మంత్రి హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్ : శ్రీరాంసాగర్ మొదటి దశలోని మొత్తం 7.30 లక్షల ఎకరాల్లో ఉన్న పంటను కాపాడటానికి ఆన్–ఆఫ్ విధానంలో నీరు సరఫరా చేయాలని మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో రాష్ట్రంలోని పలు జలాశయాలు, సాగునీటి లభ్యతపై శనివారం ఇంజనీర్లతో మంత్రి సమావేశమయ్యారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టుకు ఇప్పటికే ఆన్–ఆఫ్ పద్ధతితో మూడు తడులకు నీరిచ్చామని చీఫ్ ఇంజనీర్ తెలిపారు. ప్రస్తుతం ఈ జలాశయంలో 65 టీఎంసీలు, లోయర్ మానేరులో 8 టీఎంసీల నీరు ఉందని తెలిపారు. లోయర్ మానేరు ఎగువన ఉన్న 5 లక్షల ఎకరాల పంటను కాపాడటానికి ఇంకా 18 టీఎంసీలు అవసరమవుతాయని, మిషన్ భగీరథ అవసరాలకు మినహాయించుకొని లోయర్ మానేరు దిగువన ఉన్న 2.30 లక్షల ఎకరాలకు ఖరీఫ్ పంటకు ఆన్–ఆఫ్ పద్ధతిలో నీరు ఇవ్వగలమని ఆయన చెప్పారు.
చెరువులు నింపండి...
శ్రీరాంసాగర్ రెండో దశ ఆయకట్టు పరిధిలో మొత్తం 244 చెరువులు ఉన్నాయని, వాటిని నింపడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఈ ప్రాంతంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా చెరువుల్లోకి నీరు రాలేదని, తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఈ చెరువుల కింద ఆయకట్టును రక్షించుకోవడానికి, తాగునీటి కోసం లోయర్ మానేరు డ్యాం నుంచి తక్షణమే నీటిని విడుదల చేయాలని మంత్రి ఆదేశించారు. ఆయకట్టు చివరలో ఉన్న సూర్యాపేట, కోదాడ నియోజకవర్గాల్లో చెరువులను కూడా నింపడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఇంజనీర్లు కాలువల వెంట తిరుగుతూ నీటి నిర్వహణ చేయాలని సూచించారు. కాలువలకు గండ్లు పడితే పూడ్చటానికి జేసీబీ, టిప్పర్‌లను, ఇసుక బస్తాలను తయారుగా ఉంచుకోవాలని ఆదేశించారు. జిల్లా రెవెన్యూ యంత్రాంగం కూడా ఇంజనీర్లకు సహకరించాలని మంత్రి కోరారు. టెయిల్ టు హెడ్ విధానంలో నీటి నిర్వహణ చేయాలని సూచించారు. ఇది గత రబీ సీజన్‌లో మంచి ఫలితాలను ఇచ్చిందని, చిట్ట చివరి భూములకు కూడా నీరు అందించగాలిగామని గుర్తు చేశారు.
పర్యావరణ ప్రభావ నివేదికలు పంపండి...
అలాగే తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్న పాలకుర్తి, గుండాల మండలాల్లో ఉన్న చెరువులను నింపడానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించిన దరిమిలా దేవాదుల ప్రాజెక్టు ఇంజనీర్లతో ఈ అంశంపై మంత్రి సమీక్షించారు. పాలకుర్తి చెరువులను నింపిన అనంతరం నవాబ్‌పేట్ చెరువు ద్వారా యాదాద్రి జిల్లాలోని గుండాల మండలానికి నీరు సరఫరా చేయాలన్నారు. చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, మోడీకుంటవాగు, సీతారామ ప్రాజెక్టుల్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి అయినందున త్వరితగతిన పర్యావరణ ప్రభావ నివేదికలను కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు పంపాలని సంబంధిత చీఫ్ ఇంజనీర్లను మంత్రి ఆదేశించారు.
అలాగే సీతారామ ప్రాజెక్టుకు రెండో దశ అటవీ అనుమతి పొందడానికి కృషి చేయాలని మంత్రి ఖమ్మం చీఫ్ ఇంజనీర్‌ను ఆదేశించారు. ఈ సమావేశంలో ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్, శ్రీరాంసాగర్ రెండో దశ చీఫ్ ఇంజనీర్ నాగేందర్‌రావు, వరద కాలువ, దేవాదుల ప్రాజెక్ట్ చీఫ్ ఇంజనీర్ అనిల్‌కుమార్, శ్రీరాంసాగర్ మొదటి దశ చీఫ్ ఇంజనీర్ శంకర్, సంబంధిత ప్రాజెక్టుల ఎస్ ఈ, ఈఈలు, ఓఎస్‌డీ శ్రీధర్‌రావు దేశ్ పాండే పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment