
జమ్మూ: కాంగ్రెస్ మాజీ నేత గులాం నబీ ఆజాద్ సోమవారం తన కొత్త పార్టీని ప్రకటించారు. దానికి ‘డెమొక్రటిక్ ఆజాద్ పార్టీ’ అని పేరు పెట్టారు. కశ్మీర్‌లో ఏ క్షణమైన ఎన్నికలు రానున్నందున పార్టీ కార్యకలాపాలను వెంటనే ప్రారంభిస్తామన్నారు. 50 శాతం టిక్కెట్లను యువత, మహిళలకే కేటాయిస్తామని చెప్పారు. గాంధీ ఆలోచనలు, ఆశయాలే తమ పార్టీ సిద్ధాంతాలన్నారు. జమ్మూకశ్మీర్‌లో శాంతిని బలోపేతం చేయడం, సాధారణ పరిస్థితులను నెలకొల్పడంపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తామని వివరించారు.
ఆర్టికల్ 370 విషయంలో పీడీపీ సహా ఇతర పార్టీలు తనపై చేస్తున్న విమర్శలను ఆజాద్ తిప్పికొట్టారు. ‘‘దాని పునరుద్ధరణ అసాధ్యమని నేనెప్పుడూ చెప్పలేదు. ప్రధాని మోదీని ఒప్పించలేకపోయాననే చెప్పా. ఆర్టికల్ 370పై మోదీని, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను ఎవరైనా ఒప్పించాలనుకుంటే స్వాగతిస్తా. వారివద్ద నాకంత పలుకుబడి లేదు. ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా నిర్ణయంపై అక్టోబర్ 10 సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుండడం మంచి పరిణామం’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment