సాక్షి, వికారాబాద్: వికారాబాద్ జిల్లాలో కల్తీ కల్లు భయం ఇంకా వీడలేదు. నవాబుపేట, వికారాబాద్ మండలాల్లోని పల్లెల్లో జనం భయాందోళన చెందుతున్నారు. కల్తీ కల్లుతో సోమవారం మరొకరు మృతి చెందారు. నవాబుపేట మండలం వట్టిమీనపల్లికి చెందిన వృద్ధుడు కొమురయ్య (90) చికిత్స పొందుతూ చనిపోయాడు. ఆయన శుక్రవారం కల్లు తాగాడు. శనివారం ఉదయం నిద్ర లేవగానే కొద్దిసేపటికి కిందపడి పోయాడు. కుటుంబీకులు ఆయనను వికారాబాద్‌లోని మిషన్ ఆస్పత్రికి, ఆపై హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అయితే చికిత్సకు కొమురయ్య శరీరం స్పందించలేదు. ఈ క్రమంలో సోమవారం మృతి చెందాడు. తన తండ్రి మృతికి కల్తీ కల్లే కారణమని ఆయన కుమారుడు మల్లయ్య ఆరోపించాడు. కొమురయ్య మృతిపై నవాబుపేట పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా, ఉదంతంతో కల్తీ కల్లు మృతుల సంఖ్య రెండుకు చేరుకుంది.
పెరుగుతున్న బాధితుల సంఖ్య
కల్లు కారణంగా అస్వస్థతకు గురవుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. జిల్లాలో ఇప్పటివరకు 351 మంది అస్వస్థతకు గురయ్యారు. సోమవారం నవాబుపేట మండలానికి చెందిన 17 మంది, వికారాబాద్ మండలానికి చెందిన నలుగురు అస్వస్థతకు గురయ్యారు. వీరిని వికారాబాద్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.
కొనసాగుతున్న విచారణ
కల్తీకల్లు కారణంగా ఇద్దరు మృతి చెందడం, 351 మంది అస్వస్థతకు గురవడంతో ఎక్సైజ్‌శాఖ, పోలీసు శాఖ అధికారులు వేర్వేరుగా విచారణ జరుపుతున్నారు. చిట్టిగిద్ద కల్లు డిపో నిర్వాహకులు ఇంకా పరారీలోనే ఉన్నారు. వికారాబాద్ పోలీసులు గాలిస్తున్నారు. పెండ్లిమడుగు గ్రామానికి చెందిన కిష్టారెడ్డి పోస్టుమార్టం రిపోర్టు, ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక కోసం ఎదురుచూస్తున్నట్లు వికారాబాద్ సీఐ రాజశేఖర్ తెలిపారు. మరోవైపు కల్లు డిపోతోపాటు 11 కల్లు దుకాణాలను సీజ్ చేసిన ఎక్సైజ్ అధికారులు సైతం ల్యాబ్ రిపోర్టుల కోసం ఎదురుచూస్తున్నారు. నివేదిక వచ్చిన వెంటనే అవసరమైన చర్యలు చేపడతామని ఎక్సైజ్ సూపరింటెండెంట్ వరప్రసాద్ తెలిపారు. ఇదిలా ఉంటే పోలీసులు చిట్టిగిద్ద కల్లుడిపోలో పనిచేస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని రహస్యంగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. వీరి ద్వారా డిపో నిర్వాహకులతోపాటు ఇతర అనుమానితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
కల్తీ కల్లుకు మరొకరు బలి
Published Tue, Jan 12 2021 8:12 AM | Last Updated on Tue, Jan 12 2021 10:46 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment