Ellampalli project
-
నిండుకుండలా వున్న శ్రీరాం సాగర్ ప్రాజెక్టు
-
దిగువమానేరు, శ్రీరాం సాగర్ గేట్ల ఎత్తివేత
సాక్షి, కరీంనగర్: అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గత రాత్రి పలు చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. వాగులు వంకలన్ని పొంగిపొర్లుతున్నాయి. చెరువులు కుంటలు అలుగు పారుతుండగా ప్రాజెక్టులన్నీ నిండుకుండను తలపిస్తుండడంతో అధికారులు గేట్లు ఎత్తారు. కరీంనగర్ సమీపంలోని లోయర్ మానేరు డ్యామ్‌కు వరద పోటెత్తింది. మోయతుమ్మెద వాగు ద్వారా 47 వేల క్యూసెక్కుల వరద, మీడ్ మానేర్ నుంచి 19 వేల క్యూసెక్కుల నీరు ఎల్ఎండీకి చేరుతుంది. దీంతో అధికారులు 20 గేట్లు ఎత్తి 57,652 క్యూసెక్కుల నీటిని మానేరు వాగులోకి, మరో రెండు వేల క్యూసెక్కుల వాటర్‌ను కాకతీయ కాలువకు వదులుతున్నారు. మిడ్ మానేర్‌కు ఎస్సారెస్పీ వరద కాలువ ద్వారా 15 వేలు, మూలవాగు ద్వారా మరో 8వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండడంతో ఎంఎంఆర్‌కు చెందిన 6 గేట్లు ఎత్తి 19వేల క్యూసెక్కుల నీటిని దిగువ మానేరు డ్యామ్‌కు వదులుతున్నారు. ఎగువ మానేర్ నర్మాల ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండి అలుగు పారుతుంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎస్ఆర్ఎస్పీ కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో గోదావరి ద్వారా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు లక్షా 52వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండటంతో 15గేట్లు ఎత్తి 1,43,865 క్యూసెక్కుల నీటిని దిగువ గోదావరిలోకి వదులుతున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా మంథని నియోజకవర్గంలో నిర్మించిన సుందిళ్ల పార్వతి బ్యారేజ్, అన్నారం సరస్వతి బ్యారేజ్, మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్‌లకు భారీగా వరద వస్తుండడంతో ఆయా బ్యారేజీల గేట్లన్ని ఎత్తి దిగువకు లక్షలాది క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టుల గేట్లను ఎత్తడంతో అటు గోదావరి మానేరు వాపులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. తీర ప్రాంత ప్రజలను అధికారులతో పాటు మంత్రి గంగుల కమలాకర్ అప్రమత్తం చేశారు. వర్షం వరదలు అన్నదాతలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. గత నెలలో కురిసిన వర్షాలతో నీట మునిగి పంట నష్టపోయిన రైతులు ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా మరోసారి వర్షం వరదలు అపార నష్టాన్ని మిగిల్చాయి. శ్రీరాం సాగర్ ప్రాజెక్టు 40 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల ఇన్ ఫ్లో రెండు లక్షల 21 వేల క్యూసెక్కు లు అవుట్ ఫ్లో రెండు లక్షల 21 వేల క్యూసెక్కు లు వరద గేట్ల ద్వారా రెండు లక్షలు, కాలువల ద్వారా 21 వేల క్యూసెక్కుల నీటి విడుదల పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు, 90 టీఎంసీలు ప్రస్తుత నీటిమట్టం 1091 అడుగులు, 90 టీఎంసీలు లోయర్ మానేరు డ్యామ్ 20 గేట్లు ఎత్తి, 57652 క్యూసెక్కుల నీటిని మానేరు వాగులోకి విడుదల. ఇన్ ఫ్లో 59961 క్యూసెక్కులు. ఔట్ ఫ్లో 59961 క్యూసెక్కులు. పూర్తి స్థాయి నీటి నిలువ సామర్థ్యం 24.034 టీఎంసీలు ప్రస్తుతం నీటి నిలువ 23.645 టీఎంసీలు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు 25 గేట్లు ఎత్తి, 72509 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల. ఇన్ ఫ్లో 72518 క్యూసెక్కులు. ఔట్ ఫ్లో 73157 క్యూసెక్కులు. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు ప్రస్తుతం నీటి నిలువ 19.397 టీఎంసీలు. -
వరద కాల్వపై మరో ఎత్తిపోతల
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ద్వారా ఎత్తిపోస్తున్న గోదావరి జలాల సమగ్ర వినియోగమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్న ప్రభుత్వం వరద కాల్వపై మరో ఎత్తిపోతల పథకానికి ప్రాణం పోస్తోంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు కింది ఆయకట్టుకు పూర్తి భరోసా కల్పించేలా సూరమ్మ చెరువు ఎత్తిపోతలు చేపట్టేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది. ఈ ఎత్తిపోతల ద్వారా సుమారు 60 వేల ఎకరాలకు సాగునీరిచ్చేలా సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధమవుతోంది. ఇప్పటికే వేసిన అంచనాల ప్రకారం.. ఈ ఎత్తిపోతల వ్యయం రూ.340 కోట్లుగా ఉంటుందని ఇంజనీర్లు తేల్చారు. ఎల్లంపల్లికి పూర్తి భరోసా.. శ్రీరాంసాగర్ పునరుజ్జీవ పథకం ద్వారా వరద కాల్వ కింది ఆయకట్టుకు పూర్తి భరోసా కల్పించిన ప్రభుత్వం, ఎల్లంపల్లి కింది ఆయకట్టుకు సైతం ఇదే పథకం నుంచి నీళ్లందించాలని గతంలోనే నిర్ణయించింది. ఎల్లంపల్లి కింద 2 లక్షల ఎకరాల ఆయకట్టుండగా, ప్రస్తుతం లక్ష ఎకరాలకే నీరందుతోంది. మరో 44 వేల ఎకరాలకు నీళ్లందించేందుకు ఎల్లంపల్లి నుంచి ఐదు దశల్లో వేమనూరు, మేడారం, గంగాధర, కొడిమ్యాల, జోగాపూర్ వరకు నీటిని లిఫ్టు చేసి సూరమ్మ చెరువుకు ఎత్తిపోతలు చేపట్టారు. అయితే ఈ విధానం ద్వారా కాకుండా వరద కాల్వ నుంచి ఒకే ఒక్క దశలో నీటిని లిఫ్టు చేసి ఈ చెరువుకు తరలించేలా గతంలో జరిగిన సమీక్షల సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రతిపా దించారు. వరద కాల్వ 52వ కిలోమీటర్ నుంచి నీటిని మళ్లించి, దాన్ని పంపుల ద్వారా 85 నుంచి 90 మీటర్ల మేర ఎత్తిపోసి 10 కిలోమీటర్ల ఫ్రెషర్ మెయిన్స్ ద్వారా సూరమ్మ చెరువులోకి తరలించేలా ప్రతిపాదన సిద్ధం చేశారు. నీటి లభ్యత పెంచేందుకు చెరువు సామర్థ్యాన్ని 0.15 టీఎంసీ నుంచి 0.45 టీఎంసీలకు పెంచాలని నిర్ణయించారు. దీంతోపాటే వరద కాల్వ ద్వారా తూములు నిర్మించి 139 చెరువులను నింపాలని నిర్ణయించారు. ఈ మొత్తం ప్రతిపాదనకు రూ.340 కోట్ల మేర ఖర్చవుతుందని లెక్కగట్టారు. వేములవాడ, చొప్పదండి నియోజకవర్గాల్లోని మల్యాల, కథలాపూర్, మేడిపల్లి మండలాల్లో 60వేల ఎకరాలకు సాగునీరందేలా దీన్ని డిజైన్ చేసినట్లు ఈఎన్సీ అనిల్‌కుమార్ వెల్లడించారు. -
‘మిడ్ మానేరు’ ఎందుకు నింపడం లేదు'
సాక్షి, చొప్పదండి : మిడ్‌మానేరు ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 25 టీఎంసీలు కాగా కేవలం 15 టీఎంసీల నీరు చేరడంతోనే అర్ధరాత్రి 25 గేట్లు తెరిచి ఆదరాబాదరగా ఎల్ఎండీకి నీరు ఎందుకు విడుదల చేశారో జవాబు చెప్పాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం టీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపెల్లి సత్యం, రాష్ట్ర నాయకులు ఆది శ్రీనివాస్ తదితర కాంగ్రెస్ ప్రతినిధులతో కలిసి మండలంలోని మాన్వాడ వద్ద మిడ్‌మానేరు ప్రాజెక్టు కుడివైపు కట్ట పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటితో నిండి నీరు ఓవర్ ఫ్లో అయి వృథాగా పోతున్న సందర్భంలో అట్టి నీటిని మిడ్‌మానేరు ప్రాజెక్టులోకి ఎందుకు వదలడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇందుకు గల కారణాన్ని తెలుసుకునేందుకే కాంగ్రెస్ ప్రతినిధి బృందం కట్ట భద్రతపై ప్రాజెక్టు సందర్శనకు వచ్చినట్లు తెలిపారు. కాగా కట్ట మీద వాస్తవ పరిస్థితి చూస్తే బోర్లు వేసి టెస్ట్‌లు చేస్తున్నారు. మొత్తం బురద వస్తుంది. కట్టపైన బోగం ఒర్రె పరిసరాల్లో కిలోమీటర్ మేర కట్ట పునర్మించాలని పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. టీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపెల్లి సత్యం, రాష్ట్ర నాయకులు ఆది శ్రీనివాస్‌లు మాట్లాడుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆగస్టు 30 నిర్వాసితుల మహాసభ చేపట్టిన రోజు కట్ట తెగుతుందనే భయంతో ఆదరాబాదరగా గేట్లు ఎత్తారన్నారు. బోగం ఒర్రె పరిసరాల్లో కట్ట మరమ్మతులు చేసిన క్రమంలో రాత్రికి రాత్రి మూడు మీటర్ల మేర కట్ట నిర్మించే పనులు చేపట్టి పాడుపడ్డ మట్టి, పెద్ద పెద్ద మొద్దులు వేసి నాసిరకంగా నిర్మించారని దాంతో లీకేజీ వస్తుందన్నారు. మిడ్‌మానేరు కట్ట నాణ్యతపై రాష్ట్రస్థాయి ఇంజినీర్లతో విచారణ చేయించాలని కోరారు. లేదంటే కోర్టును ఆశ్రయిస్తామన్నారు. కట్ట నాణ్యంగా ఉంటే వెంటనే 25 టీఎంసీల నీరు మిడ్‌మానేరు ప్రాజెక్టులో నింపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాయకులు సంగీతం శ్రీనివాస్, కూస రవీందర్, బండి శ్రీనివాస్, పిల్లి కనుకయ్య, వేసిరెడ్డి దుర్గారెడ్డి, వన్నెల రమణారెడ్డి, భీంరెడ్డి మహేశ్వర్‌రెడ్డి, మొగులోజి శ్రీకాంత్, ఎండీ.బాబు, నాగుల వంశీ పాల్గొన్నారు. చిన్న సీఫేజ్ అబ్జర్వ్ చేశాం వీటిపై మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ జేఈతో మాట్లాడారు. దానికి జేఈ వేణుగోపాల్ జవాబిస్తూ ప్రాజెక్టులో టూ థర్డ్ వాటర్ ఫిల్లింగ్ అయ్యాక టెక్నికల్ వాక్త్రూలో సీఫేజ్ అబ్జర్వ్ చేసినట్లు పేర్కొన్నారు. అది లిమిట్లో ఉందని తెలిపారు. సీఫేజీలు ఉండడం సాధారణమన్నారు. డ్యాం పటిష్టతపై మంచిగా ఉండాలని ఈఆర్టీ, ఎస్ఆర్టీ టెస్ట్ చేయించామన్నారు. డౌన్ స్ట్రీమ్‌లో 20, 30 మీటర్ల తర్వాత సీఫేజీ గుర్తించి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దీన్ని ఢిల్లీ పర్సా టెక్నాలజీ వారు చూశారు. వారు ఈఆర్టీ, ఎస్ఆర్టీ టెస్టులు చేశారని తెలిపారు. దీంతో బండ్ ఫిజికల్‌గా ఎంత ఫిట్‌గా ఉందో తెలుస్తుందన్నారు. 300 మీటర్ల మేర సీఫేజ్ ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇందుకోసం 9 ఫీజో మీటర్లు ఏర్పాటు చేయాలని అనుకున్నట్లు తెలిపారు. ఒక వారంలో ఫీజో మీటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. -
గోదారంత ఆనందం..
సాక్షి, జగిత్యాల : పరవళ్లు తొక్కుతున్న గోదావరిని చూసి సీఎం కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. మేడిగడ్డ నుంచి ధర్మపురి నృసింహుని పాదాల చెంతకు సజీవ గోదా వరి సాక్షాత్కరిస్తోందని వ్యాఖ్యానించారు. 150 కిలోమీటర్ల మేర నిండుకుండలా ఉన్న గోదావరిని చూసి తనువు పులకరిస్తోందన్నారు. తన గర్భంలోని దాదాపు వంద టీఎంసీల నీటిని తెలంగాణ బిడ్డలకు ఇవ్వడానికి గోదావరి సంసిద్ధంగా ఉందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా మంగళవారం సీఎం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించారు. అనంతరం జగిత్యాల జిల్లాలో ధర్మపురి లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తవుతుందని ఎవరూ కలలో కూడా అను కోలేదు, దీనిపై నాకు కూడా సందేహాలుండేవి. కానీ నేడు ఈ అద్భుతాన్ని నా కళ్లతో చూస్తున్నాను‘‘అని పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టుల అమలు తీరుపై కేంద్ర ప్రభుత్వం మనల్ని చూసి నేర్చుకుంటోందని, ప్రతి పక్షం రోజులకోసారి కేంద్ర ప్రభుత్వ, ఇతర రాష్ట్రాల కార్యదర్శులు రాష్ట్రంలో పర్యటిస్తున్నారని చెప్పారు. సంక్షేమంలో తెలంగాణ నంబర్ వన్‌గా ఉందని, మనల్ని మించినోడు దేశంలోనే లేడని వ్యాఖ్యానించారు. కాళేశ్వరంతో 400 టీఎంసీల నీరు.. గోదావరి నది ద్వారా ఇంతకుముందు లభించే నీటి కంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ రీడిజైనింగ్ ద్వారా అదనంగా 400 టీఎంసీల నీరు లభ్యం కానుందని సీఎం కేసీఆర్ వివరించారు. గోదావరి నదిపై సీడబ్ల్యూసీ పొందుపర్చిన 44 ఏళ్ల రికార్డులు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయన్నారు. జూన్ నుంచి నవంబర్ వరకు నెలకు 60 టీఎంసీల చొప్పున 360 టీఎంసీలు, నవంబర్ నుంచి జూన్ వరకు వర్షాలు తక్కువ పడే కాలంలోనూ 40 టీఎంసీల చొప్పున మొత్తం 400 టీఎంసీల నీటితో 45 లక్షల ఎకరాలు సస్యశ్యామలం కానున్నాయని తెలిపారు. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి రోజుకు 3 టీఎంసీల చొప్పున, ఎల్లంపల్లి నుంచి మిడ్‌మానేరు ద్వారా మల్లన్నసాగర్‌కు రోజుకు 2 టీఎంసీలు, అక్కడి నుంచి కొండపోచమ్మ రిజర్వాయర్‌కు నీటిని ఎత్తిపోస్తారని వివరించారు. ఎల్లంపల్లి ఇక ఎప్పటికీ ఎండిపోదని స్పష్టంచేశారు. ధర్మపురి నృసింహుని పాదాల చెంత గోదావరి 365 రోజులు నీటితో కళకళలాడుతూనే ఉంటుందని పేర్కొన్నారు. ఎస్సారెస్పీలో నీటి లభ్యత తక్కువగా ఉందని, ప్రస్తుతం 9 టీఎంసీల మేరకే పరిమితమైందని చెప్పారు. ఎల్లంపల్లి నుంచి వరద కాలువ ద్వారా 70 టీఎంసీల నీటిని ఎస్సారెస్పీకి తరలించి 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని కేసీఆర్ తెలిపారు. గోదావరికి మించి వేరే మార్గం లేదు రాష్ట్రానికి గోదావరి నదికి మించి ప్రత్యామ్నాయం లేదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. సాగు, తాగు నీరు, పరిశ్రమలకు గోదావరి తప్ప మరో మార్గం లేదన్నారు. కానీ గోదావరి కింద కళకళలాడుతూ, పైన మాత్రం వెలవెలబోతోందన్నారు. మేడిగడ్డ వద్ద గోదావరి నది బెడ్ లెవల్ 88 మీటర్లు ఉండగా, బ్యారేజీ నిర్మాణం 100 మీటర్ల లెవల్ వరకు, అన్నారం వద్ద బెడ్ లెవల్ 106 మీటర్లు ఉండగా బ్యారేజీ నిర్మాణం 119 మీటర్లు, సుందిళ్ల వద్ద బెడ్ లెవల్ 118 మీటర్లు ఉండగా, బ్యారేజీ నిర్మాణం 130 మీటర్ల ఎత్తుకు, ఎల్లంపల్లి వద్ద 129 మీటర్ల నుంచి ప్రాజెక్ట్ నిర్మాణం 148 మీటర్ల ఎత్తుకు నిర్మించుకున్నామని వివరించారు. గత పాలకులైతే మరో 25 ఏళ్లైనా వీటిని పూర్తి చేసేవారు కాదని వ్యాఖ్యానించారు. ఎల్లంపల్లి పూర్తిస్థాయి సామర్థ్యానికి నిండిందని, ఇక్కడి నుంచి మిడ్‌మానేరుకు నీటి తరలింపు పూర్తయితే ప్రాజెక్ట్ లక్ష్యం 65 శాతం సాఫల్యమైనట్లేనని చెప్పారు. వారం రోజుల్లో మిడ్‌మానేరుకు నీరు విడుదల కావాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ఇకపై అప్పర్ మానేరు, మిడ్‌మానేరు నిండుకుండలా కళకళలాడతాయన్నారు. ఎల్లంపల్లి నుంచి ఎస్సారెస్పీకి నీటిని తరలించడం రివర్స్ పంపింగ్ కాదని, లిఫ్టింగ్ మాత్రమేనని ఆయన వివరించారు. తెలివితక్కువ మాటలొద్దు.. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం కోసం భారీగా ఖర్చులు చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా మొత్తం 400 టీఎంసీలను ఎత్తిపోసేందుకు అయ్యే ఖర్చు ఏటా రూ.4,992 కోట్లు మాత్రమేనని చెప్పారు. అది కూడా అవసరమైనప్పుడు మాత్రమే ఎంత అవసరమో అంతే వినియోగించుకుంటారని వివరించారు. బహుముఖ ప్రయోజనాలు కలిగిన ఈ ప్రాజెక్టు కోసం తమ మెదళ్లను ఎంతగానో కరిగించామన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి నది గర్భంలోనే 91 ఎకరాల విస్తీర్ణంలో నీరు నిల్వ ఉండేలా ప్రాజెక్టు రూపకల్పన చేశామని చెప్పారు. భూసేకరణతో రైతులకు ఇబ్బందులు కాకుండా చేశామన్నారు. కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వకపోయినా సొంత నిధులు, తెలివితేటలతో ప్రాజెక్ట్ పూర్తి చేశామని వివరించారు. కొన్ని ప్రగతి నిరోధక, రాజకీయ శక్తులు ప్రాజెక్ట్‌ను అడ్డుకునేందుకు 300 కేసులు వేశాయని విమర్శించారు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై మాట్లాడిన జయప్రకాశ్ నారాయణకు తెలంగాణతో ఏం సంబంధమని కేసీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రం వద్దన్న వ్యక్తి, సగం తెలివి ఉన్న ఆయనది ఏ సిద్దాంతమని నిలదీశారు. 50 వేల రైతు కుటుంబాల కంటే ముఖ్యమైన వారు రాష్ట్రంలో ఎవరున్నారన్నారు. ‘‘తెలంగాణ రాష్ట్ర కోసం ఉద్యమించిన కేసీఆర్ బతికుండగా రాష్ట్రానికి అన్యాయం జరగనిస్తాడా, సోయి తప్పి పనిచేస్తాడా, రాష్ట్రానికి కష్టం, నష్టం రానిస్తాడా’’అని వ్యాఖ్యానించారు. సాగునీటి ప్రాజెక్టులకు అయ్యే విద్యుత్ ఖర్చు రూ.5 వేల కోట్లు ఆదా చేసి ఎవరికి కిరీటం తొడగాలని ప్రశ్నించారు. ధర్మపురి నృసింహుడు నమ్మిన దేవుడు.. ధర్మపురి లక్ష్మీనృసింహస్వామి తాను నమ్మి మొక్కిన దేవుడని సీఎం కేసీఆర్ చెప్పారు. ఇక్కడి నుంచే తెలంగాణ ఉద్యమం వ్యాప్తి చెంది, ఉద్యమానికి కేంద్ర బిందువుగా మారిందని గుర్తుచేశారు. ఆలయాభివృద్ధికి ఇప్పటికే ప్రకటించిన రూ.50 కోట్లతోపాటు మరో 50 కోట్లను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. నృసింహుని ఆలయంతోపాటు శివాలయం, కోనేరు అంతా ఒకే ప్రాంగణంలోకి వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. నెలరోజుల్లో ధర్మపురిలో ప్రత్యేకంగా పర్యటిస్తానని చెప్పారు. ధర్మపురి మున్సిపాలిటీకి రూ.10 కోట్లు, నియోజకవర్గంలోని మండల కేంద్రాలకు రూ.25 లక్షలు, ఒక్కో గ్రామపంచాయతీకి రూ.10 లక్షలు ప్రత్యేక నిధులు మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, ఎంపీ బోర్లకుంట వెంకటేశ్‌నేత, కలెక్టర్ శరత్, ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్, చెన్నమనేని రమేశ్, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, సుంకె రవిశంకర్ ఉన్నారు. గోదారమ్మకు సారె నిండుగా ప్రవహిస్తూ పరవళ్లు తొక్కుతున్న గోదావరికి సీఎం కేసీఆర్ సారె సమర్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనలో భాగంగా మంగళవారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ బ్యారేజీకి హెలికాప్టర్లో చేరుకున్నారు. జోరువానలో కాలినడకన ఆయన పర్యటన సాగింది. నిర్ణీత సమయానికంటే గంట ఆలస్యంగా మేడిగడ్డ చేరుకున్న కేసీఆర్.. తొలుత ఏరియల్ సర్వే ద్వారా బ్యారేజీని పరిశీలించారు. అనంతరం బ్యారేజీపై ఉన్న 35వ గేట్ వరకు నడుచుకుంటూ వెళ్లారు. తన వెంట ఉన్న ప్రజాప్రతినిధులకు, ఇతర అధికారులకు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి వివరిస్తూ ముందుకు సాగారు. ఇప్పటివరకు ఎన్ని టీఎంసీల నీరు దిగువకు వెళ్లిందనే విషయాన్ని ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. బ్యారేజీలోని మొత్తం 85 గేట్లు మూసి ఉంటే 100 మీటర్ల నీటిమట్టం ఉంటుందని, అలాంటిది అన్ని గేట్లు తెరిచినా దాదాపు 96.5 మీటర్ల ఎత్తులో గోదావరి ప్రవాహం ఉండటం చూసి సీఎం ఆనందం వ్యక్తంచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్యమే 180 టీఎంసీలు ఎత్తిపోయడమని.. అయితే ఒక్క వారంలోనే దాదాపు 250 టీఎంసీల నీరు కిందికి వెళ్లిందని తెలిసి.. అనుకున్నది సాధించామని ఆనందపడ్డారు. ప్రస్తుతం 4 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తోందని అధికారులు సీఎంకు వివరించారు. దాదాపు 50 నిమిషాలపాటు అక్కడే గడిపిన కేసీఆర్.. బ్యారేజీ గేట్ల నిర్వహణ, వరద నియంత్రణకు సంబంధించి ఇంజనీర్లకు పలు సూచనలు చేశారు. అనంతరం గోదారమ్మకు పసుపు, కుంకుమ, పూలతో సారెను సమర్పించారు. మేడిగడ్డ పర్యటనలో సీఎం వెంట çమంత్రులు ఈటల రాజేందర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు, ఎస్పీ ఆర్.భాస్కరన్ తదితరులు ఉన్నారు. -
వరద పెరిగె.. పంపింగ్ ఆగె..
సాక్షి, హైదరాబాద్, కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టు 3 పంప్‌హౌస్‌లలోని మోటార్లను తాత్కాలికంగా నిలిపివేశారు. పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఎల్లంపల్లికి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో మేడిగడ్డ నుంచి రివర్స్ పంపింగ్ ప్రక్రియను ఆపారు. ప్రస్తుతం వస్తున్న ప్రవాహాలతోనే ఎల్లంపల్లి నిండే అవకాశాలుండటం రివర్స్ పంపింగ్ ద్వారా గోదావరి నీటిని మోటార్ల ద్వారా ఎల్లంపల్లికి ఎత్తి పోస్తే కరెంట్‌చార్జీలు వృథా అయ్యే అవకాశాల నేప థ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రాజెక్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఎల్లంపల్లిలో చేరుతున్న నీటిని కాళేశ్వరంలోని 3 ప్యాకేజీల ద్వారా మిడ్‌మానేరుకు తరలించే అవకాశాలపై దృష్టి పెట్టాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల నేపథ్యంలో ఆ దిశగా ఇంజనీర్లు చర్యలు చేపట్టారు. ప్యాకేజీ–7లోని టన్నెల్ పనులను పూర్తి చేసే కసరత్తు చేపట్టనున్నారు. వరద పెరిగింది.. గత 25 రోజులుగా ప్రాణహిత నదికి 8 వేల క్యూసెక్కుల నుంచి 13 వేల క్యూసెక్కుల మేర మాత్రమే వరద ప్రవాహాలు కొనసాగాయి. వచ్చిన కొద్దిపాటి వరదకే అడ్డుకట్ట వేసి మేడిగడ్డ నుంచి నీటిని పంపింగ్ చేశారు. మంగళవారం వరకు మేడిగడ్డ పంప్‌హౌస్ నుంచి 1,500 గంటలపాటు మోటార్లను నడిపి 12 టీఎంసీలను ఎత్తిపోశారు. అన్నారం చేరిన నీటిలో 6 టీఎంసీలను నిల్వ చేశారు. సుందిళ్ల నుంచి నీటిని ఎల్లంపల్లికి ఎత్తిపోసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. హెడ్ రెగ్యులేటర్ నుంచి ఫోర్ బేలోకి నీటిని పంపి సుందిళ్ల పంప్‌హౌస్‌లో మోటార్ల ద్వారా మంగళవారం నుంచి నీటిని ఎత్తిపోయాలని భావిం చారు. దీనికి అనుగుణంగా సుందిళ్లలో 4 మోటార్లను సిద్ధం చేశారు. గత 2 రోజులుగా కురు స్తున్న వర్షా లతో పరీవాహకం నుంచి కడెం, ఎల్లంపల్లిలోకి ప్రవాహాలు పెరిగాయి. కడెంలోకి మంగళవారం ఉదయం 60 వేల క్యూసెక్కుల ప్రవాహం రావడంతో 6 గేట్లు ఎత్తి 52 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. దీంతో ఎల్లంపల్లిలోకి 30 వేల క్యూసెక్కుల మేర ప్రవాహాలు రాగా సాయంత్రానికి అవి 18 వేల క్యూసెక్కులకు తగ్గాయి. ప్రాజెక్టులో నీటి నిల్వ 20 టీఎంసీలకుగాను 7 టీఎంసీలకు చేరింది. ఎగువ కడెంలోకి స్థిరంగా 29,810 క్యూసెక్కుల మేర ప్రవాహం వస్తుండటం, మరో 4 రోజులు వర్షాలు కురిసే అవకాశాల నేపథ్యంలో ఎల్లంపల్లిలోకి మరో 3–4 రోజులు స్థిరంగా ప్రవాహాలు కొనసాగే అవకా శం ఉంది. ఈ నేపథ్యంలో ఎల్లంపల్లిలో నిల్వలు పెరిగే అవకాశం ఉంది. దీంతో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పంప్‌హౌస్‌ల మోటార్లను నిలిపివేశారు. సుందిళ్లలోని ఒక పంప్‌హౌస్‌ను మంగళవారం సాయంత్రం కాసేపు నడిపి ఆపేశారు. ఎల్లంపల్లికి వరద నేపథ్యంలో రివర్స్ పంపింగ్ ద్వారా ఎల్లంపల్లికి నీటిని పంపినా ఫలితం ఉండదు. ఒకవేళ తరలించినా అక్కడి నుంచి మిడ్‌మానేరుకు నీటి తరలింపు ప్రక్రియ సిద్ధంగా ఉండాలి. ప్రస్తుతం ఎల్లంపల్లి దిగువన ప్యాకేజీ–7 పనులు ఇంకా పూర్తికానందున ఈ ప్రక్రియ మొదలు కాలేదు. దీంతో మోటార్లను నిలిపివేశారు. మోటార్లు ఆపేసిన అనంతరం ప్రాణహిత నదిలోనూ వరద ఉధృతి పెరిగింది. వచ్చే నెల 5 నుంచి ఎల్లంపల్లి ఎత్తిపోతలు ఎల్లంపల్లికి వరద ప్రవాహాలు మొదలవడం, ఒకవేళ ప్రవాహాలు ఆగినా సుందిళ్ల నుంచి నీటిని తరలించే వ్యవస్థ సిద్ధంగా ఉండటంతో ఈ ప్రాజెక్టు నుంచి నీటి తరలింపు చర్యలకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే ఎల్లంపల్లి దిగువన ప్యాకేజీ–6లో 7 మోటార్లకు 5 మోటార్లు సిద్ధంగా ఉండగా ఐదో మోటార్ వెట్ రన్ మంగళవారం విజయవంతమైంది. ఇక ప్యాకేజీ–7 టన్నెల్లో సివిల్ పనులన్నీ బుధ, గురువారాల్లో పూర్తి కానున్నాయి. పనులు పూర్తయితే అక్కడ క్లీనింగ్ ప్రక్రియ మొదలవుతుంది. దీనికి 4–5 రోజులు పట్టనుంది. ఈ పనులను మంగళవారం సీఎం కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్, సీఎం ఓఎస్డీ శ్రీధర్ దేశ్‌పాండే, ఈఎన్సీ మురళీధర్ పరిళీలించారు. ఎల్లంపల్లి నుంచి వచ్చే నెల 5న ఎత్తిపోతలు ప్రారంభించాలని ఆదేశించారు. ఎల్లంపల్లి నుంచి ఈ మూడు ప్యాకేజీల ద్వారా మిడ్‌మానేరుకు నీటిని తరలించనున్నారు. వచ్చే నెల 5న ఎల్లంపల్లి నుంచి నీటిని ఎత్తిపోసే కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉందని నీటిపారుదల వర్గాలు తెలిపాయి. కాగా, ఈశాన్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఆగస్టు 4న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు వెల్లడించారు. మేడిగడ్డ బ్యారేజీలో 30 గేట్ల ఎత్తివేత మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాణహిత నదికి వరద పోటెత్తింది. ఆ నీరంతా గడ్చిరోలి జిల్లా సిరొంచ మీదుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద గోదావరిలో కలుస్తోంది. దీంతో మంగళవారం సాయంత్రం వరకు కాళేశ్వరం వద్ద గోదావరి నీటిమట్టం 8 మీటర్లకు చేరుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి ప్రాణహిత వరద పెరగడంతో మంగళవారం ఉదయం 30 గేట్లు పైకి ఎత్తారు. దీంతో బ్యారేజీ వద్ద 4.10 లక్షల క్యూసెక్కుల అవుట్ ఫ్లో తరలిపోతోంది. వరద ఇన్‌ఫ్లో పెరిగితే బ్యారేజీలోని మరిన్ని గేట్లను ఎత్తేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. బ్యారేజీలో ఆది, సోమవారాల్లో నీటి నిల్వ 4.5 టీఎంసీలు ఉండగా మంగళవారం అది 7 టీఎంసీలకు పెరిగింది. బ్యారేజీ పూర్తిస్థాయి సామర్థ్యం 16.17 టీఎంసీలు. -
ఎల్లంపల్లి అంకితమేదీ?
సాక్షిప్రతినిధి, కరీంనగర్: జలయజ్ఞంలో భాగంగా జనహృదయ నేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి శ్రీపాద (ఎల్లంపల్లి) ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం చేసి సరిగ్గా పద్నాలుగేళ్లయింది. ఈ ప్రాజెక్టు ద్వారా సాగు, తాగునీటి అవసరాలను తీర్చుకుంటున్నప్పటికీ అధికారికంగా ప్రారంభోత్సవం చేయకపోవడం చర్చనీయాంశం అవుతోంది. ప్రజలకు అంకితం పేరిట 2014లో పైలాన్ నిర్మించి వదిలేశారు. ఉమ్మడి ప్రభుత్వ హయాంలో సీఎంగా ఉన్న వైఎస్.రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా ఎల్లంపల్లి ప్రాజెక్టును 28 జూలై 2004లో శంకుస్థాపన చేసి.. 36 (మూడేళ్లు) నెలల్లో పూర్తి చేయాలని నిర్ణయించారు. రూ.2744 కోట్ల నిధులను జలయజ్ఞం కింద కేటాయించారు. ఇందులో డ్యాం(ప్రాజెక్టు)కు రూ.408.85 కోట్లకు బెంగళూరుకు చెందిన ఎస్పీఎంఎల్ ఐటీడీ సిమెంటేషన్ పనులు దక్కించుకుంది. రూ.191 కోట్లతో స్పిల్‌వే పియర్స్‌పై ఫ్యాబ్రికేషన్ గేట్ల పనులను ఎస్ఈడబ్ల్యూ (స్యూ), ఓం మెటల్స్ కంపెనీలు పనులను పొందాయి. ఈ మేరకు ఎల్ఎస్నెం.1/2004–05, 07–11–2004తో జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రాజెక్టును స్టేజ్–1, స్టేజ్–2గా విభజించా రు. మొదటి స్టేజీలో ఫేజ్–1, ఫేజ్–2గా విభజి స్తూ ఫేజ్–1లో ప్రాజెక్టు(డ్యాం) నిర్మాణాన్ని ఐటీడీ సిమెంటేషన్ దక్కించుకోగా.. ఫేజ్–2లో 6.5 టీఎంసీల నీటిని ఎన్టీపీసీకి పైపులైన్లతో నీటి సరఫరా పనులను ఎస్పీఎంఎల్ కంపెనీ దక్కించుకుంది. పూడిక తొలగింపునకు ఆధునిక పరిజ్ఞానం ప్రాజెక్టులో పేరుకుపోయిన పూడికను విడుదల చేసేందుకు ఆధునిక పరిజ్ఞానంతో 42 నుంచి 45వ బ్లాక్ వరకు అడుగుభాగంలో (రివర్స్ స్లూయిస్) గేట్లను ఏర్పాటు చేశారు. ఈ విధానం శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు లేకపోవడంతో అందులో సగానికి పైబడి పూడిక పేరుకుపోవడంతో చిన్నపాటి వరదలకే ప్రాజెక్టు నిండుతుంది. శ్రీపాద ప్రాజెక్టులో డెడ్ స్టోరేజీ (నీటి చుక్క లేకుండా) నీటిని బయటకు పంపించే అవకాశముంటుంది. ఫలితంగా నిల్వ నీటిలో పేరుకుపోయిన మట్టి, పూడిక అంతా వరదలో కొట్టుకుపోవడంతో ప్రాజెక్టులో ఉన్న నీటి సామరŠాధ్యన్ని పూర్తిస్థాయిలో వినియోగించే వీలుంటుంది. బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా ఎల్లంపల్లి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా మారింది. ప్రస్తుత తరుణంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు తెలంగాణ ప్రభుత్వానికి గుండెకాయగా మారిందని చెప్పుకోవచ్చు. ఎల్లంపల్లి ప్రాజెక్టు దిగువన ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రివర్స్ పంపింగ్ విధానంతో తిరిగి ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి నీటిని మళ్లించనున్నారు. ఫలితంగా రెండువందల కిలోమీటర్ల పరిధిలో గోదావరినది వరద నీటితో సజీవంగా ఉంటుంది. అయితే అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు కాళేశ్వరం ప్రాజెక్టుపై ఉన్న పట్టింపు ఎల్లంపల్లి ప్రాజెక్టుపై లేకపోవడం గమనార్హం. దివంగత సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మించడంతోనే కాళేశ్వరం ప్రాజెక్టు సాకారమైందని చెప్పుకోవచ్చు. ప్రాజెక్టు జలాల వినియోగం ఇలా... ఎల్లంపల్లి ప్రాజెక్టుతో ఎత్తిపోతల ద్వారా సాగు, తాగునీరందుతున్న ప్రాంతాల్లో పెద్దపల్లి, కరీంనగర్, సిరిసిల్ల, జగిత్యాల, భూపాలపల్లి, మంచిర్యాల, హైదరాబాద్ జంట నగరాలకు ఎల్లంపల్లి ప్రాజెక్టు జలాలు అందుతున్నాయి. ఇటీవల రూ.80 కోట్లతో రామగుండం నియోజకవర్గ పరిధిలోని 24వేల ఎకరాలకు ఎత్తిపోతలతో సాగునీటిని అందించేందుకు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద 2.24 లక్షల ఎకరాలు సాగవుతున్నాయి. దీంతోపాటు ఎన్టీపీసీ, సింగరేణి బొగ్గు గనులు, సింగరేణి విద్యుత్ సంస్థల అవసరాలకు నీటిని సరఫరా చేస్తున్నారు. అపరిష్కృతంగా ఉన్న ప్రాజెక్టు సమస్యలు ఎల్లంపల్లి ప్రాజెక్టులో ముంపు బాధితుల్లో 2015 జనవరి నాటికి 18 ఏళ్లు నిండిన యువతకు పునరావాస ప్యాకేజీ అమలు చేయలేదు. ఇందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని వివిధ మండలాల్లో 3,128 మంది అర్హులున్నట్లు రెవెన్యూ అధి కారులు గుర్తించారు. పరిహారం చెల్లించాల ని ప్రభుత్వం ఆదేశించడంతోపాటు దానికి సరిపడు నిధులను ఆర్డీవోల వద్ద జమ చేసినట్లు కూడా తెలిసింది. ప్రాజెక్టుకు పర్యాటకులు వాహనాలలో వెళ్లేందుకు సరైన రహదారి సౌకర్యం లేదు. అదే విధంగా ప్రాజెక్టు వద్ద పర్యాటకులు సేదా తీరేందుకు ఉద్యానవనం, ఇతరత్రా టూరిజం ఎంటర్టైన్మెంట్ పరికరాలను ఏర్పాటు చేయలేదు. గతేడాది ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ సమీపంలోని వెల్గటూర్ మండల పరిధిలో కి వచ్చే కోటి లింగాల పుణ్యక్షేత్రం వద్ద తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో బోటింగ్ ను చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ ప్రారంభోత్సవం చేశారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు వరకు నడిపించాలని గతేడాది నిర్ణయించినప్పటికీ ఆచరణకు నోచుకోలేదు. ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం.. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి విద్యుత్ అవసరాల దృష్ట్యా ఎన్టీపీసీకి 6.5 టీఎంసీ నీటి సరఫరా.. 2టీఎంసీలు మంథనికి ఎత్తిపోతల పథకం ద్వారా కమాన్‌పూర్, మంథని నియోజకవర్గ పరిధిలో 20వేల ఎకరాలకు సాగునీరు. అందులో ఏడువేల ఎకరాలు స్థిరీకరణ. కమాన్‌పూర్ మండలంలో నాలుగు గ్రామాలలో 1,380 ఎకరాలు. ముత్తారం మండలంలోని 17 గ్రామాలకు 18,620 ఎకరాలు. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఎగువ భాగంలో కడెం ఎత్తిపోతల పథకం కింద 3టీఎంసీల నీటిని 30వేల ఎకరాలు స్థిరీకరించుట. కరీంనగర్ జిల్లాలోని ఏడు నియోజకవర్గాల పరిధిలో 19 మండలాలకు చెందిన 206 గ్రామాల కింద రెండు లక్షల ఎకరాలకు సాగు, తాగునీరు.. ఇందుకుగాను వేమునూర్‌లో 12 టీఎంసీలను పంపింగ్ చేసేందుకు పంపుహౌస్ నిర్మాణం. 160 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించతలపెట్టిన ప్రాణహిత–చేవెళ్ల భారీ ప్రాజెక్టుకు ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా ఉపయోగపడుతుంది. అబ్దుల్ కలాం సుజల స్రవంతి పథకంలో భాగంగా 10 టీఎంసీల నీటిని గ్రేటర్ హైదరాబాద్‌కు తాగునీటి అవసరాల నిమిత్తం పైపులైన్ల ద్వారా సరఫరా. -
విజయవంతంగా ప్రాజెక్టుల నిర్మాణం
