nirmal bharat abhiyan scheme
-
‘మరుగు’న పడుతున్నాయి
పరిగి, న్యూస్‌లైన్: నిర్మల్ భారత్ అభియాన్ కింద మరుగుదొడ్ల నిర్మాణానికి అధికారులు కొన్ని గ్రామాలను ఎంపిక చేశారు. గుంతలు తవ్వుకోండి వెంటనే బిల్లులు ఇప్పిస్తామని చెప్పారు. జిల్లాలో గత కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని ప్రారంభించారు. అడుగు భాగంలో రింగులు వేసేందుకు గుంతలు తవ్వి ఆరు నెలలవుతున్నా లబ్ధిదారులకు బిల్లులు చెల్లించలేదు. దీంతో నిర్మాణాలను గుంతలకే పరిమితం చేశారు. కొందరు గుంతలు తవ్వి వదిలే యగా మరికొందరు రింగులు వేసి ఊరుకున్నారు. నిర్మించుకునేందుకు ముందుకు రావటంలేదు. నిర్మాణాల్లో సవాలక్ష నిబంధనలు పాటించాలంటున్న అధికారులు బిల్లులు ఇప్పించడంలో మాత్రం చొరవ చూపడం లేదని విమర్శిస్తున్నారు. గుంతలు తవ్వి వదిలేశారు.. మండల పరిధిలోని అన్ని గ్రామాలతో పోలిస్తే రంగాపూర్, సయ్యద్‌మల్కాపూర్‌లో సమస్య తీవ్రంగా ఉంది. మొదటి విడతగా మండలంలో ఐదు గ్రామాలను ఎంపిక చేయగా అందులో రంగాపూర్ ఒకటి. ఈ గ్రామానికి 50 మరుగుదొడ్లు మంజూరు కాగా ఆరు నెలల క్రితం 50 మంది లబ్ధిదారులు గుంతలు పూర్తి చేసుకున్నారు. ఇందులో సగం వరకు సిమెంటు రింగులు కూడా తెచ్చి వేశారు. గుంతలు తవ్వుకున్న వారిలో సగం మందికి మాత్రమే బిల్లులు చెల్లించారు. మిగతావారికి ఇవ్వడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. మండలంలో ఏ గ్రామంలో చూసినా 25 నుంచి 50 వరకు గుంతలు తవ్వి బిల్లుల కోసం ఎదురు చూస్తున్నారు. ఒక్కో గ్రామంలో 25 మందికి పైగా లబ్ధిదారులకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. బిల్లు చెల్లింపులో కొర్రీలు... గ్రామాల్లో మరుగుదొడ్లు నిర్మించుకోవాలని హడావుడి చేసిన అధికారులు బిల్లు చెల్లింపు వరకు వచ్చే సరికి కొర్రీలు పెడుతున్నారు. బిల్లులు కొత్త ఆర్థిక సంవత్సరంలో ఇచ్చేందుకే కంప్యూటర్ యాక్సెప్ట్ చేస్తుందని చెబుతున్నారు. కంప్యూటర్లో లబ్ధిదారుల జాబితా ఫీడ్ చేశాక కూడా బ్యాంకు నుంచి డబ్బులు రావటానికి జాప్యం చేస్తున్నారు. ఇచ్చే డబ్బులు కూడా ఉపాధిహామీ, ఆర్డబ్ల్యూఎస్, హౌసింగ్ ఇలా వేర్వేరు శాఖల నుంచి వస్తుండటం కూడా జాప్యానికి కారణమవుతోందని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. ఇన్ని రోజులు ఎన్నికల బిజీ అంటూ తప్పించుకుంటున్న అధికారులు ఇకనైనా బిల్లులు చెల్లించాలని కోరుతున్నారు. -
షేమ్.. షేమ్...
అనంతపురం టౌన్/ సిటీ, న్యూస్‌లైన్ : ‘మడకశిర నియోజకవర్గంలోని పాపసానిపల్లిని అన్నివిధాలా అభివృద్ధి చేస్తాం. ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్డిని మంజూరు చేస్తాం.’- సాక్షాత్తు మయన్మార్ ప్రజాస్వామ్య ఉద్యమనేత అంగ్‌సాన్ సూచీ ఎదుట ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇచ్చిన హామీ ఇది. రాష్ట్ర రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి కూడా వకాల్తా పుచ్చుకొని పాపసానిపల్లిని దేశం గర్వించేలా అభివృద్ధి చేస్తామంటూ గొప్పలు చెప్పారు. ఆ గ్రామానికి అంగ్‌సాన్ సూచీ వచ్చి వెళ్లి రెండేళ్లు కావస్తోంది. అయితే.. ఇప్పటికీ మన పాలకులు ఒరగబెట్టిందేమీ లేదు. ఒక్క పాపసానిపల్లిలోనే కాదు.. జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ మహిళలు కాలకృత్యాలు తీర్చుకోవాలంటే అవస్థలు పడాల్సి వస్తోంది. ప్రజాప్రతినిధుల స్వగ్రామాల్లోనూ ఇదే దుస్థితి. సోమవారం జిల్లా వ్యాప్తంగా ప్రజాప్రతినిధుల సొంత గ్రామాల్లో ‘న్యూస్‌లైన్’ బృందాలు పర్యటించాయి. వాటి అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. మహిళలు కాలకృత్యాలు తీర్చుకోవాలంటే బహిర్భూమికి వెళ్లాల్సి వస్తోంది. సాయంత్రం ఆరు దాటితే తప్ప.. మహిళలు కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లలేని దయనీయ పరిస్థితి ఉందంటే అందరూ సిగ్గుతో తలదించుకోవాలి. కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ సామూహిక మరుగుదొడ్లను వినియోగిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్, టీడీపీపజాప్రతినిధులు సొంత గ్రామాల్లో సైతం మరుగుదొడ్లను నిర్మింపజేయడంలో ఘోరంగా విఫలమవుతున్నారు. దివంగత రాష్ట్రపతి నీలం సంజీవ రెడ్డి శత జయంతి ఉత్సవాలను ఇటీవల రూ.కోట్లు ఖర్చు చేసి ఘనంగా నిర్వహించారు. అయితే ఆయన సొంతూరైన ఇల్లూరులో ఇప్పటికీ మహిళలు సామూహిక మరుగుదొడ్డినే ఉపయోగిస్తున్నారు. జాడలేని నిర్మల్ భారత్ అభియాన్ ప్రతి కుటుంబానికి వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం రెండేళ్ల క్రితం నిర్మల్ భారత్ అభియాన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం అమలు బాధ్యతను గ్రామీణ నీటి సరఫరా(ఆర్డబ్ల్యూఎస్), జిల్లా నీటి యాజమాన్య సంస్థ(డ్వామా), జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ)లకు అప్పగించింది. ఒక్కో మరుగుదొడ్డి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రూ.4500, ఉపాధి హామీ పథకం కింద రూ.4500 మంజూరవుతోంది. లబ్ధిదారుని వాటాగా రూ.900 చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం రూ. 9900తో వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణం చేపట్టాలి. అయితే.. ఈ పథకం కింద మండలానికి ఐదు పంచాయతీల చొప్పున మాత్రమే ఎంపిక చేస్తున్నారు. వాటిలోనూ మరుగుదొడ్ల నిర్మాణం వేగంగా సాగడం లేదు. జిల్లా వ్యాప్తంగా 1.60 లక్షల కుటుంబాలకు మరుగుదొడ్లు లేవని డీఆర్డీఏ అధికారులు గుర్తించారు. మొదటి విడత కింద 54,494 మరుగుదొడ్లను మంజూరు చేశారు. వీటిలో 2,119 మాత్రమే పూర్తయ్యాయి. 7,592 నిర్మాణంలో ఉన్నాయి. మిగిలినవి ఎప్పటికి పూర్తి చేస్తారో అధికారులే చెప్పలేకపోతున్నారు. మరుగుదొడ్ల నిర్మాణానికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులు నిత్యం ఆదేశాలు జారీ చేస్తున్నా జిల్లాలో పురోగతి మాత్రం కనిపించడం లేదు. దీనికితోడు ప్రజాప్రతినిధులు కూడా దృష్టి సారించకపోవడంతో పరిస్థితి అధ్వానంగా తయారైంది. పెరిగిన నిర్మాణ సామగ్రి (సిమెంటు, ఇసుక) ధరల కారణంగా ప్రభుత్వం మరుగుదొడ్ల నిర్మాణానికి ఇచ్చే మొత్తం ఏమాత్ర ం సరిపోవడం లేదని లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. దీనికితోడు జాబ్ కార్డు ఉన్న వారికే బిల్లులు చెల్లిస్తామని మెలిక పెట్టారు. ఈ నిబంధన కారణంగా అప్పోసప్పో చేసి మరుగు దొడ్ల నిర్మాణం చేపట్టిన వారు ఇబ్బంది పడుతున్నారు. -
‘నిర్మల్ భారత్’ డబ్బులు పక్కదారి!
నవాబుపేట, న్యూస్‌లైన్: పేదలకు అందించాల్సిన నిధులు పక్కదారి పడుతున్నాయి. మండల పరిధిలోని పూలపల్లి గ్రామంలో నిర్మల్ భారత్ అభియాన్ డబ్బులు దుర్వినియోగం అయిన సంఘటన ఆలస్యంగా శనివారం వెలుగుచూసింది. వివరాలు.. నిర్మల్ భారత్ అభియాన్ కింద పూలపల్లి గ్రామస్తులకు మరుగుదొడ్లు మంజూరు అయ్యాయి. ఎస్సీ, ఎస్టీలు నిర్మాణాలను పూర్తి చేసుకోకపోవడంతో డీఆర్డీఏ కింద అధికారులు రూ. 40 వేల రుణాలు మంజూరు చేశారు. నిధులను గ్రామ సంఘం తీర్మానం మేరకు అర్హులకు ఇవ్వాల్సి ఉంటుంది. కాగా గ్రామ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు బాలమణి, యాదమ్మ, కోశాధికారి నాగమణి, గ్రామ సీసీ పోచయ్యలు ఎలాంటి తీర్మానం లేకుండా రూ. 30 వేలు డ్రా చేశారు. విషయం శుక్రవారం మండల మహిళా సంఘానికి తెలిసింది. దీంతో వారు శనివారం గ్రామానికి చేరుకొని వివరాలు సేకరించారు. నిధుల దుర్వినియోగం వాస్తవమేనని తేల్చారు. డబ్బులు తిరిగి చెల్లించాలని స్వాహా చేసిన వారిని ఆదేశించారు. ఈవిషయమై ఏపీఎం దేవయ్య వివరణ కోరగా.. అదేం లేదు. గ్రామ సభ తీర్మానం ఉంది. లోన్లు తిరిగి చెల్లించాలని ఆదేశించామని తెలిపారు. -
మరో అడుగు..
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : వ్యక్తిగత మరుగుదొడ్ల(ఐఎస్ఎల్) నిర్మాణం పేరిట రూ.17.60 కోట్లు పక్కదారి పట్టిన వైనంపై విచారణ కోసం మరో కమిటీ నియమించారు. వారం రోజుల క్రితం ఏజేసీ వెంకటయ్యతోపాటు ఆర్డబ్ల్యూఎస్, పీఆర్, ఆర్అండ్బీ ఎస్ఈలు, డ్వామా పీడీలను కలిపి ఐదుగురితో కమిటీ వేశారు. తాజాగా ప్రభుత్వం విచారణ కోసం ‘విజిలెన్స్’ను రంగంలోకి దింపడం చర్చనీయాంశం అవుతోంది. దీంతో మరుగుదొడ్ల నిర్మాణం వ్యవహారంపై విచారణలో మరో అడుగు ముందుకు పడింది. జిల్లాలో సుమారు లక్ష మరుగుదొడ్ల నిర్మాణం లక్ష్యంగా నిర్మల్ భారత్ అభియాన్(ఎన్బీఏ) కింద మంజూరైన నిధుల నుంచి రూ.17.60 కోట్లు పక్కదారి పట్టించడాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. మరుగుదొడ్ల నిర్మాణం కోసం టూల్‌కిట్స్‌ను సరఫరా చేసిన ధనలక్ష్మి ఏజెన్సీస్‌కు నిర్మాణం కాకుండానే రూ.17.60 కోట్లు చెల్లించిన వైనంపై ‘సాక్షి’లో వెలువడిన వరుస కథనాలు సంచలనం సృష్టించాయి. . ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ అహ్మద్ బాబు అక్రమాలపై ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించారు. క్షేత్రస్థాయిలో ఐఎస్ఎల్ టూల్‌కిట్స్ నాణ్యతను పరిశీలించి తీసుకోవడంలో వీఆర్వోలు, ఎంపీడీవోల నిర్లక్ష్యం ప్రదర్శించారని ఉన్నా, నిబంధనలకు విరుద్ధంగా ఐఎస్ఎల్ టూల్‌కిట్స్ కొనుగోలుకు పెద్దమొత్తంలో చెల్లించేందుకు అప్పటి ముగ్గురు ఉన్నతాధికారుల ప్రమేయంపైనా ఆరా తీస్తుండటం అధికారవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వారంలో రెండు కమిటీలు ఎన్బీఏ కింద ఈ బాగోతంలో కమీషన్ల రూపంగా రూ.కోటికి పైగా చేతులు మారాయన్న ఆరోపణలపై విచారణ వేగవంతమైంది. మొదటి నుంచి మరుగుదొడ్లలో అవకతవకలపై సీరియస్‌గా ఉన్న కలెక్టర్ సెప్టెంబర్ చివరి వారంలో ఏజేసీ వెంకటయ్య ఆధ్వర్యంలో కమిటీ వేశారు. అంతకు ముందు కలెక్టర్ పంపిన నివేదికపై స్పందించిన ప్రభుత్వం ఇటీవలే విజిలెన్స్‌కు విచారణ బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ఇన్చార్జి రీజినల్ విజిలెన్స్ ఆఫీసర్ కె.సురేందర్ ఆధ్వర్యంలో బృందం రంగంలోకి దిగినట్లు తెలిసింది. జిల్లాలో ఎన్బీఏ కింద ఎప్పుడు మరుగుదొడ్లకు నిధులు మంజూరయ్యాయి? లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఎప్పుడు మొదలైంది? మరుగుదొడ్ల నిర్మాణం విషయంలో నిబంధనలు ఏం చెప్తున్నాయి? ఐఎస్ఎల్ టూల్కిట్ల కోసం ‘ధనలక్షి’కి ఏయే తేదీల్లో ఎంత మొత్తంలో చెల్లించారు? టూల్కిట్ల సరఫరా నాటికి జిల్లాలో గ్రౌండింగైన మరుగుదొడ్ల సంఖ్య ఎంత? మరుగుదొడ్ల నిర్మాణం మొదలవక ముందే రూ.17.60 కోట్లు ఎందుకు చెల్లించారు? తదితర అంశాలపై విజిలెన్స్ ఆరా తీస్తుంది. మరుగుదొడ్డిని నిర్మించుకునే లబ్ధిదారుడే నేరుగా ఆన్లైన్ ద్వారా టూల్‌కిట్స్ కొనుగోలు చేయాలన్న నిబంధనలున్నా... ఎంపీడీవోలు ఎందుకు ‘ధనలక్ష్మి’ ద్వారా కొనుగోలు చేశారు? రూ.17.60 కోట్ల చెల్లింపుల వెనుక ఎవరెవరి ప్రమేయం, ఒత్తిళ్లు ఉన్నాయి? అన్న కోణంలో దర్యాప్తు జరుగుతోంది. టూల్కిట్ల సరఫరాకు ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్ బదిలీ కాగా, ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ పదోన్నతిపై బదిలీ అయ్యారు. జెడ్పీ ముఖ్య కార్యనిర్వహణాధికారి పదవీ విరమణ చేశారు. అయితే నిబంధనలకు విరుద్దంగా కొనుగోలు చేయడంపైన విజిలెన్స్ అభ్యంతరం చెప్తూనే ఎంపీడీవోల పాత్రపైనా ఆరా తీస్తుంది. తమ పైఅధికారుల ఒత్తిళ్ల మేరకు చెల్లింపులు జరిపామని చెప్తున్నా తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోనన్న ఆందోళన కొందరు ఎంపీడీవోల్లో కనిపిస్తుంది.