చింతపల్లిలో నిర్మించుకున్న మరుగుదొడ్డి
చింతపల్లి : మరుగుదొడ్డి నిర్మాణానికి ప్రభుత్వం మంజూరు చేసే బిల్లుల్లో అధికారులు చేతివాటం ప్రదర్శించారు. ఆన్‌లైన్‌లో లబ్ధిదారులకు బిల్లు చెల్లించినట్లుగా చూపించి.. ఏకంగా సుమారు రూ.కోటికి పైగా స్వాహా చేశారు. చింతపల్లి మండలంలో అధికారులు మరుగుదొడ్ల బిల్లుల్లో మొదటి విడత చెల్లించి.. రెండో విడతలో మొండి చేయి చూపించారు. మరి కొందరికి అసలు బిల్లులే చెల్లించలేదు. పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, అధికారులు వాటిని పంచుకు తిన్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిధులు స్వాహా చేసినట్లు తెలియడంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు.
రూ.6వేల చొప్పున రెండు విడతల్లో..
స్వచ్ఛ భారత్ మిషన్ కింద చింతపల్లి మండలంలోని 34 గ్రామాల్లో 3,874 మందిని మరుగుదొడ్లు లేనివారిని లబ్ధిదారులుగా గుర్తించారు. మరుగుదొడ్ల నిర్మాణానికి రెండు విడతల్లో రూ.6వేల చొప్పున రూ.12 వేలను లబ్ధిదారుడికి ప్రభుత్వం అందిస్తుంది. మరుగుదొడ్డి నిర్మాణ దశలను ఫీల్డ్ అసిస్టెంట్లు తనిఖీ చేసి నిర్మాణంలో ఉన్న మరుగుదొడ్డి వద్ద లబ్ధిదారుడిని ఉంచి ఫొటో తీసి ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి. తర్వాత పంచాయతీ కార్యదర్శి, సంఘబంధం అధ్యక్షురాలు, సర్పంచ్ సంతకం చేసి పరిశీలించి రెండు విడతల్లో రూ.6 వేల చొప్పున లబ్ధిదారులకు చెక్కులు అందజేస్తారు. మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి అయిన తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్లు ధ్రువీకరణ అనంతరం గ్రామపంచాయతీ ఖాతాలో డబ్బులు జమ చేస్తారు. ఈ వెసులుబాటును అవకాశంగా చేసుకుని అంతా కుమ్మకై ్క బిల్లులు కాజేశారని ఆరోపణలు వస్తున్నాయి.
అక్రమాలకు తెరలేపిన అధికారులు..
మరుగుదొడ్ల బిల్లులు బిల్లు ఇవ్వకుండానే ఇచ్చినట్లుగా ఉండడం ఏమిటని అధికారులను ఇటీవల కొందరు లబ్ధిదారులు నిలదీయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. 2018 సంవత్సరంలో మరుగుదొడ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు 2019లోపే కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో బిల్లులు చెల్లించింది. అయితే మొదటి విడత రూ.6 వేలు లబ్ధిదారులకు ఇచ్చి, మరో రూ.6 వేలు కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్టు మింగేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమకు అనుకూలంగా ఉన్న వారు మరుగుదొడ్లు నిర్మించుకోకున్నా నిర్మాణం జరిగినట్లుగా ఆన్‌లైన్ చేసి నిధులు స్వాహా చేశారని తెలుస్తోంది. పలు గ్రామాల్లో సొంతంగా మరుగుదొడ్లు నిర్మించుకున్న వారి సొమ్మును సైతం మింగేశారు. అసలైన లబ్ధిదారులు డబ్బుల గురించి అడిగితే ఆర్థిక సంవత్సరం ముగియడంతో నిధులు మురిగిపోయాయని చెబుతూ వస్తున్నారు.
పైసా ఇవ్వలేదు
స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా నా తల్లి పిల్లి యాదమ్మ పేరు మీద 2019లో మరుగుదొడ్డి నిర్మించుకున్నా. ఇందుకు సంబంధించి బిల్లు ఇవ్వాలని ఎన్నిసార్లు ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులను కలిసినా పట్టించుకోవడం లేదు. మరుగుదొడ్డి నిర్మించుకొని నాలుగేళ్లు కావస్తున్నా పైసా ఇవ్వలేదు. ఉన్నతాధికారులు విచారణ జరిపి న్యాయం చేయాలి.
– పిల్లి లింగం, చింతపల్లి
బిల్లులు ఇప్పించేలా చూస్తాం
మరుగుదొడ్డి నిర్మించుకొని బిల్లు అందని కొందరు ఎంపీడీఓ కార్యాలయంలో సంప్రదించారు. స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా మరుగుదొడ్డి నిర్మించుకుని బిల్లులు పొందని వారిని ఏపీఓను సంప్రదించాలని సూచించాం. బిల్లులు అందని వారికి బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకుంటాం.
– రాజు, ఎంపీడీఓ, చింతపల్లి
బిల్లులు అందలే..
చింతపల్లి మండల కేంద్రంలోనే 180 మంది లబ్ధిదారులకు మొదటి విడత బిల్లు రూ.6 వేలు అందగా.. రెండో విడతకు సంబంధించి రూ.6 వేలు రావాల్సి ఉంది.
కుర్మేడు గ్రామంలో 130, కుర్రంపల్లిలో 130 మందికి రెండు విడతలకు సంబంధించి బిల్లులు రావాల్సి ఉంది.
వెంకటంపేట, నసర్లపల్లి గ్రామాల్లో మరుగుదొడ్డి నిర్మించుకోని వారి పేరిట బిల్లులు స్వాహా చేయగా మరుగుదొడ్డి నిర్మించుకున్న వారికి మాత్రం బిల్లులు అందించలేదు.
నెల్వలపల్లి, ఉప్పరపల్లి, గడియగౌరారం, మల్లారెడ్డిపల్లి, హోమంతాలపల్లి, వింజమూరు గ్రామాల్లో కూడా లబ్ధిదారులకు బిల్లులు అందాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment