సాక్షి, రాజమహేంద్రవరం: అగ్గిపుల్ల.. కుక్కపిల్ల.. సబ్బుబిళ్ల... కాదేదీ కవితకనర్హం అని ఓ మహా కవి అన్న మాటలను కొంత మంది మద్యం వ్యాపారులు బాగా వంటపట్టించుకుంటున్నారు. కారం, నెయ్యి, నూనె తదితర ఆహార వస్తువులను కల్తీ చేయగా లేనిది తాము ఎందుకు చేయకూడదని కొంత మంది మద్యం వ్యాపారులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ చట్టవిరుద్ధంగా మద్యం కల్తీ చేస్తూ విక్రయిస్తున్నారు. వందల రూపాయలు ఖర్చు పెట్టి మద్యం తాగుతున్న వారికి కనీసం నాణ్యమైన మద్యం ఇవ్వకుండా అందులో కల్తీ చేసి వారి మత్తును సొమ్ము చేసుకుంటున్నారు.
రెండు రోజుల కిందట రాజమహేంద్రవరంలోని జాంపేట అశోక థియేటర్ పక్కన ఉన్న మేనక బార్ అండ్ రెస్టారెంట్‌ను మద్యం కల్తీ కేసులో అధికారులు సీజ్ చేయడంతోఅసలు గుట్టు తేటతెల్లమైంది. మీడియం బ్రాండ్ మద్యంలో చీఫ్ లిక్కర్, నీళ్లు, సారా కలిపి విక్రయిస్తున్నారు. హెట్‌టీ, ఎనీటైం తదితర చీప్ లిక్కర్లను ఆఫీసర్స్ చాయిచ్, ఇంపీరియల్ బ్లూ తదితర మీడియం బ్రాండ్లలో కలుపుతున్నారు.
మీడియం బ్రాండ్ మద్యం ఫుల్ బాటిల్ (720 ఎంఎల్)లో చీప్ లిక్కర్ 180 ఎంఎల్ నుంచి 240 ఎంఎల్‌ను కలిపి మీడియం బ్రాండ్ ధరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మేనక బార్ అండ్ రెస్టారెంట్‌లో గత కొన్ని నెలలుగా ఈ తంతు జరుగుతోందని అధికారులు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఫిర్యాదుల నేపథ్యంలో గత నెల 21వ తేదీన బార్‌లో రాజమహేంద్రవరం ఎక్సైజ్ శాఖ అధికారులు తనిఖీలు చేశారు. మీడియం బ్రాండ్లలో మద్యాన్ని పరీక్షించారు. మద్యం మీడియం బ్రాండ్లలో చీప్ లిక్కర్, నీళ్లు, సారా కలుపుతున్నట్లు గుర్తించారు.
అధికారులపై పెద్ద స్థాయిలో ఒత్తిళ్లు...
గత ఏడాది నూతన బార్ పాలసీ వచ్చే వరకు మేనక బార్ అండ్ రెస్టారెంట్ తాడితోట ప్రాంతంలో షెల్టాన్ హోట్‌కు ఎదురుగా ఉండేది. నూతన మద్యం పాలసీలో ప్రస్తుతం ఉన్న బార్ స్థానంలో ఉన్న దుకాణం రాకపోవడతో మేనకబార్‌ను అక్కడ ఏర్పాటు చేశారు. బార్‌ను అధికారులు తనిఖీ చేసి కేసు నమోదు చేయడంతో బార్ యజమాని, స్థల యజమాని రగంలోకి దిగారు. మేనక బార్ యజమాని అయిన రామకృష్ణా రెడ్డి (మేనక రెడ్డి) గతంలో రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో కలసి సారా వ్యాపారం చేశారు. స్థల యజమాని కూడా రాజకీయ పరిచయాలు ఉండడంతో కేసు నమోదు కాకుండా పెద్ద స్థాయిలో ఒత్తిళ్లు తీసుకువచ్చారు. అయినా వెరవని అధికారులు గత నెల 21వ తేదీన కేసు నమోదు చేశారు. మంత్రి స్థాయిలో ఒత్తిళ్లు తీసుకువచ్చి బార్‌ను సస్పెండ్ నిర్ణయాన్ని అమలు చేయనీయకుండా అడ్డుపడ్డారు. అయితే ఈ విషయంపై సమగ్ర నివేదిక తయారు చేసిన స్థానిక అధికారులు దాన్ని ఉన్నతాధికారులకు పంపారు. బార్‌ను సీజ్ చేయాలని ఉన్నతాధికారులు నుంచి ఆదేశాలు రావడంతో శుక్రవారం స్థానిక అధికారులు బార్‌ను మూసివేశారు.
మద్యం ప్రియులకు ప్రాణసంకటం..
కొంత మంది మద్యం వ్యాపారుల ధనదాహం మద్యం ప్రియులకు ప్రాణసంకటంగా మారింది. జిల్లాలో 524 మద్యం దుకాణాలు, 40 బార్లు నిర్వహణలో ఉన్నాయి. బార్లు, మద్యం దుకాణాల వద్ద లూజు విక్రయాలు చేపడుతున్నారు. పేదలు, మురికివాడల వద్ద ఉన్న దుకాణాలు, బార్లలో మేనక బార్ అండ్ రెస్టారెంట్‌లోలా మద్యం కల్తీ చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment