Farmers Right
-
హక్కులు దక్కితేనే రైతుకు రక్ష!
ఎంత చేసినా వ్యవసాయం వాణిజ్య వ్యాపకంగా మనలేని గడ్డు స్థితులు నేడు దేశవ్యాప్తంగా నెలకొన్నాయి. వ్యవసాయాన్ని గౌరవప్రదమైన వృత్తిగా బతకనీయాలంటే రైతుకు పనికొచ్చే సహాయక చర్యలు ఇంకా పెంచాలి. వాటికో చట్టబద్ధత తీసుకురావాలి. కేంద్రంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు రైతుకు పెట్టుబడి ఆర్థిక సహాయం చేస్తున్నాయి. ఇది ఇటీవలి కాలంలో వ్యవసాయ రంగంలో వచ్చిన ఆహ్వానించదగ్గ పరిణామం! అయితే, ఇది మాత్రమే సరిపోదు. సమాచార హక్కు కమిషన్ తరహాలో కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో ‘వ్యవసాయ కమిషన్లు’ ఏర్పాటు కావాలి. స్వతంత్ర ప్రతిపత్తితో, చట్టబద్ధమైన అధికారాలతో పనిచేసే ఈ కమిషన్లకు గట్టి అధినేతలు రావాలి. అలాగే రైతుకు సాంప్రదాయికంగా ఉంటున్న విత్తన హక్కును కాపాడటం, ఎమ్మెన్సీల దాష్టీకం నుంచి వారిని బయటపడేయటం కూడా చాలా ముఖ్యం. ఇప్పుడు సాయం అవసరమైన స్థితిలో వ్యవసాయం ఉంది. ఒకేరకమైన సహాయంతో తీరేది కాదు. అనేక రకాల సహాయాలు అంది తేనే వ్యవసాయం బతికి బట్టకడుతుంది. ‘అజాత శత్రువే అలిగిన నాడు...’ అన్నట్టు, రైతన్నకు కోపమొచ్చి ‘నా తిండికి సరిపడా నే పండించుకు తింటాను, మిగతా భూమి పడావ్ (పంట విరామం) వేస్తా, ఏం చేసుకుంటారో చేసుకోండి..!’ అని ఆగ్రహిస్తే దేశం మలమల మాడాల్సి వస్తుంది. ఆ చేదు అనుభవాన్నీ తెలుగునేల ఎప్పుడో చవి చూపింది. ఎంత చేసినా వ్యవసాయం వాణిజ్య వ్యాపకంగా మనలేని గడ్డు స్థితులు నేడు దేశవ్యాప్తంగా నెలకొన్నాయి. మనది, కార్పొరేట్ వ్యవసాయం సాధ్యపడని చిన్న కమతాల దేశం. అందుకే, ఉన్నంతలో... పెట్టుబడి నుంచి గిట్టుబాటు ధర వరకు అన్ని దశల్లో రైతు బాగోగులు చూసి ఆదుకుంటేనే వ్యవసాయం. ఈ ఎరుకతోనే ప్రభుత్వాలు రైతుకు అంతో ఇంతో సహాయం చేయడానికి, చేసినట్టు కనబడటానికి ప్రయత్ని స్తాయి. కానీ, నిజంగా ఆదుకొని వ్యవసాయాన్ని గౌరవప్రదమైన వృత్తిగా బతకనీయాలంటే రైతుకు పనికొచ్చే సహాయక చర్యలు ఇంకా పెంచాలి. వాటికో చట్టబద్ధత తీసుకురావాలి. వ్యవసాయ విధానాలు, చట్టాలు, నిబంధనలు, విధివిధానాల అమలుపై సరైన నిఘా, నియం త్రణ ఉండాలి. ఇందుకు ప్రభుత్వాలు మరింత చొరవ చూపాలి. వృత్తికి భరోసా ఇవ్వాలి. బతుక్కి భద్రత కల్పించాలి. కష్టాల్లో రైతాంగాన్ని ఆదుకోవాలి. కేంద్రంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు రైతుకు పెట్టుబడి ఆర్థిక సహాయం చేస్తున్నాయి. ఇది ఇటీవలి కాలంలో వ్యవసాయ రంగంలో వచ్చిన ఆహ్వానించదగ్గ పరిణామం! అయితే, ఇది మాత్రమే సరిపోదు. నిన్నటికి నిన్న గుజరాత్లో బంగాళదుంప రైతాం గానికి, పెప్సీ కంపినీకి మధ్య జరిగిన న్యాయపోరాటం, రైతుకు కావాల్సిన ఇతరేతర భద్రతాచర్యల అవసరాన్ని నొక్కి చెప్పింది. కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో ‘వ్యవసాయ కమిషన్లు’ ఏర్పాటు కావాలి. స్వతంత్ర ప్రతిపత్తితో, చట్టబద్దమైన అధికారాలతో పనిచేసే ఈ కమిషన్లకు గట్టి అధినేతలు రావాలి. ప్రభుత్వాల తాబేదారులుగా ఉండే ‘జీ హుజూర్’లు కాకుండా కాసింత వెన్నెముక ఉన్న అధిపతులు వస్తేనే, దేశపు వెన్నెముక అయిన రైతుకు రక్ష. ఈ విషయంలో ‘మేం వ్యవసాయ కమిషన్’ ఏర్పాటు చేయబోతున్నాం అని ప్రకటించి ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్య మంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఒక అడుగు ముందుకు వేశారు. వివిధ రాష్ట్రాల నుంచి ఆ దిశలో సాగే మరిన్ని అడుగులు ఢిల్లీ పీఠం వరకూ సాగాలి. పెట్టుబడి చేయూత గొప్ప సాయమే! రెండు తెలుగు రాష్ట్రాల నేతలు తెగువతో రైతుకు పెట్టుబడి నగదు సహాయం ప్రకటించి, అమలు పరచి అఖిల భారత నాయకత్వానికి దారి చూపుతున్నారు. తెలంగాణలో కే. చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా వరంగల్ సభలో, ఏపీలో వై.ఎస్. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కాక ముందే గుంటూరు పార్టీ ప్లీనరీలో ఈ పెట్టుబడి సహాయం గురించి తొలుత ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం ‘రైతు బంధు’ పేరిట ఏటా ఎకరాకి ఎనిమిది వేల రూపాయలు రెండు విడతల్లో (నాలుగేసి వేలుగా) గత సంవత్సరమే ఇచ్చింది. ఇప్పుడు ఆ మొత్తాన్ని పదివేల రూపా యలకు పెంచి ఇస్తున్నారు. ఏపీలోనూ ‘రైతు భరోసా’కింద కుటుంబా నికి ఏటా రూ. 12,500 చొప్పున నాలుగేళ్ల పాటు ఇవ్వాలన్నది పథకం. వచ్చే ఖరీఫ్ నుంచి ప్రారంభమౌతుందని ముందు ప్రకటించినా, రైతులకు వీలయినంత తొందరగా మేలు కల్పించాలని ప్రస్తుత రబీ నుంచే, అంటే అక్టోబర్ 15 నుంచి ఇవ్వనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణలో 54.50 లక్షలు, ఏపీలో ఉజ్జాయింపుగా 56 లక్షలు, మొత్తంగా కోటి కుటుంబాలకు పైగా ఈ ప్రత్యక్ష ప్రయోజనం పొందు తున్నాయి. ఇటీవలి సార్వత్రిక ఎన్నికలకు ముందరి బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైతు కుటుంబాలకు ఏటా ఆరేసి వేల రూపాయల చొప్పున నగదు సహాయాన్ని ప్రకటించింది. అయిదెకరాల లోపు భూమి ఉన్న రైతులకే అని ముందు ప్రకటించినప్పటికీ, సదరు పరిమితి లేకుండా ఇవ్వడానికి సిద్దపడింది. ఊబిలో పీకల్లోతుకు కూరుకొనిపోయి ఉన్న రైతాంగాన్ని, పెట్టుబడి సాయమొక్కటే గట్టెక్కించకపోవచ్చు! కానీ, వ్యవసాయ సీజన్ మొదలయ్యేటప్పుడు ఖాళీ చేతులతో ఉండే సగటు రైతుకు ఈ నగదు సహాయం ఓ వరం, ఎంతో భరోసా! కౌలు రైతులకు ఈ సహాయం అందటం లేదన్నదే, వ్యవసాయ రంగం శ్రేయో భిలాషుల మనసును కలచివేసే బాధ! రైతు హక్కులకు రక్షణ ఏది? తగిన చట్టాలు లేక కొంత, ఉన్నపుడు కూడా వాటి అమలు సవ్యంగా లేక మరికొంత... వ్యవసాయ రంగం, తద్వారా దేశమే స్థూలంగా నష్టపో తోంది. ఫలితంగా రాజ్యాంగ, చట్ట బద్దమైన హక్కులు రైతుకు దక్కని పరిస్థితి. బాధ్యతగా ఉండే ప్రభుత్వాలకు కొంత చొరవ ఉన్నచోట సరే! కానీ, అటువంటి చొరవ కొరవడిన చోట రైతుకు ఏ సహాయమూ లభించటం లేదు. భూ యాజమాన్య హక్కుల నుంచి రైతుకు అన్నీ సమస్యలే! పట్టాదారు పాసు పుస్తకాలు పొందడమూ గగనమే! రైతుకు దన్నుగా ఉండే సహజవనరుల్ని కార్పొరేట్లు, పలుకుబడి కల్గిన వారు స్వార్థంతో కొల్లగొడుతున్నారు. నాణ్యమైన విత్తనం లభించదు. బ్యాంకు రుణాలు, ఎరువులు, సరైన క్రిమిసంహారకాలు... ఏది పొందడమైనా రైతాంగానికి ఓ పోరాటమే. అతివృష్టి–అనావృష్టి వంటి ప్రకృతి వైప రిత్యాల నష్టపరిహారాల నుంచి పంట భీమా వర్తించి లబ్ధి దొరకటం వరకు... ప్రతిదీ జీవన్మరణ సమస్య. పంట పండి చేతికి అందడం ఒక ఎత్తయితే, చేతికందిన పంటకు ధర, మార్కెట్, నిలువ వసతి లభించడం అంతే సవాల్‌గా పరిణమిస్తోంది. ప్రభుత్వ పరంగా కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) ప్రకటిస్తారు తప్ప అది ఖచ్చితంగా రైతుకు లభించేలా చూడరు. ఒకోసారి, ఉత్పత్తి అంతా రైతు చెయ్యిదాటి దళా రుల వశమయ్యాక ఎమ్మెస్పీతో కొనుగోళ్లు జరిగేలా ప్రభుత్వాలు అప్రమత్తమవుతాయి. ప్రత్యేక చర్యలు తీసుకుంటాయి. అది ఎవరి ప్రయోజనాల కోసమో ఇట్టే అర్థమవుతుంది. పంటకు ఆశించిన ధర లభించనపుడు, నేరుగానో, ఇతరేతరంగానో నిలువ చేద్దామన్నా తగి నన్ని గిడ్డంగులుండవు. వ్యవసాయాధారిత పరిశ్రమలు, ఉత్పత్తి కేంద్రాలు కూడా ఉండవు. ప్రయివేటు, ప్రభుత్వ రంగంలో సదరు పరిశ్రమల్ని ప్రోత్సహించకపోవడం రైతుకు శాపంగా తయారవుతోంది. వీటన్నిటినీ అధిగమించడానికి కేంద్ర, రాష్ట్రాల స్థాయిల్లో చట్టబద్ధమెన ‘వ్యవసాయ కమిషన్లు’ ఏర్పడవలసిన అవసరం ఉంది. విత్తనంపై ఎమ్మెన్సీల పెత్తనం వేల సంవత్సరాల నుంచి మన దేశంలో ఓ గొప్ప సంప్రదాయంగా వస్తున్న రైతాంగం విత్తన హక్కు క్రమంగా హరించుకుపోతోంది. ఇప్పు డది తీవ్ర ప్రమాదంలో పడింది. పాతిక, ఇరవై సంవత్సరాల కిందటి దాకా కూడా, వీసమెత్తు భంగం లేకుండా రైతు అనుభవించిన అప్రతి హతమైన హక్కు ఇది. గత దశాబ్ద కాలంలో పరిస్థితులు చాలా మారాయి. విత్తన స్వేచ్ఛ, హక్కు నుంచి రైతును మెలమెల్లగా దూరం చేసే అంతర్జాతీయ కుట్ర యధేచ్ఛగా సాగుతోంది. ఇది పరోక్షంగా దేశ సార్వభౌమాధికారంపైనే దాడి. చట్టాల్లో తగు రక్షణ కల్పించినప్పటికీ వాటికి వక్ర భాష్యాలెక్కువయ్యాయి. విధాన పరంగా ప్రభుత్వాలు, సాంకేతికాంశాల వల్ల అక్కడక్కడ న్యాయస్థానాలు కూడా రైతును కాదని కార్పొరేట్లు, బహుళజాతి కంపెనీ (ఎమ్మెన్సీ)ల వైపే మొగ్గుతున్నాయి. పేటెంట్ చట్టాలు, మేథోసంపత్తి హక్కులు, ట్రిప్స్–డబ్లుటీవో ఒప్పం దాల నీడలో ఈ ఎమ్మెన్సీలు పెట్రేగిపోతున్నాయి. మోన్సాంటో, పెప్సీ, బేయర్... వంటి బడా కంపెనీల అకృత్యాలు, ఆధిపత్య ధోరణులు పెచ్చుమీరాయి. గుజరాత్లో బంగాళదుంప రైతులపై పెప్సీ కంపెనీ దావా వేయడం ఈ దాష్టీకాల్లో భాగమే! పెద్ద ఎత్తున ‘ఆలు చిప్స్’ తయారీకి స్థానికంగా రైతులతో ఒప్పందం కుదుర్చుకొని పండిస్తున్న ‘ఎఫ్.ఎల్ 2027’ రకం బంగాళదుంపపై తనకు పేటెంట్ హక్కులు న్నాయనేది వాదన. తన అనుమతి లేకుండా నలుగురు రైతులు ఆ రకం పంట పండించి, అమ్ముకుంటున్నారనేది పెప్సీ కంపెనీ అభియోగం. అంతకు ముందు అయిదుగురిపైన ఇవే రకం ఆరోపణలు. ఒక్కో రైతు కోటి రూపాయల పైన నష్టపరిహారం చెల్లించాలని దావా! స్థానిక రైతులు, రైతాంగ సంఘాల వారు, మేథావులు అహ్మదాబాద్‌లో సమా వేశమై ప్రతిఘటించారు. దావా వేయడానికి పెప్సీ కంపెనీ, ‘ప్లాంట్ రకాలు, రైతుల హక్కుల (పిపివి అండ్ ఎఫ్ ఆర్) చట్టం–2001’ లోని సెక్షన్ 64ని ఉటంకిస్తే, రైతులు అదే చట్టంలోని సెక్షన్ 39ని వాడు కున్నారు. ‘తమ వ్యవసాయ ఉత్పత్తికి విత్తనాలను దాచుకోవడం, వాడడం, విత్తనాలను నాటడం, తిరిగి నాటడం, మార్చుకోవడం, పంచు కోవడం లేదా విక్రయించుకోవడం....’ వంటి రైతు హక్కుల్ని చట్టంలోని ఈ సెక్షన్ రక్షిస్తుంది. అయితే, ఈ చట్టం కింద ‘బ్రాండెడ్ సీడ్’ను విక్రయించ కూడదు. రైతు పోరాటం ఫలితంగా పెప్సీ కంపెనీ తన కేసుల్ని ఉపసంహరించుకోవడం ఒక రకంగా రైతాంగ విజయమే! అన్ని చోట్ల, అన్ని సార్లూ ఇది సాధ్యపడకపోవచ్చు. అందుకే, న్యాయాధికారా లతో కూడిన ఓ చట్టబద్ధ కమిషన్ అవసరం. ముసాయిదా సిద్ధంగానే ఉంది తమ హక్కులకు భంగం కలిగిన ప్రతి సందర్భంలోనూ రైతులు ఈ కమిషన్‌ను సంప్రదించవచ్చు. మానవహక్కుల సంఘం, సమాచార హక్కు కమిషన్ తరహాలో వ్యవసాయానికి కేంద్ర, రాష్ట్ర కమిషన్లను ఏర్పాటు చేసుకోవాలి. వ్యవసాయానికి సంబంధించిన అన్ని చట్టాల అమలును పర్యవేక్షిస్తూ, ఎప్పటికప్పుడు ప్రభుత్వాలకు ఈ కమిషన్లు వ్యవసాయాభివృద్ధికి సంబంధించిన సిఫారసులు చేస్తాయి. రైతుకు నష్టం జరిగిన పుడు బాధ్యులపై చర్యలు పుర మాయిస్తూనే, రైతుకు సత్వర న్యాయం జరిగేలా ప్రభుత్వాలకు తగు ఆదేశాలిస్తాయి. వ్యవసాయానికి జరిగిన, జరుగుతున్న, జరుగబోయే నష్టాల్ని కూడా కమిషన్ నివారించగలుగు తుంది. కమిషన్ పరిధి, అధికారాలు, పనితీరు, విధి–విధానాలకు సంబం ధించిన అంశాలతో ముసాయిదా ఎప్పుడో సిద్దమైంది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ న్యాయశాఖ దీన్ని లోతుగా పరిశీలన చేసింది. ఇలాంటి విషయాల్లో ‘ముసాయిదా’ కన్నా ‘సంకల్పం’ (విల్ రాదర్ దెన్ బిల్) ముఖ్యం. దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
రైతుహక్కుల పరిరక్షణే ప్రధానం
వ్యవసాయ వంగడాల అభివృద్ధిలో ప్రభుత్వ సంస్థలతో పోటీపడుతూ దేశీయ వ్యవసాయ రంగంలోకి అడుగుపెట్టిన బహుళజాతి సంస్థలు రైతు సంక్షేమం దృష్ట్యా పని చేస్తాయి అనుకుంటే అది మన భ్రమే. కేవలం లాభాపేక్షతోనే ఇవి తమ కార్యక్రమాలు నిర్వహిస్తాయి. తమ లాభాలను రక్షించుకునే ప్రక్రియలో భాగంగానే ఈ రోజు చిన్న సన్నకారు రైతుల పైన కూడా కోటి రూపాయల వరకు నష్టపరిహారం కోరుతూ పెప్సీ కంపెనీ గుజరాత్ కోర్టులో దావా వేయటానికి వెనకాడలేదు. బహుళజాతి సంస్థలు సరఫరా చేసిన విత్తనాలు మొలకెత్తక పోయినా, లేక నేడు గుజరాత్లో లాగా వారి హక్కులను అతిక్రమించారని కేసులు వేసినా వ్యక్తిగతంగా రైతు ఈ సంస్థలతో పోరాటం జరిపే పరిస్థితి లేదు. అందుకనే ’మొక్కలలో రకాలు వ్యవసాయదారుల హక్కుల పరిరక్షణ చట్టం’లో రైతుల ప్రయోజనాల్ని పరిరక్షించే విధంగా మార్పులు తీసుకురావడం అవశ్యం. ఈమధ్య గుజరాత్ రాష్ట్రంలో పెప్సీ కంపెనీ వారు రైతుల పైన కోర్టులో కోటి రూపాయల నష్టపరిహారం కోరుతూ కేసులు వేశారు. తాము సంపాదించిన పేటెం ట్‌కు విఘాతం కలిగించే విధంగా విత్తనాలు ఉపయోగించి వ్యవసాయం చేశారనేది వారి మీద మోపబడిన ప్రధాన అభియోగం. 2001వ సంవత్సరంలో రూపొందించిన ’మొక్కలలో రకాలు రైతుల హక్కుల పరిరక్షణ చట్టం’ (ప్లాంట్ వెరైటీస్ అండ్ ఫార్మర్స్ రైట్స్ ప్రొటెక్షన్ యాక్ట్) ఉల్లంఘనకు గానూ రైతులపై ఈ కేసు పెట్టారు. 1989వ సంవత్సరం నుంచి భారతదేశంలో పంజాబ్ రాష్ట్రంతో మొదలుపెట్టి ఒప్పంద వ్యవసాయ విధానం ద్వారా(కాంట్రాక్ట్ ఫార్మింగ్) వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకం చేస్తూ ఉన్న పెప్సీ కంపెనీ దాదాపు 30 ఏళ్ల అనుభవం తరువాత ఈరోజు రైతులపై కేసులు పెట్టటం కొంత విచిత్రంగానే కనిపిస్తుంది. కానీ పెప్సీ కంపెనీ పెట్టిన ఈ కేసు మూలంగా ’ మొక్కలలో రకాలు రైతుల ప్రయోజనాల పరిరక్షణ చట్టం’లోని కొన్ని లొసుగుల అంశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. పై చట్టంలో సెక్షన్ 39 కింద వ్యవసాయదారుల హక్కుల పరిరక్షణ గురించి చెప్పారు. బ్రాండింగ్ చేసి వాణిజ్యపరంగా అమ్మనంతవరకు వ్యవసాయదారుల చేత రక్షిత వంగడాల వాడకాన్ని ఈ సెక్షన్ కింద పరిరక్షించటం జరి గింది. కానీ ఇదే చట్టంలో సెక్షన్ 28 కింద కొత్త వంగడాలను అభివృద్ధి చేసిన సంస్థలకు తాము కానీ తమ చేత లైసెన్స్ పొందిన వ్యక్తులు గానీ ప్రత్యేకంగా వినియోగించే అవకాశాన్ని కల్పించింది. ఈ రెండు సెక్షన్లలోని పరస్పర విరుద్ధ అంశాలను ఈ కేసులలో కోర్టులు పరిష్కరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం పెప్సీ కంపెనీ ఈ అంశాలను కోర్టు బయట పరిష్కరించుకోవటానికి సుముఖత చూపటం బట్టి ఈ అంశాలు ఇప్పట్లో కోర్టుల్లో తేలే అవకాశాలు కనిపించడం లేదు. ముఖ్యంగా ఈ ఉదంతం నుంచి మన దృష్టికి వచ్చిన ప్రధానమైన అంశాలు ఈ కింది విధంగా ఉంటాయి. 1. ప్రపంచ వాణిజ్య సంస్థకు అనుబంధంగా తయారైన ఖీఖఐ్కS లాంటి మేధోసంపత్తి హక్కుల నుంచి భారత ప్రభుత్వం బయటకి వచ్చే అవకాశం ఉందా! 2. బహుళ జాతి సంస్థల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఒప్పంద వ్యవసాయ విధానానికి ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా? 3. రైతుల హక్కులను పరిరక్షించడానికి ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోవాలి. ఈ మూడు అంశాలు ఒక్కొక్కటి పరిశీలిద్దాం. ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో) ఏర్పాటు కావడానికి ముందు వ్యవసాయ పరిశోధన వంగడాల అభివృద్ధి ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రభుత్వరంగ సంస్థల్లో జరుగుతూ ఉండేది. ఈ సంపద అంతా జాతీయ సంపదగా పరిగణించారు కాబట్టి పరిశోధనకు అవసరమైనటువంటి నిధులు ప్రజాధనం ద్వారా సమకూర్చారు కాబట్టి ఈ పరిశోధన వల్ల వచ్చే ఫలితాలు అందరు రైతులకు అందుబాటులో ఉండేవి. ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పాటుతో ఈ విధానం మారింది. మేధోసంపత్తికి పరిహారం సమకూర్చే విధంగా ట్రిప్స్ అగ్రిమెంటు ప్రపంచ వాణిజ్య సంస్థ విధి విధానాల్లో భాగంగా పొందుపరిచారు. ఈ మొత్తం ప్రక్రియ అభివృద్ధి చెందిన దేశాలకు అనుకూలంగా, అభివృద్ధి చెందుతున్న దేశాలకు వ్యతిరేకంగా నడిచింది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ముందు పారిశ్రామిక సర్వీస్ రంగాల్లో డబ్ల్యూటీవో ద్వారా సరళీకృత విధానాలను విజయవంతంగా ప్రవేశపెట్టి ట్రిప్స్ అగ్రిమెంట్ ద్వారా పేటెంటింగ్ కాపీరైట్ చట్టాలను బలపరిచి అభివృద్ధి చెందిన దేశాలు తమ ప్రయోజనాలను పూర్తిగా పరీక్షించుకున్నారు. వ్యవసాయరంగంలో సరళీకృత విధానాన్ని అమలు చేస్తామని వాగ్దానం చేసినా దోహా రౌండ్ చర్చలు విఫలం కావడంతో వ్యవసాయ రంగ సరళీకృత విధానాల ద్వారా అభివృద్ధి చెందుతున్న దేశాలకు వచ్చే ప్రయోజనాలు ఎండమావులు గానే మిగిలిపోయాయి. అభివృద్ధి చెందిన దేశాలలో వ్యవసాయ రంగానికి ఇచ్చే సబ్సిడీలు అంతకుముందు లాగానే కొనసాగుతున్నాయి. పూర్తిగా వ్యవసాయ రంగాన్ని సరళీకృతం చేసి, అభివృద్ధి చెందిన దేశాలలో వ్యవసాయ రంగానికి సబ్సిడీలను నియంత్రణ చేయగలిగి ఉంటే అభివృద్ధి చెందే దేశాల వ్యవసాయ ఉత్పత్తులకు అభివృద్ధి చెందిన దేశాలలో విస్తృత మార్కెట్ ఏర్పడి ఉండేది. తదనుగుణంగా ఇక్కడి రైతుల ఆదాయాలు గణనీయంగా అభివృద్ధి చెందే అవకాశం ఉండేది. వ్యవసాయ రంగంపై జరిగిన దోహా రౌండ్ చర్చలు విఫలం కావటంతో అటువంటి అవకాశం లేకుండా పోయింది. డబ్ల్యూటీవో సంస్థ ఆధ్వర్యంలోని ట్రిప్స్ అగ్రిమెంట్ ద్వారా వచ్చిన మేధో సంపత్తి పరిరక్షణ విధానానికి అనువుగా మన చట్టాలు మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఒక విధంగా డబ్ల్యూటీవో చట్రంలో ట్రిప్స్ చక్రంలో ఇతర దేశాలతో పాటు మనం కూడా బంధితులమయ్యాం. తదనుగుణంగా మన చట్టాల్లో తెచ్చిన మార్పు 2001 సంవత్సరంలోని మొక్కలలో రకాలు వ్యవసాయదారుల హక్కుల పరిరక్షణ చట్టం. ఈ చట్టం కిందనే ఈరోజు పెప్సీ కంపెనీ గుజరాత్లో రైతుల మీద కేసులు పెట్టింది. అంతర్జాతీయ ఒప్పందాల దృష్ట్యా ఈ చట్టాన్ని రద్దు చేసుకునే అవకాశం లేనందువల్ల చట్టం లోపలే ఏ విధంగా వ్యవసాయదారుల హక్కులను పరిరక్షించాలి అనే అంశంపైన ప్రభుత్వం దృష్టి పెడితే బాగుంటుంది. ఇక రెండో ప్రధానమైన అంశం ఈ బహుళ జాతి సంస్థల ఆధ్వర్యంలో జరిగే ఒప్పంద వ్యవసాయానికి(కాంట్రాక్ట్ ఫార్మింగ్) ప్రత్యామ్నాయ విధానం ఏమైనా ఉందా! కొంతవరకు సహకార వ్యవసాయ విధానం ఈ ఒప్పంద వ్యవసాయ విధానానికి ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చేయవచ్చు. కానీ దీనికి బలమైన నాయకత్వం అవసరం ఎంతైనా ఉంది. సహకార రంగంలో ఒక అమూల్ సంస్థ తప్పితే దేశంలో ఇంకెక్కడ సహకార సంస్థలు బలపడి రైతులకు దీర్ఘకాలంలో ప్రయోజనం కల్పించిన దాఖలాలు కనిపించడం లేదు. బహుళజాతి సంస్థల ఆధ్వర్యంలో జరిగే ఒప్పంద వ్యవసాయ విధానంలో రైతులకు బహుళ ప్రయోజనాలు చేకూరుతాయి అనేది కూడా వాస్తవం. మొట్టమొదటిది అంతర్జాతీయ మార్కెట్‌ను, చిన్నకమతాల రైతులను అనుసంధానం చేసే సామర్థ్యం బహుళజాతి సంస్థలకే ఉంటుంది. నాణ్యమైన వంగడాల సరఫరా, వ్యవసాయ ఉత్పత్తులను ఆధునిక పద్ధతుల్లో నిల్వ చేయటం, ప్రాసెసింగ్ సదుపాయాలు కల్పించటం తద్వారా వ్యవసాయోత్పత్తుల విలువను పెంచటం ఈ బహుళ జాతి సంస్థల ద్వారానే సాధ్యమవుతుంది. సరైన ప్రత్యామ్నాయం వాటికి లేదు కనుక వ్యవసాయ రంగంలో కొన్ని పరిమితులు, షరతులకు లోబడి పనిచేసే విధంగా బహుళజాతి సంస్థల ఆధ్వర్యంలో ఒప్పంద వ్యవసాయాన్ని ప్రోత్సహించడం వ్యవసాయ రంగంలో ఉత్పాదకత ఆదాయం పెరగడానికి దోహదపడుతుంది. కానీ ప్రభుత్వాలు ఈ బహుళ జాతి సంస్థలపై ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. రైతు సంక్షేమం దృష్ట్యా అవి పనిచేస్తాయి అనుకుంటే అది మన భ్రమే. కేవలం లాభాపేక్షతోనే ఈ కంపెనీలు తమ కార్యక్రమాలు నిర్వహిస్తాయి. అటువంటి లాభాలను రక్షించుకునే ప్రక్రియలో భాగంగానే ఈ రోజు చిన్న, సన్నకారు రైతులపైన కూడా కోటి రూపాయల వరకు నష్టపరిహారం కోరుతూ పెప్సీ కంపెనీ గుజరాత్లో కోర్టులో దావా వేయటానికి వెనకాడలేదు. వ్యవసాయం చేసుకోవలసిన రైతులను కక్షదారులుగా మారిస్తే పరిమితి లేని వనరులున్న ఈ బహుళ జాతి సంస్థలపై రైతులు పోరాటం చేసే పరిస్థితే లేదు. బహుళజాతి సంస్థలు సరఫరా చేసిన విత్తనాలు మొలకెత్తక పోయినా, లేక ఈనాడు గుజరాత్లో లాగా వారి హక్కులను అతిక్రమించారని కేసులు వేసినా వ్యక్తిగతంగా రైతు ఈ సంస్థలతో పోరాటం జరిపే పరిస్థితి లేదు. ఇక్కడనే ప్రభుత్వాలకు చాలా ప్రధానమైనటువంటి పాత్ర ఉన్నది. బహుళజాతి సంస్థలతో ఉత్పన్నమైన ఎటువంటి కేసుల విషయంలో కూడా రైతుల తరఫున పోరాడే బాధ్యత ప్రభుత్వం చేత ఏర్పాటు చేసిన సంస్థ స్వీకరించాలి. పూర్తిగా వ్యాజ్యం అయ్యే ఖర్చులు ఈ సంస్థ భరించే విధంగా మార్పులు తీసుకురావాలి. రైతు లను కేవలం వ్యవసాయానికే పరిమితం చేసి అనవసరమైన కోర్టు కేసులు వారి నెత్తి మీద లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఈ సంస్థ రైతులకు అండగా కోర్టు కేసులు నడపటానికి అనువుగా చట్ట సవరణ ప్రభుత్వం తీసుకురావాలి. అట్లాగే ఆ సంస్థలకు కావలసిన ఆర్థిక పరిపుష్టిని ఏర్పాటు చేయాలి. అప్పుడే నిర్భయంగా వ్యవసాయదారుడు బహుళజాతి సంస్థలతో ఒప్పందాలు చేసుకుని వ్యవసాయ కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించడంలో నిమగ్నం కాగలుగుతాడు. ఇంకొక ప్రధాన విషయం మనదేశంలో ఈ చట్టాన్ని రూపొందించేటప్పుడు పూర్తిగా పేటెంట్ విధానానికి వెళ్లకుండా రైతుల ప్రయోజనాలను కూడా దృష్టిలో పెట్టుకొని sui generisవిధానంలో ఈ ‘మొక్కలలో రకాలు వ్యవసాయదారుల హక్కుల పరిరక్షణ చట్టం’ని రూపొం దించారు. ఈ చట్టం అమలులో ఉండి 20 సంవత్సరాలు అవుతుంది కనుక ఇది ఎంతవరకు రైతుల ప్రయోజనాలను పరిరక్షించడంలో సఫలీకృతమైంది అనే విషయాన్ని ఒకసారి సమీక్షించుకొని ట్రిప్స్ విధానానికి ప్రతికూలం కానంతవరకు తగిన మార్పులను వ్యవసాయదారుల ప్రయోజనాలను పరిరక్షించే విధంగా తీసుకురావాల్సిన ఆవశ్యకత కూడా ఎంతైనా ఉంది. ఐవైఆర్ కృష్ణారావు వ్యాసకర్త ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఈ–మెయిల్ : iyrk45@gmail.com -
రైతులకు, గ్రామీణులకూ హక్కులొచ్చాయి!
ఆరుగాలం కాయకష్టంతో పొట్టపోసుకునే చిన్న, సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు, గ్రామాల్లో పనీపాటలతో జీవనం సాగించే బడుగు ప్రజల హక్కులకు ఐక్యరాజ్య సమితి బాసటగా నిలిచింది. 2018 ఆఖరులో జరిగిన అంతర్జాతీయ స్థాయిలో చెప్పుకోదగ్గ ఒక ముఖ్య పరిణామం ఇది. పరిమిత వనరులతోనే ప్రపంచ జనాభాకు 70% ఆహారాన్ని పండించి అందిస్తున్న మట్టి మనుషులకు ఉన్న హక్కులను సముచితంగా గుర్తించమని అంతర్జాతీయ సమాజానికి ఐరాస సర్వసభ్య సమావేశం చాటిచెప్పింది. ఈ మేరకు డిసెంబర్ 17న తుది డిక్లరేషన్‌ను న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి 73వ సర్వసభ్య సమావేశం ఆమోదించింది. ఇందులో పేర్కొన్న హక్కులను దేశీయ చట్టాల ద్వారా చిన్న, సన్నకారు రైతులకు, గ్రామీణులకు రక్షణ కల్పించాలని ప్రపంచ దేశాల నేతలకు, ప్రభుత్వాలకు సూచించింది. పాలకుల నిరాదరణకు, అన్యాయాలకు గురవుతూ కనీస మానవ హక్కులకు నోచుకోకుండా.. అరకొర ఆదాయాలతో అర్థాకలితో అలమటిస్తూ.. భూమి హక్కులు, సాంఘిక, ఆర్థిక, ఆహార భద్రత లోపించి, అప్పులపాలై కుంగిపోతూ, ఆత్మహత్యల పాలవుతున్న చిన్న–సన్నకారు రైతులు, మహిళా రైతులు, రైతు కూలీలు, మత్స్యకారులు, ఆదివాసులు, సంచార జాతులు, ఇతర గ్రామీణ వృత్తిదారులకు.. ఐక్యరాజ్య సమితి కొత్త సంవత్సరం కానుకగా ఈ డిక్లరేషన్‌ను వెలువరించడం గొప్ప సానుకూల పరిణామం. సుమారు 17 ఏళ్ల సుదీర్ఘ తర్జన భర్జనల తర్వాత డిసెంబర్ 17న ఐక్యరాజ్య సమితి రైతులు, గ్రామీణ ప్రజల ప్రత్యేక హక్కుల డిక్లరేషన్‌ను వెలువరించడం విశేషం. ఏమిటీ డిక్లరేషన్? 74 దేశాలకు చెందిన 164 రైతు సంఘాలతో కూడిన సమాఖ్య ‘లా వయ కంపెసినా’, స్వచ్ఛంద సంస్థలు ‘సెటిమ్’, ‘ఫియమ్’ ఇంటర్నేషనల్‌తో కలిసి తొలుత 17 ఏళ్ల క్రితం ఈ ప్రతిపాదనను ఐరాస మానవ హక్కుల విభాగం ముందుకు తెచ్చాయి. అంతేకాదు. అది మరుగున పడిపోకుండా పట్టించుకున్నాయి. ఆ తర్వాత ఐరాసలో బొలీవియా దేశ ప్రతినిధి 2012 నుంచి ఈ డిక్లరేషన్‌ను భుజానేసుకొని డిసెంబర్ 17న ఆమోదింపజేసే వరకూ విశేష కృషి చేశారు. ఐరాసలో సభ్యదేశాలు 193. రైతులు, గ్రామీణులకు ప్రత్యేక హక్కులు అవసరమేనని గుర్తించే 28 అధికరణాలతో కూడిన ఈ డిక్లరేషన్‌ను భారత్, చైనా సహా 121 దేశాలు సమర్థించాయి. ఆస్ట్రేలియా, యూకే, యు.ఎస్.ఎ. వంటి 8 దేశాలు వ్యతిరేకించాయి. 54 దేశాలు తటస్థంగా ఉన్నాయి. ఏదైతేనేమి డిక్లరేషన్ ఇప్పుడు అంతర్జాతీయ చట్టబద్ధత పొందింది. ఈ హక్కులను ఇక ప్రపంచ దేశాలు ప్రత్యేక చట్టాలు చేసి రైతులు, గ్రామీణుల హక్కులు రక్షించాల్సి ఉంది. దీనికి ఎందుకంత ప్రాధాన్యం? చిన్న కమతాల్లో పంటలు పండించుకొని జీవనం సాగించే చిన్న, సన్నకారు రైతులు ప్రపంచ జనాభాకు అవసరమైన 70% ఆహారాన్ని ఆరుగాలం కష్టపడి పండించి అందిస్తున్నారు. ప్రకృత వనరలను తగుమాత్రంగా వాడుకుంటూ, గ్రామీణులకు ఉపాధి కల్పిస్తున్నారు. భూతాపాన్ని తగ్గించేందుకు దోహదపడుతున్నారు. అయితే, హక్కుల విషయానికి వచ్చేసరికి పట్టణప్రాంతీయులతో పోల్చితే చిన్న, సన్నకారు రైతులు, గ్రామీణులు వివక్షకు గురవుతున్నారు. వివిధ దేశాల్లో అమల్లో ఉన్న వ్యవసాయ విధానాలు సంపన్న రైతులు, పారిశ్రామిక వ్యవసాయదారులకు లబ్ధి చేకూర్చేవిగానే ఉన్నాయని.. ఈ విధానాల వల్ల చిన్న, సన్నకారు రైతులకు, రైతు కూలీలకు, ముఖ్యంగా వ్యవసాయంలో అత్యధికంగా శ్రమిస్తున్న మహిళా రైతులకు, చేకూరుతున్న లబ్ధి తూతూ మంత్రమేనని ఐరాస మానవ హక్కుల సలహా సంఘం చేసిన అధ్యయనంలో వెలడైంది. ఈ నేపథ్యంలో చిన్న, సన్నకారు రైతులు, గ్రామీణుల హక్కుల డిక్లరేషన్ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. పర్యావరణ అనుకూల సుస్థిర వ్యవసాయ పద్ధతులను అనుసరించడం, సంప్రదాయ విజ్ఞానాన్ని పెంపొందించుకొని అనుసరించడం, ఆహార సార్వభౌమత్వాన్ని నిలబెట్టుకోవడం, భూమిపైన, నీటిపైన, అడవి, ఇతర ప్రకృతి వనరులపైన రైతులు, గ్రామీణులకున్న సామూహిక హక్కులను కాపాడటం.. సభ్య దేశాల్లోని ప్రభుత్వాల విధి అని ఐక్యరాజ్యసమితి ఈ డిక్లరేషన్‌లో పేర్కొంది. దేశీ, స్థానిక వంగడాలను సాగు చేసి భద్రపరచుకొని వినియోగించుకోవడంతోపాటు ఇతర రైతులకు విక్రయించుకునే హక్కు కూడా కల్పించమని ఈ డిక్లరేషన్ ప్రపంచ దేశాలకు సూచిస్తోంది. మన దేశంలో ఇప్పటికే చట్టం ఉన్నా, అది క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలుకావడం లేదన్న అభిప్రాయం ఉంది. రైతులకున్న హక్కులు పాలకుల దృష్టిలో ఇకనైనా ప్రాధాన్యాన్ని సంతరించుకుంటాయని ఆశిద్దాం. -
ఇన్పుట్ సబ్సిడీ రైతుల హక్కు
అనంతపురం సెంట్రల్ : ఇన్పుట్ సబ్సిడీ ప్రభుత్వాల దయాదాక్షిణ్యం కాదని, రైతుల హక్కు అనే విషయం గుర్తించాలని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన అనంతరంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతుల డబ్బు వారికిచ్చే విషయంలోనూ ప్రచారం చేసుకునేందుకే ముఖ్యమంత్రి ఈనెల 5న జిల్లాలో పర్యటించనున్నారని విమర్శించారు. ఇన్పుట్ సబ్సిడీ అర్హత పత్రాల పేరిట ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి ఫొటోలను ముద్రించి కార్డులు అందజేయడం హాస్యాస్పదమన్నారు. ఒక్కో కార్డుకు రూ.10 చొప్పున జిల్లాలో 6లక్షల మందికి కార్డులు ఇచ్చేందుకు రూ.60లక్షలు దుర్వినియోగం చేశారన్నారు. ప్రస్తుతం 2016 ఖరీఫ్ ఇన్పుట్ సబ్సిడీ రూ.1,032 కోట్లు ఇస్తున్నారని.. అయితే గత నాలుగేళ్లుగా పంట నష్టపోయిన వారికి రూ.4,087కోట్లు ప్రభుత్వం బాకీ పడిందన్నారు. గ్రామాల్లో జన్మభూమి కమిటీ సిఫారసు చేసిన రైతులకే ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయన్నారు. ఇంతవరకు అర్హుల జాబితా ప్రకటించకపోవడమే అందుకు నిదర్శనమన్నారు. అర్హులకు న్యాయం జరక్కపోతే రైతులు తిరగబడతారని హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యనారాయణ, మాజీ మంత్రి శైలజానాథ్, మాజీ ఎమ్మెల్యే సుధాకర్ పాల్గొన్నారు. -
ఆ 240 ఎకరాల విషయంలో జోక్యం వద్దు
భూ సేకరణ ప్రక్రియ పూర్తి చేసి పరిహారం చెల్లించండి ఆ తరువాతే భూములు తీసుకోండని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా సుందిళ్ల బ్యారేజీ నుంచి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఉద్దేశించిన ఎత్తిపోతల పథకం కోసం పెద్దపల్లి జిల్లా, గౌలివాడలో సేకరించదలచిన 240 ఎకరాల భూముల విషయంలో జోక్యం చేసుకోవద్దని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ భూములకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ పూర్తి చేసి, పరిహారం చెల్లించేంత వరకు ఆ భూములను స్వాధీనం చేసుకోవ డానికి వీల్లేదని స్పష్టం చేసింది. అంతేకాక ఆ భూముల్లో రైతులు ఏవైనా పంటలు వేసుకు ని ఉంటే వాటి విషయంలో రైతుల హక్కుల కు భంగం కలిగించేలా వ్యవహరించవద్దని తేల్చి చెప్పింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి, నీటిపారు దల శాఖ ముఖ్య కార్యదర్శి, జిల్లా కలెక్టర్, భూ సేకరణ అధికారి తదితరులకు నోటీసు లు జారీ చేసింది. తదుపరి విచారణను 21కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. భూ సేకరణ ప్రక్రియ పూర్తి కాక ముందే ప్రభుత్వం తమ భూములను స్వాధీనం చేసుకుంటోందని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని గౌలివాడ గ్రామానికి చెందిన రైతు ప్రవీణ్‌రెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. -
ఆ హక్కులతో రైతన్నే ‘రారాజు’!
ముఖాముఖి: 12 కొత్త హక్కులతో కూడిన డిక్లరేషన్‌పై చర్చకు తెరలేచింది. సాగు పద్ధతిని ఎంచుకునే హక్కు, విత్తనాలు, సంప్రదాయక వ్యవసాయ విజ్ఞానం కలిగి ఉండే హక్కు, వ్యవసాయోత్పత్తుల ధర, అమ్మకంపై నిర్ణయాధికార హక్కు, భూమి హక్కుతోపాటు మేధో హక్కులను తిరస్కరించే హక్కు వీటిల్లో పొందుపరచడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఆహార వ్యవస్థలు నానాటికీ బహుళజాతి కంపెనీల చెప్పుచేతల్లోకి వెళ్లిపోతున్న నేపథ్యంలో వ్యవసాయ రంగసంక్షోభం తీవ్రతరమవుతున్నది. అణగారిపోతున్న వారిలో బక్కచిక్కిన బడుగు రైతులు, గ్రామీణ కూలీలు, ఆదివాసీలు ముందు వరుసలో ఉంటారు. వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న చిన్న, సన్నకారు రైతులు, పాడి రైతులు, గ్రామీణ వ్యవసాయ కూలీలతోపాటు మత్స్యకారులు, ఆదివాసులు పేదరికంతో అల్లాడుతున్నారు. వీరందర్నీ కలిపి ‘రైతులు, గ్రామీణ పేదలు’ అని ఐక్యరాజ్యసమితి వ్యవహరిస్తోంది. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న గ్రామీణులకు వెన్నుదన్నుగా నిల వడానికి సాధారణ మానవ హక్కులు చాలవని, కొత్తగా కొన్ని ప్రత్యేక హక్కులు కల్పించాలని ఐక్యరాజ్యసమితికి చెందిన మానవ హక్కుల మండలి (హెచ్చార్సీ) నిశ్చితాభిప్రాయంతో ఉంది. ఈ దిశగా అంతర్జాతీయ చట్టం తేచ్చేం దుకు ఇటీవల తొలి అడుగు వేయడం శుభపరిణామం. ప్రత్యేక వర్కింగ్ గ్రూప్‌ను హెచ్చార్సీ ఏర్పాటు చేసింది. 47 దేశాల ప్రభుత్వ ప్రతినిధులు ఇందులో సభ్యులుగా ఉన్నారు. దీని తొలి సమావేశం గత నెల 15-19 తేదీల్లో జెనీవాలో జరిగింది. 12 కొత్త హక్కులతో కూడిన డిక్లరేషన్‌పై చర్చకు తెరలేచింది. సాగు పద్ధతిని ఎంచుకునే హక్కు, విత్తనాలు, సంప్రదాయక వ్యవసాయ విజ్ఞానం కలిగి ఉండే హక్కు, వ్యవసాయోత్పత్తుల ధర, అమ్మకంపై నిర్ణయాధికార హక్కు, భూమి హక్కుతోపాటు మేధో హక్కులను తిరస్కరించే హక్కు వీటిల్లో పొందుపరచడం విశేషం. చైనా, భారత్, ఇండోనేసియా సహా 23 దేశాలు సానుకూలంగా స్పందించాయి. అమెరికా, యూరోపియన్ దేశా ల కూటమి, జపాన్ వంటి 9 దేశాలు వ్యతిరేకించగా, 15 దేశాలు తటస్థంగా ఉండిపోయాయి. ఏకాభిప్రాయం కోసం వివిధ దేశాలతో హెచ్చార్సీ చర్చలు ప్రారంభించింది. వచ్చే ఏడాదిలో జరిగే వర్కింగ్ గ్రూప్ తదుపరి సమావేశంలో ఈ హక్కులకు ఆమోదముద్ర పడవచ్చు. ప్రపంచీకరణ దుష్ర్పభావాల దాడి నుంచి చిన్న రైతులు, గ్రామీణ పేదలను కాపాడుకోవాలనుకునే దేశాలకు ఈ కొత్త హక్కులు మార్గదర్శకాలుగా నిలుస్తాయి. ఐరాస దృష్టిలో రైతు... ఐక్యరాజ్యసమితి, ఆహార వ్యవసాయ సంస్థ దృష్టిలో రైతులంటే.. నేలతల్లితో, ప్రకృతితో నేరుగా, ప్రత్యేక అనుబంధం కలిగి ఉండి ఆహారం, ఇతర వ్యవసాయోత్పత్తులను పండించేవారు. కుటుంబ సభ్యులు, ఇరుగు పొరుగు చిన్న రైతులతో కలిసి స్వయంగా పొలం పనులు చేసేవారు. భూమిలేని వివిధ రకాల గ్రామీణులు కూడా రైతులే. వ్యవసాయదారులతోపాటు పశువులను పెంచేవారు, పశువులను మేపేవారు, గ్రామాల్లో వ్యవసాయ సంబంధమైన పనిముట్లు తయారు చేసే వృత్తిదారులు, వ్యవసాయ కూలీలు, మత్స్యకారులు, చేతివృత్తిదారులు, సంచార జీవులు, వేట, అటవీ ఉత్పత్తులను సేకరించి జీవించే ఆదివాసులు... వీరందరూ రైతులే. వాణిజ్య దృష్టితో భారీ యంత్రాలను ఉపయోగించి వ్యవసాయం చేసే భారీ కమతాల ఆసాములను ‘రైతులు’గా ఈ డిక్లరేషన్ గుర్తించడంలేదు. అందుకే అమెరికా, యూరోపియన్ దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ హక్కుల పట్ల మన దేశం సానుకూలంగా ఉన్నప్పటికీ వర్కింగ్ గ్రూప్‌లో ఎంత దృఢంగా నిలబడుతుందన్నదానిపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే, కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేం దుకు ప్రజా ఉద్యమం నిర్మించాల్సిన అవసరం ఉందని జెనీవా సమావేశంలో అనధికార ప్రతినిధిగా పాల్గొన్న దేవీందర్ శర్మ అంటున్నారు. చండీగఢ్‌కు చెందిన శర్మ ప్రముఖ వ్యవసాయ, ఆహార, వాణిజ్య విధాన విశ్లేషకుడు, కాలమిస్టుగా అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించారు. ఆయన ఇటీవల హైదరాబాద్ వచ్చినప్పుడు ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రధానాంశాలు. చిన్న రైతులు, ఇతర గ్రామీణ పేదలకు కొత్త హక్కుల అవసరం ఏమిటి? ప్రపంచవ్యాప్తంగా 260 కోట్ల మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరిలో సగానికి సగం మంది అర్ధాకలితో బాధపడుతున్నారు. మార్కెట్ మాయాజాలంలో చిక్కుకున్న రైతులు ఆదాయ భద్రత లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. భారీగా సబ్సిడీలు ఇస్తున్న అమెరికా, ఫ్రాన్స్, కెనడా, ఆస్ట్రేలియా తదితర సంపన్న దేశాల్లో కూడా రైతులు ఆర్థిక కష్టాలతో ఆత్మహత్యలపాలవుతున్నారు. 2007-09 మధ్య ఫ్రాన్స్‌లో 500 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. భారతీయుల్లో 54 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఇప్పటికి 2.9 లక్షల మంది ైరె తులు ఆత్మహత్య చేసుకున్నారు. మన దేశం లో 2 నిముషాలకో రైతు, యూరప్‌లో నిముషానికో రైతు వ్యవసాయం వదిలేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రోజుకు 350 మంది రైతులు సాగు వదిలేసి వలసపోతున్నారు. రైతులను రక్షించుకోకపోతే భవిష్యత్తు అంధకారమవుతుంది. అందుకే రైతులకు ప్రత్యేక హక్కులు కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ కొత్త హక్కులు ఎన్నాళ్లకు అందివస్తాయి? రైతులకు తమ వంగడాలపై బ్రీడింగ్ హక్కులు కల్పించడానికి 22 ఏళ్లు పట్టింది. ఈ హక్కుల విషయంలో అన్నేళ్లు కాదు గానీ, కొన్ని ఏళ్లే పట్టవచ్చు. ప్రతిపాదనలు పదేళ్ల నుంచే ఉన్నా... వర్కింగ్ గ్రూప్‌లో ఈ ఏడాది చర్చ ప్రారంభమైంది. వచ్చే ఏడాది సమావేశంలోనూ చర్చ కొనసాగుతుంది. ఐరాస చేసే హక్కుల తీర్మానాలు సభ్యదేశాల ప్రభుత్వాలకు మార్గదర్శకాలుగా నిలుస్తాయి. వాటి ఆధారంగా ప్రభుత్వాలు తమ దేశాల్లో చట్టాలు చేస్తాయి. మన దేశంలో ఆహార హక్కు కూడా ఇలా వచ్చిందే. కీలకమైన హక్కులపై సంపన్నదేశాలు విభేదిస్తున్నాయి కదా? విత్తనాలు, భూములు, సంప్రదాయ సాగు విజ్ఞానం, ప్రకృతికి అనుగుణమైన సాగు పద్ధతుల ఎంపిక, వ్యవసాయోత్పత్తులకు ధర నిర్ణయించుకునే హక్కు తదితర హక్కులపై తీవ్రస్థాయిలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నా యి. యూరోపియన్ యూనియన్, అమెరికా ఈ హక్కులను వ్యతిరేకిస్తున్నాయి. చర్చల అనంతరం ఈ హక్కు లను ఎన్ని దేశాలు అంగీకరిస్తాయో చూడాలి. అయితే, రైతుల హక్కులపై ఇప్పటికైనా సమితి చర్చ ప్రారంభిం చింది కాబట్టి, రైతులు అధిక సంఖ్యలో ఉన్న మన దేశం చర్చల్లో గట్టిగా నిలబడాలి. వర్కింగ్ గ్రూప్‌లోని మనదేశ ప్రతినిధి ఈ హక్కులకు మద్దతు పలికారు కదా.. ఇంకా చేయాల్సిందేమిటి? భూమి హక్కుపై మన దేశం అభ్యంతరం చెబుతోంది. రైతుల భూములను వారికి ఇష్టం లేకుండా కంపెనీల కోసం స్వల్ప ధరకు ప్రభుత్వం సేకరించి పెట్టడం ఎం దుకు? అవసరమైన కంపెనీలనే రైతులకు నచ్చిన ధర ఇచ్చి కొనుక్కోమనొచ్చు కదా? భారత్ మిగతా హక్కులపై సరే అంటున్నదే గానీ బలమైన గొంతుకను వినిపించడం లేదు. సంపన్న దేశాల ప్రభావానికి లొంగకుండా మన ప్రభుత్వం దృఢమైన వైఖరిని అవలంభించాలి. జెనీవా సమావేశంలో మీరైమైనా ప్రతిపాదించారా? అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వ్యవసాయ సంక్షోభానికి మూలకారణం రైతులకు ఆదాయ భద్రతలేకపోవడం. ఈ హక్కులతో ఆదాయ భద్రత, సామాజిక భద్రత హక్కులు కూడా చేర్చమని నేను, కొందరు ప్రతినిధులం ప్రతిపాదిం చాం. కనీస మద్దతు ధర రైతుకు ఆదాయ భద్రతను కల్పిం చడంలేదు. ఇందుకోసం ప్రతి రాష్ట్రంలో ‘రైతుల ఆదాయ కమిషన్’ నెలకొల్పాలి. ప్రాంతాల వారీగా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ఆదాయ భద్రత కల్పించడం కమిషన్ లక్ష్యంగా ఉండాలి. రైతులకు అందించే అన్నిరకాల సబ్సిడీలు ఈ కమిషన్ ద్వారానే ఛానలైజ్ అయ్యేలా చూడాలి. అంతర్జాతీయంగా పటిష్టమైన రైతుల హక్కుల చార్టర్‌ను రూపొందించుకుంటే.. ఒకటి రెండేళ్ల తర్వాతైనా దీనికి అనుగుణమైన చట్టాలు స్థానిక రైతులకు అందుబాటులోకి వస్తాయి. గ్రామీణ జనాభాలో 80 శాతం మంది రైతులు, వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న మన దేశీ యులకు ఈ హక్కుల అవసరం ఇతరులకన్నా ఎక్కువగా ఉంది. ఈ హక్కులపై గట్టిగా నిలబడేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే బాధ్యత మన రైతు సంఘాలపై ఉంది. - పంతంగి రాంబాబు ‘సాక్షి’ స్పెషల్ డెస్క్