
సాక్షి, తిరుపతి: టీటీడీ ఉద్యోగుల నిరసన కార్యక్రమం రెండో రోజు కొనసాగుతోంది. టీటీడీ పరిపాలనా భవనం ప్రధాన ద్వారం ఎదుట ఉద్యోగులు మౌన నిరసన తెలుపుతున్నారు. టీటీడీ పాలకమండలి సభ్యుడు నరేష్‌ను బోర్డు నుంచి తొలగించాలని, బహిరంగ క్షమాపణ చెప్పాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
టీటీడీ పాలకమండలి సభ్యుడు నరేష్ ఉద్యోగి బాలాజీపై దురుసు ప్రవర్తనకు నిరసనగా ఉద్యోగులు మౌన నిరసనలు తెలుపుతున్నారు. 48 గంటల నిరసన కార్యక్రమంలో భాగంగా వారు రెండో రోజు నిరసనల్లో పాల్గొన్నారు. శుక్రవారం ఉదయం నుంచి టీటీడీ పరిపాలనా భవనం ప్రధాన ద్వారం ఎదుట నిరసనలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులు.. పాలకమండలి సభ్యుడు నరేష్‌ను తొలగించాలని, బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం స్పందించకుంటే సోమవారం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని టీటీడీ ఉద్యోగుల ఐక్యవేదిక హెచ్చరికలు జారీ చేసింది.

ఇదిలా ఉండగా.. తిరుమల శ్రీవారి ఆలయం వద్ద టీటీడీ ఉద్యోగిపై బోర్డు మెంబర్ నరేష్ బూతులతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. కర్ణాటకకు చెందిన పాలకమండలి సభ్యుడు నరేష్ ఆలయం వెలుపలి నుంచి వస్తున్న సమయంలో అక్కడే ఉన్న టీటీడీ ఉద్యోగి గేటు తీయలేదు. మహా ద్వారం ముందున్న గేటు తీసేందుకు సదరు ఉద్యోగి నిరాకరించాడు.

అయితే, ప్రోటోకాల్ పరిధిలో టీటీడీ బోర్డు సభ్యుడికి గేటు తెరవలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు బోర్డు మెంబర్ నరేష్. అనంతరం, సదరు ఉద్యోగిపై బూతులతో మండిపడ్డారాయన. బయటకు పోవాలని చిర్రుబుర్రులాడారు. ఇలాంటి వారిని ఇక్కడ విధుల్లో ఎందుకు ఉంచారని ఆగ్రహంతో రగిలిపోయారు. అతడిని వెంటేనే అక్కడ నుంచి పంపించి వేయాలని అధికారులకు సూచించారు. అనంతరం, అక్కడి నుంచి టీటీడీ బోర్డు మెంబర్ నిష్క్రమించారు. దీనికి సంబంధించిన వీడియో బయటకు వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment