‘బాబు సిట్‌’ను పక్కన పెట్టిన ‘సుప్రీం..’ ఇక 'సీబీఐ సిట్' | Supreme Court orders on Srivari Laddu ghee adulteration charges | Sakshi
Sakshi News home page

‘బాబు సిట్‌’ను పక్కన పెట్టిన ‘సుప్రీం..’ ఇక 'సీబీఐ సిట్'

Published Sat, Oct 5 2024 4:51 AM | Last Updated on Sat, Oct 5 2024 6:54 AM

Supreme Court orders on Srivari Laddu ghee adulteration charges

శ్రీవారి లడ్డూ నెయ్యి కల్తీ ఆరోపణలపై సుప్రీంకోర్టు ఉత్తర్వులు 

ప్రత్యేక సిట్‌ దర్యాప్తును పర్యవేక్షించాలని సీబీఐ డైరెక్టర్‌కి ఆదేశం  

కోట్ల మంది శ్రీవారి భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకునే స్వతంత్ర సిట్‌ 

తద్వారా దర్యాప్తుపై విశ్వసనీయత పెరుగుతుందన్న అత్యున్నత న్యాయస్థానం

ప్రత్యేక సిట్‌ దర్యాప్తును పర్యవేక్షించాలని సీబీఐ డైరెక్టర్‌కి కోర్టు ఆదేశం

ఈ మొత్తం వ్యవహారాన్ని రాజకీయ డ్రామాగా మారనివ్వబోమని వ్యాఖ్య

నెయ్యిపై జూలైలో నివేదిక వస్తే సెప్టెంబర్‌లో ఎందుకు మాట్లాడారు?

సీఎం చంద్రబాబును మరోసారి ప్రశ్నించిన సుప్రీంకోర్టు

రాష్ట్ర ప్రభుత్వ సిట్‌నే కొనసాగించాలన్న సొలిసిటర్‌ జనరల్‌ 

తుషార్‌ మెహతా.. స్వతంత్ర దర్యాప్తుపై అభ్యంతరం లేదని సీఎం చెప్పినట్లు పత్రికల్లో చదివామన్న ధర్మాసనం

ఆ కథనాలను పట్టించుకోవద్దన్న రోహత్గీ, లూథ్రా

చంద్రబాబు వ్యాఖ్యలు ఖచ్చితంగా ప్రభావితం చేస్తాయి

అందువల్ల స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలని కోరిన కపిల్‌ సిబల్‌

దర్యాప్తు బృందంలో ఇద్దరు సీబీఐ అధికారులు, ఇద్దరు రాష్ట్ర పోలీసులు, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నుంచి ఒకరు

తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ ఆరోపణలపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు

ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రజల మనోభావాలు ముడిపడి ఉన్నందున తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై స్వతంత్ర, నిష్పాక్షిక దర్యాప్తు అవసరం. రాష్ట్ర  ప్రభుత్వం నియమించిన సిట్‌ స్థానంలో ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసేందుకు ఓ స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నాం. 

ఇందులో సీబీఐ డైరెక్టర్‌ నామినేట్‌ చేసిన ఇద్దరు సీనియర్‌ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసిన ఇద్దరు సీనియర్‌ పోలీసు అధికారులు, ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) చైర్‌పర్సన్‌ నామినేట్‌ చేసిన ఓ అధికారి ఉంటారు. ఈ సిట్‌ దర్యాప్తును సీబీఐ డైరెక్టర్‌ పర్యవేక్షించాలి. ఈ మొత్తం వ్యవహారాన్ని ఎంతమాత్రం రాజకీయ డ్రామాగా మారనివ్వబోం.  రాజకీయ పోరాటాలకు న్యాయస్థానాన్ని వేదిక కానివ్వబోము.– సుప్రీంకోర్టు   

సాక్షి, అమరావతి: తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ జరిగిందన్న ఆరోపణలపై విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రజల మనోభావాలు ముడిపడి ఉన్నందున ఈ వ్యవహారంపై స్వతంత్ర, నిష్పాక్షిక దర్యాప్తు అవసరమని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. తద్వారా దర్యాప్తు విశ్వసనీయత పెరుగుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్‌ స్థానంలో ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసేందుకు తామే ఓ స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. 

ఈ సిట్‌లో సీబీఐ డైరెక్టర్‌ నామినేట్‌ చేసిన ఇద్దరు సీనియర్‌ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసిన ఇద్దరు సీనియర్‌ పోలీసు అధికారులు, ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) చైర్‌పర్సన్‌ నామినేట్‌ చేసిన ఓ అధికారికి స్థానం కల్పించింది. ఈ సిట్‌ దర్యాప్తును స్వయంగా పర్యవేక్షించాలని సీబీఐ డైరెక్టర్‌ను ఆదేశించింది. ఈ మొత్తం వ్యవహారాన్ని ఎంతమాత్రం రాజకీయ డ్రామాగా మారనివ్వబోమంది. 

రాజకీయ పోరాటాలకు న్యాయస్థానాన్ని వేదిక కానివ్వబోమని తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ భూషణ్‌ రామకృష్ణ గవాయ్, జస్టిస్‌ కల్పతి వెంకటరామన్‌ విశ్వనాథన్‌ ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులతో నెయ్యి కల్తీపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలను పరిÙ్కరిస్తున్నట్లు ప్రకటించింది. 

స్వతంత్ర దర్యాప్తు కోసం వైవీ తదితరుల పిటిషన్లు... 
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతు కొవ్వులను కలిపారన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపణలపై వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఓ కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ బీజేపీ సీనియర్‌ నేత, ప్రముఖ ఆర్థికవేత డాక్టర్‌ సుబ్రమణియన్‌ స్వామి ఇటీవల సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు. 

అలాగే లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారంలో దర్యాప్తు, స్వతంత్ర విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తిని నియమించాలని కోరుతూ రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత వైవీ సుబ్బారెడ్డి కూడా పిల్‌ దాఖలు చేశారు. ఇదే అంశంపై ఇతర రాష్ట్రాలకు చెందిన సంపత్, శ్రీధర్, సురేష్‌ చవంకే వేర్వేరుగా రెండు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ నాలుగు వ్యాజ్యాలపై ఇటీవల విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. నెయ్యిలో జంతు కొవ్వులు కలిపారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన రాజకీయ ప్రకటనలపై అసహనం వ్యక్తం చేసింది. 

శ్రీవారి లడ్డూ నెయ్యిలో జంతు కొవ్వులు కలిశాయనేందుకు ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ను కొనసాగించాలా?లేక స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలా అనే విషయంపై కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి చెప్పాలని సొలిసిటర్‌ జనరల్‌ (ఎస్‌జీ) తుషార్‌ మెహతాను ఆదేశించిన విషయం తెలిసిందే. 

పత్రికా కథనాలను పట్టించుకోకండి.... 
తాజాగా శుక్రవారం ఈ వ్యాజ్యాలు మరోసారి విచారణకు వచ్చాయి. ఈ సందర్భంగా తుషార్‌ మెహతా స్పందిస్తూ.. ఇది దేశవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల మనోభావాలకు సంబంధించిన వ్యవహారమని పేర్కొనగా.. ధర్మాసనం స్పందిస్తూ, దేశం కాదని.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాలకు సంబంధించిందని తెలిపింది. ఈ వ్యవహారంలో ఆహార భద్రత కూడా ముడిపడి ఉందని ధర్మాసనం పేర్కొంది.  

తాము రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌కు వ్యతిరేకం కాదని, అయితే కేంద్ర ప్రభుత్వానికి చెందిన అధికారుల పర్యవేక్షణలో దర్యాప్తు జరగడం సబబుగా ఉంటుందని మెహతా చెప్పారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. స్వతంత్ర సంస్థ ద్వారా దర్యాప్తు చేయిస్తే అభ్యంతరం లేదని ముఖ్యమంత్రి చెప్పినట్లు తాము పత్రికల్లో చదివామని గుర్తు చేసింది. 

ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫు సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ, టీటీడీ తరఫు సీనియర్‌ న్యాయవాది సిద్దార్థ లూథ్రా జోక్యం చేసుకుంటూ పత్రికలు చాలా రాస్తున్నాయని, వాటిని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. టీటీడీ ఈవో చెప్పిన వాస్తవాలను వక్రీకరించాయని లూథ్రా తెలిపారు. దర్యాప్తు విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, దాన్ని కోర్టు పర్యవేక్షించినా కూడా ఇబ్బంది లేదని నివేదించారు. 

సీఎం వ్యాఖ్యలతో సిట్‌ దర్యాప్తు నిష్పాక్షికంగా జరిగే అవకాశమే లేదు... 
ఈ సమయంలో వైవీ సుబ్బారెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ జోక్యం చేసుకుంటూ.. ముఖ్యమంత్రి వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్‌ దర్యాప్తు నిష్పాక్షికంగా ఉండేందుకు అవకాశం లేదన్నారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు భిన్నంగా సిట్‌ దర్యాప్తు ఉండబోదని తెలిపారు. ముఖ్యమంత్రి చేసిన ప్రకటనలకు ఓ విలువ ఉంటుందన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలు ఖచ్చితంగా సిట్‌ దర్యాప్తుపై ప్రభావం చూపుతాయన్నారు. 

ఈ సమయంలో ముకుల్‌ రోహత్గీ జోక్యం చేసుకుంటూ 100 రోజుల పాలనపై ముఖ్యమంత్రి మాట్లాడారని చెప్పారు. ఆయన మాట్లాడిన సందర్భం వేరన్నారు. నేషనల్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ బోర్డు (ఎన్‌డీడీబీ) జూలైలో నివేదిక ఇచ్చిందన్నారు. దాని ఆధారంగా ముఖ్యమంత్రి మాట్లాడారని తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. జూలైలో నివేదిక వస్తే ముఖ్యమంత్రి సెపె్టంబర్‌లో ఎందుకు మాట్లాడారని ప్రశ్నించింది. 

ఆరోపణలు చాలా తీవ్రమైనవని, అందులో ఎలాంటి సందేహం లేదని వ్యాఖ్యానించింది. దీనిపై సిబల్‌ జోక్యం చేసుకుంటూ.. ఎన్‌డీడీబీ తన నివేదికలో ఎక్కడా జంతు కొవ్వు కలిసినట్లు చెప్పలేదని, వెజిటబుల్‌ ఫ్యాట్‌ మాత్రమే ఉన్నట్లు చెప్పిందని నివేదించారు. అయితే ఇందుకు విరుద్ధంగా జంతు కొవ్వు అంటూ ముఖ్యమంత్రి రాజకీయ ప్రకటనలు చేశారన్నారు. ఈ నేపథ్యంలో స్వతంత్ర దర్యాప్తు అవసరం ఎంతైనా ఉందని, ఆ దిశగా ఆదేశాలు జారీ చేయాలని ధర్మాసనాన్ని కోరారు. 

కల్తీ నెయ్యిని కొండపైకి ఎందుకు అనుమతించారు..? 
అనంతరం ధర్మాసనం స్పందిస్తూ.. జూలై 6, 12వ తేదీల్లో వచ్చిన ట్యాంకులను వెనక్కి పంపామని, ఆ నెయ్యిని లడ్డూ తయారీలో అసలు ఉపయోగించలేదని టీటీడీ ఈవో పలుమార్లు చెప్పారని గుర్తు చేసింది. మరి అలాంటప్పుడు కల్తీ జరిగిందని దేని ఆధారంగా చెబుతున్నారని ప్రశ్నించింది. ఆ రెండు తేదీల్లో వచ్చిన ట్యాంకర్లలో కల్తీ నెయ్యి ఉందని లూథ్రా పేర్కొనగా.. అలాంటప్పుడు కల్తీ నెయ్యిని కొండపైకి ఎందుకు అనుమతించారని సిబల్‌ ప్రశ్నించారు. 

అప్పుడు అధికారంలో ఉన్నది తాము కాదని, మీరేనని ఆయన లూథ్రాకు గుర్తు చేశారు. దీనిపై ధర్మాసనం జోక్యం చేసుకుంటూ స్వతంత్ర దర్యాప్తు అవసరమని, తద్వారా కోట్ల మంది భక్తుల్లో విశ్వాసం కలిగించినట్లు అవుతుందని తెలిపింది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ను పక్కనబెట్టి తామే ప్రత్యేక సిట్‌ను ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేస్తూ ఆ మేరకు ఉత్తర్వులు వెలువరించింది. 

రాజకీయ పోరాటాలకు వేదికగా చేసుకునేందుకు అనుమతించం...  
‘మేం ఆరోపణలు, ప్రత్యారోపణల జోలికి వెళ్లడం లేదు. ఇక్కడ మేం ఓ విషయం స్పష్టంగా చెప్పదలచుకున్నాం. కోర్టును రాజకీయ పోరాటాలకు వేదికగా వాడుకునేందుకు అనుమతించం. కోట్ల మంది భక్తుల మనోభావాలను పరిగణలోకి తీసుకుంటూ.. వారికి ఉపశమనం కలిగించేందుకు వీలుగా సీబీఐ, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అధికారులతో కూడిన స్వతంత్ర సిట్‌ను దర్యాప్తు నిమిత్తం ఏర్పాటు చేస్తున్నాం. 

ఈ ప్రత్యేక సిట్‌ దర్యాప్తు సీబీఐ డైరెక్టర్‌ పర్యవేక్షణలో జరగాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ స్థానంలో సీబీఐ డైరెక్టర్‌ నామినేట్‌ చేసిన ఇద్దరు సీబీఐ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసిన ఇద్దరు పోలీసు అధికారులు, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ చైర్‌పర్సన్‌ సిఫారసు చేసిన ఓ అధికారి ప్రత్యేక సిట్‌లో ఉంటారు’  

ధర్మాసనం ఉత్తర్వుల సారాంశం ఇదీ..
‘జూలై 6, 12వ తేదీల్లో రెండు ట్యాంకర్లలో సరఫరా చేసిన నెయ్యి కల్తీ అయినట్లు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లోని ఆరోపణల ప్రకారం కల్తీ అయిన నెయ్యిని లడ్డూ ప్రసాదంలో వినియోగించినట్లు చెప్పారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది భక్తుల మనసులను గాయపరిచినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. 

నెయ్యి కల్తీపై దర్యాప్తు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ను కొనసాగించాలా? లేక స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలా? అనే విషయంపై కేంద్ర హోంశాఖతో సంప్రదించి ఏ విషయం మాకు చెప్పాలని గత విచారణ సమయంలో సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాను కోరాం. 

రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌లోని సభ్యులు సీనియర్‌ అధికారులని, వారికి మంచి పేరు ఉందని మెహతా ఈ రోజు మాకు చెప్పారు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ ద్వారా దర్యాప్తును కొనసాగించాలని, అయితే ఆ దర్యాప్తును కేంద్ర ప్రభుత్వ అధికారులు పర్యవేక్షిస్తారని ఆయన మాకు నివేదించారు’  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement