సాక్షి, అమరావతి: పేదల సంక్షేమ కార్యక్రమాల పర్యవేక్షణకు ఉద్దేశించిన జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ)కు కేంద్ర ప్రభుత్వం మంగళం పాడింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి డీఆర్‌డీఏల నిర్వహణకు నిధులు నిలిపివేస్తున్నట్లు రాష్ట్రాలకు లేఖ రాసింది. దీంతో వీటిలో పనిచేస్తున్న సిబ్బంది సంకట స్థితిలో పడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా, వేర్వేరుగా అమలు చేసే పలు సంక్షేమ పథకాలను జిల్లా స్థాయిలో సమన్వయం చేసుకుంటూ అవి క్షేత్రస్థాయిలో పటిష్టంగా అమలయ్యేలా, నిర్దేశిత లక్ష్యాలను సాధించేలా చూడటం వీటి బాధ్యత. 1999లో ఏర్పాటైన డీఆర్‌డీఏలు రాష్ట్రంలోని 13 జిల్లాల్లోనూ ఉన్నాయి. వీటిలో 230 మందికి పైగా సిబ్బంది కాంట్రాక్టు, తాత్కాలిక పద్ధతిన పనిచేస్తున్నారు.
రాష్ట్రంలో దాదాపు 90 లక్షల గ్రామీణ మహిళల పొదుపు సంఘాల కార్యక్రమాలతో పాటు పింఛన్ల పంపిణీ వంటి పథకాలను ఈ కార్యాలయాలు పర్యవేక్షిస్తాయి. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు అనుబంధంగా పనిచేసే డీఆర్‌డీఏల నిర్వహణ, సిబ్బంది జీతాల నిధులను కేంద్రమే ఇస్తోంది. ఈ నిధులను వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి నిలిపివేస్తున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అండర్ సెక్రటరీ సంజయ్ అన్ని రాష్ట్రాలకు తాజాగా లేఖ రాశారు. దీంతో ఈ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్న ఈ ఉద్యోగులను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలోనే వివిధ విభాగాల్లో వినియోగించుకోవడానికి ఉన్న అవకాశాలు పరిశీలించడంతో పాటు అందుకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతిని కోరుతూ ఆ శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలిసింది.
డీఆర్‌డీఏలకు కేంద్రం మంగళం!
Published Tue, Nov 9 2021 3:39 AM | Last Updated on Tue, Nov 9 2021 8:20 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment