తిరుపతమ్మకు పింఛను అందిస్తున్న నాగజ్యోతి నాగేశ్వరరావు
సాక్షి, అమరావతి: అవ్వాతాతలు, వితంతువు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఈ నెలలో ఇప్పటిదాకా ప్రభుత్వం రూ.1,551.70 కోట్ల మొత్తాన్ని పింఛన్ల రూపంలో పంపిణీ చేసింది. బుధవారం సాయంత్రం వరకు 61,03,930 మందికి పింఛన్ల పంపిణీ పూర్తయిందని.. సోమ, మంగళ, బుధవారాల్లో కలిపి ఇప్పటిదాకా 97.20 శాతం మందికి పంపిణీ చేసినట్టు సెర్ప్ అధికారులు తెలిపారు. మిగిలిన వారి కోసం మరో రెండు రోజుల పాటు లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వలంటీర్లు వచ్చి డబ్బులు పంపిణీ చేస్తారని అధికారులు వెల్లడించారు.
రాజకీయాలకు అతీతంగా..
పొదలకూరు/ఒంగోలు సబర్బన్: సంక్షేమ పథకాల అమల్లో తమ ప్రభుత్వం కులం, మతం, రాజకీయం చూడదని సీఎం వైఎస్ జగన్ ప్రకటన పదే పదే వందల వేల ఘటనల్లో నిరూపితమవుతూనే ఉంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరుకు సమీపంలోని మర్రిపల్లికి చెందిన వెంపులూరు పుల్లయ్యగౌడ్(80) పాతికేళ్లు టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. మండలపార్టీ అధ్యక్షుడిగా, జిల్లా కార్యవర్గసభ్యునిగా పనిచేశారు. వృద్ధాప్య కారణాల రీత్యా ఆయన ప్రస్తుతం ఇంటికే పరిమితమయ్యారు.
ఆయన సతీమణి రమణమ్మ(75) మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు. ఆమె వృద్ధాప్య పింఛన్ పొందుతున్నారు. గ్రామ వైఎస్సార్‌సీపీ నేతలు వారి ఆర్థిక స్థితిని దృష్టిలో ఉంచుకుని వృద్ధాప్య పింఛన్‌ను డయాలసిస్ పింఛన్‌గా మార్పించారు. బుధవారం ఆమెకు రూ.10 వేలు అందజేశారు. అలాగే, టీడీపీ మహిళా నేతకు వితంతు పింఛన్ అందించిన ఘటన ఒంగోలులో జరిగింది.
ఒంగోలు నగర పాలక సంస్థ ఎన్నికల్లో 31వ డివిజన్‌లో టీడీపీ తరఫున కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిన వల్లెపు తిరుపతమ్మకు ఆమెపై పోటీచేసి విజయం సాధించిన వైఎస్సార్‌సీపీకి చెందిన నాగజ్యోతి నాగేశ్వరరావు పింఛన్ అర్హత కార్డుతో పాటు రూ.2,500 పింఛన్‌ను అందజేశారు. పాత జెడ్పీ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రీజినల్ కో ఆర్డినేటర్, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొని నూతనంగా పింఛన్లు పొందిన వారికి నగదు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment