పరిగి, న్యూస్‌లైన్: నిర్మల్ భారత్ అభియాన్ కింద మరుగుదొడ్ల నిర్మాణానికి అధికారులు కొన్ని గ్రామాలను ఎంపిక చేశారు. గుంతలు తవ్వుకోండి వెంటనే బిల్లులు ఇప్పిస్తామని చెప్పారు. జిల్లాలో గత కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని ప్రారంభించారు. అడుగు భాగంలో రింగులు వేసేందుకు గుంతలు తవ్వి ఆరు నెలలవుతున్నా లబ్ధిదారులకు బిల్లులు చెల్లించలేదు. దీంతో నిర్మాణాలను గుంతలకే పరిమితం చేశారు. కొందరు గుంతలు తవ్వి వదిలే యగా మరికొందరు రింగులు వేసి ఊరుకున్నారు. నిర్మించుకునేందుకు ముందుకు రావటంలేదు. నిర్మాణాల్లో సవాలక్ష నిబంధనలు పాటించాలంటున్న అధికారులు బిల్లులు ఇప్పించడంలో మాత్రం చొరవ చూపడం లేదని విమర్శిస్తున్నారు.
గుంతలు తవ్వి వదిలేశారు..
మండల పరిధిలోని అన్ని గ్రామాలతో పోలిస్తే రంగాపూర్, సయ్యద్‌మల్కాపూర్‌లో సమస్య తీవ్రంగా ఉంది. మొదటి విడతగా మండలంలో ఐదు గ్రామాలను ఎంపిక చేయగా అందులో రంగాపూర్ ఒకటి. ఈ గ్రామానికి 50 మరుగుదొడ్లు మంజూరు కాగా ఆరు నెలల క్రితం 50 మంది లబ్ధిదారులు గుంతలు పూర్తి చేసుకున్నారు. ఇందులో సగం వరకు సిమెంటు రింగులు కూడా తెచ్చి వేశారు. గుంతలు తవ్వుకున్న వారిలో సగం మందికి మాత్రమే బిల్లులు చెల్లించారు. మిగతావారికి ఇవ్వడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. మండలంలో ఏ గ్రామంలో చూసినా 25 నుంచి 50 వరకు గుంతలు తవ్వి బిల్లుల కోసం ఎదురు చూస్తున్నారు. ఒక్కో గ్రామంలో 25 మందికి పైగా లబ్ధిదారులకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.
బిల్లు చెల్లింపులో కొర్రీలు...
గ్రామాల్లో మరుగుదొడ్లు నిర్మించుకోవాలని హడావుడి చేసిన అధికారులు బిల్లు చెల్లింపు వరకు వచ్చే సరికి కొర్రీలు పెడుతున్నారు. బిల్లులు కొత్త ఆర్థిక సంవత్సరంలో ఇచ్చేందుకే కంప్యూటర్ యాక్సెప్ట్ చేస్తుందని చెబుతున్నారు. కంప్యూటర్‌లో లబ్ధిదారుల జాబితా ఫీడ్ చేశాక కూడా బ్యాంకు నుంచి డబ్బులు రావటానికి జాప్యం చేస్తున్నారు. ఇచ్చే డబ్బులు కూడా ఉపాధిహామీ, ఆర్‌డబ్ల్యూఎస్, హౌసింగ్ ఇలా వేర్వేరు శాఖల నుంచి వస్తుండటం కూడా జాప్యానికి కారణమవుతోందని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. ఇన్ని రోజులు ఎన్నికల బిజీ అంటూ తప్పించుకుంటున్న అధికారులు ఇకనైనా బిల్లులు చెల్లించాలని కోరుతున్నారు.
‘మరుగు’న పడుతున్నాయి
Published Fri, May 2 2014 11:55 PM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement
Advertisement