అందని బిల్లులు | Preposterous bills | Sakshi
Sakshi News home page

అందని బిల్లులు

Published Mon, Aug 8 2016 6:50 PM | Last Updated on Tue, Aug 28 2018 5:25 PM

అందని బిల్లులు - Sakshi

అందని బిల్లులు

  • - మరుగుదొడ్లు, ఇంకుడుగుంతల బిల్లుల చెల్లింపులో అధికారుల నిర్లక్ష్యం
  • - ఆందోళనలో లబ్ధిదారులు
  • - పట్టించుకోని పాలకులు
  • స్వచ్ఛభారత్‌ కార్యక్రమంలో భాగంగా ఇంకుడుగుంతలు, మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టిన లబ్ధిదారులకు బిల్లులు చెల్లించడం లేదు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా ఇంకుడుగుంతలు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని ప్రకటించాయి. పలు గ్రామాల్లో ప్రజలకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు. పలువురు అధికారులు గ్రామాలను దత్తత తీసుకొని ఇంకుడుగుంతలు, మరుగుదొడ్ల నిర్మాణం పనులను యుద్ధప్రాతిపదికన చేయించారు. నిర్మాణం పనులను పూర్తి చేసి నెలలు గడుస్తున్నా బిల్లులు చెల్లించడం లేదని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు.
    - శివ్వంపేట

    మండల కేంద్రమైన శివ్వంపేటతో పాటు పలు గ్రామాలకు 5,600 ఇంకుడుగుంతలు మంజూరయ్యాయి. 4 వేల ఇంకుడుగుంతల నిర్మాణం చేపట్టారు. వీటిలో 3 వేల వాటికి బిల్లులు చెల్లించారు. వెయ్యి ఇంకుడుగుంతలకు నెలలు గడుస్తున్నా బిల్లులు అందడం లేదు. ఒక్కో ఇంకుడుగుంతకు రూ.4,100 చెల్లించాల్సి ఉంది. నిర్మాణం పూర్తి చేసిన వాటికి ఒక్క రూపాయీ చెల్లించకపోవడంతో లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు. శివ్వంపేట, గూడూర్‌, చెన్నాపూర్‌, పెద్దగొట్టిముక్ల, కొంతాన్‌పల్లి, చెండి తదితర  గ్రామాల్లో మరుగుదొడ్లు నిర్మించుకొని నెలలు గడుస్తోంది. ఒక్కో నిర్మాణానికి రూ.12 వేల చొప్పున చెల్లించాల్సి ఉంది.

    అప్పులు చేసి మరీ వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేసినా ఐహెచ్‌హెచ్‌ఎల్‌,  ఈజీఎస్‌ ద్వారా నిధులు చెల్లించడం లేదు. బిల్లులు మంజూరు చేయాలని పలుమార్లు అధికారులకు, ‍ప్రజాప్రతినిధులకు విన్నవించినా ఏ మాత్రం పట్టించుకోవడం లేదని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

    ఐదు నెలలవుతోంది
    ఇంకుడుగుంత నిర్మించుకొని ఐదునెలలవుతోంది. బిల్లు చెల్లింపులో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రజాప్రతినిధులు చెప్పినా పట్టించుకోవడం లేదు.
    - సింగిరెడ్డి వెంకట్‌రెడ్డి, చెన్నాపూర్‌

    అప్పులు చేసి నిర్మించాం
    అప్పులు చేసి మరుగుదొడ్డి, ఇంకుడుగుంత నిర్మాణం చేపట్టినా బిల్లులు చెల్లించడం లేదు. అధికారులు ఆరునెలల క్రితం వివరాలను నమోదు చేసుకున్నా బిల్లులు మాత్రం ఇవ్వడం లేదు
    - ఆకు మల్లయ్య

    బిల్లులు చెల్లించాలి
    మరుగుదొడ్డి, ఇంకుడుగుంత నిర్మించుకొని నెలలు గడుస్తున్నా బిల్లులు ఇవ్వడం లేదు. నిర్మించుకున్న వాటికి డబ్బులు చెల్లించాలని రోజూ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తోంది.
    - నీరుడి ఎల్లం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement