పేదలకు అందించాల్సిన నిధులు పక్కదారి పడుతున్నాయి. మండల పరిధిలోని పూలపల్లి గ్రామంలో నిర్మల్ భారత్ అభియాన్ డబ్బులు దుర్వినియోగం అయిన సంఘటన ఆలస్యంగా శనివారం వెలుగుచూసింది.
నవాబుపేట, న్యూస్‌లైన్: పేదలకు అందించాల్సిన నిధులు పక్కదారి పడుతున్నాయి. మండల పరిధిలోని పూలపల్లి గ్రామంలో నిర్మల్ భారత్ అభియాన్ డబ్బులు దుర్వినియోగం అయిన సంఘటన ఆలస్యంగా శనివారం వెలుగుచూసింది. వివరాలు.. నిర్మల్ భారత్ అభియాన్ కింద పూలపల్లి గ్రామస్తులకు మరుగుదొడ్లు మంజూరు అయ్యాయి. ఎస్సీ, ఎస్టీలు నిర్మాణాలను పూర్తి చేసుకోకపోవడంతో డీఆర్‌డీఏ కింద అధికారులు రూ. 40 వేల రుణాలు మంజూరు చేశారు. నిధులను గ్రామ సంఘం తీర్మానం మేరకు అర్హులకు ఇవ్వాల్సి ఉంటుంది.
కాగా గ్రామ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు బాలమణి, యాదమ్మ, కోశాధికారి నాగమణి, గ్రామ సీసీ పోచయ్యలు ఎలాంటి తీర్మానం లేకుండా రూ. 30 వేలు డ్రా చేశారు. విషయం శుక్రవారం మండల మహిళా సంఘానికి తెలిసింది. దీంతో వారు శనివారం గ్రామానికి చేరుకొని వివరాలు సేకరించారు. నిధుల దుర్వినియోగం వాస్తవమేనని తేల్చారు. డబ్బులు తిరిగి చెల్లించాలని స్వాహా చేసిన వారిని ఆదేశించారు. ఈవిషయమై ఏపీఎం దేవయ్య వివరణ కోరగా.. అదేం లేదు. గ్రామ సభ తీర్మానం ఉంది. లోన్లు తిరిగి చెల్లించాలని ఆదేశించామని తెలిపారు.