మహిళల ఆర్థికాభివృద్ధికి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. పొదుపు సంఘాల్లోని మహిళా రైతులను గుర్తించి, ఆధునిక పద్ధతుల్లో సాగు చేసేలా వారిని ప్రోత్సహిస్తోంది. ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తూ, వ్యవసాయానికి కావాల్సిన యంత్ర పరికరాలను సమకూర్చుతోంది. మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం బ్యాంకు లింకేజీ, సామాజిక పెట్టుబడి, సీఐఎఫ్, గ్రూపు అంతర్గత అప్పులు, స్త్రీనిధి ద్వారా రుణాలు అందిస్తోంది. ఆయా రుణాలను మహిళలు సొంత అవసరాలకు వినియోగించుకుంటున్న నేపథ్యంలో వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న మహిళల కోసం వ్యవసాయ ఆధారిత యూనిట్లను నెలకొల్పి వారి ఆర్థికాభివృద్ధికి చేయూత ఇవ్వాలని నిర్ణయించింది.
కొడవలూరు(పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లా): సన్న, చిన్న కారు మహిళా రైతుల ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం అండగా నిలుస్తోంది. మహిళా రైతులతో ‘రైతు ఉత్పత్తి దారుల సమాఖ్య’ గ్రూపులను ఏర్పాటు చేసి, వివిధ శాఖల ద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తోంది. బ్యాంక్‌లు, ప్రభుత్వ శాఖల ద్వారా రుణ సదుపాయం కల్పించడంతో పాటు వారి ఉత్పత్తులకు మెరుగైన ధరలు వారే కల్పించుకునేలా వసతులు సమకూరుస్తోంది. ఇప్పటికే మూడు విడతల్లో 24 మండలాల్లో 27,412 మంది సభ్యులతో 2,492 గ్రూపులు ఏర్పాటయ్యాయి. తొలివిడతలోని గ్రూపులు సత్ఫలితాల దిశగా పయనిస్తున్నాయి. మహిళా రైతులు సంఘాల్లో సభ్యులుగా చేరేందుకు బాగా ఆసక్తి కనబరుస్తున్నారు.
డీఆర్‌డీఏ ద్వారా అమలు
ఈ సంఘాల ఏర్పాటు బాధ్యతను జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థకు అప్పగించింది. మండలానికి 150 గ్రూపులు లక్ష్యంగా నిర్దేశించింది. సంఘాలు ఎలా ఏర్పాటు చేయాలి, వారికి ప్రభుత్వ శాఖల సహకారం ఏ విధంగా అందించాలి. వారి ఉత్పత్తులకు ధర పెంచుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలు, నిధుల లభ్యతలను ఆ సంస్థకు అప్పగించింది. దీంతో డీఆర్‌డీఏ అధికారులు అంచలంచెలుగా జిల్లా అంతటా సంఘాలు ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకొంటున్నారు. ఇప్పటికే తొలిదశలో సైదాపురం, రాపూరు, చేజర్ల, కలువాయి, కొండాపురం, దుత్తలూరు, మర్రిపాడు, రెండో దశలో మనుబోలు, వెంకటాచలం, ఇందుకూరుపేట, అల్లూరు, విడవలూరు, సంగం, అనంతసాగరం, ఏఎస్‌పేట, వింజమూరు, మూడో దశలో కావలి, జలదంకి, సీతారామపురం, కొడవలూరు, కోవూరు, నెల్లూరు, ముత్తుకూరు, బోగోలు మండలాల్లో సంఘాలు ఏర్పాటయ్యాయి.
సత్ఫలితాల దిశగా తొలిదశ సంఘాలు
తొలి దశలో ఏర్పాటైన సంఘాలు సత్ఫలితాల దిశగా పయనిస్తున్నాయి. చేజర్ల, రాపూరు, కలువాయి తదితర మండలాల్లో రుణం పొంది మినీ రైస్ మిల్లు, పిండి మిల్లు, పొట్టేళ్ల పెంపకం, సేంద్రియ ఎరువులతో పెరటి తోటల పెంపకం చేస్తున్నారు. తద్వారా వచ్చే నాణ్యమైన ఉత్పత్తులను ‘కాలుగుడి’ యాప్‌లో పొందు పరచి ఆన్‌లైన్ మార్కెట్ చేసి లాభపడుతున్నారు.
వ్యవసాయ, అనుబంధ శాఖల సహకారం
వ్యవసాయశాఖ సంఘాలకు సాంకేతిక సహకారం అందిస్తోంది. మౌలిక వసతులను కల్పిస్తోంది. భూసార పరీక్షలు చేయించడం. సమగ్ర వ్యవసాయ విధానంపై శిక్షణ ఇవ్వడం చేస్తోంది.
సెర్ఫ్: బ్యాంక్ ఖాతాలను తెరిపించడంతో పాటు రుణాలు పొందే విధంగా ప్రోత్సహిస్తుంది. పుస్తక నిర్వహణపై శిక్షణ ఇస్తుంది.
ఉద్యానశాఖ: ప్రభుత్వ, ఇతర సంస్థల సబ్సిడీ పథకాలను సంఘాలకు అందిస్తుంది. సాంకేతిక సహకారమందిస్తుంది. సమీకృత వ్యవసాయంపై శిక్షణ ఇస్తుంది.
రైతు సాధికార సంస్థ: సేంద్రియ, ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ ఇవ్వడం, అందుకు అవసరమైన పనిముట్లు, ఎరువులు, పురుగు మందులు అందేలా చూడడం, మార్కెటింగ్ సదుపాయం కల్పించడం చేస్తుంది.
పశుసంవర్థశాఖ: పాడి పశువులు, సన్న జీవాల కొనుగోలుకు సహకారమందిస్తుంది. వ్యాక్సినేషన్, డీవార్మింగ్ చేయిస్తుంది. డెయిరీ కార్యక్రమాల అభివృద్ధికి దోహదపడుతుంది.
ఎన్‌ఆర్‌ఈజీఎస్: గొర్రెలు, మేకలు, కోళ్లు, పశువుల షెడ్స్, ఫార్మ్ పాండ్స్ ఏర్పాటుకు సహకారం అందిస్తుంది.
రుణ పరపతి: ఒక్కో సంఘ సభ్యురాలికి రూ.25 వేల రుణం పొందే వెసులుబాటు ఉంటుంది. సభ్యులంతా కలిపి తీసుకోవాలంటే రూ.1.50 లక్ష వరకు రుణం పొందవచ్చు. సభ్యులు పొదుపులోని నగదును రుణంగా పొందవచ్చు. వీటితోపాటు ఉద్యానశాఖ 75 శాతం రాయితీతో ఇస్తున్న పథకాలు పొందవచ్చు.
సంఘాలు ఏర్పాటు చేశాం
ఒకే రకం పంట సాగు చేసే మహిళా రైతులతో సంఘాలు ఏర్పాటు చేసి పొదుపు కూడా ఆరంభించాం. అధికారుల సూచనలు, సలహాలతో ఎలాంటి పంటలు వేస్తే లాభ దాయకంగా ఉంటుంది. ఆ సాగు పద్ధతులను గురించి అవగాహన చేసుకుంటున్నాం. మార్కెట్ మెళకువలు తెలుసుకుని త్వరలోనే ప్రక్రియ ప్రారంభిస్తాం.
– జి.లక్ష్మిరాణి, అన్నదాత రైతు ఉత్పత్తి దారుల సంఘం, కొడవలూరు
లాభదాయక సంఘాల స్ఫూర్తితో సాధికారత
తొలి దశలో ఏర్పాటైన మా సంఘాలు ఇప్పటికే వివిధ రకాల పంటలు, రైస్ మిల్లు, ఆన్‌లైన్ మార్కెట్‌లు చేస్తూ లాభ పడుతున్నాయి. ఆ సంఘాల స్ఫూర్తితోనే ముందుకు సాగుతాం. వివిధ శాఖలు సహకారమందిస్తున్నందున తప్పక లాభాల బాట పడుతామన్న ధీమా ఉంది. ఉద్యాన శాఖ ద్వారా 75 శాతం రాయితీ రావడంతో పాటు మార్కెటింగ్ సదుపాయం మెరుగ్గా ఉంది.
– కె.సుభాషిణి, వాసు రైతు ఉత్పత్తిదారుల సంఘం
త్వరలో రూ.1.20 కోట్లతో సేకరణ కేంద్రాల ఏర్పాటు
సంఘాలు పండించిన ఉత్పత్తులను ఒక చోటకు సమీకరించి గ్రేడింగ్ చేసి మార్కెటింగ్ చేయడానికి మండలానికో షెడ్డు నిర్మించనున్నాం. ఒక్కో షెడ్డుకు ప్రభుత్వం రూ.20 లక్షల వంతున మంజూరు చేస్తోంది. రూ.15 లక్షలు షెడ్డుకు, రూ.5 లక్షలు కోల్డ్ రూమ్‌కు మంజూరు చేస్తోంది. తొలివిడతలో కలువాయి, రాపూరు, చేజర్ల, గుడ్లూరు, సైదాపురం, ఓలేటివారిపాళెంలో షెడ్ నిర్మాణాలకు రూ.1.20 కోట్లు మంజూరు చేశారు. రైతులు పండించిన పండ్లు, నిమ్మకాయలు, కూరగాయల్లాంటివి రెండు లేదా మూడు రోజులు నిల్వ ఉండాల్సి వస్తే చెడిపోకుండా కోల్డ్ రూమ్ తప్పనిసరి చేయడం జరిగింది. ఉత్పత్తిదారుల సంఘాలను కూడా దశల వారీగా 37 మండలాల్లో ఏర్పాటు చేయనున్నాం.
– కేవీ సాంబశివారెడ్డి, డీఆర్‌డీఏ పీడీ నెల్లూరు
Comments
Please login to add a commentAdd a comment