
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌లో నీటి నిల్వ, ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిచేరుతున్న వరద నీటిపై ప్రాజెక్ట్ అధికారుల అంచనా తప్పిందా..! అంటే అవుననే సమాధానం వస్తోంది. గత గురువారం ఉదయం ఎగువ ప్రాంతాల నుంచి 4.32 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరే అవకాశం ఉందని సమాచారం వచ్చినప్పుడు ప్రాజెక్ట్‌లో నీటి నిల్వ 82 టీఎంసీలు ఉంది. ఆ సమయంలో వరద గేట్లు ఎత్తి గోదావరిలోకి నీరు విడుదల చేయాల్సి ఉండగా అధికారులు వెనకా ముందు చేశారు. కాగా, ప్రాజెక్ట్‌లో నీటి నిల్వ 89 టీఎంసీలకు చేరిన తర్వాత అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు వరద గేట్లను ఎత్తారు.
దీంతో అప్పటికే ఎగువ ప్రాంతాల్లో బ్యాక్ వాటర్ నిలిచి వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. అదే విధంగా ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు తగ్గుముఖం పడుతున్న సమయంలో నీరు నిల్వ ఉంచాల్సి ఉండగా గోదావరిలోకి నీటిని వదిలారు. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు 86 టీఎంసీల నుంచి 80 టీఎంసీలకు నీటి నిల్వ తగ్గిపోయింది. వాస్తవానికి 86 టీఎంసీల నీటిని నిల్వ ఉంచి మిగతా జలాలను కిందకు వదలాలి. అయితే అనాలోచితంగా నీటిని వదలడం, అదే సమయంలో ఎగువ ప్రాంతాల నుంచి వరద తగ్గిపోవడంతో ప్రాజెక్టులో తగిన స్థాయిలో నీరు నిల్వ లేకుండా పోయింది.
ప్రాజెక్టు చరిత్రను పరిశీలిస్తే ఎగువ ప్రాంతాల నుంచి లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతున్న సమయంలో 89 టీఎంసీల నీటిని నిల్వ ఉంచడం ఇదే తొలిసారి. అలాగే ప్రాజెక్ట్‌లో నీటి నిల్వ 80 టీఎంసీలకు పడిపోయినా కూడా వరద గేట్ల ద్వారా లక్షన్నర క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదలడం కూడా ఇదే తొలిసారి. కాగా, నీటి నిల్వ, విడుదల విషయంలో ఉన్నతాధికారుల ఆదేశాలనే పాటిస్తున్నామని ప్రాజెక్ట్ ఈఈ చక్రపాణి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment