ఎల్లంపల్లి అంకితమేదీ? | Where Is The Sripada Yellampalli Project Dedication Karimnagar | Sakshi
Sakshi News home page

ఎల్లంపల్లి అంకితమేదీ?

Published Mon, Jul 30 2018 12:01 PM | Last Updated on Sat, Aug 11 2018 7:56 PM

Where Is The Sripada Yellampalli Project Dedication Karimnagar - Sakshi

శ్రీపాద (ఎల్లంపల్లి) ప్రాజెక్టుకు

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: జలయజ్ఞంలో భాగంగా జనహృదయ నేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డి శ్రీపాద (ఎల్లంపల్లి) ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం చేసి సరిగ్గా పద్నాలుగేళ్లయింది. ఈ ప్రాజెక్టు ద్వారా సాగు, తాగునీటి అవసరాలను తీర్చుకుంటున్నప్పటికీ అధికారికంగా ప్రారంభోత్సవం చేయకపోవడం చర్చనీయాంశం అవుతోంది. ప్రజలకు అంకితం పేరిట 2014లో పైలాన్‌ నిర్మించి వదిలేశారు.
 
ఉమ్మడి ప్రభుత్వ హయాంలో సీఎంగా ఉన్న వైఎస్‌.రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా ఎల్లంపల్లి ప్రాజెక్టును 28 జూలై 2004లో శంకుస్థాపన చేసి.. 36 (మూడేళ్లు) నెలల్లో పూర్తి చేయాలని నిర్ణయించారు. రూ.2744 కోట్ల నిధులను జలయజ్ఞం కింద కేటాయించారు. ఇందులో డ్యాం(ప్రాజెక్టు)కు రూ.408.85 కోట్లకు బెంగళూరుకు చెందిన ఎస్‌పీఎంఎల్‌ ఐటీడీ సిమెంటేషన్‌ పనులు దక్కించుకుంది. రూ.191 కోట్లతో స్పిల్‌వే పియర్స్‌పై ఫ్యాబ్రికేషన్‌ గేట్ల పనులను ఎస్‌ఈడబ్ల్యూ (స్యూ), ఓం మెటల్స్‌ కంపెనీలు పనులను పొందాయి. ఈ మేరకు ఎల్‌ఎస్‌నెం.1/2004–05, 07–11–2004తో జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రాజెక్టును స్టేజ్‌–1, స్టేజ్‌–2గా విభజించా రు. మొదటి స్టేజీలో ఫేజ్‌–1, ఫేజ్‌–2గా విభజి స్తూ ఫేజ్‌–1లో ప్రాజెక్టు(డ్యాం) నిర్మాణాన్ని ఐటీడీ సిమెంటేషన్‌ దక్కించుకోగా.. ఫేజ్‌–2లో 6.5 టీఎంసీల నీటిని ఎన్టీపీసీకి పైపులైన్లతో నీటి సరఫరా పనులను ఎస్‌పీఎంఎల్‌ కంపెనీ దక్కించుకుంది.
 
పూడిక తొలగింపునకు ఆధునిక పరిజ్ఞానం
ప్రాజెక్టులో పేరుకుపోయిన పూడికను విడుదల చేసేందుకు ఆధునిక పరిజ్ఞానంతో 42 నుంచి 45వ బ్లాక్‌ వరకు అడుగుభాగంలో (రివర్స్‌ స్లూయిస్‌) గేట్లను ఏర్పాటు చేశారు. ఈ విధానం శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు లేకపోవడంతో అందులో సగానికి పైబడి పూడిక పేరుకుపోవడంతో చిన్నపాటి వరదలకే ప్రాజెక్టు నిండుతుంది. శ్రీపాద ప్రాజెక్టులో డెడ్‌ స్టోరేజీ (నీటి చుక్క లేకుండా) నీటిని బయటకు పంపించే అవకాశముంటుంది. ఫలితంగా నిల్వ నీటిలో పేరుకుపోయిన మట్టి, పూడిక అంతా వరదలో కొట్టుకుపోవడంతో ప్రాజెక్టులో ఉన్న నీటి సామరŠాధ్యన్ని పూర్తిస్థాయిలో వినియోగించే వీలుంటుంది.

బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌గా ఎల్లంపల్లి
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌గా మారింది. ప్రస్తుత తరుణంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు తెలంగాణ ప్రభుత్వానికి గుండెకాయగా మారిందని చెప్పుకోవచ్చు. ఎల్లంపల్లి ప్రాజెక్టు దిగువన ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రివర్స్‌ పంపింగ్‌ విధానంతో తిరిగి ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి నీటిని మళ్లించనున్నారు. ఫలితంగా రెండువందల కిలోమీటర్ల పరిధిలో గోదావరినది వరద నీటితో సజీవంగా ఉంటుంది. అయితే అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు కాళేశ్వరం ప్రాజెక్టుపై ఉన్న పట్టింపు ఎల్లంపల్లి ప్రాజెక్టుపై లేకపోవడం గమనార్హం. దివంగత సీఎం వైఎస్‌.రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మించడంతోనే కాళేశ్వరం ప్రాజెక్టు సాకారమైందని చెప్పుకోవచ్చు.

  • ప్రాజెక్టు జలాల వినియోగం ఇలా...
  • ఎల్లంపల్లి ప్రాజెక్టుతో ఎత్తిపోతల ద్వారా సాగు, తాగునీరందుతున్న ప్రాంతాల్లో పెద్దపల్లి, కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, భూపాలపల్లి, మంచిర్యాల, హైదరాబాద్‌ జంట నగరాలకు ఎల్లంపల్లి ప్రాజెక్టు జలాలు అందుతున్నాయి. ఇటీవల రూ.80 కోట్లతో రామగుండం నియోజకవర్గ పరిధిలోని 24వేల ఎకరాలకు ఎత్తిపోతలతో సాగునీటిని అందించేందుకు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద 2.24 లక్షల ఎకరాలు సాగవుతున్నాయి. దీంతోపాటు ఎన్టీపీసీ, సింగరేణి బొగ్గు గనులు, సింగరేణి విద్యుత్‌ సంస్థల అవసరాలకు నీటిని సరఫరా చేస్తున్నారు.
  • అపరిష్కృతంగా ఉన్న ప్రాజెక్టు సమస్యలు
  • ఎల్లంపల్లి ప్రాజెక్టులో ముంపు బాధితుల్లో 2015 జనవరి నాటికి 18 ఏళ్లు నిండిన యువతకు పునరావాస ప్యాకేజీ అమలు చేయలేదు. ఇందులో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పరిధిలోని వివిధ మండలాల్లో 3,128 మంది అర్హులున్నట్లు రెవెన్యూ అధి కారులు గుర్తించారు. పరిహారం చెల్లించాల ని ప్రభుత్వం ఆదేశించడంతోపాటు దానికి సరిపడు నిధులను ఆర్డీవోల వద్ద జమ చేసినట్లు కూడా తెలిసింది.
  • ప్రాజెక్టుకు పర్యాటకులు వాహనాలలో వెళ్లేందుకు సరైన రహదారి సౌకర్యం లేదు. అదే విధంగా ప్రాజెక్టు వద్ద పర్యాటకులు సేదా తీరేందుకు ఉద్యానవనం, ఇతరత్రా టూరిజం ఎంటర్‌టైన్‌మెంట్‌ పరికరాలను ఏర్పాటు చేయలేదు.
  •  
  • గతేడాది ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌ సమీపంలోని వెల్గటూర్‌ మండల పరిధిలో కి వచ్చే కోటి లింగాల పుణ్యక్షేత్రం వద్ద తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో బోటింగ్‌ ను చీఫ్‌విప్‌ కొప్పుల ఈశ్వర్‌ ప్రారంభోత్సవం చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు వరకు నడిపించాలని గతేడాది నిర్ణయించినప్పటికీ ఆచరణకు నోచుకోలేదు.
  • ఎల్లంపల్లి ప్రాజెక్టు  ప్రధాన లక్ష్యం..
  • ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి విద్యుత్‌ అవసరాల దృష్ట్యా ఎన్‌టీపీసీకి 6.5 టీఎంసీ  నీటి సరఫరా..
  • 2టీఎంసీలు మంథనికి ఎత్తిపోతల పథకం ద్వారా కమాన్‌పూర్, మంథని నియోజకవర్గ  పరిధిలో 20వేల ఎకరాలకు సాగునీరు. అందులో ఏడువేల ఎకరాలు స్థిరీకరణ. కమాన్‌పూర్‌ మండలంలో నాలుగు గ్రామాలలో 1,380 ఎకరాలు. ముత్తారం మండలంలోని 17 గ్రామాలకు 18,620 ఎకరాలు.
  •  ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఎగువ భాగంలో కడెం ఎత్తిపోతల పథకం కింద 3టీఎంసీల  నీటిని 30వేల ఎకరాలు స్థిరీకరించుట.
  •  కరీంనగర్‌ జిల్లాలోని ఏడు నియోజకవర్గాల పరిధిలో 19 మండలాలకు చెందిన 206 గ్రామాల కింద రెండు లక్షల ఎకరాలకు సాగు, తాగునీరు.. ఇందుకుగాను వేమునూర్‌లో 12 టీఎంసీలను పంపింగ్‌  చేసేందుకు పంపుహౌస్‌ నిర్మాణం.
  • 160 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించతలపెట్టిన ప్రాణహిత–చేవెళ్ల భారీ ప్రాజెక్టుకు ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌గా ఉపయోగపడుతుంది.
  •  అబ్దుల్‌ కలాం సుజల స్రవంతి పథకంలో భాగంగా 10 టీఎంసీల నీటిని గ్రేటర్‌ హైదరాబాద్‌కు తాగునీటి అవసరాల నిమిత్తం పైపులైన్ల ద్వారా సరఫరా.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

ముఖ్యమంత్రి హోదాలో వైఎస్సాఆర్‌ శంకుస్థాపన చేసిన శిలాఫలకం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement