సాక్షి, నిజామాబాద్: తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నీటిపారుదల ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వస్తుంది. దీంతో ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణకు వరప్రదాయినిగా ఉన్న నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి భారీ వరద నీరుపోటెత్తుతోంది. ప్రాజెక్టులో సుమారు 2,22,216 క్యూసెక్కుల నీరు వస్తుండడంతో డ్యాం అధికారులు ముందు జాగ్రత్తగా 26 గేట్లను ఎత్తి లక్షా 50వేల క్యూసెక్కుల నీటిని దిగువన గోదావరిలోకి వదులుతున్నారు.
శ్రీరాంప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం 90 టీఎంసీలు( 1091 అడుగులు నీటిమట్టం) కాగా.. ప్రస్తుతం 75 వేల టీఎంసీల ( 1087.7 అడుగుల నీటిమట్టం) నీరు ఉంది. ప్రాజెక్టులోకి వరద పెరిగే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ ఎస్‌ఈ శ్రీనివాస్ తెలిపారు. గేట్లను ఎత్తివేయడంతో ముందస్తుగా దిగువన పరీవాహక ప్రాంతాల ప్రజలను అలెర్ట్ చేసినట్లు తెలిపారు. రెవెన్యూ, పోలీసులు ఇందుకనుగుణంగా భద్రతా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలెవ్వరూ కూడా పరీవాహక ప్రాంతాలకు రావద్దని, మత్స్యకార్మికులు, పశువుల కాపరులు, రైతులు గోదావరిని దాటే ప్రయత్నం చేయవద్దని అప్రమత్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment