నెల్లూరు(అర్బన్): నెల్లూరులోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి నేత్ర విభాగంలో డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా ఓ రైతన్నకు కంటి మార్పిడి (కార్నియల్ ట్రాన్స్‌ప్లాంటేషన్) చేసి చూపును ప్రసాదించారు. నెల్లూరు జీజీహెచ్‌లో తొలిసారి కార్నియల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసిన సందర్భంగా ఆ వివరాలను ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సిద్దానాయక్ శనివారం తెలియజేశారు.
తోటపల్లిగూడూరు మండలం పేడూరు గ్రామానికి చెందిన రామయ్య (60) అనే రైతుకు 20 ఏళ్ల క్రితం కంటికి దెబ్బతగిలి నల్లగుడ్డు మీద పువ్వు ఏర్పడింది. దీంతో కంటి చూపు పూర్తిగా తగ్గి రోజువారీ పనులు చేసుకోలేని పరిస్థితి నెలకొంది. రామయ్య ఈ నెల 3న నెల్లూరు జీజీహెచ్‌కి రాగా, కంటి విభాగాధిపతి డాక్టర్ సంధ్య ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించి కంటి గుడ్డు మార్పిడి ద్వారా చూపును ప్రసాదించవచ్చని చెప్పారు. ఈ నెల 9న రాజయ్య కంటికి ఆపరేషన్ చేసి దాత నుంచి సేకరించిన నల్లగుడ్డును విజయవంతంగా అమర్చారు. ఆపరేషన్‌ను విజయవంతంగా చేసిన డాక్టర్ సంధ్య బృందాన్ని సూపరింటెండెంట్ అభినందించారు. రోగి రామయ్య మాట్లాడుతూ తనకు చూపును ప్రసాదించిన డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment