ఆ 240 ఎకరాల విషయంలో జోక్యం వద్దు
- భూ సేకరణ ప్రక్రియ పూర్తి చేసి పరిహారం చెల్లించండి
- ఆ తరువాతే భూములు తీసుకోండని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా సుందిళ్ల బ్యారేజీ నుంచి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఉద్దేశించిన ఎత్తిపోతల పథకం కోసం పెద్దపల్లి జిల్లా, గౌలివాడలో సేకరించదలచిన 240 ఎకరాల భూముల విషయంలో జోక్యం చేసుకోవద్దని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ భూములకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ పూర్తి చేసి, పరిహారం చెల్లించేంత వరకు ఆ భూములను స్వాధీనం చేసుకోవ డానికి వీల్లేదని స్పష్టం చేసింది. అంతేకాక ఆ భూముల్లో రైతులు ఏవైనా పంటలు వేసుకు ని ఉంటే వాటి విషయంలో రైతుల హక్కుల కు భంగం కలిగించేలా వ్యవహరించవద్దని తేల్చి చెప్పింది.
ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి, నీటిపారు దల శాఖ ముఖ్య కార్యదర్శి, జిల్లా కలెక్టర్, భూ సేకరణ అధికారి తదితరులకు నోటీసు లు జారీ చేసింది. తదుపరి విచారణను 21కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. భూ సేకరణ ప్రక్రియ పూర్తి కాక ముందే ప్రభుత్వం తమ భూములను స్వాధీనం చేసుకుంటోందని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని గౌలివాడ గ్రామానికి చెందిన రైతు ప్రవీణ్‌రెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.