swach bharat mission
-
మరుగుదొడ్ల నిర్మాణంలో రూ.కోటి స్వాహా!
చింతపల్లి : మరుగుదొడ్డి నిర్మాణానికి ప్రభుత్వం మంజూరు చేసే బిల్లుల్లో అధికారులు చేతివాటం ప్రదర్శించారు. ఆన్లైన్లో లబ్ధిదారులకు బిల్లు చెల్లించినట్లుగా చూపించి.. ఏకంగా సుమారు రూ.కోటికి పైగా స్వాహా చేశారు. చింతపల్లి మండలంలో అధికారులు మరుగుదొడ్ల బిల్లుల్లో మొదటి విడత చెల్లించి.. రెండో విడతలో మొండి చేయి చూపించారు. మరి కొందరికి అసలు బిల్లులే చెల్లించలేదు. పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, అధికారులు వాటిని పంచుకు తిన్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిధులు స్వాహా చేసినట్లు తెలియడంతో లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. రూ.6వేల చొప్పున రెండు విడతల్లో.. స్వచ్ఛ భారత్ మిషన్ కింద చింతపల్లి మండలంలోని 34 గ్రామాల్లో 3,874 మందిని మరుగుదొడ్లు లేనివారిని లబ్ధిదారులుగా గుర్తించారు. మరుగుదొడ్ల నిర్మాణానికి రెండు విడతల్లో రూ.6వేల చొప్పున రూ.12 వేలను లబ్ధిదారుడికి ప్రభుత్వం అందిస్తుంది. మరుగుదొడ్డి నిర్మాణ దశలను ఫీల్డ్ అసిస్టెంట్లు తనిఖీ చేసి నిర్మాణంలో ఉన్న మరుగుదొడ్డి వద్ద లబ్ధిదారుడిని ఉంచి ఫొటో తీసి ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. తర్వాత పంచాయతీ కార్యదర్శి, సంఘబంధం అధ్యక్షురాలు, సర్పంచ్ సంతకం చేసి పరిశీలించి రెండు విడతల్లో రూ.6 వేల చొప్పున లబ్ధిదారులకు చెక్కులు అందజేస్తారు. మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి అయిన తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్లు ధ్రువీకరణ అనంతరం గ్రామపంచాయతీ ఖాతాలో డబ్బులు జమ చేస్తారు. ఈ వెసులుబాటును అవకాశంగా చేసుకుని అంతా కుమ్మకై ్క బిల్లులు కాజేశారని ఆరోపణలు వస్తున్నాయి. అక్రమాలకు తెరలేపిన అధికారులు.. మరుగుదొడ్ల బిల్లులు బిల్లు ఇవ్వకుండానే ఇచ్చినట్లుగా ఉండడం ఏమిటని అధికారులను ఇటీవల కొందరు లబ్ధిదారులు నిలదీయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. 2018 సంవత్సరంలో మరుగుదొడ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు 2019లోపే కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో బిల్లులు చెల్లించింది. అయితే మొదటి విడత రూ.6 వేలు లబ్ధిదారులకు ఇచ్చి, మరో రూ.6 వేలు కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్టు మింగేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమకు అనుకూలంగా ఉన్న వారు మరుగుదొడ్లు నిర్మించుకోకున్నా నిర్మాణం జరిగినట్లుగా ఆన్లైన్ చేసి నిధులు స్వాహా చేశారని తెలుస్తోంది. పలు గ్రామాల్లో సొంతంగా మరుగుదొడ్లు నిర్మించుకున్న వారి సొమ్మును సైతం మింగేశారు. అసలైన లబ్ధిదారులు డబ్బుల గురించి అడిగితే ఆర్థిక సంవత్సరం ముగియడంతో నిధులు మురిగిపోయాయని చెబుతూ వస్తున్నారు. పైసా ఇవ్వలేదు స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా నా తల్లి పిల్లి యాదమ్మ పేరు మీద 2019లో మరుగుదొడ్డి నిర్మించుకున్నా. ఇందుకు సంబంధించి బిల్లు ఇవ్వాలని ఎన్నిసార్లు ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులను కలిసినా పట్టించుకోవడం లేదు. మరుగుదొడ్డి నిర్మించుకొని నాలుగేళ్లు కావస్తున్నా పైసా ఇవ్వలేదు. ఉన్నతాధికారులు విచారణ జరిపి న్యాయం చేయాలి. – పిల్లి లింగం, చింతపల్లి బిల్లులు ఇప్పించేలా చూస్తాం మరుగుదొడ్డి నిర్మించుకొని బిల్లు అందని కొందరు ఎంపీడీఓ కార్యాలయంలో సంప్రదించారు. స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా మరుగుదొడ్డి నిర్మించుకుని బిల్లులు పొందని వారిని ఏపీఓను సంప్రదించాలని సూచించాం. బిల్లులు అందని వారికి బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకుంటాం. – రాజు, ఎంపీడీఓ, చింతపల్లి బిల్లులు అందలే.. చింతపల్లి మండల కేంద్రంలోనే 180 మంది లబ్ధిదారులకు మొదటి విడత బిల్లు రూ.6 వేలు అందగా.. రెండో విడతకు సంబంధించి రూ.6 వేలు రావాల్సి ఉంది. కుర్మేడు గ్రామంలో 130, కుర్రంపల్లిలో 130 మందికి రెండు విడతలకు సంబంధించి బిల్లులు రావాల్సి ఉంది. వెంకటంపేట, నసర్లపల్లి గ్రామాల్లో మరుగుదొడ్డి నిర్మించుకోని వారి పేరిట బిల్లులు స్వాహా చేయగా మరుగుదొడ్డి నిర్మించుకున్న వారికి మాత్రం బిల్లులు అందించలేదు. నెల్వలపల్లి, ఉప్పరపల్లి, గడియగౌరారం, మల్లారెడ్డిపల్లి, హోమంతాలపల్లి, వింజమూరు గ్రామాల్లో కూడా లబ్ధిదారులకు బిల్లులు అందాల్సి ఉంది. -
ప్రధాన మంత్రి అవార్డు రేసులో విశాఖ
సాక్షి , విశాఖపట్నం : స్వచ్ఛతలో మెరిసి మురిసిపోతున్న మహా విశాఖ నగరం.. మరో ముందడుగు వేసింది. స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రధానమంత్రి అవార్డు–2020కి ఎంపికైన 10 జిల్లాల జాబితాలో విశాఖ చోటు దక్కించుకుంది. జిల్లాలోని మూడు పట్టణ స్థానిక సంస్థలు(యూఎల్బీలు) కలిపి ఒక క్లస్టర్‌గా పోటీల్లో పాల్గొన్న విశాఖ.. దక్షిణాది రాష్ట్రాల తరఫున ఎంపికైన ఏకైక జిల్లాగా నిలిచింది.స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఈ ఏడాది ఏకంగా 14 స్థానాలు ఎగబాకి తొమ్మిదో స్థానంలో నిలిచి టాప్–10లో విశాఖ నగరం చోటు సంపాదించుకుంది. చెత్త రహిత నగరంగా.. తడిపొడి చెత్త విభజన, చెత్త నుంచి ఎరువు తయారీలోనూ ఇటీవలే ప్రశంసలందుకున్న విశాఖ.. ఇప్పుడు మరో అవార్డు కోసం రేసులో నిలిచింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్వచ్ఛ భారత్ మిషన్(ఎస్బీఎం)లో ప్రజల భాగస్వామ్యం కేటగిరీలో ప్రధాన మంత్రి అవార్డు కోసం విశాఖపట్నం దేశంలోని తొలి పది యూఎల్బీ క్లస్టర్ల జాబితాలో నిలిచింది. ఈసారి కేవలం విశాఖ నగరం మాత్రమే కాకుండా.. జిల్లాలోని యూఎల్‌బీలన్నీ కలిపి క్లస్టర్‌గా ఏర్పడి ఈ అవార్డు కోసం పోటీ పడుతోంది. వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, చెత్త విభజన, స్థానిక సంస్థలు అందించే సేవలు, కార్యక్రమాలపై అవగాహన, సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లడం మొదలైన అంశాల్లో ప్రజల్లో అవగాహన ఎలా ఉందనే అంశాలపై ఈ పోటీ నిర్వహిస్తున్నారు. జీవీఎంసీతో పాటు నర్సీపట్నం, యలమంచిలి జీవీఎంసీతో పాటు నర్సీపట్నం, యలమంచిలి మున్సిపాలిటీలు కలిపి జిల్లా యూఎల్బీ క్లస్టర్‌గా ఏర్పడింది. ఆయా రాష్ట్రాల్లోని ఎంపికైన ప్రతి జిల్లాలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను కలిపి క్లస్టర్‌గా ఏర్పాటు చేసి ఈ అవార్డు కోసం పోటీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా విశాఖ జిల్లా తొలి పది జిల్లాల్లో స్థానం సంపాదించుకుంది. ఈ అవార్డుకి సంబంధించిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ని ప్రధాన మంత్రి కార్యాలయ అధికారులకు జిల్లా కలెక్టర్, జీవీఎంసీ ప్రత్యేకాధికారి వి.వినయ్‌చంద్ ఆన్లైన్లో వివరించారు. జిల్లా యూఎల్బీల్లో స్వచ్ఛభారత్ విషయంలో ఎలాంటి ప్రగతి సాధించిందనే అంశాలను వెల్లడించారు. దక్షిణాది నుంచి ఏకైక జిల్లా.. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల నుంచి 10 జిల్లాలు ప్రధాన మంత్రి అవార్డు కోసం పోటీ పడుతున్నాయి. ప్రమోటింగ్ పీపుల్స్ మూమెంట్– జన భగీరధి పేరుతో ఈ అవార్డు అందించనున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి విశాఖపట్నం, ఛత్తీస్‌గఢ్ నుంచి దుర్గ్, సుర్గుజా, రాయ్‌ఘర్, రాజ్‌నంద్‌గావూన్ జిల్లాలు, గుజరాత్ నుంచి సూరత్, అహ్మదాబాద్, రాజ్‌కోట్, మధ్యప్రదేశ్ నుంచి ఇండోర్, మహారాష్ట్ర నుంచి ధూలే జిల్లాలు బరిలో ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాల నుంచి ఈ అవార్డు కోసం పోటీ పడుతోంది మాత్రం కేవలం విశాఖ జిల్లా మాత్రమే. ప్రజల భాగస్వామ్యమే నిలబెట్టింది.. ప్రధాన మంత్రి అవార్డు కోసం జిల్లా యూఎల్బీ యూనిట్ పోటీ పడుతోంది. దీనికి సంబంధించిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ పీఎం కార్యాలయానికి, స్వచ్ఛభారత్ మిషన్ అధికారులకు వివరించాం. ఎస్బీఎం బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. ఇందులో విశాఖ ప్రజలు నిరంతరం యాక్టివ్‌గా ఉంటూ భాగస్వాములు కావడం వల్లే టాప్–10లో స్థానం సంపాదించుకోగలిగాం. 29,016 స్వయం సహాయక బృందాల్లోని 3,38,511 మంది మహిళలు చెత్త విభజన చేస్తూ ఇంట్లో ఎరువు తయారు చేస్తుండటం రికార్డుగా చెప్పుకోవచ్చు. –వి.వినయ్‌చంద్, జిల్లా కలెక్టర్, జీవీఎంసీ ప్రత్యేకాధికారి ఈ నెలాఖరులో ఫలితాలు.. స్వచ్ఛత విషయంలో ప్రజల భాగస్వామ్యంతో పాటు స్వచ్ఛ అంబాసిడర్లు, నౌకాదళం, నాయకులు, పరిశ్రమలు, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు అందిస్తున్న సహకారం వల్లే.. విశాఖ పోటీలో నిలిచింది. జీవీఎంసీ కమిషనర్ నేతృత్వంలో ప్రజారోగ్య విభాగం అందిస్తున్న సేవలతో నగరం సర్వేక్షణ్‌లో 9వ స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో తొలిసారిగా యూజర్ ఫ్రెండ్లీ టాయిలెట్లు ఏర్పాటు చేసింది విశాఖ నగరంలోనే. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ, చెత్త నుంచి విద్యుత్ తయారీ, భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణ విషయంలోనూ ముందంజలో ఉన్నాం. పీఎం అవార్డు ఫలితాలు ఈ నెలాఖరులో వెల్లడి కానున్నాయి. – డా. వి.సన్యాసిరావు, జీవీఎంసీ అదనపు కమిషనర్, స్వచ్ఛ సర్వేక్షణ్ నోడల్ అధికారి -
అంతన్నాడు.. ఇంతన్నాడే చంద్రబాబు
సాక్షి ప్రతినిధి, కాకినాడ : అంతన్నాడు.. ఇంతన్నాడు.. గంగరాజు అనే పాటను తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం మోరి గ్రామస్తులు గుర్తుకు తెచ్చుకుంటున్నారు. చంద్రబాబు తీరే ఆ పాటను గుర్తుచేస్తుందని గ్రామస్తులు చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా మోరి గ్రామాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు స్మార్ట్ విలేజ్‌గా ప్రకటించారు. 2016 డిసెంబర్ 29న మోరి గ్రామంలో భారీగా బహిరంగ సభలో ఆర్భాటంగా ప్రకటన చేశారు. ఫైబర్‌గ్రిడ్‌తో అనుసంధానమని, రాష్ట్రంలోనే తొలి పూర్తి నగదురహిత లావాదేవీల గ్రామమని, బహిరంగ మలవిసర్జన రహిత గ్రామమని ప్రకటించారు. సీఎం ప్రకటనలు చూసి ఇక మోరి గ్రామ స్వరూపమే మారిపోతుందని అంతా అనుకున్నారు. కానీ అమలులో మాత్రం అదంతా ఉత్తిదేనని తేలిపోయింది. పనిచేయని ఫైబర్ గ్రిడ్ కనెక్షన్లు రాష్ట్రంలోనే తొలిసారిగా ఫైబర్ గ్రిడ్‌ను మోరి గ్రామానికి అందించారు. 1,500 ఫైబర్ గ్రిడ్ కనెక్షన్లను ప్రభుత్వం మంజూరుచేసింది. ప్రతి ఇంటికీ నెలకు రూ.149కే టీవీ, ఇంటర్నెట్ సౌకర్యం అన్నారు. ఆ కనెక్షన్లను స్థానిక కేబుల్ ఆపరేటర్లు ఫైబర్ గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. అయితే ఇందులో 300 కనెక్షన్లకు ఐపీటీవీ (టీవీకి, ఫోన్‌కు పవర్ సప్లయి చేసే బాక్సులు) బాక్స్‌ల్లో వచ్చిన సాంకేతిక లోపాల వల్ల ప్రారంభంలోనే ఇన్స్టాల్ కాలేదు. పనిచేయని ఫోన్లు, కానరాని నగదు రహిత లావాదేవీలు నగదు రహిత లావాదేవీలు ప్రోత్సహించేందుకు మోరిలో 600 మందికి స్మార్ట్ ఫోన్లు అందజేశారు. ఇచ్చిన కొన్ని రోజులకే ఫోన్ స్విచ్ఆఫ్ అవడం, బ్యాటరీ ఉబ్బిపోవడం, తదితర సమస్యలతో చాలావరకు పనికిరాకుండా పోయాయి. గ్రామంలో మెడికల్, కిరాణా, కూరగాయలు, పాన్‌షాప్.. ఇలా అన్నీ కలిపి 39 వరకూ ఉన్నాయి. నగదురహిత లావాదేవీలంటూ కేవలం నలుగురికి మాత్రమే స్వైపింగ్ మిషన్లు ఇచ్చింది. ప్రస్తుతం అవి కూడా వినియోగించని పరిస్థితి నెలకొంది.దీంతో ప్రస్తుతం నగదు లావాదేవీలే జరుపుతున్నారు. స్వచ్ఛభారత్‌కు తూట్లు సంపూర్ణ పారిశుధ్యంలో భాగంగా నూరుశాతం బహిరంగ మలవిసర్జన రహిత గ్రామంగా మోరిని ప్రకటించారు. ఇందులో భాగంగా గ్రామంలో తొలి విడతగా 456 మరుగుదొడ్లు లేని నివాసాలను గుర్తించారు. ఇందులో నాలుగేళ్లలో 430 పూర్తిచేశారు. ఈలోపు కొత్తగా మరుగుదొడ్ల కోసం మరో 100 దరఖాస్తులు వచ్చాయి. బహిరంగ మల విసర్జన రహిత గ్రామంగా ప్రకటించినా అక్కడింకా మరుగుదొడ్లు లేని ఇళ్లు ఉన్నాయి. గ్రామాల్లో ఇంకా బహిరంగ మల విసర్జన కొనసాగుతూనే ఉంది.దీంతోపాటు ఎక్కడి చెత్త అక్కడే ఉండిపోతోంది. టీవీ కనెక్షన్లకు సాంకేతిక లోపాలు ‘‘ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ అమలు ప్రారంభంలోనే టీవీకి ఫైబర్ కేబుల్ వేసి కనెక్షన్ ఇచ్చారు. అయితే కొద్ది రోజులకే ఔటాఫ్ ఆర్డర్ అని వస్తోంది. టీవీని ఆన్ చేసిన వెంటనే స్క్రీన్‌పై నో ఇంటర్నెట్ ఏక్సెస్ అని వస్తుంది. ఇలా ఉంది మా ఊళ్లో ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్’’ అని చెబుతున్నారు గ్రామస్తులు. మోరి ప్రజలకు సినిమా చూపించారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మా ఊళ్లో భారీ బహిరంగ సభ పెట్టారు. స్మార్ట్ విలేజ్ అన్నారు. మోరి ప్రజలకు సినిమా చూపించారు. ఆయన చెప్పినవేవీ ఇక్కడ అమలు కాలేదు. –జాన శంకరరావు, మాజీ సర్పంచ్, మోరి, సఖినేటిపల్లి మండలం – కందుల శివశంకర్, సాక్షి ప్రతినిధి, కాకినాడ -
ఓడీఎఫ్..డబుల్ ప్లస్
సాక్షి, సిటీబ్యూరో: ‘స్వచ్ఛత’ విషయంలో నగరానికి అరుదైన గుర్తింపు లభించింది. స్వచ్ఛభారత్ మిషన్ హైదరాబాద్‌ను ‘ఓడీఎఫ్ (ఓపెన్ డిఫకేషన్ ఫ్రీ) డబుల్ ప్లస్’గా ప్రకటించింది. దేశంలోని ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూర్ వంటి ఏ మెట్రో నగరానికీ ఇలాంటి అవార్డు రాలేదు. నగరానికి ప్రస్తుతం లభించిన ఓడీఎఫ్ డబుల్‌ప్లస్ గుర్తింపు శాశ్వతంగా ఉండేందుకు ప్రజల సహకారం అవసరమని జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిశోర్ కోరారు. దేశంలో ఓడీఎఫ్ డబుల్ ప్లస్‌కు ఎంపికైన మూడు నగరాల్లో హైదరాబాద్‌లోనే ఎక్కువ జనాభా ఉందని, మన జనాభా కోటి కాగా, మిగతా రెండు నగరాలైన ఇండోర్, చండీగఢ్‌ల జనాభా 20 లక్షలపైచిలుకు మాత్రమేనన్నారు. ఈ గుర్తింపు ఎప్పటికీ కొనసాగేందుకు ప్రజలకు తగిన అవగాహన కార్యక్రమాలు అవసరమని అభిప్రాయపడ్డారు. ఇందుకుగాను ఫిబ్రవరి మొదటి వారం నుంచి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. స్వచ్ఛభారత్ మిషన్ అవార్డు ప్రకటన సందర్భంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆస్కి సహకారంతో గత రెండు నెలలుగా జీహెచ్ఎంసీ, జలమండలి పరస్పర సహకారంతో పనిచేయడం వల్ల ఇది సాధ్యమైందన్నారు. నగరంలో ప్రస్తుతమున్న టాయ్లెట్లు సరిపోవని, మరిన్ని పబ్లిక్ టాయ్లెట్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. తద్వారా మున్ముందు ఈ ర్యాంక్ కోల్పోకుండా ఉంటామన్నారు. దీంతోపాటు నానో వాహనం ద్వారా ఎలక్ట్రానిక్ మానిటరింగ్ చేయడం ద్వారా ఎక్కడైనా బహిరంగ మూత్రవిసర్జన జరిగితే గుర్తించి, జరిమానా విధింపు వంటి చర్యలు చేపడతామన్నారు. నిబంధనలు పాటించడం, తదితర అంశాలపై ప్రజలకు తగిన అవగాహన ఉంటేనే క్లీన్ అండ్గ్రీన్సిటీ వంటివి సాధ్యమంటూ, అందుకుగాను అవగాహన కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తామని స్పష్టం చేశారు. నగరంలో 9వేల కి.మీ.ల రహదారులుండగా, ప్రధాన రహదారులపై, బస్టాండ్లు, ఆటోస్టాండ్లు తదితర ప్రాంతాల్లో తప్పనిసరిగా పబ్లిక్ టాయ్లెట్లు ఉండాలన్నారు. వీలైనన్ని ఎక్కువ ప్రదేశాల్లో పబ్లిక్ టాయ్లెట్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఇందుకుగాను సర్వే నిర్వహిస్తామన్నారు. పెట్రోలుబంకులు, హోటళ్లలోని టాయ్లెట్లను ప్రజలు వినియోగించుకునేందుకు అనుమతించాల్సిందిగా కోరినప్పటికీ ఆశించిన మేరకు ఫలితమివ్వలేదన్నారు. దీన్ని కచ్చితంగా అమలు చేసేందుకు గాను తగిన చర్యల కోసం విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. బహిరంగ మూత్ర విసర్జనను నివారించేందుకు ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్నీ వినియోగించుకుంటామన్నారు. బహిరంగ మూత్ర విసర్జనకు పాల్పడ్డవారిపై 617 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. నగర జనాభా పెరుగుతున్నందున అందుకనుగుణంగా ట్రెంచ్‌లెస్ టెక్నాలజీతో సివరేజి వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. కలుషిత జలాల నివారణకు భోలక్‌పూర్‌లో రూ.20.8 కోట్లతో కొత్త పైప్లైన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రూ.6వేల కోట్లతో సివరేజి మాస్టర్‌ప్లాన్ నగరంలో సివరేజి వ్యవస్థను మెరుగుపరచేందుకు సీఎస్సార్ ద్వారా కార్పొరేట్ సంస్థల సహకారం పొందనున్నట్లు కమిషనర్ దానకిశోర్ తెలిపారు. సివరేజి ప్లాంట్ల ఏర్పాటు కానీ, నిర్వహణ కానీ చేసేందుకు కొన్ని సంస్థలు ఆసక్తి కనబరిచాయన్నారు. నగరానికి ఓడీఎఫ్ డబుల్‌ప్లస్ లభించడంతో పారిశుధ్య నిర్వహణకు కేంద్రం ప్రోత్సాహక నిధులివ్వనుందన్నారు. గ్రేటర్లో దాదాపు రూ.6 వేల కోట్లతో సివరేజి మాస్టర్‌ప్లాన్ పనులు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. స్వచ్ఛభారత్‌కు 250 మార్కులు.. ఓడీఎఫ్ డబుల్‌ప్లస్ గుర్తింపు పొందిన నగరాలకు స్వచ్ఛ భారత్ ర్యాంకింగ్‌లలో 250 మార్కులు లభిస్తాయి. దీంతో నగరానికి స్వచ్ఛభారత్‌లోనూ మెరుగైన ర్యాంకుకు మార్గం సుగమమైనట్లు అధికారులు పేర్కొన్నారు. తనిఖీల్లో భాగంగా స్వచ్ఛభారత్ మిషన్ ప్రతినిధుల బృందం నగరంలోని 45 పబ్లిక్/కమ్యూనిటీ టాయ్లెట్లను పరిశీలించింది. 18 టాయ్‌లెట్లలోని పరిస్థితుల్ని తనిఖీ చేసింది. వాటిల్లో 12 ఎక్సలెంట్‌గా, 1 చాలా శుభ్రంగా, 5 తగిన విధంగా ఉన్నాయని అభిప్రాయపడింది. గుర్తింపు ఇలా... స్వచ్ఛ భారత్ మిషన్ ఆర్నెళ్లకోమారు తనిఖీలు చేసి ఓడీఎఫ్ నగరాలుగా ప్రకటిస్తుంది. ఒకసారి గుర్తింపు పొందిన నగరాల్లో తిరిగి పరిస్థితులు బాగులేకుంటే ఇచ్చిన గుర్తింపు ఆటోమేటిక్‌గా రద్దవుతుంది. 2017 డిసెంబర్లో ఓడీఎఫ్ నగరంగా ఎంపికైన హైదరాబాద్ మహానగరం తాజాగా ఓడీఎఫ్ డబుల్‌ప్లస్ నగరంగా ఎంపికైంది. బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత నగరాలకు ఓడీఎఫ్, బహిరంగ విసర్జకు జరిమానాలు విధించే నగరాలకు ఓడీఎఫ్ ప్లస్, మానవ విసర్జిత వ్యర్థాలను శాస్త్రీయంగా ట్రీట్మెంట్ చేసే సదుపాయాలుండటంతో పాటు ట్రీట్మెంట్ ప్లాంట్లకు పంపించే సదుపాయాలున్న నగరాలకు ఓడీఎఫ్ డబుల్‌ప్లస్ నగరాలుగా గుర్తింపునిస్తారు. జీహెచ్ఎంసీ కమిషనర్‌గా, జలమండలి ఎండీగా దానకిశోరే ఉండటంతో 18 ఎస్టీపీల్లో మానవ విసర్జితాల ట్రీట్మెంట్ సదుపాయాలు కల్పించడంతోపాటు సెప్టిక్‌ట్యాంకుల నుంచి విసర్జితాలను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ఉండేందుకు సెప్టిక్ట్యాంకర్ వాహనాలకు లైసెన్సులిచ్చే విధానాన్ని ప్రవేశపెట్టడం తదితర చర్యలు తీసుకున్నారు. దీంతో నగరం ఓడీఎఫ్నుంచి నేరుగా ఓడీఎఫ్ డబుల్ ప్లస్‌గా ఎంపికైంది. -
పురపాలికల్లో ‘స్వచ్ఛ సర్వేక్షన్’
సాక్షి, కల్వకుర్తి టౌన్: కేంద్ర స్వచ్ఛ భారత్ మిషన్, పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చేపట్టనున్న స్వచ్ఛ సర్వేక్షన్ –2019 పోటీలకు పురపాలికలు ముస్తాబవుతున్నారు. కేంద్రం నుంచి వచ్చిన కార్వే కన్సల్టెన్సీ బృందం సభ్యులు ఆయా మున్సిపాలిటీల్లో పర్యటిస్తూ, స్వచ్ఛతపై వివరాలు సేకరిస్తారు. ఈ బృందం కాలనీల్లో అక్కడి పరిస్థితులకు అనుగుణంగా వివరాలు సేకరించడంతోపాటు స్థానికుల నుంచి వివరాలు తీసుకుని కేంద్రానికి పంపిస్తారు. వీరు సేకరించే వివరాల ఆధారంగానే కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షన్ ర్యాంక్‌లను ప్రకటిస్తుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో స్వచ్ఛ సర్వేక్షన్–2019 పోటీలకు తొమ్మిది పురపాలికలు, ఒక మేజర్ మున్సిపాలిటీలు సన్నద్ధం అవుతున్నాయి. పోటీల్లో అత్యుత్తమ ర్యాంక్ సాధించేందుకు అధికార యంత్రాగం కసరత్తు ప్రారంభించింది. స్వచ్ఛత ప్రణాళికపై దృష్టి కేంద్రీకరించింది. ఇటీవల కేంద్రం థర్ట్ పార్టీ బృందం రాష్ట్రవ్యాప్తంగా నగరాలు, పట్టణాలలో సర్వే నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆయా మున్సిపాలిటీల కమిషనర్లు స్వచ్ఛ సర్వేక్షన్‌లోని మార్గదర్శకాలపై శానిటరీ ఇన్స్పెక్టర్లు, జవాన్లకు దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో ఆయా మున్సిపాలిటీల కమిషనర్లు స్వచ్ఛ సర్వేక్షన్‌లోని మార్గదర్శకాలపై శానిటరీ ఇన్స్పెక్టర్లు, జవాన్లకు దిశానిర్దేశం ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా నగరాలు, పట్టణాలను స్వచ్ఛమైన నివాస ప్రాంతాలుగా మార్చాలన్న లక్ష్యంతో మున్సిపాలిటీలలో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. గతంలో 2016, 2017, 2018లో సాధించిన ర్యాంకుల కంటే ఉత్తమంగా 2019 ఏడాదిలో ర్యాంకు సాధించాలన్న సాధనలో ప్రత్యేక ప్రణాళిక లక్ష్యాల తయారీలో నిమగ్నమయ్యారు. మిగిలింది 25 రోజులే.. దేశవ్యాప్తంగా స్వచ్ఛ సర్వేక్షన్–2019 పోటీలో 4,231నగరాలు, పట్టణాలు పోటీపడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా పోటీ పెరిగింది. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల అధికారులు విరామం లేకుండా ప్రజల్లో అవగాహన కల్పిస్తూ, శ్రమిస్తూ ఉత్తమ స్వచ్ఛ నగర కల సాకారం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. వచ్చే జనవరి 4 నుంచి ఫిబ్రవరి 4వ తేదీలలో ఎప్పుడైనా స్వచ్ఛ సర్వేక్షన్ థర్డ్ పార్టీ క్యూసీఐ బృందాలు నగరాలు, పట్టణాలను తనిఖీ చేస్తాయి. స్వచ్ఛ సర్వేక్షన్‌కు వస్తున్న బృందాల్లో అసెసర్లు, నగరంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తారు. ప్రజల అభిప్రాయాలు, వ్యక్తిగత మరుగుదొడ్లు, పబ్లిక్ టాయిలెట్ల పరిశుభ్రత, దేవాలయాలు, మసీదు, చర్చీలు, ఆర్టీసీ బస్ స్టేషన్లు, రైలు స్టేషన్లు, చెత్త సేకరిస్తున్న విధానం, అందుకు వినియోగిస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది, సేకరించిన చెత్త నిత్వ కేంద్రాలు, చెత్త ప్రాసెసింగ్ తదితర వివరాలను మదింపు చేస్తారు. ప్రత్యేక ప్రశ్నావళి ద్వారా ప్రజలను ప్రశ్నించి, వివరాలు రాబడుతారు. స్వచ్ఛ సర్వేక్షన్ నిర్వహించే అధికారులు, క్యూసీఐ అధికారులు ప్రతి మున్సిపాలిటీని నాలుగు విభాగాలుగా విభజించి, వాటికి తగిన మార్కులను కేటాయిస్తారు. అందులో సర్వీస్ లెవల్ చెంచ్ మార్కుకు 1,250 మార్కులు, థర్డ్ పార్టీ అసెసర్ల పరిశీలన ద్వారా 1,250 మార్కులు, సిటిజన్ ఫీడ్ బ్యాక్ ద్వారా 1,250 మార్కులు, సర్టిఫికెట్, ఓడీఎఫ్, గ్యార్బేజీ, ఫ్రీసిటీ, కెపాసిటీ బిల్డింగ్ ద్వారా 1,250మార్కులను కేటాయించి, ర్యాంకులు ప్రకటిస్తారు. ఉమ్మడి జిల్లాలో గతేడాది ర్యాంక్‌లు ఉమ్మడి పాలమూరు జిల్లాలో మేజర్ మున్సిపాలిటీ మహబూబ్‌నగర్‌తో పాటు పురపాలికలు నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట, కల్వకుర్తి, వనపర్తి, నారాయణపేట, బాదేపల్లి, అయిజ, గద్వాల, షాద్‌నగర్ ఉన్నాయి. లక్ష జనాభాకు తక్కువ ఉన్న మున్సిపాలిటీలను జోనల్ ర్యాంకింగ్ ద్వారా, లక్ష జనాభాకు పైబడి ఉన్నవారిని నేషనల్ ర్యాంకింగ్ ద్వారా ప్రకటిస్తారు. 2018లో ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షన్లో మహబూబ్‌నగర్ మేజర్ మున్సిపాలిటీ జాతీయ ర్యాంకుల్లో 2,253.33 మార్కులతో 161 స్థానంలో నిలిచింది. జోనల్ ర్యాంకింగ్‌లో ప్రస్తుతం మహబూబ్‌నగర్ జిల్లా నుంచి విడిపోయి రంగారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న షాద్‌నగర్ మున్సిపాలిటీ 2,416 మార్కులతో 12ర్యాంకు సాధించింది. అలాగే నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ 2,207 మార్కులతో 33వ స్థానంలో, కొల్లాపూర్ 1,942 మార్కులతో 99వ ర్యాంక్, అచ్చంపేట 1814 మార్కులతో 161, గద్వాల 1,592 మార్కులతో 333, నారాయణపేట 1,577 మార్కులతో 352, బాదేపల్లి 1,50తో 409, వనపర్తి1,432 మార్కులతో 541, కల్వకుర్తి 1,363తో 635, అయిజ 1,224తో 818ర్యాంకుల్లో నిలిచాయి. ప్రజలను జాగృతం చేయాలి.. పురపాలికల్లో బహిరంగ మలమూత్ర విసర్జనను వంద శాతం నిషేధించాలి. ప్రతి ఇంటి నుంచి తడి, పొడి చెత్తను వేరు చేసి అందించాలి. వేరు చేసేలా పారిశుద్ధ్య కార్మికులు బాధ్యతగా తీసుకొని చేయించుకోవాలి. ప్రజల ఫీడ్‌బ్యాక్ నివాసాల పరిశుభ్రతపై అప్రమత్తం చేయాలి. గతేడాది కంటే బహిరంగ మలమూత్ర విసర్జనలో అన్ని మున్సిపాలిటీలు ఓడీఎఫ్‌ను ప్రకటించాయి. ఇంటింటా తడి, పొడి చెత్త వంద శాతం జరగడం లేదు. సేకరించిన తడిచెత్తను శుద్ధీకరణలో బాగా వెనకబడిపోయాం. ప్లాంట్లు నిర్మించడంలో అధికారులు అలసత్వాన్ని ప్రదర్శించారు. అంతేగాక ఇప్పటికే అన్ని మున్సిపాలిటీలను ఓడీఎఫ్‌గా ప్రకటించినా, బహిరంగ మలమూత్ర విసర్జన మాత్రం ఇంకా జరుగుతూనే ఉంది. చాలా మంది ప్రజలు వ్యక్తిగత మరుగుదొడ్లు లేకపోవడంతో ఇంకా బయటికే మలమూత్ర విసర్జనకు వెళుతున్నారు. అధికారులు మాత్రం గొప్పగా ఓడీఎఫ్ ప్రకటించామని చేతులు దులుపుకుంటున్నారు.సెఫ్టిక్ ట్యాంకులు లేకుండా చాలా ఇళ్ల నుంచి మలమూత్ర వ్యర్థాలు మురుగుకాల్వలోకి పారుతున్నాయి. ప్లాస్టిక్ వాడకం నిషేధంలో ఉంది. ఈ పరిమాణాలు మార్పులకు గండి కొట్టనున్నాయి. అందువల్ల అధికార యంత్రాంగం స్వచ్ఛ సర్వేక్షన్పై శ్రమించి, ప్రజలను జాగృతం చేయాల్సి అవనసరం ఎంతైనా ఉంది. -
అత్యంత సుందరమైన రైల్వే స్టేషన్లు ఇవే
ముంబై : దేశంలోని అత్యంత సుందరమైన రైల్వే స్టేషన్ల జాబితాను రైల్వే మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. శుభ్రత, పారిశుద్ధ్యతా ప్రమాణాల ఆధారంగా రూపొందించిన ఈ జాబితాలో మహారాష్ట్రలోని చంద్రాపూర్, బల్లర్షా స్టేషన్లు ప్రథమ స్థానాన్ని పొందాయని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి సుధీర్ ముంగటివార్ గురువారం తెలిపారు. తమ రాష్ట్రంలోని రెండు స్టేషన్లు సుందరమైన స్టేషన్లుగా ఎంపికైనందుకు రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ తనను అభినందించారని సుధీర్ సంతోషం వ్యక్తం చేశారు. చంద్రాపూర్ జిల్లాకు గార్డియన్ మినిస్టర్‌గా వ్యవహరిస్తున్న సుధీర్ మాట్లాడుతూ.. ఏడాది క్రితమే చంద్రాపూర్, బల్లర్షా స్టేషన్ల సుందరీకరణ పనులు చేపట్టామని పేర్కొన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా నాగ్‌పూర్ ప్రభుత్వ చిత్రకళా మహావిద్యాలయ నుంచి కళాకారులను పిలిపించామన్నారు. వీరి ప్రతిభతో.. బల్లర్షా ఫుటోవర్ బ్రిడ్జిపై చిత్రించిన పులి బొమ్మ ప్రస్తుతం సెల్ఫీ పాయింట్‌గా మారిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. సుందరమైన రైల్వేస్టేషన్ల జాబితాలో కొన్ని.. 1. చంద్రాపూర్, బల్లార్షా(మహారాష్ట్ర) 2. మధుబని(బిహార్), మధురై(తమిళనాడు) మధుబని, బిహార్ మధురై, తమిళనాడు 3. గాంధీధామ్(గుజరాత్), సికింద్రాబాద్(తెలంగాణ), కోట(రాజస్థాన్) గాంధీధామ్(గుజరాత్) సికింద్రాబాద్(తెలంగాణ) కోట(రాజస్థాన్) -
ఆదర్శం..ఆదివారంపేట
