సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకు సంపూర్ణ ఆరోగ్య భరోసా కల్పిస్తూ డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.25 లక్షల వరకూ ఉచితంగా వైద్యాన్ని అందిస్తున్న నేపథ్యంలో పథకం గురించి తెలియని వారు ఏ ఒక్కరూ ఉండటానికి వీల్లేదని అధికార యంత్రాంగానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. నిరుపేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు ఆరోగ్యశ్రీ అండగా నిలుస్తుందనే అవగాహన ఉండాలన్నారు.
పథకాన్ని ఎలా వినియోగించుకోవాలనే అంశంపై ముమ్మరంగా ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. జగనన్న ఆరోగ్య సురక్ష రెండో దశ అమలు, ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డుల పంపిణీ, ప్రచార కార్యక్రమాలపై ఆరా తీసిన సీఎం జగన్ పలు సూచనలు చేశారు.
చేతి నుంచి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి రాకూడదు..
నిరుపేద, మధ్య తరగతి కుటుంబాలకు ఉచిత వైద్య సేవలందిస్తూ అత్యంత మానవీయ దృక్పథంతో మనందరి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. ఆరోగ్యశ్రీ ప్రొసీజర్లు, చికిత్స వ్యయ పరిమితిని విప్లవాత్మక రీతిలో భారీగా పెంచాం. పేద, మధ్య తరగతి ప్రజలెవరూ వైద్యం కోసం చేతి నుంచి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఎక్కడా రాకూడదు. ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందాలన్న విషయంలో ఎవరికీ సందేహాలు ఉండకూడదు. తమకు దగ్గరలోని నెట్‌వర్క్ ఆస్పత్రులకు ఎలా వెళ్లాలన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలియాలి. విస్తరించిన ప్రయోజనాలతో కొత్త ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులను అందిస్తున్నాం. నిర్దేశించుకున్న లక్ష్యం మేరకు కార్డుల పంపిణీ పూర్తి చేయాలి.
జల్లెడ పట్టి గుర్తిస్తూ..
జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా గుర్తించిన అనారోగ్య బాధితులకు చేయూతనిచ్చే కార్యక్రమం ఎలా జరుగుతోందో నిరంతరం సమీక్షించాలి. ప్రజారోగ్య పరిరక్షణలో ప్రివెంటివ్ కేర్ అత్యంత ముఖ్యమైన అంశం. ఆరోగ్య సురక్షలో భాగంగా ప్రతి ఇంటిని జల్లెడ పట్టి ఆరోగ్య సమస్యలను గుర్తించి శిబిరాల ద్వారా అవసరమైన వైద్య సేవలు అందించాలి. ప్రతి ఆర్నెల్లకు ఒకసారి ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి. ప్రతి ఇల్లు, ప్రతి కుటుంబం, ప్రతి గ్రామం, ప్రతి పట్టణాన్ని జల్లెడ పట్టాలి. శాచ్యురేషన్ విధానంలో ఈ ప్రక్రియ జరగాలి.
ఏ గ్రామంలో ఎంతమందికి బీపీ, షుగర్‌లు ఉన్నాయి? ఎంత మంది అనారోగ్యంతో బాధపడుతున్నారు? వారికి అందే వైద్యసేవలు ఏమిటి? తదితర అంశాలతో డేటా మ్యాపింగ్ చేపట్టాలి. బీపీ, షుగర్, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను గుర్తించి చికిత్సలు, కాలానుగుణంగా మందులు అందించాలి. ఈ మొత్తం డేటాను ప్రతి ఆర్నెల్లకు ఒకసారి మీ రికార్డుల్లో అప్‌డేట్ చేయాలి. గ్రామంలో వంద శాతం ఇళ్లు, వ్యక్తులు ఈ ప్రక్రియలో కవర్ కావాలి.
సదుపాయాలపై శ్రద్ధ..
ఎక్కడైనా ఆరోగ్యశ్రీ కార్డు మిస్ అయినా సరే వారికి కూడా ఉచిత వైద్యం అందాలి. ప్రాథమిక వైద్య పరీక్షల్లో గుర్తించిన సమస్యలను నిర్ధారించేందుకు మరోసారి పరీక్షలు చేయాలి. సురక్ష రెండో దశ నిర్వహణ తర్వాత ప్రతి కేసుకు సంబంధించి టెస్ట్‌లు పూర్తి కావాలి. గుండె పోటు బాధితులకు సత్వర వైద్యం కోసం ప్రవేశపెట్టిన స్టెమీ కార్యక్రమం వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్ దగ్గర నుంచి మొదలవ్వాలి. దీనిపై సిబ్బందికి అవగాహన కల్పించాలి. నూతనంగా ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సదుపాయాలపై ఫోకస్ పెట్టాలి. అవసరమైన అన్ని వసతులను కల్పించాలి.
కర్నూలు క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ త్వరలో ప్రారంభం
జగనన్న ఆరోగ్య సురక్ష రెండో దశ కింద ఇప్పటివరకూ 1,338 శిబిరాలు నిర్వహించి 98,210 మందికి అక్కడే స్పాట్ టెస్ట్‌లు నిర్వహించినట్లు సమీక్షలో అధికారులు వెల్లడించారు. 4,27,910 మంది ఓపీ ద్వారా వైద్యసేవలు పొందినట్లు తెలిపారు. సురక్ష తొలి దశ కార్యక్రమం సందర్భంగా నేత్ర పరీక్షలు నిర్వహించి 5,76,493 మందికి కళ్లద్దాల అవసరం ఉందని గుర్తించగా 67 శాతం మందికి ఇప్పటికే పంపిణీ చేసినట్లు చెప్పారు.
మిగిలిన వారికి అద్దాల పంపిణీ వేగంగా కొనసాగుతున్నట్లు తెలిపారు. వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో 12 ఎస్‌ఎన్‌సీయూలు, 5 ఎన్‌ఐసీయూలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రికి తెలియచేశారు. విశాఖలోని మెంటల్ కేర్ ఆసుపత్రి, విజయవాడ, తిరుపతిలో సిటీ డయాగ్నోస్టిక్ సెంటర్స్, రీజనల్ డ్రగ్ స్టోర్స్, తిరుపతి ఎస్‌వీ మెడికల్ కాలేజ్‌లో పీజీ మెన్స్ హాస్టల్, అనంతపురం జీజీహెచ్‌లో బరŠన్స్ వార్డ్, కర్నూలులో స్టేట్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్, జీఎంసీ కర్నూలులో ఎగ్జామినేషన్ హాల్‌ను అతి త్వరలో ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్‌రెడ్డి, వైద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, కార్యదర్శి డాక్టర్ మంజుల, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ నివాస్, ఏపీఎంఎస్‌ఐడీసీ ఎండీ మురళీధర్‌రెడ్డి, ఆరోగ్యశ్రీ సీఈవో బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment