![four arrested in tirumala laddu adulteration case: Andhra pradesh](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/ttd.jpg.webp?itok=KHJkTY-q)
సీబీఐ ఆధ్వర్యంలోని సిట్ అధికారుల వెల్లడి
తిరుమల: తిరుమలకు(tirumala) కల్తీ నెయ్యి సరఫరా చేశారన్న ఆరోపణలపై నమోదైన కేసులో నలుగురిని అరెస్ట్ చేసినట్లుగా సీబీఐ ఆధ్వర్యంలోని సిట్ అధికారులు తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం కొద్ది నెలలుగా ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ, ఉత్తరప్రదేశ్‌కు చెందిన పరాగ్ డెయిరీ, ప్రీమియర్ అగ్రి ఫుడ్స్, ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ సంస్థలకు చెందిన కీలక వ్యక్తులను మూడు రోజులుగా తిరుపతిలో విచారిస్తోంది.
విచారణకు సహకరించక పోవడంతో ఆదివారం వారిని అదుపులోకి తీసుకుంది. సీబీఐ హైదరాబాద్ డివిజన్ జాయింట్ డైరెక్టర్ వీరేశ్ ప్రభు, విశాఖ సీబీఐ ఎస్పీ మురళీరాంబతో పాటు రాష్ట్రం నుంచి విశాఖ డీఐజీ గోపీనాథ్ జెట్టి, గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అధికారి సత్యకుమార్ పాండా ఆధ్వర్యంలో విచారణ సాగుతున్న విషయం తెలిసిందే. మూడు రోజులుగా వీరేశ్ ప్రభు తిరుపతిలో మకాం వేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఉత్పత్తి సామర్థ్యానికి మించి ఎక్కువ మొత్తంలో సరఫరా చేయడానికి ఉత్తరాదికి చెందిన డెయిరీల నుంచి ఏఆర్ డెయిరీ నెయ్యి కొనుగోలు చేసినట్లు సిట్ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. దీంతో ఏఆర్ డెయిరీకి సహకరించిన సంస్థల ప్రతినిధులను కూడా అదుపులోకి తీసుకుని విచారించింది.
అనంతరం విపిన్ జైన్ (భోలే బాబా ఆర్గానిక్ డెయిరీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్, భగవాన్‌పూర్, రూర్కీ, ఉత్తరాఖండ్), పోమిల్ జైన్ (భోలే బాబా ఆర్గానిక్ డెయిరీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్), అపూర్వ చావ్డా (సీఈఓ) వైష్ణవి డెయిరీ స్పెషాలిటీస్ ప్రైవేట్ లిమిటెడ్, పునబాక, తిరుపతి జిల్లా), రాజురాజశేఖరన్ (ఏఆర్ డెయిరీ ప్రైవేట్ లిమిటెడ్, దిండిగల్, తమిళనాడు ఎండీ)లను అరెస్ట్ చేసింది. వీరిని సోమవారం కోర్టులో హాజరు పరచనుంది.
Comments
Please login to add a commentAdd a comment