ప్రశాంతంగా ముగిసిన జెడ్పీటీసీ ఉప ఎన్నిక
68.82 శాతం ఓటింగ్ నమోదు
అర్కతలలో అత్యధికంగా 84.80 శాతం
తిమ్మరెడ్డిపల్లిలో అత్యల్పంగా 37.02 శాతం
టీఆర్‌ఎస్- కాంగ్రెస్‌ల మధ్య నువ్వా-నేనా!
ఈ నెల 8న వెలువడనున్న ఫలితం
చేవెళ్ల/ నవాబుపేట : హోరాహోరీ ప్రచారంతో రెండు ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నవాబుపేట జెడ్పీటీసీ ఉప ఎన్నికకు శనివారం నిర్వహించిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 68.82 శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి రమణారెడ్డి వెల్లడించారు. మొత్తం 31,127 ఓట్లు ఉండగా అందులో 21,419 పోలయ్యాయి. నవాబుపేట మండల పరిధిలోని 21 పంచాయతీల్లో 43 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. నారగూడ, గంగ్యాడ, పూలపల్లి, చించల్‌పేట, పులుమామిడి, గేట్‌వనంపల్లి, గుబ్బెడి పత్తేపూర్, లింగంపల్లి తదితర గ్రామాల్లో ఉదయం 8 గంటల నుంచే ఓటర్లు బారులుతీరి కనిపించారు.
కడిచర్ల, మమ్మదాన్‌పల్లి, మీనపల్లికలాన్ గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలలో ఈవీఎంలు సాంకేతిక కారణాలవల్ల మొరాయించడంతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. ఈ గ్రామాల్లో సాయంత్రం 5 గంటల వరకు క్యూ ఉన్న వారికి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించారు. ఎన్నికల నిర్వహణకు వికారాబాద్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 43 మంది ప్రిసైడింగ్ అధికారులతోపాటుగా మరో 172 మంది సిబ్బంది జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణలో విధులు నిర్వహించారు. వికారాబాద్ డీఎస్పీ స్వామి ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఎన్నిక సందర్భంగా వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
అనుమతిలేని వాహనాలను పోలింగ్ కేంద్రాలవద్దకు అనుమతించలేదు. చించల్‌పేటలో ఎమ్మెల్యే కాలె యాదయ్య, పులుమామిడిలో ఎమ్మెల్సీ కె.యాదవరెడ్డి, అత్తాపూర్‌లో జిల్లా టీఆర్‌ఎస్ అధ్యక్షుడు నాగేందర్‌గౌడ్, కాంగ్రెస్ అభ్యర్థి చిట్టెపు మల్లారెడ్డి ఎక్‌మామిడిలో, టీఆర్‌ఎస్ అభ్యర్థి పోలీస్ రాంరెడ్డి అర్కతలలో, టీడీపీ అభ్యర్థి గంగ్యాడ వెంకటేష్‌యాదవ్ లింగంపల్లిలో, స్వతంత్య్ర అభ్యర్థి మంగలి ఆనంద్ లింగంపల్లి గ్రామాల్లో ఓటు వేశారు. పోలింగ్ సమయంలో చేవెళ్ల ఆర్డీఓ చంద్రమోహన్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి రాధ, తహసీల్దార్ యాతయ్య పలు గ్రామాలలో తిరిగి పరిస్థితిని సమీక్షించారు. ఉదయం 11 గంటల వరకే 39 శాతం ఓటింగ్ నమోదైనట్లు చేవెళ్ల ఆర్డీఓ తెలిపారు. ఎత్‌రాజ్‌పల్లి, నవాబుపేట, తిమ్మరెడ్డిపల్లి గ్రామాలో అధికారులు నిర్లక్ష్యంతో ఓటరు జాబితాలో ఒక గ్రామానికి చెందిన ఓట్లు మరొక గ్రామాల్లో ఉండటంతో ఓటర్లు అధికారులుపై మండిపడ్డారు.
2014 ఎన్నికలలో జెడ్పీటీసీగా విజయం సాధించిన కె.యాదవరెడ్డి ఎమ్మెల్సీగా తిరిగి ఎన్నిక కావడంతో జెడ్పీటీసీకి రాజీనామా చేశారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ స్థానం నుంచి అధికార టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోలీస్ రాంరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా చిట్టెపు మల్లారెడ్డి ప్రధాన పోటీదారులుగా బరిలోకి దిగారు. ఇక్కడ టీడీపీ పోటీచేసినా మూడో స్థానానికి పరిమితం కావొచ్చని ఓటింగ్ సరళిని బట్టి విశ్లేషిస్తున్నారు.
ఉత్సాహంగా పాల్గొన్న ఓటర్లు
ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇక్కడ ప్రచారం చేశాయి. టీఆర్‌ఎస్ నుంచి మంత్రి మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎస్.రత్నం, మాజీ ఎమ్మెల్సీ పి.నరేందర్‌రెడ్డి అభ్యర్థి రాంరెడ్డి తరఫున విస్తృతంగా ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిట్టెపు మల్లారెడ్డి తరఫున మాజీ మంత్రులు పి.సబితారెడ్డి, ప్రసాద్‌కుమార్, చంద్రశేఖర్, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి పి.కార్తీక్‌రెడ్డి, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి పి.వెంకటస్వామి తదితరులు అహోరాత్రులు ప్రచారం నిర్వహించారు. ఇరు పార్టీలకు ఈ ఎన్నిక ఫలితం ప్రతిష్టాత్మకం కానుంది. ఫలితాల కోసం ఈ నెల 8 వరకు ఎదురుచూడాల్సిందే.
నవాబుపేటలో హోరాహోరీ
Published Sun, Dec 6 2015 12:37 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM
Advertisement
Advertisement