అంపశయ్య మీదున్న టీడీపీ నేతలు చీప్ ట్రిక్స్ ప్రయోగించడంలో మాత్రం ముందే ఉంటారు. అధికార పార్టీ నేతలపై దుష్ప్రచారం చేయడంలో పచ్చ పార్టీ ఎంతకైనా తెగిస్తోంది. నెల్లూరు జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ కుటుంబానికి సన్నిహితంగా ఉండే ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభించారు.
గత ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. మొత్తం పది సీట్లూ వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలుచుకుంది. వచ్చే ఎన్నికల్లో కూడా పదికి పది సీట్లు గెలుచుకునే లక్ష్యంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు క్షేత్రస్థాయిలో శ్రమిస్తున్నాయి. అయితే అంపశయ్య మీదున్న టీడీపీ ఎలాగొలా ఉనికి చాటుకునేందుకు పాట్లు పడుతోంది. సోషల్ మీడియాను వేదికగా చేసుకుని అధికార పార్టీ ఎమ్మెల్యేలపై దుష్ప్రచారానికి తెరతీసింది. కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి వైఎస్సార్సీపీని వీడుతున్నారంటూ ప్రచారం చేస్తోంది. క్యాడర్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీసేందుకు ఇలాంటి చీప్ ట్రిక్లు ప్రయోగిస్తోంది.
తెలుగుదేశం నాయకులు చేస్తున్న చిల్లర ప్రచారంపై కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ఎల్లో బ్యాచ్ చేస్తున్న ప్రచారాలను వారు ఖండించారు. సీఎం వైఎస్ జగన్ కి తమ కుటుంబాలతో సాన్నిహిత్యం ఉందని.. తుది శ్వాస వరకు పార్టీ వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు మీద ప్రసన్న కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కొన్ని సోషల్ మీడియా సైట్స్ ద్వారా చంద్రబాబే ఇలాంటి ప్రచారాలు చేయిస్తున్నారని మండిపడ్డారు. తన పార్టీని బ్రతికించుకోవడం కోసం...అధికార పార్టీ ఎమ్మెల్యేలు అసంతృప్తి తో ఉన్నారంటూ చిల్లర బ్యాచ్‌లో దుష్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు..
కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయిలో సర్వేలు చేయిస్తోంది. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలకు విజయం సాధించే ప్రసక్తి లేదని రిపోర్టులు రావడంతో చంద్రబాబు కంగుతిన్నారట. పైగా పలు నియోజకవర్గాల్లో అభ్యర్థులు కూడా కరువయ్యారు. దీంతో కొత్త ముఖాల కోసం వేట సాగిస్తున్న టీడీపీ నాయకత్వం అధికార పార్టీ ఎమ్మెల్యేలకు గాలం వేస్తోంది. ప్రజాదరణ కోల్పోయిన ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్లు ఇచ్చేది లేదని ఏడాదిన్నర ముందే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెగేసి చెప్పారు. ఈ క్రమంలో టికెట్పై ఆశలు వదులుకున్న కొందరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు పార్టీకి ద్రోహం చెయ్యడంతో వారిపై అధిష్టానం సస్పెన్షన్ వేటు వేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చెత్తను ఊడ్చేస్తుంటే...ఆ చెత్తనే మహా ప్రసాదంగా టీడీపీ స్వీకరిస్తోందనే కామెంట్స్ నెల్లూరు జిల్లా పొలిటికల్ సర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి.
మరోవైపు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి ఉన్నప్పటి నుంచి ఆయనతో సన్నిహితంగా ఉండే నల్లపురెడ్డి కుటుంబం, మేకపాటి రాజమోహన్రెడ్డి కుటుంబాలపై టీడీపీ పథకం ప్రకారం ట్రోలింగ్ నడుపుతోంది. తొలినుంచీ ఈ రెండు కుటుంబాలు వైఎస్కు అత్యంత సన్నిహితంగా ఉంటూ వచ్చారు. వైఎస్ మరణానంతరం ఆయన కుమారుడు జగన్ వెంటే ఉన్నారు. ఈ రెండు కుటుంబాలంటే జగన్ కూడా ఎంతో అభిమానంతో ఉంటారు. జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి ద్రోహం చేయడంతో నల్లపురెడ్డి, మేకపాటి కుటుంబాలపై దుష్ప్రచారం ప్రారంభించారు. ఈ ట్రోలింగ్తో పార్టీ కేడర్ గందరగోళానికి గురువుతారని వారి దుష్ట ఆలోచన. అయితే ఇద్దరు ఎమ్మెల్యేలు ఎల్లో పార్టీ కుట్రలను భగ్నం చేశారు. తాము జగన్ వెంటే అని విస్పష్టంగా ప్రకటించారు. ఆ విధంగా టీడీపీ ట్రోలింగ్ రాయుళ్ళ నోళ్లు మూతపడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment