విదేశాలకూ దైవ ప్రసాదం  | Yadadri Prasadam Distribution To Foreign Countries From Next Month | Sakshi
Sakshi News home page

విదేశాలకూ దైవ ప్రసాదం 

Published Wed, Jun 19 2019 9:44 AM | Last Updated on Wed, Jun 19 2019 9:45 AM

Yadadri Prasadam Distribution To Foreign Countries From Next Month - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అమెరికాలో ఉంటున్న నాగేందర్‌ ఇలవేల్పు యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి. ఏటా తన పుట్టిన రోజున స్వామిని అర్చించి తీర్థ ప్రసాదాలు తీసుకోవాలనేది ఆయన కోరిక. కానీ వివిధ కారణాల వల్ల ఆయనకు యాదాద్రి వచ్చి దైవ దర్శనం చేసుకునేందుకు కుదరట్లేదు. దీంతో పుట్టిన రోజున ఏదో వెలితి ఆయనను వెంటాడుతోంది. ఇలాంటి ఎందరో ప్రవాస తెలుగువారు వేదన పడుతున్నారు. ఇకపై భక్తుల చింత తీరనుంది. కొద్దిరోజుల్లోనే వారి ఇలవేల్పు దేవాలయం నుంచి ఆయా దేశాల్లోని భక్తు ల చెంతకు స్వామివారి ప్రసాదం, అక్షింతలు, పసుపు–కుంకుమ చేరనున్నాయి. ప్రత్యేక సందర్భాల్లో వారు కోరిన రోజున ఆలయంలో వారి పేరుతో పూ జాదికాలు నిర్వహించి ప్రసాదాన్ని వారికి పంపుతా రు. దేవాదాయశాఖ తాజాగా తీసుకున్న ఈ నిర్ణయం వచ్చే నెల నుంచి అందుబాటులోకి రాబోతోంది. 

యాదగిరిగుట్టతో మొదలు.... 
విదేశాల్లోని భక్తులకు మానసిక సంతోషాన్ని కలిగించేలా వారి ఇష్టదైవం కొలువైన కోవెల నుంచి ప్రసాదం ఎందుకు వారికి చేరకూడదన్న ఉద్దేశంతో దేవాదాయశాఖ కమిషనర్‌ అనిల్‌ కుమార్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో చర్చించి దీనికి అనుమతి తీసుకున్న ఆయన... విదేశాలకు స్వామి ప్రసాదం చేరవేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా ఐటీ శాఖను కోరారు. దీనికి సంబంధించిన అనుమతులు తీసుకోవడం నుంచి విధివిధానాలను ఖరారు చేయడం వరకు ఆ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే నెల నుంచి ప్రారంభించే ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా తొలుత యాదగిరి లక్ష్మీనర్సింహస్వామి దేవాలయంతో మొదలుపెట్టాలని నిర్ణయించారు. వీలైతే భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం నుంచి కూడా ఈ సేవ మొదలుపెట్టాలనుకుంటున్నారు. ఇటీవలే బెల్లం ప్రసాదాల వితరణ ప్రారంభించి భక్తుల అభిమానాన్ని చూరగొన్న దేవాదాయశాఖ అదే ఉత్సాహంతో దేవాలయాల్లో నిర్వహించే ఆర్జిత సేవలు, గదుల కేటాయింపు తదితరాల బుకింగ్‌ను ఆన్‌లైన్‌ చేసింది. ఇప్పుడు విదేశీ భక్తులకు ప్రసాదం అందజేసే కార్యక్రమాన్ని మొదలుపెడుతున్నారు. 

మరిన్ని దేవాలయాల్లో ఆన్‌లైన్‌ సేవలు.... 
దేవాలయానికి వెళ్లేలోపే ఆర్జిత సేవలు, గదులను బుక్‌ చేసుకునేందుకు వీలుగా ఆన్‌లైన్‌ సేవలకు ఇటీవలే దేవాదాయశాఖ శ్రీకారం చుట్టింది. హైదరాబాద్‌లో యాదాద్రి భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆన్‌లైన్‌ సేవలను మొదలుపెట్టింది. తొలుత యాదగిరిగుట్ట, భద్రాచలం, వేములవాడ, బాసర, సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి దేవాలయం, బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం, కర్మన్‌ఘాట్‌ ఆంజనేయస్వామి దేవాలయంలో ఈ సేవలను మొదలుపెట్టారు. జూలై 6వ తేదీ నుంచి వరంగల్‌లోని భద్రకాళి దేవాలయం, ధర్మపురి, కొండగ ట్టు, కొమురవెల్లి, జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ దేవాలయం, సికింద్రాబాద్‌ గణపతి దేవాలయాల్లో ప్రారంభించనున్నారు. ఆ తర్వాత దశలవారీగా మిగతా ప్ర ధాన ఆలయాల్లో మొదలుపెడతారు. విరాళాలను కూడా ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించే అవకాశం కల్పించారు.
 
నిల్వ ఎలా? 
రాష్ట్రంలోని చాలా దేవాలయాల్లో పులిహోర, లడ్డూ ప్రధాన ప్రసాదంగా ఉంది. పులిహోరను ఒక రోజుకు మించి నిల్వ చేసే అవకాశం లేనందున దాన్ని విదేశాలకు పంపరు. ఇక లడ్డూ కూడా రెండు మూడు రోజులే నిల్వ ఉంటుంది. దాన్ని గాలి చొరబడని ప్యాకింగ్‌లో ఉంచితే ఒక రోజుకు మించి నిల్వ ఉండదు. లడ్డూ నిల్వ ఉండాలంటే తిరుమల ప్రసాదం తరహాలో తేమ లేకుండా ఉండాలి. దీంతో ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రస్తుతానికి ప్రసాదంగా స్వామి పసుపు–కుంకుమ, అక్షింతలు, ఇతర పూజా వస్తువులను పంపాలని నిర్ణయించారు. తేమ లేని లడ్డూ తయారీ, రవ్వతో చేసే పొడి ప్రసాదం తదితరాల విషయంలో తుది నిర్ణయం తీసుకొని దాన్ని అందించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement