laddu prasadam
-
అహోబిలేషుడి లడ్డూకు కమీషన్ పోటు
ఆళ్లగడ్డ: టీడీపీ నేత కమీషన్ బాగోతం వల్ల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అహోబిలం దేవస్థానంలో లక్ష్మీనరసింహ స్వామి లడ్డూ ప్రసాదం విక్రయాలు నిలిచిపోయాయి. ఎగువ, దిగువ క్షేత్రాల్లో లడ్డూ కౌంటర్లు వారం రోజులుగా మూత పడటంతో భక్తులు ఆవేదనతో వెనుదిరుగుతున్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని టీడీపీ కీలక నాయకుడే కారణమని తెలుస్తోంది. ప్రసాదాల తయారీకి సరుకులు సరఫరా చేసే వ్యాపారిని కమీషన్ కోసం ఆ నాయకుడు ఒత్తిడి చేశాడు. ఇందులో తనకు పెద్దగా ఏమీ మిగలదని, కమిషన్ ఇవ్వబోనని ఆ వ్యాపారి చెప్పడంతో సరుకుల సరఫరాను ఆపేయించారు. దీంతో టీడీపీ నాయకుడు, కొందరు దేవస్థాన నిర్వాహకులకు కలిపి 20 శాతం కమీషన్ ఇచ్చేటట్లు బాపట్లకు చెందిన కాంట్రాక్టర్‌తో ఒప్పందం చేసుకుని సరుకుల సరఫరా బాధ్యతను అప్పగించారు. ఈ నేపథ్యంలో వారం రోజులుగా సరుకులు రాక పోవడంతో ప్రసాదాల తయారీ నిలిచిపోయింది. దీంతో విక్రయాలు లేక భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవుడి ప్రసాదంలోనూ కమీషన్ల కక్కుర్తి ఏమిటని వాపోతున్నారు. -
చంద్రబాబు ఆరోపణల వెనుక కుట్ర కోణం
సాక్షి, అమరావతి: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పదే పదే ప్రకటించడం వెనుక కుట్ర కోణం ఉందని ప్రముఖ న్యాయవాది, మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామి పేర్కొన్నారు. ఎలాంటి ఆధారం లేకుండా లడ్డూ ప్రసాదం కల్తీ జరిగిందని ఆరోపించడం ప్రపంచాన్ని కలవర పెట్టిందని అన్నారు. ప్రజల మనోభావాలను ప్రభావితం చేసే ఇలాంటి అంశాలను బహిరంగంగా ప్రకటించే ముందు దర్యాప్తు చేయాలన్నారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన తిరుమల లడ్డూపై వచ్చిన ఆరోపణలపై పలు ప్రశ్నలు లేవనెత్తారు. 2019లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి క్రైస్తవ ముద్ర వేసేందుకు చేసిన సందర్భాలను సైతం ఆయన ఇక్కడ గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మీడియా సంస్థల బాధ్యతారాహిత్యాన్ని ఎత్తిచూపారు. ఏపీ ప్రభుత్వం నియమించిన సిట్‌తో వాస్తవాలు తేలవని, అందుకే సుప్రీంకోర్టును ఆశ్రయించినట్టు చెప్పారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన ఇంకా ఏమన్నారంటే.. నెయ్యి శాంపిల్స్ పరీక్షలు చేసి, టీటీడీ ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడంతో వెనక్కు పంపించామని టీటీడీ ఈవో రిపోర్టులో స్పష్టంగా ఉన్నప్పటికీ, కల్తీ జరిగిందని సాక్షాత్తు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయడు పదే పదే బహిరంగంగా ప్రకటించడం దేనికి నిదర్శనం? ఇలా ఆరోపణలు చేశాక దర్యాప్తుకు ఆదేశిస్తారా? నిజానిజాలు నిర్ధారించుకోకుండా భక్తుల్లో అలజడి సృష్టించడానికి యతి్నంచడం కుట్ర కోణంగా భావించక తప్పదు. – ప్రముఖ న్యాయవాది, మాజీ ఎంపీ డాక్టర్ సుబ్రమణ్యస్వామి జగన్ సీఎం అయినప్పటి నుంచి ఇదే వైఖరి⇒ తిరుమల బాలాజీ లడ్డూ ప్రసాదం తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని స్వయంగా ముఖ్యమంత్రే గత నెల 18న బహిరంగంగా ఆరోపించారు. ఆ తర్వాత ప్రసాదం కల్తీపై దర్యాప్తు చేసేందుకు సిట్‌ను నియమిస్తున్నట్టు సెపె్టంబర్ 26న ప్రకటించారు. ఇలాంటి తీవ్రమైన ఆరోపణ చేసేటప్పుడు సీఎం స్థాయిలో ఉన్న వారు వాస్తవమా.. కాదా అని తొలుత దర్యాప్తు చేసి నిర్ధారించుకోవాలి. ⇒ కానీ ఇక్కడ అలా జరగలేదు. ముందు ఆరోపణ చేసి తర్వాత సిట్ దర్యాప్తు అన్నారు. పైగా కల్తీపై దర్యాప్తు కోసం అదే ప్రభుత్వం సిట్‌ను నియమించడం ద్వారా వాస్తవాలు వెలుగులోకి వస్తాయని అనుకోవడం లేదు. జూలైలో కల్తీ జరిగిందని చెప్పి.. ఇంత కాలం తర్వాత ఇప్పుడు ఎందుకు సిట్‌ని నియమించారు? పైగా గత ప్రభుత్వంపై, నాటి సీఎం జగన్మోహన్రెడ్డి, ఆయన మంత్రులపై చాలా పెద్ద ఆరోపణలు చేశారు. ⇒ జగన్ సీఎం అయినప్పటి నుంచి తిరుపతిలో క్రైస్తవ మత ప్రచారం చేస్తున్నారని ఓ ప్రణాళిక ప్రకారం ఆరోపణలు చేస్తూ వచ్చారు. తద్వారా నాటి సీఎం వైఎస్ జగన్‌పై మత ముద్ర వేసేందుకు చాలా ప్రయత్నం చేశారు. 2019లో సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించినప్పుడు కూడా ఇదే రకమైన ఆరోపణలు చేశారు. ఒక క్రైస్తవుడిని టీటీడీ చైర్మన్‌గా ఎలా నియమిస్తారని హిందూవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ⇒ వాస్తవమేంటంటే సుబ్బారెడ్డి గురించి తెలిసిన వారిని ఎవరిని అడిగినా ఆయన హిందువనే చెబుతారు. ఆయన 32 సార్లు మాల వేసుకుని శబరిమలకు వెళ్లివచ్చారు. ఇంట్లో గోశాల నిర్వహిస్తూ గోవులకు పూజ చేస్తున్నారు. ఇప్పుడు లడ్డూ ప్రసాదం కల్తీ జరిగిపోయిందని చంద్రబాబు నాయుడు పత్రికల్లో పతాక స్థాయిలో స్టేట్మెంట్లు ఇచ్చారు. ఇలాంటివి చాలానే ఉన్నాయి. ఇందులో సుప్రీంకోర్టును సైతం కలవరపెట్టే అంశాలు చాలా ఉన్నాయి. అందుకే సుప్రీంకోర్టును ఆశ్రయించాను. ప్రస్తుతం ఈ అంశంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ప్రత్యేక సిట్‌ను నియమించింది. తప్పుడు వార్తలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి⇒ జూలైలో నెయ్యి శాంపిల్ తీసుకుని టెస్ట్ చేశారని టీటీడీ రిపోర్టులో ఉంది. ఆ రిపోర్టులో కల్తీ జరిగిందని గానీ, ఫిష్ ఆయిల్, కొవ్వు కలిసిందని గానీ ఎక్కడా లేదు. నెయ్యి నాణ్యత టీటీడీ ప్రమాణాలకు తగ్గట్టుగా లేనందున తిప్పి పంపించామని ఉందే తప్ప ప్రసాదం తయారీకి పంపించామని ఎక్కడా చెప్పలేదు. కాబట్టి ఒక అబద్ధాన్ని సృష్టించి.. విస్తృతంగా ప్రచారం చేశారన్నది వాస్తవం. ఇలాంటప్పుడు కల్తీ జరిగిందని ఎలా చెబుతారు? ప్రసాదంపై చేసిన ఆరోపణ కోట్లాది మంది ప్రజలను ప్రభావితం చేసేది. ఆరోపణలు చేయడం సులువే, కానీ వాటిని నిరూపించాలిగా!⇒ వార్తాపత్రికలు కూడా జవాబుదారీగా ఉండాలి. రాజకీయ నాయకులు లడ్డూ ప్రసాదం, ఆలయ అంశాలను సమస్యగా మార్చి తమ గ్రాఫ్ పెంచుకునే ప్రయత్నం చేయవద్దని సుప్రీంకోర్టు గట్టిగానే చెప్పింది. ఈ హెచ్చరికను ప్రజలు ప్రశంసించారు. ఒకరి గుర్తింపును, ఎదుగుదలను రాజకీయంగా నాశనం చేసేందుకు తప్పుడు వార్తలను ప్రచారం చేసే ఏజెన్సీలు సైతం ఉన్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. -
బాబు గారి ‘కొవ్వు’ బాగోతం బట్టబయలు
సాక్షి, అమరావతి: తిరుమలలో శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కలిపే ఆవు నెయ్యి సరఫరాకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్వహించిన టెండర్లపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలేనన్న విషయం మరోసారి బహిర్గతమైంది. అయిన వారికి కట్టబెట్టడం కోసం అడ్డగోలుగా నిబంధనలు మార్చేశారంటూ ఆయన చేసిన ఆరోపణల్లో వీసమెత్తు నిజం లేదన్నది మరోసారి వెల్లడైంది. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నప్పుడు పది లక్షల కిలోల ఆవు నెయ్యి సరఫరాకు నిర్వహించిన టెండర్లలో ఏఆర్ డెయిరీ ఫుడ్స్ కాంట్రాక్టు దక్కించుకుంది. ఇప్పుడు అదే టెండర్ నిబంధనలతో తాజాగా పది లక్షల కిలోల ఆవు నెయ్యి సరఫరాకు ఈనెల 7న (సోమవారం) టీటీడీ మార్కెటింగ్ విభాగం టెండర్ నోటిఫికేషన్ జారీ చేయడం సీఎం చంద్రబాబు బండారాన్ని బయటపెట్టింది. చంద్రబాబు ఆరోపణలన్నీ రాజకీయ దురుద్దేశంతో చేసినవేనన్న విషయాన్ని స్పష్టం చేసింది. స్వచ్ఛత కోసం ప్రమాణాలు పెంపు తిరుమల శ్రీవారికి సమర్పించే నైవేద్యాలు, లడ్డూ, అన్న ప్రసాదాల తయారీలో వినియోగించే ఆవు నెయ్యి, ముడిసరుకుల సేకరణకు టీటీడీ మార్కెటింగ్ విభాగం ఎప్పటికప్పుడు టెండర్లు నిర్వహిస్తుంది. స్వచ్ఛమైన ఆవు నెయ్యి సేకరణకు ఆర్నెల్లకు ఓ సారి టెండర్లు పిలుస్తుంది. నెయ్యిలో తేమ శాతం 0.3 శాతానికి మించకూడదని, బూటిరో రిఫ్రాక్టో (బీఆర్) మీటర్ రీడింగ్ 40 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద 40–43 మధ్య ఉండాలని, ఆర్ఎం వాల్యూ కనిష్టంగా 26 ఉండాలని, బౌడౌన్, మినరల్ ఆయిల్, ఫారిన్ కలర్స్ టెస్టుల్లో నెగెటివ్ రావాలని, మెల్టింగ్ పాయింట్ 27–37 డిగ్రీల మధ్య ఉండాలనే ఎనిమిది ప్రమాణాలతో 2019 మే 29 వరకూ టెండర్లు పిలిచేవారు. 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత స్వచ్ఛమైన ఆవు నెయ్యి సేకరణకు మరో తొమ్మిది ప్రమాణాలను అదనంగా చేర్చింది. మొత్తం 17 ప్రమాణాలతో రివర్స్ టెండరింగ్ విధానంలో టెండర్లు నిర్వహించి, శ్రీవారి ఖజానాకు భారీగా ఆదా చేశారని టీటీడీ అధికారవర్గాలే చెబుతున్నాయి. నిబంధనలు మరింత కఠినతరం భూమన కరుణాకర్‌రెడ్డి టీటీడీ చైర్మన్‌గా ఉన్నప్పుడు స్వచ్ఛమైన ఆవు నెయ్యి సేకరణకు నిబంధనలను మరింత కఠినతరం చేశారు. ఈమేరకు 2023 నవంబర్ 14న టీటీడీ బోర్డు సమావేశంలో తీరా>్మనాన్ని ఆమోదించి అమలు చేశారు. ఆవు నెయ్యి సేకరణ టెండర్లలో పాల్గొనాలంటే కనీసం ఐదేళ్లు వరుసగా డెయిరీలో నెయ్యిని ఉత్పత్తి చేసి ఉండాలని, జాతీయ డెయిరీలైతే రోజుకు 4 లక్షల లీటర్లు, 1500 కిలోమీటర్ల పరిధిలోని డెయిరీలైతే రోజుకు 2 లక్షల లీటర్లు, రాష్ట్రంలోని డెయిరీలైతే రోజుకు లక్ష లీటర్ల పాలను సేకరిస్తుండాలని నిబంధనలు పెట్టారు. జాతీయ డెయిరీలైతే నెలకు 360 టన్నులు లేదా ఏడాదికి 5 వేల టన్నుల ఆవు నెయ్యి ఉత్పత్తి చేసి ఉండాలని, రూ.500 కోట్ల టర్నోవర్ కలిగి ఉండాలని షరతు విధించారు. 1,500 కిలోమీటర్ల పరిధిలోని డెయిరీలైతే నెలకు 180 టన్నులు లేదా ఏడాదికి 2,750 టన్నుల ఆవు నెయ్యిని ఉత్పత్తి చేసి ఉండి, రూ.250 కోట్ల వార్షిక టర్నోవర్ కలిగి ఉండాలని నిబంధన పెట్టారు. రాష్ట్రంలోని డెయిరీలకైతే నెలకు 90 టన్నులు లేదా ఏడాదికి 1,500 టన్నుల ఆవు నెయియని ఉత్పత్తి చేసి ఉండి.. రూ.వంద కోట్ల టర్నోవర్ ఉండాలని షరతు విధించారు. వాటిని నిక్కచ్చిగా అమలుచేయడంతో కాంట్రాక్టు పొందిన డెయిరీలు స్వచ్ఛమైన ఆవు నెయ్యిని టీటీడీకి సరఫరా చేశాయి. ఇదే నిబంధనలతో ఎన్నికల సంఘం పర్యవేక్షణలో 2024 మార్చి 12న టీటీడీ పిలిచిన టెండర్లలో ఏఆర్ డెయిరీ ఫుడ్స్ నెయ్యి సరఫరా కాంట్రాక్టును దక్కించుకుంది. ఇప్పుడూ అవే నిబంధనలతో టీటీడీ టెండర్లు పిలవడం గమనార్హం. -
తీరు మారని టీడీపీ: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చంద్రబాబునాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేసినప్పటికీ లడ్డూ ప్రసాదం విషయంపై టీడీపీ ఇంకా రాజకీయం చేస్తూనే ఉందని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆక్షేపించారు. సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించాక తాను మీడియాతో మాట్లాడిన మాటల వీడియోను ప్రధాన మంత్రి మోదీ, కేంద్ర మంత్రులు, జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, ఆ పార్టీల నేతలకు ట్యాగ్ చేస్తూ శనివారం ఆయన ఎక్స్ (ట్విటర్)లో పోస్టు చేశారు. ఆ వీడియోలో వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ‘కల్తీ నెయ్యి వాడలేదని ఈవో చెప్పినా, లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు ఉందని ముఖ్యమంత్రి ఎలా చెబుతారు? ఆధారాలు లేకపోయినా సీఎం మీడియా ముందు అలా ఎలా మాట్లాడుతారు? ఒకవైపు విచారణ జరుగుతుండగా.. ఆ వ్యాఖ్యలతో సిట్ ప్రభావితం కాదా? తమ నివేదిక తప్పు కావచ్చని స్వయంగా ఎన్డీడీబీ రిపోర్టులోనే రాశారు కదా? ఎన్డీడీబీ నివేదికపై సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు? అదొక్కటే కాదు.. దేశంలో ఎన్నో ల్యాబ్స్ ఉన్నాయి కదా? ముఖ్యమంత్రి ప్రకటనకు పూర్తి విరుద్ధంగా ఈవో ప్రకటన ఉంది. ఆ నెయ్యి వాడనే లేదని ఈవో చెప్పారు. సీఎం చేసిన ప్రకటనకు ఎలాంటి ఆధారాలు లేవు. దర్యాప్తునకు ఆదేశించినప్పుడు పదాల గారడీ ఎంత మాత్రం అవసరం లేదు. ఎన్డీడీబీ నివేదిక జూలైలో వస్తే దానిపై ముఖ్యమంత్రి ఎందుకు సెప్టెంబరులో మాట్లాడినట్లు? జూలైలోనే ఎందుకు మాట్లాడలేదు? మీడియాతో మాట్లాడటానికి ముందు లడ్డూలను పరీక్షించడం సరైనదని సీఎం భావించలేదా? అసలు బహిరంగ ప్రకటనలు ఎందుకు చేయాలి? దాని వల్ల సిట్ దర్యాప్తు ప్రభావితం కాదా? అది కోట్ల మంది మనోభావాలను దెబ్బ తీస్తుందని తెలియదా? సిట్ ఏర్పాటు చేసినా, ఇంకా కల్తీ నెయ్యిపై ప్రకటన ఎలా చేస్తారు? మీడియాతో ఎలా మాట్లాడుతారు?’.. అని సుప్రీంకోర్టు గత 30వ తేదీన వ్యాఖ్యానించింది అని చెప్పారు. Even after the critical remarks of the Hon’ble Supreme Court against @ncbn , TDP continues to politicize the Laddu Prasadam issue. @BJP4India @INCIndia @arivalayam @BRSparty @samajwadiparty @AamAadmiParty @AIADMKOfficial @narendramodi @AmitShah @ShivSenaUBT_ @AITCofficial… pic.twitter.com/vefByATGT6— YS Jagan Mohan Reddy (@ysjagan) October 5, 2024ఈవో, సీఎం పరస్పర విరుద్ధ ప్రకటనలు‘ఎఫ్ఐఆర్ సెప్టెంబరు 25న రిజిస్టర్ చేస్తే.. అంతకు ముందే సెప్టెంబరు 18న ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి స్టేట్మెంట్ ఇచ్చాడు. సిట్ ఏర్పాటైంది సెప్టెంబరు 26న అయితే.. అంతకన్నా ముందే ఎలా ప్రకటన ఇచ్చాడంటూ.. సీఎం బహిరంగ ప్రకటన కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బ తీస్తుందని కోర్టు చెప్పింది. ఇన్ని రకాలుగా చంద్రబాబును సుప్రీంకోర్టు ఆక్షేపించింది. అయితే మళ్లీ ఇవాళ కూడా.. కల్తీ నెయ్యి వాడలేదని ఈవో చెప్పిన విషయాన్ని ప్రస్తావిస్తూ చంద్రబాబు చేసిన తప్పును సుప్రీంకోర్టు ఎత్తి చూపింది. బాబు తాను స్వయంగా ఏర్పాటు చేసుకున్న సిట్‌ను రద్దు చేస్తూ.. సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఇద్దరు సీబీఐ అధికారులు, వారికి సహకారం అందించడానికి ఇద్దరు రాష్ట్ర అధికారులు.. వీరికి తోడు ఎఫ్ఎస్ఎస్ఏఐ (ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) నుంచి ఒకరు నియమితులవుతారని.. వీరందరూ లడ్డూకి సంబంధించిన విషయంపై నివేదిక ఇస్తారని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇంత స్పష్టంగా సుప్రీంకోర్టు ఆదేశించినా.. చంద్రబాబులో ఏ మాత్రం పశ్చాత్తాపం కనిపించలేదు. ఆయనకు వ్యక్తిత్వం ఉంటే ముందు ప్రజలను క్షమాపణ కోరాలి. తర్వాత తిరుమలలో తప్పు చేశానని స్వామి వారిని వేడుకోవాలి. అవేవీ చేయడం లేదు. టీడీపీ దుష్ప్రచారం ఆపలేదు’ అని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. -
అబద్ధాలకు రెక్కలుకట్టి గోబెల్స్ ప్రచారం చేస్తావా?
సనాతనా ధర్మం అంటే ఏమిటో అసలు ఆ మనిíÙకి తెలుసా? సాక్షాత్తు నువ్వు కూడా కూటమిలో ఉన్నావు. చంద్రబాబు నీ కళ్ల ఎదుటే తప్పు చేశాడు. దేవుడి విషయంలో చంద్రబాబు చేసిన తప్పు నీకే కాదు ఆరేళ్ల పిల్లాడికి కూడా కన్పిస్తోంది. నీ కళ్ల ఎదుటే వేంకటేశ్వరస్వామి ప్రతిష్టను తగ్గిస్తూ.. విశిష్టతను దెబ్బతీస్తూ కావాలనే దుర్బిద్ధితో చంద్రబాబు రాజకీయం చేస్తున్నాడు. రాజకీయ లబ్ధి పొందేందుకు కోట్ల మంది శ్రీవారి భక్తుల్లో ఒక అనుమానాన్ని రేకెత్తించాడు. తిరుమల తిరుపతి దేవస్థానానికి అపవిత్రతను ఆపాదించే ప్రయత్నం చేస్తూ.. లడ్డూ విశిష్టతను తగ్గించే ప్రయత్నం చేశారు. అందులో నీవు కూడా భాగమే. – వైఎస్ జగన్సాక్షి, అమరావతి : ‘వంద రోజుల పాలన వైఫల్యం.. సూపర్ సిక్స్‌తో సహా ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ప్రజలు నిలదీస్తుండటంతో వారి దృష్టి మళ్లించాలనే రాజకీయ దురుద్దేశంతో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామితో ఆడుకుంటావా?’ అని సీఎం చంద్రబాబును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ నిలదీశారు. ఒక అబద్ధానికి రెక్కలు కట్టి గోబెల్స్ ప్రచారం చేసి.. తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాశస్త్యం, లడ్డూ విశిష్టతను అపవిత్రం చేస్తావా? అంటూ మండిపడ్డారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారంటూ ఆరోపిస్తున్న సీఎం చంద్రబాబు చేసిన తప్పులు, చెప్పిన అబద్ధాలను ‘మీడియా’ ఎదుట సాక్ష్యాధారాలతో సహా మరోసారి వివరించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. టీటీడీలో గొప్ప వ్యవస్థ జూలై 6, జూలై 12న వచ్చిన ట్యాంకర్లలో నెయ్యి నాణ్యత పరీక్షించిన తర్వాత వాటిని లోపలికి అనుమతించ లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో స్వామి వారి ప్రసాదాలు, అడ్డూ, అన్న ప్రసాదాల తయారీకి అవసరమైన ముడి సరుకులు, నెయ్యి కొనుగోలు చేయడానికి అత్యంత గొప్ప, పటిష్టమైన వ్యవస్థ ఉంది. 2014–19 మధ్య నాణ్యత లేదని 14 నెయ్యి ట్యాంకర్లు వెనక్కు పంపగా.. మా హయాంలో 2019–24 మధ్య 18 ట్యాంకర్లు వెనక్కు పంపారు. నెయ్యి, ముడిసరుకుల సేకరణకు ఈ–టెండర్ల ద్వారా బిడ్లు నిర్వహిస్తారు. ఎల్–1కు 65 శాతం, ఆ తర్వాత బిడ్‌లో ఉన్న వారికి అదే ధరకు 35 శాతం ఇస్తారు. ఆ నెయ్యి వాడలేదని టీటీడీ ఈవోనే చెప్పారు తిరుమలకు టెండర్ ప్రకారం సరఫరా చేసే నెయ్యి ట్యాంకర్లు.. తమతో ఎన్ఏబీఎల్ గుర్తింపు పొందిన ల్యాబ్ నుంచి క్వాలిటీ సరి్టఫికెట్ తీసుకురావాలి. ఆ సర్టిఫికెట్తో వచ్చినా, తిరుపతిలో ప్రతి ట్యాంకర్ శాంపిల్ మూడు సార్లు టెస్ట్ చేస్తారు. అలా జూలై 6, 12 తేదీల్లో వచ్చిన ట్యాంకర్లు తిరుపతిలో చేసిన నాణ్యత పరీక్షలో ఫెయిల్ అయితే, వాటిని వెనక్కు పంపారు. అవే శాంపిల్స్‌ను ఎన్డీడీబీకి పంపిస్తే, జూలై 23న రిపోర్ట్ వచ్చింది. దాంతో ఆ ట్యాంకర్లు వెనక్కు పంపడంతో పాటు, ఆ కంపెనీ వారికి నోటీసులు కూడా ఇచ్చారు. నాణ్యత లేని నెయ్యి వాడలేదని ఈవో స్పష్టంగా చెప్పినా (ఆ వీడియోను చూపారు).. తన 100 రోజుల పాలనలో అన్ని రంగాల్లో విఫలమైన చంద్రబాబు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ.. సెపె్టంబరు 18న ఎన్డీఏ సమావేశంలో తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిపిన నెయ్యి వాడారంటూ దారుణ ఆరోపణలు చేశారు. (అందుకు సంబంధించిన వీడియో చూపుతూ) ఆ వెంటనే రెండు రోజులకు, అంటే సెప్టెంబరు 20న టీటీడీ ఈవో ఇదే విషయంపై మాట్లాడుతూ.. కల్తీ నెయ్యి ట్యాంకర్లు నాలుగింటిని వెనక్కి పంపేశామని.. ఆ నెయ్యిని లడ్డూ తయారీలో వాడనేలేదని స్పష్టం చేశారు. (ఆ వీడియోను ప్రదర్శించారు) అయినా కూడా మళ్లీ సెపె్టంబర్ 22న మాట్లాడిన చంద్రబాబు.. ఏ మాత్రం భయం, భక్తి లేకుండా తనకు రాజకీయ ఉద్దేశాలే ముఖ్యమని, స్వామి వారు అన్నా, తిరుపతి అన్నా భయం, భక్తి లేదని నిరూపిస్తూ.. తాను అంతకు ముందు చెప్పిన పచ్చి అబద్ధాలను మరోసారి వల్లె వేశారు. తిరుమలకు వచ్చిన ఆ నాలుగు ట్యాంకర్ల నెయ్యి వాడినట్లు (ఆ వీడియోను చూపుతూ) చెప్పారు. తప్పును గుడ్డిగా సమర్థి0చడం సనాతన ధర్మమా? ‘చంద్రబాబుతో పాటు నువ్వు కూడా ఆ అబద్ధాలకు రెక్కలు కట్టి ప్రచారం చేస్తున్నప్పుడు ఇంకా సనాతన ధర్మం గురించి నువ్వు ఏం మాట్లాడతావు? ఆ తప్పును గుడ్డిగా వెనకేసుకొస్తూ సనాతన ధర్మం గురించి మాట్లాడతావా? ఇది ఎంత వరకు ధర్మం’ అంటూ వైఎస్ జగన్ నిలదీశారు. తప్పు చేయలేదు కాబట్టే సాక్ష్యాధారాలతో సహా నిజాలు చెప్పగలుగుతున్నామని స్పష్టం చేశారు. ‘చంద్రబాబు మాటలకు ఆయన నియమించుకున్న టీటీడీ ఈవో చెబుతున్న మాటలకు తేడా ఏమిటో స్పష్టంగా ఆధారాలతో సహా చూపిస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానంలో దశాబ్దాలుగా అమలువుతున్న గొప్ప సంప్రదాయాలను గుర్తు చేస్తున్నాం. పటిష్టమైన వ్యవస్థను మనమే దెబ్బతీసేలా.. మనంతట మనమే మన గుడిని.. మన స్వామి వారిని.. శ్రీవారి లడ్డూ విశిష్టతను తగ్గించుకునేలా మాట్లాడి.. మనమే సనాతన ధర్మం గురించి గొప్పలు చెప్పుకోవడం ఎంత వరకు సబబు?’ అంటూ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. -
‘బాబు సిట్’ షట్టర్ క్లోజ్
సాక్షి, అమరావతి: తిరుమల లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నియమించిన ‘సిట్’ స్కిట్ బెడిసికొట్టింది. టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులతో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) షట్టర్ క్లోజ్ అయ్యింది. లడ్డూ ప్రసాదం అంశంపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించడంతో సిట్ కథ మఖలో పుట్టి పుబ్బలో ముగిసినట్లైంది. తన రాజకీయ ప్రయోజనాల కోసం శ్రీవారి ఆలయ పవిత్రత, లడ్డూ ప్రసాదం ప్రాశస్త్యానికి భంగం కలిగించేందుకు సైతం చంద్రబాబు వెనుకాడరన్న వాస్తవం జాతీయస్థాయిలో బట్టబయలైంది. కుట్ర పూరితంగానే సిట్లడ్డూ ప్రసాదంపై తన దుష్ప్రచారానికి రాజముద్ర వేసేందుకు చంద్రబాబు పక్కా పన్నాగంతోనే సిట్‌ను ఏర్పాటు చేశారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన ఈ అంశంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీతోపాటు పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు చేసిన డిమాండ్‌ను అందుకే బేఖాతర్ చేశారు. టీడీపీ వీర విధేయులతో సిట్‌ను నియమించారు. అత్యంత వివాదాస్పద అధికారి, ఇటీవల ఎన్నికల్లో టీడీపీ కూటమి అక్రమాలకు కొమ్ము కాశారని ఆరోపణలు ఎదుర్కొన్న గుంటూరు ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠిని సిట్ ఇన్చార్జ్గా నియమించడం ప్రభుత్వ పెద్దల కుట్రను బయటపెట్టింది. ఈ బృందంలో విశాఖపట్నం డీఐజీ గోపీనాథ్ జెట్టీ, కడప ఎస్పీ హర్షవర్దన్ రాజులను సభ్యులుగా నియమించారు. గోపీనాథ్ జెట్టి చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కృష్ణయ్య అల్లుడు కావడం గమనార్హం. రిటైరైన తరువాత కొన్నేళ్లు హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్‌గా వ్యవహరించిన కృష్ణయ్యను 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వంలో కీలకమైన ఏపీఐఐసీ చైర్మన్‌గా నియమించారు. ఇక 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయనకు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ పదవి కట్టబెట్టడం గమనార్హం. సిట్ ఏర్పాటు చేసిన తరువాత టీటీడీ ద్వారా తిరుపతిలోని ఈస్ట్ పోలీసు స్టేషన్లో నెయ్యిలో కల్తీపై ఫిర్యాదు చేయించడం గమనార్హం. ఆ ఫిర్యాదు చేసే ముందు రోజు రాత్రే తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ సీఐని బదిలీ చేసి ఆ స్థానంలో టీడీపీ అనుకూల పోలీసు అధికారిని నియమించడం ప్రభుత్వ కుట్రను బట్టబయలు చేసింది. అనంతరం సిట్ బృందం తిరుమల–తిరుపతిలలో రెండు రోజుల పాటు దర్యాప్తు పేరిట హడావుడి చేసింది. సుప్రీం కొరడా... సిట్ క్లోజ్లడ్డూ అంశంపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ రాజ్యసభ మాజీ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ కేసును గత నెల 30న తొలిసారి విచారించిన సమయంలోనే సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సీఎం హోదాలో ఉంటూ లడ్డూ ప్రసాదంపై నిరాధార ఆరోపణలు చేయడం ఏమిటని సీఎం చంద్రబాబును ఆక్షేపించింది. కనీసం దేవుడిని అయినా రాజకీయాలకు దూరంగా ఉంచాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. లడ్డూ ప్రసాదం అంశంపై సిట్ దర్యాప్తు సరిపోతుందా..? లేదంటే స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలా అన్నది ఆలోచిస్తామని ఆ రోజే తన ఉద్దేశాన్ని స్పష్టం చేసింది. దాంతో బెంబేలెత్తిన చంద్రబాబు ప్రభుత్వం తిరుపతిలో దర్యాప్తు నిర్వహిస్తున్న సిట్ కార్యకలాపాలను తక్షణం నిలిపివేసింది. తాజాగా శుక్రవారం ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు చంద్రబాబు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటి నిర్ణయాన్ని ప్రకటించిందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఐదుగురు సభ్యులతో కూడిన స్వతంత్ర బృందం దర్యాప్తు నిర్వíßæంచాలని ఆదేశించింది. దాంతో కుట్రపూరితంగా టీడీపీ కూటమి ప్రభుత్వం నియమించిన సిట్ కథ సమాప్తమైంది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలతో చంద్రబాబు కుట్ర బెడిసికొట్టింది. దేవ దేవుడి విశిష్టత కాపాడాలి తిరుమల లడ్డూ ప్రసాదం కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా తీర్పు వెలువరించింది. కోట్లాది మంది ప్రజల విశ్వాసాలను గౌరవిస్తూ వారికి టీటీడీపై నమ్మకం కలిగించేలా స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించింది. లడ్డూ తయారీలో కల్తీ అయిన నెయ్యి వాడినట్టు తమకు ప్రాథమిక ఆధారాలు కనిపించట్లేదని అభిప్రాయపడింది. ల్యాబ్ రిపోర్టు ఆధారంగా చేస్తున్న ఆరోపణలను తప్పుపట్టింది. ఆ రిపోర్టులో ఫాల్స్ పాజిటివ్ వచ్చే అవకాశం ఉందని చెప్పింది. సీఎం దగ్గర ఏదైనా మెటీరియల్ ఉందా? తొందరపడి ముందుగా మాట్లాడటం ఏమిటి? దేవుడిని ఎందుకు రాజకీయాల్లోకి తీసుకొస్తారని నిలదీసింది. అదే సుప్రీంకోర్టు నిజాలను నిగ్గు తేల్చేందుకు స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించడం శుభపరిణామం. ఈ క్రమంలోనే కోర్టును రాజకీయ రణరంగంగా వాడుకోవద్దని కూడా కోరింది. – ప్రొఫెసర్ నాగేశ్వర్, ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు మతాల మధ్య చిచ్చుపెడుతున్నారు ప్రజల కష్టాలను పట్టించుకోకుండా కూటమి ప్రభుత్వం మతాల మధ్య చిచ్చు పెడుతోంది. సచివాలయ, వలంటీర్ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోంది. ఇప్పుడు కొత్తగా ఊరికో మద్యం షాపును తెస్తోంది. హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి డైవర్షన్ పాలిటిక్స్‌కు తెరలేపింది. ఇందులో భాగమే శ్రీవారి లడ్డూ వివాదం. సనాతన ధర్మాన్ని ఇప్పుడు తానే కనిపెట్టినట్లు పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారు. గతంలో కులాల మధ్య చిచ్చు పెట్టింది వీళ్లే. ఇప్పుడు మతాల మధ్య చిచ్పు పెడుతున్నారు. వీరందరికీ సుప్రీంకోర్టు తీర్పు గుణపాఠం కావాలి. – గడికోట శ్రీకాంత్‌రెడ్డి, వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే దేవుడితో రాజకీయాలు సరికాదు దేశ సర్వోన్నత న్యాయ స్థానం శ్రీవారి ప్రతిష్టతను కాపాడే గొప్ప బాధ్యతను తీసుకుంది. దేవుడితో రాజకీయాలు చేయడం మంచిది కాదు. సర్వమతాలను సమానంగా గౌరవించాలి. తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో ఒక్కోసారి ఒక్కో విధంగా ఆరోపణలు వినిపించాయి. సుప్రీంకోర్టు టీటీడీపై ప్రజలకున్న విశ్వాసాన్ని కాపాడేందుకు స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించింది. దీనిని ప్రతి ఒక్కరూ గౌరవించాలి. – వేముల హజరత్తయ్య గుప్త, న్యాయవాది కోర్టు తీర్పు గుణపాఠం కావాలిపవిత్రమైన తిరుమల లడ్డూ వ్యవహారంలో సుప్రీం తీర్పు అవకాశవాదులకు గుణపాఠం కావాలి. తిరుమల లడ్డూ కల్తీ అయిందని సరైన ఆధారాలతో నిర్ధారించకుండానే భక్తుల మనోభావాలను ప్రభావితం చేసేలా రాజకీయ పార్టీ నేతలు మాట్లాడటం తగదు. దీనిని దేశంలోని అన్ని హైందవ మఠాలు, పీఠాధిపతులు ముక్తకంఠంతో ఖండించాలి. సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో లడ్డూ వ్యవహారంపై దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు తీర్పునివ్వడం హర్షణీయం. టీటీడీ పాలక మండలిలో రాజకీయేతర వ్యక్తులను నియమించాలి. – బ్రహ్మశ్రీ అనిపెద్ది వెంకట నరసింహ శర్మ మూర్తి, కాణ్వ విద్యా పీఠాధిపతి -
‘బాబు సిట్’ను పక్కన పెట్టిన ‘సుప్రీం..’ ఇక 'సీబీఐ సిట్'
ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రజల మనోభావాలు ముడిపడి ఉన్నందున తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై స్వతంత్ర, నిష్పాక్షిక దర్యాప్తు అవసరం. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ స్థానంలో ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసేందుకు ఓ స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో సీబీఐ డైరెక్టర్ నామినేట్ చేసిన ఇద్దరు సీనియర్ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసిన ఇద్దరు సీనియర్ పోలీసు అధికారులు, ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) చైర్పర్సన్ నామినేట్ చేసిన ఓ అధికారి ఉంటారు. ఈ సిట్ దర్యాప్తును సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షించాలి. ఈ మొత్తం వ్యవహారాన్ని ఎంతమాత్రం రాజకీయ డ్రామాగా మారనివ్వబోం. రాజకీయ పోరాటాలకు న్యాయస్థానాన్ని వేదిక కానివ్వబోము.– సుప్రీంకోర్టు సాక్షి, అమరావతి: తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ జరిగిందన్న ఆరోపణలపై విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రజల మనోభావాలు ముడిపడి ఉన్నందున ఈ వ్యవహారంపై స్వతంత్ర, నిష్పాక్షిక దర్యాప్తు అవసరమని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. తద్వారా దర్యాప్తు విశ్వసనీయత పెరుగుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ స్థానంలో ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసేందుకు తామే ఓ స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సిట్‌లో సీబీఐ డైరెక్టర్ నామినేట్ చేసిన ఇద్దరు సీనియర్ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసిన ఇద్దరు సీనియర్ పోలీసు అధికారులు, ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) చైర్పర్సన్ నామినేట్ చేసిన ఓ అధికారికి స్థానం కల్పించింది. ఈ సిట్ దర్యాప్తును స్వయంగా పర్యవేక్షించాలని సీబీఐ డైరెక్టర్‌ను ఆదేశించింది. ఈ మొత్తం వ్యవహారాన్ని ఎంతమాత్రం రాజకీయ డ్రామాగా మారనివ్వబోమంది. రాజకీయ పోరాటాలకు న్యాయస్థానాన్ని వేదిక కానివ్వబోమని తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్, జస్టిస్ కల్పతి వెంకటరామన్ విశ్వనాథన్ ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులతో నెయ్యి కల్తీపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలను పరిÙ్కరిస్తున్నట్లు ప్రకటించింది. స్వతంత్ర దర్యాప్తు కోసం వైవీ తదితరుల పిటిషన్లు... తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతు కొవ్వులను కలిపారన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపణలపై వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఓ కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ బీజేపీ సీనియర్ నేత, ప్రముఖ ఆర్థికవేత డాక్టర్ సుబ్రమణియన్ స్వామి ఇటీవల సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. అలాగే లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారంలో దర్యాప్తు, స్వతంత్ర విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తిని నియమించాలని కోరుతూ రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్సీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి కూడా పిల్ దాఖలు చేశారు. ఇదే అంశంపై ఇతర రాష్ట్రాలకు చెందిన సంపత్, శ్రీధర్, సురేష్ చవంకే వేర్వేరుగా రెండు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ నాలుగు వ్యాజ్యాలపై ఇటీవల విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. నెయ్యిలో జంతు కొవ్వులు కలిపారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన రాజకీయ ప్రకటనలపై అసహనం వ్యక్తం చేసింది. శ్రీవారి లడ్డూ నెయ్యిలో జంతు కొవ్వులు కలిశాయనేందుకు ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ను కొనసాగించాలా?లేక స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలా అనే విషయంపై కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి చెప్పాలని సొలిసిటర్ జనరల్ (ఎస్జీ) తుషార్ మెహతాను ఆదేశించిన విషయం తెలిసిందే. పత్రికా కథనాలను పట్టించుకోకండి.... తాజాగా శుక్రవారం ఈ వ్యాజ్యాలు మరోసారి విచారణకు వచ్చాయి. ఈ సందర్భంగా తుషార్ మెహతా స్పందిస్తూ.. ఇది దేశవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల మనోభావాలకు సంబంధించిన వ్యవహారమని పేర్కొనగా.. ధర్మాసనం స్పందిస్తూ, దేశం కాదని.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాలకు సంబంధించిందని తెలిపింది. ఈ వ్యవహారంలో ఆహార భద్రత కూడా ముడిపడి ఉందని ధర్మాసనం పేర్కొంది. తాము రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌కు వ్యతిరేకం కాదని, అయితే కేంద్ర ప్రభుత్వానికి చెందిన అధికారుల పర్యవేక్షణలో దర్యాప్తు జరగడం సబబుగా ఉంటుందని మెహతా చెప్పారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. స్వతంత్ర సంస్థ ద్వారా దర్యాప్తు చేయిస్తే అభ్యంతరం లేదని ముఖ్యమంత్రి చెప్పినట్లు తాము పత్రికల్లో చదివామని గుర్తు చేసింది. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, టీటీడీ తరఫు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా జోక్యం చేసుకుంటూ పత్రికలు చాలా రాస్తున్నాయని, వాటిని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. టీటీడీ ఈవో చెప్పిన వాస్తవాలను వక్రీకరించాయని లూథ్రా తెలిపారు. దర్యాప్తు విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, దాన్ని కోర్టు పర్యవేక్షించినా కూడా ఇబ్బంది లేదని నివేదించారు. సీఎం వ్యాఖ్యలతో సిట్ దర్యాప్తు నిష్పాక్షికంగా జరిగే అవకాశమే లేదు... ఈ సమయంలో వైవీ సుబ్బారెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ జోక్యం చేసుకుంటూ.. ముఖ్యమంత్రి వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ దర్యాప్తు నిష్పాక్షికంగా ఉండేందుకు అవకాశం లేదన్నారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు భిన్నంగా సిట్ దర్యాప్తు ఉండబోదని తెలిపారు. ముఖ్యమంత్రి చేసిన ప్రకటనలకు ఓ విలువ ఉంటుందన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలు ఖచ్చితంగా సిట్ దర్యాప్తుపై ప్రభావం చూపుతాయన్నారు. ఈ సమయంలో ముకుల్ రోహత్గీ జోక్యం చేసుకుంటూ 100 రోజుల పాలనపై ముఖ్యమంత్రి మాట్లాడారని చెప్పారు. ఆయన మాట్లాడిన సందర్భం వేరన్నారు. నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (ఎన్డీడీబీ) జూలైలో నివేదిక ఇచ్చిందన్నారు. దాని ఆధారంగా ముఖ్యమంత్రి మాట్లాడారని తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. జూలైలో నివేదిక వస్తే ముఖ్యమంత్రి సెపె్టంబర్లో ఎందుకు మాట్లాడారని ప్రశ్నించింది. ఆరోపణలు చాలా తీవ్రమైనవని, అందులో ఎలాంటి సందేహం లేదని వ్యాఖ్యానించింది. దీనిపై సిబల్ జోక్యం చేసుకుంటూ.. ఎన్డీడీబీ తన నివేదికలో ఎక్కడా జంతు కొవ్వు కలిసినట్లు చెప్పలేదని, వెజిటబుల్ ఫ్యాట్ మాత్రమే ఉన్నట్లు చెప్పిందని నివేదించారు. అయితే ఇందుకు విరుద్ధంగా జంతు కొవ్వు అంటూ ముఖ్యమంత్రి రాజకీయ ప్రకటనలు చేశారన్నారు. ఈ నేపథ్యంలో స్వతంత్ర దర్యాప్తు అవసరం ఎంతైనా ఉందని, ఆ దిశగా ఆదేశాలు జారీ చేయాలని ధర్మాసనాన్ని కోరారు. కల్తీ నెయ్యిని కొండపైకి ఎందుకు అనుమతించారు..? అనంతరం ధర్మాసనం స్పందిస్తూ.. జూలై 6, 12వ తేదీల్లో వచ్చిన ట్యాంకులను వెనక్కి పంపామని, ఆ నెయ్యిని లడ్డూ తయారీలో అసలు ఉపయోగించలేదని టీటీడీ ఈవో పలుమార్లు చెప్పారని గుర్తు చేసింది. మరి అలాంటప్పుడు కల్తీ జరిగిందని దేని ఆధారంగా చెబుతున్నారని ప్రశ్నించింది. ఆ రెండు తేదీల్లో వచ్చిన ట్యాంకర్లలో కల్తీ నెయ్యి ఉందని లూథ్రా పేర్కొనగా.. అలాంటప్పుడు కల్తీ నెయ్యిని కొండపైకి ఎందుకు అనుమతించారని సిబల్ ప్రశ్నించారు. అప్పుడు అధికారంలో ఉన్నది తాము కాదని, మీరేనని ఆయన లూథ్రాకు గుర్తు చేశారు. దీనిపై ధర్మాసనం జోక్యం చేసుకుంటూ స్వతంత్ర దర్యాప్తు అవసరమని, తద్వారా కోట్ల మంది భక్తుల్లో విశ్వాసం కలిగించినట్లు అవుతుందని తెలిపింది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ను పక్కనబెట్టి తామే ప్రత్యేక సిట్‌ను ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేస్తూ ఆ మేరకు ఉత్తర్వులు వెలువరించింది. రాజకీయ పోరాటాలకు వేదికగా చేసుకునేందుకు అనుమతించం... ‘మేం ఆరోపణలు, ప్రత్యారోపణల జోలికి వెళ్లడం లేదు. ఇక్కడ మేం ఓ విషయం స్పష్టంగా చెప్పదలచుకున్నాం. కోర్టును రాజకీయ పోరాటాలకు వేదికగా వాడుకునేందుకు అనుమతించం. కోట్ల మంది భక్తుల మనోభావాలను పరిగణలోకి తీసుకుంటూ.. వారికి ఉపశమనం కలిగించేందుకు వీలుగా సీబీఐ, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారులతో కూడిన స్వతంత్ర సిట్‌ను దర్యాప్తు నిమిత్తం ఏర్పాటు చేస్తున్నాం. ఈ ప్రత్యేక సిట్ దర్యాప్తు సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో జరగాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ స్థానంలో సీబీఐ డైరెక్టర్ నామినేట్ చేసిన ఇద్దరు సీబీఐ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసిన ఇద్దరు పోలీసు అధికారులు, ఎఫ్ఎస్ఎస్ఏఐ చైర్పర్సన్ సిఫారసు చేసిన ఓ అధికారి ప్రత్యేక సిట్‌లో ఉంటారు’ ధర్మాసనం ఉత్తర్వుల సారాంశం ఇదీ..‘జూలై 6, 12వ తేదీల్లో రెండు ట్యాంకర్లలో సరఫరా చేసిన నెయ్యి కల్తీ అయినట్లు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లోని ఆరోపణల ప్రకారం కల్తీ అయిన నెయ్యిని లడ్డూ ప్రసాదంలో వినియోగించినట్లు చెప్పారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది భక్తుల మనసులను గాయపరిచినట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. నెయ్యి కల్తీపై దర్యాప్తు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ను కొనసాగించాలా? లేక స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలా? అనే విషయంపై కేంద్ర హోంశాఖతో సంప్రదించి ఏ విషయం మాకు చెప్పాలని గత విచారణ సమయంలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను కోరాం. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌లోని సభ్యులు సీనియర్ అధికారులని, వారికి మంచి పేరు ఉందని మెహతా ఈ రోజు మాకు చెప్పారు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ద్వారా దర్యాప్తును కొనసాగించాలని, అయితే ఆ దర్యాప్తును కేంద్ర ప్రభుత్వ అధికారులు పర్యవేక్షిస్తారని ఆయన మాకు నివేదించారు’ -
సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి, ఎమ్మెల్యేపై ఫిర్యాదు
అవనిగడ్డ: తిరుపతి వెంకటేశ్వరస్వామి లడ్డూ వ్యవహారంలో భక్తుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిన సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి, అవనిగడ్డ ఎమ్మెల్యే, తెలంగాణ బీజేపీ నేత మాధవీలతపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ కృష్ణాజిల్లా అవనిగడ్డలోని ఏడో వార్డుకు చెందిన న్యాయ విద్యార్థి బడే గౌతమ్ అవనిగడ్డ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమది హిందూ కుటుంబమని, తరచూ తిరుపతి వెళ్లి స్వామిని దర్శించుకుని లడ్డూ ప్రసాదాలు స్వీకరిస్తామని చెప్పారు. ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేకుండా సీఎం స్థాయిలో ఉన్న చంద్రబాబు లడ్డూలో పందికొవ్వు కలిసిందని ఆరోపించడం తగదన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హిందువులను రెచ్చగొట్టేలా ప్రసంగించారని, హోంమంత్రి వంగలపూడి అనిత, తెలంగాణ బీజేపీ నేత మాధవీలత లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిపారని మీడియో ముందు మాట్లాడారని, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ లడ్డూలో కల్తీ జరిగిందని దేవాలయాల్లో పూజలు చేయించారని చెప్పారు. హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించడంతో పాటు చట్టవ్యతిరేక విధానాలు అవలంబించిన వీరందరిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నట్టు గౌతమ్ చెప్పారు. -
అది ముమ్మాటికీ చెంప దెబ్బే!
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారత దేశ ప్రజలు అత్యంత పవిత్రంగా భావించే తిరుమల తిరు పతి దేవస్థానం లడ్డూ ప్రసాదంపై సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు ధర్మం నాలుగు పాదాల నడుస్తు న్నదని చెప్పడానికి నిదర్శ నంగా నిలిచాయి. సుప్రీం వ్యాఖ్యలు ముమ్మాటికీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలకు చెంపపెట్టు లాంటివే. ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి నిజం చేయాలంటే కుదరదని సుప్రీం వ్యాఖ్యలు రుజువు చేశాయి. ఇక ప్రాయశ్చిత్త దీక్ష నాటకాలు అన్నీ వట్టివేనని కుండబద్దలు కొట్టినట్లయింది. కల్తీ నెయ్యి జరిగినట్లు సాక్ష్యాలు లేవన్న సుప్రీం... సిట్ విచారణ ఎందుకంటూ నిలదీసింది. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై వేసిన నిందారోపణలన్నీ అసత్యాలని ప్రజలకు అర్థమైంది. ఒక వ్యక్తిని రాజకీయంగా హత్య చేసేందుకు పరమ పవిత్రమైన ఏడు కొండల వాడిని వాడుకున్న నీచ రాజకీయం ‘చంద్రబాబు అండ్ కో’దని అందరికీ అర్థమైంది.సెప్టెంబరు 18న ఏపీ సీఎం చంద్రబాబు లడ్డూ ప్రసాదంపై చేసిన వ్యాఖ్యలు రోజుకో మలుపు తిరుగుతూ వస్తున్నాయి. నిజంగా జంతువుల కొవ్వు కలిపి ఉంటే∙ప్రసాదం నిల్వ ఉండదనీ, వెంటనే పాడైపోవడం, వాసన రావడం... ఇలా అనేక సమస్యలు ఎదురవుతాయని నిపుణులు పదే పదే చెబుతూ వచ్చారు. అదీకాకుండా అసలు ఈ తతంగమంతా చంద్రబాబు పాలనా పగ్గాలు చేపట్టాకే జరిగింది. దానిని వదిలేసి అదేదో జగన్ హయాంలో జరిగిందంటూ మసిపూసి మారేడుకాయను చేసే ప్రక్రియను తలకెత్తుకున్న చంద్రబాబు తలదించుకొనేలా సుప్రీం వ్యాఖ్యలు చేసింది. అసలు కల్తీ జరిగింది అనడానికి ఆధారా లెక్కడున్నాయంటూ ప్రశ్నించింది. ఇప్పుడు దీనికి చంద్రబాబు ప్రజలకు ఏం సమాధానం చెబుతారో చూడాలి.ఒక బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ప్రపంచ దేశాల్లో భక్తులు కలిగిన తిరుమల తిరుపతి దేవస్థానంపైన, ఆల య ప్రతిష్ఠపైన, లడ్డూ ప్రసాదం చరిత్రపైన మాయని మచ్చ వేయగలిగారు. ఆయన వ్యాఖ్యలు నిజమా, కాదా అని తెలుసుకోకుండా జనసేనాని పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష పేరుతో హడావిడి చేశారు. జనాన్ని నమ్మించేందుకు దుర్గమ్మ గుడికి వెళ్లి మెట్లపూజ చేశారు. చంద్రబాబు రాజకీయ వ్యూహంలో బలైపోయారు. వాస్తవానికి జనసేనాని ఈ వ్యాఖ్యలు చేయలేదు. చేసింది చంద్రబాబు. కానీ, ప్రజల్లో గందరగోళాన్ని సృష్టించ డానికి కారకులైంది పవన్. ఇప్పుడు పవన్ ప్రజలకు సమాధానం చెప్పుకునేందుకు ఏం చేయా లన్నదానిపై మల్లగుల్లాలు పడాల్సిన దుఃస్థితి నెలకొంది. ఇప్పటికైనా పవన్ తొందరపడకుండా నింపాదిగా రాజకీయాలు చేస్తేనే చంద్రబాబు వ్యూహాల నుండి తప్పించుకుని తనదైన శైలిలో తన అభిమానుల మనసులో ముద్ర వేసుకో గలుగుతారు. ఇక బీజేపీ పెద్దలు అచ్చంగా చంద్ర బాబు మౌత్ పీస్‌లుగా మారినట్లు కనిపించింది.ఆ పార్టీ ఏపీ అధ్యక్షురాలిగా ఉన్న పురంధేశ్వరి భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశంపై స్పందించిన తీరు ఆ పార్టీ నేతలనే ఆశ్చర్యానికి గురిచేసింది. హిందూ ధర్మ పరిరక్షణకు బీజేపీ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందంటూ చెబుతూనే, లడ్డూలో వాడిన నెయ్యి కల్తీ జరిగిందంటూ వ్యాఖ్యానించారు. దీనికి ఆ పార్టీ నేతలు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలవడం అనేది ఏ విధంగానూ జరిగే అవకాశం లేదు. పాలకులు ఎవరున్నా అంతటి నీచ పరిస్థితికి దిగజారే అవకాశాలు ఉండవు. చంద్రబాబు మూడుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా నాణ్యత లేని నెయ్యి ట్యాంకర్లను వెనక్కు పంపిన దాఖలాలు ఉన్నాయి కదా! కేవలం 2014–19 మధ్యే ఆయన హయాంలో 14 సార్లు వెనక్కు పంపారు కదా! అంతమాత్రం చేత చంద్రబాబు హయాంలో జంతు కొవ్వు కలిపిన లడ్డూలు తయారైనట్లు భావించాలా? ఇది ఏమాత్రం సహేతుకం?ముస్లింలకు 4 శాతం ఉన్న రిజర్వేషన్లు రద్దుచేస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ముస్లిం ఓటు బ్యాంకుకు పూర్తిగా దూరమైనట్లు చంద్రబాబు గ్రహించి ఈ కుట్రకు తెరలేపినట్లు కనిపిస్తోంది. దీనివల్ల హిందువుల ఓట్లను కన్సాలిడేట్ చేసుకోవచ్చని ఆయన భావించి ఉంటారని అనుకోవాల్సి వస్తోంది. లేకపోతే ఆ నివేదికను ఒక రాజకీయ వేదిక మీద ఎందుకు చంద్రబాబు చదువుతారన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.తమ ఇలవేల్పు అయిన వేంకటేశ్వరుని లడ్డూ ప్రసాదం కల్తీ జరిగింది అంటే ఎవరికైనా ఇట్టే ఆగ్రహావేశాలు వస్తాయి. ఇక్కడ కూడా అదే జరిగింది. కానీ, జగన్ ప్రధానికి లేఖ రాయడం, సీజేఐకి కూడా రాస్తానని చెప్పడం, నేషనల్ మీడియాకు వాస్తవాలు వివరించడం, సుబ్బారెడ్డి లాంటి వారు సుప్రీం కోర్టులో వ్యాజ్యం దాఖలు చేయడం, కరుణాకర్ రెడ్డి లాంటి వారు ప్రమాణాలు చేయడం ఇలా అనేకానేక కార్య క్రమాల నేపథ్యంలో సామాన్య మానవుల్లో ఆలో చన రేకెత్తింది. కల్తీ జరిగిందని తిరస్కరించిన నెయ్యి ట్యాంకర్లు 2024 జూలై 12న తిరుమలకు వచ్చాయి. ఆ ట్యాంకర్లలోని నెయ్యిని లడ్డూ తయారీలో వాడలేదు. ఏది ఏమైనప్పటికీ తిరుమల లడ్డూ ప్రసాదం అంశంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఇప్పుడు సామన్య జనాల్లో పెద్ద ఎత్తున చర్చ నీయాంశంగా మారాయి. నిజానిజాలు నిగ్గు తేల్చేలా సీబీఐతో విచారణ చేయించాలని సుప్రీం కోర్టు ఆదేశిస్తే ప్రజలు స్వాగతిస్తారు. దేశ ప్రధాని కూడా ఈ అంశం మీద నోరు విప్పాలి. ప్రజల్లో దెబ్బతిన్న మనోభావాలను తిరిగి ప్రతిష్ఠించేలా చర్యలు తీసుకోవాలి.పూనూరు గౌతమ్ రెడ్డి వ్యాసకర్త ఏపీ అధ్యక్షులు,వైయస్సార్ టీయూసీ -
దీని అర్థం ఏంటి బాబూ?: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: రాజకీయ దుర్బుద్ధితో పరమ పవిత్రమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంపై పచ్చి అబద్ధాలు వల్లె వేసి అపవిత్రం చేస్తూ.. తన తిరుమల పర్యటనపై అవాస్తవాలు చెబుతూ దబాయిస్తున్న సీఎం చంద్రబాబు తీరును ఆదివారం ‘ఎక్స్’ వేదికగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎండగట్టారు. ‘నీకు నోటీసు ఇచ్చారా? తిరుమలకు పోవద్దాన్నారా? వేంకటేశ్వరస్వామి గుడికి పోనివ్వబోమని ఎవరైనా చెప్పారా...’ అంటూ శుక్రవారం సీఎం చంద్రబాబు పచ్చి అబద్ధాలను వల్లె వేశారు. మాజీ సీఎం జగన్ తిరుపతి, తిరుమల పర్యటనకు అనుమతి లేదని.. ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ వైఎస్సార్సీపీ నేతలకు శుక్రవారం నోటీసులు ఇచ్చారు. శుక్రవారం సీఎం చంద్రబాబు మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోనూ.. వైఎస్సార్సీపీ నేతలకు పోలీసులు జారీ చేసిన నోటీసులను జత చేస్తూ ‘దీని అర్థం ఏంటి బాబూ?.. దీని కన్నా వేరే సాక్ష్యం కావాలా? సత్యమేవ జయతే’ అంటూ మాజీ సీఎం వైఎస్ జగన్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. స్వార్థ రాజకీయాల కోసం తిరుమల పవిత్రతను దెబ్బతీస్తావా? పరమ పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో స్వచ్ఛమైన ఆవు నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు వాడారంటూ చంద్రబాబు చెబుతోన్న మాటల్లో వీసమెత్తు నిజం లేదంటూ సాక్ష్యాధారాలతో సహా మాజీ సీఎం వైఎస్ జగన్ వివరించారు. జూలై 23న టీటీడీ ఈవో.. సెప్టెంబరు 18న సీఎం చంద్రబాబు.. సెప్టెంబరు 20న టీటీడీ ఈవో.. సెప్టెంబరు 22న సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోలను.. సెప్టెంబరు 27న తాను మీడియాతో మాట్లాడిన మాటల వీడియోలను జత చేసి.. దీని అర్థం ఏంటి బాబూ? దీని కన్నా వేరే సాక్ష్యం కావాలా? సత్యమేవ జయతే అంటూ ‘ఎక్స్’లో వైఎస్ జగన్ పోస్టు చేశారు. వనస్పతి కలిసింది.. ట్యాంకర్లు రిజెక్ట్ చేశాం శాంపిళ్లలో కల్తీ జరిగిందని తేలింది. అందులో వెజిటబుల్ ఫ్యాట్ అంటే వనస్పతి కలిసిందని తేలింది. ఆ సప్లయిర్‌ను బ్లాక్ లిస్ట్ చేసేందుకు షోకాజ్ నోటీసు ఇచ్చాం. రెండు ట్యాంకర్లను రిజెక్ట్ చేశాం – జూలై 23న టీటీడీ ఈవో శ్యామలరావు కల్తీ బాబు సృష్టి.. శ్రీ వేంకటేశ్వరస్వామి దగ్గర పెట్టే ప్రసాదాన్ని అపవిత్రం చేసే విధంగా నాసిరకమైన ముడిసరుకులు వాడారు. లడ్డూ తయారీలో నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారు. – సెప్టెంబరు 18న సీఎం చంద్రబాబు నాలుగు ట్యాంకర్లు వెనక్కి పంపాం కల్తీ నెయ్యి అని రిపోర్టులో తేలడంతో నాలుగు ట్యాంకర్ల నెయ్యిని రిజెక్ట్ చేశాం. నాలుగు ల్యాంకర్లను వెనక్కి పంపాం. ఆ సంస్థ నుంచి సరఫరాను నిలిపేశాం. – సెప్టెంబరు 20న టీటీడీ ఈవో శ్యామలరావు బాబు నోట మళ్లీ అవే కల్తీ మాటలు నాలుగు ట్యాంకర్లు అప్పటికే వచ్చేశాయి. వాటిలోని కల్తీ నెయ్యిని వాడారు. – సెప్టెంబరు 22న సీఎం చంద్రబాబు తిరుమల లడ్డూ పవిత్రతను దెబ్బతీసిన చంద్రబాబు పచ్చి అబద్ధాలు వల్లె వేసి తిరుమల, తిరుపతి దేవస్థానం ప్రతిష్టను సీఎం చంద్రబాబు అబాసుపాలు చేశారు. పరమ పవిత్రమైన లడ్డూ విశిష్టతకు దెబ్బతీశారు. శ్రీవారి ప్రసాదం బాగాలేదని, తింటే మంచిది కాదని భక్తుల్లో అనుమానపు బీజాలు నాటారు. తాను చెబుతున్నది పచ్చి అబద్ధమని తెలిసి కూడా చంద్రబాబు పదే పదే అవాస్తవాలు చెబుతున్నారు. – సెప్టెంబరు 27న మాజీ సీఎం వైఎస్ జగన్ నేడు తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ – విచారణ జరపనున్న జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిపారన్న సీఎం చంద్రబాబు ఆరోపణలపై వాస్తవాలు నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ ఏర్పాటు చేయాలని బీజేపీ సీనియర్ నేత సుబ్రమణియన్‌స్వామి, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సహా పలువురు పిటిషన్లు వేశారు. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో స్వతంత్ర దర్యాప్తు జరపాలని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అభ్యర్ధించారు. ఎన్డీడీబీ ల్యాబ్ నివేదికపై ఫోరెన్సిక్ ఆడిట్ జరపాలని విన్నవించారు. ఈ కేసులో సుబ్రమణియన్‌స్వామి స్వయంగా వాదనలు వినిపించనున్నారు. తిరస్కరించిన నెయ్యిని ప్రసాదంలో వాడలేదని స్వయంగా ఈవో చెప్పిన విషయాలను సుప్రీంకోర్టు దృష్టికి పిటిషనర్లు తీసుకెళ్లారు. తిరస్కరించిన నెయ్యిని వాడనప్పుడు లడ్డూ అపవిత్రత ఎందుకైంది, ల్యాబ్ రిపోర్టు తయారీ వెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయా? అనేది కూడా తేల్చాలని పిటిషన్లో విన్నవించారు. నిరాధారమైన తప్పుడు ఆరోపణలతో శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని వివరించారు. ఎస్వోపీ ప్రకారం పరీక్షల్లో ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న నెయ్యిని మాత్రమే తిరుమల ప్రసాదానికి వినియోగించే విధానం దశాబ్దాలుగా కొనసాగుతోందని, ఏదో ఒక చిన్న రిపోర్టును ఆధారంగా చేసుకుని కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని పేర్కొన్నారు. అందుకే సుప్రీంకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని పిటిషనర్లు అభ్యర్ధించారు. -
దేవదేవుడి మీదే కుట్రలు చేసిన నీచుడిగా చరిత్రకెక్కిన చంబాసురుడు
-
ఆత్మరక్షణలో చంద్రబాబు
సాక్షి, అమరావతి: కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వరస్వామిని అడ్డుపెట్టుకుని రాజకీయ లబ్ధి పొందడానికి విఫలయత్నం చేసి అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడ్డారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జరగని కల్తీని జరిగిందని చెబుతూ పెద్ద కుట్రకు తెరతీసి చివరికి ప్రజల ముందు దోషిగా నిలబడ్డారు. ఈ క్రమంలో ఒక తప్పు నుంచి బయట పడేందుకు మరో తప్పు చేస్తూ ఆయన వివాదాల ఊబిలో చిక్కుకుపోయారు. ఇప్పుడు బయటపడడానికి నానాతంటాలు పడుతున్నారు. విజయవాడ వరద విపత్తును ఎదుర్కోవడంలో ఘోర వైఫల్యం చెందడం, తన వంద రోజుల పాలనా వైఫల్యాలపై ప్రజల్లో చర్చ జరగకుండా ఉండేందుకు ఆయన తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందనే దారుణమైన అబద్ధాన్ని తెరపైకి తీసుకువచ్చారు. వైఎస్సార్సీపీ హయాంలో లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేశారని ఈనెల 18న ఆరోపించి ఆ దేవదేవుడినే తన కుట్రలోకి లాగారు. కానీ, జగన్మోహన్రెడ్డి ఆధారసహితంగా వాస్తవాలన్నీ వెల్లడిస్తుండడంతో చంద్రబాబు ఇరుకునపడ్డారు. పదిరోజులుగా జరిపిన డైవర్షన్ పాలిటిక్స్ చెల్లుబాటు కాకపోవడంతో చంద్రబాబు దిక్కుతోచని స్థితికి చేరుకున్నారు.సమాధానం చెప్పలేక చేతులెత్తేసిన బాబు» స్వామివారి లడ్డూ ప్రసాదం విషయంలో శుక్రవారం మాజీ సీఎం జగన్ లేవనెత్తిన ఏ ఒక్క ప్రశ్నకు సీఎం హోదాలో చంద్రబాబు సమాధానాలు చెప్పలేక చేతులెత్తేశారు.» ‘చంద్రబాబు హయాంలో 2015లో ఆవు నెయ్యి కిలో రూ. 276కు. 2019 జనవరిలో రూ. 324కు కొన్నారు. మరి ఇప్పుడు రూ. 320కు కొంటే తప్పేంటి? టెండర్లలో ఎల్1 కింద ఎవరొస్తే వారికి కాంట్రాక్టు ఇచ్చారు. ఇది గతంలోనూ జరిగిందే’ అని మాజీ సీఎం జగన్ నిలదీస్తే.. సీఎం చంద్రబాబు మాత్రం ఎక్కువ మంది వ్యాపారులు వచ్చేలా టెండర్ల నిబంధనలు మార్చేశారని, అందుకే తక్కువ రేటుకు కొంటున్నారని చెప్పుకొచ్చారు.» ‘లడ్డూలో కల్తీ నెయ్యి వాడారనే వ్యవహారం మొత్తం చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే జరిగింది కదా? వచ్చిన ట్యాంకర్లలో నాలుగు ట్యాంకర్లు ల్యాబ్ రిపోర్టులో పాస్ అయ్యాయి. మరో నాలుగు రిజెక్ట్ కావడంతో వెనక్కి పంపించేశారు. అసలు వాడని నెయ్యితో.. లడ్డూ ఎలా తయారైంది’ అన్న జగన్ ప్రశ్నకు చంద్రబాబు దగ్గర సరైన సమాధానం లేదు.» ‘ప్రశాంతంగా ఉన్న తిరుమలలో ఘర్షణలను ప్రోత్సహించేందుకు చంద్రబాబు ప్లాన్ వేశారు. నేను దర్శనానికి వెళ్తుంటే పోలీసులను ఎందుకు మోహరించడం’ అని ప్రశ్నిస్తే.. తిరుమలకు వెళ్లొద్దని ఎవ్వరూ చెప్పట్లే, ర్యాలీలు, జన సమీకరణలు చేయొద్దని మాత్రమే చెప్పామంటూ దాటవేత ధోరణి ప్రదర్శించారు.తిరుమలలో అకస్మాత్తుగా డిక్లరేషన్ ఫ్లెక్సీలు!» వైఎస్ జగన్ పర్యటన వాయిదా పడటంతో తొలగింపు » కూటమి నేతల సూచనతో టీటీడీ ఇలా చేయడం సరికాదంటున్న భక్తులు » రాజకీయాల్లో టీటీడీ పావుగా మారకూడదని సూచనతిరుమల: ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన తిరుమలను టీటీడీ రాజకీయ పునరావాస కేంద్రంగా మారుస్తోంది. రాజకీయ నాయకులు చెప్పిందల్లా చేస్తూ భక్తుల మనోభావాలతో చెలగాటమాడుతోంది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తున్నారని తెలుసుకొని టీటీడీ హుటాహుటిన శుక్రవారం మధ్యాహ్నం తిరుమలలో హైందవేతరుల ఆలయ ప్రవేశానికి సంబంధించిన డిక్లరేషన్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. అయితే వైఎస్ జగన్ పర్యటన వాయిదా పడటంతో కొద్ది సేపటికే ఆ ఫ్లెక్సీలు తొలగించింది. వాటిని చూసిన భక్తులు.. రాజకీయాల కోసం తిరుమలను కూడా వాడుకుంటున్నారా అని ఆశ్చర్యపోయారు. ఇన్ని రోజులు లేని డిక్లరేషన్ సూచిక బోర్డులు అకస్మాత్తుగా ప్రత్యక్షమవడంతో వైఎస్ జగన్ పర్యటన వల్లే ఏర్పాటు చేశారని చెబుతున్నారు. ఇలా ఒక్కరి కోసం ప్రత్యేకంగా ఫ్లెక్సీలు పెట్టడం సరికాదని మండిపడుతున్నారు. టీటీడీ అధికారులు కూడా రాజకీయాల్లో పావులుగా మారడం బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, కూటమి నేతల సూచన మేరకే టీటీడీ అధికారులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద, ఏటీసీ కూడలి వద్ద రాత్రికి రాత్రి తయారు చేయించి డిక్లరేషన్ ఫ్లెక్సీ బోర్డులు ఏర్పాటు చేశారు. మతం పేరుతో టీటీడీని సైతం కూటమి నాయకులు రాజకీయంగా వాడుకోవడం కూడా సరికాదని భక్తులు విమర్శిస్తున్నారు. హిందుత్వం ముసుగులో మత విద్వేషాలు రెచ్చగొట్టేలా కూటమి పార్టీల నాయకులు, కొందరు స్వామీజీలు మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు. -
వాడని నెయ్యి.. తయారు కాని లడ్డూ.. జరగని తప్పుపై ‘పచ్చ’గోల
సాక్షి, అమరావతి: తన వంద రోజుల పాలనపై ప్రజలు ఆగ్రహంగా ఉండటంతో ఆ వ్యవహారం నుంచి వారి దృష్టి మళ్లించడానికే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పవిత్రతను, ప్రతిష్టను కోలుకోలేని విధంగా దెబ్బ తీస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దుష్ప్రచారం చేస్తున్నారని సర్వత్రా అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కల్తీ అయిందని చంద్రబాబు చెబుతున్న నెయ్యిని అసలు వాడనప్పుడు లడ్డూ ఏ విధంగా కల్తీ అవుతుందని.. ఈ లెక్కన ఏ విధంగా అపచారం జరిగిందన్న ప్రశ్నకు చంద్రబాబు అండ్ గ్యాంగ్ నుంచి సమాధానం లేదు. ఆ నాలుగు ట్యాంకర్ల నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్ మూలాలున్నాయని గుర్తించిన వెంటనే.. ఆ ట్యాంకర్లను వెనక్కు పంపించామని, ఆ నెయ్యిని వాడనే లేదని టీటీడీ ఈవో శ్యామలరావు మీడియా సమక్షంలో స్పష్టంగా ప్రకటించారు. ఆ ట్యాంకర్లు కనీసం టీటీడీ గోడౌన్ వరకు కూడా రాలేదని స్పష్టం చేశారు. ఇవన్నీ తలకెక్కించుకోని ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఈ వ్యవహారానికి రాజకీయ రంగు పులిమి రాద్ధాంతం చేయడం ద్వారా లబ్ధి పొందాలని కుట్ర పన్నారు. ఆ వెంటనే తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ అయిందని నింపాదిగా ప్రకటించారు. జంతువుల కొవ్వు కలిసిన నెయ్యితో లడ్డూలు తయారు చేశారని పచ్చిగా అబద్ధం చెప్పారు. ఇందుకు కారణం గత ప్రభుత్వమేనని నింద మోపుతూ దుష్ప్రచారం ప్రారంభించారు. ఆ వెంటనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్, ఎల్లో గ్యాంగ్ ఇదే పాటను అందుకున్నారు. అసలు కల్తీ నెయ్యిని వాడనే లేదని సాక్షాత్తు ఈవోనే చెబుతున్నప్పుడు.. కల్తీ అయిన నెయ్యితో లడ్డూ తయారు చేశారని ఎలా చెబుతారంటూ ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులు, కోట్లాది మంది భక్తులు సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్డు సిటింగ్ జడ్జితో లేదా సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రధానికి లేఖ రాసిన వైఎస్ జగన్ పచ్చి అబద్ధాలు చెప్పే అలవాటున్న సీఎం చంద్రబాబు స్వార్థ రాజకీయాల కోసం పవిత్రమైన తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేస్తూ కోట్లాది మంది భక్తుల విశ్వాసాలను దెబ్బ తీసే స్థాయికి దిగజారారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫిర్యాదు చేశారు. జరగని తప్పుపై రాద్ధాంతం చేస్తున్న చంద్రబాబుకు బుద్ధి చెప్పాలని కోరారు. లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ అయిన నెయ్యిని ఉపయోగించనప్పుడు తప్పు జరిగే అవకాశమే లేదని చెప్పారు. చంద్రబాబు చర్యలు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన టీటీడీని, ఆ సంస్థ అనుసరిస్తున్న పద్ధతుల ఔన్నత్యాన్ని దెబ్బ తీశాయని ఆవేదన వ్యక్తం చేశారు. భక్తుల విశ్వాసాలను, టీటీడీ ఔన్నత్యాన్ని దెబ్బతీసేలా అబద్ధాలను వ్యాప్తి చేస్తున్న చంద్రబాబును గట్టిగా మందలించాలని కోరుతూ ప్రధాని మోదీకి ఆదివారం లేఖ రాశారు. ప్రజల దృష్టి మళ్లించడానికే.. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం 100 రోజుల్లో ఇచి్చన హామీలు నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలమైంది. ఈ నేపథ్యంలో ప్రజల దృష్టిని మరల్చడానికే టీటీడీ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా చంద్రబాబు పచ్చి అబద్ధాలను ప్రచారం చేశారన్నది స్పష్టమైంది. కల్తీ జరిగిందనే ఆరోపణలతో తిరస్కరించిన నెయ్యి ట్యాంకర్లు 2024 జూలై 12న తిరుమలకు వచ్చాయి. ఆ ట్యాంకర్లలోని నెయ్యిని లడ్డూ తయారీలో వాడలేదు. దశాబ్దాలుగా టీటీడీలో ఉన్న అత్యుత్తమ విధానాల వల్ల నెయ్యిలో సందేహాస్పద పదార్థాలు ఉంటే వెంటనే గుర్తిస్తారు. అలా ఆ ట్యాంకర్లను వెనక్కి పంపారని, ఆ నెయ్యిని లడ్డూ తయారీలో వాడలేదని తెలిసి కూడా చంద్రబాబు బాధ్యతా రాహిత్యంగా వ్యాఖ్యలు చేశారు. తద్వారా కోట్ల మంది తిరుమల భక్తుల్లో తీవ్ర ఆవేదన నెలకొంది. వాస్తవానికి ఆలయంలోనికి వెళ్లే ముందు ప్రతి ట్యాంకర్ నుండి మూడు నమూనాలు తీసుకుని పరీక్షిస్తారు. ఈ మూడు శాంపిళ్లలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత మాత్రమే నెయ్యిని ఉపయోగించడానికి అనుమతిస్తారు. ఏ పరీక్షలోనైనా సందేహాస్పద పదార్థాలు కనిపిస్తే ఆ ట్యాంకర్‌ను తిరస్కరిస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి అనుమతించరు. ఇలాంటి అత్యుత్తమ విధానాలు పాటిస్తున్నందు వల్ల ప్రసాదాల తయారీలో నాణ్యత లేని పదార్థాలను ఉపయోగిస్తున్నారనే ప్రశ్నే తలెత్తదు. గతంలో కూడా ఈ వ్యవస్థ ఉంది. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో 14 నుంచి 15 సార్లు ట్యాంకర్లను ఇలాగే తిరస్కరించారు. 2019–24 మధ్య వైఎస్సార్సీపీ హయాంలో 18 సార్లు ట్యాంకర్లను తిరస్కరించారు. వాస్తవంగా ఏఆర్ డెయిరీ ఫుడ్స్ నెయ్యి సరఫరా ప్రారంభించింది జూన్ 12 నుంచి అని టీటీడీ ఈవోనే చెబుతున్నారు. నెయ్యి ట్యాంకర్లను వెనక్కు పంపిన రెండు నెలల తర్వాత చంద్రబాబు ఆ విషయం గురించి రాద్ధాంతం చేయడాన్ని అందరూ ప్రస్తావిస్తున్నారు. ఆ ల్యాబ్ నివేదికను టీడీపీ కార్యాలయం నుంచి విడుదల చేయడాన్ని బట్టి ముమ్మాటికీ ఇది రాజకీయం కుట్రేనని స్పష్టమవుతోంది. మరో వైపు కల్తీకి ఆస్కారమే లేదని ఆహార రంగ నిపుణులు సైతం తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెరగడంతో సీఎం తన జేబులోని అధికారులతో సిట్ ఏర్పాటు చేశారు. -
బాబు కుట్రకు పోలీసు వత్తాసు
సాక్షి, అమరావతి: తిరుపతి లడ్డూ ప్రసాదంపై తమ దుష్ప్రచారం బెడిసికొట్టడంతో సీఎం చంద్రబాబు కొత్త కుట్రకు తెర తీశారు. అవాస్తవ ఆరోపణల కుతంత్రం తన మెడకే చుట్టుకుంటుండడంతో ఆయన ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించలేకపోవడంతో ఆ వివాదమంతా టీడీపీ ప్రభుత్వ సృష్టేనని జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు ఈ అంశంపై మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సుప్రీంకోర్టు తలుపు తట్టడంతో చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ అంశంపై న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకుంటే తన కుట్ర బట్టబయలవుతుందని బెంబేలెత్తుతున్నారు. దీంతో తాను సృష్టించిన వివాదాన్ని తనకు అనుకూలంగా ముగించేందుకు చంద్రబాబు దారులు వెతుకుతున్నారు. అందులో భాగంగానే టీడీపీ వీర విధేయ పోలీసు అధికారులతో ‘సిట్’ ఏర్పాటు చేసినప్పటికీ ఆయన స్థిమితపడలేకపోతున్నారు. అందుకే లడ్డూ ప్రసాదం కోసం సరఫరా చేసిన నెయ్యిపై తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో టీటీడీ అధికారులతో బుధవారం ఫిర్యాదు చేయించారు. పోలీసు వేధింపులతో బెంబేలెత్తించి తిమ్మిని బమ్మి చేసే కుతంత్రానికి పదును పెడుతున్నారు.రాత్రికి రాత్రే సీఐ అవుట్తిరుపతి ఈస్ట్ పోలీసులకు టీటీడీ బుధవారం ఫిర్యాదు చేసింది. అయితే ఆ ముందు రోజే అంటే మంగళవారం రాత్రే తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ సీఐ మహేశ్వర్‌రెడ్డిని ప్రభుత్వం హఠాత్తుగా వీఆర్‌కు పంపించింది. ఆయన స్థానంలో స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా ఉన్న తమకు విధేయుడైన ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్‌కు బాధ్యతలు అప్పగించింది. లడ్డూ అంశంపై అక్రమ కేసు నమోదు చేసేందుకు మహేశ్వర్‌రెడ్డి సుముఖత చూపలేదని సమాచారం. దాంతో ఆయన్ని తప్పించి తమకు విధేయుడైన అధికారిని నియమించినట్లు తెలుస్తోంది. పోలీస్ స్టేషన్లో నమోదు చేసే ఫిర్యాదులపై విచారణ నిర్వహించాల్సిన బాధ్యత స్టేషన్ హౌస్ ఆఫీసర్‌దే. టీడీపీ ప్రధాన కార్యాలయం చెప్పినట్లుగా దర్యాప్తు పేరిట వేధింపులకు పాల్పడే అధికారిని నియమించుకునేందుకే ఈ ఎత్తుగడ వేసినట్లు స్పష్టమవుతోంది.మరి.. నాడు బాబు హయాంలోనూ కల్తీ జరిగిందా?నెయ్యి కల్తీ జరిగినట్లు ప్రాథమిక ఆధారంగా టీటీడీ ఆ ఫిర్యాదులో ప్రస్తావించిన అంశం విడ్డూరంగా ఉంది. కేజీ నెయ్యి రూ.319.80 చొప్పున సరఫరా చేసేందుకు ఏఆర్ డెయిరీ అంగీకరించడమే కల్తీ చేశారనేందుకు ప్రాథమిక ఆధారం అని పేర్కొనడం గమనార్హం. మరి కేజీ రూ.319.80 చొప్పున సరఫరా చేయడమే కల్తీ చేసినట్టుగా భావించాలంటే.. గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2015లో కేజీ రూ.276 చొప్పున, 2018లో రూ.320 చొప్పునే టీటీడీ నెయ్యి కొనుగోలు చేసింది. ఇక అప్పుడు కూడా కల్తీ చేసినట్లే భావించాలి కదా...? నాడు టీడీపీ హయాంలో నెయ్యి సరఫరా చేసిన డెయిరీలపై కూడా ఫిర్యాదు చేయాలి కదా? అని నిపుణులు నిలదీస్తున్నారు.పక్కా పన్నాగంతోనే పోలీసులకు ఫిర్యాదులడ్డూ ప్రసాదంపై తమ దుష్ప్రచారాన్ని కొనసాగిస్తూనే చంద్రబాబు ప్రభుత్వం పోలీసు అస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధ పడింది. కల్తీ నెయ్యి సరఫరా చేశారని గుర్తించామని చెబుతున్న రెండు నెలల తరువాత టీటీడీ తీరిగ్గా తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్లో తాజాగా ఫిర్యాదు చేయడం గమనార్హం. తమిళనాడుకు చెందిన నెయ్యి సరఫరాదారు ఏఆర్ డెయిరీపై టీటీడీ జనరల్ మేనేజర్ (స్టోర్స్) పి.మురళీకృష్ణ ద్వారా ప్రభుత్వం ఫిర్యాదు చేయించింది. నెయ్యి కల్తీ జరిగిందని జూలై 23నే టీటీడీకి నివేదిక వచ్చిందన్న చంద్రబాబు సెప్టెంబరు 20న తొలిసారిగా వెల్లడించి దుష్ప్రచారానికి తెరతీశారు. మరి కల్తీ జరిగిందని తెలిసిన జూలై 23నే ఆహార భద్రతా చట్టం కింద టీటీడీ ఎందుకు కేసు నమోదు చేయలేదన్న న్యాయ నిపుణుల ప్రశ్నకు ప్రభుత్వం సూటిగా సమాధానం చెప్పలేకపోయింది. టీటీడీ ఈవో శ్యామలరావు మొదట ప్రెస్ మీట్లో మాట్లాడుతూ నెయ్యిలో వెజిటబుల్ ఫ్యాట్ కలిసిందని... అయితే ఆ నెయ్యి వాడలేదని.. తిప్పి పంపామని వెల్లడించారు. అంతేగానీ జంతువుల కొవ్వు కలిసిందని ఆయన చెప్పలేదు. జంతువుల కొవ్వు కలిసినట్లు ఎన్డీడీబీ నివేదికలో కూడా వెల్లడించలేదు. కానీ తరువాత ఈ నెల 20న సీఎం చంద్రబాబు కుట్రపూరితంగా నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందనే దుష్ప్రచారం మొదలు పెట్టడంతో శ్యామలరావు కూడా మాట మార్చక తప్పలేదు. రాష్ట్ర ప్రభుత్వ వాదనలోని డొల్లతనంపై నిపుణులు సూటిగా ప్రశ్నలు సంధిస్తుండటంతో చంద్రబాబు బెంబేలెత్తుతున్నారు. దాంతో తమను ప్రశ్నిస్తున్న గొంతులను అణచివేసేందుకు పోలీసు అస్త్రాన్ని ప్రయోగించాలని నిర్ణయించారు. లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారాన్ని పతాకస్థాయికి చేర్చిన చంద్రబాబు బృందం తాజాగా తిరుపతి పోలీసులకు ఫిర్యాదు ముసుగులో వేధింపుల కుట్రకు తెరతీసింది.విచారణ పేరిట వేధింపుల కుట్ర..రాజకీయ ప్రత్యర్థులు, డెయిరీల యాజమాన్యం, ఎంపిక చేసుకున్న అధికారులు, ఉద్యోగులపై వేధింపులకు పాల్పడాలన్నదే చంద్రబాబు ప్రభుత్వం కుట్ర. అక్రమ కేసుల్లో ఇరికించి అనంతరం కొందర్ని అప్రూవర్‌గా మార్చుకుని తమ కుట్ర వాదనను వారితో ఒప్పించాలనే కుతంత్రం పన్నింది. సిట్ పూర్తి స్వరూపాన్ని ప్రభుత్వం ఇంకా వెల్లడించలేదు. నివేదికతో సరిపెట్టాలా? అంతకుమించి అధికార పరిధి కల్పిస్తారా? అనేది స్పష్టం చేయలేదు. మరోవైపు తిరుపతి పోలీసులు కేసు విచారణ పేరిట వేధింపులకు గురి చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధంచేస్తోంది. అమరావతిలోని టీడీపీ ప్రధాన కార్యాలయం డైరెక్షన్ మేరకే తిరుపతి పోలీసుల విచారణ హైడ్రామా కొనసాగనుంది. ఎవరెవరిని విచారణకు పిలవాలి? ఎలా భయపెట్టాలి? ఎలా వేధించాలన్నది అంతా టీడీపీ పర్యవేక్షణలోనే సాగనుందన్నది సుస్పష్టం. లడ్డూ ప్రసాదంపై తమ దుష్ప్రచారానికి వత్తాసు పలకాలని.. తప్పుడు వాంగ్మూలాలు ఇవ్వాలని... లేదంటే కేసుల్లో ఇరికించి అరెస్టులతో వేధిస్తామని పోలీసు అస్త్రాన్ని ప్రయోగించాలన్నది చంద్రబాబు కుతంత్రం అని స్పష్టమవుతోంది.సిట్ వేశాక పోలీసులకు ఫిర్యాదా!లడ్డూ ప్రసాదం అంశంపై ప్రభుత్వం మంగళవారం తమకు వీర విధేయులైన పోలీసు అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) నియమించింది. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అక్రమాలకు కొమ్ముకాసిన గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని సిట్ ఇన్చార్జ్గా నియమించడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఇక సిట్‌లో సభ్యుడిగా నియమించిన విశాఖ డీఐజీ గోపీనాథ్ జెట్టీ చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కృష్ణయ్య అల్లుడు. రిటైరైన తరువాత హెరిటేజ్ ఫుడ్స్‌లో డైరెక్టర్‌గా పని చేసిన కృష్ణయ్య అనంతరం 2014–19లో టీడీపీ హయాంలో ఏపీఐఐసీ చైర్మన్‌గా ఉన్నారు. ఆయన్ని కూటమి ప్రభుత్వం తాజాగా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్‌గా నియమించింది. ఆయన అల్లుడు గోపీనాథ్ జెట్టీని సిట్ సభ్యుడిగా నియమించడం ద్వారా చంద్రబాబు కుతంత్రం బహిర్గతమవుతోంది. అయినా సరే చంద్రబాబులో ఆందోళన తగ్గలేదు. లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించాలని జాతీయ స్థాయిలో పార్టీలు, నిపుణులు, న్యాయవేత్తలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. సిట్టింగ్ న్యాయమూర్తి ద్వారా విచారణ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. తన వ్యాఖ్యలపై విచారణ జరిపించాలని మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడంతో చంద్రబాబులో ఆందోళన మరింత తీవ్రమైంది. సుప్రీంకోర్టు విచారణకు ఆదేశిస్తే టీడీపీ సర్కారు కుట్ర మొత్తం బయటపడుతుందన్నది ఆయనకు తెలుసు. తమ కుట్రను కప్పిపుచ్చేందుకు సిట్‌తో సరిపెట్టలేమని భావించారు. అందుకే పోలీసు వేధింపులతో బెంబేలెత్తించి తనకు అనుకూలంగా లొంగదీసుకునే కుతంత్రానికి తెరతీశారు. తాజాగా తిరుపతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయించడం ద్వారా మరోవైపు నుంచి కూడా విచారణ పేరిట రాద్దాంతం చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. -
బాబు తెచ్చిన నెయ్యే
సాక్షి, అమరావతి: జరగని తప్పు జరిగిందంటూ పరమ పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిచ్చి ప్రేలాపనలు పేలుతూ ఘోర అపచారానికి ఒడిగట్టారు. లడ్డూల తయారీలో స్వచ్ఛమైన ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యిని వాడారంటూ నిరాధారమైన, దారుణ ఆరోపణలు చేశారు. ఎన్డీడీబీ (నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు) కాల్ఫ్ (సెంటర్ ఫర్ ఎనాలసిస్ అండ్ లెర్నింగ్ లైవ్ స్టాక్, ఫుడ్) టెస్ట్ రిపోర్ట్‌లను సీఎం చంద్రబాబు ఆధారంగా చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో పాల ఉత్పత్తులు, ఆహార నాణ్యత సంస్థలలో పనిచేస్తూ విశేష అనుభవం గడించిన పలువురు నిపుణులను ఎన్డీడీబీ కాల్ఫ్ రిపోర్టుపై ‘సాక్షి’ సంప్రదించింది. జంతువుల కొవ్వు ఆనవాళ్లు ఆ నెయ్యిలో లేవని వారంతా ముక్తకంఠంతో స్పష్టం చేశారు. ⇒ నాలుగు శాంపిళ్లను పరీక్షించి ఎన్డీడీబీ కాల్ఫ్ ఇచ్చిన నాలుగు టెస్ట్ రిపోర్టులలో మిల్క్ ఫ్యాట్ వరుసగా 99.584, 99.610, 99.618, 99.677 శాతం ఉందని.. మిగిలిన 0.416, 0.390, 0.382, 0.323 శాతం మాయిశ్చర్ (తేమ), ఇతరాలు (విటమిన్స్, కెరటిన్, మినరల్స్ తదితరాలు) ఉంటాయని నిపుణులు విశ్లేషించారు. ⇒ కేజీ నెయ్యిలో ఏ సరఫరా సంస్థైనా 20 నుంచి 30 గ్రాముల వెజిటబుల్ ఆయిల్, జంతువుల కొవ్వు కలిపే స్థాయికి దిగజారదని స్పష్టం చేశారు. ⇒ కల్తీ నెయ్యి సరఫరా చేసినందుకు ఎన్డీడీబీ కాల్ఫ్ టెస్ట్ రిపోర్టుల ఆధారంగా ఎందుకు బ్లాక్ లిస్ట్‌లో పెట్టకూడదో చెప్పాలంటూ ఏఆర్ డెయిరీ ఫుడ్స్‌కు టీటీడీ మార్కెటింగ్ విభాగం జనరల్ మేనేజర్ పి.మురళీకృష్ణ జూలై 27న జారీ చేసిన షోకాజ్ నోటీసులోనూ.. దానికి ఏఆర్ డెయిరీ ఫుడ్స్ ఇచ్చిన జవాబును తిరస్కరిస్తూ జూలై 28న ఇచ్చిన రిజాయిండర్ షోకాజ్ నోటీసులోనూ జంతువుల కొవ్వు ఆ నెయ్యిలో కలిసిందని ఎక్కడా స్పష్టంగా తేలి్చచెప్పకపోవడాన్ని నిపుణులు ప్రస్తావిస్తున్నారు. వెజిటబుల్ ఆయిల్‌తో పాటు ఫారిన్ ఫ్యాట్స్ కలిసి ఉండొచ్చునంటూ అనుమానం మాత్రమే వ్యక్తం చేశారని పేర్కొంటున్నారు. ⇒ సీఎం చంద్రబాబు మాత్రం టీటీడీ వెనక్కి పంపేసిన ఆ నాలుగు ట్యాంకర్ల నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని, దాన్ని శ్రీవారి లడ్డూల తయారీలో వాడారని.. వాటిని భక్తులకు పంపిణీ చేశారని.. భక్తులు వాటిని తినేశారంటూ పచ్చి అబద్ధాలు వల్లె వేస్తుండటంపై నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ⇒ దీన్ని బట్టి చూస్తే.. సున్నితమైన అంశంపై ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలన్న స్వార్థంతోనే పరమ పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని సీఎం చంద్రబాబు అపవిత్రం చేసి ఘోర అపరాధం చేశారన్నది స్పష్టమవుతోంది. ⇒ స్వార్థ రాజకీయాల కోసం శ్రీ వేంకటేశ్వరస్వామి వారితో ఆటలాడుకోవడం... భూలోక వైకుంఠం తిరుమలను అపవిత్రం చేసే దుస్సాహసానికి ఒడిగట్టడం నారా చంద్రబాబు నాయుడికి ఇదేమీ కొత్తేమీ కాదని టీటీడీ అధికారులు, అధ్యాత్మీక వేత్తలు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాబు ప్రభుత్వంలోనే కల్తీ నెయ్యి సరఫరా.. ⇒ స్పెషల్ గ్రేడ్ ఆగ్ మార్క్ ఆవు నెయ్యి కోసం 2024 మార్చి 12న టీటీడీ ఈ–టెండర్లు పిలిచింది. అయితే ఎన్నికల సంఘం మార్చి 16న సాధారణ ఎన్నికల షెడ్యూలును విడుదల చేయడంతో అదే రోజు నుంచి ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చింది. దాంతో ప్రభుత్వానికి ఎలాంటి నిర్ణయాధికారం ఉండదు. ⇒ ఈ టెండర్లు 2024 మే 8న టెండర్లు ఖరారయ్యాయి. కేజీ రూ.319.80 చొప్పున పది లక్షల కిలోల నెయ్యి సరఫరా కాంట్రాక్టును తమిళనాడులోని దిండిగల్‌కు చెందిన ఏఆర్ డెయిరీ ఫుడ్స్ దక్కించుకుంది. టీటీడీకి నెయ్యి సరఫరాను జూన్ 12 నుంచి ఆ సంస్థ ప్రారంభించింది. అదేరోజు సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారు. దీన్ని బట్టి ఏఆర్ డెయిరీ ఫుడ్స్ సంస్థ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కేజీ కాదు కదా కనీసం ఒక గ్రాము నెయ్యిని కూడా టీటీడీకి సరఫరా చేయలేదన్నది స్పష్టమవుతోంది. ⇒ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక జూన్ 12, 21, 25, జూలై 4వ తేదీలలో ఏఆర్ ఫుడ్స్ సరఫరా చేసిన నాలుగు ట్యాంకర్ల నెయ్యిలో ఒక్కో ట్యాంకర్ నుంచి మూడు శాంపిళ్లను తీసుకుని తిరుమలలోని టీటీడీ ల్యా»ొరేటరీకి టీటీడీ మార్కెటింగ్ విభాగం అధికారులు పంపారు. టెండర్లో పేర్కొన్న ప్రమాణాల మేరకు ఆ నెయ్యి ఉందని తేల్చడంతో ఆ నాలుగు ట్యాంకర్లను టీటీడీ అధికారులు గోదాములోకి అనుమతించి నెయ్యిని ఆన్లోడ్ చేసుకున్నారు. ⇒ ఈ క్రమంలో జూలై 6న రెండు ట్యాంకర్లు, జూలై 15న రెండు ట్యాంకర్ల నెయ్యిని టీటీడీకి ఏఆర్ డెయిరీ ఫుడ్స్ పంపింది. ఆ ట్యాంకర్ల నెయ్యి శాంపిళ్లను పరీక్షించిన టీటీడీ ల్యా»ొరేటరీ టెండర్లో పేర్కొన్న ప్రమాణాల మేరకు లేదని తిరస్కరించింది. ఆ 4 ట్యాంకర్ల నెయ్యిని టీటీడీ అధికారులు వెనక్కి పంపేశారు. అంటే.. కల్తీ నెయ్యిని లడ్డూ తయారీలో అసలు వాడలేదన్నది స్పష్టమవుతోంది. చంద్రబాబు మాత్రం శ్రీవారి లడ్డూల తయారీలో జంతుకొవ్వు కలిసిన నెయ్యిని వాడారంటూ పచ్చి అబద్ధాలు వల్లె వేస్తుండటం గమనార్హం.సీఎంకు ఇచ్చిన నివేదికలో ఒకలా.. షోకాజ్ నోటీసుల్లో మరోలా కల్తీ నెయ్యి వ్యవహారంపై టీటీడీ ఈవో జె.శ్యామలరావు గత ఆదివారం సీఎం చంద్రబాబుకు నివేదిక ఇచ్చారు. ఏఆర్ డెయిరీ ఫుడ్స్ సంస్థ టీటీడీకి నెయ్యి సరఫరాను జూన్ 12 నుంచి ప్రారంభించిందని.. ఎనిమిది ట్యాంకర్ల నెయ్యిని సరఫరా చేసిందని నివేదికలో పేర్కొన్నారు. ఇందులో నాలుగు ట్యాంకర్ల నెయ్యి నాణ్యంగా ఉందని టీటీడీ ల్యాబొరేటరీ తేల్చిందని వెల్లడించారు. జూలై 6, 15న సరఫరా చేసిన నాలుగు ట్యాంకర్ల నెయ్యి నాణ్యంగా లేదని.. ఆ నెయ్యి శాంపిళ్లను ఎన్డీడీబీ కాల్ఫ్కు పరీక్షల నిమిత్తం పంపామని వివరించారు. ఎన్డీడీబీ జూలై 23న టెస్ట్ రిపోర్టులు ఇచ్చిందని.. ఆ నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్స్‌తోపాటు జంతువుల కొవ్వు కలిసి ఉండొచ్చునని అనుమానం వ్యక్తం చేసిందన్నారు. దాంతో నాలుగు ట్యాంకర్లను వెనక్కి పంపేశామని.. సరఫరాను ఆపేశామని.. కల్తీ నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డెయిరీ ఫుడ్స్‌ను బ్లాక్ లిస్ట్‌లో పెడుతూ జూలై 27న షోకాజ్ నోటీసులు జారీ చేశామని నివేదికలో పేర్కొన్నారు. కానీ.. ఇదే అంశంపై ఎన్డీడీబీ టెస్ట్ రిపోర్టులు ఇచ్చిన రోజు అంటే జూలై 23న తిరుమలలో ఈవో శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ.. నాలుగు ట్యాంకర్లలో నెయ్యి కల్తీ అయినట్లు నివేదికలో తేలిందని.. వనస్పతి డాల్డా లాంటి వెజిటబుల్ ఆయిల్స్ కలిసి ఉండొచ్చునని చెప్పారు. ఏఆర్ డెయిరీ ఫుడ్స్‌కు జూలై 27న ఇచ్చిన షోకాజ్ నోటీసులోనూ.. 28న ఇచ్చిన రిజాయిండర్ షోకాజ్ నోటీసులోనూ నెయ్యిలో వెజిటబుల్ ఆయిల్ కలిసిందని, ఫారిన్ ప్యాట్ కలిసి ఉండే అవకాశం ఉండొచ్చునని టీటీడీ పేర్కొంది. కానీ.. రెండు నెలల తర్వాత సీఎంకు ఇచ్చిన నివేదికలో టీటీడీ ఈవో శ్యామలరావు మాట మార్చడం గమనార్హం. సీఎంవో నుంచి తీవ్ర స్థాయిలో వచ్చిన ఒత్తిడికి తలొగ్గే ఈవో శ్యామలరావు జూలై 23న మీడియాతో ఒకలా మాట్లాడి.. ఈనెల 22న సీఎంకు మరోలా నివేదిక ఇచ్చారనే అభిప్రాయం టీటీడీ అధికారవర్గాల్లో బలంగా వ్యక్తమవుతోంది. -
నందిని నెయ్యి వద్దన్నది బాబే
సాక్షి, అమరావతి: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం పవిత్రతను దెబ్బతీసేలా టీడీపీ కూటమి ప్రభుత్వ దుష్ప్రచార కుట్ర కొనసాగుతోంది. సీఎం చంద్రబాబు పూటకో కట్టు కథ, రోజుకో అవాస్తవ ఆరోపణలతో కుతంత్రానికి పదును పెడుతున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో కర్ణాటకకు చెందిన నందిని డెయిరీకి టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టును ఎందుకు ఇవ్వలేదని చంద్రబాబు ప్రశి్నస్తుండటం ఈ కుట్ర కథలో తాజా అంకం. వాస్తవం ఏమిటంటే.. దశాబ్ద కాలంగా టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తున్న నందిని డెయిరీని 2015లో తొలిసారిగా పక్కకు తప్పించింది టీడీపీ ప్రభుత్వమే. చంద్రబాబు ఆ విషయాన్ని కప్పిపుచ్చుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలతో దుష్ప్రచారం చేసేందుకు యతి్నస్తుండటం గమనార్హం. నందిని డెయిరీని తప్పించింది చంద్రబాబే... కర్ణాటక సహకార రంగంలోని నందిని డెయిరీ దశాబ్ద కాలంపాటు టీటీడీకి నెయ్యి సరఫరా చేసింది. ఆ ప్రక్రియను 2015లో చంద్రబాబు ప్రభుత్వమే అడ్డుకుంది. నాడు టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టు కోసం నందిని డెయిరీతోపాటు పలు సంస్థలు టెండర్లు దాఖలు చేశాయి. అయితే అప్పటి టీడీపీ ప్రభుత్వం నందిని డెయిరీని కాదని మహారాష్ట్రకు చెందిన ప్రైవేటు రంగంలోని గోవింద్ డెయిరీకి నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇచి్చంది. దీనిపై అప్పట్లోనే తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.చిత్తూరు జిల్లా పూతలపట్టు టీడీపీ ఎమ్మెల్యే మురళీమోహన్ అప్పట్లో ఓ టీవీ చానల్లో రిపోర్టర్‌గా ఉన్న సమయంలో నందినీ డెయిరీకి నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇవ్వకపోవడాన్ని తప్పుబడుతూ వార్తలు కూడా ప్రసారం చేశారు. అన్ని వైపుల నుంచి విమర్శలు వచి్చనా చంద్రబాబు ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. నందినీ డెయిరీని కాదని గోవింద్ డెయిరీకే నెయ్యి సరఫరా కాంట్రాక్టు కట్టబెట్టింది. నందిని డెయిరీని తొలిసారిగా పక్కన పెట్టేసి మరో ప్రైవేటు డెయిరీకి కాంట్రాక్టు ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వమేనన్నది సుస్పష్టం. వైఎస్సార్సీపీ హయాంలో టెండర్లలో పాల్గొనని నందిని ఇక వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నెయ్యి సరఫరా కోసం టీటీడీ నిర్వహించిన టెండర్ల ప్రక్రియలో నందిని డెయిరీ అసలు పాల్గొనలేదు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం తాము కోట్ చేసిన ధరకు కాంట్రాక్టు ఇవ్వనందున టీటీడీ నెయ్యి సరఫరా కాంట్రాక్టులో పాల్గొనబోమని పేర్కొంది. ఈ క్రమంలో నిబంధనల ప్రకారం టెండర్ల ప్రక్రియ నిర్వహించి ఎల్ 1గా నిలిచిన ఏఆర్ డెయిరీకి నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇచ్చారు. ఇదీ అసలు విషయం. అయినా సరే ఎందుకు ఇవ్వలేదంటూ..ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయాన్ని కప్పిపుచ్చుతూ వైఎస్సార్సీపీ హయాంలో నందిని డెయిరీకి నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఎందుకు ఇవ్వలేదని ప్రశి్నంచడం విస్మయం కలిగిస్తోంది. అసలు వైఎస్సార్సీపీ హయాంలో టెండర్ల ప్రక్రియలో పాల్గొనని నందిని డెయిరీకి కాంట్రాక్టు ఎలా ఇస్తారు? ఈ విషయం తెలిసినా సీఎం చంద్రబాబు ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకే అసత్య ఆరోపణలు చేస్తున్నారు. 2015లో టీడీపీ హయాంలో టెండరు ప్రక్రియలో పాల్గొన్నప్పటికీ నందిని డెయిరీకి నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఇవ్వనిది చంద్రబాబే అన్నది పచ్చి నిజం. ఆ వాస్తవాన్ని కప్పిపుచ్చుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడం వెనుక చంద్రబాబు రాజకీయ కుతంత్రం ఉన్నట్లు స్పష్టమవుతోంది. -
శ్రీవారి లడ్డూపై పుట్టెడు అబద్ధాలు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు స్వార్థ రాజకీయాల కోసం కుతంత్రం పన్ని మహాపచారం చేశారు! పరమ పవిత్రమైన శ్రీవారి లడ్డూను సీఎం చంద్రబాబు అపవిత్రం చేశారు. లడ్డూ తయారీలో ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారంటూ నిరాధారమైన దారుణ ఆరోపణలు చేసి భక్తుల మనోభావాలతో చెలగాటమాడారు. నెయ్యి ట్యాంకర్లలో వెజిటబుల్ ఫ్యాట్స్ కలిసి కల్తీ అయ్యిందని నిర్ధారణ కాగానే వాటిని వెనక్కి పంపేశామని టీటీడీ ఈవో పదే పదే స్పష్టం చేశారు. శ్రీవారి లడ్డూల తయారీలో కల్తీ నెయ్యిని వాడలేదని తేల్చిచెప్పారు. అయినా సరే సీఎం చంద్రబాబు తీరు మార్చుకోలేదు. జంతువుల కొవ్వుతో లడ్డూలు తయారు చేశారంటూ పచ్చి అబద్ధాలు పదేపదే వల్లె వేస్తూ మహాపచారం చేస్తున్నారు.ఈ ప్రశ్నలకు జవాబుందా బాబూ?1. తాను టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించక ముందే సీఎం చంద్రబాబును కలిశానని.. తిరుమల ప్రసాదాల తయారీలో వినియోగిస్తున్న ముడిసరుకుల్లో నాణ్యత లేదని, జంతువుల కొవ్వుతో తయారైన నెయ్యితో లడ్డూలు తయారు చేస్తున్నారని.. ఈనెల 20న మీడియాతో శ్యామలరావు చెప్పారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ఇదే విషయాన్ని మీరు కూడా ధ్రువీకరించారు. దీన్ని బట్టి స్వార్థ రాజకీయాల కోసమే శ్రీవారి లడ్డూ ప్రసాదంపై దుష్ఫ్రచారం చేయడానికి జూన్ 14నే మహాకుతంత్రం పన్నారన్నది స్పష్టమవు తోంది కదా?2. ఈనెల 18న కూటమి శాసనసభాపక్ష సమావేశం వేదికగా కోట్లాది భక్తుల విశ్వాసాలను.. టీటీడీ ఔన్నత్యాన్ని దెబ్బతీసేలా శ్రీవారి లడ్డూ ప్రసాదంలో ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వును వాడారంటూ మీరు దారుణమైన వ్యాఖ్యలు చేయడం రాజకీయ మహాకుతంత్రంలో భాగం కాదా బాబూ?3. ఏఆర్ డైయిరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ జూలై 6న, జూలై 15న సరఫరా చేసిన నాలుగు ట్యాంకర్ల ఆవు నెయ్యిలో వెజిటబుల్ ఫ్యాట్స్ కలిశాయని జూలై 23న ఎన్డీడీబీ నివేదిక ఇచ్చిందని అదే రోజు టీటీడీ ఈవో శ్యామలరావు ప్రకటించారు. కానీ.. రెండు నెలల తర్వాత ఎన్డీడీబీ నివేదికను టీడీపీ ఆఫీసులో విడుదల చేయడం వెనుక మీ కుట్రపూరిత ఆలోచన బహిర్గతమవుతోంది కదా?4. కల్తీ నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపేశామని, కల్తీ నెయ్యితో శ్రీవారి లడ్డూలు తయారు చేయలేదని ఈవో శ్యామలరావు స్పష్టం చేసినప్పటికీ.. లడ్డూల తయారీలో ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వు వాడారంటూ భావోద్వేగాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం వెనుక రాజకీయంగా లబ్ధి పొందాలన్న మీ కుతంత్రం బట్టబయలైంది కదా?5. మీ ప్రభుత్వ హయాంలో అక్టోబరు 2015 నుంచి మే 2019 వరకూ నందిని బ్రాండ్ నెయ్యిని టీటీడీకి కేఎంఎఫ్(కర్ణాటక మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ లిమిటెడ్) సరఫరా చేయలేదు. కానీ.. కేఎంఎఫ్‌కు ఉద్దేశపూర్వకంగా నెయ్యి సరఫరా కాంట్రాక్టును వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఇవ్వలేదంటూ మీరు పచ్చి అబద్ధాలు వల్లె వేయడంలో ఆంతర్యమేంటి?6. కేజీ నెయ్యి రూ.319కే వస్తుందా? అని మీరు అంటున్నారు. తక్కువ ధరకు అప్పగించడం వల్లే కల్తీ నెయ్యిని సరఫరా చేశారంటున్నారు. మరి 2015 జూన్‌లో మీరు నిర్వహించిన టెండర్లలో రూ.324లకు కేజీ నందిని నెయ్యి సరఫరా చేస్తామని కోట్ చేసిన కేఎంఎఫ్‌ను కాదని.. రూ.276కే సరఫరా చేస్తామని గోవిందా గోవిందా మిల్క్ అండ్ మిల్క్ ప్రాడక్ట్ లిమిటెడ్ (మహారాష్ట్ర)కు నెయ్యి సరఫరా బాధ్యత ఎలా ఇచ్చారు? రూ.276కే ఇచ్చినప్పుడే కల్తీ జరగనప్పుడు రూ.319కి కొన్నప్పుడు కల్తీ ఎలా జరుగుతుంది? ఇంత చిన్న లాజిక్‌ను ఎలా మర్చిపోయి.. కళ్లార్పకుండా కమిట్మెంట్తో అబద్ధాలు చెప్పగలుగుతున్నారు?7. టెండర్ల వ్యవస్థను నీరుగార్చి అధిక ధరలకు కాంట్రాక్టర్లకు పనులు అప్పగించడం ద్వారా 2015–19 మధ్య ప్రభుత్వ ఖజానా నుంచి రూ.20 వేల కోట్లు మీరు దోచుకున్నారు. 2019–24 మధ్య వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్వహించిన రివర్స్ టెండరింగ్‌లో మీ అక్రమాలు బయటపడ్డాయి. ప్రభుత్వ ఖజానాకు రూ.7,500 కోట్లకుపైగా ఆదా అయ్యింది. రివర్స్ టెండరింగ్ వల్లే టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా అవుతోందని ఇప్పుడు మీరు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణల వెనుక ఆంతర్యం మీ అక్రమాలను రివర్స్ టెండరింగ్ రట్టు చేసిందనే కడుపుమంటే కదా?8. స్వార్థ రాజకీయాల కోసం కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి మహాప్రసాదం లడ్డూపై మీరు చేసిన వ్యాఖ్యల వల్ల కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. టీటీడీ ప్రతిష్టను దెబ్బతీశారు. ఈ వ్యవహారంలో నిజానిజాలు నిగ్గుతేల్చి.. టీటీడీ ఔన్నత్యాన్ని, భక్తుల విశ్వాసాలను పునరుద్ధరించాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరుతూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ లేఖ రాస్తే మీకు అంత ఉలుకెందుకు? ప్రధాని మోదీకి లేఖ రాసేందుకు వైఎస్ జగన్‌కు ఎంత ధైర్యమని వ్యాఖ్యానిస్తారా? కేంద్రం జోక్యం చేసుకుని దర్యాప్తు చేయిస్తే మీ రాజకీయ కుతంత్రం బహిర్గతమవుతుందనే భయమే కదా? అందుకే కదా ‘సిట్’ వేసింది?9. టీటీడీ చైర్మన్‌గా వ్యవమరించిన వైవీ సుబ్బారెడ్డి నిఖార్సైన హిందువు. 43 సార్లు అయ్యప్ప మాల ధరించారు. వైవీ సుబ్బారెడ్డి భార్య స్వర్ణలత హిందువు. రోజూ ఉదయం గో పూజతోనే ఆమె దినచర్య ప్రారంభమవుతుంది. అలాంటి మహిళ బైబిల్ పట్టుకుని తిరుగుతున్నారని.. అన్యమతస్థులను టీటీడీ చైర్మన్‌గా నియమించారని మీరు వ్యాఖ్యలు చేయడంలో ఆంతర్యం సున్నితమైన భావోద్వేగాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలన్న కుట్రే కదా?10. టీటీడీ నిర్వహించే మూడు పరీక్షల్లో కల్తీ అయ్యిందని తేలితే నెయ్యి ట్యాంకర్లను వెనక్కి పంపేస్తారు. 2014–19 మధ్య 14–15 సార్లు.. 2019–24 మధ్య 18 సార్లు ఇలా వెనక్కి పంపేశారు. కల్తీ నెయ్యితో లడ్డూలు ఎన్నడూ తయారు చేయలేదని టీటీడీ ఈవో స్పష్టంగా చెబుతుంటే.. ఆలయంలో శాంతి హోమం నిర్వహించాలని మీరు ఆదేశించడంలో ఆంతర్యమేంటి? ఇదంతా మీరు నిరాధారమైన, దారుణమైన ఆరోపణలతో పరమ పవిత్రమైన లడ్డూను అపవిత్రం చేసినందుకు ప్రాయశ్చిత్తం చేసుకోవడంలో భాగమే కదా?11. నిర్దిష్ట ప్రమాణాల మేరకు లేనందున తమిళనాడు డెయిరీ నుంచి వచ్చిన నాలుగు ట్యాంకర్ల నెయ్యిని వెనక్కి పంపేశామని, ఆ నెయ్యిని అసలు వాడలేదని ఈవో నివేదిక ఇవ్వలేదా?12. తిరుమలలో రివర్స్ టెండర్లు ఏమిటీ? అక్కడ కూడా రివర్స్ టెండర్లు నిర్వహిస్తారా? అని ప్రశ్నించిన మీరు నిబంధనలకు విరుద్ధంగా రివర్స్ టెండర్లు పిలిచి నెయ్యి సరఫరా కాంట్రాక్టును ఢిల్లీకి చెందిన ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ సంస్థ 65 శాతం, నందిని డెయిరీ 35 శాతం సరఫరా చేసేలా ఈ ఏడాది ఆగస్టులో ఒప్పందం కుదుర్చుకోవడం వెనుక మతలబు ఏమిటీ?ప్రమాణ స్వీకారం చేసిన రెండు రోజులకే కుట్ర..ఎన్నికల్లో కూటమి గెలుపొందటంతో జూన్ 12న సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేశారు. జూన్ 14న టీటీడీ ఈవోగా శ్యామలరావును నియమించారు. టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించక ముందే సీఎంను శ్యామలరావు కలిశారు. ఈ సమావేశంలోనే మహాకుట్రకు సీఎం చంద్రబాబు బీజం వేస్తూ.. తిరుమల ప్రసాదాల తయారీలో నాసిరకం ముడిసరుకులు వాడుతున్నారని, ఆవు నెయ్యికి బదులు జంతువుల కొవ్వును వాడుతున్నారని.. దాన్ని ప్రక్షాళన చేయాలని ఈవోను ఆదేశించారు. దీన్ని ఈవో శ్యామలరావు, సీఎం చంద్రబాబు మీడియా సాక్షిగా అంగీకరించారు. అంటే జూన్ 14నే మహాకుతంత్రానికి బీజం పడినట్లు స్పష్టమవుతోంది. -
చంద్రబాబు మార్కు ‘కుట్ర’ తప్పు జరిగితే కేసు ఎందుకు పెట్టలేదు?
నేరం జరిగిందని తెలిస్తే ఎవరైనా ఏం చేస్తారు? వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. మరి ఎంతో ప్రాశస్త్యమైన చరిత్ర కలిగిన, పవిత్రమైన తిరుమల లడ్డూ ప్రసాదం తయారీ కోసం సరఫరా చేసిన నేయిలో జంతువుల కొవ్వు కలిపితే ఏం చేయాలి? వెంటనే కల్తీ నేయి సరఫరా చేసిన కంపెనీపై ఫిర్యాదు చేయాలి. కేసు పెట్టాలి. ఆధారాలతో సహా నిరూపించాలి. దోషులకు శిక్షపడేట్టు చేయాలి. ఆహార భద్రతా చట్టం అందుకు అవకాశం కల్పిస్తోంది కూడా. కానీ సీఎం హోదాలో ఉన్న చంద్రబాబుకు మాత్రం అవేవీ పట్టడం లేదు. ఊకదంపుడు నిరాధార రాజకీయ ఆరోపణలతో లబ్ధి పొందడానికే యతి్నస్తున్నారు. సాక్షి, అమరావతి: టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారని తమకు జూలై 23నే తెలిసిందని చెబుతున్న చంద్రబాబు.. మరి ఆ నెయ్యి సరఫరా చేసిన కంపెనీపై ఎందుకు కేసు పెట్టలేదన్న ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పక పోవడం విస్తుగొలుపుతోంది. నెయ్యిలో కల్తీ జరిగిందని నిరాధార ఆరోపణలతో రాద్ధాంతం చేస్తూ ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకే కుట్రకే ప్రాధాన్యమిస్తున్నారు. తద్వారా అడ్డదారిలో రాజకీయ ప్రయోజనాల కోసం ఎంతకైనా దిగజారుతానని మరోసారి నిరూపించారు.లడ్డూ ప్రసాదం తయారీ కోసం టీటీడీకి సరఫరా చేసిన ఆవు నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారని గుజరాత్‌లోని ఎన్డీడీబీ ల్యాబ్ నివేదిక వెల్లడించినట్టు చంద్రబాబు ప్రభుత్వం పక్కా పన్నాగంతో దు్రష్పచారాన్ని తెరపైకి తెచి్చంది. జూలై 23న నివేదిక వచ్చిందని కూడా టీడీపీ కూటమి ప్రభుత్వమే అధికారికంగా వెల్లడించింది. మరి నెయ్యి కల్తీ జరిగినట్టు జూలై 23నే తెలిస్తే.. రాష్ట్ర ప్రభుత్వంగానీ టీటీడీగానీ ఏం చేయాలి? చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. కల్తీ నెయ్యి సరఫరా చేసిన సంస్థపై కేసు నమోదు చేయాలి. ఎందుకంటే టెండరు నిబంధనలను ఉల్లంíœుంచి కల్తీ నెయ్యి సరఫరా చేయడం నేరం.అందులోనూ కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా, తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నాణ్యత దెబ్బతినేలా కల్తీ నెయ్యి సరఫరా చేయడం మహాపరాధం. జంతువుల కొవ్వుతో కల్తీ చేసిన నెయ్యిని సరఫరా చేయడమే నిజమైతే.. ఆ కల్తీ నెయ్యితో లడ్డూ ప్రసాదం తయారు చేయడమే నిజమైతే.. కల్తీ నెయ్యి సరఫరా చేసిన సంస్థపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి. కానీ ఎన్డీడీబీ ల్యాబ్ నివేదిక వచ్చి 2 నెలలైనా సరే చంద్రబాబు ప్రభుత్వం ఆ కంపెనీపై కేసు పెట్టనే లేదు. కల్తీ చేస్తే 6 నెలల నుంచి 3 ఏళ్ల జైలు శిక్ష కల్తీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలకు ఆహార భద్రత చట్టం అవకాశం కలి్పస్తోంది. ఆ చట్టంలోని సెక్షన్ 15ఏ ప్రకారం.. ఆహార పదార్థాల్లో కల్తీకి పాల్పడిన వారిపై, కల్తీ ఆహార పదార్థాలు సరఫరా చేసిన సంస్థపై భారీ జరిమానాతో పాటు ఆరు నెలల నుంచి మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించేందుకు అవకాశం కలి్పస్తోంది. నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపి కల్తీ చేశారని నిరూపితమైతే సరఫరా సంస్థపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వానికి పూర్తి అధికారం ఉంది. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఆ సంస్థపై కేసు నమోదు చేయనే లేదు. ఎందుకంటే కేసు నమోదు చేస్తే.. నిబంధనల ప్రకారం దర్యాప్తు జరుగుతుంది.నెయ్యి సరఫరా చేసిన సంస్థ తాము కల్తీ చేయలేదని ఘంటాపథంగా వాదిస్తోంది. తమ వద్ద పూర్తి ఆధారాలున్నాయని సవాల్ విసురుతోంది. దాంతో టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని రుజువు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అవుతుంది. కానీ టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో ఎలాంటి జంతువుల కొవ్వు కలవలేదని చంద్రబాబు ప్రభుత్వానికి తెలుసు. అందుకే ఆ సంస్థపై కేసు నమోదు చేయలేదన్నది అసలు లోగుట్టు. అయినా సరే చంద్రబాబు నిస్సిగ్గుగా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. పవన్, లోకేశ్ తదితరులు నిరాధారణ ఆరోపణలు చేస్తున్నారు. -
దుష్ప్రచారంలో దిట్ట
సాక్షి, అమరావతి: అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా మతాన్ని, దేవుడిని అడ్డుపెట్టుకుని అడ్డగోలుగా నోటికొచ్చినట్లు ఆరోపణలు చేయడంలో సీఎం చంద్రబాబు ఆయన భజన బృందం దిట్ట. తన ఆరోపణలకు సంబంధించి నిజానిజాలు నిగ్గుతేల్చేందుకు ఆయన ఏనాడూ ఉన్నతస్థాయి విచారణకు ముందుకురాలేదు. ఈ విషయంలో ఆయనపై మొదట నుంచీ విమర్శలున్నాయి. అలాగే, చంద్రబాబు హయాంలోనే అనేక అపచారాలూ చోటుచేసుకున్నాయని భక్తులు గుర్తుచేస్తున్నారు. ఉదా.. » తాజాగా.. చంద్రబాబు పాలనలోనే తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీనెయ్యి అంశం వెలుగుచూసింది. కానీ, ఆయన సిగ్గూఎగ్గూ లేకుండా గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వానికి అంటగడుతూ వివాదానికి తెరలేపారు. » రెండేళ్ల క్రితం జగన్ సీఎంగా కొనసాగుతున్న సమయంలో టీడీపీ, ఆ పార్టీ శ్రేణులు తిరుమల కొండపై శిలువ అంటూ సామాజిక మాధ్యమాల్లో నానా రభస సృష్టించిన విషయం తెలిసిందే. అప్పట్లో టీటీడీ ఈ అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండించడంతో పాటు బాధ్యులపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించడంతో ఆ దు్రష్పచారానికి తెరపడింది. » అలాగే, గత ఏడాది ఆగస్టులో కూడా తిరుమల కాలిబాటలో పులుల సంచారం వెలుగులోకి వస్తే భక్తుల భద్రతకోసం ప్రతి 250 మెట్లకు ఒక గార్డు చొప్పన 70 మందిని భక్తులకు కాపలా ఉంచేందుకు నిర్ణయించడంతో పాటు అత్యవసర సమయంలో ఉపయోగకరంగా ఉంటుందని భక్తులకు ఉచితంగా కర్రలను అందించాలని టీటీడీ సంకల్చిచింది. దీనినీ పచ్చ బ్యాచ్ వక్రీకరిస్తూ కర్రకు పది రూపాయలు రుసుం పెట్టి, టీటీడీ కర్రల వ్యాపారం చేసిందని పెద్దఎత్తున దు్రష్పచారం చేస్తే, అప్పట్లో టీడీపీయే దానిని ఖండించుకుంది. » ఇక అదే నెలలో తిరుపతి గోవిందస్వామి రాజస్వామి ఆలయ గోపురం అంశంలోనూ దు్రష్పచారమే చేశారు. » ఇలా తిరుమల ఆలయానికి మాత్రమే పరిమితం కాకుండా దేవదాయ శాఖ పరిధిలోని ఆలయాలకు సంబంధించి ఇదే తరహా దు్రష్పచారాలకు పచ్చమూకలు తెగబడ్డాయి. » గత ఏడాది ఆగస్టులో కాణిపాకం ఆలయంలో పంచామృత అభిõÙకం టికెట్ ధర రూ.700 నుంచి రూ.5,000లకు పెంచకుండానే పెంచారంటూ దు్రష్పచారం చేశాయి.బాబు హయాంలోనే దుర్గగుడిలో క్షుద్ర పూజలు..ఇక పవిత్ర పూజా కార్యక్రమాల్లో బూట్లు వేసుకుని తరచూ పూజల్లో పాల్గొనే చంద్రబాబు గత కృష్ణా పుష్కరాల సమయంలో ఆయన విజయవాడలో దాదాపు 30 గుళ్లను నేలమట్టం చేశారు. ఆ విగ్రహాలను చెత్త ట్రాక్టర్లలో తరలించి భక్తుల మనోభావాలను దారుణంగా దెబ్బతీశారు. మరోవైపు.. 2014–19 మధ్య చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే విజయవాడ దుర్గగుడిలో క్షుద్ర పూజల కలకలం రేగింది. దీనికి సంబంధించి ఆలయ గర్భగుడిలో గుర్తుతెలియని వ్యక్తులు సంచరించినట్లు వీడియోలు కూడా బయటకొచ్చాయి. » అంతేకాదు.. 1995–2004 మధ్య 1472 సంవత్సరం నాటి తిరుమల వెయ్యికాళ్ల మండపాన్ని కూల్చివేసిన ఘటన కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లోనే జరిగింది. -
లడ్డూ ప్రసాదం స్వచ్ఛం, శుద్ధం, పవిత్రం
సాక్షి, అమరావతి : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం స్వచ్ఛం..శుద్ధం అని ఆహార శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. జంతువుల కొవ్వు కలిసిన నెయ్యితో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం ఏనాడూ తయారు చేయనేలేదని స్పష్టం చేశారు. భారత ఆహార భద్రత– ప్రమాణాల సాధికారిక సంస్థ(ఎఫ్ఎస్ఎస్ఐ) అధ్యయనాన్ని ఉటంకిస్తూ శాస్త్రీయమైన ఆధారాలతో సహా నిగ్గు తేల్చారు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఆహార పరిశోధన రంగం శాస్త్రవేత్తలు రుచి శ్రీవాస్తవ, నేహా దీపక్ షాలు ఈ మేరకు సాధికారికంగా వెల్లడించారు. పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తున్న రాద్ధాంతం అంతా దుష్ప్రచారమేనని తేల్చి చెప్పారు. జంతువుల కొవ్వు కలిపిన నెయ్యితో తయారు చేసే ఆహార పదార్థాలు విపరీతమైన దుర్వాసన వస్తుందని వారు స్పష్టం చేశారు. ఎటువంటి ప్రత్యామ్నాయ దినుసులు వాడినప్పటికీ ఆ దుర్వాసనను తొలగించలేమని చెప్పారు. అత్తరు, ఇతరత్రా సుగంధ ద్రవ్యాలు కుమ్మరించినా సరే ఆ దుర్వాసన పోదు. ఇక జంతువుల కొవ్వు కలిపిన నెయ్యితో తయారు చేసే లడ్డూలు గుండ్రంగా ఉండలా ఉండవు. లడ్డూ బూందీ విడిపోతుంది. ఆ నెయ్యి లడ్డూ బూందీని కలిపి ఉంచ లేదు.వైఎస్సార్సీపీ ప్రభుత్వం అయిదేళ్ల కాలంలో తిరుమల లడ్డూ ప్రసాదంపై అటువంటి ఆరోపణలుగానీ ఫిర్యాదులుగానీ రానే లేదు. ఎప్పటి మాదిరిగానే ఆ ఐదేళ్లలో కూడా రోజూ వేలాది మంది భక్తులు లక్షలాది లడ్డూలు భక్తితో తిన్నారు. ఆ అయిదేళ్లలో తిరుమల దర్శనం చేసుకున్న కోట్లాది మంది భక్తుల్లో ఒక్కరు కూడా లడ్డూ ప్రసాదంపై ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. దుర్వాసన వచ్చినట్టు ఆరోపించనే లేదు. అంతెందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ కూడా పలుమార్లు తిరుమల వెళ్లారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం తిన్నారు. ఉప రాష్ట్రపతి హోదాలో వెంకయ్య నాయుడుతోపాటు బీజేపీ అగ్రనేతలు అందరూ తిరుమల లడ్డూ ప్రసాదం స్వీకరించిన వారే. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా తిరుమల వెళ్లారు. లడ్డూ ప్రసాదం తిన్నారు. కానీ వారిలో ఒక్కరు కూడా లడ్డూ ప్రసాదం నాణ్యత బాగోలేదని గానీ దుర్వాసన వస్తోందని గానీ ఆరోపించనే లేదన్నది అందరికీ తెలుసు. కానీ ప్రస్తుతం రాజకీయ ప్రయోజనాల కోసం కుట్ర పూరితంగానే తిరుమల లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం చేస్తున్నారన్నది సుస్పష్టం. ఎలా కల్తీ జరిగిందో ఎన్డీడీబీ చెప్పలేదు నెయ్యి కల్తీ జరిగిందని మాత్రమే ఎన్డీడీబీ నివేదిక వెల్లడించగలదు. కానీ, జంతువుల కొవ్వు కలపడం వల్ల ఆ కల్తీ జరిగిందని నిరూపించే అవకాశమే లేదని ఆహార శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. సోయాబీన్, పొద్దు తిరుగుడు పువ్వు, రేపీడ్స్, గోధుమ జెర్మ్, మొక్క జొన్న జెర్మ్, పత్తి విత్తనాలు, కొబ్బరి, పామ్ ఆయిల్ ద్వారా కూడా కల్తీ చేసే అవకాశాలున్నాయి.నెయ్యిలో కల్తీ చేయాలంటే వ్యాపారులు సాధారణంగా పాల్పడే అక్రమ విధానం ఏమిటంటే.. పామాయిల్, హైడ్రోజనేటెడ్ కూరగాయల కొవ్వును కలుపుతూ ఉంటారని ఆహార శాస్త్రవేత్తలు చెప్పారు. ఎందుకంటే అవి అయితేనే తక్కువ వ్యయంతో కల్తీ చేయవచ్చన్నారు. టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో ఎటువంటి కల్తీ చేశారన్నది ఎన్డీడీబీ నివేదికలో స్పష్టం చేయనే లేదు. కానీ చంద్రబాబు, ఆయన ముఠా సభ్యులు జంతువుల కొవ్వు కలిపారని రాద్ధాంతం చేయడం రాజకీయ కుట్రేనన్నది సుస్పష్టం.జంతువుల కొవ్వు కలిసిందని నివేదికలో లేదుటీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని ఎన్డీడీబీ ల్యాబ్ నివేదిక వెల్లడించ లేదు. ఆ నివేదిక కల్తీని సూచిస్తుందని తప్ప.. ఎటువంటి కల్తీనో చెప్ప లేదు. కల్తీ చేయాలనుకునే వ్యాపార సంస్థలు సాధారణంగా పామాయిల్ మరియు హైడ్రోజనేటెడ్ కూరగాయల కొవ్వు కలుపుతారు.అంతేగానీ జంతువుల కొవ్వును కలపరు. ఎందుకంటే జంతువుల కొవ్వు కలిపితే వ్యయం పెరుగుతుంది. వారికి లాభం ఉండదు. తక్కువ వ్యయంతో ఎక్కువ లాభం పొందేందుకే ఎవరైనా కల్తీ చేస్తారు. కానీ తయారీ వ్యయం పెంచుకునేందుకు కల్తీ చేయరు. – నేహా దీపక్ షా, ఆహార శాస్త్రవేత్తఆ నెయ్యిలో జంతువుల కొవ్వు లేదుజంతువుల కొవ్వు కలిపిన నెయ్యితో తయారు చేసే లడ్డూలుగానీ ఇతర ఆహార పదార్థాల నుంచిగానీ విపరీతమైన దుర్వాసన వస్తుంది. ఎటువంటి సువాసన ద్రవ్యం వేసినా సరే ఆ దుర్వాసన పోదు. దుర్వాసన వచ్చే లడ్డూలుగానీ ఆహార పదార్థాలు గానీ ఎవరూ తయారు చేయరు. తయారు చేసినా ఎవరూ స్వీకరించరు. తిరుమల లడ్డూ ప్రసాదంపై గత ఐదేళ్లలో అటువంటి ఫిర్యాదు రాలేదన్నది గుర్తుంచుకోవాలి. లడ్డూలో కల్తీ లేదని నేను కచ్చితంగా చెప్పగలను. – రుచి శ్రీవాస్తవ, ఆహార పరిశోధకురాలు -
నిజాల నిగ్గు తేల్చాలి
సాక్షి, అమరావతి : ‘వందల కోట్ల మందికి శ్రీవారు ఆరాధ్య దైవం. తిరుమల ప్రసాదానికి అత్యంత పవిత్రత ఉంది. అలాంటి లడ్డూ తయారీ నెయ్యిలో పశువుల కొవ్వు కలిపారన్న అనుమానాలు రేకెత్తించింది ముఖ్యమంత్రి చంద్రబాబే కాబట్టి.. వాటి నిగ్గు తేల్చాల్సిన బాధ్యత కూడా ఆయనదే. అసలు కల్తీ నెయ్యిని వాడనప్పుడు.. అపచారానికి తావే లేదు. ఈ విషయంలో పూర్తి బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించిన చంద్రబాబు.. కోట్లాది మంది భక్తుల మనోభావాలపై దెబ్బకొట్టారు.దాన్ని సవరించాల్సిన బాధ్యతను విస్మరించి సంప్రోక్షణ అంటూ ఇంకా డ్రామాలు చేస్తున్నారు’ అని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. తిరుమల లడ్డూ వివాదంపై ఆయన ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు ప్రస్తావించారు. స్వార్థ రాజకీయాల కోసం చంద్రబాబు దేవుణ్ని వాడుకోవడం దారుణం అన్నారు. ‘నిజానికి నెయ్యిని అలా కల్తీ చేయడం సాధ్యమా? ఎవరైనా ఆ పని చేస్తారా? ఒకవేళ చేస్తే దేశ ద్రోహులు మాత్రమే ఆ పని చేయాలి. టెర్రరిస్టులో లేక మత విద్వేషం ఉన్న వారో చేయాలి. ఒకవేళ నెయ్యిలో నాణ్యత లేకపోతే, దాన్ని లోపలికి కూడా పోనివ్వరు. అలాంటప్పుడు నాణ్యత లేని నెయ్యిని వాడే అవకాశమే లేదు. కానీ, చంద్రబాబు ఉన్మాదిలా మాట్లాడుతున్నారు. అందుకే మా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రధానికి, సీజేఐకి లేఖ రాస్తానని చెప్పారు. పూర్తి స్థాయిలో విచారించాలని కోరారు. వాస్తవాలు తేల్చాలని, భక్తుల మనోభావాలు నిలబెట్టాలని కోరుతున్నాం’ అని పేర్కొన్నారు. చంద్రబాబు కుట్ర కోణం మూడు రోజులుగా జరుగుతున్న తతంగం చూస్తే, అసలు దాన్ని విపరీతంగా ప్రస్తావించింది, ప్రచారం చేసింది సీఎం చంద్రబాబేనని సజ్జల చెప్పారు. నెయ్యిలో కల్తీ కాదు.. ఏకంగా జంతువుల కొవ్వు నుంచి తయారు చేసిన నెయ్యి వాడుతున్నారని పచ్చిగా నింద మోపుతూ, చాలా నింపాదిగా మాట్లాడటం స్పష్టంగా కనిపించిందన్నారు. బాబు మాటలను బట్టి ఇదంతా కుట్ర అని స్పష్టమవుతోందన్నారు. ‘జూలై 23న నెయ్యి పరీక్ష రిపోర్ట్ వస్తే.. ఇన్ని రోజులు ఎందుకు ఆగారు? ఆ రిపోర్ట్ అంత సీరియస్‌గా ఉంటే టీటీడీ ఈవో కానీ, సీఎం కానీ తక్షణ చర్యలకు ఎందుకు దిగలేదు? నెయ్యిలో ఏవో వెజిటబుల్ ఫ్యాట్ (వనస్పతి) గుర్తించామని, తగిన చర్యలు తీసుకుంటున్నామని తొలుత ఈవో చెప్పారు. ఇప్పుడు రెండు నెలల తర్వాత మాట మార్చి చెబుతున్నారు. అందుకే ఇది కుట్ర అని అనుమానాలు వస్తున్నాయి. అదుపులో లేని వ్యాధితో బాధ పడుతున్న వారు లేదా.. స్వార్థం కోసం కోట్లాది మంది మనోభావాలు దెబ్బతిన్నా ఫరవాలేదనుకునే శాడిస్ట్‌లే ఇలాంటి పని చేస్తారు’ అని ధ్వజమెత్తారు. ‘ఏదైతే ఫీడ్ (ఆహారం) ఇస్తారో.. అంటే పామాయిల్ కేక్ వంటివి.. ఆ ఆవుల పాలలో అది కూడా కనిపిస్తుంది. ఉదాహరణకు చంటి పిల్లల తల్లులు తీసుకునే ఆహారం వల్ల వారి పాలల్లో కూడా వాటి లక్షణాలు ఉంటాయి. సరిగ్గా.. ఇక్కడ కూడా ఆ పశువులకు ఇచ్చే దాణాలో ఉండే పదార్థ లక్షణాలు వాటి పాలలో కనిపిస్తాయి. ఇది సహజం. అంత మాత్రాన జంతువుల కొవ్వు ఉందని చెప్పడం దుర్మార్గం’ అన్నారు. ‘అమెజాన్‌లో కొట్టి చూడండి. నెయ్యి కేజీ బ్రాండ్‌ను బట్టి రూ.450 నుంచి రూ.550 వరకు ఉంటుంది. టీడీపీ హయాంలో కూడా నెయ్యి కిలో రూ.350కే సరఫరా చేశారు. మరి అప్పుడు నాణ్యత లేని, కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లా? నెయ్యిలో కల్తీ చేస్తే చెడు వాసన వస్తుంది. సొంత డెయిరీ ఉన్న చంద్రబాబుకు ఈ విషయాలు తెలీవా?’ అని సజ్జల మండిపడ్డారు. -
ఆవు నెయ్యి తీసుకునే విధానంలో మార్పు
తిరుపతి సిటీ : టీటీడీ లడ్డూ ప్రసాదంలో ఉపయోగించే నెయ్యిలో గతంలో కల్తీ ఎక్కువగా ఉందని ఎన్డీడీబీ తేల్చిందని, అందుకోసం ఆవు నెయ్యి తీసుకునే విధానంలో మార్పులు తీసుకొచ్చామని టీటీడీ ఈఓ శ్యామలరావు తెలిపారు. ఆదివారం రాత్రి తిరుపతి పద్మావతి గెస్ట్ హౌజ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం స్వచ్ఛమైన ఆవు నెయ్యినే ప్రసాదంలో వినియోగిస్తున్నామని చెప్పారు. నందిని, ఆల్ఫా మిల్క్ వంటి పేరొందిన సంస్థల నుంచి స్వచ్ఛమైన ఆవు నెయ్యిని కిలో రూ.475తో కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం కొనుగోలు చేస్తున్న నెయ్యిని ఎన్డీడీబీ పరీక్షలు చేసి స్వచ్ఛమైనదిగా తేల్చిందన్నారు. క్రమం తప్పకుండా ఎన్ఏబీఎస్ అక్రిడిటేషన్ ల్యాబ్‌కు శ్యాంపిల్స్‌ను పంపించే ప్రక్రియను కొనసాగిస్తామన్నారు. మొదటి సారిగా ఆవు నెయ్యి స్వచ్ఛతపై పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తున్నామని, ఇందుకోసం మైసూరు సీఎఫ్టీఆర్ఐలో ట్రైనింగ్ పొంది ల్యాబ్‌లో పని చేసిన 18 మందిని సెన్సరీ ప్యానెల్‌గా ఏర్పాటు చేశామన్నారు. వీరు నెయ్యి స్వచ్ఛతతోపాటు, రంగు, రుచి, వాసన కనుక్కునే విధానంలో నిపుణులని చెప్పారు. ఎన్డీడీబీ సంస్థ సహకారంతో డిసెంబర్‌లోపు రూ.75 లక్షల విలువగల నెయ్యి పరీక్షా పరికరాలు టీటీడీకి సమకూరుతాయని తెలిపారు. లడ్డూ పోటులో సంప్రోక్షణ పూర్తిఆలయంలోని అన్న ప్రసాదాలు, లడ్డూ పోటులలో సంప్రోక్షణ కార్యక్రమాలు ఇప్పటికే పూర్తి చేశామని ఈవో చెప్పారు. భక్తులలో ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే, వారి సంతోషం కోసం శాంతి హోమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పెద్దజియ్యర్, ఆగమశాస్త్ర పండితుల సలహా మేరకు సోమవారం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ఆలయంలోని బంగారు బావి వద్ద గల యాగ శాలల్లో మూడు హోమ గుండాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. కాగా, కల్తీ నెయ్యిపై మైసూరు టెస్టింగ్ సంస్థ రిపోర్ట్‌లను ఎందుకు బహిర్గతం చేయలేదని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఈవో స్పందించ లేదు. తాను ఏమీ మాట్లాడలేనని చేతులెత్తేశారు. 2014–19లో, 2019–24 మధ్య కాలంలో ప్రమాణాలు పాటించని ఎన్ని సంస్థలను బ్లాక్‌లో పెట్టారు.. ఎన్ని ట్యాంకర్లను వెనక్కి పంపారన్న ప్రశ్నకూ సమాధానం దాటవేశారు. చంద్రబాబు హయాంలో సైతం అతి తక్కువ ధరతో నెయ్యిని కొనుగోలు చేశారని.. ఆ సమయంలో నెయ్యి స్వచ్ఛంగానే ఉందా.. అన్న ప్రశ్నకు సైతం తన వద్ద సమాధానం లేదన్నట్టు వ్యవహరించారు. అన్ని విషయాలు సీఎం చంద్రబాబు ప్రెస్మీట్లో చెప్పారంటూ తప్పించుకున్నారు. కాగా, సీఎం చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్‌ను ఈవో చదవడం తప్పు మరేమీ చెప్పడం లేదన్న వ్యాఖ్యలు మీడియా ప్రతినిధుల నుంచి వినిపించాయి. -
తిరుమల లడ్డూపై మరో మారు చంద్రబాబు అబద్ధాలు
సాక్షి, అమరావతి: కళ్లార్పకుండా కమిట్మెంట్తో అబద్ధాలు ఆడడంలో దిట్ట.. చెప్పిన అబద్ధాన్ని చెప్పకుండా చెప్పడంలో నేర్పరి అయిన సీఎం చంద్రబాబు శనివారం మళ్లీ తిరుమల శ్రీవారి పవిత్రతకు అపచారం తలపెట్టారు. తన రాజకీయ స్వార్థం కోసం ఎంతకైనా తెగించే ఆయన తిరుమల లడ్డూ విషయంలో బ్రహ్మాండం బద్దలైపోయినట్లు భక్తుల మనోభావాల్ని, వారి విశ్వాసాలను కాలరాస్తున్నారు. ఎందుకంటే.. కల్తీ నెయ్యితో తిరుమల లడ్డూ తయారైందని ఆరోపించిన ఆయన.. వాస్తవానికి అసలు ఆ నెయ్యితో లడ్డూయే తయారుకాలేదన్న విషయాన్ని.. కల్తీనెయ్యి కల్తీనెయ్యి అంటూ గుండెలు బాదుకుంటున్న ఆయన ఆ నెయ్యిని వాడలేదన్న విషయాన్నీ మరుగునపర్చి అనవసర రాద్ధాంతానికి తెరలేపి భక్తుల్లో విషబీజాలు నాటుతున్నారు. ఏడుకొండల వాడే తనతో ఈ లడ్డూ వ్యవహారంపై మాట్లాడించాడేమోనని వ్యాఖ్యానించే స్థితికి ముఖ్యమంత్రి చంద్రబాబు దిగజారిపోయారు. ఆ దేవుడే తన నోటినుంచి నిజాలు చెప్పించాడేమోనని, మనం నిమిత్తమాత్రులమని దేవుడే అన్నీ చేయిస్తాడని మంగళగిరి టీడీపీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. దేవాలయాల పవిత్రత, భక్తుల సెంటిమెంట్‌ను కాపాడేందుకు ప్రాధాన్యం ఇస్తామని చెబుతూ.. గత ప్రభుత్వంలో దేవాలయాల్లో అనేక అపచారాలు జరిగాయని అడ్డగోలుగా అబద్ధాలు ఆడుతూ పదేపదే అపచారాలకు పాల్పడుతున్నారు. పైగా ప్రజల సెంటిమెంట్‌తో ఆడుకున్నారని, ప్రజల మనోభావాలకు విలువ ఇవ్వలేదని ఆయనన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు నేరాలు చేసి ఎదురుదాడి చేస్తున్నారన్నారు. తిరుమల శ్రీవారి ప్రసాదం విషయంలో ఎన్డీడీబీ రిపోర్ట్ ఇస్తే దానిపై సమాధానం చెప్పకుండా బుకాయిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. రూ.320కి కిలో ఆవు నెయ్యి ఎలా వస్తుందని ప్రశ్నించారు. శ్రీవారికి నైవేద్యంగా పెట్టే లడ్డూ తయారీలో రివర్స్ టెండర్లు ఏమిటన్నారు. తప్పు చేసింది కాక డైవర్షన్ పాలిటిక్స్ అని సిగ్గులేకుండా చెబుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం మారిన వెంటనే తిరుమల ప్రక్షాళన చేయాలని కొత్త ఈఓకు చెప్పానన్నారు.పండితులతో చర్చించి సంప్రోక్షణపై నిర్ణయం..ఇక టీటీడీ విషయంలో తర్వాత ఏంచేయాలనే దానిపై చర్చిస్తున్నామని.. జీయర్లు, కంచి పీఠాధిపతులు, సనాతన ధర్మ పండితులతో చర్చించి సంప్రోక్షణ ఎలా ఉండాలో నిర్ణయిస్తామన్నారు. తిరుమల సెట్‌ను ఇంట్లో వేసుకున్న వాడిని ఏమనాలని ప్రశ్నించారు. ఇక అమరావతితో రూ.250 కోట్లతో శ్రీవారి గుడి కడదామనుకుంటే దాన్ని కుదించారని, మళ్లీ ఇప్పుడు పెద్దపెద్ద మాటలు చెబుతున్నారని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో ప్రసాదాల నాణ్యాతా పరీక్షలు, అవసరమైన సంప్రోక్షణ కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ కార్యాలయంలో వినతులు స్వీకరించారు. -
ఆ నాలుగు ట్యాంకర్ల నెయ్యి అస్సలు వాడలేదు: శ్యామలరావు
అమరావతి: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారని, టీటీడీకి అపవిత్రం జరిగిపోయిందని చంద్రబాబు చేస్తున్న ప్రచారం అంతా బోగస్ అని తేలిపోయింది. చంద్రబాబు చేస్తున్న దుర్మార్గపు దుష్ప్రచారం వల్లే టీటీడీ పవిత్రత మంటగలుస్తోందని మరోసారి స్పష్టమైపోయింది. బాబు నియమించిన టీటీడీ ఈవో శ్యామలరావు మాటల్లో ఈ విషయం బట్టబయలైంది. శనివారం ప్రఖ్యాత ఆంగ్ల వెబ్సైట్ ది ప్రింట్‌తో శ్యామలరావు మాట్లాడుతూ ‘‘తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ నుంచి వచ్చిన 10 ఆవునెయ్యి ట్యాంకర్లలో నాలుగింటిలో నాణ్యత తగ్గినట్లు టీటీడీ నిపుణులు నిర్ధారించారు. జులై 6న వచ్చిన రెండు ట్యాంకర్లలో, జులై 12న వచ్చిన మిగిలిన ట్యాంకర్లలోని శ్యాంపుల్స్ను సేకరించి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ సెంటర్‌కు పంపించాం. ఆ నెయ్యిని 100శాతం ఉపయోగించలేదు.’’ అని శ్యామలరావు చెప్పారు. ఎన్డీడీబీ రిపోర్ట్‌లో జంతుసంబంధమైన, వెజిటబుల్ ఫ్యాట్లకు సంబంధించిన కల్తీ జరిగినట్లు తేలడంతో ఆ నాలుగు ట్యాంకర్లను పక్కన పెట్టి ఏఆర్డైరీకి తిప్పి పంపించామని శ్యామలరావు చెప్పారు. అసమయంలో టీటీడీకి ఐదు ఏజెన్సీలు నెయ్యి సరఫరా చేస్తున్నాయని, అందులో ఏఆర్ డైరీ ట్యాంకర్లలోనే నెయ్యి తక్కువ నాణ్యత ఉన్నట్లు తేలిందని ఆయన తెలిపారు. కల్తీ అయిన నెయ్యిని ప్రసాదాల తయారీకి అస్సలు వాడలేదంటూ శ్యామలరావు చెప్పినట్లు ది ప్రింట్లో వచ్చిన కథనం లడ్డూలలో కల్తీ ఎక్కడుంది? : ఐవైఆర్ కృష్ణారావు ఎన్డీడీబీ రిపోర్ట్ ప్రకారం తిరస్కరించిన కల్తీనెయ్యి గురించే ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఆరోపణలు చేస్తుంటే ఇక తిరుపతి లడ్డూలలో కల్తీ ఎక్కడుంది? ’’ అని మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు ప్రశ్నించారు. ఆయన ది ప్రింట్ ప్రతినిధితో మాట్లాడుతూ చంద్రబాబు చేస్తున్న ఆరోపణలకు దన్నుగా మరేదైనా గట్టి ఆధారం లేకపోతే ఇది కచ్చితంగా చంద్రబాబుకు, టీడీపీకి బూమరాంగ్ వంటిదేనని వ్యాఖ్యానించారు. చర్యతీసుకోవడం మానేసి రాజకీయమా? ‘‘టీటీడీలో ఒక సిస్టమ్‌ను అనుసరిస్తాం. సాంకేతిక, ఆర్థిక అర్హతల ఆధారంగానే సరఫరాదారును ఎంపిక చేస్తారు. ఎంపికైన ఏజెన్సీ కల్తీ వంటి ఏదైనా తప్పు చేస్తే దానిని గుర్తించి చర్య తీసుకోవడం ప్రస్తుత ప్రభుత్వ బాధ్యత. అది మానేసి దీనిని రాజకీయంచేయడం ఎంత వరకు సబబు?’’ అని పేరు చెప్పడానికి ఇష్టపడని టీటీడీ అధికారి ఒకరు ది ప్రింట్ ప్రతినిధికి చెప్పారు. వాడని నెయ్యి.. తయారు కాని లడ్డూ! టీటీడీకి ఈ ఏడాది జూలై 6, జూలై 12వ తేదీల్లో ఓ సరఫరా సంస్థ రెండేసి ట్యాంకర్లు చొప్పున ఆవు నెయ్యిని సరఫరా చేసింది. టీటీడీ మార్కెటింగ్ అధికారి, సంస్థ ప్రతినిధి సమక్షంలో ట్యాంకర్ సీల్ తొలగించి నెయ్యిని కలియతిప్పి.. ఒక్కో ట్యాంకర్ నుంచి మూడు శాంపిళ్ల చొప్పున సేకరించి అదే రోజు తిరుమలలో టీటీడీ ల్యాబ్‌కు పంపారు. ల్యాబ్‌లో వేర్వేరుగా పరీక్షలు చేసిన ముగ్గురు టెక్నీషియన్లు టెండర్లో పేర్కొన్న ప్రమాణాల మేరకు నెయ్యి నాణ్యత లేదని తేల్చుతూ జూలై 8, 14న నివేదిక ఇచ్చారు. దాంతో తిరుపతిలో టీటీడీ గోడౌన్ బయట నుంచే ఆ రెండు ట్యాంకర్ల నెయ్యిని టీటీడీ అధికారులు వెనక్కి పంపేశారు. కల్తీ నెయ్యిని శ్రీవారి లడ్డులో వినియోగించడం కాదు కదా కనీసం తిరుపతిలోని టీటీడీ గోడౌన్‌లోకి కూడా అనుమతించడం లేదన్నది దీనిద్వారా స్పష్టమవుతోంది. -
ఏఆర్ డెయిరీలో ఫుడ్ సేఫ్టీ అధికారుల సోదాలు
సాక్షి, చెన్నై: తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో తమిళనాడులోని దిండుగల్‌లో ఉన్న ఏఆర్ డెయిరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్‌లో శనివారం సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ అధికారులు రెండు గంటలకు పైగా సోదాలు నిర్వహించారు. తిరుమలకు సరఫరా అయింది ఏఆర్ డెయిరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ నెయ్యేనన్న సమాచారంతో దిండుగల్‌లోని ఆ ఉత్పత్తి కేంద్రంపై అందరి దృష్టి పడింది. దీంతో శుక్రవారం రాత్రి తమిళనాడు ప్రభుత్వ కాలుష్య నియంత్రణ మండలి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ అనిత ఆ పరిశ్రమలో తనిఖీలు చేసి, వ్యర్థ జలాలను పరిశీలనకు తీసుకెళ్లారు.అదే సమయంలో శనివారం సెంట్రల్ ఫుడ్ సేప్టీ అధికారి ఒకరితో పాటు మరి కొందరు సిబ్బంది ఆ పరిశ్రమలో సోదాలు చేశారు. ఏఆర్ డెయిరీకి చెందిన పాలు, నెయ్యి, పనీర్, వెన్న, పెరుగు, మజ్జిగ, స్వీట్లు తదితర ఉత్పత్తులను 2 గంటలకుపైగా పరిశోధించారు. వీటి శాంపిల్స్‌ను తీసుకెళ్లారు. అదే సమయంలో ఏఆర్ డెయిరీ కంపెనీ తరఫున క్వాలిటీ కంట్రోల్ విభాగం అధికారులు లెని, కన్నన్ మీడియా ముందుకు వచ్చారు. తమ ఉత్పత్తులలో కల్తీకి ఆస్కారం లేదని, ఎవ్వరైనా సరే ఏ సమయంలోనైనా ఉత్పత్తులను తనిఖీ చేసుకోవచ్చని సూచించారు.తిరుపతి దేవస్థానానికి నెయ్యి పంపించే ముందు పరిశీలించి, అందుకు సంబంధించిన సర్టీఫికెట్లను సిద్ధం చేస్తామని వివరించారు. జూన్, జూలై నెలల్లో పంపించామని, ఇప్పుడు అక్కడకు సరఫరా చేయడం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం తమ సంస్థ పేరు బహిరంగంగా చెప్పనప్పటికీ, జరుగుతున్న పరిణామాలను చూసి వివరణ ఇవ్వాలని నిర్ణయించామన్నారు. తమ ఉత్పత్తులు అన్ని చోట్ల ఉన్నాయని, ఏ సమయంలోనైనా సరే తనిఖీలు చేసుకోవచ్చునని సూచించారు. 16 వేల టన్నులను ఆ రెండు నెలలు నిరంతరాయంగా పంపిణీ చేశామని, ఇందుకు సంబంధించిన అన్ని రకాల తనిఖీ, పరిశీలన సర్టిఫికెట్లు తమ వద్ద ఉన్నాయని ఓ ప్రశ్నకు సమాధానం చెప్పారు.