
సాక్షి, అమరావతి: ఈ నెల మొదటి తేదీ మహాశివరాత్రి పర్వదినం. అదీగాక మంగళవారం ప్రభుత్వ సెలవు దినం. అయినా అవ్వా తాతలకు పింఛన్ ఇచ్చే కార్యక్రమం మాత్రం యథాతథంగా కొనసాగుతోంది. ఫిబ్రవరి నెలకు సంబంధించిన పింఛన్‌ను మార్చి ఒకటో తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 61,25,228 మంది లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు రూ.1,557.06 కోట్లు విడుదల చేసింది. సోమవారం సాయంత్రానికే అన్ని గ్రామ, వార్డు సచివాలయాల ఖాతాల్లో పింఛన్ నిధులను జమ చేసే కార్యక్రమం పూర్తయినట్టు సెర్ప్ అధికారులు చెప్పారు.
తెల్లవారుజాము నుంచే వలంటీర్లు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి డబ్బులిస్తారు. ఐదు రోజుల పాటు పంపిణీ కార్యక్రమం కొనసాగనుంది. పంపిణీలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా లబ్ధిదారులకు పింఛన్ అందించే సందర్భంలో గుర్తింపు కోసం బయోమెట్రిక్, ఐరిస్ విధానాలను అమలు చేస్తున్నారు. అలాగే ఆర్బీఐఎస్ విధానాన్ని కూడా అందుబాటులోకి తెచ్చారు. సాంకేతిక కారణాల వల్ల ఏ ఒక్కరికీ పింఛన్ అందలేదనే ఫిర్యాదు రాకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు. పింఛన్ల పంపిణీ పర్యవేక్షణ కోసం రాష్ట్రంలోని 13 జిల్లాల డీఆర్‌డీఏ కార్యాలయాల్లోని కాల్ సెంటర్లు ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment