రైతుహక్కుల పరిరక్షణే ప్రధానం | IYR Krishna Rao Article On Farmers Rights | Sakshi
Sakshi News home page

రైతుహక్కుల పరిరక్షణే ప్రధానం

Published Wed, May 22 2019 12:13 AM | Last Updated on Wed, May 22 2019 12:15 AM

IYR Krishna Rao Article On Farmers Rights - Sakshi

వ్యవసాయ వంగడాల అభివృద్ధిలో ప్రభుత్వ సంస్థలతో పోటీపడుతూ దేశీయ వ్యవసాయ రంగంలోకి అడుగుపెట్టిన బహుళజాతి సంస్థలు రైతు సంక్షేమం దృష్ట్యా పని చేస్తాయి అనుకుంటే అది మన భ్రమే. కేవలం లాభాపేక్షతోనే ఇవి తమ కార్యక్రమాలు నిర్వహిస్తాయి. తమ లాభాలను రక్షించుకునే ప్రక్రియలో భాగంగానే ఈ రోజు చిన్న సన్నకారు రైతుల పైన కూడా కోటి రూపాయల వరకు నష్టపరిహారం కోరుతూ పెప్సీ కంపెనీ గుజరాత్‌ కోర్టులో దావా వేయటానికి వెనకాడలేదు. బహుళజాతి సంస్థలు సరఫరా చేసిన విత్తనాలు మొలకెత్తక పోయినా, లేక నేడు గుజరాత్‌లో లాగా వారి హక్కులను అతిక్రమించారని కేసులు వేసినా వ్యక్తిగతంగా రైతు ఈ సంస్థలతో పోరాటం జరిపే పరిస్థితి లేదు. అందుకనే ’మొక్కలలో రకాలు వ్యవసాయదారుల హక్కుల పరిరక్షణ చట్టం’లో రైతుల ప్రయోజనాల్ని పరిరక్షించే విధంగా మార్పులు తీసుకురావడం అవశ్యం. 

ఈమధ్య గుజరాత్‌ రాష్ట్రంలో పెప్సీ కంపెనీ వారు రైతుల పైన కోర్టులో కోటి రూపాయల నష్టపరిహారం కోరుతూ కేసులు వేశారు. తాము సంపాదించిన పేటెం ట్‌కు విఘాతం కలిగించే విధంగా విత్తనాలు ఉపయోగించి వ్యవసాయం చేశారనేది వారి మీద మోపబడిన ప్రధాన అభియోగం. 2001వ సంవత్సరంలో రూపొందించిన ’మొక్కలలో రకాలు రైతుల హక్కుల పరిరక్షణ చట్టం’ (ప్లాంట్‌ వెరైటీస్‌ అండ్‌ ఫార్మర్స్‌ రైట్స్‌ ప్రొటెక్షన్‌ యాక్ట్‌) ఉల్లంఘనకు గానూ రైతులపై ఈ కేసు పెట్టారు. 1989వ సంవత్సరం నుంచి భారతదేశంలో పంజాబ్‌ రాష్ట్రంతో మొదలుపెట్టి ఒప్పంద వ్యవసాయ విధానం ద్వారా(కాంట్రాక్ట్‌ ఫార్మింగ్‌) వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకం చేస్తూ ఉన్న పెప్సీ కంపెనీ దాదాపు 30 ఏళ్ల అనుభవం తరువాత ఈరోజు రైతులపై కేసులు పెట్టటం కొంత విచిత్రంగానే కనిపిస్తుంది.

కానీ పెప్సీ కంపెనీ పెట్టిన ఈ కేసు మూలంగా ’ మొక్కలలో రకాలు రైతుల ప్రయోజనాల పరిరక్షణ చట్టం’లోని కొన్ని లొసుగుల అంశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. పై చట్టంలో సెక్షన్‌ 39 కింద వ్యవసాయదారుల హక్కుల పరిరక్షణ గురించి చెప్పారు. బ్రాండింగ్‌ చేసి వాణిజ్యపరంగా అమ్మనంతవరకు వ్యవసాయదారుల చేత రక్షిత వంగడాల వాడకాన్ని ఈ సెక్షన్‌ కింద పరిరక్షించటం జరి గింది. కానీ ఇదే చట్టంలో సెక్షన్‌ 28 కింద కొత్త వంగడాలను అభివృద్ధి చేసిన సంస్థలకు తాము కానీ తమ చేత లైసెన్స్‌ పొందిన వ్యక్తులు గానీ ప్రత్యేకంగా వినియోగించే అవకాశాన్ని కల్పించింది. ఈ రెండు సెక్షన్లలోని పరస్పర విరుద్ధ అంశాలను ఈ కేసులలో కోర్టులు పరిష్కరించాల్సి ఉంటుంది. ప్రస్తుతం పెప్సీ కంపెనీ ఈ అంశాలను కోర్టు బయట పరిష్కరించుకోవటానికి సుముఖత చూపటం బట్టి ఈ అంశాలు ఇప్పట్లో కోర్టుల్లో తేలే అవకాశాలు కనిపించడం లేదు. ముఖ్యంగా ఈ ఉదంతం నుంచి మన దృష్టికి వచ్చిన ప్రధానమైన అంశాలు ఈ కింది విధంగా ఉంటాయి.

1. ప్రపంచ వాణిజ్య సంస్థకు అనుబంధంగా తయారైన ఖీఖఐ్కS లాంటి మేధోసంపత్తి హక్కుల నుంచి భారత ప్రభుత్వం బయటకి వచ్చే అవకాశం ఉందా! 2. బహుళ జాతి సంస్థల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఒప్పంద వ్యవసాయ విధానానికి ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా? 3. రైతుల హక్కులను పరిరక్షించడానికి ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోవాలి. ఈ మూడు అంశాలు ఒక్కొక్కటి పరిశీలిద్దాం. ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీవో) ఏర్పాటు కావడానికి ముందు వ్యవసాయ పరిశోధన వంగడాల అభివృద్ధి ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రభుత్వరంగ సంస్థల్లో జరుగుతూ ఉండేది. ఈ సంపద అంతా జాతీయ సంపదగా పరిగణించారు కాబట్టి పరిశోధనకు అవసరమైనటువంటి నిధులు ప్రజాధనం ద్వారా సమకూర్చారు కాబట్టి ఈ పరిశోధన వల్ల వచ్చే ఫలితాలు అందరు రైతులకు అందుబాటులో ఉండేవి. ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పాటుతో ఈ విధానం మారింది. మేధోసంపత్తికి పరిహారం సమకూర్చే విధంగా ట్రిప్స్‌ అగ్రిమెంటు ప్రపంచ వాణిజ్య సంస్థ విధి విధానాల్లో భాగంగా పొందుపరిచారు.

ఈ మొత్తం ప్రక్రియ అభివృద్ధి చెందిన దేశాలకు అనుకూలంగా, అభివృద్ధి చెందుతున్న దేశాలకు వ్యతిరేకంగా నడిచింది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ముందు పారిశ్రామిక సర్వీస్‌ రంగాల్లో డబ్ల్యూటీవో ద్వారా సరళీకృత విధానాలను విజయవంతంగా ప్రవేశపెట్టి ట్రిప్స్‌ అగ్రిమెంట్‌ ద్వారా పేటెంటింగ్‌ కాపీరైట్‌ చట్టాలను బలపరిచి అభివృద్ధి చెందిన దేశాలు తమ ప్రయోజనాలను పూర్తిగా పరీక్షించుకున్నారు. వ్యవసాయరంగంలో సరళీకృత విధానాన్ని అమలు చేస్తామని వాగ్దానం చేసినా దోహా రౌండ్‌ చర్చలు విఫలం కావడంతో వ్యవసాయ రంగ సరళీకృత విధానాల ద్వారా అభివృద్ధి చెందుతున్న దేశాలకు వచ్చే ప్రయోజనాలు ఎండమావులు గానే మిగిలిపోయాయి. అభివృద్ధి చెందిన దేశాలలో వ్యవసాయ రంగానికి ఇచ్చే సబ్సిడీలు అంతకుముందు లాగానే కొనసాగుతున్నాయి. పూర్తిగా వ్యవసాయ రంగాన్ని సరళీకృతం చేసి, అభివృద్ధి చెందిన దేశాలలో వ్యవసాయ రంగానికి సబ్సిడీలను నియంత్రణ చేయగలిగి ఉంటే అభివృద్ధి చెందే దేశాల వ్యవసాయ ఉత్పత్తులకు అభివృద్ధి చెందిన దేశాలలో విస్తృత మార్కెట్‌ ఏర్పడి ఉండేది. తదనుగుణంగా ఇక్కడి రైతుల ఆదాయాలు గణనీయంగా అభివృద్ధి చెందే అవకాశం ఉండేది. వ్యవసాయ రంగంపై జరిగిన దోహా రౌండ్‌ చర్చలు విఫలం కావటంతో అటువంటి అవకాశం లేకుండా పోయింది. 

డబ్ల్యూటీవో సంస్థ ఆధ్వర్యంలోని ట్రిప్స్‌ అగ్రిమెంట్‌ ద్వారా వచ్చిన మేధో సంపత్తి పరిరక్షణ విధానానికి అనువుగా మన చట్టాలు మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఒక విధంగా డబ్ల్యూటీవో చట్రంలో ట్రిప్స్‌ చక్రంలో ఇతర దేశాలతో పాటు మనం కూడా బంధితులమయ్యాం. తదనుగుణంగా మన చట్టాల్లో తెచ్చిన మార్పు 2001 సంవత్సరంలోని మొక్కలలో రకాలు వ్యవసాయదారుల హక్కుల పరిరక్షణ చట్టం. ఈ చట్టం కిందనే ఈరోజు పెప్సీ కంపెనీ గుజరాత్‌లో రైతుల మీద కేసులు పెట్టింది. అంతర్జాతీయ ఒప్పందాల దృష్ట్యా ఈ చట్టాన్ని రద్దు చేసుకునే అవకాశం లేనందువల్ల చట్టం లోపలే ఏ విధంగా వ్యవసాయదారుల హక్కులను పరిరక్షించాలి అనే అంశంపైన ప్రభుత్వం దృష్టి పెడితే బాగుంటుంది. ఇక రెండో ప్రధానమైన అంశం ఈ బహుళ జాతి సంస్థల ఆధ్వర్యంలో జరిగే ఒప్పంద వ్యవసాయానికి(కాంట్రాక్ట్‌ ఫార్మింగ్‌) ప్రత్యామ్నాయ విధానం ఏమైనా ఉందా! కొంతవరకు సహకార వ్యవసాయ విధానం ఈ ఒప్పంద వ్యవసాయ విధానానికి ప్రత్యామ్నాయంగా అభివృద్ధి చేయవచ్చు.

కానీ దీనికి బలమైన నాయకత్వం అవసరం ఎంతైనా ఉంది. సహకార రంగంలో ఒక అమూల్‌ సంస్థ తప్పితే దేశంలో ఇంకెక్కడ సహకార సంస్థలు బలపడి రైతులకు దీర్ఘకాలంలో ప్రయోజనం కల్పించిన దాఖలాలు కనిపించడం లేదు. బహుళజాతి సంస్థల ఆధ్వర్యంలో జరిగే ఒప్పంద వ్యవసాయ విధానంలో రైతులకు బహుళ ప్రయోజనాలు చేకూరుతాయి అనేది కూడా వాస్తవం. మొట్టమొదటిది అంతర్జాతీయ మార్కెట్‌ను, చిన్నకమతాల రైతులను అనుసంధానం చేసే సామర్థ్యం బహుళజాతి సంస్థలకే ఉంటుంది. నాణ్యమైన వంగడాల సరఫరా, వ్యవసాయ ఉత్పత్తులను ఆధునిక పద్ధతుల్లో నిల్వ చేయటం, ప్రాసెసింగ్‌ సదుపాయాలు కల్పించటం తద్వారా వ్యవసాయోత్పత్తుల విలువను పెంచటం ఈ బహుళ జాతి సంస్థల ద్వారానే సాధ్యమవుతుంది. సరైన ప్రత్యామ్నాయం వాటికి లేదు కనుక వ్యవసాయ రంగంలో కొన్ని పరిమితులు, షరతులకు లోబడి పనిచేసే విధంగా బహుళజాతి సంస్థల ఆధ్వర్యంలో ఒప్పంద వ్యవసాయాన్ని ప్రోత్సహించడం వ్యవసాయ రంగంలో ఉత్పాదకత ఆదాయం పెరగడానికి దోహదపడుతుంది.

కానీ ప్రభుత్వాలు ఈ బహుళ జాతి సంస్థలపై ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. రైతు సంక్షేమం దృష్ట్యా అవి పనిచేస్తాయి అనుకుంటే అది మన భ్రమే. కేవలం లాభాపేక్షతోనే ఈ కంపెనీలు తమ కార్యక్రమాలు నిర్వహిస్తాయి. అటువంటి లాభాలను రక్షించుకునే ప్రక్రియలో భాగంగానే ఈ రోజు చిన్న, సన్నకారు రైతులపైన కూడా కోటి రూపాయల వరకు నష్టపరిహారం కోరుతూ పెప్సీ కంపెనీ గుజరాత్లో కోర్టులో దావా వేయటానికి వెనకాడలేదు. వ్యవసాయం చేసుకోవలసిన రైతులను కక్షదారులుగా మారిస్తే పరిమితి లేని వనరులున్న ఈ బహుళ జాతి సంస్థలపై రైతులు పోరాటం చేసే పరిస్థితే లేదు. బహుళజాతి సంస్థలు సరఫరా చేసిన విత్తనాలు మొలకెత్తక పోయినా, లేక ఈనాడు గుజరాత్‌లో లాగా వారి హక్కులను అతిక్రమించారని కేసులు వేసినా వ్యక్తిగతంగా రైతు ఈ సంస్థలతో పోరాటం జరిపే పరిస్థితి లేదు. ఇక్కడనే ప్రభుత్వాలకు చాలా ప్రధానమైనటువంటి పాత్ర ఉన్నది.

బహుళజాతి సంస్థలతో ఉత్పన్నమైన ఎటువంటి కేసుల విషయంలో కూడా రైతుల తరఫున పోరాడే బాధ్యత ప్రభుత్వం చేత ఏర్పాటు చేసిన సంస్థ స్వీకరించాలి. పూర్తిగా వ్యాజ్యం అయ్యే ఖర్చులు ఈ సంస్థ భరించే విధంగా మార్పులు తీసుకురావాలి. రైతు లను కేవలం వ్యవసాయానికే పరిమితం చేసి అనవసరమైన కోర్టు కేసులు వారి నెత్తి మీద లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఈ సంస్థ రైతులకు అండగా కోర్టు కేసులు నడపటానికి అనువుగా చట్ట సవరణ ప్రభుత్వం తీసుకురావాలి. అట్లాగే ఆ సంస్థలకు కావలసిన ఆర్థిక పరిపుష్టిని ఏర్పాటు చేయాలి. అప్పుడే నిర్భయంగా వ్యవసాయదారుడు బహుళజాతి సంస్థలతో ఒప్పందాలు చేసుకుని వ్యవసాయ కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించడంలో నిమగ్నం కాగలుగుతాడు.

ఇంకొక ప్రధాన విషయం మనదేశంలో ఈ చట్టాన్ని రూపొందించేటప్పుడు పూర్తిగా పేటెంట్‌ విధానానికి వెళ్లకుండా రైతుల ప్రయోజనాలను కూడా దృష్టిలో పెట్టుకొని   sui generisవిధానంలో ఈ ‘మొక్కలలో రకాలు వ్యవసాయదారుల హక్కుల పరిరక్షణ చట్టం’ని రూపొం దించారు. ఈ చట్టం అమలులో ఉండి 20 సంవత్సరాలు అవుతుంది కనుక ఇది ఎంతవరకు రైతుల ప్రయోజనాలను పరిరక్షించడంలో సఫలీకృతమైంది అనే విషయాన్ని ఒకసారి సమీక్షించుకొని ట్రిప్స్‌ విధానానికి ప్రతికూలం కానంతవరకు తగిన మార్పులను వ్యవసాయదారుల ప్రయోజనాలను పరిరక్షించే విధంగా తీసుకురావాల్సిన ఆవశ్యకత కూడా ఎంతైనా ఉంది.


ఐవైఆర్‌ కృష్ణారావు
వ్యాసకర్త ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి
ఈ–మెయిల్‌ :  iyrk45@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement