రండీ.. హస్తినను శుభ్రపరుద్దాం! | swach bharat mission in New Delhi | Sakshi
Sakshi News home page

రండీ.. హస్తినను శుభ్రపరుద్దాం!

Published Tue, Sep 30 2014 10:27 PM | Last Updated on Sat, Sep 2 2017 2:11 PM

swach bharat mission in New Delhi

సాక్షి, న్యూఢిల్లీ: నగరంలో ప్రస్తుతం కొనసాగుతున్న పారిశుధ్య కార్యక్రమంలో పాల్గొనడానికి మంత్రులు, అధికారులు  పోటీపడుతుండగా.. సామాన్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని  లెప్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ పిలుపునిచ్చారు. స్వచ్ఛ్ భారత్ మిషన్‌ని విజయవంతం చేయడానికి ప్రభుత్వ ప్రయత్నాలు మాత్రమే సరిపోవని, సామాన్య ప్రజలు కూడా కార్యక్రమంలో పాల్గొనాలని నజీబ్ జంగ్ కోరారు. ‘ప్రభుత్వ ప్రయత్నాలు మాత్రమే సరిపోవు. ఢిల్లీవాసులు ఇళ్లనుంచి బయటకు వచ్చి స్కూళ్లు, ఆసుపత్రులను సందర్శించి, పారిశుధ్య కార్యక్రమంలో పాల్గొనాల’ని నజీబ్ జంగ్ నగరప్రజలకు విజ్ఞప్తిచేశారు. ‘పరిశుభ్రమైన భారతదేశం గాంధీజీ కన్నకల. ఈ కలను నిజం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఢిల్లీలో పారిశుధ్య కార్యక్రమం నెలరోజులపాటు కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వం, మున్సిపల్ సంస్థలు, ఢిల్లీ ప్రభుత్వం ఇందుకోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ కార్యక్రమం 2019 వరకు కొనసాగుతుంది. ఈ కార్యక్రమంతో విదేశాలలో కనిపించేంతటి పరిశుభ్రత మనదేశంలో కూడా కనబడుతుందని నేను ఆశిస్తున్నాన’ని  ఢిల్లీవాసులకు చేసిన విజ్ఞప్తిలో నజీబ్ జంగ్ పేర్కొన్నారు.
 
 నేడు 2 గంటల వరకే పనిచేయనున్న ప్రభుత్వ కార్యాలయాలు
 నగరంలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఇవాళ మధ్యాహ్నం రెండు గంటల వరకే పనిచేయనున్నాయి. గాంధీ జయంతిని పురస్కరించుకొని స్వచ్ఛ్ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండడంతో అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసేందుకుగాను సౌత్‌బ్లాక్, నార్త్ బ్లాక్, శాస్త్రిభవన్, రైల్ భవన్, శ్రమ్ శక్తిభవన్, ఉద్యోగ్ భవన్, నారిమన్ భవన్, విజ్ఞాన్ భవన్ కార్యాలయాను కాస్త ముందుగానే మూసివేయనున్నారని సంబంధి త విభాగం ఓ ప్రకటనలో తెలిపింది. వీటితోపాటు సీఎస్‌ఐఆర్ బిల్డింగ్, రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయం, యోజ నా భవన్, నేషనల్ ఆర్కైవ్స్, ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్, నేషనల్ మీడియా సెంటర్, జవహర్ భవన్, వాయు భవన్, సేనా భవన్, నేషనల్ మ్యూజియం, విజ్ఞాన్ భవన్, సీసీఏ, వ్యవసాయ మంత్రిత్వశాఖ కార్యాలయం, డీఆర్‌డీఓ, రక్షాభవన్, నేషనల్ స్టేడియం, హైదరాబాద్ హౌస్, కోస్ట్‌గార్డ్ హౌస్ తదితర భవనాలు కూడా మూతపడనున్నాయి.
 
 ‘క్లీన్ అండ్ గ్రీన్ ఢిల్లీ’ డ్రైవ్‌ను ప్రారంభించనున్న మెట్రో
 స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ మెట్రో ‘క్లీన్ అండ్ గ్రీన్ ఢిల్లీ’ డ్రైవ్‌ను ప్రారంభించనుంది. గాంధీ జయంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు డీఎంఆర్‌సీ ఓ ప్రకటనలో తెలిపింది. కార్యక్రమంలో భాగంగా నగరంలోని అన్ని మెట్రో స్టేషన్లలో మొక్కలు నాటుతామని, స్టేషన్ల పరిసరాలను శుభ్రపరుస్తామని మెట్రో ప్రకటించింది. ఇప్పటికే ప్రయాణికులకు అత్యుత్తమ సేలందిస్తున్న మెట్రో ఇక నుంచి పర్యావరణ పరిరక్షణ కోసం స్టేషన్ పరిసరాలను హరితమయంగా మార్చనుందని డీఎంఆర్‌సీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ అనుజ్ దయాళ్ తెలిపారు.
 
 డీఎంఆర్‌సీలో పనిచేసే సిబ్బంది, అధికారులు, సీఐఎస్‌ఎఫ్ జవాన్లు, పారిశుద్ధ్య కార్మికులు, పార్కింగ్ కాంట్రాక ్టర్లు, సదుపాయాల కల్పన సిబ్బందిని ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తామని తెలిపారు. నగరంలోని 147 మెట్రో స్టేషన్లతోపాటు 8 రైళ్ల నిర్వహణ డిపోల్లో కూడా అక్టోబర్ 2న ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని దయాళ్ తెలిపారు. వీటితోపాటు ఏడు డీఎంఆర్‌సీ కాలనీలను హరితమయంగా మారుస్తామన్నారు. అంతేకాక యమునా తీరప్రాంతంలో 1,500 పండ్ల మొక్కలను నాటుతామని చెప్పారు. అల్లనేరేడు, చింత, ఉసిరి, వెలగ తదితర పండ్ల మొక్కలను నాటుతామని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement