సాక్షి, హైదరాబాద్, కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టు 3 పంప్‌హౌస్‌లలోని మోటార్లను తాత్కాలికంగా నిలిపివేశారు. పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఎల్లంపల్లికి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్న నేపథ్యంలో మేడిగడ్డ నుంచి రివర్స్ పంపింగ్ ప్రక్రియను ఆపారు. ప్రస్తుతం వస్తున్న ప్రవాహాలతోనే ఎల్లంపల్లి నిండే అవకాశాలుండటం రివర్స్ పంపింగ్ ద్వారా గోదావరి నీటిని మోటార్ల ద్వారా ఎల్లంపల్లికి ఎత్తి పోస్తే కరెంట్‌చార్జీలు వృథా అయ్యే అవకాశాల నేప థ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రాజెక్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఎల్లంపల్లిలో చేరుతున్న నీటిని కాళేశ్వరంలోని 3 ప్యాకేజీల ద్వారా మిడ్‌మానేరుకు తరలించే అవకాశాలపై దృష్టి పెట్టాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల నేపథ్యంలో ఆ దిశగా ఇంజనీర్లు చర్యలు చేపట్టారు. ప్యాకేజీ–7లోని టన్నెల్ పనులను పూర్తి చేసే కసరత్తు చేపట్టనున్నారు.
వరద పెరిగింది..
గత 25 రోజులుగా ప్రాణహిత నదికి 8 వేల క్యూసెక్కుల నుంచి 13 వేల క్యూసెక్కుల మేర మాత్రమే వరద ప్రవాహాలు కొనసాగాయి. వచ్చిన కొద్దిపాటి వరదకే అడ్డుకట్ట వేసి మేడిగడ్డ నుంచి నీటిని పంపింగ్ చేశారు. మంగళవారం వరకు మేడిగడ్డ పంప్‌హౌస్ నుంచి 1,500 గంటలపాటు మోటార్లను నడిపి 12 టీఎంసీలను ఎత్తిపోశారు. అన్నారం చేరిన నీటిలో 6 టీఎంసీలను నిల్వ చేశారు. సుందిళ్ల నుంచి నీటిని ఎల్లంపల్లికి ఎత్తిపోసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. హెడ్ రెగ్యులేటర్ నుంచి ఫోర్ బేలోకి నీటిని పంపి సుందిళ్ల పంప్‌హౌస్‌లో మోటార్ల ద్వారా మంగళవారం నుంచి నీటిని ఎత్తిపోయాలని భావిం చారు. దీనికి అనుగుణంగా సుందిళ్లలో 4 మోటార్లను సిద్ధం చేశారు. గత 2 రోజులుగా కురు స్తున్న వర్షా లతో పరీవాహకం నుంచి కడెం, ఎల్లంపల్లిలోకి ప్రవాహాలు పెరిగాయి. కడెంలోకి మంగళవారం ఉదయం 60 వేల క్యూసెక్కుల ప్రవాహం రావడంతో 6 గేట్లు ఎత్తి 52 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు.
దీంతో ఎల్లంపల్లిలోకి 30 వేల క్యూసెక్కుల మేర ప్రవాహాలు రాగా సాయంత్రానికి అవి 18 వేల క్యూసెక్కులకు తగ్గాయి. ప్రాజెక్టులో నీటి నిల్వ 20 టీఎంసీలకుగాను 7 టీఎంసీలకు చేరింది. ఎగువ కడెంలోకి స్థిరంగా 29,810 క్యూసెక్కుల మేర ప్రవాహం వస్తుండటం, మరో 4 రోజులు వర్షాలు కురిసే అవకాశాల నేపథ్యంలో ఎల్లంపల్లిలోకి మరో 3–4 రోజులు స్థిరంగా ప్రవాహాలు కొనసాగే అవకా శం ఉంది. ఈ నేపథ్యంలో ఎల్లంపల్లిలో నిల్వలు పెరిగే అవకాశం ఉంది. దీంతో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పంప్‌హౌస్‌ల మోటార్లను నిలిపివేశారు. సుందిళ్లలోని ఒక పంప్‌హౌస్‌ను మంగళవారం సాయంత్రం కాసేపు నడిపి ఆపేశారు. ఎల్లంపల్లికి వరద నేపథ్యంలో రివర్స్ పంపింగ్ ద్వారా ఎల్లంపల్లికి నీటిని పంపినా ఫలితం ఉండదు. ఒకవేళ తరలించినా అక్కడి నుంచి మిడ్‌మానేరుకు నీటి తరలింపు ప్రక్రియ సిద్ధంగా ఉండాలి. ప్రస్తుతం ఎల్లంపల్లి దిగువన ప్యాకేజీ–7 పనులు ఇంకా పూర్తికానందున ఈ ప్రక్రియ మొదలు కాలేదు. దీంతో మోటార్లను నిలిపివేశారు. మోటార్లు ఆపేసిన అనంతరం ప్రాణహిత నదిలోనూ వరద ఉధృతి పెరిగింది.
వచ్చే నెల 5 నుంచి ఎల్లంపల్లి ఎత్తిపోతలు
ఎల్లంపల్లికి వరద ప్రవాహాలు మొదలవడం, ఒకవేళ ప్రవాహాలు ఆగినా సుందిళ్ల నుంచి నీటిని తరలించే వ్యవస్థ సిద్ధంగా ఉండటంతో ఈ ప్రాజెక్టు నుంచి నీటి తరలింపు చర్యలకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే ఎల్లంపల్లి దిగువన ప్యాకేజీ–6లో 7 మోటార్లకు 5 మోటార్లు సిద్ధంగా ఉండగా ఐదో మోటార్ వెట్ రన్ మంగళవారం విజయవంతమైంది. ఇక ప్యాకేజీ–7 టన్నెల్‌లో సివిల్ పనులన్నీ బుధ, గురువారాల్లో పూర్తి కానున్నాయి. పనులు పూర్తయితే అక్కడ క్లీనింగ్ ప్రక్రియ మొదలవుతుంది.
దీనికి 4–5 రోజులు పట్టనుంది. ఈ పనులను మంగళవారం సీఎం కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్, సీఎం ఓఎస్డీ శ్రీధర్ దేశ్‌పాండే, ఈఎన్‌సీ మురళీధర్ పరిళీలించారు. ఎల్లంపల్లి నుంచి వచ్చే నెల 5న ఎత్తిపోతలు ప్రారంభించాలని ఆదేశించారు. ఎల్లంపల్లి నుంచి ఈ మూడు ప్యాకేజీల ద్వారా మిడ్‌మానేరుకు నీటిని తరలించనున్నారు. వచ్చే నెల 5న ఎల్లంపల్లి నుంచి నీటిని ఎత్తిపోసే కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉందని నీటిపారుదల వర్గాలు తెలిపాయి. కాగా, ఈశాన్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో ఆగస్టు 4న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు వెల్లడించారు.
మేడిగడ్డ బ్యారేజీలో 30 గేట్ల ఎత్తివేత
మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాణహిత నదికి వరద పోటెత్తింది. ఆ నీరంతా గడ్చిరోలి జిల్లా సిరొంచ మీదుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద గోదావరిలో కలుస్తోంది. దీంతో మంగళవారం సాయంత్రం వరకు కాళేశ్వరం వద్ద గోదావరి నీటిమట్టం 8 మీటర్లకు చేరుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి ప్రాణహిత వరద పెరగడంతో మంగళవారం ఉదయం 30 గేట్లు పైకి ఎత్తారు. దీంతో బ్యారేజీ వద్ద 4.10 లక్షల క్యూసెక్కుల అవుట్ ఫ్లో తరలిపోతోంది. వరద ఇన్‌ఫ్లో పెరిగితే బ్యారేజీలోని మరిన్ని గేట్లను ఎత్తేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. బ్యారేజీలో ఆది, సోమవారాల్లో నీటి నిల్వ 4.5 టీఎంసీలు ఉండగా మంగళవారం అది 7 టీఎంసీలకు పెరిగింది. బ్యారేజీ పూర్తిస్థాయి సామర్థ్యం 16.17 టీఎంసీలు.
Comments
Please login to add a commentAdd a comment