మంచిర్యాలరూరల్(హాజీపూర్): తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్ట్‌ల నిర్మాణంలో విజయవంతంగా ముందుకు సాగుతున్నామని భారీ నీటి పారుదల శాఖా మంత్రి హరీశ్‌రావు తెలిపారు. శుక్రవారం ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ను మంత్రి సందర్శించారు. ప్రాజెక్ట్‌లోని నీటిమట్టంతోపాటు ప్రాజెక్ట్ తాజా వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధికారులు కూడా తాజా నివేదికను మంత్రికి అందించారు. మంత్రి మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రాజెక్ట్‌ల నిర్మాణంలో ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ప్రాజెక్ట్‌లను పూర్తిచేసి సాగు, తాగునీటి సౌకర్యాలు మెరుగుపరిచామని తెలిపారు. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ భూసేకరణకోసం రూ.600 కోట్లు కేటాయించి పునరావాస పరిహారాన్ని నిర్వాసితులకు అందించామని తెలిపారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం కాగా సీఎం కేసీఆర్ ఒక లక్ష్యంతో ప్రాజెక్ట్ నిర్మాణం చేపడుతూ అభివృద్ధిలో దూసుకుపోతున్నామన్నారు. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించాలని పేర్కొనడం కాంగ్రెస్ అవగాహన రాహిత్యానికి నిదర్శనమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో గ్రామాలు ముంపునకు గురికాకుండా రూపకల్పన చేసి నిర్మించిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా మేడిగడ్డ వద్ద నిర్మించే బ్యారేజీని 16 టీఎంసీల నీటి సామర్థ్యంతో 85 గేట్లతో నిర్మిస్తుండగా, అన్నారం వద్ద బ్యారేజీని 11 టీఎంసీల నీటిసామర్థంతో 66 గేట్లతో నిర్మిస్తున్నట్లు తెలిపారు. సుందిళ్ల వద్ద నిర్మిస్తున్న బ్యారేజీ కూడా 9 టీఎంసీల నీటితో మొత్తం 74 గేట్లతో నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో 100 కిలోమీటర్ల భూగర్భజలాలు పెరుగుతాయని తెలిపారు. మంత్రి వెంట ఎల్లంపల్లి ప్రాజెక్ట్ సీఈ వెంకటేశ్వర్లు, ఎస్ఈ విజయ్‌కుమార్, ఈఈ సత్యరాజ్‌చంద్ర, డీఈ రాజమల్లు, ఏఈఈ శివసాగర్ ఉన్నారు. -
ఆ 240 ఎకరాల విషయంలో జోక్యం వద్దు
భూ సేకరణ ప్రక్రియ పూర్తి చేసి పరిహారం చెల్లించండి ఆ తరువాతే భూములు తీసుకోండని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా సుందిళ్ల బ్యారేజీ నుంచి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఉద్దేశించిన ఎత్తిపోతల పథకం కోసం పెద్దపల్లి జిల్లా, గౌలివాడలో సేకరించదలచిన 240 ఎకరాల భూముల విషయంలో జోక్యం చేసుకోవద్దని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ భూములకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ పూర్తి చేసి, పరిహారం చెల్లించేంత వరకు ఆ భూములను స్వాధీనం చేసుకోవ డానికి వీల్లేదని స్పష్టం చేసింది. అంతేకాక ఆ భూముల్లో రైతులు ఏవైనా పంటలు వేసుకు ని ఉంటే వాటి విషయంలో రైతుల హక్కుల కు భంగం కలిగించేలా వ్యవహరించవద్దని తేల్చి చెప్పింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి, నీటిపారు దల శాఖ ముఖ్య కార్యదర్శి, జిల్లా కలెక్టర్, భూ సేకరణ అధికారి తదితరులకు నోటీసు లు జారీ చేసింది. తదుపరి విచారణను 21కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. భూ సేకరణ ప్రక్రియ పూర్తి కాక ముందే ప్రభుత్వం తమ భూములను స్వాధీనం చేసుకుంటోందని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని గౌలివాడ గ్రామానికి చెందిన రైతు ప్రవీణ్‌రెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. -
అన్నదాతల్లో ఆనందం
దండేపల్లి : శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుపై నిర్మించిన దండేపల్లి మండలంలోని గూడెం శ్రీ సత్యనారాయణస్వామి ఎత్తిపోతల పథకం నీటిని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు మంగళవారం విడుదల చేయనున్నారు. దీంతో కడెం ఆయకట్టు చివరి రైతుల్లో ఆనందం నెలకొంది. ఆయకట్టు పరిధిలోని డి–30నుంచి డి–42 వరకు గూడెం ఎత్తిపోతల నీటిని అందించనున్నారు. ఎత్తిపోతల పథకానికి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్‌రెడ్డి రూపకల్పన చేసి రూ.118 కోట్లు నిధులు మంజూరు చేసి 2009 జనవరి 27న పనులకు శంకుస్థాపన చేశారు. నిధుల కొరతతో మిగిలిపోయిన పనులకు ప్రస్తుత సీఎం కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు 2014లో బడ్జెట్‌ను రూ.180 కోట్లకు పెంచి పనులు పూర్తి చేశారు. 2015 జూన్ 5న ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించి రైతులకు అంకితం చేశారు. అదే సంవత్సరం ఎత్తిపోతల నీటిని కడెం ప్రధాన కాల్వకు విడుదల చేసి ఖరీప్‌లో ఆయకట్టు చివరిదాక సాగునీరందించారు. యాసంగికి మొదటిసారి.. ఎత్తిపోతల పథకం ప్రారంభించినప్పటి నుంచి యాసంగికి నీళ్లు ఇవ్వడం ఇదే మొదటిసారి. 2015లో ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. అదే సంవత్సరం ఖరీఫ్ సాగుకు నీరందించారు. నీటి కొరత కారణంగా 2016లో రబీకీ నీరందించలేకపోయారు. మొన్నటి ఖరీఫ్‌కు కడెం ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీరుండటంతో ఆయకట్టు చివరిదాక కడెం ప్రాజెక్టు నీటినే అందించారు. అయితే.. యాసంగి సాగుకు కడెం నీరు చివరిదాక సరిపోనందున గూడెం ఎత్తిపోతల నీరు అందించాలని అధికారులు ఇటీవలే నిర్ణయించారు. యాసంగిలో ఆరుతడి పంటలకు గూడెం ఎత్తిపోతల నీటిని అందిస్తుండటంతో ఆయకట్టు చివరి రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. 17,775ఎకరాలకు సాగునీరు.. గూడెం ఎత్తిపోతల ద్వారా దండేపల్లి, లక్సెట్టిపేట, హాజీపూర్ మండలాల్లో 30 వేల ఎకరాలకు సాగునీరందించాల్సి ఉంది. అయితే.. ఈ యాసంగిలో మాత్రం ఆరుతడి పంటల కోసం 2.26 టీఎంసీల నీటిని 17,775 ఎకరాలకు అందించనున్నట్లు అధికారులు తెలిపారు. గూడెం పంప్‌హౌజ్ నుంచి 11 కిలోమీటర్ల పైప్‌లైన్ ద్వారా దండేపల్లి మండలంలోని తానిమడుగు వద్ద కడెం ప్రాజెక్టు డి–30 వద్ద నిర్మించిన డెలివరి సిస్టర్న్ ద్వారా కడెం ప్రధాన కాల్వలో నీటిని విడుదల చేస్తారు. దీంతో గూడెం ఎత్తిపోతల నీరు కడెం ఆయకట్టు చివరిదాక వెళ్లనుంది. -
భూ నిర్వాసితులకు నజరానా
సాక్షి, హైదరాబాద్: మిడ్ మానేరు, ఎల్లంపల్లి ప్రాజెక్టుల వల్ల నిర్వాసితు లైన యువతకు ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. ఈ ప్రాజెక్టు ల పరిధిలో ఆర్అండ్ఆర్ నోటిఫి కేషన్ ఇచ్చిన 2010 ఆగస్టు నాటికి మైనర్లుగా ఉండి 2015 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారికి రూ. 2 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రత్యేక ఆర్థిక సాయం కింద ఏకమొత్తంగా ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం నీటిపారుదల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం రెండు ప్రాజెక్టుల పరిధి లోని 9,484 మంది నిర్వాసిత యువతకు రూ. 189.68 కోట్ల ప్రత్యేక ఆర్థిక సాయం అందనుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద ప్రత్యేక సాయం పొందే వారిలో కరీంనగర్ పరిధిలోని 3,127 మందికి రూ. 62.54 కోట్లు, ఆదిలాబాద్ పరిధిలోని 1,974 మందికి రూ. 39.48 కోట్లు కలిపి మొత్తంగా రూ. 102.02 కోట్ల ఆర్థిక సాయం పొందను న్నారు. అలాగే మిడ్‌మానేరు పరిధిలోని గౌరవెల్లి రిజర్వాయర్ పరిధిలో 152 మందికి రూ. 3.04 కోట్లు, ఇదే ప్రాజెక్టు పరిధిలోని ఇందిరమ్మ వరద కాల్వ కింద ఉన్న 4,231 మందికి రూ. 84.62 కోట్లు కలిపి రూ. 87.66 కోట్ల ఆర్థిక సాయం అందుకోనున్నారు. గతేడాది నిర్ణయం..ప్రస్తుతం అమలు..: మిడ్ మానేరు, ఎల్లంపల్లి ప్రాజెక్టుల పరిధిలో సామాజిక ఆర్ధిక సర్వే (ఎస్ఈఎస్) ఆధారంగా గుర్తించిన యువతకు మానవతా దృక్పథంతో ఆర్థిక సాయం అందిం చాలని గతేడాది జనవరిలోనే నిర్ణయం జరిగింది. 2010 ఆగస్టు 26 నాటికి సామాజిక ఆర్థిక సర్వే సమయానికి మైనర్లుగా ఉండి 2015 జనవరి 1 నాటికి 18 ఏళ్లు పూర్తి చేసుకున్న వారికి వన్‌టైమ్ సెటిల్మెంట్ కింద ఓసీ, బీసీలకు రూ. 2 లక్షలు, ఎస్సీ, ఎస్టీలకు రూ. 2.30 లక్షలు చెల్లిస్తే సబబుగా ఉంటుందని సర్కారు భావించింది. అయితే ఈ విధానం ద్వారా చెల్లింపులకు మార్గదర్శకాలు లేకపోవడంతో ఈ ప్రక్రియ ముందుకు పోలేదు. అనంతరం తిరిగి కొత్తగా మార్గదర్శకాలు రూపొందించి నిర్ణీత గడువులో 18 ఏళ్లు పూర్తి చేసుకున్న వారి జాబితా సిద్ధమైంది. అయితే ఇతర ప్రాజెక్టుల పరిధిలోనూ ప్రత్యేక ఆర్థిక సాయం డిమాండ్లు వచ్చే అవకాశాలున్న దృష్ట్యా ఈ ప్రతిపాదనను జూన్‌లో జరిగిన కేబినెట్ సమావేశంలో తిరస్కరించారు. కానీ గతేడాది సెప్టెంబర్‌లో కురిసన భారీ వర్షాల వల్ల మిడ్ మానేరు కట్టలు తెగిపోయిన సందర్భంగా కరీంనగర్ వెళ్లిన సీఎం కేసీఆర్ స్థానిక ప్రజాప్రతినిధుల వినతులను దృష్టిలో పెట్టుకొని నిర్వాసిత యువతకు రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు. -
ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా పెరిగిన వరద
ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సోమవారం భారీగా వరద నీరు వచ్చిచేరుతుంది. ప్రాజెక్టులోకి 5 లక్షల 11 వేల 227 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా వస్తోంది. అధికారులు 4 లక్షలా 83 వేల 185 క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తి సామర్ధ్యం 20.175 టీఎంసీలు. -
ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు
ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులోకి 13,561 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. సుమారు 18 క్యూసెక్కుల నీటిని 10 గేట్లు ఎత్తి బయటకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 19.56 టీఎంసీల నీరు నిల్వ ఉంది. -
ఎల్లంపల్లికి భారీగా చేరుతున్న వరద నీరు
144.56 మీటర్లకు చేరిన నీరు మంచిర్యాల రూరల్ : ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న నీటితో ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు భారీగా నీరు చేరుతోంది. ఆదివారం మండలంలోని గుడిపేట వద్ద గల ఎల్లంపల్లి(శ్రీపాద సాగర్) ప్రాజెక్ట్‌కు భారీగా వరద నీరు చేరుతుండటంతో నిండు కుండలా దర్శనమిచ్చింది. ఇటీవల కురిసిన వర్షాలు, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో పాటు కడెం ప్రాజెక్ట్ ద్వారా పెద్ద ఎత్తున వరద నీరు వస్తుండటంతో ఎల్లంపల్లి నిండుకుంటుంది. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నీటి మట్టం 148 మీటర్ల క్రస్ట్ లెవెల్ కాగా ఆదివారం రాత్రి 8 గంటల వరకు 144.56 మీటర్లకు చేరింది. 20.175 టీఎంసీల నీటి సామర్థ్యానికి గాను ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో 11.777 టీఎంసీల నీటీ నిల్వ ఉంది. ప్రాజెక్ట్‌కు ఇన్ ఫ్లో 8 వేల 696 కూసెక్కులు కాగా ఇందులో 521 క్యూసెక్కుల అవుట్ ఫ్లో ఉంది. అవుట్ ఫ్లో నీరు ఎన్టీపీసీకి 363 క్యూసెక్కులు, హైదరాబాద్ మెట్రోవాటర్ వర్క్స్(సుజల స్రవంతి పథకం) ద్వారా గ్రేటర్ హైదరాబాద్‌కు 158 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నారు. ప్రభుత్వం ఈ ఏడాది ప్రాజెక్ట్‌లో 147 మీటర్ల వరకు నీటి నిల్వ చేయాలని ఉత్తర్వులు జారీ చేయగా అధికారులు ఆ దిశగా ప్రాజెక్ట్‌లో నీటి నిల్వ చేస్తున్నారు. ఇక జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రాజెక్ట్ ముంపు గ్రామాల్లోని ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని జేసీ సుందర్ అబ్నార్ రెవెన్యూ అధికారులతో కలిసి ఇప్పటికే నిర్వాసితులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లోని ముంపు గ్రామాలకు ఎలాంటి ముంపు లేదని ప్రాజెక్ట్‌కు నీళ్లు పెద్ద ఎత్తున వచ్చి చేరుతున్నా ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నామని తెలిపారు. ముంపు గ్రామాలైన చందనాపూర్, రాపల్లి, కొడపల్లి, కర్ణమామిడి, పడ్తనపల్లి గ్రామాల నిర్వాసితులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నామని అన్నారు. అయితే ముందస్తుగా వారికి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పునరావాస కేంద్రాల్లో తాత్కాలిక పునరావాస ఏర్పాట్లు కూడా సిద్దం చేసి ఉంచామన్నారు. ఎఫ్ఆర్ఎల్ లెవెల్స్ ప్రకారం నీట మునిగే గ్రామాలు... ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌లో ఎఫ్ఆర్ఎల్ ప్రకారం మంచిర్యాల, లక్సెట్టిపేట మండలాల పరిధిలోని ముంపు గ్రామాలు ఈ విధంగా మునగనున్నాయి. ప్రాజెక్ట్ 148 మీటర్ల క్రస్ట్ లెవెల్ కాగా ఇప్పటి వరకు 144.56 మీటర్ల వరకు నీటి నిల్వ ఉంది. అయితే ఈ నీరు మరింత పెరిగితే ఆయా గ్రామాల వారిగా ముంపు గ్రామాలు నీట మునగనున్నాయి. 143.50 మీటర్ల నీటి నిల్వ ఉంటే నమ్నూర్, 145.00లో రాపల్లి, 145.50లో కొండపల్లి, లక్సెట్టిపేటలోని సురారం, 147.50లో చందనాపూర్, 147.75లో కర్ణమామిడి, 148.00లో గుడిపేట,149.50లో పడ్తనపల్లి, లక్సెట్టిపేట మండలంలోని గుల్లకోట గ్రామాలు నీట మునగనున్నాయి. -
ఎల్లంపల్లికి పెరుగుతున్న వరద ఉధృతి
144.50 మీటర్లకు చేరిన నీరు ముంపు గ్రామాలు ఖాళీ చేయాలని జేసీ ఆదేశాలు మంచిర్యాల రూరల్ : ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న నీటితో ఎల్లంపల్లి ప్రాజెక్ట్ భారీగా నిండుతోంది. ఇటీవల కురిసిన వర్షాలతో పాటు కడెం ప్రాజెక్ట్ గేట్లు తీయడంతో పెద్ద ఎత్తున వరద నీరు ప్రాజెక్ట్‌కు చేరింది. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నీటి మట్టం 148 మీటర్ల క్రస్ట్ లెవెల్ కాగా శనివారం రాత్రి 8 గంటల వరకు 144.50 మీటర్లకు చేరింది. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో 11.98 టీఎంసీల నీటి నిల్వ ఉంది. కాగా, ప్రస్తుతానికి ప్రాజెక్ట్‌కు ఇన్‌ఫ్లో 6,400ల క్యూసెక్కుల కాగా 521 క్యూసెక్కుల అవుట్ ఫ్లో ఉంది. ప్రభుత్వం ఈ ఏడాది ప్రాజెక్ట్‌లో 147 మీటర్ల వరకు నీటి నిల్వ చేయాలని ఉత్తర్వులు జారీ చేయగా అధికారులు ఆ దిశగా ప్రాజెక్ట్‌లో నీటి నిల్వ చేస్తున్నారు. ఇక జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రాజెక్ట్ ముంపు గ్రామాల్లోని ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలని జేసీ సుందర్ అబ్నార్ నిర్వాసితులను ఆదేశించారు. ముంపు గ్రామాలైన చందనాపూర్, రాపల్లి, కొడపల్లి, కర్ణమామిడి, పడ్తనపల్లి గ్రామాల నిర్వాసితులను అప్రమత్తం చేస్తున్నామని పేర్కొన్నారు. నీటిమట్టం 145.50 మీటర్లకు పెరిగితే చందనాపూర్ నీట మునిగే ప్రమాదం ఉంది. -
పుష్కర ఘాట్లలో నీటి ఉధృతి
కరీంనగర్(రామగుండం): కరీంనగర్ జిల్లాలోని పుష్కర ఘాట్లకు నీటి ఉధృతి పెరిగింది. సోమవారం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి 3 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో పలు పుష్కర ఘాట్లలో ప్రవాహ వేగం పెరిగింది.మర్ముల్, మంథని, రామగుండం, గొలివాడ, గోదావరిఖని పుష్కర ఘాట్లలో నీటి ఉధృతి పెరిగింది. దీంతో భక్తులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు తెలిపారు. -
నిర్వాసితులను ఆదుకోండి..
మంచిర్యాల రూరల్ : ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిధిలోని నిర్వాసితులు గురువారం తమను ఆదుకోవాలని మంచిర్యాలలో ఆందోళనకు దిగారు. ప్రాజెక్టులో నీటిని నిల్వ చేయడంతో ముంపు గ్రామాల సమీపంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరి నానా తిప్పలు పడాల్సి వస్తోందని ఆర్డీవో కార్యాలయంలో కలెక్టర్ జగన్మోహన్ను కలిసి విన్నవించారు. కర్ణమామిడి, పడ్తన్‌పల్లి గ్రామాలకు ఇప్పటి వరకు ఇంటి డబ్బులు, ఇంటి అడుగు స్థలం డబ్బులు ఇవ్వలేదని, కర్ణమామిడి గ్రామానికి పునరావాస కాలనీ పనులు ఏర్పాటు చేయలేదని ఆయనకు వివరించారు. స్పందించిన కలెక్టర్ నిర్వాసితుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పరిహారం ఎప్పుడు చెల్లిస్తారని ఎస్డీసీ తిరుపతిరావును అడగ్గా, పది రోజుల్లోగా కొంత పరిహారం నిధులు వస్తాయని తెలిపారు. ఎంపీపీ బేర సత్యానారయణ, జెడ్పీటీసీ రాచకొండ ఆశాలత, వైస్ ఎంపీపీ మందపల్లి శ్రీనివాస్, పడ్తన్‌పల్లి, కర్ణమామిడి సర్పంచులు పాల్గొన్నారు. గుళ్లకోట నిర్వాసితుల ఆందోళన ఆర్డీవో కార్యాలయంలో అధికారులతో సమీక్ష జరుపుతున్న కలెక్టర్ బయటకు వచ్చి, నిర్వాసితుల సమస్యలను వినాలంటూ లక్సెట్టిపేట మండలం గుళ్లకోటకు చెందిన గ్రామస్తులు ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు బైఠాయించి, తమకు పరిహారం అందించేందుకు కలెక్టర్ హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశం అనంతరం బయటకు వెళ్తున్న కలెక్టర్‌ను అడ్డుకున్నారు. సమస్యలు పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
పరిహారం ఇస్తారా.. చావమంటారా?
అధికారులను నిలదీసిన భూ నిర్వాసితుడు నర్సింగపూర్(చందుర్తి): పరిహారం పంపిణీలో అన్యాయం జరిగిందనే మనస్తాపంతో అధికారుల ఎదుటే ఓ రైతన్న ఆత్మహత్యాయత్నం చేశాడు. చందుర్తి మండలం నర్సింగపూర్ ఊరచెరువును.. ఎల్లంపల్లి ప్రాజెక్టు రెండో దశలో రిజర్వాయర్‌గా నిర్మిస్తున్నారు. ఇందులో రైతు దేవయ్య పొలం, బావి కోల్పోయాడు. తనకు అందాల్సిన పరిహారాన్ని భూసేకరణ అధికారులే ఇతర రైతుల పేర్లపై నమోదు చేశారని దేవయ్య ఆరోపించాడు. భూసేకరణ డెప్యూటీ తహశీల్దార్ రాజమణి సోమవారం గ్రామంలో పరిహారం చెక్కులు పంపిణీ చేస్తుండగా దేవయ్య గోడు వెల్లబోసుకున్నాడు. పరిహారం అందకుంటే ఆత్మహత్య చేసుకుంటానని పురుగుమందు డబ్బా వెంటతెచ్చుకున్నాడు. తప్పిదాలను పరిశీలించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో రైతు వెనుదిరిగాడు. -
వేములవాడకు ఎల్లంపల్లి నీళ్లు
మేడిపెల్లి: ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి వేములవాడ నియోజకవర్గంలోని భూములకు నీరందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు తెలిపారు. గురువారం మేడిపెల్లి, కట్లకుంటలో ‘మన ఊరు-మన ప్రణాళిక’పై జరిగిన గ్రామసభల్లో మాట్లాడారు. నియోజకవర్గ పరిధిలోని 97 వేల ఎకరాలకు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి సాగునీరు అందించడానికి ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు చెప్పారు. చందుర్తి మండలం రుద్రంగి శివారులో ఉన్న చెరువును నింపి కథలాపూర్, మేడిపెల్లి మండలాలకు సాగునీరు అందిస్తామని తెలిపారు. అధికారులు అన్ని గ్రామాల్లో పర్యటించి ప్రణాళికలు తయారు చేయాలన్నారు. మేడిపెల్లిలో మంచినీటి సమస్య శాశ్వత పరిష్కారానికి ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశించారు. జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, జెడ్పీటీసీ నెల్లుట్ల పూర్ణిమ, ఎంపీపీ పల్లి జమున, నియోజకవర్గ ఇన్చార్జి అంబయ్య, మండల పరిశీలకుడు శాంతికుమార్, తహశీల్దార్ వసంత, ఎంపీడీవో సుందరవరదరాజన్, ఎంఈవో జితేందర్‌రావు, సర్పంచులు బొంగోని రాజాగౌడ్, గౌరి భూమయ్య, రాములు, అంగడి ఆనందం, చెట్ట గంగరాజు, ఎంపీటీసీలు కుందారపు అన్నపూర్ణ, దాసరి శంకర్, సురకంటి విజయనారాయణరెడ్డి, భూమేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
కోల్‌బెల్ట్‌కు నీటి కష్టాలు!
గోదావరిఖని, న్యూస్‌లైన్ : కోల్‌బెల్ట్ ప్రజలకు నీటి ముప్పు పొంచి ఉంది. తలాపునే గోదావరి ఉన్నా తాగునీటికి నానా తిప్పలు పడే రోజులు రానున్నాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణంతో నీరు కిందకి వచ్చే పరిస్థితి లేకపోవడంతో అవస్థలు తప్పేలా లేవు. కార్మికుల శ్రేయస్సే ధ్యేయమని చెబుతున్న సింగరేణి యాజమాన్యం ముందస్తు చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. తాగునీటికి ఖర్చు చేసేందుకు వెనుకంజ సింగరేణి సంస్థ గోదావరి నది ఒడ్డున గల ఫిల్టర్‌బెడ్ నుంచి పారిశ్రామిక ప్రాంతానికి నీటిని సరఫరా చేస్తోంది. ఎల్లంపల్లి ప్రాజెక్టుతో నదిలో ప్రవాహం నిలిచిపోయే పరిస్థితి ఉన్నందున సింగరేణి సంస్థకు ప్రాజెక్టు నుంచి ఒక టీఎంసీ నీటిని పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిం ది. సింగరేణి అధికారులు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి గోదావరిఖని వరకు ఏర్పాటు చేసే పైపులైన్లు, స్టోరేజీ ట్యాంకులు.. తదితర నిర్మాణాల కోసం కన్సల్టెంట్ సంస్థతో సర్వే నివేదికను తయారు చేయించారు. ఈ పైపులైన్ల ఏర్పాటుకు సుమారు రూ.220 నుంచి రూ.250 కోట్లు ఖర్చవుతుందని ఆ సంస్థ ప్రాథమికంగా అంచనా వేసి నివేదికను సింగరేణికి అప్పగించింది. సింగరేణి యాజమాన్యం ఈ ఖర్చుకు వెనకడుగు వేసి ఎల్లంపల్లి నుంచి నీటిని పైపులైన్ల ద్వారా తీసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. ప్రస్తు తం సింగరేణి మేడిపల్లి ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులో ఊటగా వచ్చే నీటిని మోటార్ల ద్వారా నదిలోకి వదిలితే ఆ నీరే దిగువప్రాంతానికి ప్రవహిస్తోంది. సింగరేణి ఫిల్టర్‌బెడ్‌కు ఎగువ ప్రాంతం లో గోదావరిఖని పట్టణం నుంచి వచ్చే మురుగునీరు వచ్చి నదిలో చేరుతోంది. ఇలా ప్రస్తు తం సింగరేణి నీటిని అందిస్తోంది. ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టి సింగరేణి మేడిపల్లి ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టు కోసం ప్రస్తుతం మట్టి, బొగ్గు వెలికితీయగా తయారైన కందకంలో ప్రతీ వర్షాకాలంలో నదిలో వచ్చే వరద నీటిని నింపాలని యాజమాన్యం ఆలోచిస్తోంది. నిల్వ చేసిన నీటిని తిరిగి కార్మికుల అవసరాలకు ఉపయోగించుకోవాలని చూస్తోం ది. ఈ ప్రయోగం తాత్కాలికంగా ఉపశమనం కలిగించినా... వర్షాలు కురవక వరద రాకపోతే భవిష్యత్‌లో తాగునీటికి తీవ్ర కొరత ఏర్పడే పరిస్థితి ఉంటుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఎల్లంపల్లికి గేట్లు బిగించడంతో ఇప్పటికే కిందవైపునకు నీటి ప్రవాహం నిలిచి పోయినట్లయింది. పాజెక్టు ప్రారంభించే ముం దు స్థానిక అవసరాలకు నీటిని కేటాయించాల్సిందేనంటూ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇటీవల ఆందోళన నిర్వహించారు. మామూలు రోజుల్లో నే నీటికి ఇబ్బంది ఏర్పడితే.. వేసవిలో అవస్థలు ఎలా ఉంటాయో ఊహించొచ్చు. ఇప్పటికే రామగుండం కార్పొరేషన్ నుంచి జరుగుతున్న ప్రయత్నాలు ముందుకు సాగకపోగా... సింగరేణి యాజమాన్యం కూడా పట్టింపులేకుండా వ్యవహరిస్తుండడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. నీటి ఇబ్బందుల పరిష్కారానికి సింగరేణి చర్యలు తీసుకోవాల్సిన అవసరముంది.