navabpet
-
కల్లోలం రేపుతున్న కల్తీ కల్లు
సాక్షి, వికారాబాద్: వికారాబాద్ జిల్లాలో కల్తీ కల్లు భయం ఇంకా వీడలేదు. నవాబుపేట, వికారాబాద్ మండలాల్లోని పల్లెల్లో జనం భయాందోళన చెందుతున్నారు. కల్తీ కల్లుతో సోమవారం మరొకరు మృతి చెందారు. నవాబుపేట మండలం వట్టిమీనపల్లికి చెందిన వృద్ధుడు కొమురయ్య (90) చికిత్స పొందుతూ చనిపోయాడు. ఆయన శుక్రవారం కల్లు తాగాడు. శనివారం ఉదయం నిద్ర లేవగానే కొద్దిసేపటికి కిందపడి పోయాడు. కుటుంబీకులు ఆయనను వికారాబాద్‌లోని మిషన్ ఆస్పత్రికి, ఆపై హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అయితే చికిత్సకు కొమురయ్య శరీరం స్పందించలేదు. ఈ క్రమంలో సోమవారం మృతి చెందాడు. తన తండ్రి మృతికి కల్తీ కల్లే కారణమని ఆయన కుమారుడు మల్లయ్య ఆరోపించాడు. కొమురయ్య మృతిపై నవాబుపేట పోలీసులు విచారణ జరుపుతున్నారు. కాగా, ఉదంతంతో కల్తీ కల్లు మృతుల సంఖ్య రెండుకు చేరుకుంది. పెరుగుతున్న బాధితుల సంఖ్య కల్లు కారణంగా అస్వస్థతకు గురవుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. జిల్లాలో ఇప్పటివరకు 351 మంది అస్వస్థతకు గురయ్యారు. సోమవారం నవాబుపేట మండలానికి చెందిన 17 మంది, వికారాబాద్ మండలానికి చెందిన నలుగురు అస్వస్థతకు గురయ్యారు. వీరిని వికారాబాద్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. కొనసాగుతున్న విచారణ కల్తీకల్లు కారణంగా ఇద్దరు మృతి చెందడం, 351 మంది అస్వస్థతకు గురవడంతో ఎక్సైజ్‌శాఖ, పోలీసు శాఖ అధికారులు వేర్వేరుగా విచారణ జరుపుతున్నారు. చిట్టిగిద్ద కల్లు డిపో నిర్వాహకులు ఇంకా పరారీలోనే ఉన్నారు. వికారాబాద్ పోలీసులు గాలిస్తున్నారు. పెండ్లిమడుగు గ్రామానికి చెందిన కిష్టారెడ్డి పోస్టుమార్టం రిపోర్టు, ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక కోసం ఎదురుచూస్తున్నట్లు వికారాబాద్ సీఐ రాజశేఖర్ తెలిపారు. మరోవైపు కల్లు డిపోతోపాటు 11 కల్లు దుకాణాలను సీజ్ చేసిన ఎక్సైజ్ అధికారులు సైతం ల్యాబ్ రిపోర్టుల కోసం ఎదురుచూస్తున్నారు. నివేదిక వచ్చిన వెంటనే అవసరమైన చర్యలు చేపడతామని ఎక్సైజ్ సూపరింటెండెంట్ వరప్రసాద్ తెలిపారు. ఇదిలా ఉంటే పోలీసులు చిట్టిగిద్ద కల్లుడిపోలో పనిచేస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకుని రహస్యంగా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. వీరి ద్వారా డిపో నిర్వాహకులతోపాటు ఇతర అనుమానితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. -
సర్పంచ్ పదవి కోసం హంగామా
కడెం (ఖానాపూర్): సర్పంచ్ పదవి తమకే ఇవ్వాలని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని ఓ వ్యక్తి హంగామా సృష్టించాడు. నిర్మల్ జిల్లా కడెం మండలంలోని నవాబ్‌పేట్ గ్రామంలో ఆదివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. మొదట నిర్ణయించుకున్నట్లుగా తమను కాదని గ్రామానికి చెందిన కొందరు కక్షపూరితంగా మరికొందరితో నామినేషన్ వేయించి, మానసిక క్షోభకు గురిచేశారంటూ నవాబ్‌పేట్ సర్పంచ్ అభ్యర్థి లావణ్య భర్త జెల్ల శంకరయ్య వాటర్ ట్యాంక్ ఎక్కి హంగామా సృష్టించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని శంకరయ్యను సముదాయించి వాటర్ ట్యాంక్ నుంచి కిందకు దింపారు. ఎస్సై కృష్ణకుమార్ శంకరయ్యకు కౌన్సెలింగ్ ఇచ్చి ప్రజాస్వామబద్ధంగా ఎన్నికలు జరగాలని, అర్హత ఉన్న ఎవరైనా పోటీ చేయవచ్చని, బరిలో ఉండి గెలవాలే తప్ప న్యాయం చేయాలంటూ ఇలాంటి అఘా యిత్యాలకు పాల్పడవద్దని హితవు చెప్పారు. -
రెండు కార్లు ఢీ.. ఇద్దరి మృతి
వికారాబాద్: ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట్ మండలం పులుమామిడి గేటు సమీపంలో గురువారం చోటుచేసుకుంది. కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌లో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్న శివశంకర్(55) ఓ శుభకార్యం నిమిత్తం వికారబాద్‌కు వచ్చి తిరిగి కారులో వెళ్తున్న సమయంలో ఎదురుగా వచ్చిన మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శివశంకర్‌తో పాటు శంకర్పల్లి మండలానికి చెందిన నవాబ్రెడ్డి(45) మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
నవాబుపేటలో హోరాహోరీ
ప్రశాంతంగా ముగిసిన జెడ్పీటీసీ ఉప ఎన్నిక 68.82 శాతం ఓటింగ్ నమోదు అర్కతలలో అత్యధికంగా 84.80 శాతం తిమ్మరెడ్డిపల్లిలో అత్యల్పంగా 37.02 శాతం టీఆర్ఎస్- కాంగ్రెస్‌ల మధ్య నువ్వా-నేనా! ఈ నెల 8న వెలువడనున్న ఫలితం చేవెళ్ల/ నవాబుపేట : హోరాహోరీ ప్రచారంతో రెండు ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నవాబుపేట జెడ్పీటీసీ ఉప ఎన్నికకు శనివారం నిర్వహించిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 68.82 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రమణారెడ్డి వెల్లడించారు. మొత్తం 31,127 ఓట్లు ఉండగా అందులో 21,419 పోలయ్యాయి. నవాబుపేట మండల పరిధిలోని 21 పంచాయతీల్లో 43 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నారగూడ, గంగ్యాడ, పూలపల్లి, చించల్‌పేట, పులుమామిడి, గేట్‌వనంపల్లి, గుబ్బెడి పత్తేపూర్, లింగంపల్లి తదితర గ్రామాల్లో ఉదయం 8 గంటల నుంచే ఓటర్లు బారులుతీరి కనిపించారు. కడిచర్ల, మమ్మదాన్‌పల్లి, మీనపల్లికలాన్ గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలలో ఈవీఎంలు సాంకేతిక కారణాలవల్ల మొరాయించడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ గ్రామాల్లో సాయంత్రం 5 గంటల వరకు క్యూ ఉన్న వారికి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించారు. ఎన్నికల నిర్వహణకు వికారాబాద్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 43 మంది ప్రిసైడింగ్ అధికారులతోపాటుగా మరో 172 మంది సిబ్బంది జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణలో విధులు నిర్వహించారు. వికారాబాద్ డీఎస్పీ స్వామి ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఎన్నిక సందర్భంగా వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనుమతిలేని వాహనాలను పోలింగ్ కేంద్రాలవద్దకు అనుమతించలేదు. చించల్‌పేటలో ఎమ్మెల్యే కాలె యాదయ్య, పులుమామిడిలో ఎమ్మెల్సీ కె.యాదవరెడ్డి, అత్తాపూర్‌లో జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు నాగేందర్‌గౌడ్, కాంగ్రెస్ అభ్యర్థి చిట్టెపు మల్లారెడ్డి ఎక్‌మామిడిలో, టీఆర్ఎస్ అభ్యర్థి పోలీస్ రాంరెడ్డి అర్కతలలో, టీడీపీ అభ్యర్థి గంగ్యాడ వెంకటేష్‌యాదవ్ లింగంపల్లిలో, స్వతంత్య్ర అభ్యర్థి మంగలి ఆనంద్ లింగంపల్లి గ్రామాల్లో ఓటు వేశారు. పోలింగ్ సమయంలో చేవెళ్ల ఆర్డీఓ చంద్రమోహన్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి రాధ, తహసీల్దార్ యాతయ్య పలు గ్రామాలలో తిరిగి పరిస్థితిని సమీక్షించారు. ఉదయం 11 గంటల వరకే 39 శాతం ఓటింగ్ నమోదైనట్లు చేవెళ్ల ఆర్డీఓ తెలిపారు. ఎత్రాజ్పల్లి, నవాబుపేట, తిమ్మరెడ్డిపల్లి గ్రామాలో అధికారులు నిర్లక్ష్యంతో ఓటరు జాబితాలో ఒక గ్రామానికి చెందిన ఓట్లు మరొక గ్రామాల్లో ఉండటంతో ఓటర్లు అధికారులుపై మండిపడ్డారు. 2014 ఎన్నికలలో జెడ్పీటీసీగా విజయం సాధించిన కె.యాదవరెడ్డి ఎమ్మెల్సీగా తిరిగి ఎన్నిక కావడంతో జెడ్పీటీసీకి రాజీనామా చేశారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ స్థానం నుంచి అధికార టీఆర్ఎస్ అభ్యర్థిగా పోలీస్ రాంరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా చిట్టెపు మల్లారెడ్డి ప్రధాన పోటీదారులుగా బరిలోకి దిగారు. ఇక్కడ టీడీపీ పోటీచేసినా మూడో స్థానానికి పరిమితం కావొచ్చని ఓటింగ్ సరళిని బట్టి విశ్లేషిస్తున్నారు. ఉత్సాహంగా పాల్గొన్న ఓటర్లు ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇక్కడ ప్రచారం చేశాయి. టీఆర్ఎస్ నుంచి మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎస్.రత్నం, మాజీ ఎమ్మెల్సీ పి.నరేందర్‌రెడ్డి అభ్యర్థి రాంరెడ్డి తరఫున విస్తృతంగా ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిట్టెపు మల్లారెడ్డి తరఫున మాజీ మంత్రులు పి.సబితారెడ్డి, ప్రసాద్‌కుమార్, చంద్రశేఖర్, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి పి.కార్తీక్‌రెడ్డి, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి పి.వెంకటస్వామి తదితరులు అహోరాత్రులు ప్రచారం నిర్వహించారు. ఇరు పార్టీలకు ఈ ఎన్నిక ఫలితం ప్రతిష్టాత్మకం కానుంది. ఫలితాల కోసం ఈ నెల 8 వరకు ఎదురుచూడాల్సిందే. -
రైతును దెబ్బతీసిన ‘హెలెన్’ వర్షాలు
శంషాబాద్ రూరల్: ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఇంటికి చేరుకునే సమయానికి వరదపాలైంది.కోతకు వచ్చిన వరి పంటలు, కల్లాల్లోని గింజలు తడిసి మండలంలోని కెబి.దొడ్డి, సుల్తాన్‌పల్లి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. హెలెన్ తుపాను కారణంగా శని వారం ఎగువ భాగంలో భారీ వర్షం కురిసిం ది. దీంతో ఈసీవాగులోకి ఆదివారం తెల్లవారుజామున వరద నీరు చేరి చుట్టు పక్కల పొలాలను ముంచెత్తాయి. ధాన్యపు గింజలు, పంట మెద ళ్లు కొట్టుకుపోయాయి. కాశింబౌలికి చెందిన రైతు నవీన్‌రెడ్డి పొలంలోని 65 బస్తాల ధాన్యం, కె.బి.దొడ్డి రైతులు రుక్కమ్మ, విక్రమ్ మరి కొందరి పొలాల్లోని ధాన్యం వరదలో కొట్టుకుపోయింది. రెండు గ్రామాల్లో 50 మందికి రైతులకు చెందిన సుమారు 50 ఎకరాల వరి, 15 ఎకరాల క్యారెట్, పూల పంటలు నీటమునిగాయి. వరి కోతల తర్వాత ధాన్యం బస్తాలను కొం దరు రైతులు పొలాల్లో భద్రపర్చారు. నీరు చేరడంతో బస్తాలు తడిసిపోయాయి. నవాబుపేట: హెలెన్ తుపాను రైతులను కోలు కోని స్థితిలోకి నెట్టింది. తుపాను ప్రభావంతో రెండు రోజులుగా మండలంలో కురుస్తున్న వర్షాలకు పంటపొలాల్లో పూర్తిగా నీళ్లు చేరాయి. శనివారం రాత్రి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి మూసీ వాగు పొంగిపొర్లింది. వందల ఎకరాల్లో పంటలను ముంచేసింది. వరి, మొక్కజొన్న, కూరగాయలు, పత్తి పంటలు పూర్తిగా నీట మునిగాయి. వాగుకు దగ్గర పొలాల్లో ఉన్న వ్యవసాయ పరికరాలు, కరెంటు మోటార్లు నీటి ఉధృతికి కొట్టుకుపోయాయి. టమాట, ఉల్లి, ఇతర కూరగాయలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మండలంలో సుమారు 500 ఎకరాలకుపైగా నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ, రెవెన్యూ అధికారులు అంచనా వేస్తున్నారు. చేవెళ్ల: హెలెన్ తుపాను ప్రభావంతో శనివారం ఉదయం నుంచి నిరంతరాయంగా కురిసిన వర్షానికి మండలంలో పలు పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చేతికొచ్చి పంటను తీసే దశలో ఉన్న పత్తికి తీవ్ర నష్టం వాటిల్లింది. పైలిన్ తుపానుతో చాలా వరకు నల్లబడిన పత్తిపంట ఈ తుపానుతో మరింత నష్టానికి గురైంది. ఇప్పటికే ధరరాక దిగులుగా ఉన్న రైతన్నకు కంటతడిపెట్టిస్తోంది. క్వింటాలుకు రూ.4వేల మద్దతు ధర కూడా రాక ఇబ్బందిపడుతున్న రైతన్నకు పత్తి నల్లబారడంతో మరింత నష్టాల్లో కూరుకుపోయే ప్రమాదం ఉంది. క్యారెట్, టమాట పంటలకు సైతం తీవ్ర నష్టం వాటిల్లింది. ఏకధాటిగా కురిసిన వర్షానికి కాసిన టమాటాలు నేలరాలిపోయాయి. ఈ ఏడాది ఆరంభంలో కురిసిన వడగళ్లవాన, నెలరోజుల క్రితం వచ్చిన పైలిన్ తుపాను, మరోసారి పడగ విప్పిన హెలెన్ తుపానుతో ఈ సంవత్సరమంతా నష్టాలతోనే గడిచిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
‘నిర్మల్ భారత్’ డబ్బులు పక్కదారి!
నవాబుపేట, న్యూస్‌లైన్: పేదలకు అందించాల్సిన నిధులు పక్కదారి పడుతున్నాయి. మండల పరిధిలోని పూలపల్లి గ్రామంలో నిర్మల్ భారత్ అభియాన్ డబ్బులు దుర్వినియోగం అయిన సంఘటన ఆలస్యంగా శనివారం వెలుగుచూసింది. వివరాలు.. నిర్మల్ భారత్ అభియాన్ కింద పూలపల్లి గ్రామస్తులకు మరుగుదొడ్లు మంజూరు అయ్యాయి. ఎస్సీ, ఎస్టీలు నిర్మాణాలను పూర్తి చేసుకోకపోవడంతో డీఆర్డీఏ కింద అధికారులు రూ. 40 వేల రుణాలు మంజూరు చేశారు. నిధులను గ్రామ సంఘం తీర్మానం మేరకు అర్హులకు ఇవ్వాల్సి ఉంటుంది. కాగా గ్రామ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు బాలమణి, యాదమ్మ, కోశాధికారి నాగమణి, గ్రామ సీసీ పోచయ్యలు ఎలాంటి తీర్మానం లేకుండా రూ. 30 వేలు డ్రా చేశారు. విషయం శుక్రవారం మండల మహిళా సంఘానికి తెలిసింది. దీంతో వారు శనివారం గ్రామానికి చేరుకొని వివరాలు సేకరించారు. నిధుల దుర్వినియోగం వాస్తవమేనని తేల్చారు. డబ్బులు తిరిగి చెల్లించాలని స్వాహా చేసిన వారిని ఆదేశించారు. ఈవిషయమై ఏపీఎం దేవయ్య వివరణ కోరగా.. అదేం లేదు. గ్రామ సభ తీర్మానం ఉంది. లోన్లు తిరిగి చెల్లించాలని ఆదేశించామని తెలిపారు.