ఒప్పుకున్న టీటీడీ ఈవో శ్యామలరావు.. ఏఆర్ డెయిరీకి తిప్పి పంపించామని వెల్లడి
ది ప్రింట్‌లో ప్రత్యేక కథనం
అమరావతి: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారని, టీటీడీకి అపవిత్రం జరిగిపోయిందని చంద్రబాబు చేస్తున్న ప్రచారం అంతా బోగస్ అని తేలిపోయింది. చంద్రబాబు చేస్తున్న దుర్మార్గపు దుష్ప్రచారం వల్లే టీటీడీ పవిత్రత మంటగలుస్తోందని మరోసారి స్పష్టమైపోయింది. బాబు నియమించిన టీటీడీ ఈవో శ్యామలరావు మాటల్లో ఈ విషయం బట్టబయలైంది. శనివారం ప్రఖ్యాత ఆంగ్ల వెబ్‌సైట్ ది ప్రింట్‌తో శ్యామలరావు మాట్లాడుతూ ‘‘తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ నుంచి వచ్చిన 10 ఆవునెయ్యి ట్యాంకర్లలో నాలుగింటిలో నాణ్యత తగ్గినట్లు టీటీడీ నిపుణులు నిర్ధారించారు.
జులై 6న వచ్చిన రెండు ట్యాంకర్లలో, జులై 12న వచ్చిన మిగిలిన ట్యాంకర్లలోని శ్యాంపుల్స్‌ను సేకరించి నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డ్ సెంటర్‌కు పంపించాం. ఆ నెయ్యిని 100శాతం ఉపయోగించలేదు.’’ అని శ్యామలరావు చెప్పారు. ఎన్‌డీడీబీ రిపోర్ట్‌లో జంతుసంబంధమైన, వెజిటబుల్ ఫ్యాట్‌లకు సంబంధించిన కల్తీ జరిగినట్లు తేలడంతో ఆ నాలుగు ట్యాంకర్లను పక్కన పెట్టి ఏఆర్‌డైరీకి తిప్పి పంపించామని శ్యామలరావు చెప్పారు. అసమయంలో టీటీడీకి ఐదు ఏజెన్సీలు నెయ్యి సరఫరా చేస్తున్నాయని, అందులో ఏఆర్ డైరీ ట్యాంకర్లలోనే నెయ్యి తక్కువ నాణ్యత ఉన్నట్లు తేలిందని ఆయన తెలిపారు.
కల్తీ అయిన నెయ్యిని ప్రసాదాల తయారీకి అస్సలు వాడలేదంటూ శ్యామలరావు చెప్పినట్లు ది ప్రింట్‌లో వచ్చిన కథనం
లడ్డూలలో కల్తీ ఎక్కడుంది? : ఐవైఆర్ కృష్ణారావు
ఎన్‌డీడీబీ రిపోర్ట్ ప్రకారం తిరస్కరించిన కల్తీనెయ్యి గురించే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఆరోపణలు చేస్తుంటే ఇక తిరుపతి లడ్డూలలో కల్తీ ఎక్కడుంది? ’’ అని మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు ప్రశ్నించారు. ఆయన ది ప్రింట్ ప్రతినిధితో మాట్లాడుతూ చంద్రబాబు చేస్తున్న ఆరోపణలకు దన్నుగా మరేదైనా గట్టి ఆధారం లేకపోతే ఇది కచ్చితంగా చంద్రబాబుకు, టీడీపీకి బూమరాంగ్ వంటిదేనని వ్యాఖ్యానించారు.
చర్యతీసుకోవడం మానేసి రాజకీయమా?
‘‘టీటీడీలో ఒక సిస్టమ్‌ను అనుసరిస్తాం. సాంకేతిక, ఆర్థిక అర్హతల ఆధారంగానే సరఫరాదారును ఎంపిక చేస్తారు. ఎంపికైన ఏజెన్సీ కల్తీ వంటి ఏదైనా తప్పు చేస్తే దానిని గుర్తించి చర్య తీసుకోవడం ప్రస్తుత ప్రభుత్వ బాధ్యత. అది మానేసి దీనిని రాజకీయంచేయడం ఎంత వరకు సబబు?’’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని టీటీడీ అధికారి ఒకరు ది ప్రింట్ ప్రతినిధికి చెప్పారు.
వాడని నెయ్యి.. తయారు కాని లడ్డూ!
టీటీడీకి ఈ ఏడాది జూలై 6, జూలై 12వ తేదీల్లో ఓ సరఫరా సంస్థ రెండేసి ట్యాంకర్లు చొప్పున ఆవు నెయ్యిని సరఫరా చేసింది. టీటీడీ మార్కెటింగ్ అధికారి, సంస్థ ప్రతినిధి సమక్షంలో ట్యాంకర్ సీల్ తొలగించి నెయ్యిని కలియతిప్పి.. ఒక్కో ట్యాంకర్ నుంచి మూడు శాంపిళ్ల చొప్పున సేకరించి అదే రోజు తిరుమలలో టీటీడీ ల్యాబ్‌కు పంపారు. ల్యాబ్‌లో వేర్వేరుగా పరీక్షలు చేసిన ముగ్గురు టెక్నీషియన్లు టెండర్‌లో పేర్కొన్న ప్రమాణాల మేరకు నెయ్యి నాణ్యత లేదని తేల్చుతూ జూలై 8, 14న నివేదిక ఇచ్చారు.
దాంతో తిరుపతిలో టీటీడీ గోడౌన్ బయట నుంచే ఆ రెండు ట్యాంకర్ల నెయ్యిని టీటీడీ అధికారులు వెనక్కి పంపేశారు. కల్తీ నెయ్యిని శ్రీవారి లడ్డులో వినియోగించడం కాదు కదా కనీసం తిరుపతిలోని టీటీడీ గోడౌన్‌లోకి కూడా అనుమతించడం లేదన్నది దీనిద్వారా స్పష్టమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment