adulteration
-
ఈ ‘టీ’తో నష్టాలే!
సాక్షి, హైదరాబాద్: నాసిరకమైన టీ పొడిలో కొబ్బరి చిప్ప పొడి, రసాయనాలు, రంగులు, చాక్లెట్ ఫ్లేవర్, మిల్క్ పౌడర్ కలిపి కల్తీ టీ పొడి తయారు చేస్తున్న ముఠాకు మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు చెక్ చెప్పారు. ముగ్గురు నిందితులను పట్టుకుని వారి నుంచి 300 కేజీల కల్తీ టీ పొడి, 200 కేజీల కొబ్బరి చిప్పల పొడి స్వా«దీనం చేసుకున్నట్లు డీసీపీ వైవీఎస్ సుదీంద్ర బుధవారం తెలిపారు. ఫతేనగర్‌కు చెందిన జగన్నాథ్ కోణార్క్ టీ పౌడర్ సేల్స్ అండ్ సప్లయర్స్ పేరుతో వ్యాపారం చేస్తున్నాడు. తేలిగ్గా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో కల్తీ టీ పొడి తయారీకి సిద్ధమయ్యాడు. మార్కెట్ నుంచి కేజీ రూ.80 ఖరీదు చేసే టీ పొడి, రసాయనాలు, రంగులు, ఫ్లేవర్స్‌తో పాటు కొబ్బరి చిప్పల పొడి కొనేవాడు. దీన్ని తన దుకాణానికి తీసుకువెళ్లి తన వద్ద పని చేసే ప్రతాప్, పరాదాలకు ఇచ్చే వాడు. వీళ్లు వాటన్నింటినీ కలిపి కల్తీ టీ పొడి తయారు చేసి ప్యాక్ చేసే వారు. ఈ పొడిని కేజీ రూ.250కి అమ్మే జగన్నాథ్ లాభాలు ఆర్జిస్తున్నాడు. ఈ టీ పొడిని ఎక్కువగా చిన్న చిన్న దుకాణదారులతో పాటు రోడ్డు పక్కన టీ స్టాల్స్‌కు అమ్మేవాడు. వీరి వ్యవహారంపై సమాచారం అందుకున్న మధ్య మండల టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎన్.రామకృష్ణ నేతృత్వంలో ఎస్సై డి.శ్రీకాంత్ గౌడ్ వలపన్ని ముగ్గురినీ పట్టుకున్నారు. నిందితులతో పాటు స్వాధీనం చేసుకున్న సరుకును సనత్‌నగర్ పోలీసులకు అప్పగించారు. జగన్నాథ్‌పై ఇప్పటికే మోమిన్‌పేట్, సనత్‌నగర్ ఠాణాల్లో మూడు ఇదే తరహా కేసులు ఉన్నాయని, అయినప్పటికీ అతడు తన పంథా కొనసాగస్తున్నాడని డీసీపీ తెలిపారు. కల్తీ పొడితో చేసిన టీ తాగడం వల్ల కేన్సర్, కామెర్లు సహా అనేక వ్యాధుల బారినపడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. -
‘బాబు సిట్’ను పక్కన పెట్టిన ‘సుప్రీం..’ ఇక 'సీబీఐ సిట్'
ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రజల మనోభావాలు ముడిపడి ఉన్నందున తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై స్వతంత్ర, నిష్పాక్షిక దర్యాప్తు అవసరం. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ స్థానంలో ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసేందుకు ఓ స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో సీబీఐ డైరెక్టర్ నామినేట్ చేసిన ఇద్దరు సీనియర్ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసిన ఇద్దరు సీనియర్ పోలీసు అధికారులు, ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) చైర్పర్సన్ నామినేట్ చేసిన ఓ అధికారి ఉంటారు. ఈ సిట్ దర్యాప్తును సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షించాలి. ఈ మొత్తం వ్యవహారాన్ని ఎంతమాత్రం రాజకీయ డ్రామాగా మారనివ్వబోం. రాజకీయ పోరాటాలకు న్యాయస్థానాన్ని వేదిక కానివ్వబోము.– సుప్రీంకోర్టు సాక్షి, అమరావతి: తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ జరిగిందన్న ఆరోపణలపై విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) సుప్రీంకోర్టు పక్కన పెట్టింది. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ప్రజల మనోభావాలు ముడిపడి ఉన్నందున ఈ వ్యవహారంపై స్వతంత్ర, నిష్పాక్షిక దర్యాప్తు అవసరమని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. తద్వారా దర్యాప్తు విశ్వసనీయత పెరుగుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ స్థానంలో ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసేందుకు తామే ఓ స్వతంత్ర ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సిట్‌లో సీబీఐ డైరెక్టర్ నామినేట్ చేసిన ఇద్దరు సీనియర్ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసిన ఇద్దరు సీనియర్ పోలీసు అధికారులు, ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) చైర్పర్సన్ నామినేట్ చేసిన ఓ అధికారికి స్థానం కల్పించింది. ఈ సిట్ దర్యాప్తును స్వయంగా పర్యవేక్షించాలని సీబీఐ డైరెక్టర్‌ను ఆదేశించింది. ఈ మొత్తం వ్యవహారాన్ని ఎంతమాత్రం రాజకీయ డ్రామాగా మారనివ్వబోమంది. రాజకీయ పోరాటాలకు న్యాయస్థానాన్ని వేదిక కానివ్వబోమని తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్, జస్టిస్ కల్పతి వెంకటరామన్ విశ్వనాథన్ ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులతో నెయ్యి కల్తీపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలను పరిÙ్కరిస్తున్నట్లు ప్రకటించింది. స్వతంత్ర దర్యాప్తు కోసం వైవీ తదితరుల పిటిషన్లు... తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతు కొవ్వులను కలిపారన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపణలపై వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఓ కమిటీని ఏర్పాటు చేయాలని కోరుతూ బీజేపీ సీనియర్ నేత, ప్రముఖ ఆర్థికవేత డాక్టర్ సుబ్రమణియన్ స్వామి ఇటీవల సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. అలాగే లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారంలో దర్యాప్తు, స్వతంత్ర విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తిని నియమించాలని కోరుతూ రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్సీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి కూడా పిల్ దాఖలు చేశారు. ఇదే అంశంపై ఇతర రాష్ట్రాలకు చెందిన సంపత్, శ్రీధర్, సురేష్ చవంకే వేర్వేరుగా రెండు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ నాలుగు వ్యాజ్యాలపై ఇటీవల విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. నెయ్యిలో జంతు కొవ్వులు కలిపారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన రాజకీయ ప్రకటనలపై అసహనం వ్యక్తం చేసింది. శ్రీవారి లడ్డూ నెయ్యిలో జంతు కొవ్వులు కలిశాయనేందుకు ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ను కొనసాగించాలా?లేక స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలా అనే విషయంపై కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి చెప్పాలని సొలిసిటర్ జనరల్ (ఎస్జీ) తుషార్ మెహతాను ఆదేశించిన విషయం తెలిసిందే. పత్రికా కథనాలను పట్టించుకోకండి.... తాజాగా శుక్రవారం ఈ వ్యాజ్యాలు మరోసారి విచారణకు వచ్చాయి. ఈ సందర్భంగా తుషార్ మెహతా స్పందిస్తూ.. ఇది దేశవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల మనోభావాలకు సంబంధించిన వ్యవహారమని పేర్కొనగా.. ధర్మాసనం స్పందిస్తూ, దేశం కాదని.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల మనోభావాలకు సంబంధించిందని తెలిపింది. ఈ వ్యవహారంలో ఆహార భద్రత కూడా ముడిపడి ఉందని ధర్మాసనం పేర్కొంది. తాము రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌కు వ్యతిరేకం కాదని, అయితే కేంద్ర ప్రభుత్వానికి చెందిన అధికారుల పర్యవేక్షణలో దర్యాప్తు జరగడం సబబుగా ఉంటుందని మెహతా చెప్పారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. స్వతంత్ర సంస్థ ద్వారా దర్యాప్తు చేయిస్తే అభ్యంతరం లేదని ముఖ్యమంత్రి చెప్పినట్లు తాము పత్రికల్లో చదివామని గుర్తు చేసింది. ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, టీటీడీ తరఫు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా జోక్యం చేసుకుంటూ పత్రికలు చాలా రాస్తున్నాయని, వాటిని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. టీటీడీ ఈవో చెప్పిన వాస్తవాలను వక్రీకరించాయని లూథ్రా తెలిపారు. దర్యాప్తు విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, దాన్ని కోర్టు పర్యవేక్షించినా కూడా ఇబ్బంది లేదని నివేదించారు. సీఎం వ్యాఖ్యలతో సిట్ దర్యాప్తు నిష్పాక్షికంగా జరిగే అవకాశమే లేదు... ఈ సమయంలో వైవీ సుబ్బారెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ జోక్యం చేసుకుంటూ.. ముఖ్యమంత్రి వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ దర్యాప్తు నిష్పాక్షికంగా ఉండేందుకు అవకాశం లేదన్నారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు భిన్నంగా సిట్ దర్యాప్తు ఉండబోదని తెలిపారు. ముఖ్యమంత్రి చేసిన ప్రకటనలకు ఓ విలువ ఉంటుందన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలు ఖచ్చితంగా సిట్ దర్యాప్తుపై ప్రభావం చూపుతాయన్నారు. ఈ సమయంలో ముకుల్ రోహత్గీ జోక్యం చేసుకుంటూ 100 రోజుల పాలనపై ముఖ్యమంత్రి మాట్లాడారని చెప్పారు. ఆయన మాట్లాడిన సందర్భం వేరన్నారు. నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (ఎన్డీడీబీ) జూలైలో నివేదిక ఇచ్చిందన్నారు. దాని ఆధారంగా ముఖ్యమంత్రి మాట్లాడారని తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. జూలైలో నివేదిక వస్తే ముఖ్యమంత్రి సెపె్టంబర్లో ఎందుకు మాట్లాడారని ప్రశ్నించింది. ఆరోపణలు చాలా తీవ్రమైనవని, అందులో ఎలాంటి సందేహం లేదని వ్యాఖ్యానించింది. దీనిపై సిబల్ జోక్యం చేసుకుంటూ.. ఎన్డీడీబీ తన నివేదికలో ఎక్కడా జంతు కొవ్వు కలిసినట్లు చెప్పలేదని, వెజిటబుల్ ఫ్యాట్ మాత్రమే ఉన్నట్లు చెప్పిందని నివేదించారు. అయితే ఇందుకు విరుద్ధంగా జంతు కొవ్వు అంటూ ముఖ్యమంత్రి రాజకీయ ప్రకటనలు చేశారన్నారు. ఈ నేపథ్యంలో స్వతంత్ర దర్యాప్తు అవసరం ఎంతైనా ఉందని, ఆ దిశగా ఆదేశాలు జారీ చేయాలని ధర్మాసనాన్ని కోరారు. కల్తీ నెయ్యిని కొండపైకి ఎందుకు అనుమతించారు..? అనంతరం ధర్మాసనం స్పందిస్తూ.. జూలై 6, 12వ తేదీల్లో వచ్చిన ట్యాంకులను వెనక్కి పంపామని, ఆ నెయ్యిని లడ్డూ తయారీలో అసలు ఉపయోగించలేదని టీటీడీ ఈవో పలుమార్లు చెప్పారని గుర్తు చేసింది. మరి అలాంటప్పుడు కల్తీ జరిగిందని దేని ఆధారంగా చెబుతున్నారని ప్రశ్నించింది. ఆ రెండు తేదీల్లో వచ్చిన ట్యాంకర్లలో కల్తీ నెయ్యి ఉందని లూథ్రా పేర్కొనగా.. అలాంటప్పుడు కల్తీ నెయ్యిని కొండపైకి ఎందుకు అనుమతించారని సిబల్ ప్రశ్నించారు. అప్పుడు అధికారంలో ఉన్నది తాము కాదని, మీరేనని ఆయన లూథ్రాకు గుర్తు చేశారు. దీనిపై ధర్మాసనం జోక్యం చేసుకుంటూ స్వతంత్ర దర్యాప్తు అవసరమని, తద్వారా కోట్ల మంది భక్తుల్లో విశ్వాసం కలిగించినట్లు అవుతుందని తెలిపింది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ను పక్కనబెట్టి తామే ప్రత్యేక సిట్‌ను ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేస్తూ ఆ మేరకు ఉత్తర్వులు వెలువరించింది. రాజకీయ పోరాటాలకు వేదికగా చేసుకునేందుకు అనుమతించం... ‘మేం ఆరోపణలు, ప్రత్యారోపణల జోలికి వెళ్లడం లేదు. ఇక్కడ మేం ఓ విషయం స్పష్టంగా చెప్పదలచుకున్నాం. కోర్టును రాజకీయ పోరాటాలకు వేదికగా వాడుకునేందుకు అనుమతించం. కోట్ల మంది భక్తుల మనోభావాలను పరిగణలోకి తీసుకుంటూ.. వారికి ఉపశమనం కలిగించేందుకు వీలుగా సీబీఐ, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారులతో కూడిన స్వతంత్ర సిట్‌ను దర్యాప్తు నిమిత్తం ఏర్పాటు చేస్తున్నాం. ఈ ప్రత్యేక సిట్ దర్యాప్తు సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో జరగాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ స్థానంలో సీబీఐ డైరెక్టర్ నామినేట్ చేసిన ఇద్దరు సీబీఐ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసిన ఇద్దరు పోలీసు అధికారులు, ఎఫ్ఎస్ఎస్ఏఐ చైర్పర్సన్ సిఫారసు చేసిన ఓ అధికారి ప్రత్యేక సిట్‌లో ఉంటారు’ ధర్మాసనం ఉత్తర్వుల సారాంశం ఇదీ..‘జూలై 6, 12వ తేదీల్లో రెండు ట్యాంకర్లలో సరఫరా చేసిన నెయ్యి కల్తీ అయినట్లు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్లోని ఆరోపణల ప్రకారం కల్తీ అయిన నెయ్యిని లడ్డూ ప్రసాదంలో వినియోగించినట్లు చెప్పారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది భక్తుల మనసులను గాయపరిచినట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. నెయ్యి కల్తీపై దర్యాప్తు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ను కొనసాగించాలా? లేక స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించాలా? అనే విషయంపై కేంద్ర హోంశాఖతో సంప్రదించి ఏ విషయం మాకు చెప్పాలని గత విచారణ సమయంలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను కోరాం. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌లోని సభ్యులు సీనియర్ అధికారులని, వారికి మంచి పేరు ఉందని మెహతా ఈ రోజు మాకు చెప్పారు. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ద్వారా దర్యాప్తును కొనసాగించాలని, అయితే ఆ దర్యాప్తును కేంద్ర ప్రభుత్వ అధికారులు పర్యవేక్షిస్తారని ఆయన మాకు నివేదించారు’ -
కొనసాగుతున్న సిట్ దర్యాప్తు
తిరుమల: తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ అంటూ అసత్య ఆరోపణలు చేసిన చంద్రబాబే వేసిన సిట్ సోమవారం కూడా విచారణ కొనసాగించింది. సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠీ నేతృత్వంలోని బృందం తిరుమలలో ల్యాబ్‌ను పరిశీలించి నాణ్యతా ప్రమాణాలను ఎలా గుర్తిస్తారో సిబ్బందిని అడిగి తెలుసుకుంది. అనంతరం నెయ్యిని నిల్వ చేసే గోదాముకు చేరుకుని ఇక్కడ ఎన్ని రోజులు ఉంచుతారు, నాణ్యతా పరీక్షల నిమిత్తం ఎప్పుడు శాంపిళ్లు తీసుకుంటారు, శాంపిల్ తీసుకున్న అనంతరం ఎలాంటి పరీక్షలు నిర్వహిస్తారు, టెండర్‌దారుడు ప్రమాణాల మేరకు సరఫరా చేశారా లేదా అనేది ఎలా నిర్ధారిస్తారు, ఒకవేళ కల్తీ జరిగితే.. ఆ విషయాన్ని పసిగట్టే పరికరాలు ల్యాబ్‌లో ఉన్నాయా వంటి వివరాలను అధికారులు, సిబ్బంది నుంచి సేకరించారు.ల్యాబ్‌లో తనిఖీలు నిర్వహిస్తుండగా.. అప్పటికే ల్యాబ్‌కు చేరుకున్న ట్యాంకర్లలోని నెయ్యిని పరిశీలించిన అధికారులు, ల్యాబ్ సిబ్బంది నెయ్యి నాణ్యతా పరీక్షలు ఎలా జరుపుతారో ప్రత్యక్షంగా పరిశీలించారు. గతంలో టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన టెండర్‌దారుల వివరాలను, నాణ్యతా పరీక్షల నివేదికలను అధికారులు సేకరించారు. కల్తీ నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డెయిరీ ఎప్పటి నుంచి నెయ్యి సరఫరా చేసింది, ఆ నెయ్యిలో నాణ్యత లేదని ఎప్పుడు గుర్తించారు, నెయ్యిని పరీక్షల కోసం పంపించాలని ఎవరు ఆదేశించారన్న సమాచారాన్ని కూడా అధికారులు సేకరించారు. అనంతరం త్రిపాఠీ నేతృత్వంలోని అధికారుల బృందం పోలీస్ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని గత మూడు రోజులుగా లభ్యమైన ఆధారాలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తరువాత సిట్ చీఫ్ నేతృత్వంలోని బృందం తిరుపతి బయలుదేరి వెళ్లిపోగా.. డీఎస్పీ స్థాయి నేతృత్వంలోని అధికార బృందం మాత్రం ఇంకా ల్యాబ్‌లో తనిఖీలు నిర్వహిస్తూ.. పాత రికార్డులను పరిశీలించింది.నేడు లడ్డూ పోటు, విక్రయ కేంద్రాల్లో విచారణ మంగళవారం లడ్డూ పోటు, లడ్డూ విక్రయ కేంద్రాలు, లడ్డూ తయారీకి వినియోగించే ముడి సరుకులను పరిశీలించి.. లడ్డూ తయారీలో పాల్గొంటున్న శ్రీవైష్ణవులను విచారించనున్నట్టు సమాచారం. మరో బృందం తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో నెయ్యి కొనుగోలు, ఒప్పందాలు, నాణ్యమైన నెయ్యి సరఫరా కోసం టీటీడీ, ఏఆర్ డెయిరీ మధ్య జరిగిన ఒప్పందాలను పరిశీలించనుంది. టెండర్ల నిబంధనల్లో మార్పులు చేయడానికి దారి తీసిన పరిస్ధితులపై కూడా సిట్ బృందం దర్యాప్తు చేయనుంది. సిట్ బృందం మరో రెండు రోజుల పాటు తిరుమల, తిరుపతిలో ఉండి విచారణ నిర్వహించనుంది. సిట్ కార్యకలాపాల కోసం టీటీడీ శ్వేత భవనంలో కార్యాలయం ఏర్పాటు చేసేందుకు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. -
కల్తీ చేస్తే జైలు‘పాలు’.. ఏపీలో కీలక చట్టం.. త్వరలో అమలు
సాక్షి, అమరావతి: పాల సేకరణ, విక్రయాల సందర్భంగా కల్తీలు, మోసాలకు పాల్పడితే డెయిరీల నిర్వాహకులు, సంబంధిత వ్యాపారులు ఇకపై కటకటాల ఊచలు లెక్క పెట్టాల్సిందే. ఈ తరహా మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు దేశంలో మరెక్కడా లేనివిధంగా పాల సేకరణ (రైతు రక్షణ), నాణ్యమైన పాల వినియోగ చట్టం–2023ను రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే అమలులోకి తీసుకురాబోతోంది. ఇటీవలే అసెంబ్లీ ఆమోదం పొందిన ఈ చట్టం అమలుకు సంబంధించి ఎస్ఓపీ (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) రూపకల్పన కోసం పశు సంవర్థక శాఖ కసరత్తు చేస్తోంది. గతంలోనూ చట్టాలున్నా.. గతంలో తూనికలు, కొలతలు శాఖ, మునిసిపాలిటీల ఆధ్వర్యంలోని ప్రజారోగ్య విభాగాలు మాత్రమే పాల విక్రయాల్లో జరిగే లోపాలపై అడపాదడపా దృష్టి సారించేవి. ఆ రెండు విభాగాలకూ ఇతర పనులు సైతం ఉండటంతో పాల విక్రయాలపై పెద్దగా దృష్టి సారించేవి కాదు. దీనివల్ల యథేచ్ఛగా అక్రమాలు సాగిపోయేవి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం పశు సంవర్థక శాఖ అధికారులను సైతం రంగంలోకి దించింది. పాల సేకరణ సందర్భంగా మిల్క్ అనలైజర్స్, వేయింగ్ మెషిన్స్ను డెయిరీల నిర్వాహకులు అనుకూలంగా మార్చుకుని అక్రమాలకు పాల్పడుతుండటంతో తూనికలు, కొలతల చట్టం ప్రకారం వాటిని తనిఖీ చేసే అధికారాలను 2021 నవంబర్ నుంచి ప్రభుత్వం పశు వైద్యులకు అప్పగించింది. దీంతో రంగంలోకి దిగిన పశు వైద్య బృందాలు ఏడాదిన్నర కాలంలో 3,704 దాడులు నిర్వహించి కేసులు నమోదు చేశాయి. 151 ఉల్లంఘనలపై జరిమానాలు విధించడం ద్వారా అక్రమాలకు కొంతమేర అడ్డుకట్ట వేయగలిగారు. అయితే, మోసాలకు కారణమైన అనలైజర్స్, ఇతర పరికరాలను సీజ్ చేయడం, ఇందుకు బాధ్యులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అధికారం పశు సంవర్థక శాఖకు లేకుండాపోయింది. అక్రమాలకు చెక్ పెట్టేలా కొత్త చట్టం ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ తరహా మోసాలకు పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి నియమ, నిబంధనలన్నీ ఒకే గొడుగు కిందకు తీసుకు రావాలన్న సంకల్పంతో పాల సేకరణ (రైతు రక్షణ), నాణ్యమైన పాల వినియోగం చట్టం–2023ను తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం మిల్క్ అనలైజర్స్తో పాటు పాల సేకరణ కేంద్రాలు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు (బీఎంసీయూ), ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్ల (ఏఎంసీయూ)పై పశు సంవర్థక శాఖ పర్యవేక్షణలోకి తీసుకొచ్చారు. ఇందుకోసం మిల్క్ ఇన్స్పెక్టర్లు, ఇతర అధికారులను పశు సంవర్థక శాఖ నియమిస్తుంది. మిల్క్ అనలైజర్స్ నిర్వహించే వ్యక్తులు కచ్చితంగా పశు సంవర్థక శాఖ నుంచి లైసెన్సులు తీసుకోవాల్సి ఉంటుంది. నాణ్యత ప్రమాణాలు పాటించని మిల్క్ అనలైజర్స్‌ను జప్తు చేస్తారు. పాల నాణ్యత పాటించకపోతే ఫుడ్ సేఫ్టీ, నాణ్యత ప్రమాణాల యాక్టు 2006 ప్రకారం చర్యలు తీసుకుంటారు. మోసాలకు పాల్పడితే జరిమానాలు, శిక్షలు ఇలా.. ♦ అనుమతి లేకుండా మిల్క్ అనలైజర్స్ కలిగిన వ్యక్తికి రూ.50 వేల వరకు జరిమానా, 6 నెలల జైలుశిక్ష విధిస్తారు. అనుమతి లేకుండా బీఎంసీయూలు, ఏఎంసీయూలు అనలైజర్స్ వాడితే రూ.లక్ష వరకు జరిమానా విధిస్తారు. రెండోసారి నేరానికి ఏడాదిపాటు కఠిన కారాగార శిక్షతో పాటు జరిమానా విధిస్తారు. ♦ మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్, డెయిరీలు మిల్క్ అనలైజర్లను అనధికారికంగా, అనుమతి లేకుండా పొంది ఉంటే రూ.5 లక్షల వరకు జరిమానా విధిస్తారు. తదుపరి నేరానికి రెండేళ్ల కారాగార శిక్షతో పాటు జరిమానా విధిస్తారు. ♦ మిల్క్ అనలైజర్లను దుర్వినియోగపరిచే వారికి రూ.50 వేల వరకు జరిమానా, 6 నెలలకు తగ్గకుండా జైలుశిక్ష విధిస్తారు. నేర తీవ్రతను బట్టి ఐదేళ్ల వరకు పొడిగించే అవకాశం ఉంది. ♦ లైసెన్స్ లేకుండా పాలను సేకరిస్తే రూ.50 వేల వరకు జరిమానా విధిస్తారు. రెండోసారి నేరానికి రూ.లక్ష వరకు జరిమానా, 6 నెలల కారాగార శిక్ష లేదా రెండూ విధిస్తారు. ♦ లైసెన్సు లేకుండా మిల్క్ అనలైజర్ల సర్వీసింగ్ సెంటర్లు నిర్వహించే వారికి రూ.25 వేల జరిమానా విధిస్తారు. రెండోసారి నేరానికి పాల్పడితే రూ.50 వేల వరకు జరిమానా లేదా ఏడాది కారాగార శిక్ష విధిస్తారు. ఒక్కోసారి రెండూ విధించే అవకాశం ఉంది. ♦ పాడి రైతుకు నిర్దేశిత ధర చెల్లించకపోయినా.. ఫ్యాట్, ఎస్ఎన్ఎఫ్ శాతాలను తక్కువగా చూపించి మోసానికి పాల్పడినా రూ.50 వేల వరకు జరిమానా విధిస్తారు. రెండోసారి నేరానికి రూ.లక్ష జరిమానా లేదా 6 నెలల కారాగార శిక్ష లేదా రెండూ విధిస్తారు. రైతులు, వినియోగదారుల రక్షణ కోసమే.. పాల సేకరణలో దళారులు, వ్యాపారులు పాల్పడే మోసాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు వినియోగదారులకు నాణ్యమైన పాలను సరఫరా చేయడమే లక్ష్యంగా దేశంలో మరెక్కడా లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం పాడి రైతులకు పూర్తి రక్షణ కల్పిస్తుంది. – సీదిరి అప్పలరాజు, పశు సంవర్థక శాఖ మంత్రి -
‘కల్తీ’ కథలు.. ఒకటేమిటీ అన్నీ అంతే.. తినేదెలా? బతికేదెలా?
కేసరి దాల్పైనే దాడులు పట్టణంలోని రాజీవ్నగర్కాలనీలోని ఓ ఇంట్లో దాచిన 112 బస్తాల నిషేధిత కేసరిదాల్ను 2017లో సీజ్‌చేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయగఢ్ నుంచి సరుకు ఇక్కడికి అక్రమంగా వస్తున్నట్టు అప్పట్లో అధికారుల విచారణలో తేలింది. 2018లో సైతం పుడ్‌సేప్టీ అధికారులు పలమనేరు ప్రాంతంలోని పలు వారపుసంతల్లో కల్తీ సరుకులపై దాడులు చేపట్టి భారీగా జరిమానాలు విధించారు. ఎముకలతో నూనెలు పలమనేరు సమీపంలోని గడ్డూరు వద్ద ఓ ఇంట్లో టన్నులకొద్దీ దాచి ఉంచిన ఎముకలను అధికారులు సీజ్ చేశారు. తమిళనాడులోని కబేళాలనుంచి వీటిని సేకరించి ఇక్కడ ఎండబెట్టి నూనెను తయారు చేస్తున్నారని అధికారులు గుర్తించారు. దీంతో అప్పట్లో జిల్లా వ్యాప్తంగా వంటనూనెలపై తనిఖీలు చేశారు. ఇలాంటి సంఘటనలు జరిగినపుడు అధికారులు హడావుడి చేసి, ఆ తరువాత మళ్లీ పట్టించుకోవడంలేదు. దీంతో అక్రమార్కులు మళ్లీ కల్తీ సరుకును మార్కెట్లో్లకి తెచ్చి అమ్మకాలు మొదలెట్టారు. మధ్య తరగతి ప్రజలే లక్ష్యంగా కల్తీ వ్యాపారం సాగుతోంది. చౌక బేరమే ఈ కల్తీ వ్యాపారానికి ఆధారంగా మారింది. ఈ జిల్లా మూడు రాష్ట్రాల సరిహద్దులో ఉండడం అక్రమార్కులకు కలసి వచ్చింది. తమిళనాడు నుంచి యథేచ్ఛగా కల్తీ సరుకు మార్కెట్లోకి దిగుతోంది. వారపు సంతల్లో అమ్ముడవుతోంది. మరోవైపు దుకాణాలు, హోటళ్లు, టీ స్టాళ్లు వంటి ఆహార పదార్థాలు విక్రయించే కేంద్రాలకు గుట్టు చప్పుడు కాకుండా చేరిపోతోంది. ఇలా కల్తీ సరుకు ప్రజల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఇంత జరుగుతున్నా అధికార యంత్రాంగం కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిస్తోంది. పలమనేరు (చిత్తూరు): జిల్లాలో ఆహార పదార్థాల కల్తీ జోరందుకుంది. పప్పు దినుసులు, టీపొడి, నూనెలు తదితరాల్లో ఈ కల్తీలు యథేచ్ఛగా సాగుతున్నాయి. దీంతోపాటు కేసరి దాల్ అమ్మకాలు వారపు సంతల్లో భారీగా సాగుతున్నట్టు తెలుస్తోంది. సరిహద్దుల్లోని కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి కల్తీ సరుకులు ఇక్కడికి గుట్టుగా రవాణా అవుతున్నాయి. ఇలాంటి కల్తీ పదార్థాలను తింటే అనారోగ్యం తప్పదని తెలిసినా ఫుడ్‌సేఫ్టీ అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. కల్తీ ఇలా వంటనూనెలే అధికం దుకాణాలకు వస్తున్న సరుకుల్లో ఒకటో రకం, రెండో రకం అంటూ స్థానిక వ్యాపారులే ఏది అసలో, ఏది నకిలీనో కనుక్కోలేకపోతున్నారు. బియ్యం మొదలుకొని శెనగపప్పు, కందిపప్పు, చక్కెర, పెసరపప్పు, మైదాపిండి, గసాలు, రవ్వ, జీలకర్ర, మిరియాలు, ఆఖరుకు వంటనూనెలు కల్తీ అవుతున్నాయి. ఈ కల్తీ వ్యాపారం అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. స్థానికంగా దుకాణాల్లో లభించే ప్రముఖ కంపెనీల నూనె ప్యాకెట్లు ఈ ప్రాంతంలోని వారపు సంతల్లో సైతం అదే కంపెనీల పేరుతో నకిలీ ప్యాకెట్లు లభ్యమవుతున్నాయి. ధరలో కూడా భారీ తేడా ఉండడంతో ప్రజలు ఎగబడి వీటినే కొనుగోలు చేస్తున్నారు. అదే అదనుగా లీటరు ప్యాకెట్లలో 900 మిల్లీలీటర్ల నూనె నింపి సులభంగా సొమ్ముచేసుకుంటున్నారు. చోద్యం చూస్తున్న ఫుడ్ సేఫ్టీ విభాగం ఆహార పదార్థాల కల్తీని అరికట్టేందుకు జిల్లా మొత్తానికి ఇద్దరు ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. అయితే వారు దుకాణాల వైపు కన్నెత్తి చూడడం లేదు. సంబందిత మున్సిపల్ కమిషనర్లకు తనిఖీలు చేసే అధికారం లేదు. ప్రభుత్వం ఫుడ్‌సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్‌ను అమలు చేస్తున్నా ఇలాంటి అక్రమాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. దీనిపై ఆహార కల్తీ నిరోధక శాఖ విచారణాధికారిగా వ్యవహరిస్తున్న జాయింట్ కలెక్టర్ అయినా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. తమిళనాడునుంచి వచ్చిన కల్తీ టీపొడి టీపొడి భారీ వ్యాపారం కల్తీ టీ పొడి అక్రమార్కుల పంట పండిస్తోంది. సాధారణంగా మార్కెట్లో పావు కిలో బ్రాండెడ్ టీ పొడి కొనాలంటే రూ.150 నుంచి రూ.200 వరకు ఖర్చు పెట్టాలి. అంటే కిలో రూ.600 నుంచి రూ.800 వరకు ఉంది. అది కల్తీ టీ పొడి అయితే కిలో రూ.170కే దొరుకుతోంది. వినియోగించిన టీ పొడిలో చింతగింజల పొడి, రసాయనాలతో కూడిన చాక్లెట్ పొడి కలిపి చౌకగా దొరికే టీ పొడిని విక్రయిస్తున్నారు. ఈ చాక్లెట్ పొడిని కలపడం వల్ల ఎంత ఉడికించినా టీ రంగు మారదు. జిల్లాలోని పలు టీ దుకాణాల్లో ఈ కల్తీ టీపొడినే వాడుతున్నారు. దీని వల్ల వ్యాపారులకు ఆదాయం అధికంగా వస్తోంది. క్వింటాళ్ల కొద్దీ కల్తీ టీ పొడిని జిల్లాలోని మార్కెట్లో విక్రయించేస్తున్నారు. నిల్వ ఉంచిన కేసరిదాల్ను సీజ్ చేసిన అధికారి (ఫైల్) కేసరి దాల్‌పై 1961 నుంచే నిషేధం జిల్లాలో ప్రమాదకర కేసరి దాల్(లంకపప్పు) అమ్మకాలు మళ్లీ ఊపందుకున్నాయి. వీటిని తింటే పలు రకాల ఆరోగ్య సమస్యలు ఖాయం. ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, అశోం రాష్ట్రాల్లో విరివిగా పండే లతిరస్ సటివస్ అనే మొక్క గింజలను పప్పులుగా చేస్తారు. వాటికి రసాయన రంగులను కలిపి కేసరి దాల్ పేరుతో మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఇందులో న్యూరో టాక్సిన్ అనే విష పదార్థం ఉంటుంది. వీటిని తింటే నరాలకు సంబంధించిన వ్యాధులు వస్తాయి. అందుకే ప్రభుత్వం 1961 నుంచి ఈ పంటపై నిషేధం విధించింది. కానీ ఈ పప్పు ధర చౌకగా ఉండడంతో జనం దీన్ని కొనుగోలు చేస్తూ ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. గతంలో పలమనేరు సమీపంలో అధికారులు సీజ్ చేసిన ఎముకల గోడోన్ కబేళాల నుంచి బోన్ ఆయిల్ జిల్లాలోని పలు పట్టణాల్లో తమిళనాడులోని కబేళాలతో లభ్యమయ్యే ఎముకలనుంచి తయారవుతున్న నూనెలను లూజు పామోలిన్, శెనిగనూనెలో కలిపి గట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తున్నట్లు గతంలోనే అధికారులు గుర్తించారు. ముఖ్యంగా చిత్తూరు, నగిరి, పుత్తూరు, కుప్పం, పలమనేరు, పుంగనూరు తదితర ప్రాంతాల్లో చికెన్ కబాబ్ సెంటర్లు, కొన్ని హోటళ్లలో బిరియానీ, బోండా, బజ్జీలతో పాటు స్వీట్స్టాల్స్లో ఈ కల్తీ నూనెలు వినియోగిస్తున్నారు. తమిళనాడుకు చెందిన వ్యాపారులు ముఠాగా ఏర్పడి ఈ కల్తీ దందాను నడిపిస్తున్నారు. కారుచౌకగా ఈ నూనెను జిల్లాలో విక్రయిస్తున్నట్టు సమాచారం. పొట్టేలు మటన్‌లో లేగదూడల మాంసాన్ని సైతం కలిపి విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. జీర్ణకోశ వ్యాధులు వస్తాయి వంటనూనెల కల్తీతో జీర్ణకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. తొలుత గ్యాస్స్ట్రిక్తో ఈ సమస్య ప్రారంభమై ఆ తర్వాత తీవ్ర స్థాయికి వెళుతుంది. కల్తీ ఆహార పదార్థాలను తిన్న వెంటనే చర్మంపై దురదలు, అలర్జీ వచ్చిందంటే వెంటనే అక్కడ కల్తీ జరిగినట్లు భావించవచ్చు. కల్తీ అయిన నూనెలతో తయారు చేసే ఆహారపదార్థాలు, మధుమేహ వ్యాధి ఉన్నవారికి చాలా ప్రమాదకరం. – డా.హరగోపాల్, వైద్యాధికారి, పలమనేరు ఏరియా ఆస్పత్రి ఆకస్మిక దాడులు చేస్తాం జిల్లాలో కల్తీ ఆహార పదార్థాలు, వంటనూనెలు, హోటళ్లలో మాంసాహార పదార్థాలు, పప్పులు, రెండోరకం వస్తువులు, వారపుసంతలో విడి విక్రయ సరుకులపై త్వరలో ఆకస్మిక దాడులు నిర్వహిస్తాం. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న మన జిల్లాలో కల్తీ సరుకుల విక్రయానికి అవకాశం ఉంటుంది. దీనిపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం. తక్కువ ధరతో లభిస్తోందని ఏ వస్తువులను కొనుగోలు చేయొద్దు. – సతీష్‌కుమార్, ఫుడ్ ఇన్స్పెక్టర్, చిత్తూరు -
కల్లోలం రేపుతున్న కల్తీ కల్లు
సాక్షి, వికారాబాద్: వికారాబాద్ జిల్లాలో కల్తీ కల్లు భయం ఇంకా వీడలేదు. నవాబుపేట, వికారాబాద్ మండలాల్లోని పల్లెల్లో జనం భయాందోళన చెందుతున్నారు. కల్తీ కల్లుతో సోమవారం మరొకరు మృతి చెందారు. నవాబుపేట మండలం వట్టిమీనపల్లికి చెందిన వృద్ధుడు కొమురయ్య (90) చికిత్స పొందుతూ చనిపోయాడు. ఆయన శుక్రవారం కల్లు తాగాడు. శనివారం ఉదయం నిద్ర లేవగానే కొద్దిసేపటికి కిందపడి పోయాడు. కుటుంబీకులు ఆయనను వికారాబాద్‌లోని మిషన్ ఆస్పత్రికి, ఆపై హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అయితే చికిత్సకు కొమురయ్య శరీరం స్పందించలేదు. ఈ క్రమంలో సోమవారం మృతి చెందాడు. తన తండ్రి మృతికి కల్తీ కల్లే కారణమని ఆయన కుమారుడు మల్లయ్య ఆరోపించాడు. కొమురయ్య మృతిపై నవాబుపేట పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా, ఉదంతంతో కల్తీ కల్లు మృతుల సంఖ్య రెండుకు చేరుకుంది. పెరుగుతున్న బాధితుల సంఖ్య కల్లు కారణంగా అస్వస్థతకు గురవుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. జిల్లాలో ఇప్పటివరకు 351 మంది అస్వస్థతకు గురయ్యారు. సోమవారం నవాబుపేట మండలానికి చెందిన 17 మంది, వికారాబాద్ మండలానికి చెందిన నలుగురు అస్వస్థతకు గురయ్యారు. వీరిని వికారాబాద్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. కొనసాగుతున్న విచారణ కల్తీకల్లు కారణంగా ఇద్దరు మృతి చెందడం, 351 మంది అస్వస్థతకు గురవడంతో ఎక్సైజ్‌శాఖ, పోలీసు శాఖ అధికారులు వేర్వేరుగా విచారణ జరుపుతున్నారు. చిట్టిగిద్ద కల్లు డిపో నిర్వాహకులు ఇంకా పరారీలోనే ఉన్నారు. వికారాబాద్ పోలీసులు గాలిస్తున్నారు. పెండ్లిమడుగు గ్రామానికి చెందిన కిష్టారెడ్డి పోస్టుమార్టం రిపోర్టు, ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక కోసం ఎదురుచూస్తున్నట్లు వికారాబాద్ సీఐ రాజశేఖర్ తెలిపారు. మరోవైపు కల్లు డిపోతోపాటు 11 కల్లు దుకాణాలను సీజ్ చేసిన ఎక్సైజ్ అధికారులు సైతం ల్యాబ్ రిపోర్టుల కోసం ఎదురుచూస్తున్నారు. నివేదిక వచ్చిన వెంటనే అవసరమైన చర్యలు చేపడతామని ఎక్సైజ్ సూపరింటెండెంట్ వరప్రసాద్ తెలిపారు. ఇదిలా ఉంటే పోలీసులు చిట్టిగిద్ద కల్లుడిపోలో పనిచేస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని రహస్యంగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. వీరి ద్వారా డిపో నిర్వాహకులతోపాటు ఇతర అనుమానితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. -
అంగట్లో వంటనూనెలు
వాసన గ్రహించే ముక్కుకి, రుచిని గ్రహించే నాలుకకి అవినాభావ సంబంధం ఉంది. చక్కగా మరిగిన వంటనూనెలలో రుచిని పెంచే గుణం దాగి ఉంది. అతిగా వాడితే అనారోగ్యం పొంచి ఉంది. ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటే వంటనూనెలను మరిగించడం కంటే పచ్చిగా వాడటమే మంచిది. ప్రస్తుతం బజారులో లభించే సాధారణ వంటనూనెలు... నువ్వుల పప్పు నూనె (తిల తైలం), వేరుసెనగ (పల్లీ) నూనె, సన్‌ఫ్లవర్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్, పామాయిల్, మొదలైనవి. కొన్ని ప్రాంతాలలో కొబ్బరినూనె, ఆవనూనె వాడుకునే అలవాటు ఉంది. ఇటీవలి కాలంలో కుసుమ నూనె, సన్‌ఫ్లవర్ ఆయిల్‌ను కూడా ఉపయోగిస్తున్నారు. సామాన్యులు ఈ నూనెల ధరలను బట్టి చవకగా లభించే వాటికే ప్రాధాన్యతనిస్తున్నారు. కారణాలేవైతేనేం! ప్రస్తుతం మినహాయింపు లేకుండా వంటనూనెలన్నీ కల్తీమయమనే విషయం జగమెరిగిన సత్యం. రిఫైన్డు ఆయిల్సులో ఉన్న రసాయనిక ద్రవ్యాలు, జంతు కళేబరాల కొవ్వులతో కల్తీ చేయబడ్డ బ్రాండెడ్ ప్యాకెట్లు, ప్రత్తి విత్తనాల నూనెల్ని కలిపి కల్తీ చేయడం వంటి అనేక ప్రక్రియల వల్ల జీర్ణకోశ సమస్యలే కాక, పక్షవాతం, క్యాన్సరు వంటి దారుణ వ్యాధులు కలుగుతున్నాయని వైద్యవిజ్ఞానం ఘోషిస్తోంది. ఈ మధ్యనే కొంచెం అవగాహన పెరిగి, గానుగలను ఆశ్రయించి, మన కళ్ల ముందు ఆడిస్తున్న నువ్వుల పప్పునూనె, పల్లీల నూనెలపై మొగ్గు చూపుతున్నారు. ఇళ్లల్లో తయారుచేసుకునే పదార్థాలను సేవిస్తున్నారు. ఆయుర్వేద గ్రంథాలలోని ప్రస్తావన... నువ్వుల నూనె: తిలలు అంటే నువ్వులు. పొట్టును తొలగిస్తే ‘నువ్వు పప్పు’ అంటాం. పొట్టుతోబాటు తీసిన నూనెను ఆయుర్వేద ఔషధాలలో వాడతారు. పప్పు నూనె మరింత రుచికరంగా ఉంటుంది. గుణధర్మాలు: దీనిని శరీరానికి మర్దన చేసికొని అభ్యంగ స్నానానికి వాడతారు. వంటనూనెగా కూడా సేవిస్తారు. చర్మానికి మృదుత్వాన్ని, కాంతిని ఇస్తుంది. ఆకలిని పెంచుతుంది. బలాన్ని, తెలివితేటల్ని పెంచుతుంది. స్థూలకాయులకు బరువు తగ్గటానికి, కృశించినవారికి బరువు పెరగటానికి దోహదపడుతుంది. కేశాలకు, నేత్రాలకు మంచిది. గర్భాశయశోధకం. కొంచెం వేడి చేస్తుంది. మలమూత్రాలను అధికంగా కాకుండా కాపాడుతుంది. సాధారణ విరేచనాన్ని సానుకూలం చేస్తుంది. బాహ్యంగానూ, అభ్యంతరంగానూ క్రిమిహరం. శుక్రకరం. నువ్వులలో కాల్షియం, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. మెగ్నీషియం, జింక్, కాపర్, ఫాస్ఫరస్, మాంగనీస్, సెలీనియం, విటమిన్ బి 1, ఆహారపు పీచు కూడా ఉంటాయి. ప్రొటీన్లు తగినంత ఉంటాయి. వేరుసెనగ నూనె: ఆయుర్వేద కాలంలో దీని ప్రస్తావన లేదు. పోషక విలువలు: ప్రొటీన్లు, కొవ్వులు తగు రీతిలో లభిస్తాయి. పిండి పదార్థాలు తక్కువగా ఉంటాయి. బయోటిన్, కాపర్, నియాసిన్, ఫోలేట్సు, మాంగనీసు, విటమిన్ ఇ , థయామిన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం మొదలైనవి ఉండటం వలన ఆరోగ్యకరం. శరీరబరువు తగ్గటానికి, పిత్తాశయంలో (గాల్‌బ్లాడర్) రాళ్లు ఏర్పడకుండా నిరోధించడానికి దోహదం చేస్తుంది. వేరు సెనగ పలుకుల్ని బాగా ఎండబెట్టి వాడుకుంటే దాని అనర్థాల ప్రభావం ఉండదు. ఆయుర్వేద గ్రంథాలలో ఆవనూనె (సర్లప), ఆవిసె (అతసీ), కుసుమ (కుసుంబ) గసగసాలు (ఖసబీజ), ఏరండ (ఆముదం) నూనెల వివరాలు కూడా ఉన్నాయి. వాడకపోయినా పరవాలేదు... ఒకసారి మరిగించిన నూనెలను మళ్లీమళ్లీ మరిగించి వాడితే క్యాన్సరు వంటి ఆరోగ్యసమస్యలు తలెత్తుతాయి ∙నూనెలను పచ్చివిగా వాడుకుంటే మంచిది ∙కల్తీలను దృష్టిలో ఉంచుకుని అంగట్లో తయారు చేసి అమ్మే సమోసాలు, పకోడీలు, చిప్స్ వంటివి తినకపో వటం మంచిది ∙గానుగలో స్వంతంగా ఆడించుకున్న నూనెలను వాడుకుంటూ, ఇంట్లోనే వండిన వాటిని తినడం వల్ల వ్యాధులు సోకవు ∙అసలు ఈ నూనెలు వాడకపోయినా, శరీరానికి కావలసిన కొవ్వులు ఆకుకూరల వంటి ఇతర ఆహార శాకాలలో లభిస్తాయి (ఇవి మనకు కంటికి కనపడవు) – డా. వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ఆయుర్వేద వైద్య నిపుణులు, హైదరాబాద్ -
ముంబై నుంచి మేక కాళ్లు..
జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో అడుగడుగునా కల్తీలు రాజ్యమేలుతున్నాయి. ఉప్పు, పప్పు, చింతపండు, నూనె, కారం.. ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని నిత్యావసర సరుకులూ కల్తీలమయమైపోయాయి. చేసేది లేక వినియోగదారులు కల్తీ సరుకులనే కొనుగోలు చేస్తున్నారు. కల్తీలను నియంత్రించాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. కృష్ణాజిల్లా, మచిలీపట్నం టౌన్ : పట్టణంలోని పలు దుకాణాల్లో కల్తీ మోసాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఉప్పు, పప్పు వంటి నిత్యావసర సరుకులను విక్రయించే పచారీ దుకాణాల నుంచి నిల్వ తినుబండారాలను స్వీట్ షాప్‌లు, బేకరీలు, రెస్టారెంట్లు, మెస్‌లు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతున్న టిఫిన్ సెంటర్లు, హోటళ్లు, బిర్యానీ పాయింట్లు, మాంసం దుకాణాలు.. ఇలా అన్ని దుకాణాల్లోనూ కల్తీతో పాటు నిల్వ పదార్థాలను వినియోగదారులకు అంటగడుతున్నారు. బియ్యం కల్తీ.. బీపీటీ రకం బియ్యం కావాలని అడిగితే కిలో రూ.40 నుంచి రూ.50 వరకూ ఉన్న ఇతర రకాలను అంటగడుతున్నారు. తీరా వండితే రేషన్ బియ్యం మాదిరిగా ఉంటుండటంతో వినియోగదారులు బిత్తరపోతున్నారు. హోటళ్లకు వెళితే నిల్వ చట్నీలు, పాచిపోయిన, నిల్వ పిండితోనే తినుబండారాలు తయారీ చేసి విక్రయిస్తున్న ఘటనలు పలుచోట్ల చోటు చేసుకుంటున్నాయి. రహదారుల మార్జిన్లు, మురుగు డ్రెయిన్ల వెంబడి టిఫిన్ బండ్లు ఇబ్బడి ముబ్బడిగా దర్శనమిస్తున్నాయి. చిన్న పునుగుల నుంచి అట్టు, ఇడ్లీ.. వంటి అల్పాహారాలను విక్రయిస్తున్నారు. అయితే వీటి నాణ్యత ప్రశ్నార్థకం. కల్తీ నూనెలతో ఈ వంటకాలు జరుగుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. కానరాని ఫుడ్ కంట్రోల్ శాఖ సిబ్బంది తినుబండారాల నాణ్యతను గతంలో మున్సిపాల్టీ పరిధిలో పని చేసే ఫుడ్ ఇన్స్పెక్టర్లు పర్యవేక్షించేవారు. అయితే ఈ పోస్టులను ప్రభుత్వం రద్దు చేయటంతో తనిఖీలు చేయటం లేదు. సంబంధిత అధికారులు మామూళ్ల మత్తులో జోగుతుండటంతోనే పట్టణంలో ఒక్క దాడి కూడా చేసిన దాఖలాలు లేవు. దీంతో వ్యాపారుల ఇష్టారాజ్యంగా మారింది. ఇక మాంసం దుకాణాల వద్ద కూడా డీప్ ఫ్రిజ్‌లలో నిల్వ ఉంచిన మాంసం, చనిపోయిన జీవాలను కోసి విక్రయిస్తున్నా పట్టించుకునే నాధుడే లేడు. మున్సిపల్ కబేళాలో వైద్యుడి పర్యవేక్షణలో జీవాలను కోయాల్సి ఉన్నా అది అమలు కావడం లేదు. దీంతో జీవాలను ఇళ్ల వద్దే కోసి విక్రయాలు జరుపుతున్నారు. ముంబై నుంచి మేక కాళ్లు.. ముంబై నుంచి ప్రతి వారం ఐస్‌లో నిల్వ ఉంచిన మేక తలలు, కాళ్లు రైలు ద్వారా ఇక్కడికి చేరుతున్నాయి. వాటిని మార్కెట్లో యథేచ్ఛగా విక్రయిస్తున్నా పట్టించుకునేవారే లేరు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు కల్తీ వస్తువుల విక్రయాలపై దృష్టి సారించాలని పట్టణవాసులు కోరుతున్నారు. నిల్వ పదార్థాలు తినకుండా ఉంటేనే మేలు.. నిల్వ ఉన్న పదార్థాలు తినకుండా ఉంటేనే ఆరోగ్య సమస్యల నుంచి బయట పడొచ్చు. నిల్వ పదార్థాలు, కల్తీ సరుకులతో చేసినవి తింటే పలు అనారోగ్యాలు చుట్టుముడతాయి. ముఖ్యంగా ఉదరకోశ వ్యాధులు సోకుతాయి. పేగుల్లో ఇన్ఫెక్షన్, అల్సర్లు, డయేరియా వంటి రోగాలు సోకటంతో పాటు నులిపురుగులు వృద్ధి చెందుతాయి. కాగిన నిల్వ నూనెతో వండే పదార్థాలను తింటే క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. – డాక్టర్ అల్లాడ శ్రీనివాసరావు, ఆర్ఎంఓ, జిల్లా ప్రభుత్వాస్పత్రి -
రోగాల‘పాల’వుతున్నాం
నల్లని వన్నీ నీళ్లు..తెల్లని వన్నీ పాలు.. అంటూ స్వచ్ఛతకు మారు పేరుగా భావించే పాలు ఇప్పుడు మనల్ని రోగాలు పాలు చేస్తున్నాయా?ఈ ప్రశ్నకు అవుననే సమాధానం ఇస్తున్నారు నగరానికి చెందిన అపోలో క్రెడిల్ ఆసుపత్రికి చెందిన డాక్టర్‌రాధికారెడ్డి పింగళి. దీనికి ప్రధానకారణం మిల్క్ అడల్ట్రేషన్(పాలను నిర్ణీత సమయానికి ముందే ఉత్పత్తి అయ్యేలా చేయడం) అని ఆమె చెప్పారు. ఇంకా రాధికారెడ్డి చెబుతున్న అంశాలివి. సాక్షి, సిటీబ్యూరో :నగరంలో చాలామంది ఇళ్లలో నిరంతర ప్రధానమైన డైట్ మిల్క్. ఇతర డైరీ సంబంధ ఉత్పత్తులు కూడా. ఈ నేపథ్యంలో పాలు వినియోగం మన పాలిట శాపం కాకూడదు అంటే అవి ఎలా వచ్చాయి? ఎలా నిల్వ చేశారు? ఎలా సరఫరా చేశారు? అనేది ప్రధాన అంశంగా చూడాలి. ప్యాకింగ్..షాకింగ్.. ప్యాక్డ్ మిల్క్ అనేది ఒక్కోసారి సంతాన లేమి సమస్యలకు కూడా కారణంగా మారుతోంది. ప్లాస్టిక్‌లో నిల్వ ఉంచే పాలు హాని చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్లాస్టిక్‌లో ఉండే బీపీఏకి ఉన్న ఎండోక్రైన్ నిరోధకారి గుణం వల్ల ఫెర్టిలిటీ సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. పాల కోసం పాపాలు ప్రస్తుతం పాలకు ఉన్న భారీ డిమాండ్ వల్ల దాని పరిమాణాన్ని పెంచడానికి ఉపయోగిస్తున్న అవాంఛనీయ పద్ధతులు దాని నాణ్యతను దెబ్బతీయడమే కాకుండా మన ఆరోగ్యానికి హానికరంగా పరిణమిస్తున్నాయి. పాల ఉత్పత్తి కోసం పశువులకు పలు రకాల స్టెరాయిడ్స్, హోర్మోనల్ ఇంజక్షన్లు ఇస్తున్నారు. ఆక్సిటోసిన్ ఇంజెక్షన్స్, ఫార్మాలిన్, హైడ్రోజన్ పెరాక్సైడ్, డిటర్జంట్స్ వంటివి ఉపయోగించడం సర్వసాధారణంగా మారింది. అయితే ఈ తరహాలో పాలను పెంపొందించేందుకు అమలు చేస్తున్న అవాంఛనీయ పద్ధతులను వెంటనే తనిఖీ చేయకపోతే 2025 కల్లా 87 శాతం ప్రజలు కేన్సర్ బారిన ప్రమాదం ఉందని భారత ప్రభుత్వాన్ని తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది. ఒక సర్వే ప్రకారం మన దేశంలో లభ్యమవుతున్న పాలల్లో 67శాతం ఇలాంటి పద్ధతుల్లో ఉత్పత్తి చేసినవే. రోజువారీగా పాలను విభిన్న రూపాల్లో వినియోగించే అలవాటు ఉన్న పరిస్థితుల్లో హార్మోన్ల అసమతౌల్యం ఫలితంగా అమ్మాయిల్లో వయసుకు మించిన ఎదుగుదల, గైనెకొమాస్టియా (పురుషుల్లో వక్షోజాలు పెరగడం), టెస్టోస్టెరాన్ తగ్గిపోవడం, కేన్సర్, చర్మవ్యాధులు, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సమస్యలు, హృద్రోగాలు, రక్తపోటు, కిడ్నీ వ్యాధులు, దృష్టి లోపం, జ్ఞాపకశక్తి మందగించడం, అల్సర్స్ వంటివి రావచ్చు. కాబట్టి పాలను విరివిగా వినియోగించేవాళ్లు అవి తమ వద్దకు వస్తున్న విధానాన్ని ఒకటికి పదిసార్లు చెక్ చేసుకోవడమే మంచిది. -
'పాల'కూట విషం
కల్తీ..కల్తీ..ఆహారంగా తీసుకునే ప్రతిదీ కల్తీ అవుతోంది. చివరకు పాలను కూడా వదలకుండా కంత్రీగాళ్లు కల్తీ చేస్తున్నారు. తక్కువ ఖర్చుతో వచ్చే ముడి సరుకుతో పాలలాంటి పదార్థాన్ని తయారు చేసి అసలు పాలలో కలిపేసి ప్రైవేటు డెయిరీలకు పోస్తున్నారు. కొన్నిసార్లు డెయిరీ నిర్వాహకులు గుర్తించక వాటిని వినియోగదారులకు సరఫరా చేస్తుండటంతో కల్తీ పాలు తాగి జనం అనారోగ్యం పాలవుతున్నారు. గుర్తించిన చోట వాటికి అడ్డుకట్ట వేసేందుకు డెయిరీల యాజమాన్యాలు ప్రయత్నిస్తున్నాయి. ప్రకాశం, దర్శి టౌన్: జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో పాడి పరిశ్రమే ప్రధాన జీవనాధారం. గ్రామాల్లో నూటికి 70 శాతం పాడి పరిశ్రమపైనే ఆధారపడి జీవిస్తున్నారు. అయితే వారిలో కొందరు కల్తీ పాల తయారీకి పూనుకుంటున్నారు. దీంతో జిల్లాలో కల్తీ పాల తయారీ రోజు రోజుకూ పెరుగుతోంది. అధిక ఆదాయం కోసం అర్రులు చాచే కొందరు పాలను కల్తీ చేస్తున్నారు. పాలను ఎక్కువగా పోసి సొమ్ము చేసుకునేందుకు అర్రులు చాస్తున్నారు. కల్తీ చేస్తోందిలా.. లీటర్ పాలలో మూడు లీటర్ల నీరు కలిపి అందులో సన్‌ఫ్లవర్ ఆయిల్, యూరియా, కళ్లు ఉప్పు, చక్కెర, పచ్చి కొబ్బరి నుంచి తయారు చేసిన రసంలో మరికొన్ని మిశ్రమాలను, ఇంకా తెల్లదనం, చిక్కదనం కోసం ఫెవికాల్‌ను వినియోగిస్తున్నారు. దీంతో నాలుగు లీటర్ల పాలు తయారవుతున్నాయి. జిల్లాలో సంతమాగులూరు, ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో పలు గ్రామాల్లో కల్తీ పాల ఉత్పత్తి జరుగుతోంది. విషయం తెలిసిన పలు డెయిరీలు ఆయా గ్రామాల పాలు తీసుకునే విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కల్తీ పాలను ఇలా గుర్తించవచ్చు.. కల్తీ పాలు చూడగానే సాధారణ పాల కన్నా భిన్నంగా మెరుస్తూ ఉంటాయి. కొంత సమయం అయిన తర్వాత పైన నూనె, ఇతర పదార్థాలు తెట్టుగా తేలతాయి. దీంతో పాలు డెయిరీకి వెళ్లే సమయానికి పైన తెట్టు, వాసన కూడా మారతాయి. డెయిరీలో ప్రతి క్యాన్‌ను పరిశీలిస్తే గానీ కల్తీ పాలను పట్టుకోలేరు. ఈ విధంగా పరీక్ష చేయాలి.. ♦ నేషనల్ డెయిరీ డవలప్మెంటు వారి కలర్ కంపెరిజన్ చార్ట్‌ల ద్వారా పాలనుపిప్పెట్టులో పోసి, కొంత కెమికల్ వేసి టైట్రేషన్ చేస్తే యూరియా, ఘగర్స్, ఆయిల్, సాల్ట్ కంటెంట్లు తెలుస్తుంది. దీనికి బట్టి పాల కల్తీ గుర్తించి తర్వాత నుంచి జాగ్రత్త వహిస్తారు. ♦ పాలల్లో మెడికల్ షాపులో దొరికే టింక్చర్ అయోడిన్‌ను తీసుకుని వేస్తే అవి పసుపు రంగులోనికి మారితే మంచివి. అలాకాక నీలం రంగులోనికి మారితే కల్తీవి. ♦ టెస్ట్ ట్యూబ్‌లో టీస్పూన్ పాలను తీసుకుని అందులో అర టీస్పూన్ కందిపప్పు పిండి కలపాలి. ఐదు నిముషాల తర్వాత పాలలో ఎరుపు లిట్మస్ పేపర్‌ను ముంచి అరనిముషం ఉంచాలి. పేపర్ ఎరుపు నుంచి నీలం రంగుకు మారితే ఆ పాలలో యూరియా కలిపి ఉన్నట్లు గుర్తించవచ్చు. బయటపడిన పలు సంఘటనలు... జిల్లాలో పలు గ్రామాలను పరిశీలిస్తే ఆ గ్రామంలో ఉత్పత్తి అయ్యే పాలకు మిల్క్ కేంద్రాల ద్వారా సేకరించే పాలకు చాలా వ్యత్యాసం వస్తుండటంతో ఈ కల్తీ పాల వ్యవహారం బయటకు వచ్చింది. తాళ్లూరు మండలంలో పలు గ్రామాలతో పాటు అద్దంకి, సంతమాగులూరు మండలం ఏల్చూరు, ముండ్లమూరు మండలాల్లో ఈ తంతు జరుగుతోందని పాడి రైతులు వాపోతున్నారు. వారి వలన తమకు కూడా చెడ్డ పేరు వస్తుందని, ఇటువంటివి అరికట్టాలని ముండ్లమూరు, మార్టూరు మండలంలో గతంలో తహసీల్దార్‌కు కూడా ఫిర్యాదు చేసిన సంఘటనలు ఉన్నాయి. తాళ్లూరులో పలువురు ఇటువంటి కల్తీ వ్యవహారాన్ని అరికట్టాలని అనేక సార్లు కోరారు. కేంద్రాలకు తగ్గుతున్న పాలు.. జిల్లాలో 80 పాలశీతలీకరణ కేంద్రాలు ఉన్నాయి. వీటి ద్వారా రోజూ 4.5 లక్షల లీటర్ల పాలు వస్తుంటాయి. అయితే ఈ కల్తీ పాలను అరికట్టడంతో డెయిరీలు పలు చర్యలు తీసుకోవటంతో అవి 4 లక్షలకు పడిపోయాయి. దర్శి నియోజకవర్గంలో 20 పాలశీతలీకరణ కేంద్రాలు ఉండగా దాదాపు 1.5 లక్షల లీటర్ల పాలు వస్తుంటాయి. ఇవి కూడా 80 వేల లీటర్లకు పైగా తగ్గాయి. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం.. కల్తీ పాల తయారీకి ఉపయోగించే పదార్థాలు వినియోగదారుల ఆరోగ్యంపై పూర్తి ప్రభావాన్ని చూపుతాయని వైద్యులు చెబుతున్నారు. కిడ్నీ, లివర్, సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. చిన్న పిల్లలపై తీవ్ర ప్రభావం చూపి వాంతులు, విరేచనాలు ఎక్కువగా ఉంటాయి. ప్రొటీన్లు తగ్గి సోడియం శాతం పెరుగుతుంది. హార్మోన్లపై తీవ్ర ప్రభావం చూపడంతో పాటు థైరాయిడ్, ఫంగస్ సంబంధిత వ్యాధులు వస్తుంటాయి. జీవన ప్రమాణాలపై పూర్తి ప్రభావం కల్తీలో వాడే పదార్థాలు కిడ్నీ, లివర్‌పై ఎక్కువ ప్రభావం చూపుతాయి. హోర్మోన్లపై ప్రభావం చూపుతాయి. కామెర్లు ఉన్న రోగులు కోమాలోకి వెళ్లే అవకాశం ఉంది. యూరియా కిడ్నీ, లివర్‌పై అధిక ప్రభావం చూపుతాయి. ప్రజల జీవన ప్రమాణాలు కూడా పూర్తి స్థాయిలో తగ్గుతాయి.– పోకూరి శ్రీనివాస్, న్యూరాలజిస్ట్, నల్లూరి నర్సింగ్‌హోమ్, ఒంగోలు. కల్తీ పాలతో తీవ్రంగా నష్టపోతున్నాం డెయిరీల మధ్య అనారోగ్యకరమైన పోటీతో పాల ఉత్పత్తిదారుల వద్దకు అధిక అడ్వాన్స్‌లతో ఆకర్షిస్తున్నారు. ఇదే అదునుగా భావిస్తున్న కొందరు సోమరి రైతులు తక్కువ పాలు ఉత్పత్తి చేస్తూ కల్తీతో అధిక పాలు పోయటానికి ప్రయత్నిస్తుంటారు. అయితే ఆ గ్రామంలో పాలు పడుతున్న ఏజెంట్లు విషయాన్ని గమనించి అనేక చోట్ల నిరోధిస్తున్నారు. దీంతో పాలు తగ్గుతున్నాయి. మొహమాటంతో కొన్ని చోట్ల అదేవిధంగా తీసుకోవటంతో పాలలో కల్తీ వచ్చి మిగిలిన పాలు కూడా పాడవుతున్నాయి. మా డెయిరీలో అయితే నూరుశాతం నిరోధించాం. అయితే ఈ ప్రాంత పాలంటే కల్తీవని హైదరాబాద్ వారికి ఒక చెడు అభిప్రాయం వచ్చింది. దీంతో ఈ ప్రాంత డెయిరీలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది.– హనుమంతరావు, ఎండీ, సాయిగంగా డెయిరీ, తూర్పు గంగవరం. -
చాయ్‌పత్తినీ వదలట్లేదు
‘‘ఏ చాయ్ చటుక్కునా తాగరా భాయ్.. ఈ చాయ్ చమక్కులే చూడరా భాయ్’’ అంటూ ఓ సినీ కవి తేనీటి గొప్పతనాన్ని వివరించాడు. టీ నిత్య జీవితంలో భాగమైపోయింది. టీ తాగనిదే చాలామం దికి దినచర్య కూడా ప్రారం భం కాదు. అలసటగా ఉన్నప్పుడు ఉత్సాహం కోసం టీ తాగుతుంటారు. తలనొప్పిగా అనిపించినా ఉపశమనం కోసం తేనీరే తీసుకుంటారు. ఇద్దరు మిత్రులు కలిసినా.. బంధువుల ఇంటికి వెళ్లినా.. ముందుగా ఆఫర్ చేసేది టీనే.. కానీ ఉత్తేజాన్నిస్తుందని భావించే టీలో ఉపయోగించే పొడిని కూడా కొందరు కల్తీ చేసేస్తున్నారు. రసాయనాలతో తయారు చేసిన టీ పొడిని విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. సాక్షి, కామారెడ్డి : స్నేహితుడు కలిస్తే చాలు ‘ఓ చాయ్ కొడదాం పదా’ అంటాం. మనసు చికాకు గా ఉన్నా, తలనొప్పి అనిపించినా చాలు ఓ చాయ్ తాగాలనుకుంటాం. పేద గొప్ప తేడా లేకుండా టీ తాగుతుంటారు. సమీపంలోని హోటల్‌కు వెళ్లి చాయ్ లాగించేస్తారు. కానీ చాయ్ తాగడమే తప్ప చాయ్ తయారీలో ఎలాంటి పదార్థాలు వాడుతున్నారో ఎవరూ పట్టించుకోరు. ఎందుకంటే మా ట్లాడుతూ చాయ్ తాగడం, డబ్బులు ఇచ్చి వెళ్లిపోవడం.. అంతే.. దీన్ని కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. కల్తీ చాయ్‌పత్తి అమ్మకాలతో జేబు లు నింపుకుంటున్నారు. చాయ్ తయారు చేసేవా రు సైతం తక్కువ ధరలో పత్తి దొరుకుతుంది కదా అని కొంటూ చాయ్ తయారు చేసి అమ్ముకుంటున్నారు. చాయ్‌పత్తి మంచిదా, చెడ్డదా అన్నది చూ డడం లేదు. తక్కువ ధర.. ఆపై కొద్దిపాటి పత్తి వే స్తే చాలు చాయ్ మంచి రంగు వస్తుండడంతో దీని కొనుగోలుకే చాలా హోటళ్ల నిర్వాహకులు ఆసక్తి చూపుతున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కల్తీ చాయ్పత్తీతో తయా రు చేసిన చాయ్ తాగడం వల్ల కలిగే అనర్థాలు అప్పుడే కనిపించవు. పైగా చాయ్‌తోనే సమస్య వచ్చిందని ఎవరూ అంచనా వేసే ప్రయత్నం కూడా చేయరు. రాష్ట్ర రాజధానినుంచి.. కామారెడ్డి పట్టణంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు నిత్యం హైదరాబాద్ నుంచి పెద్ద మొత్తంలో కల్తీ చాయ్‌పత్తి తరలివస్తోంది. కవర్లలో ప్యాక్ చేసి తీసుకువచ్చి హోటళ్లకు సరఫరా చేస్తున్నారు. కామారెడ్డి పట్టణంలోని కొత్త బస్టాండ్ ప్రాంతంలో రెండు, పాత బస్టాండ్ ప్రాంతంలో రెండు హోటళ్లకు నిత్యం చాయ్‌పత్తి వస్తున్నట్టు తె లుస్తోంది. అలాగే జిల్లాలోని ఇతర ప్రాంతాలతో పాటు నిజామాబాద్‌కు కూడా చా య్పత్తీని తరలిస్తున్నారని సమాచారం. హైదరాబాద్‌లో తయారై న చాయ్‌పత్తిని మారుతి వ్యాన్లు, కార్లు, ఆటోలతో పాటు బైక్‌లపై రకరకాల మార్గాల ద్వారా సరఫ రా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మార్కెట్లో కుళ్లా చాయ్‌పత్తి కిలోకు రూ.200–240 వరకు విక్రయిస్తున్నారు. అయితే హైదరాబాద్ నుంచి వస్తున్న చాయ్‌పత్తి మాత్రం కిలోకు రూ.120 నుంచి రూ.140కి అమ్ముతున్నట్టు తెలుస్తోంది. రసాయనాలతో తయారీ.. కొన్ని హోటళ్లకు సరఫరా అవుతున్న చాయ్‌పత్తి త యారీలో రసాయనాలు వాడుతున్నట్టు తెలుస్తోంది. చేతిలో కొంత చాయ్‌పత్తిని తీసుకుని నీళ్లలో వే యగానే ఒక్కసారిగా చాయ్ రంగు వస్తోంది. పై గా ఆయిల్రూపంలో పైన పేరుతోంది. సాధార ణంగా చాయ్‌పత్తిని నీటిలో మరిగిస్తేగాని పత్తీ కరగదు, రంగులోకి రాదు. కానీ కల్తీ చాయ్‌పత్తి మా త్రం క్షణాల్లో రంగులోకి వస్తుండడం అనుమానాలకు తావిస్తోంది. చాయ్ రుచి వచ్చేలా కూడా రసాయనాలు వాడుతున్నట్లు తెలుస్తోంది. నిఘా కరువు.. జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని ఇతర ప్రాం తాలకు సరఫరా అవుతున్న కల్తీ చాయ్‌పత్తి విషయంలో అధికార యంత్రాంగం దృష్టి సారించడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రసాయనాలతో తయారైన చాయ్‌పత్తి మూలంగా ప్రజల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. అధికారులు స్పందించి కల్తీ చాయ్‌పత్తి సరఫరాను అరికట్టాల్సిన అవసరం ఉంది. -
చిన్న పిల్లలే... టార్గెట్..!
చిన్న పిల్లలు ఇష్టంగా తినే కుర్కురే వంటి పదార్ధం, పాప్‌కార్న్, బంగాళా దంప చిప్స్, చాకెట్లు, రేగు పండు జామ్. ఇలా ఒకటేమిటి.. అన్నీ నాసిరకమే. చూడగానే ఆకట్టుకునే ప్యాకింగ్. ప్యాకెట్ విప్పగానే తినేయాలపించేలా రంగులు. మళ్లీ మళ్లీ కొనిపించే గిఫ్ట్ ప్యాక్‌లు. రూపాయి ప్యాకెట్ నుంచి ఐదు రూపాయల ప్యాకెట్ వరకు తయారీ చేసి మార్కెట్ చేస్తున్నారు.. కోస్తా జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ నాసిరకం తినుబండారాలు సరఫరా చేస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ వ్యాపారం చేస్తున్న ఈ కంపెనీపై అధికారులు సోమవారం దాడులు చేసి సంస్థ యజమాని, అతని అల్లుడిని అదుపులోకి తీసుకుని కంపెనీని సీజ్ చేశారు. చిట్టినగర్ (విజయవాడ పశ్చిమ): కొత్తపేట జోడు బొమ్మల సెంటర్ ప్రాంతానికి చెందిన ఒగ్గు మురళీకృష్ణ కేఎల్‌రావు పార్కు రోడ్డులో ఆర్కే ప్రొడక్ట్ పేరిట చిన్నపిల్లల తినుబండారాలను తయారు చేస్తుంటాడు. మురళీకృష్ణ ప్రభుత్వానికి చెల్లించాల్సిన ట్యాక్స్‌లను సక్రమంగా చెల్లించకపోవడంతో పాటు ఆహార పదార్థాల తయారీలో నాణ్యతను పాటించడం లేదనే సమాచారం ట్రాస్క్ఫోర్స్ ఏసీపీ జి.రాజీవ్‌కుమార్‌కు అందింది. సీపీ ద్వారకా తిరుమలరావు ఆదేశాల మేరకు సోమవారం మధ్యాహ్నం యూనిట్‌పై ఏసీపీ రాజీవ్‌కుమార్, ఫుడ్ కంట్రోల్ అధికారి పూర్ణచంద్రరావు, కొత్తపేట సీఐ మురళీకృష్ణలు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఆ సమయంలో ప్యాకింగ్ చేసి మార్కెట్‌కు పంపేందుకు సిద్ధంగా ఉన్న ఆహార పదార్థాలను తనిఖీ చేశారు. పామాయిల్‌తో పాటు చిన్నపిల్లలు తినే కుర్కురే వంటి పదార్థం, పాప్‌కార్న్‌లతో రేగిపండు జామ్‌లను తనిఖీ చేశారు. అందులో వాడే రంగులు, రసాయనాలను పరిశీలించారు. ప్యాకింగ్ యూనిట్లో ఉన్న మురళీకృష్ణ అల్లుడు వినోద్‌ను సైతం అధికారులు ప్రశ్నించారు. ఆహార పదార్థాల తయారీకి ఉపయోగించే ముడి సరుకులను ఎక్కడి నుంచి తీసుకువస్తావనే వివరాలను ఎంత అడిగినా వారు చెప్పలేదు. రెన్యూవల్ లేకుండానే.. కంపెనీ నిర్వహణకు ప్రభుత్వం నుంచి తీసుకున్న అనుమతులు 2016లోనే ముగిసినప్పటికీ రెన్యూవల్ చేయించకపోవడం, ట్యాక్స్‌లు సక్రమంగా చెల్లించకపోవడం తదితర విషయాలను టాస్క్‌ఫోర్స్ అధికారులు గుర్తించి ఆయా విభాగాల అధికారులకు సమాచారం అందించారు. కంపెనీలో ఏడుగురు మాత్రమే పనిచేస్తున్నట్లు లేబర్ లైసెన్సులో ఉండగా, వాస్తవానికి కంపెనీలో 50 మందికి పైగా పనివారు ఉన్నట్లు గుర్తించారు. ఇక సరుకులను మేడపైకి చేరవేసేందుకు ఉపయోగించే లిఫ్టుకు ఎటువంటి రక్షణ వ్యవస్థ లేకపోవడం, భవనంలోని మూడు అంతస్తులలో ఎక్కడా ఫైర్ సేఫ్టీ పరికరాలు లేకపోవడంతో అధికారులు ఆశ్చర్యపోయారు. కంపెనీ ఒక చోట.. సరుకు మరోచోట టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించే సమయంలో అతని కంపెనీ వద్ద లారీతో సరుకు దిగుమతి అవుతుంది. సరుకు తాలుకు బిల్లులను డ్రైవర్ నుంచి తీసుకుని అధికారులు తనిఖీ చేశారు. సరుకును సూరంపల్లిలోని ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని కంపెనీలో దిగుమతి చేయాల్సి ఉండగా కేఎల్‌రావు నగర్లో దిగుమతి చేస్తున్నారు. సుమారు రూ. 10 లక్షల విలువ గల సరుకులు ఇక్కడ ఎందుకు దిగుమతి చేస్తున్నారని ప్రశ్నించగా సరైన సమాధానం లేదు. దీంతో అధికారులు బిల్లులను స్వాధీనం చేసుకున్నారు. గతంలో రెండు సార్లు దాడులు రెండేళ్లలో ఈ కంపెనీపై విజిలెన్స్, టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించడం ఇది మూడోసారి. గతంలో రెండుసార్లు విజిలెన్స్, టాస్క్ఫోర్సు అధికారులు దాడులు చేశారు. ఒక దఫా కార్పొరేషన్ ప్రజా ఫిర్యాదుల కమిటీ చైర్మన్ సమక్షంలో దాడులు నిర్వహించారు. అధికారులు దాడులు నిర్వహించిన సమయంలో కంపెనీలో అపరిశుభ్ర వాతావరణంలోనే ఆహార పదార్థాలను తయారు చేస్తున్నట్లు గుర్తించి కంపెనీని సీజ్ చేశారు. సోమవారం కూడా టాస్క్‌ఫోర్స్ అధికారులు అన్నిరకాల ఆహార పదార్థాల శాంపిల్స్‌ను సేకరించడంతో పాటు కేసు నమోదు చేసి కంపెనీని సీజ్ చేశారు. రవాణాకు సిద్ధంగా ఉన్న రూ. 10 లక్షల విలువ చేసే వివిధ బ్రాండ్ల ప్యాకెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
కల్తీ టీ పొడి విక్రయదారుడిపై విజి‘లెన్స్’
భవానీపురం (విజయవాడ పశ్చిమ) : కల్తీ టీ పొడి అమ్ముతున్నట్లు పక్కా సమాచారం అందుకున్న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గొల్లపూడి పరిధిలోని మహాత్మాగాంధీ హోల్‌సేల్ కమర్షియల్ కాంప్లెక్స్‌లోని ఓ హోల్‌సేల్ టీ మర్చంట్స్ దుకాణంపై మంగళవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. కాంప్లెక్స్‌లోని 283వ నెంబర్ షాపులో సుమన్ అనే వ్యక్తి టీ పొడి హోల్‌సేల్ వ్యాపారం చేస్తున్నారు. కర్ణాటక, పశ్చిమ బెంగాల్ తదితర ప్రాంతాల నుంచి లూజు టీ పొడిని దిగుమతి చేసుకుని ఇక్కడ రీ ప్యాక్ చేసి విక్రయిస్తున్నారు. అయితే ప్యాకింగ్ సమయంలో కల్తీ చేయడం, నాన్ పర్మిటెడ్ కలర్స్‌ను కలపటం వంటి పనులతో నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ఈ క్రమంలో విశ్వసనీయ సమాచారం అందుకున్న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ వి. హర్షవర్ధన్ నేతృత్వంలో డీఎస్పీ ఆర్. విజయపాల్, ఫుడ్ సేఫ్టీ అధికారి పూర్ణచంద్రరావు తమ సిబ్బందితో కలిసి దాడులు చేశారు. అక్కడ టీ పొడిని పరిశీలించగా ఎక్కువ మోతాదులో కలర్ కలిపినట్లు గుర్తించారు. అలా కలిపిన కలర్‌ను, కలర్ కలిపిన టీ పొడిని స్వాధీనం చేసుకున్నారు. సుమారు లక్ష రూపాయలు విలువగల 450 కిలోల టీ పొడి బ్యాగులను కూడా స్వాధీనం చేసుకున్నారు. కల్తీలపై అవగాహన కలిగి ఉండాలి.. ఆహార పదార్థాల కల్తీలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని విజిలెన్స్ ఎస్పీ హర్షవర్ధన్ తెలిపారు. కల్తీ ఆహార పదార్థాలు అమ్ముతున్నట్లు అనుమానం వస్తే విజిలెన్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం అందించాలని కోరారు. ఇక్కడ పట్టుబడిన కల్తీ టీ పొడి నమూనాలను సేకరించామని, వాటిని ల్యాబ్‌కు పంపి రిపోర్ట్ వచ్చాక చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం సువర్చల ట్రేడర్స్ లైసెన్స్‌ను సస్పెండ్ చేస్తున్నామని, కల్తీ జరిగినట్లు రుజవైతే సుమారు 7 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా ఉంటుందన్నారు. ఇతర ప్రాంతాల నుంచి మూడో రకం టీ పొడిని కిలో రూ.50–60లకు కొనుగోలు చేసి దానిలో కల్తీ కలిపి రీ ప్యాక్ చేసి రూ.150 వరకు అమ్ముతున్నారని తెలిపారు. జీర్ణకోశ వ్యవస్థ దెబ్బ తింటుంది.. లూజు టీ పొడిలో ఎటువంటి కలర్స్ కలపకూడదని, ఇక్కడ అమ్ముతున్న టీ పొడిలో నాన్ పర్మిటెడ్ కలర్స్ కలుపుతున్నట్లు గుర్తించామని ఫుడ్ సేఫ్టీ అధికారి పూర్ణచంద్రరావు చెప్పారు. కొంత మంది వ్యాపారులు వాడిన టీ పొడిని సేకరించి మామూలు టీ పొడిలో కలుపుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. అలాగే టీ పొడిలో జీడిపిక్కల పౌడర్‌ను కలుపుతున్నారని చెప్పారు. ఇలాంటి కల్తీ ఆహార పదార్థాల వాడకంతో జీర్ణవ్యవస్ధ దెబ్బ తింటుందని, లివర్, కిడ్నీలపై ప్రభావం పడుతుందని తెలిపారు. ఈ దాడుల్లో విజిలెన్స్ డీఎస్పీ ఆర్. విజయపాల్, తహసిల్దార్ వీఎం ఇందిరాదేవి, సీఐ ఎన్ఎస్ఎస్ అపర్ణ, అసిస్టెంట్ జియాలజిస్ట్ బాలాజీ నాయక్, సిబ్బంది పాల్గొన్నారు. -
ఐస్‌క్రీమ్ తింటున్నారా ? జాగ్రత్త.. !
చిన్నారుల నుంచి పెద్దవారి వరకు ఐస్‌క్రీములను ఇష్టపడనివారు ఉండరు. వేసవిలో అయితే అందరూ వేసవి తాపాన్ని తట్టుకోవడానికి ఐస్‌క్రీములు తినాల్సిందే. అయితే మనం తినే ఐస్‌క్రీముల వెనుక అనేక చేదు నిజాలు ఉన్నాయని వైద్య నిపుణులు అంటున్నారు. ఐస్‌క్రీముల్లో విపరీతంగా రంగులు వాడుతున్నారని, వీటివల్ల ఊపిరితిత్తుల సమస్యలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. మోతాదుకు మించి రంగులు వాడటం, అనుమతి లేని కల్తీ రంగులు వినియోగిస్తుండటంతో ప్రమాదం పొంచి ఉందని పేర్కొంటున్నారు. సాక్షి, అమరావతి : ఈ వేసవిని ఐస్‌క్రీమ్ తయారీ ఫ్యాక్టరీలు సొమ్ము చేసుకుంటున్నాయి. అనేక రంగులతో ఆకర్షణీయంగా కనిపించే ఈ ఐస్‌క్రీముల్లో కల్తీ జరుగుతున్నట్టు ఆహార భద్రతా అధికారుల పరిశీలనలో వెల్లడైంది. ప్రతి ఐస్క్రీములోనూ నాసిరకం రంగులే వాడుతున్నారని తేలింది. అంతేకాకుండా ఐస్‌క్రీముల్లో వాడే ప్రతి పదార్థం నాసిరకమైందేనని లేదా కల్తీ జరుగుతున్నదేనని స్పష్టమైంది. రాష్ట్రంలో మూడు వేలకుపైగా చిన్నాపెద్ద ఐస్క్రీము ఫ్యాక్టరీలు ఉండగా వాటిలో 90 శాతం ఫ్యాక్టరీలకు అనుమతి లేదు. లైసెన్స్ ఉందా? లేదా? అని అడిగే అధికారులూ లేరు. దీంతో వేసవిలో నాలుగు నెలలపాటు ఐస్‌క్రీముల వ్యాపారం కోట్ల రూపాయల్లో జరుగుతోంది. ఈ స్థాయిలో వ్యాపారం జరుగుతున్నా ఐస్‌క్రీముల్లో నాణ్యత ఉందా? లేదా?, ఆహార భద్రతా ప్రమాణాల మేరకే ఇవి తయారవుతున్నాయా వంటి విషయాలపై అటు ప్రభుత్వం, ఇటు అధికారులు దృష్టి సారించడం లేదు. లక్షలాది మంది నిత్యం ఐస్‌క్రీములను తింటూ అనారోగ్యం పాలవుతున్నా ప్రభుత్వ యంత్రాంగానికి చీమకుట్టినట్టు కూడా లేదు. ప్రధానంగా వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉన్న చిన్నారులు కల్తీ పదార్థాలతో కూడిన ఐస్‌క్రీములు తినడం వల్ల శ్వాసకోశ, గొంతువాపు, జీర్ణకోశ వ్యాధులకు గురవుతున్నారు. అన్నింటా అనుమతి లేని రంగులే.. ఎక్కువ శాతం ఐస్‌క్రీముల్లో అనుమతి లేని రంగులు వాడుతున్నారు. దీంతోపాటు తయారీ కంపెనీలకు లైసెన్సులు లేవు. అత్యంత హాని కలిగించే శాక్రిన్ను మోతాదుకు మించి వాడుతున్నట్టు తేలింది. దీనివల్ల ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. డ్రమ్ముల్లో నీళ్లు నింపి వారం పది రోజుల తర్వాత కూడా అవే నీటిని ఐస్‌క్రీముల తయారీకి వినియోగిస్తున్నారు. సాధారణంగా ఐస్‌క్రీముల్లో హై ఫ్యాట్, మీడియం ఫ్యాట్, లో ఫ్యాట్ రకాలు వాడతారు. కానీ ఈ ఫ్యాట్ మోతాదు సరైన స్థాయిలో ఉండకపోవడంతో ఐస్‌క్రీమ్ నిల్వలో తేడా వస్తుంది. అదేవిధంగా ప్యాకింగ్ లేబుళ్లపై తయారీ తేదీ, ఎక్స్‌పెయిరీ తేదీ ఉండటం లేదు. ఆయా ఫ్యాక్టరీల్లో పారిశుధ్యం అత్యంత ఘోరంగా ఉన్నట్టు తేలింది. విజయవాడ, గుంటూరు కల్తీ ఐస్‌క్రీములకు అడ్డాగా మారాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వేసవిలో రాష్ట్రవ్యాప్తంగా నెలకు రూ.200 కోట్లకుపైనే ఐస్‌క్రీముల వ్యాపారం జరుగుతున్నట్టు అధికారుల అంచనా. తనిఖీలు నిర్వహిస్తూనే ఉన్నాం ఐస్‌క్రీముల్లో అనుమతి లేని రంగులు వాడుతుంది నిజమే. కొద్దిరోజుల క్రితం తనిఖీలు నిర్వహించి కొన్ని కేసులు కూడా నమోదు చేశాం. తిరిగి తనిఖీలు నిర్వహిస్తాం. ఎలాంటి లోపాలున్నా ఆయా కంపెనీలను సీజ్ చేసి, వారిపై కేసులు నమోదు చేస్తాం. లైసెన్సు లేకపోయినా ఆయా ఫ్యాక్టరీలు సీజ్ చేస్తాం. – పూర్ణచంద్రరావు, ఆహార భద్రతా నియంత్రణాధికారి -
కల్తీ మద్యం కలకలం
మందస : జిల్లాలో సంచలనం సృష్టిస్తున్న కల్తీ మద్యం వ్యవహారం మందస మండలంలోనూ వెలుగు చూసింది. మండలంలోని హరిపురం–బాలిగాం జంక్షన్‌లోని ఓ వైన్‌షాపులో మద్యాన్ని కల్తీ చేస్తుండగా ఎక్సైజ్ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హరిపురం–బాలిగాం జంక్షన్‌లోని తనీష్ వైన్స్(జీఎస్ఎల్ నెం.222)లో బుధవారం ఉదయం ఇంపీరియల్ బ్లూ క్వార్టర్(నిప్) బాటిళ్లును కల్తీ చేస్తుండగా ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఇందులో మొత్తం 5 కేసులు(240 బాటిళ్లు) కల్తీ చేస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు కల్తీకి వినియోగించే కప్పులు తొలగించే మిషన్, రబ్బర్ ట్యూబ్ తదితర వస్తువులను, 18.6 కేటీఏ లూజ్ లిక్కర్ మినరల్ వాటర్ బాటిళ్లలో ఉండగా సీజ్ చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కె.వెంకటేశ్వరరావు సూచనల మేరకు ఏఈఎస్ బి.శ్రీనివాసులు, సీఐ ఎస్.శ్రీనివాసరావు, ఎస్ఐ చంద్రశేఖరరాజు, సిబ్బంది ఆధ్వర్యంలో దాడులు జరిగాయి. కల్తీ మద్యం వ్యవహారంలో హెచ్.వెంకటేశ్ అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, వైన్‌షాపు నౌకరీనామాలు షణ్ముఖరావు అలియాస్ చిన్న, హేమంత్‌కుమార్ పేరున ఉన్నాయని ఎక్సైజ్ అధికారులు పేర్కొన్నారు. కల్తీ మద్యం కేసును సోంపేట ఎక్సైజ్ పోలీసు స్టేషన్‌కు అప్పగించామని, సోంపేట సీఐ ఆధ్వర్యంలో దర్యాప్తు జరుగుతుందని సోంపేట సీఐ అబ్దుల్‌ఖలీం తెలిపారు. తనీష్ వైన్ షాపును కూడా సీజ్ చేస్తున్నామన్నారు. -
పోచంపల్లిలో 15మందికి అస్వస్థత
గుర్రంపోడు (నాగార్జునసాగర్) : మండలంలోని పోచంపల్లిలో 15 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరంతా కల్తీ కల్లు తాగడవల్లే.. తీవ్ర వాంతులు, విరేచనాల బారిన పడ్డారని వైద్యాధికారులు అంటున్నారు. శనివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితులు నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గీత కార్మికుడు కుంభం యాదయ్య వద్ద రోజూ మాదిరిగానే సాయంత్రం కల్లు సేవించారు. రాత్రి పదిగంటల సమయంలో కొందరికి వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. వారు స్థానిక ఆర్ఎంపీ వద్దకు చికిత్స పొందారు. ఆర్ఎంపీ వద్దకు చికిత్సకు వచ్చే వారి సంఖ్య పెరుగుతుండటంతో కల్లు తాగడం వల్లే అని గుర్తించారు. వారిని తెల్లవారుజామున మండలకేంద్రంలోని పీహెచ్‌సీకి తరలించి చికిత్స అందించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం 108లో నల్లగొండకు తరలించారు. బాధితుల్లో గ్రామానికి చెందిన గుండెబోయిన జ్యోతి, గుండెబోయిన యాదమ్మ, గుండెబోయిన దనమ్మ, గుండెబోయిన పాపయ్య, జాల మల్లయ్య, పూలె లక్ష్మమ్మ, గుండెబోయిన సత్యనారాయణ, గుండెబోయిన కోటేష్, పూల ఇద్దయ్య, ముక్కాముల యాదమ్మ, గుండెబోయిన బక్కమ్మ, గుండెబోయిన భిక్షమయ్య, పోలేని ఏశమ్మ, ముక్కాముల లక్ష్మీప్రసన్న ఉన్నారు. వీరిలో జాల మల్లయ్య, గుండెబోయిన సత్యనారాయణచ పూలె లక్ష్మమ్మ, గుండెబోయిన భిక్షమయ్య పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలించారు. కల్తీ కల్లు కారణమా..! కల్లు తాగిన వారందరూ అస్వస్థతకు గురికావడంతో.. కల్లు కల్తీ కావడం వల్లే జరిగిందని పోలీసు, ఎక్సైజ్ అధి కారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. కల్లు శాంపిల్స్‌ను తీసి ల్యాబ్‌కు పంపామని, మూడు రోజుల్లో ఖచ్చి తమైన రిపోర్టు వస్తుందని పోలీసులు చెబుతున్నారు. బాధితులను పరామర్శించిన కలెక్టర్ నల్లగొండ టౌన్ : గుర్రంపోడు మండలం పోచంపల్లి గ్రామంలో శనివారం రాత్రి కల్లు తాగి అస్వస్థతకు గురైన బాధితులను జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ఆదివారం కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ పరామర్శించారు. ఈ సందర్బంగా బాధితులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని డాక్టర్లను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బాధితుల్లో ఐదుగురిని డిశ్చార్జ్ చేశారని తెలిపారు. ఎక్సైజ్ అధికా రులు విచారణ చేస్తున్నారని, కల్లు పరీరక్షకు పంపినట్లు, కల్తీకల్లు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుం టామని కలెక్టర్ హెచ్చరించారు. ప్రజలు కల్తీకల్లు తాగి ప్రాణాలమీదకు తెచ్చుకోవద్దని సూచించారు. కల్లులో పురుగు మందుల అవశేషాలు : ఎస్పీ నల్లగొండ క్రైం : గుర్రంపోడు మండలంలోని పోచంపల్లిలో కల్లు తాగి పలువురు అస్వస్థతకు గురైన సంఘటనలో కల్లులో పురుగుమందుల అవశేషాలు ఉన్నట్లు వైద్యులు ప్రాథమికంగా గుర్తించారని ఎస్పీ ఏవీ.రంగనాథ్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. గీత కార్మికుడితో విబేధాలు ఉన్న వ్యక్తులు కల్లులో పురుగుమందు కలిపినట్లు తెలిసిందని, సంఘటనా స్థలంలో విషకారక ప్యాకెట్లు లభించాయని పేర్కొన్నారు. అస్వస్థతకు గురైన 15 మందిలో నలుగురిని మెరుగైన చికిత్స కోసం ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రికి తరలించామని, ఎవరికీ ఎలాంటి హానీ లేదని తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని.. ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. నిషా కోసమే కల్లు కల్తీ..! గుర్రంపోడు : నిషా కోసమే కల్లును కల్తీ చేస్తారు. ఈ కల్లు సేవించిన వారి ప్రాణాల మీదకు తెస్తుంది. కొందరు నిషేధితమైన తీపిదనాన్ని కల్గించేందుకు చక్రిన్, నిషాకు ప్రమాదకరమైన డైజోఫామ్, ఆల్ఫాజోలమ్ వంటి రసాయనాలు వాడుతారు. వీటితో కల్లును కల్తీ చేయడం నేరం. ఎక్సైజ్ అధికారుల వద్ద గల కిట్ ద్వారా తరుచూ కల్లు శాంపిల్స్‌ను తనిఖీలు చేయాల్సి ఉంది. కల్లు కల్తీకి వాడే రసాయనాలు అమ్మే వ్యాపారులపై కూడా కేసులు నమోదు చేస్తారు. ఈ రసాయనాలు ఒక్కోసారి కల్లు అమ్మేవారు మోతాదుకు మించి వేయడం.. ప్రాణాల మీదకు తెస్తుంది. ఈ కల్తీ కల్లు ఎక్కువగా వాసన ఉంటుంది. కల్తీ కల్లు శాంపిల్‌ను వేడిచేస్తే పసుపు రంగులోకి మారుతుంది. పో చంపల్లిలో కల్లు కల్తీ ఘటనలో కల్లు విక్రయిం చిన కుంభం యాదయ్యను పోలీసులు విచారించగా రసాయనాలు అమ్మిన గ్రామంలోని వ్యాపారితోపాటు మరికొంతమందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమచారం. జానా పరామర్శ.. నల్లగొండ టౌన్ :గుర్రంపోడు మండలం పోచంపల్లి గ్రామంలో కల్తీకల్లు తాగి అస్వస్థతకు గురై జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆదివారం కలెక్టర్ గౌరవ్ ఉప్పల్‌తో కలిసి సీఎల్సీ నేత కుందూరు జానారెడ్డి పరామర్శించారు. అనంతరం జానా మాట్లాడుతూ బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని, అవసరమైన వారిని హైదరాబాద్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని డాక్టర్లకు సూచించారు. కల్తీకల్లుకు సంబంధించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అన్నారు. -
ప్రాణాలతో చెలగాటం..
ఆదిలాబాద్: కల్తీకి కాదేదు అనర్హం అన్న చందంగా తాగునీటితో పాటు తినుబండారాలు, పప్పులు, ఉప్పు, నూనె, బియ్యం, కారంపొడి, పుసుపు, పిండి, పాల పదార్థాల్లో ఎత్తున కల్తీ పెద్ద జరుగుతోంది. మార్కెట్లో సురక్షితం కానివి, ఆరోగ్యానికి హానికరమైనవి, నాణ్యత లోపించినవి, ప్యాకింగ్‌పై ఒక రకమైన పదార్థామని చెబుతూ లోన మరో రకం పదార్థాలను కలిపి విక్రయాలు జరుపుతున్నారు. వంట నూనెలను లూజ్‌గా విక్రయించరాదనే నిబంధనలు ఉన్నా జిల్లాలో విచ్చలవిడిగా వీటి విక్రయాలు కొనసాగుతున్నాయి. హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్, టిఫిన్ సెంటర్లు, మిఠాయి, ఐస్‌క్రీం దుకాణాలు, బేకరీల్లో కుళ్లిన పదార్థాలు వాడడంతో ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఆహారభద్రత, ప్రమాణాల యాక్టు–2006 ప్రకారం ఆహార కల్తీకి పాల్పడితే చట్టరీత్యా శిక్షార్హులవుతారు. ఈ నేపథ్యంలో ఆయా శాఖల అధికారులు సమన్వయంతో దాడులు చేస్తేనే కల్తీ వ్యాపారాన్ని అడ్డుకోగలుగుతారు. వార సంతల్లోనూ.. జిల్లాలో ఆయా ప్రాంతాల్లో జరిగే వారసంతల్లోనూ నాసిరకం వస్తువులు, కల్తీ ఆహార పదార్థాలను ప్రజలకు కట్టబెడుతున్నారు. జనం అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని అందినకాడికి దోచుకుంటున్నారు. కొన్ని సంస్థలకు చెందిన వస్తువుల మాదిరిగా పోలీ ఉండేలా తయారు చేసి విక్రయిస్తున్నారు. గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా వారసంతలు జరుగుతుంటాయి. ప్రతి వారం వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున గిరిజనులు ఇక్కడికి వచ్చి వస్తువులు కొనుగోళ్లు చేస్తుంటారు. ముఖ్యంగా జిల్లాలో ఇచ్చోడ, నార్నూర్, సిరికొండ, సిరిచల్మ, ఇంద్రవెల్లి, గుడిహత్నూర్, తదితర ప్రాంతాల్లో జరిగే వారసంతల్లో కల్తీ సరుకులు జోరుగా విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఎక్కువగా చిరుదాన్యాలు, కారంపొడి, పౌడర్లు, సబ్బులు, కాస్మోటిక్ వస్తువులు, పప్పుదినుసుల్లో నాసిరకమైన వాటిని విక్రయిస్తున్నారు. తక్కువ ధరకు లభిస్తుండడంతో ప్రజలు వీటిని కొనుగోలు చేసి మోసపోతున్నారు. రసాయన పదార్థాలతో తయారు చేసిన పెప్సీకోల కల్తీ నూనె, రసాయన పదార్థాలతో సిద్ధం చేసిన పాస్ట్‌ఫుడ్ - ఖానాపూర్, బొక్కల్గూడ, శాంతినగర్ కాలనీలలో అనుమతి లేకుండా ఎన్నో ఆహార పదార్థాల తయారీ పరిశ్రమలు ఉన్నాయి. ఇందులో ప్రమాదకరమైన రసాయనాలతో శీతలపానియాలు, మిఠాయిలు, బ్రెడ్‌ప్యాకెట్లు వంటివి తయారు చేసి పట్టణంతో పాటు గ్రామాల్లో విక్రయాలు చేస్తున్నారు. శనివారం సీసీఎస్ సీఐ సురేశ్ ఆధ్వర్యంలో దాడులు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సుమారు రూ.10 లక్షల విలువ చేసే కల్తీ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మహాలక్ష్మీవాడ, న్యూహౌసింగ్ బోర్డు కాలనీలో మిక్సర్ తయారీ కేంద్రాలున్నాయి. ఇందులో కూడా కల్తీ సాగుతున్నట్లు సమాచారం. - జిల్లాకేంద్రంలోని అంబేద్కర్ చౌక్‌లో ఉన్న ఓ ఫేమస్ బిర్యానీ హౌస్, కలెక్టర్చౌక్లోని రెస్టారెంట్లో గతంలో మున్సిపల్ అధికారులు దాడులు చేసి కుళ్లిపోయిన చికెన్‌ను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా కేంద్రంలోని పలు బిర్యానీ హౌస్‌లలో పెద్ద ఎత్తున ఆహార పదార్థాల కల్తీ జరుగుతున్నట్లు తెలుస్తోంది. రోజుల తరబడి చికెన్‌ను ఫ్రిజ్‌లో ఉంచి మరుసటి రోజు దాన్ని వండుతున్నారు. ఇది ఆరోగ్యానికి ఎంతో ప్రమాదకరం. అధికారులు నామమాత్రంగా దాడులు చేయడంతో అప్పుడప్పుడే ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తున్నాయి. - జిల్లాలో విచ్చలవిడిగా ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్లు వెలిశాయి. ఇందులో వేసవిలో రూ.కోట్ల వ్యాపారం సాగుతోంది. ఏ ఒక్క ప్లాంట్‌లో కూడా సరైన ప్రమాణాలు పాటించడం లేదు. కొంత మంది ఇళ్లలో ప్లాంట్లు ఏర్పాటు చేసుకొని రూ.15 నుంచి రూ.20 చొప్పున వాటర్ క్యాన్లను విక్రయిస్తున్నారు. - జిల్లా కేంద్రంలోని డైట్మైదానం ఎదుట పాస్ట్‌ఫుడ్ దుకాణాలు వెలిశాయి. ఇందులో కల్తీ నూనె, రసాయాన పదార్థాలు వాడుతున్నారు. నోటికి రుచికరంగా ఉంటుందని వీటిని తినేందుకు మొగ్గుచూపిన చాలామంది అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇటీవల సీఏం కేసీఆర్ రాక సందర్భంగా అధికారులు వీటిని తొలగించగా.. ఆ మరుసటి రోజే దుకాణాలు మళ్లీ వెలిశాయి. దాడులు కొనసాగుతాయి.. ఆదిలాబాద్‌లో అనుమతి లేకుండా ఆహార పదార్థాలు, వస్తువులు తయారు చేసినా, కల్తీ ఆహార పదార్థాలు విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తున్నాం. కొన్ని చోట్ల రసాయనాలు వాడి ఆహార పదార్థాలు తయారు చేస్తున్నట్లు తెలియడంతో వాటిపై కూడా నిఘా పెంచాం. ఎవరైనా నకిలీ వస్తువులు అమ్మినట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి. నర్సింహారెడ్డి, ఆదిలాబాద్ డీఎస్పీ కల్తీ వ్యాపారం చేస్తే కఠిన చర్యలు.. పట్టణంలో కల్తీవ్యాపారం చేసినట్లు సమాచారం తెలిస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం. హోటళ్లు, ఇతర ఆహార పదార్థాల తయారీ సెంటర్లలో నాణ్యమైన పదార్థాలే వాడాలి. ఎక్కడైనా కల్తీ జరుగుతున్నట్లు తెలిస్తే మాకు సమాచారం అందించాలి. కల్తీ వ్యాపారాలపై దాడులు చేస్తాం. ఒకవేళ కల్తీ జరిగినట్లు నిర్ధారణ అయితే కేసులు నమోదు చేస్తాం నవీన్, ఫుడ్‌ఇన్‌స్పెక్టర్ -
బ్రాండెడ్ పేరుతో కల్తీ దందా
మొయినాబాద్(చేవెళ్ల): సాధారణ బియ్యం, కందిపప్పులను బ్రాండెడ్ పేర్లతో ప్యాకింగ్ చేస్తున్న గోదాంపై ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. గోదాంలోని బియ్యం, కందిపప్పుతోపాటు ఇతర సరుకులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన మొయినాబాద్ మండలంలోని అమ్డాపూర్ రోడ్డులో ఉన్న ఓ వ్యవసాయ క్షత్రంలో మంగళవారం సాయంత్రం వెలుగుచూసింది. మొయినాబాద్ సీఐ సునీత తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని బేగంబజార్‌కు చెందిన రాంనివాస్సోలంకీకి మొయినాబాద్ మండలంలో జేబీఐఈటీ కళాశాల సమీపంలో అమ్డాపూర్ రోడ్డు పక్కన వ్యవసాయ క్షేత్రం ఉంది.అందులో గరిమ ఎంటర్ప్రైజెస్ పేరుతో గోదాం నిర్మించాడు. ఒడిశా నుంచి తక్కువ ధరకు సాదారణ బియ్యం, కందిపప్పు కొనుగోలు చేసి ఇక్కడి గోదాంకు తీసుకొస్తారు. గోదాంలో వాటిని బ్రాండెడ్ పేర్లతో ప్యాకింగ్ చేస్తారు. కోహినూర్ బాస్మతి రైస్, రియల్ డైమండ్, ఇండియా గేట్ వంటి బ్రాండ్ల పేర్లతో తయారు చేసిన కవర్లలో బియ్యాన్ని, అంకుల బ్రాండ్‌తో తయారు చేసిన కవర్లలో కందిపప్పును ప్యాక్ చేసి నగరంలోని బేగం బజార్లో అధిక ధరలకు విక్రయిస్తున్నారు. దీనిపై సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు మంగళవారం సాయంత్రం దాడులు నిర్వహించారు.ఎస్ఓటీ సీఐ ప్రవీణ్‌రెడ్డి, ఏఎస్సై అంతిరెడ్డి సిబ్బందితో వచ్చి దాడి చేశారు. గోదాంలో 200 టన్నుల బియ్యం, 12 టన్నుల కందిపప్పు ఉన్నట్లు గుర్తించారు. వీటితోపాటు సాధారణ గోధుమ పిండి ఉంది. స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో సీఐ సునీత సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. బ్రాండెడ్ పేర్లతో ప్యాక్ చేసిన 200 టన్నుల బియ్యం, 12 టన్నుల కందిపప్పును స్వాధీనం చేసుకుని గోదాంను సీజ్ చేశారు. ఈ అక్రమ దందాకు పాల్పడుతున్న వ్యాపారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బియ్యం, కందిపప్పు విలువ సుమారు రూ. 1 కోటి వరకు ఉంటుందని.. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. రెండేళ్లుగా ఈ దందా సాగుతున్నట్టు తెలుస్తోంది. -
కల్తీ దొంగలు
సాక్షి, రాజమహేంద్రవరం: అగ్గిపుల్ల.. కుక్కపిల్ల.. సబ్బుబిళ్ల... కాదేదీ కవితకనర్హం అని ఓ మహా కవి అన్న మాటలను కొంత మంది మద్యం వ్యాపారులు బాగా వంటపట్టించుకుంటున్నారు. కారం, నెయ్యి, నూనె తదితర ఆహార వస్తువులను కల్తీ చేయగా లేనిది తాము ఎందుకు చేయకూడదని కొంత మంది మద్యం వ్యాపారులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ చట్టవిరుద్ధంగా మద్యం కల్తీ చేస్తూ విక్రయిస్తున్నారు. వందల రూపాయలు ఖర్చు పెట్టి మద్యం తాగుతున్న వారికి కనీసం నాణ్యమైన మద్యం ఇవ్వకుండా అందులో కల్తీ చేసి వారి మత్తును సొమ్ము చేసుకుంటున్నారు. రెండు రోజుల కిందట రాజమహేంద్రవరంలోని జాంపేట అశోక థియేటర్ పక్కన ఉన్న మేనక బార్ అండ్ రెస్టారెంట్‌ను మద్యం కల్తీ కేసులో అధికారులు సీజ్ చేయడంతోఅసలు గుట్టు తేటతెల్లమైంది. మీడియం బ్రాండ్ మద్యంలో చీఫ్ లిక్కర్, నీళ్లు, సారా కలిపి విక్రయిస్తున్నారు. హెట్టీ, ఎనీటైం తదితర చీప్ లిక్కర్లను ఆఫీసర్స్ చాయిచ్, ఇంపీరియల్ బ్లూ తదితర మీడియం బ్రాండ్లలో కలుపుతున్నారు. మీడియం బ్రాండ్ మద్యం ఫుల్ బాటిల్ (720 ఎంఎల్)లో చీప్ లిక్కర్ 180 ఎంఎల్ నుంచి 240 ఎంఎల్‌ను కలిపి మీడియం బ్రాండ్ ధరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మేనక బార్ అండ్ రెస్టారెంట్లో గత కొన్ని నెలలుగా ఈ తంతు జరుగుతోందని అధికారులు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఫిర్యాదుల నేపథ్యంలో గత నెల 21వ తేదీన బార్లో రాజమహేంద్రవరం ఎక్సైజ్ శాఖ అధికారులు తనిఖీలు చేశారు. మీడియం బ్రాండ్లలో మద్యాన్ని పరీక్షించారు. మద్యం మీడియం బ్రాండ్లలో చీప్ లిక్కర్, నీళ్లు, సారా కలుపుతున్నట్లు గుర్తించారు. అధికారులపై పెద్ద స్థాయిలో ఒత్తిళ్లు... గత ఏడాది నూతన బార్ పాలసీ వచ్చే వరకు మేనక బార్ అండ్ రెస్టారెంట్ తాడితోట ప్రాంతంలో షెల్టాన్ హోట్కు ఎదురుగా ఉండేది. నూతన మద్యం పాలసీలో ప్రస్తుతం ఉన్న బార్ స్థానంలో ఉన్న దుకాణం రాకపోవడతో మేనకబార్ను అక్కడ ఏర్పాటు చేశారు. బార్‌ను అధికారులు తనిఖీ చేసి కేసు నమోదు చేయడంతో బార్ యజమాని, స్థల యజమాని రగంలోకి దిగారు. మేనక బార్ యజమాని అయిన రామకృష్ణా రెడ్డి (మేనక రెడ్డి) గతంలో రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో కలసి సారా వ్యాపారం చేశారు. స్థల యజమాని కూడా రాజకీయ పరిచయాలు ఉండడంతో కేసు నమోదు కాకుండా పెద్ద స్థాయిలో ఒత్తిళ్లు తీసుకువచ్చారు. అయినా వెరవని అధికారులు గత నెల 21వ తేదీన కేసు నమోదు చేశారు. మంత్రి స్థాయిలో ఒత్తిళ్లు తీసుకువచ్చి బార్‌ను సస్పెండ్ నిర్ణయాన్ని అమలు చేయనీయకుండా అడ్డుపడ్డారు. అయితే ఈ విషయంపై సమగ్ర నివేదిక తయారు చేసిన స్థానిక అధికారులు దాన్ని ఉన్నతాధికారులకు పంపారు. బార్‌ను సీజ్ చేయాలని ఉన్నతాధికారులు నుంచి ఆదేశాలు రావడంతో శుక్రవారం స్థానిక అధికారులు బార్‌ను మూసివేశారు. మద్యం ప్రియులకు ప్రాణసంకటం.. కొంత మంది మద్యం వ్యాపారుల ధనదాహం మద్యం ప్రియులకు ప్రాణసంకటంగా మారింది. జిల్లాలో 524 మద్యం దుకాణాలు, 40 బార్లు నిర్వహణలో ఉన్నాయి. బార్లు, మద్యం దుకాణాల వద్ద లూజు విక్రయాలు చేపడుతున్నారు. పేదలు, మురికివాడల వద్ద ఉన్న దుకాణాలు, బార్లలో మేనక బార్ అండ్ రెస్టారెంట్లోలా మద్యం కల్తీ చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. -
కల్తీలకు కేరాఫ్‌గా గుంటూరు
పట్నంబజారు (గుంటూరు): ప్రభుత్వ నిర్లిప్తత, అధికారుల అవినీతితో గుంటూరు జిల్లా కల్తీలకు కేరాఫ్‌గా మారిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, గుంటూరు జిల్లా పరిశీలకుడు బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న ప్రభుత్వ పెద్దలు.. విత్తనాలు, కారం, పాలు, నూనె అని తేడా లేకుండా కల్తీలకు పాల్పడుతున్నా పట్టించుకునే పరిస్థితుల్లో లేరన్నారు. గుంటూరు నగరంపాలెంలోని కేకేఆర్ ఫంక్షన్ ప్లాజాలో గురువారం నిర్వహించిన పార్టీ సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. ఐదో విడత జన్మభూమిలో రాష్ట్రవ్యాప్తంగా 10లక్షల అప్లికేషన్లు వస్తే..వాటిలో ఎన్ని పరిష్కరించగలిగారని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. టీడీపీ మూడున్నరేళ్ల పాలనలో చేసిన మంచి ఏమి లేదని, ప్రస్తుతం అందించిన దరఖాస్తుల్ని 2022లో పూర్తి చేస్తారా? అని ఎద్దేవా చేశారు. ఏ ఒక్కచోటా పేదవారికి ఇళ్లు కట్టించిన పాపాన పోలేదని మండిపడ్డారు. పోలీసుల్ని అడ్టుపెట్టుకుని జన్మభూమి సభలు నిర్వహించడం దారుణమని ఖండించారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు వైఎస్సార్ సీపీ పాటుపడుతోందని, దానిలో భాగంగా జిల్లాలోని 17 నియోజకవర్గాల్లో బూత్ కమిటీల్ని పటిష్టం చేసి శిక్షణ తరగతులు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. జన్మభూమి సభల్లో కానరాని చిత్తశుద్ధి : ఉమ్మారెడ్డి శాసనమండలి ప్రతిపక్ష నేత ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జన్మభూమి సభల్లో ఎక్కడా చిత్తశుద్ధి కనబడడం లేదని, ప్రభుత్వంలో జవాబుదారీతనం తగ్గిం దని విమర్శించారు. ఇప్పటి వరకూ నిర్వహిం చిన జన్మభూమి సభల్లో 42 లక్షల దాకా అర్జీ లు వచ్చాయని, వాటిల్లో లబ్ధిదారులకు ఎంత వరకూ న్యాయం జరిగిందని ప్రశ్నించారు. గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ ఆధ్యక్షుడు రావి వెంకటరమణ మాట్లాడుతూ ప్రభుత్వంపై వ్యతిరేకతను ఓట్లుగా మలుచుకునేందుకు పాటుపడతామని తెలిపారు. కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మోపిదేవి వెంకటరమణ, మర్రి రాజశేఖర్, ఆతుకూరి ఆంజనేయులు, కిలారి రోశయ్య, ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున, బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి, చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చల్లపల్లి రామ్మోహనరావు, రాష్ట్ర కార్యదర్శులు లేళ్ల అప్పిరెడ్డి, ఎండీ.నసీర్ అహ్మద్, మందపాటి శేషగిరిరావు, గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ సమన్వయకర్త లావు శ్రీకృష్ణదేవరాయలు, నియోజకవర్గ సమన్వయకర్తలు కావటి మనోహర్‌నాయుడు, బొల్లా బ్రహ్మనాయుడు, అన్నాబత్తుని శివకుమార్, కత్తెర హెనీ క్రిస్టినా, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గులాం రసూల్, పార్టీ నేతలు, అనుబంధ విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు. -
టీ పొడి కల్తీ?
పరిగి: టీ పొడిలో కల్తీ జరుగుతోందని వదంతులు వ్యాపించాయి. తయారైన టీ పొడిని గుట్టుగా తమిళనాడుకు ఎగుమతి చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో కల్తీ గుట్టు తేల్చేందుకు పెనుకొండ డీఎస్పీ కరీముల్లా షరీఫ్, హిందూపురం రూరల్ సీఐ వెంకటేశులు కలిసి పరిగి ఎస్సై రాంభూపాల్, పోలీసు సిబ్బందితో బుధవారం రంగంలోకి దిగారు. హిందూపురం మధుగిరి ప్రధాన రహదారిలో ప్రికాట్ మిల్లు సమీపంలో ఉన్న గొరవనహళ్లి క్రాస్‌లో చర్మ శుభ్రత కోసం మలేదడెక్ట్ అనే కుటీర పరిశ్రమ నడుస్తోంది. తమిళనాడు రాష్ట్రంలోని సేలం ప్రాంతానికి చెందిన మాధవన్ దీని నిర్వాహకుడు. గొర్రెలు, మేకల చర్మాలను శుభ్రపరిచేందుకు అవసరమైన పొడి తయారీకి బదులు కల్తీ టీ పొడి తయారు చేసి తమిళనాడుకు అమ్ముతున్నారని ఆరోపణలు రావడంతో డీఎస్పీ, సీఐలు ఫ్యాక్టరీ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం బిల్లు పుస్తకాలు, రిజిస్ట్రేషన్ కాపీలు, రెన్యూవల్స్ రికార్డులు తనిఖీ చేశారు. గోడౌన్‌లోని తయారీ విధానాన్ని, చర్మం శుభ్రపరిచేందుకు తయారవుతుందంటున్న పౌడరు, తయారీలో వాడే పదార్థాలు, ముడి సరుకు వివరాలను నిశితంగా పరిశీలించారు. పరీక్షల నిమిత్తం నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. ల్యాబ్ నివేదిక వచ్చాక ఆరోపణలు రుజువైతే నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
కల్తీ రక్కసి
► గుంటూరు ఆటోనగర్‌లో శనివారం భారీగా పట్టుబడిన కల్తీ పచ్చళ్ల డ్రమ్ములు ► కుళ్లిన పదార్థాలతో తయారీ ► నిర్వాహకుడిని కాపాడేందుకు రంగంలోకి పిడుగురాళ్ల టీడీపీ నాయకుడు ► వరుస ఘటనలతో ప్రజానీకం ఆందోళన కల్తీ ఆహార పదార్థాలకు జిల్లా అడ్డాగా మారుతోంది. ‘కల్తీలకు కాదేది అనర్హం’ అన్న రీతిలో జిల్లాలో కల్తీ జరుగుతోంది. ధనార్జనే ధ్యేయంగా కొందరు వ్యాపారులు దందా కొనసాగిస్తూ డబ్బు దండుకుంటున్నారు. వారికి అధికార పార్టీ నేతలు దన్నుగా నిలవడంతో వారి వ్యాపారం మూడు పూవులు ఆరుకాయలుగా కొనసాగుతోంది. సాక్షి, అమరావతి బ్యూరో: కారం, నెయ్యి, బియ్యం, కంది పప్పు, చికెన్, టీపొడి మొదలు కుళ్లిన పచ్చళ్లను సైతం విక్రయిస్తున్నారు అక్రమార్కులు. శుక్రవారం రాత్రి గుంటూరు ఆటోనగర్ శివారు ప్రాంతంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించి 200 డమ్ముల్లో కల్తీ పచ్చళ్లు పట్టుకోవడం ఒక్కసారిగా జిల్లాను భయభ్రాంతులకు గురిచేసింది. పట్టుబడిన పచ్చళ్లు బూజు పట్టి ఉండి, బ్యాక్టీరియా చేరి కంపుకొడుతుండటం గమనార్హం. పచ్చళ్లలో కల్తీ కారం, రోడామిన్–బి వంటి హానికర పదార్థాలు ఉన్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విజిలెన్స్ అధికారులు కల్తీ పచ్చళ్లకు సంబంధించి , ఫుడ్ సేఫ్టీ అధికారుల సమక్షంలో తొమ్మిది శాంపిల్స్ తీసి హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు, శాంపిల్ ఫలితాలు వచ్చాక కేసులు నమోదు చేస్తామని మీనమేషాలు లెక్కిస్తున్నట్లు సమాచారం. ఆటోనగర్‌లో పట్టుబడిన పచ్చళ్లకు సంబంధించి పుడ్ సేఫ్టీ అధికారులు కేసు నమోదు చేయకుండా పచ్చళ్లు వాడిన వినియోగదారుడు ఫిర్యాదు చేస్తేనే కేసు నమోదు చేస్తామని, తప్పిచేయత్నం చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రంగంలోకి పిడుగురాళ్ల నేత... కల్తీ పచ్చళ్ల వ్యవహారం నుంచి సంబంధిత వ్యాపారిని గట్టెక్కించేందుకు పిడుగురాళ్ల పట్టణానికి చెందిన ఓ అధికార పార్టీ నేత రంగంలో దిగి కేసు నమోదు కాకుండా చక్రం తిప్పినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఫుడ్ సెఫ్టీ , పౌర సరఫరాలు, పోలీస్, రెవెన్యూ, నగరపాలక సంస్థ, తూనికలు కొలతల శాఖ అధికారులు కల్తీ పచ్చళ్ల గురించి పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో మంగళగిరిలో కల్తీ పచ్చళ్ల స్థావరాలపై విజిలెన్స్ అధికారులు దాడులు చేసి రెండు నామూనాలను హైదరాబాద్ నాచారం ల్యాబ్‌కు, మిగిలిన నాలుగు శాంపిళ్లను గుంటూరు మెడికల్ కాలేజిలోని రీజినల్ ల్యాబ్‌కు పంపారు. హైదరాబాద్‌కు పంపిన రెండు శాంపిళ్లలో ఒకటి హానికరమని, వాటిలో ఎరిత్రోసిన్ అనే హానికర పదార్థం ఉన్నట్లు తేలింది. మరో శాంపిల్‌లో మిస్ బ్రాండెడ్‌గా గుర్తించినట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా కలెక్టర్ కోన శశిధర్ స్పందించి కల్తీ దందాపై ఉక్కుపాదం మోపాలని ప్రజలు కోరుతున్నారు. కల్తీ కారం కథ కంచికి.. గతేడాది అధికారులు కోల్డ్‌స్టోరేజీలపై దాడులు నిర్వహించి రూ.కోట్ల విలువైన కల్తీ కారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కల్తీ వ్యాపారానికి సంబంధం ఉన్నవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, జైలుకు పంపుతామని జిల్లాకు చెందిన ఓ మంత్రి, అధికారులు కలిసి హడావిడి చేసి తర్వాత పట్టించుకోలేదు. 87 నామూనాలు తీసి హైదరాబాద్ ల్యాబ్‌కు పంపగా వాటిలో 30 నామూనాలు ప్రజారోగ్యానికి హానికరమని నివేదికలు వచ్చినా ఫుడ్‌సేఫ్టీ అధికారులు నామమాత్రంగా కేసులు నమోదు చేశారు. దీనివెనుక పెద్ద ముడుపులు చేతులు మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ రెండు, మూడు రోజుల నుంచి కల్తీ పచ్చళ్ల బాగోతం కూడా బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రజలు ఏం కొనాలో? ఏం తినాలో తెలియక ఆందోళనకు గురవుతున్నారు. -
తాట తీయండి..
- డ్రగ్స్, కల్తీలపై ఉక్కుపాదం మోపండి: సీఎం కేసీఆర్ - మంత్రులు.. నేతలు.. ఎవరున్నా సరే కేసులు పెట్టండి - అక్రమార్కులు భయపడేలా చర్యలుండాలి - హైదరాబాద్‌ను డ్రగ్స్ రహిత నగరంగా మార్చండి - బ్రాండ్ ఇమేజీ కాపాడటం అత్యవసరం - గుడుంబా 95% పోయింది.. ఇది వంద శాతం కావాలి - బాగా పనిచేసే పోలీసులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు - డ్రగ్స్ కేసుపై పోలీస్, ఎక్సైజ్ అధికారులతో సీఎం సమీక్ష సాక్షి, హైదరాబాద్ డ్రగ్స్, కల్తీల నియంత్రణ విషయంలో మరింత దూకుడుగా ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పోలీసు, ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. అన్ని కోణాల నుంచి లోతుగా దర్యాప్తు చేయాలని సూచించారు. ఈ దందాలో ఎవరి ప్రమేయం ఉన్నా వదలొద్దని స్పష్టం చేశారు. ‘‘చట్ట వ్యతిరేక చర్యలకు ఈ రాష్ట్రంలో చోటులేదు. ఎంతటి వారైనా సరే పట్టుకోండి. ఎంతటి ప్రముఖుడైనా వదలొద్దు. రాజకీయ నాయకులున్నా సరే కేసు పెట్టండి. టీఆర్ఎస్ వారి పాత్ర ఉన్నా సరే.. కేసులు పెట్టి జైలుకు పంపండి. కేబినెట్ మంత్రి ఉన్నా కేసు పెట్టండి...’’ అని స్పష్టం చేశారు. అక్రమార్కులు భయపడే విధంగా కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. పోలీస్, ఎక్సైజ్, ఇతర శాఖల అధికారుల కృషి బాగుందని ప్రశంసించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రగతి భవన్లో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, పద్మారావు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు ఎస్.నర్సింగ్‌రావు, సోమేశ్ కుమార్, శాంతి కుమారి, ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, ఏసీబీ డీజీ పూర్ణచందర్రావు, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు మహేందర్ రెడ్డి, సందీప్ శాండిల్య, మహేశ్ భగవత్, ఇంటెలిజెన్స్ ఐజీ నవీన్ చంద్, సెక్యూరిటీస్ ఐజీ ఎన్కే సింగ్, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సభర్వాల్, హైదరాబాద్, వరంగల్ రేంజ్ ఐజీలు స్టీఫెన్ రవీంద్ర, నాగిరెడ్డి, పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్ గుప్త తదితరులు ఇందులో పాల్గొన్నారు. డ్రగ్స్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ హైదరాబాద్‌ను డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చాలని సీఎం ఆదేశించారు. ‘‘హైదరాబాద్‌లో డ్రగ్స్ ఎప్పట్నుంచో ఉంది. గత పాలకులు అశ్రద్ధ చూపారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కాపాడడం అత్యంత అవసరం. అందుకే కేసు దర్యాప్తులో ఉండగా సెలవులో వెళ్లవద్దని నేనే అకున్ సభర్వాల్‌కు సూచించా. కేసు మూలాలన్నీ వెలికి తీయండి. డగ్స్ సరఫరా, వినియోగమంటే భయభ్రాంతులయ్యేలా చర్యలుండాలి. హైదరాబాదే తెలంగాణకు లైఫ్‌లైన్. అందుకే ఈ అరాచకం అంతం కావాలి. హైదరాబాద్‌ను డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చాలి’’ అని అన్నారు. ‘‘శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్‌గా ఉంది. రాష్ట్రంలో పేకాట జాడ్యాన్ని రూపుమాపగలిగాం. ఆన్లైన్లో పేకాటను నిషేధించాం. 95 శాతం గుడుంబా పోయింది. ఇది వంద శాతం కావాలి. ధూల్‌పేటలో ప్రత్యేక వ్యూహం అనుసరించాలి. గుడుంబా తయారీ, అమ్మకాలు చేసే వారితో మాట్లాడి, వారికి ప్రత్యామ్నాయం చూపాలి. ఇందుకోసం హోంమంత్రి ఆధ్వర్యంలో త్వరలోనే సమావేశం నిర్వహిస్తాం..’’ అని సీఎం తెలిపారు. నిరంతర నిఘాకు కౌంటర్ ఇంటెలిజెన్స్ ఆహార పదార్థాల కల్తీ, నకిలీ విత్తనాలు, డ్రగ్స్ విషయాల్లో ఒక్క కేసుతో అయిపోయిందని అనుకోవద్దని సీఎం అన్నారు. ‘‘అసాంఘిక శక్తుల కార్యకలాపాలపై నిరంతరం నిఘా పెట్టడానికి కౌంటర్ ఇంటెలిజెన్స్ ఉన్నట్లే వీటిపై నిరంతర నిఘాకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలి. మీ అనుభవం, శక్తియుక్తులతో ఈ దురాగతాలపై ఉక్కుపాదం మోపండి. ఎవరినీ ఉపేక్షించకుండా చట్టం చాలా కఠినంగా వ్యవహరిస్తుందనే సందేశం ప్రజల్లోకి వెళ్లాలి. బాగా పనిచేసిన పోలీసు అధికారులకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వండి. కిందిస్థాయిలో పనిచేసే ఎస్సైల వరకు ప్రభుత్వ లక్ష్యాన్ని వివరించండి. బాగా పనిచేస్తే ప్రోత్సహించండి. ఇంక్రిమెంట్లు ఇవ్వండి. ఆగస్టు 15న నేనే వారికి స్వయంగా అవార్డులు ఇస్తా’’ అని ముఖ్యమంత్రి వెల్లడించారు. రక్తం కల్తీ బాధ కలిగించింది రక్తాన్ని కూడా కల్తీ చేయడం తనకు ఎంతో బాధ కలిగించిందని సీఎం అన్నారు. ‘‘ఇటీవల రక్తంలో సెలైన్ ఎక్కించి రోగులకు అమ్ముతున్నారనే విషయం వెలుగులోకి వచ్చింది. నాకు ఎంతో బాధ కలిగింది. బతికిస్తాడని నమ్మి వచ్చిన వారిని చంపుతారా? ఇదెంత దుర్మార్గం? ఇలాంటి వారిని ఏం చేసినా తప్పు లేదు. యావజ్జీవ కారాగార శిక్ష పడేందుకు అనుగుణమైన చట్టాలకు రూపకల్పన చేయండి. అవసరమైన చట్టాలకు సవరణలు, మార్పులు చేయండి. ఈ దందాలో కింగ్‌గా, డాన్‌గా చలామణి అవుతున్న వారు ఎక్కడున్నా పట్టుకోండి. డ్రగ్స్‌తో పాటు గంజాయి కూడా నగరాల్లో సరఫరా అవుతోంది. రాష్ట్రంలో ఎక్కడ గంజాయి సాగవుతుందో గుర్తించండి. సరిహద్దుల్లో నిఘా, తనిఖీలు పెంచండి’’ అంటూ దిశానిర్దేశం చేశారు. అవినీతి అధికారుల చిట్టా ‘‘కొందరు అధికారుల అవినీతి వల్ల ఈ దుర్మార్గాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అవినీతి అధికారుల చిట్టా తయారు చేయండి. వారిపై నిఘా పెట్టండి. డబ్బులిచ్చి పనిచేయించుకునే వారిని, డబ్బులు తీసుకుని పనిచేసే వారిని గుర్తించి, కేసులు పెట్టి శిక్షించాలి. అవినీతి నిరోధక శాఖ మరింత బాగా పనిచేయాలి’’ అని సీఎం ఆదేశించారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ల నియామకం ఆహార పదార్థాల నాణ్యతా ప్రమాణాలు పరీక్షించేందుకు అవసరమైనంత మంది ఫుడ్ ఇన్స్పెక్టర్లను వెంటనే నియమించాలని, విత్తనాల నాణ్యత పరీక్షల ఫలితాలు వెంటనే వచ్చేలా చూడాలని వ్యవసాయ శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన జిల్లాలు, పోలీస్ కమిషనరేట్లకు అనుగుణంగా తలపెట్టిన పోలీసు కార్యాలయాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కోరారు. ఒక్కో అధికారికి.. ఒక్కో బాధ్యత ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి కీలక బాధ్యతలు అప్పగించారు. ఆ వివరాలు.. సీఎంవో అధికారులు ఎస్.నర్సింగరావు, శాంతి కుమారి గుడుంబా తయారీదారులకు ప్రత్యామ్నాయ జీవనోపాధికి బ్యాంకులతో సంబంధం లేకుండా ఆర్థిక సహాయం అందించే కార్యక్రమ పర్యవేక్షణ హైదరాబాద్ సిటీ కమిషనర్ మహేందర్‌రెడ్డి కల్తీలు, డ్రగ్స్ తదితర వ్యవస్థీకృత నేరాలను అదుపు చేయడానికి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడానికి అనువుగా చట్టాల్లో ఎలాంటి మార్పులు, సవరణలు చేయాలో అధ్యయనం చేసి ప్రభుత్వానికి సిఫారసు చేయటం ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్‌చంద్ వ్యవస్థీకృత నేరాలను అదుపు చేసేందుకు కౌంటర్ ఇంటెలిజెన్స్ తరహాలో నిరంతర నిఘా కోసం ప్రత్యేక విభాగాన్ని నెలకొల్పే బాధ్యత డీజీపీ అనురాగ్‌శర్మ కల్తీ విత్తనాలు తయారు చేసే కేంద్రాలు, ఆహార పదార్థాలు కల్తీ జరిగే ప్రదేశాలపై ఆకస్మిక దాడులు. ఇతర వ్యూహాల అమలు పర్యవేక్షణ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సభర్వాల్, కమిషనర్ చంద్రవదన్ డ్రగ్స్‌పై పూర్తిస్థాయి దర్యాప్తు. భాగస్వామ్యం ఉన్న ప్రతీ ఒక్కరికీ కఠిన శిక్షలు పడేంత వరకు చర్యలు. ఐజీలు స్టీఫెన్ రవీంద్ర, నాగిరెడ్డి హైదరాబాద్‌లో కాకుండా రాష్ట్రంలోని ఇతర నగరాలు, పట్టణాల్లో అక్రమ దందాలను అరికట్టేందుకు వ్యూహం. అమలు సీఎస్ ఎస్పీ సింగ్ హైదరాబాద్ చుట్టు పక్కల విత్తనాలు, ఆహార కల్తీ జరిగే ప్రాంతాలను గుర్తించి, కలెక్టర్ల సహకారంతో తగిన చర్యలు తీసుకోవటం ఏసీబీ డీజీ పూర్ణచందర్రావు అక్రమాలకు పాల్పడే అధికారులను గుర్తించి, అవినీతి ఎక్కడ జరుగుతున్నదో పసిగట్టి, అవినీతి అధికారుల చిట్టా తయారు చేయటం దామోదర్ గుప్త, ఎంపీ మల్లారెడ్డి కొత్త పోలీసు కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లు, ఎక్సైజ్ స్టేషన్లు, సిబ్బంది క్వార్టర్ల నిర్మాణ పనుల పర్యవేక్షణ ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ డ్రగ్స్, గుడుంబా, గంజాయిపై కఠినంగా వ్యవహరించేలా ఎక్సైజ్ శాఖను బలోపేతం చేసే చర్యలు వ్యవసాయ శాఖ కమిషనర్ జగన్మోహన్ విత్తనాల నాణ్యత పరీక్షల ఫలితాలు వెంట వెంటనే వచ్చేలా చర్యలు తీసుకోవటం జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి హైదరాబాద్‌లో కావాల్సినంత మంది ఫుడ్ ఇన్స్పెక్టర్లను నియమించి, ఆహార పదార్థాల పరీక్షలు వెంటవెంటనే నిర్వహించి, కేసుల్లో సహకరించటం మంత్రులు నాయిని, పద్మారావు దూల్పేటలో గుడుండా నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, తయారీదారులకు ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పించే బాధ్యత -
మరో కల్తీ దందా గుట్టురట్టు
ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లాలో మరో కల్తీ దందా ముఠాను ఇబ్రహీంపట్నం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. సాగర్ హైవే పక్కన మంగలపల్లిలో శ్రీ భవానీ ఏజెన్సీ పేరుతో ఓ గోడౌన్లో నకిలీ కారంతో పాటు ఇతరు తృణధాన్యాలను తయారు చేస్తున్నట్లు సమాచారం అందడంతో అధికారులు ఆకస్మిక తనిఖీ నిర్వహించి పట్టుకున్నారు. నాలుగు టన్నుల మిర్చి, 3.5 టన్నుల పసుపు పౌడర్, 1250 కిలోల ధనియాల పౌడర్, 320 కిలోల ఆవాలు, 2500 కిలోల ఇతర తృణధాన్యాలు, 15 కిలోల అయిల్ స్వాధీనం చేసుకున్నారు. వీరు శ్రీ ఓం, చక్రం బ్రాండ్ల పేరుతో నకిలీ కారం, తదితరాలను అమ్ముతున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కల్తీ నివారణకు ఐదంచెల ప్రణాళిక
అధికారులకు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఆదేశం సాక్షి, హైదరాబాద్: కల్తీ నివారణకు ఐదంచెల ప్రణాళిక రూపొందించాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్(ఐపీఎం) అధికారులతో సచివాలయంలో కల్తీ నివారణపై మంత్రి సమీక్ష చేశారు. మంత్రి లక్ష్మా రెడ్డి మాట్లాడుతూ హానికరం, నాసిరకం, మిస్ బ్రాండెడ్ వస్తువుల తయారీపై దృష్టి సారించాలని, వాటి అమ్మకా లను కట్టడి చేయాలని ఆదేశించారు. అందుకు తగ్గ ప్రణాళి కలు రూపొందించాలని మంత్రి సూచించారు. దాడులు చేయడం, శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేసుకోవడం వంటి చర్యలు చేపట్టాలన్నారు. స్ట్రీట్ వెండర్స్ అవేర్నెస్ ప్రోగ్రా మ్ చేపట్టాలని సూచించారు. ఈ సమీక్ష సమా వేశంలో ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివా రీ, ఐపీఎం డైరెక్టర్ డాక్టర్ శివలీల తదితరులు పాల్గొన్నారు.