తిరుమలాయపాలెం మండలంలో తానంచర్ల, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని..
కొక్కిరేణి (తిరుమలాయపాలెం): తిరుమలాయపాలెం మండలంలో తానంచర్ల, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు కృషి చేస్తానని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. వీటి పనులు అసంపూర్తిగా ఉన్న విషయూన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళతానన్నారు. ఆయన గురువారం కొక్కిరేణిలో మాజీ ఎంపీపీ ఊడుగు రామయ్య ఇంట్లో స్థానిక నాయకులతో సమావేశమయ్యూరు.
మండలంలో పంటల పరిస్థితి, రైతుల బాగోగులు తెలుసుకున్నారు. మండలంలోని తానంచర్ల, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పనులు నిలిచిపోవడంతో సాగు నీటికి ఇబ్బందులు ఎదురవుతున్నారని వారు ఎంపీతో చెప్పారు. దీనిపై పొంగులేటి స్పందించారు. ఆయన వెంటనే తానంచర్ల, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు అధికారులకు ఫోన్ చేశారు. వీటి నిర్మాణ పనులు ఆగిపోవడానికి కారణాలు, ఇతరత్రా పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించారు.
ఈ రెండు ప్రాజెక్టులపై సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తానని అన్నారు. స్థానిక నాయకులతో ఎంపీ పొంగులేటి మాట్లాడుతూ... శ్రీరాంసాగర్ డీబీఎం 60 కాలువ పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తానన్నారు. భూసేకరణ సమస్య కారణంగానే తానంచర్ల కాలువ పనులు నిలిచిపోయినట్టుగా తన దృష్టికి వచ్చిందన్నారు.
మండల ప్రజాప్రతినిధులు, రైతు సంఘం నాయకులు తన వద్దకు వస్తే ఈ రెండు ప్రాజెక్టులపై చర్చించేందుకు ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళతానని అన్నారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం పార్టీలకతీతంగా పని చేస్తానని అన్నారు. రైతాంగ శ్రేయస్సు కోసం ప్రజాప్రతినిధులు కూడా కలిసి రావాలని కోరారు. కరువు మండలమైన తిరుమలాయపాలెంలోని సమస్యలను కలెక్టర్, ఇతర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం జిల్లా కన్వీనర్ బెల్లం శ్రీనివాస్, వైఎస్‌ఆర్ సీపీ జిల్లా అధికార ప్రతినిధులు ఆకుల మూర్తి, ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి, పాలేరు నియోజకవర్గ ఇన్‌చార్జి సాధు రమేష్‌రెడ్డి, నాయకులు జిల్లా శ్రీనివాసరెడ్డి, షర్మిలాసంపత్, కొప్పుల చెన్నక్రిష్ణారెడ్డి, దొడ్డి సాంబయ్య, ఎంపీపీ కొప్పుల అశోక్, మాజీ ఎంపీపీ ఊడుగు రామయ్య, జడ్పీటీసీ మాజీ సభ్యుడు ఎలకొండ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.