ముత్తారం(మంథని): ఉమ్మడి ముత్తారం మండలంలోని ఆదివారంపేట జిల్లాస్థాయిలో గుర్తింపు పొందింది. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్వచ్ఛభారత్ మిషన్(జీ)నిర్వహణలో జిల్లాస్థాయిలో ప్రథమస్థానంలో నిలిచింది. పరిసరాల పరిశుభ్రత, సంపూర్ణ పారిశుద్ధ్యం, పన్నుల వసూళ్లు, హరితహారం, ఉపాధిపనుల లక్ష్యాన్ని సాధించినందుకు ఈ అవార్డు వరించింది. ఈ మేరకు కలెక్టర్ గ్రామాభివృద్ధికి రూ. 10 లక్షలు నజరానా ప్రకటించారు. అంతా 100శాతం... గ్రామంలో మరుగుదొడ్డి లేని ఇళ్లులేదు. ప్రతి వీధిలో సీసీరోడ్లు పరిశుభ్రంగా దర్శనమిస్తాయి. సంపూర్ణ పారిశుద్ధ్యంలో జిల్లాలోనే ఆదర్శంగా ఉంది. సుమారు 58 ఇంకుడుగుంతల నిర్మాణం పూర్తి అయ్యింది. మరో 100వరకు ప్రగతిలో ఉన్నాయి. స్మశాన వాటిక నిర్మాణం, దోభీఘాట్, పశువుల తొట్టె, స్నానాల గట్టం, డంపింగ్ యార్డ్, మినరల్ వాటర్ ప్లాంట్, ఎల్ఈడీ వీధిదీపాలు ఏర్పాటు చేసుకున్నారు. దీంతో గతేడాది జాతీయ గ్రామీణ నిర్మల్ పురస్కార్ అవార్డ్‌కు ప్రతిపాదనలు పంపారు. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆధ్యక్షతన గతేడాది అక్టోబర్ 11న అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్లో నిర్వహించిన జాతీయ సమ్మేళనానికి ఆదివారంపేట సర్పంచ్ మైదం కుమార్‌కు ఆహ్వానం అందగా పాల్గొన్నారు. పథకాలు ఆన్లైన్... ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలును గ్రామంలో సమర్థ్ధవంతంగా నిర్వర్తించారు. ఎప్పటికప్పుడు ఆయా పథకాల అమలు తీరును ఆన్లైన్ చేయయడంలో జిల్లాలోనే ఆదివారంపేట సర్పంచ్ మందజలో ఉన్నారు. దీంతో అధికారులు జాతీయ సమ్మేళనానికి ఎంపిక చేశారు. గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తూ..శభాష్ అనిపించుకుంటున్నారు. గ్రామస్తుల సహకారంతో.. గ్రామస్తుల సహకారంతోనే గ్రామాన్ని అన్నిరంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దడం జరిగింది. గ్రామస్తులు ప్రోత్సాహంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. దీంతో ఆదివారంపేట జిల్లాలోనే ఉత్తమ గ్రామపంచాయతీగా ఎంపికైయ్యింది.– మైదం కుమార్,సర్పంచ్ ఆదివారంపేట అన్నిరంగాల్లో ఆదర్శం పరిసరాల పరిశుభ్రత, సంపూర్ణ పారిశుద్ధ్యంలోనే కాదు అభివృద్ధిలోను ఆదివారంపేట ఆదర్శంగా నిలుస్తోంది. గ్రామంలో ప్రజల మౌలిక అవసరాలకు అనుకూలంగా అన్ని నిర్మాణాలు చేపట్టడం జరిగింది. జిల్లాలోనే ఉత్తమ గ్రామపంచాయతీగా ఎంపిక కావడం గ్రామస్తుల అదృష్టం.– కలవేన సదానందం, స్థానికుడు ప్రొఫైల్ జనాభా: 1964 మహిళలు: 957 పురుషులు: 1007 ఇళ్లు: 567 మరుగుదొడ్లు: 100శాతం సీసీ రోడ్లు: 100శాతం అంగన్వాడీ కేంద్రాలు: 2 ప్రభుత్వ పాఠశాలలు: 1 -
ఒట్టు.. వెదికినా దొరకదు టాయ్లెట్టు
ఇది మహానగరం బాస్.. ఆకాశాన్నంటే మేడలుంటాయ్.. అద్భుతాల జాడలుంటాయ్.. హైటెక్ రోడ్లుంటాయ్.. రాత్రికి, పగలుకు తేడా తెలియని విద్యుత్ వెలుగులుంటాయ్.. అడుగడుగునా జనం.. వారి అవసరాలు తీర్చుకోవడానికి ఒక్క మరుగుదొడ్డీ కనిపించదు. రోడ్డుపై కాలు కదపలేనంతగా వాహనాల తోరణాలు.. చేసేది లేక ఆ పక్కనే కడుపు ఉబ్బరం తీర్చుకునే వారు.. ఏం చేస్తారు పాపం.. కంపును ఇంపుగా భావించి పని కానిస్తారు. ఎందుకంటే ఇది మహానగరం.. ఎల్బీనగర్ నుంచి పటాన్చెరు వరకు.. కుత్బుల్లాపూర్ నుంచి గచ్చిబౌలి వరకు.. భూతద్దం పెట్టి వెదికినా ఒక్క పబ్లిక్ టాయ్‌లెట్టూ కనిపించదు. ఇక్కడే రాష్ట్రాన్ని పాలించే నేతలుంటారు.. శాసనాలు చేసే మేధావులుంటారు.. ప్రజా అవసరాలు తీర్చే అధికారులుంటారు.. వారెవరికీ సామాన్యుడి కష్టాన్ని అర్థం చేసుకునే తీరిక లేదు. వారంతా అంతర్జాతీయ సదస్సుల నిర్వహణకు వ్యూహాలు రచిస్తుంటారు. ఐటీలో అంతర్జాతీయ ఖ్యాతినార్జించే పనిలో ఉంటారు.. సామాన్య ప్రజల కోసం రోడ్డు పక్కన టాయ్లెట్లు కట్టాలనే చిన్న ఆలోచనే రాదు. కోటి మంది జనాభా అవసరాలు తీర్చేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఉంది. సిటీని అద్భుతంగా మార్చే యంత్రాంగం ఉంది. ‘స్వచ్ఛ హైదరాబాద్’ కోసం రేయింబవళ్లు తపన పడుతుంటుంది. నగరంలో బహిరంగ మలమూత్ర విసర్జన చేస్తే శిక్ష తప్పదంటుంది. అడుగడుగునా అందమైన టాయ్లెట్లు కట్టామంటుంది. కోటిమందికి 382 మూత్రశాలలు అందుబాటులో ఉన్నాయంటుంది. ఎక్కడున్నాయంటే కాగితంపై లెక్కలు చూపిస్తారు. ఎన్ని వినియోగంలో ఉన్నాయంటే మాత్రం సమాధానం ఉండదు. ప్రస్తుతం సిటీలో ఐదు కిలో మీటర్లకు ఒక్క టాయ్‌లెట్టూ కనిపించదు. ఉన్నవాటిలోకి వెళితే.. ముక్కు పగిలే కంపుతో కళ్లు తిరిగి పడిపోవాల్సిందే. మరి సామాన్యుడి కనీస కష్టం తీర్చుకునేదెలా..! రాష్ట్ర అభివృద్ధి కోసం ఏటా లక్షన్నర కోట్ల బడ్జెట్ ప్రవేశ పెట్టే నేతలు.. అందులో పైసా వంతు విదిల్చితే చాలు.. రాష్ట్ర రాజధాని నగరంలో వేలాది పబ్లిక్ టాయ్లెట్లు నిర్మించవచ్చు. సామాన్యుల కష్టాలు తీర్చవచ్చు. సాక్షి, సిటీబ్యూరో/నెట్వర్క్: సైదాబాద్ నుంచి బంజారాహిల్స్‌కు బైక్‌పై బయల్దేరిన రాజేశ్‌కు చంచల్‌గూడ దాటాక టాయ్‌లెట్‌కు వెళ్లాల్సిన అవసరం ఏర్పడింది. కనుచూపు మేరలో ఎక్కడా కనబడలేదు. బంజారాహిల్స్ చేరేంతవరకు ఎక్కడైనా కనబడతాయేమోనని రోడ్డు పక్కన వెతుకుతూనే ఉన్నాడు. ఈ క్రమంలో తృటిలో ఒక యాక్సిడెంట్ తప్పింది. ...ఈ పరిస్థితి ఒక్క రాజేశ్‌దే కాదు. నగరంలో వివిధ పనుల నిమిత్తం బయటకు వెళ్లేవారు, ఇతర ప్రాంతాలనుంచి వచ్చేవారు ఎందరో ఎదుర్కొంటున్న సమస్య ఇది. జీహెచ్ఎంసీ జనాభా దాదాపు కోటి దాటగా, నగర ప్రజలతోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారితో సహ ప్రతిరోజూ దాదాపు 15 లక్షల మంది రోడ్లపై ప్రయాణిస్తున్నారు. వీరికి సరిపడా పబ్లిక్ టాయ్లెట్లు లేక అవస్థలు పడుతున్నారు. కిలోమీటర్ల కొద్దీ పబ్లిక్ టాయ్లెట్లు కనిపించక అల్లాడుతున్నారు. గంటలకొద్దీ ఉగ్గబట్టుకుంటుండంతో మూత్ర సంబంధ వ్యాధుల బారిన పడుతున్నారు. మహిళల పరిస్థితి మరింత దుర్భరం. షీ టాయ్లెట్లంటూ ఇటీవల కొన్నిప్రాంతాల్లో మాత్రమే ఏర్పాటు చేసినా అవి ఏమూలకూ చాలడం లేవు. ఉన్నవాటిల్లో యాభై శాతం వరకు నిర్వహణ లోపంతో దుర్గంధం వెదజల్లుతున్నాయి. దీంతో కొందరు, యూజర్ ఛార్జీలు చెల్లించలేక మరి కొందరు బహిరంగ విసర్జనకు పాల్పడుతున్నారు. జీహెచ్ఎంసీలో ఉన్న 1450 పబ్లిక్ టాయ్లెట్ల యూనిట్లతోపాటు, హోటళ్లు, పెట్రోలు బంకుల వారిని ఒప్పించి మరో 500 పైగా పబ్లిక్ టాయ్లెట్లను ప్రజలు వినియోగించుకునేలా అందుబాటులోకి తెచ్చామని జీహెచ్ఎంసీ చెబుతోంది. హోటళ్లు, పెట్రోలు బంకుల్లోని వాటిని ఉచితంగానే వినియోగించుకునే ఏర్పాట్లు చేశామంటోంది. అయితే వాటిని వినియోగించుకోవచ్చుననే బోర్డులు లేకపోవడంతో ప్రజలకు తెలియడం లేదు. దీంతో ఎక్కడ పడితే అక్కడ మల, మూత్ర విసర్జనలతో నగరం అధ్వాన్నంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ‘సాక్షి’ ఫీల్డ్ విజిట్ నిర్వహించగా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. అర కిలోమీటర్‌కో యూరినల్స్ ఎక్కడ ? ♦ స్వచ్ఛభారత్ మిషన్ మార్గదర్శకాల మేరకు ప్రతి అర కిలోమీటరుకు యూరినల్స్, కిలోమీటర్‌కు మరుగుదొడ్లు ఉండాలి. కానీ నగరంలో ఏ ఒక్క మార్గంలోనూ ఈమేరకు లేవు. ఎల్బీనగర్ నుంచి గచ్చిబౌలి వరకు, కోఠి నుంచి మియాపూర్ వరకు, మల్కాజిగిరి నుంచి చార్మినార్ వరకు మార్గదర్శకాల కనుగుణంగా లేవు. దాదాపు 5 నుంచి 10 కిలోమీటర్ల వరకు కూడా ఒక్క టాయ్‌లెట్ కూడా లేని మార్గాలెన్నో. ♦ సైదాబాద్ నుంచి బంజారాహిల్స్‌కు 12 కి.మీ.ల దూరం ఉండగా, చంచల్‌గూడ జైలు వద్ద తప్ప మరెక్కడా పబ్లిక్ టాయ్లెట్లు లేవు. ♦ సాగర్ రింగ్‌రోడ్డు నుంచి బంజారాహిల్స్‌కు వచ్చేవారికి చంపాపేట, కోఠిలో తప్ప మరెక్కడా పబ్లిక్ టాయ్లెట్లు లేవు. ♦ చాదర్‌ఘాట్ నుంచి చైతన్యపురి వరకు లేవు. దిల్సుఖ్నగర్ నుంచి కోఠివైపు వచ్చేవారికి మూసారంబాగ్, మలక్‌పేటల్లో మాత్రం ఉన్నాయి. ఇతర ప్రాంతాల్లో లేవు. ♦ ఐడీపీఎల్వద్ద పబ్లిక్ టాయ్లెట్లోకి ప్రజలు వెళ్లడానికి వీల్లేకుండా ఆటోలు అడ్డు ఉంటున్నాయి. ♦ రాయదుర్గం నుంచి గోపన్‌పల్లి వరకు, రాయదుర్గం నుంచి బీహెచ్ఈఎల్ వరకు ఉన్న పది పెట్రోల్‌బంకుల్లో ‘జీహెచ్ఎంసీ టాయ్లెట్లు’ అని ఉన్నప్పటికీ, ఎక్కడా టాయ్లెట్లను ఉచితంగా వినియోగించుకోవచ్చునని బోర్డులు లేవు. ♦ కూకట్‌పల్లిలో పెట్రోల్ బంకుల్లో ఉచిత మూత్రశాలలు ఎక్కడా లేవు. సిబ్బందికోసం ఏర్పాటు చేసినివి సైతం ప్రజలకు కనిపించడం లేదు. ♦ టోలిచౌకి చౌరస్తా వద్ద మూడు ప్రధాన బస్టాపులున్నాయి. మెహదీపట్నం, గచ్చిబౌలి, గండిపేట వైపు వెళ్లే బస్సుల్లో ప్రతి గంటకు వేలాదిమంది రాకపోకలు సాగిస్తారు. ఇంత రద్దీ ప్రాంతంలో ఎలాంటి టాయ్లెట్లు లేవు. గోల్కొండ, టోలిచౌకి, షేక్పేటల వద్ద ఒక్క షీటాయ్లెట్ కూడా లేకపోవడంతో మహిళలు అవస్థలు వర్ణనాతీతం. ♦ కుత్బుల్లాపూర్ పరిధిలోని 14 పెట్రోల్ బంకుల్లో స్వచ్ఛ టాయ్లెట్లు ఏర్పాటు చేసినప్పటికీ, రెండు చోట్ల తప్ప మిగతా ప్రాంతాల్లో నిర్వహణ లేక ప్రజలు వినియోగించుకోవడం లేదు. ♦ రాయదుర్గం, సైబరాబాద్ కమిషనరేట్, అంజయ్యనగర్, సుదర్శన్నగర్లలో స్వచ్ఛ టాయ్లెట్లు ఏర్పాటు చేసినప్పటికీ కొద్దిరోజులకే వాటిని తొలగించారు. ♦ హిమాయత్‌నగర్ ప్రధాన రహదారిలో ఒక్క టాయ్‌లెట్ కూడా లేదు. ♦ నారాయణగూడ, బషీర్‌బాగ్, కింగ్‌కోఠి పరిసర ప్రాంతాల్లో విద్యార్థులతో సహ లక్షల మంది రాకపోకలు సాగిస్తుంటారు.వీరందరికీ ఇక్కడ ఉన్న రెండు పబ్లిక్ టాయ్‌లెట్లే దిక్కు ♦ ఉప్పల్‌లో స్వచ్ఛ టాయ్లెట్లు ఉన్నప్పటికీ డబ్బులు ఇవ్వలేక గ్రామాల నుంచి వచ్చే ప్రజలు రోడ్లపైనే మూత్రవిసర్జన చేస్తున్నారు. ♦ కాప్రా సర్కిల్లోని 20 హోటళ్లు, 12 పెట్రోలు బంకుల్లో ఎక్కడా ఉచిత సదుపాయం అనే సూచికలు లేవు. ♦ కుషాయిగూడలో హోటళ్లు, పెట్రోలు బంకుల వద్ద టాయ్లెట్లను ఉపయోగించుకోవచ్చునని బోర్డులు ఏర్పాటు చేసి, కొద్దిరోజులకే తొలించారు. ♦ పాతబస్తీలోని చాంద్రాయణగుట్టనుంచి నయాపూల్ వరకు 16 పెట్రోల్బంకులుండగా, నాలుగు చోట్ల బోర్డులున్నాయి. ♦ ఎర్రగడ్డనుంచి అమీర్‌పేట వరకు ప్యారడైజ్ నుంచి బేగంపేట్ వరుణ్‌మోటార్స్ వరకు ఎలాంటి టాయ్లెట్లు లేవు. ఈ ప్రాంతంలోని ఆయా రహదారుల్లో ఏడు పెట్రోల్‌బంకులు, 30 హోటళ్లలో ఏఒక్క దాంట్లోనూ ఉచిత సదుపాయం ఉన్నట్లు బోర్డులు లేవు. ఒక వేళ వెళ్దామనుకున్నా సిబ్బంది అడ్డుపడుతున్నారని ప్రజలు వాపోతున్నారు. ♦ నేరేడ్మెట్ చౌరస్తా నుంచి ఈసీఐఎల్ రహదారి, ఆర్కేపురం రహదారి, మల్కాజిగిరి నుంచి వాజ్‌పేయి నగర్ వరకు పబ్లిక్ టాయ్లెట్లు లేవు. షేక్‌పేట్ నాలా వద్ద ఫుట్‌పాత్ పై పని కానిస్తున్న దృశ్యం నిర్వహణ లోపం..దుర్గంధ భరితం.. పబ్లిక్ టాయ్లెట్ల నిర్వహణను ప్రైవేటుకిచ్చిన జీహెచ్ఎంసీ వాటిని తనిఖీలు చేయకపోవడంతో చాలా చోట్ల కనీస సదుపాయాలు లేక, దుర్గంధంతో, వినియోగానికి వీల్లేకుండా ఉన్నాయి. తక్కువ రద్దీ ప్రాంతాల్లో నిర్వహణకు ముందుకొచ్చే వారు కూడా లేకపోవడంతో మూతపడుతున్నాయి. జరిమానాల కొరడా..! పరిస్థితులిలా ఉండగా, బహిరంగ మూత్ర విసర్జన చేస్తే జరిమానాలు విధించనున్నట్లు జీహెచ్ఎంసీ మరోమారు హెచ్చరించింది. బహిరంగ మల,మూత్ర విసర్జన ప్రదేశాలు(ఓడీఎఫ్)గా దాదాపు 1800 ప్రాంతాల్ని ప్రకటించిన జీహెచ్ఎంసీ, ఆమేరకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. కేంద్రం నుంచి సర్టిఫికేషన్ కోసం ఈ చర్యలకు సిద్ధమైంది. ఇక పబ్లిక్ టాయ్లెట్ల నిర్వహణపై ప్రజల అభిప్రాయం తెలుసుకునేందుకు ప్రతి టాయ్‌లెట్ వద్ద ప్రత్యేకంగా ఫీడ్ బ్యాక్ బటన్ ఏర్పాటు చేస్తామని అధికారులు గతంలో ప్రకటించారు. కానీ ఎక్కడా పెట్టిన దాఖలాలు లేవు. ముంబైలో అంతస్తుల్లో .. ముంబై నగర జనాభా దాదాపు 2.30 కోట్లు ముంబైలో ప్రస్తుతం 11,170 పబ్లిక్ టాయ్‌లెట్లున్నాయి. బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) వచ్చే సంవత్సరం వీటి సంఖ్యను 18,818కి పెంచేందుకు సిద్ధమైంది. ఇందుకుగాను దాదాపు రూ. 376 కోట్లు ఖర్చు చేయనున్నారు. స్థలాభావంతో రెండు, మూడు అంతస్తుల్లో వీటిని నిర్మించాలని ప్రతిపాదించారు. ♦ మొత్తం 307 పబ్లిక్ టాయ్లెట్లలో 1450 యూనిట్లున్నాయి. ♦ వీటిల్లో యూరినల్స్‌కు రూ.2, మరుగుదొడ్లకు రూ. 5 నుంచి రూ. 7 వరకు చార్జీలు వసూలు చేస్తున్నారు. ♦ సౌత్‌జోన్ పరిధిలోకి వచ్చే పాతబస్తీ కేవలం 25 పబ్లిక్ టాయ్‌లెట్లే ఉన్నాయి. ♦ పెట్రోలు బంకులు : 469 ♦ టాయ్లెట్ల వినియోగానికి అంగీకరించినవి: 259 ♦ టాయ్‌లెట్ సదుపాయాలున్న హోటళ్లు : 900 ♦ వినియోగానికి అంగీకరించినవి :257 + ఆయా నగరాల జనాభా, పబ్లిక్ టాయ్లెట్ల యూనిట్లు దాదాపుగా.. ♦ ఢిల్లీ జనాభా : 2.70 కోట్లు ♦ పబ్లిక్ టాయ్లెట్లు : 5776 ♦ ముంబై జనాభా : 2.30 కోట్లు ♦ పబ్లిక్ టాయ్లెట్లు : 11,170 ♦ చెన్నయ్ జనాభా: 1.01 లక్షలు ♦ పబ్లిక్ టాయ్లెట్లు: 900 ♦ హైదరాబాద్ జనాభా: 1.02 కోట్లు ♦ పబ్లిక్ టాయ్లెట్లు : 1450 ప్రజల్లో పరివర్తన రావాలి పబ్లిక్ టాయ్లెట్లు లేనందునే బహిరంగ మూత్ర విసర్జన అనేది ఒక సాకు మాత్రమే. చాలా చోట్ల ఉన్న వాటిని వినియోగించుకోవడం లేదు. ప్రజల్లో మార్పు రానంత వరకు ఏమీ చేయలేం. కొందరి చేష్టల వల్ల ఎందరో ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నవాటిని వినియోగించుకోకుండా నిందలు వేయడం తగదు. పెట్రోలు బంకులు, హోటళ్ల వారిని ఒప్పించి టాయ్లెట్లను వినియోగించుకునే అవకాశం కల్పించాం. టాయ్లెట్ల అటెండెంట్లు శుభ్రంగా ఉండేందుకు దాదాపు 600 మందికి రెండు జతల తెల్లని దుస్తులు, టోపీ, బూట్లను సీఎస్సార్ ద్వారా పంపిణీ చేశాం. నిర్వహణపై శ్రద్ధ తీసుకుంటూ, తనిఖీలు నిర్వహిస్తున్నాం. యూజర్‌చార్జీలు చెల్లించలేని వారి కోసం విరాళాలిచ్చే వారిని ఆహ్వానిస్తున్నాం. తద్వారా ఉచిత సదుపాయం కల్పిస్తున్నాం. – డా.బి.జనార్దన్‌రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ -
చెత్తశుద్ధి కరువాయే.. భరించలేని బరువాయే
టన్నుల్లో పోగుపడి కొండల్లా పేరుకుపోతున్నచెత్త జిల్లాను వణికిస్తోంది. ఏళ్ల తరబడి డంపింగ్‌యార్డుల కోసం చేపట్టిన అన్వేషణ ఓ కొలిక్కిరావడం లేదు. దీంతో పాలకవర్గాలకు చెత్త నిర్వహణ తలనొప్పిగా మారింది. ఈలోగా పందులు, దోమల స్వైర విహారంతో ప్రజలు భయపడుతున్నారు. రోగాలు విజృంభిస్తున్నాయని ఆందోళన చెందుతున్నారు. స్వచ్ఛభారత్ అంటూ ప్రభుత్వాలు హడావుడి చేస్తున్నా టన్నుల్లో భారం.. కొంతైనా తరగడం లేదు. ప్రభుత్వానికి బొత్తిగా చెత్తశుద్ధిలేదంటూ ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు. ఆ వివరాలు ఇలా.. నగరంలో కార్మికులపై ఒత్తిడి ఏలూరు(సెంట్రల్): నగరపాలకసంస్థ పరిధిలో మొత్తం 50 డివిజన్లలో సుమారు 55 వేల ఇళ్లు ఉన్నాయి. రోజూ సుమారు 80 టన్నుల చెత్తను పారిశుద్ధ్య కార్మికులు సేకరిస్తున్నారు. ఈ చెత్తనంతా నగర శివారు పొణింగ్ ప్రాంతంలోని 18 ఎకరాల్లో ఉన్న డంపింగ్ యార్డుకు 18 ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. 190 మంది పర్మినెంట్ సిబ్బంది ఉండగా 270 మంది కాంట్రాక్ట్ సిబ్బంది నగరంలో పారిశుద్ధ్య పనుల్లో పాల్గొంటున్నారు. ఏటా పారిశుద్ధ్య పనులకు నగరపాలక సంస్థ రూ.30 లక్షలు ఖర్చు చేస్తోంది. నగరంలో 2.12 లక్షల మంది జనాభాకు గాను చెత్త సేకరణకు ఇంకా 100 మంది అదనపు సిబ్బంది అవసరమని అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. యనమదుర్రు కాలువగట్టుపై.. భీమవరం టౌన్: మున్సిపాలిటీ పారిశుద్ధ్య పనుల నిర్వహణలో ప్రత్యేక శ్రద్ధ కనబర్చడంతో రోడ్లపై చెత్త తగ్గినప్పటికీ గొల్లవానితిప్ప రోడ్డులోని యనమదుర్రు కాలువగట్టుపై గుట్టలుగా సుమారు కిలోమీటరు దూరం దర్శనమిస్తోంది. మున్సిపాలిటీకి నిధుల కొరతలేనప్పటికీ డంపింగ్‌యార్డును సమకూర్చుకోలేని పరిస్థితి. 25.64 చ.కిమీ కలిగిన పట్టణంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 1,47,188 మంది జనాభా ఉన్నారు. రోజుకు 81 టన్నుల చెత్తపోగవుతోంది. 417 మంది పారిశుద్ద్య సిబ్బంది రోజుకు 78.50 టన్నుల వ్యర్థాలను తొలగిస్తున్నారు. డంపింగ్‌యార్డు లేకపోవడంతో సేకరించిన చెత్తను ట్రాక్టర్లలో గొల్లవానితిప్పరోడ్డులోని యనమదుర్రు కాలువగట్టుపై డంప్ చేస్తున్నారు. ఇటీవల కేంద్రం నిర్వహించిన స్వచ్చ సర్వేక్షణ సర్వేలో పట్టణానికి 87వ ర్యాంకు లభించింది. 2007లో యనమదుర్రు గ్రామంలో రూ.80 లక్షలతో 14.5 ఎకరాలను డంపింగ్‌యార్డు నిమిత్తం మున్సిపాలిటీ కొనుగోలు చేసింది. అయితే కొందరు రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో సమస్య పెండింగ్‌లో ఉంది. తడి పొడి.. మొక్కుబడి తణుకు : పట్టణంలో మొత్తం 34 వార్డుల నుంచి నిత్యం దాదాపు 50 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతోంది. ఈ చెత్తను డంపింగ్ యార్డుకు తరలించేందుకు 8 ట్రాక్టర్లు, నాలుగు ఆటోలను వినియోగిస్తున్నారు. ఇందుకు ప్రత్యేకంగా తడి, పొడి చెత్తను సేకరించాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. తడి, పొడి చెత్త సేకరణపై అవగాహన కల్పించడానికి పురపాలక సంఘం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా మొత్తం నాలుగు డివిజన్లలో ప్రయోగాత్మకంగా తడి, పొడి చెత్త సేకరణ కార్యక్రమం తలపెట్టారు. ఈ పరిస్థితుల్లో 2004లోనే తణుకు పట్టణంలో చెత్త నుంచి ఎరువు తయారు చేసేందుకు ప్రత్యేక యూనిట్ నెలకొల్పినప్పటికీ ప్రస్తుతం వినియోగంలో లేదు. ఇందుకోసం 9 ఎకరాల్లో డంపింగ్ యార్డు నెలకొల్పగా చెత్తను మాత్రం రీ సైక్లింగ్ చేయకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కలగా విద్యుత్ ప్లాంట్ తాడేపల్లిగూడెం: సంవత్సరాలు గడుస్తున్నా గూడెం మున్సిపాలిటీకి డంపింగ్ కోసం స్థలం దొరకని పరిస్థితి. పట్టణంలో రోజుకు వచ్చే చెత్త 80 టన్నులు. ప్రస్తుతం చెత్తను విమానాశ్రయ భూములకు దగ్గరగా ఉన్న భూముల్లో దగ్గరగా డంప్ చేస్తున్నారు. 2014లో తాడేపల్లిగూడెం మండలం ఆరుగొలను ప్రాంతంలో మూడెకరాల 20 సెంట్ల భూమిని మున్సిపాలిటీ డంపింగ్ అవసరాల కోసం రూ.44 లక్షలు ప్రభుత్వానికి చెల్లించారు. వేస్టు ఎనర్జీ ప్లాంటు కోసం పట్టణంలో భూములను కేటాయించారు. అయినా అవి అమలులోకి రాలేదు. పైగా జిల్లాలో గుర్తించిన మునిసిపాలిటీల నుంచి చెత్తను గూడెం తరలించి, దాని నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయాలన్న ప్రాజెక్టు పట్టాలు ఎక్కలేదు. ఏటా మున్సిపాలిటీ పారిశుద్ధ్య నిర్వహణకు రూ.80 లక్షలు ఖర్చు చేస్తోంది. యార్డులు ఉన్నా యాతన పాలకొల్లు సెంట్రల్: మునిసిపల్ పరిధిలో 31 వార్డులకుగాను సుమారు 80 వేల మంది జనాభా ఉన్నారు. రోజుకు 30 టన్నుల చెత్త డంపింగ్‌యార్డుకు చేరుతోంది. ఇక్కడ డంపింగ్‌యార్డులు స్థానిక యడ్లబజారు సెంటర్, రామయ్య హాలు ఏరియాల్లో ఉన్నాయి. రెండు డంపింగ్‌యార్డులు చెత్తతో కొండలా పేరుకుపోయాయి. ఈ చెత్తను ప్రక్షాళణ చేయడంలో అధికారులు చేతులెత్తేస్తున్నారు. చెత్తను సేకరించడానికి మునిసిపాలిటీకి 6 ట్రాక్టర్లు, 4 ఆటోలు ఉన్నాయి. పారిశుద్ధ్య పర్మినెంటు కార్మికులు 92, కాంట్రాక్ట్ కార్మికులు 77 మంది.. మొత్తం 169 మంది కార్మికులు పనిచేస్తున్నారు. జనాభా పెరుగుతున్నారు తప్ప కార్మికులు మాత్రం పెరగడంలేదు. ఇంకా వేరుకాని చెత్త జంగారెడ్డిగూడెం: నగర పంచాయతీ పరిధిలో రోజూ సుమారు 10 టన్నుల చెత్తను సేకరిస్తున్నారు. ఊరి వెలుపల ఉన్న డంపింగ్‌యార్డుకు దీనిని తరలిస్తున్నారు. అయితే తడిపొడి చెత్తలను ఇంకా వేరుచేయడం లేదు. పట్టణంలో 20 వార్డుల్లో చెత్తను సేకరించేందుకు మొత్తం 89 కార్మికులు ఉండగా వీరిలో 83 మంది ఔట్ సోర్సింగ్‌పై పనిచేస్తున్నారు. చెత్తను తరలించేందుకు 3 ట్రాక్టర్లు, ఒక ఆటో, 46 రిక్షాలు ఉన్నాయి. పారిశుద్ధ్య నిర్వహణకు నెలకు రూ.13 లక్షలు.. ఏటా రూ.కోటిన్నర వరకూ వ్యయం అవుతోంది. పట్టణంలో ఈ నెల 31 వరకు ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ నిర్వహిస్తున్నారు. స్థలం దొరక్క ఇక్కట్లు నరసాపురం: నరసాపురంలో డంపింగ్‌యార్డ్ సమస్య దశాబ్దాలుగా ఉంది. 1956లో మునిసిపాలిటీ ఏర్పడింది. అప్పటి నుంచి డంపింగ్‌యార్డ్ లేదు. దీంతో నిబంధనలకు విరుద్దంగా గోదావరిగట్టునే చెత్తను డంప్ చేస్తున్నారు. డంపింగ్‌యార్డు స్థల సేకరణకు మునిసిపాలిటీ వద్ద నిధులు రూ.1.50 కోట్లు సిద్ధంగా ఉన్నాయి. రెవిన్యూ శాఖ స్థలం అన్వేషిస్తోంది. 11.275 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 31 వార్డులతో విస్తరించి ఉన్న పట్టణంలో 60 వేల జనాభా ఉంది. పట్టణంలో రోజూ 32 టన్నుల చెత్తసేకరణ జరుగుతోంది. ఇందులో 10 టన్నులు తడి చెత్త, 22 టన్నులు చెత్త లభ్యమవుతోంది. ప్రస్తుతం మునిసిపాలిటీలో శానిటరీ సెక్షన్లో 73 మంది శాశ్వత సిబ్బంది, మరో 91 మంది కాంట్రాక్ట్ వర్కర్లు పనిచేస్తున్నారు. క్రైస్తవ శ్మశానవాటికలో డంపింగ్ కొవ్వూరు: డంపింగ్‌యార్డు కోసం ఆరేళ్ల క్రితం నందమూరు శివారున సేకరించిన 1.96 ఎకరాల భూమి హైకోర్టు తీర్పుతో దక్కలేదు. పట్టణంలో రోజుకు సరాసరి 26 టన్నుల చెత్తను సేకరిస్తున్నారు. రాజీవ్ కాలనీలో ఉన్న ఎకరం స్థలాన్ని ప్రస్తుతం చెత్త డంపింగ్‌కు వినియోగిస్తున్నారు. ఆ స్థలం సరిపోవడం లేదు. దీంతో రహదారుల చెంతన, క్రిస్ట్రియన్ శ్మశాన వాటికలోను పారబోస్తున్నారు. ఏటా పారిశుద్ధ్య నిర్వహణకు సుమారు రూ.కోటి ఖర్చు చేస్తున్నారు. చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే కేంద్రం రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కొవ్వూరులో సేకరించే చెత్తను ఈ కేంద్రానికి తరలించాలని నిర్ణయించారు. ఈ ప్లాంటు ప్రారంభం కాకపోవడంతో సమస్యగా ఉంది. -
పొద్దు పొద్దునే సచిన్ ఇలా...
సాక్షి, ముంబై : పరిశుభ్ర భారతావనినే జాతి పిత బాపుజీ కలలు కన్నదని చెబుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛ భారత్ మిషన్‌కు నాంది పలికిన విషయం తెలిసిందే. 2019లో మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా స్వచ్ఛ భారత్ సాధనతో ఉత్తమ నివాళి అందించాలని మోదీ కోరారు. ఈ క్రమంలో పలువురు సెలబ్రిటీలకు కూడా ఆయన స్వచ్ఛతా హీ సేవా పిలుపునిచ్చారు. ఇప్పటికే మద్ధతు తెలిపిన లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ చీపురు పట్టేశారు. మంగళవారం ఉదయం ముంబై పశ్చిమ బాంద్రాలో నిర్వహించిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. చుట్టుపక్కల ప్రాంతాలు శుభ్రంగా ఉంటేనే మనం బాగుంటామని ఈ సందర్భంగా సచిన్ వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ఈ బృహత్తర కార్యక్రమం విజయవంతం కావాలని మాస్టర్ బ్లాస్టర్ ఆకాంక్ష వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం గాంధీ జయంతి(అక్టోబర్ 2) వరకు కొనసాగుతుంది. ప్రముఖులందరూ ఈ కార్యక్రమానికి చేయూతనివ్వాలని మోదీ లేఖలు రాసిన విషయం తెలిసిందే. మళయాళ స్టార్ హీరో మోహన్‌లాల్, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ నటులు అక్షయ్‌కుమార్, అనుష్క శర్మ, దర్శకుడు రాజమౌళి ఇప్పటికే తమ మద్ధతును ప్రకటించారు. -
రండీ.. హస్తినను శుభ్రపరుద్దాం!
సాక్షి, న్యూఢిల్లీ: నగరంలో ప్రస్తుతం కొనసాగుతున్న పారిశుధ్య కార్యక్రమంలో పాల్గొనడానికి మంత్రులు, అధికారులు పోటీపడుతుండగా.. సామాన్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని లెప్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ పిలుపునిచ్చారు. స్వచ్ఛ్ భారత్ మిషన్‌ని విజయవంతం చేయడానికి ప్రభుత్వ ప్రయత్నాలు మాత్రమే సరిపోవని, సామాన్య ప్రజలు కూడా కార్యక్రమంలో పాల్గొనాలని నజీబ్ జంగ్ కోరారు. ‘ప్రభుత్వ ప్రయత్నాలు మాత్రమే సరిపోవు. ఢిల్లీవాసులు ఇళ్లనుంచి బయటకు వచ్చి స్కూళ్లు, ఆసుపత్రులను సందర్శించి, పారిశుధ్య కార్యక్రమంలో పాల్గొనాల’ని నజీబ్ జంగ్ నగరప్రజలకు విజ్ఞప్తిచేశారు. ‘పరిశుభ్రమైన భారతదేశం గాంధీజీ కన్నకల. ఈ కలను నిజం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఢిల్లీలో పారిశుధ్య కార్యక్రమం నెలరోజులపాటు కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వం, మున్సిపల్ సంస్థలు, ఢిల్లీ ప్రభుత్వం ఇందుకోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ కార్యక్రమం 2019 వరకు కొనసాగుతుంది. ఈ కార్యక్రమంతో విదేశాలలో కనిపించేంతటి పరిశుభ్రత మనదేశంలో కూడా కనబడుతుందని నేను ఆశిస్తున్నాన’ని ఢిల్లీవాసులకు చేసిన విజ్ఞప్తిలో నజీబ్ జంగ్ పేర్కొన్నారు. నేడు 2 గంటల వరకే పనిచేయనున్న ప్రభుత్వ కార్యాలయాలు నగరంలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఇవాళ మధ్యాహ్నం రెండు గంటల వరకే పనిచేయనున్నాయి. గాంధీ జయంతిని పురస్కరించుకొని స్వచ్ఛ్ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండడంతో అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసేందుకుగాను సౌత్‌బ్లాక్, నార్త్ బ్లాక్, శాస్త్రిభవన్, రైల్ భవన్, శ్రమ్ శక్తిభవన్, ఉద్యోగ్ భవన్, నారిమన్ భవన్, విజ్ఞాన్ భవన్ కార్యాలయాను కాస్త ముందుగానే మూసివేయనున్నారని సంబంధి త విభాగం ఓ ప్రకటనలో తెలిపింది. వీటితోపాటు సీఎస్ఐఆర్ బిల్డింగ్, రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయం, యోజ నా భవన్, నేషనల్ ఆర్కైవ్స్, ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్, నేషనల్ మీడియా సెంటర్, జవహర్ భవన్, వాయు భవన్, సేనా భవన్, నేషనల్ మ్యూజియం, విజ్ఞాన్ భవన్, సీసీఏ, వ్యవసాయ మంత్రిత్వశాఖ కార్యాలయం, డీఆర్డీఓ, రక్షాభవన్, నేషనల్ స్టేడియం, హైదరాబాద్ హౌస్, కోస్ట్‌గార్డ్ హౌస్ తదితర భవనాలు కూడా మూతపడనున్నాయి. ‘క్లీన్ అండ్ గ్రీన్ ఢిల్లీ’ డ్రైవ్‌ను ప్రారంభించనున్న మెట్రో స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ మెట్రో ‘క్లీన్ అండ్ గ్రీన్ ఢిల్లీ’ డ్రైవ్‌ను ప్రారంభించనుంది. గాంధీ జయంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు డీఎంఆర్సీ ఓ ప్రకటనలో తెలిపింది. కార్యక్రమంలో భాగంగా నగరంలోని అన్ని మెట్రో స్టేషన్లలో మొక్కలు నాటుతామని, స్టేషన్ల పరిసరాలను శుభ్రపరుస్తామని మెట్రో ప్రకటించింది. ఇప్పటికే ప్రయాణికులకు అత్యుత్తమ సేలందిస్తున్న మెట్రో ఇక నుంచి పర్యావరణ పరిరక్షణ కోసం స్టేషన్ పరిసరాలను హరితమయంగా మార్చనుందని డీఎంఆర్సీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ అనుజ్ దయాళ్ తెలిపారు. డీఎంఆర్సీలో పనిచేసే సిబ్బంది, అధికారులు, సీఐఎస్ఎఫ్ జవాన్లు, పారిశుద్ధ్య కార్మికులు, పార్కింగ్ కాంట్రాక ్టర్లు, సదుపాయాల కల్పన సిబ్బందిని ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తామని తెలిపారు. నగరంలోని 147 మెట్రో స్టేషన్లతోపాటు 8 రైళ్ల నిర్వహణ డిపోల్లో కూడా అక్టోబర్ 2న ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని దయాళ్ తెలిపారు. వీటితోపాటు ఏడు డీఎంఆర్సీ కాలనీలను హరితమయంగా మారుస్తామన్నారు. అంతేకాక యమునా తీరప్రాంతంలో 1,500 పండ్ల మొక్కలను నాటుతామని చెప్పారు. అల్లనేరేడు, చింత, ఉసిరి, వెలగ తదితర పండ్ల మొక్కలను నాటుతామని చెప్పారు.