తిరుమల: తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ అంటూ అసత్య ఆరోపణలు చేసిన చంద్రబాబే వేసిన సిట్ సోమవారం కూడా విచారణ కొనసాగించింది. సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠీ నేతృత్వంలోని బృందం తిరుమలలో ల్యాబ్‌ను పరిశీలించి నాణ్యతా ప్రమాణాలను ఎలా గుర్తిస్తారో సిబ్బందిని అడిగి తెలుసుకుంది. అనంతరం నెయ్యిని నిల్వ చేసే గోదాముకు చేరుకుని ఇక్కడ ఎన్ని రోజులు ఉంచుతారు, నాణ్యతా పరీక్షల నిమిత్తం ఎప్పుడు శాంపిళ్లు తీసుకుంటారు, శాంపిల్ తీసుకున్న అనంతరం ఎలాంటి పరీక్షలు నిర్వహిస్తారు, టెండర్‌దారుడు ప్రమాణాల మేరకు సరఫరా చేశారా లేదా అనేది ఎలా నిర్ధారిస్తారు, ఒకవేళ కల్తీ జరిగితే.. ఆ విషయాన్ని పసిగట్టే పరికరాలు ల్యాబ్‌లో ఉన్నాయా వంటి వివరాలను అధికారులు, సిబ్బంది నుంచి సేకరించారు.
ల్యాబ్‌లో తనిఖీలు నిర్వహిస్తుండగా.. అప్పటికే ల్యాబ్‌కు చేరుకున్న ట్యాంకర్లలోని నెయ్యిని పరిశీలించిన అధికారులు, ల్యాబ్ సిబ్బంది నెయ్యి నాణ్యతా పరీక్షలు ఎలా జరుపుతారో ప్రత్యక్షంగా పరిశీలించారు. గతంలో టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన టెండర్‌దారుల వివరాలను, నాణ్యతా పరీక్షల నివేదికలను అధికారులు సేకరించారు. కల్తీ నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డెయిరీ ఎప్పటి నుంచి నెయ్యి సరఫరా చేసింది, ఆ నెయ్యిలో నాణ్యత లేదని ఎప్పుడు గుర్తించారు, నెయ్యిని పరీక్షల కోసం పంపించాలని ఎవరు ఆదేశించారన్న సమాచారాన్ని కూడా అధికారులు సేకరించారు. అనంతరం త్రిపాఠీ నేతృత్వంలోని అధికారుల బృందం పోలీస్ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని గత మూడు రోజులుగా లభ్యమైన ఆధారాలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తరువాత సిట్ చీఫ్ నేతృత్వంలోని బృందం తిరుపతి బయలుదేరి వెళ్లిపోగా.. డీఎస్పీ స్థాయి నేతృత్వంలోని అధికార బృందం మాత్రం ఇంకా ల్యాబ్‌లో తనిఖీలు నిర్వహిస్తూ.. పాత రికార్డులను పరిశీలించింది.
నేడు లడ్డూ పోటు, విక్రయ కేంద్రాల్లో విచారణ
మంగళవారం లడ్డూ పోటు, లడ్డూ విక్రయ కేంద్రాలు, లడ్డూ తయారీకి వినియోగించే ముడి సరుకులను పరిశీలించి.. లడ్డూ తయారీలో పాల్గొంటున్న శ్రీవైష్ణవులను విచారించనున్నట్టు సమాచారం. మరో బృందం తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో నెయ్యి కొనుగోలు, ఒప్పందాలు, నాణ్యమైన నెయ్యి సరఫరా కోసం టీటీడీ, ఏఆర్ డెయిరీ మధ్య జరిగిన ఒప్పందాలను పరిశీలించనుంది. టెండర్ల నిబంధనల్లో మార్పులు చేయడానికి దారి తీసిన పరిస్ధితులపై కూడా సిట్ బృందం దర్యాప్తు చేయనుంది. సిట్ బృందం మరో రెండు రోజుల పాటు తిరుమల, తిరుపతిలో ఉండి విచారణ నిర్వహించనుంది. సిట్ కార్యకలాపాల కోసం టీటీడీ శ్వేత భవనంలో కార్యాలయం ఏర్పాటు చేసేందుకు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment