సాక్షి, కరీంనగర్: అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గత రాత్రి పలు చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. వాగులు వంకలన్ని పొంగిపొర్లుతున్నాయి. చెరువులు కుంటలు అలుగు పారుతుండగా ప్రాజెక్టులన్నీ నిండుకుండను తలపిస్తుండడంతో అధికారులు గేట్లు ఎత్తారు. కరీంనగర్ సమీపంలోని లోయర్ మానేరు డ్యామ్‌కు వరద పోటెత్తింది. మోయతుమ్మెద వాగు ద్వారా 47 వేల క్యూసెక్కుల వరద, మీడ్ మానేర్ నుంచి 19 వేల క్యూసెక్కుల నీరు ఎల్ఎండీకి చేరుతుంది.
దీంతో అధికారులు 20 గేట్లు ఎత్తి 57,652 క్యూసెక్కుల నీటిని మానేరు వాగులోకి, మరో రెండు వేల క్యూసెక్కుల వాటర్‌ను కాకతీయ కాలువకు వదులుతున్నారు. మిడ్ మానేర్‌కు ఎస్సారెస్పీ వరద కాలువ ద్వారా 15 వేలు, మూలవాగు ద్వారా మరో 8వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండడంతో ఎంఎంఆర్‌కు చెందిన 6 గేట్లు ఎత్తి 19వేల క్యూసెక్కుల నీటిని దిగువ మానేరు డ్యామ్‌కు వదులుతున్నారు. ఎగువ మానేర్ నర్మాల ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండి అలుగు పారుతుంది.
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎస్ఆర్ఎస్పీ కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో గోదావరి ద్వారా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు లక్షా 52వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండటంతో 15గేట్లు ఎత్తి 1,43,865 క్యూసెక్కుల నీటిని దిగువ గోదావరిలోకి వదులుతున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా మంథని నియోజకవర్గంలో నిర్మించిన సుందిళ్ల పార్వతి బ్యారేజ్, అన్నారం సరస్వతి బ్యారేజ్, మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్‌లకు భారీగా వరద వస్తుండడంతో ఆయా బ్యారేజీల గేట్లన్ని ఎత్తి దిగువకు లక్షలాది క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.
ప్రాజెక్టుల గేట్లను ఎత్తడంతో అటు గోదావరి మానేరు వాపులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. తీర ప్రాంత ప్రజలను అధికారులతో పాటు మంత్రి గంగుల కమలాకర్ అప్రమత్తం చేశారు. వర్షం వరదలు అన్నదాతలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. గత నెలలో కురిసిన వర్షాలతో నీట మునిగి పంట నష్టపోయిన రైతులు ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా మరోసారి వర్షం వరదలు అపార నష్టాన్ని మిగిల్చాయి.
శ్రీరాం సాగర్ ప్రాజెక్టు
- 40 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల
- ఇన్ ఫ్లో రెండు లక్షల 21 వేల క్యూసెక్కు లు
- అవుట్ ఫ్లో రెండు లక్షల 21 వేల క్యూసెక్కు లు
- వరద గేట్ల ద్వారా రెండు లక్షలు, కాలువల ద్వారా 21 వేల క్యూసెక్కుల నీటి విడుదల
- పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు, 90 టీఎంసీలు
- ప్రస్తుత నీటిమట్టం 1091 అడుగులు, 90 టీఎంసీలు
లోయర్ మానేరు డ్యామ్
- 20 గేట్లు ఎత్తి, 57652 క్యూసెక్కుల నీటిని మానేరు వాగులోకి విడుదల.
- ఇన్ ఫ్లో 59961 క్యూసెక్కులు.
- ఔట్ ఫ్లో 59961 క్యూసెక్కులు.
- పూర్తి స్థాయి నీటి నిలువ సామర్థ్యం 24.034 టీఎంసీలు
- ప్రస్తుతం నీటి నిలువ 23.645 టీఎంసీలు.
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు
- 25 గేట్లు ఎత్తి, 72509 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల.
- ఇన్ ఫ్లో 72518 క్యూసెక్కులు.
- ఔట్ ఫ్లో 73157 క్యూసెక్కులు.
- పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు
- ప్రస్తుతం నీటి నిలువ 19.397 టీఎంసీలు.
Comments
Please login to add a commentAdd a comment