అబద్ధాలకు రెక్కలుకట్టి గోబెల్స్‌ ప్రచారం చేస్తావా? | YS Jagan deposed CM Chandrababu | Sakshi
Sakshi News home page

అబద్ధాలకు రెక్కలుకట్టి గోబెల్స్‌ ప్రచారం చేస్తావా?

Published Sat, Oct 5 2024 5:20 AM | Last Updated on Sat, Oct 5 2024 7:34 AM

YS Jagan deposed CM Chandrababu

సీఎం చంద్రబాబును నిలదీసిన వైఎస్‌ జగన్‌ 

వంద రోజుల పాలన, హామీల అమలులో వైఫల్యం..

వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి శ్రీవారితో ఆడుకుంటావా? 

రాజకీయ దుర్బుద్ధితో శ్రీవారి ప్రతిష్టను, లడ్డూ ప్రసాదం విశిష్టతను దెబ్బ తీస్తావా? 

కోట్లాది మంది భక్తుల మనోభావాలను గాయపరుస్తావా? 

ఆ నెయ్యి వాడలేదని ఈవో చెబుతున్నా పదే పదే అబద్ధాలా?  

తప్పులను వెనకేసుకు రావడం ఏ విధంగా సనాతన ధర్మం?  

సనాతనా ధర్మం అంటే ఏమిటో అసలు ఆ మనిíÙకి తెలుసా? సాక్షాత్తు నువ్వు కూడా కూటమిలో ఉన్నావు. చంద్రబాబు నీ కళ్ల ఎదుటే తప్పు చేశాడు. దేవుడి విషయంలో చంద్రబాబు చేసిన తప్పు నీకే కాదు ఆరేళ్ల పిల్లాడికి కూడా కన్పిస్తోంది. నీ కళ్ల ఎదుటే వేంకటేశ్వరస్వామి ప్రతిష్టను తగ్గిస్తూ.. విశిష్టతను దెబ్బతీస్తూ కావాలనే దుర్బిద్ధితో చంద్రబాబు రాజకీయం చేస్తున్నాడు. 

రాజకీయ లబ్ధి పొందేందుకు కోట్ల మంది శ్రీవారి భక్తుల్లో ఒక అనుమానాన్ని రేకెత్తించాడు. తిరుమల తిరుపతి దేవస్థానానికి అపవిత్రతను ఆపాదించే ప్రయత్నం చేస్తూ.. లడ్డూ విశిష్టతను తగ్గించే ప్రయత్నం చేశారు. అందులో నీవు కూడా భాగమే.     – వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి : ‘వంద రోజుల పాలన వైఫల్యం.. సూపర్‌ సిక్స్‌తో సహా ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై ప్రజలు నిలదీస్తుండటంతో వారి దృష్టి మళ్లించాలనే రాజకీయ దురుద్దేశంతో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరస్వామితో ఆడుకుంటావా?’ అని సీఎం చంద్రబాబును వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ నిలదీశారు. 

ఒక అబద్ధానికి రెక్కలు కట్టి గోబెల్స్‌ ప్రచారం చేసి.. తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాశస్త్యం, లడ్డూ విశిష్టతను అపవిత్రం చేస్తావా? అంటూ మండిపడ్డారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారంటూ ఆరోపిస్తున్న సీఎం చంద్రబాబు చేసిన తప్పులు, చెప్పిన అబద్ధాలను ‘మీడియా’ ఎదుట సాక్ష్యాధారాలతో సహా మరోసారి వివరించారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..    

టీటీడీలో గొప్ప వ్యవస్థ  
జూలై 6, జూలై 12న వచ్చిన ట్యాంకర్లలో నెయ్యి నాణ్యత పరీక్షించిన తర్వాత వాటిని లోపలికి అనుమతించ లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో స్వామి వారి ప్రసాదాలు, అడ్డూ, అన్న ప్రసాదాల తయారీకి అవసరమైన ముడి సరుకులు, నెయ్యి కొనుగోలు చేయడానికి అత్యంత గొప్ప, పటిష్టమైన వ్యవస్థ ఉంది. 2014–19 మధ్య నాణ్యత లేదని 14 నెయ్యి ట్యాంకర్లు వెనక్కు పంపగా.. మా హయాంలో 2019–24 మధ్య 18 ట్యాంకర్లు వెనక్కు పంపారు. నెయ్యి, ముడిసరుకుల సేకరణకు ఈ–టెండర్ల ద్వారా బిడ్లు నిర్వహిస్తారు. ఎల్‌–1కు 65 శాతం, ఆ తర్వాత బిడ్లో ఉన్న వారికి అదే ధరకు 35 శాతం ఇస్తారు.  
 
ఆ నెయ్యి వాడలేదని టీటీడీ ఈవోనే చెప్పారు  
తిరుమలకు టెండర్‌ ప్రకారం సరఫరా చేసే నెయ్యి ట్యాంకర్లు.. తమతో ఎన్‌ఏబీఎల్‌ గుర్తింపు పొందిన ల్యాబ్‌ నుంచి క్వాలిటీ సరి్టఫికెట్‌ తీసుకురావాలి. ఆ సర్టిఫికెట్‌తో వచ్చినా, తిరుపతిలో ప్రతి ట్యాంకర్‌ శాంపిల్‌ మూడు సార్లు టెస్ట్‌ చేస్తారు. అలా జూలై 6, 12 తేదీల్లో వచ్చిన ట్యాంకర్లు తిరుపతిలో చేసిన నాణ్యత పరీక్షలో ఫెయిల్‌ అయితే, వాటిని వెనక్కు పంపారు. అవే శాంపిల్స్‌ను ఎన్డీడీబీకి పంపిస్తే, జూలై 23న రిపోర్ట్‌ వచ్చింది. దాంతో ఆ ట్యాంకర్లు వెనక్కు పంపడంతో పాటు, ఆ కంపెనీ వారికి నోటీసులు కూడా ఇచ్చారు. 

నాణ్యత లేని నెయ్యి వాడలేదని ఈవో స్పష్టంగా చెప్పినా (ఆ వీడియోను చూపారు).. తన 100 రోజుల పాలనలో అన్ని రంగాల్లో విఫలమైన చంద్రబాబు, డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తూ.. సెపె్టంబరు 18న ఎన్డీఏ సమావేశంలో తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు కలిపిన నెయ్యి వాడారంటూ దారుణ ఆరోపణలు చేశారు. (అందుకు సంబంధించిన వీడియో చూపుతూ) ఆ వెంటనే రెండు రోజులకు, అంటే సెప్టెంబరు 20న టీటీడీ ఈవో ఇదే విషయంపై మాట్లాడుతూ.. కల్తీ నెయ్యి ట్యాంకర్లు నాలుగింటిని వెనక్కి పంపేశామని.. ఆ నెయ్యిని లడ్డూ తయారీలో వాడనేలేదని స్పష్టం చేశారు. 

(ఆ వీడియోను ప్రదర్శించారు) అయినా కూడా మళ్లీ సెపె్టంబర్‌ 22న మాట్లాడిన చంద్రబాబు.. ఏ మాత్రం భయం, భక్తి లేకుండా తనకు రాజకీయ ఉద్దేశాలే ముఖ్యమని, స్వామి వారు అన్నా, తిరుపతి అన్నా భయం, భక్తి లేదని నిరూపిస్తూ.. తాను అంతకు ముందు చెప్పిన పచ్చి అబద్ధాలను మరోసారి వల్లె వేశారు. తిరుమలకు వచ్చిన ఆ నాలుగు ట్యాంకర్ల నెయ్యి వాడినట్లు (ఆ వీడియోను చూపుతూ) చెప్పారు.   

తప్పును గుడ్డిగా సమర్థి0చడం సనాతన ధర్మమా?  
‘చంద్రబాబుతో పాటు నువ్వు కూడా ఆ అబద్ధాలకు రెక్కలు కట్టి ప్రచారం చేస్తున్నప్పుడు ఇంకా సనాతన ధర్మం గురించి నువ్వు ఏం మాట్లాడతావు? ఆ తప్పును గుడ్డిగా వెనకేసుకొస్తూ సనాతన ధర్మం గురించి మాట్లాడతావా? ఇది ఎంత వరకు ధర్మం’ అంటూ వైఎస్‌ జగన్‌ నిలదీశారు. తప్పు చేయలేదు కాబట్టే సాక్ష్యాధారాలతో సహా నిజాలు చెప్పగలుగుతున్నామని స్పష్టం చేశారు. 

‘చంద్రబాబు మాటలకు ఆయన నియమించుకున్న టీటీడీ ఈవో చెబుతున్న మాటలకు తేడా ఏమిటో స్పష్టంగా ఆధారాలతో సహా చూపిస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానంలో దశాబ్దాలుగా అమలువుతున్న గొప్ప సంప్రదాయాలను గుర్తు చేస్తున్నాం. పటిష్టమైన వ్యవస్థను మనమే దెబ్బతీసేలా.. మనంతట మనమే మన గుడిని.. మన స్వామి వారిని.. శ్రీవారి లడ్డూ విశిష్టతను తగ్గించుకునేలా మాట్లాడి.. మనమే సనాతన ధర్మం గురించి గొప్పలు చెప్పుకోవడం ఎంత వరకు సబబు?’ అంటూ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement