సాక్షి, హైదరాబాద్: తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల ఈ ఏడాది శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ)లో తగినంత నీటి లభ్యత లేదని, ఉన్న నీటిలో తాగుకే ప్రాధాన్యం ఇస్తామని నిజామాబాద్, కరీంనగర్ జిల్లా నేతలకు నీటి పారుదల మంత్రి హరీశ్‌రావు స్పష్టంచేశారు. ఎగువన మరిన్ని వర్షాలు కురిసి ప్రాజెక్టులోకి నీరొచ్చే వరకు ప్రాజెక్టు కింది ఆయకట్టుకు నీటి విడుదల సాధ్యం కాదన్నారు.
శనివారం వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో శ్రీరాం సాగర్ నీటి లభ్యత, అవసరాలు, రైతుల డిమాండ్లపై సమీక్ష జరిగింది. ప్రాజెక్టుకు ఎగువ నుంచి ఎక్కువ ప్రవాహాలు రాలేదని, ప్రస్తుతం 15 టీఎంసీల నీటి లభ్యతే ఉందని అధికారులు వివరించారు. ఇందులో మిషన్ భగీరథకు 6.5 టీఎంసీలు, మరో 5 టీఎంసీలు డెడ్ స్టోరేజీ, ఆవిరి నష్టాలకు సరిపోతాయని.. మిగిలే 4 టీఎంసీలతో ఆయకట్టుకు నీటి విడుదల సాధ్యం కాదన్నారు.
ప్రభుత్వం తాగునీటికి ప్రాధాన్యం ఇస్తున్నందున మున్ముందు అవసరాల దృష్ట్యా ఉన్న నీటిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరముందన్నారు. మంత్రి హరీశ్ మాట్లాడుతూ.. ప్రాజెక్టు పరిధిలోని రైతుల అవసరాలను అంచనా వేస్తున్నామని, ఎగువన మంచి వర్షాలు కురిసి ప్రాజె క్టులోకి నీరొస్తే ఆయకట్టు అవసరాలకు నీరు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితిని జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో అంచనా వేస్తూ క్షేత్రస్థాయిలో నీటిపారుదల శాఖ పర్యవేక్షిస్తోందని తెలిపారు.
వచ్చే యాసంగికి పనులు పూర్తి..
శ్రీరాంసాగర్‌కు పూర్వవైభవం తీసుకురావడానికే రూ.1,100 కోట్లతో పునరుజ్జీవన పథకాన్ని ప్రభు త్వం చేపట్టిందని, పనులు శరవేగంగా జరుగుతున్నా యని మంత్రి వివరించారు. వచ్చే యాసంగికి పను లు పూర్తి చేసి ఏటా 2 పంటలకు పుష్కలంగా నీరందించాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు, నేతలు తమ స్వార్థం కోసం అమాయక రైతులను రెచ్చగొడుతున్నారని, వారి మాటలకు మోసపోవద్దని రైతులకు విన్నవించారు.
రైతుల పట్ల సానుభూతితో ప్రభుత్వం వ్యవహరిస్తోందని, రైతు క్షేమమే లక్ష్యమని, పరిస్థితిని అర్థం చేసుకొని సహకరించాలని కోరారు. సమావేశంలో నిజామాబాద్ ఎంపీ కవిత, మిషన్ భగీరథ వైస్‌చైర్మన్, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, నిజామాబాద్ గ్రామీణ, ఆర్మూర్, బోధన్, కోరుట్ల శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్, జీవన్‌రెడ్డి, షకీల్ హైమద్, విద్యాసాగర్‌రావు, జగిత్యాల నియోజకవర్గ టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి సంజయ్, నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్, శ్రీరాంసాగర్ సీఈ శంకర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment