వైఎస్ జగన్ స్పష్టంగా వివరించారన్న వైఎస్సార్‌సీపీ
100 రోజుల వైఫల్యాల నుంచి దృష్టి మరల్చడానికే ఆ వ్యాఖ్యలు
కల్తీ నెయ్యి వాడేందుకు ఆస్కారం లేకుండా గట్టి వ్యవస్థ ఉందని స్పష్టికరణ
సాక్షి, అమరావతి: తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యి కల్తీ అయిందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చేసిన నిరాధార ఆరోపణల్లోని గుట్టును వైఎస్ జగన్ పూర్తిగా బట్టబయలు చేశారని వైఎస్సార్‌సీపీ పేర్కొంది. లడ్డూ ప్రసాదం కోసం నెయ్యి సేకరించడంలో ఉండే కఠిన, పారదర్శక విధానాలను విస్పష్టంగా వివరించారని తెలిపింది. నెయ్యి ఉపయోగం కోసం అంగీకరించే ముందు సమగ్ర నాణ్యత తనిఖీలు ఏ విధంగా చేస్తారో విపులంగా చెప్పారని, ఈ దృష్ట్యా పవిత్ర ప్రసాదం కోసం ఉపయోగించే నెయ్యిలో కల్తీ జరిగే అవకాశం లేదని స్పష్టంగా తెలియజెప్పారని వివరించింది.
తనిఖీ రిపోర్టులో పేర్కొన్న తేదీల్లోని కీలకమైన అసమానతలను ఎత్తిచూపుతూ.. ఎల్లో మీడియా ప్రసారం చేసిన తప్పుడు నివేదికలను ఎత్తిచూపారని చెప్పింది. ఈ మేరకు శనివారం ఆ పార్టీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సమగ్ర అభివృద్ధికి, అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పడానికి గత ప్రభుత్వంలో తీసుకున్న చర్యల గురించి కూడా వైఎస్ జగన్ చక్కగా వివరించారని స్పష్టం చేసింది. ఈ కార్యక్రమాలు నిరంతరం మౌలిక సదుపాయాలు, సేవలను మెరుగు పరుస్తాయని చెప్పింది.
చంద్రబాబు నాయుడి వ్యాఖ్యలు రాజకీయ ప్రేరేపితమని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను దెబ్బతీస్తాయని వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారంది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజులలో వైఫల్యాల నుండి దృష్టిని మరల్చడానికే బాబు ఇలాంటి వ్యాఖ్యలు చేశారని, ఆ వ్యాఖ్యలు మతపరమైన, భావోద్వేగపరమైన సున్నితత్వాన్ని పణంగా పెట్టి రాజకీయ లబ్ధి పొందడం తప్ప మరే ఇతర ప్రయోజనానికి ఉపయోగపడవని జగన్ స్పష్టం చేశారంది. చంద్రబాబు బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలపై న్యాయ వ్యవస్థ తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ భారత ప్రధాన న్యాయమూర్తికి అధికారికంగా లేఖ రాస్తానని కూడా వైఎస్ జగన్ ప్రకటించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment