Lieutenant Governor Najeeb Jung
-
ఎల్జీతో కేజ్రీవాల్ భేటీ
ఢిల్లీ ఏసీబీ పనితీరుపై చర్చ * అసెంబ్లీ ప్రత్యేక భేటీ అజెండాపై వివరణ * కేంద్రం నోటిఫికేషన్‌కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్‌తో సమావేశమయ్యారు. 20 నిమిషాలపాటు సాగిన వీరి భేటీలో.. ఢిల్లీ అవినీతి నిరోధక విభాగం(ఏసీబీ) పనితీరుపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఢిల్లీ పోలీసు సిబ్బందిపై దర్యాప్తు చేసే అధికారం ఏసీబీకి ఉంటుందంటూ ఢిల్లీ హైకోర్టు కీలక రూలింగ్ ఇచ్చిన మరుసటి రోజే వీరి భేటీ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. సీనియర్ అధికారుల నియామకాలు, బదిలీలపై లెఫ్టినెంట్ గవర్నర్‌కు, ఆప్ సర్కారుకు మధ్య వివాదం మొదలైన తర్వాత కేజ్రీవాల్.. ఎల్జీతో సమావేశమవడం ఇదే తొలిసారి. ఈ భేటీలో సీఎంతోపాటు డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేకే శర్మ పాల్గొన్నారు. రెండ్రోజుల అసెంబ్లీ సమావేశాల ఎజెండాను సీఎం ల్జీకి వివరించినట్లు తెలిసింది. సమర్థ పాలన అందించేందుకు కలసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఇటీవల ఎల్జీ.. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా శకుంతల గామ్లిన్‌ను నియమించడం, దాన్ని సీఎం తీవ్రంగా వ్యతిరేకించడం, ఇద్దరి మధ్య లేఖల యుద్ధం కొనసాగడం తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారుల నియామకాలు, బదిలీల విషయంలో ఎల్జీయే సర్వాధికారి అంటూ ఈనెల 21న కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడం అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. అధికారాలను హరించేందుకే నోటిఫికేషన్ కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌పై చర్చించేందుకు ఢిల్లీ అసెంబ్లీ రెండ్రోజుల ప్రత్యేక సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే డిప్యూటీ సీఎం సిసోడియా.. నోటిఫికేషన్‌కు వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ నోటిఫికేషన్ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ఇది ప్రజలు గెలిపించిన ప్రభుత్వ అధికారాలను హరించే ప్రయత్నమని మండిపడ్డారు. రాష్ట్ర ఎన్నికల సంఘం లేనందు వల్ల అధికారుల నియామకాలు, బదిలీలపై ఢిల్లీ ప్రభుత్వానికి అధికారం లేదనడాన్ని తప్పుపట్టారు. కాగా, లెఫ్టినెంట్ గవర్నర్‌ను అభిశంసించే అధికారాన్ని ఢిల్లీ అసెంబ్లీకి కల్పించేందుకు రాజ్యాంగాన్ని సవరించాలంటూ ఆప్ ఎమ్మెల్యే ఆదర్శ్ శాస్త్రి మరో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. -
సీఎం, గవర్నర్ మధ్య ముదిరిన వివాదం
సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ల మధ్య విబేధాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. అన్ని ప్రభుత్వ ఫైళ్లు తన వద్దకు తప్పక రావల్సిందేనని నజీబ్ జంగ్.. సీఎం కేజ్రీవాల్‌కు లేఖ రాశారు. అన్ని ఫైళ్లను ఎల్జీ కార్యాలయానికి పంపనవసరం లేదని ఢిల్లీ ప్రభుత్వం కిందనున్న అన్ని ప్రభుత్వ విభాగాలకు కేజ్రీవాల్ కార్యాలయం ఏప్రిల్ 29న లేఖ రాసింది. దీంతో లెఫ్టినెంట్ గవర్నర్ ఈ ఉత్తర్వును ఉపసంహరించుకోవాలని సీఎంను కోరారు. ఎల్జీ కార్యాలయానికి ఫైళ్లు పంపరాదని అధికారులను కోరడం రాజ్యాంగపరంగా సరైనది కాదని పేర్కొంటూ ఆదివారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్, లెప్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ల మధ్య మొదటి నుంచీ సామరస్యత లేదన్నది అందరికీ తెలిసిన విషయమే. ఫిబ్రవరిలో కేజ్రీవాల్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎల్జీ కార్యాలయం, సీఎం కార్యాలయం ఎడమొఖం, పెడమొఖంగానే ఉంటున్నాయి. ఢిల్లీ ప్రభుత్వ పరిధి కిందకు రాని పోలీసు, శాంతిభద్రతలు, భూమి ఇత్యాది అంశాలకు సంబంధించిన ఫైళ్లను తన ద్వారా పంపాలని కేజ్రీవాల్.. లెఫ్టినెంట్ గవర్నర్‌ను కోరారు. అందుకు ఎల్జీ నిరాకరించారు. దీంతో ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన అన్ని పైళ్లను ఎల్జీకి పంపాల్సిన అవసరం లేదని సీఎం కార్యదర్శి రాజేందర్‌కుమార్ ఏప్రిల్ 29న నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో కినుక చెందిన జంగ్ ఈ ఉత్వర్వును ఉపసంహరించుకోవలసిందిగా ఆదివారం సీఎం కార్యాలయాన్ని దేశించారు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆదేశాన్ని కాంగ్రెస్, బీజేపీలు విమర్శిస్తున్నాయి. అయితే ప్రభుత్వ పనితీరును మెరుగుపరచడం కోసం, ఫైళ్ల కదలికలో వేగం పెంచడం కోసం ఈ ఆదేశాలు జారీ చేసినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం కింద ఉండే ఢిల్లీ పోలీసు, శాంతిభద్రతల అంశాలను తన పరిధిలోకి తెచ్చుకోవాలని ఆమ్ ఆద్మీ సర్కారు ఆశిస్తోంది. ఈ రెండింటిపై అధికారం లేనట్లయితే ఢిల్లీ సర్కారు బలహీనంగా ఉంటుందని ఆప్ సర్కారు భావిస్తోంది. -
ఎన్నికల తర్వాత ఢిల్లీలో సుస్థిర ప్రభుత్వం
న్యూఢిల్లీ: రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుందనే ఆశాభావాన్ని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ వ్యక్తం చేశారు. ఏడాదిగా ఢిల్లీలో రాష్ట్రపతి పాలన ఉన్న సంగతి తెలిసిందే. మోడల్ టౌన్ నియోజకవర్గంలోని సెయింట్ జేవియర్ స్కూలులో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉందన్నారు. దేశంలోనే అత్యధిక ఓట్ల శాతం నమోదు కావడం ద్వారా ఢిల్లీ రికార్డు సృష్టించాలని ఎల్లప్పుడూ ఆశిస్తూ ఉంటానని చెప్పారు. 2013 ఎన్నికల్లో 65.13 శాతం ఓట్లు పోలయ్యాయన్నారు. -
గూఢచర్యాన్ని మరింత మెరుగుపర్చండి
శాంతిభద్రతల సమీక్షలో పోలీసులకు ఎల్జీ సూచన సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవల నగరంలో జరిగిన మతఘర్షణల నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలని, తమ సమాచార సేకరణ సామర్థ్యాన్ని మరింత మెరుగుపరచుకోవాలని లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ సూచించారు. గురువారం పోలీస్ కమిషనర్ బస్సీతో పాటు ఇతర పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమై నగరంలో శాంతిభద్రతల పరిస్థితిని ఆయన సమీక్షించారు. మతపరమైన హింసను నివారించేందుకు రహస్య సమాచార సేకరణ పద్ధతులను అభివృద్ధి పరచుకోవాలని సూచించారు. పదిహేను రోజుల క్రితం నగరంలో జరిగిన మతఘర్షణలను అరికట్టడంలో పోలీసులు చేసిన కృషిని నజీబ్ జంగ్ ప్రశంసించి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు మరింత అప్రమత్తంగా మెలగాలని ఆదేశించారు. అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నామని కమిషనర్ బీఎస్ బస్సీ చెప్పారు. సామాజిక సంబంధాలను ప్రోత్సహించేందుకు శాంతి కమిటీలను ఏర్పాటుచేశామని ఎల్జీకి వివరించారు. ప్రజల్లో భయాందోళనలను తొలగించేందుకు తాము జిల్లా స్థాయిలో ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు వింటున్నామని అధికారులు చెప్పారు. వచ్చే పక్షం రోజులకు సంబంధించి శాంతి భద్రతల ఏర్పాట్లను జంగ్ అడిగి తెలుసుకున్నారు. అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన సందర్భంగా మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన పోలీసులకు సూచించారు. నిరంకారి సమాగం వార్షికోత్సవం సందర్భంగా భారీగా ప్రజలు తరలి వస్తారని, అప్పుడు కూడా అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. ఇ-ప్లాట్‌ఫారంపైకి చేరడానికి చేపట్టిన చర్యలతో పాటు ఇ-పోలీసింగ్ అప్లికేషన్లను అభివృద్ధి చేయడానికి ఢిల్లీ పోలీసులు జరుపుతున్న కృషిని కూడా లెఫ్టినెంట్ గవర్నర్ సమీక్షించారు. ఢిల్లీ పోలీసులు విజయవంతంగా అమలుచేస్తోన్న ఢిల్లీ ట్రాఫిక్ పోలీస్ మొబైల్ యాప్, పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ ఆప్లికేషన్, ఢిల్లీ పోలీస్ లాస్ రిపోర్ట్ అప్లికేషన్లను ఆయన సమీక్షించారు. నగర రోడ్లపై రద్దీని తగ్గించేందుకు ఢిల్లీ పోలీసులు చేస్తున్న ప్రయత్నాలను ఆయన కొనియాడారు. లక్షల మంది సందర్శించే అంతర్జాతీయ మేళా వేలమంది హాజరయ్యే వార్షిక నిరంకారీ సమాగంల దష్ట్యా పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు చేసిన ఏర్పాట్లను కూడా లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశించారు. -
పథకాల అమలు తీరుపై ఎల్జీ సమీక్ష
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రకటించిన పథకాలు, ప్రాజెక్టుల అమలుతీరుపై లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ మంగళవారం సమీక్షించారు. ఢిల్లీ ప్రభుత్వ కార్యదర్శి, వివిధ విభాగాల ప్రిన్సిపల్ సెక్రటరీలు, కార్యదర్శులతో రాజ్‌నివాస్‌లో జరిగిన ఈ సమావేశంలో విద్యుత్, నీటి సరఫరా రంగాల్లోనగరంలో కొనసాగించాల్సిన సంస్కరణలు తొలుత చర్చకు వచ్చాయి. విద్యుత్ రంగంలో సంస్కరణల అమలుకు శ్రీకారం చుట్టిన పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ వాటిని ఆరు నెలల కాలంలో పూర్తిచేసేలా చూడాలంటూ ఈ సందర్భంగా ఎల్జీ... రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. జలవనరుల వద్ద మంత్రిత్వశాఖ వద్ద పెండింగులో ఉన్న నీటి సరఫరా సంస్కరణలను శరవేగంగా చేపట్టడం కోసం నోడల్ అధికారిని నియమించాలని ఢిల్లీ జల్ బోర్డు (డీజేబీ)తోపాటు ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. లోక్‌నాయక్, గురుతేజ్ బహదూర్ ఆస్పత్రులను ఆదర్శ ఆసుపత్రులుగా తీర్చిదిద్దే అంశంపై కూడా చర్చ జరిగింది. లోక్‌నాయక్ ఆస్పత్రి భవనంలో పనులు మొదలయ్యాయని, సర్జికల్ బ్లాక్‌ను అభివృ ద్ధి చేసే పని కొనసాగుతుందని ఎల్జీకి...ఆరోగ్య శాఖ కార్యదర్శి తెలియజేశారు. రోహిణీలో 100 సీట్ల వైద్య కళాశాల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని, 2105 నాటికి పూర్తవుతాయని తెలిపారు. వైద్య పరికరాలు 2015 నాటికి అందుతాయని చెప్పారు. ప్రాణ రక్షక పరికరాలతో కూడిన 110 అంబులెన్సులు వచ్చే ఏడాది మార్చినాటికి అందుబాటులోకి వస్తాయని తెలియజేశారు. కాగా అత్యాచార బాధితుల కోసం వన్ స్టాప్ సెంటర్ ఫర్ క్రైసిస్ మేనేజ్మెంట్ అండ్ రీహాబిలిటేషన్‌ను సంజయ్ గాంధీ ఆస్పత్రిలోప్రారంభించారు. నగరంలో మరో ఏడు సెంటర్లను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో 30 డయాలిసిస్ యూనిట్లను ఏర్పాటుచేశారు. అవి పనిచేయడం ప్రారంభించాయి. ఇటువంటి మరో 20 యూనిట్లను డా,. హెగ్డేవార్ ఆసుపత్రిలో రానున్న మూడు నెలల్లో ప్రయివేటు ప్రభుత్వ భాగస్వామ్యంతోఏర్పాటుచేస్తారు. బడ్జెట్లో ప్రకటించినవిధంగా దక్షిణ ఢిల్లీలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుకు సంబంధించి చత్తర్ పూర్లో స్థలాన్ని గుర్తించారు. రోహిణి, షేక్సరాయ్ సాయుర్పుర్ గ్రామాల్లో ఫోరెన్సిక్ లేబోరేటరీలను ఏర్పాటు పనులు మొదలయ్యాయి. 155 మంది మహిళా సబ్ ఇన్స్పెక్టర్లు, 1434 మహిళా కానిస్టేబుళ్లను ఎంపిక చేశారు. ఈ నెలాఖరు నుంచి వారికి శిక్షణ ఇస్తారు. 14 పాఠశాలకు భవన నిర్మాణానికి అనుమతించారు. ఇందులో 10 భవనాల నిర్మాణపనులు మొదలయ్యాయి. బసంత్గావ్, తుగ్లకాబాద్లలో వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లను ఏర్పాటు కోసం స్థలం సేకరించారు. మరో నాలుగు వసతి గృహాలనుకూడా ఏర్పాటుచేస్తారు. 53 జేజే క్లస్టర్లలో 67 మొబైల్ టాయిలెట్ వ్యాన్లను ఏర్పాటుచేశారు. 1,380 లోఫ్లోర్ బస్సులు, ఆటోమేటిక్ టికెటింగ్యంత్రాల కొనుగోలుకు సంబంధించి టెండర్లు జారీ చేశారు. -
త్వరలోనే నిర్ణయం
ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుపై సుప్రీంకోర్టుకు తెలియజేసిన కేంద్ర ప్రభుత్వం సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతున్న అనిశ్చితి త్వరలోనే తొలగిపోనుంది. ఇందుకు సంబంధించి త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు శుక్రవారం తెలియజేసింది. ఢిల్లీలో నెలకొన్న రాజకీయ అనిశ్చితిపై లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ తమకు సమర్పించిన నివేదికను పరిశీలిస్తున్నామని అదనపు సొలిసిటర్ జనరల్ రంజిత్‌కుమార్ ...ప్రధాన న్యాయమూర్తి హెచ్.ఎల్దత్తూ నేతృత్వంలోని ధర్మాసనానికి తెలియజేశారు. దీంతో ఢిల్లీలో రాష్ట్రపతి పాలనను సవాలు చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది. ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వ వైఖరి స్పష్టమవుతుంద న్న ఆశతో శుక్రవారం నాటి సుప్రీంకోర్టు కార్యకలాపాలను గమనించిన వారికి కేసు విచారణ వాయిదాపడడం నిరాశ మిగిల్చింది. ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలా ? లేక ఎన్నికలు జరిపించాలా? అనే అంశంపై కేంద్రం తీసుకునే నిర్ణయం... హర్యానా, మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాలపై ఆధారపడి ఉంటుందని, ఈ ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా ఉన్నట్లయితే ఢిల్లీలో ఎన్నికలు జరపించవచ్చని రాజకీయ పండితులు అంచనా వేస్తున్న దృష్ట్యా ప్రభుత్వ వైఖరిని తెలపడానికి లెఫ్టినెంట్ గవర్నర్ మరికొంత సమయం కోరవచ్చనే ఊహాగానాలు ముందుగానే వినిపించాయి. ప్రభుత్వం శుక్రవారం కోర్టును మరికొంత సమయం కోరడం ఈ ఊహాగానాలను బలపరిచింది. ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకుగల అవకాశాలను అన్వేషించేందుకు అనుమతించాల్సిందిగా కోరుతూ లెప్టినెంట్ గవర్నర్ రాసిన లేఖ ఇంకా రాష్ట్రపతి పరిశీలన కోసం ఎదురుచూస్తోందని, దానిపై త్వరలో నిర్ణయం వెలువడవచ్చని ప్రభుత్వం న్యాయస్థానానికి తెలిపింది. ఈ విషయంపై ప్రభుత్వం తరపున గతంలో న్యాయస్థానం ఎదుట హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ వ్యక్తిగత సమస్యల కారణంగా కూడా కేసు విచారణను న్యాయస్థానం ఈ నెల 28కి వాయిదా వేసిందని అమన్ అనే న్యాయవాది తెలిపారు. ఇదిలాఉంచితే ఢిల్లీలో ఫిబ్రవరి 17 నుంచి రాష్ట్రపతిపాలన కొనసాగుతోంది. సుప్తచేతనావస్థలో నున్న అసెంబ్లీని రద్దు చేసి వెంటనే ఎన్నికలు జరిపించాలని కోరుతూ ఆమ్ ఆద్మీ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని, ఈ విషయమై లెఫ్టినెంట్ గవర్నర్ రాష్ట్రపతికి లేఖ రాశారని, సెప్టెంబర్ తొమ్మిదో తేదీన ప్రభుత్వం ఈ పిటిషన్‌పై విచారణ జరుపుతున్న ధర్మాసనానికి తెలిపింది. ఈ ప్రకియ ఫలితాన్ని అక్టోబర్ 10న తనకు తెలియజేయాలని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. లేనట్లయితే పార్టీల మార్పిడికి ప్రోత్సాహం లభిస్తుందని హెచ్చరించింది. కాగా ఢిల్లీ శాసనసభ సభ్యుల సంఖ్య 70. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో మొత్తం 31 మంది శాసనసభకు ఎన్నికయ్యారు. అయితే వీరిలో హర్షవర్ధన్, పర్వేష్ వర్మ, రమేశ్ బిధూరీలు ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించడంతో ఆ పార్టీ సభ్యుల సంఖ్య 31 నుంచి 28కి పడిపోయింది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుల సంఖ్య 28 కాగా వారిలో రెబెల్ ఎమ్మెల్యే వినోద్‌కుమార్ బిన్నీని బహిష్కరించడంతో వారి సంఖ్య 27కు పడిపోయింది. ఇక కాంగ్రెస్‌కు ఎనిమిది, బీజేపీ, అకాలీదళ్ పార్టీలకు ఒక్కొక్కరు చొప్పున సభ్యులు ఉన్నారు. ఆప్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కొన్నాళ్లక్రితం సన్నద్ధత వ్యక్తం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చేందుకు నిరాకరించడంతో అది సాధ్యం కాలేదు. ఇదిలాఉంచితే ఈ ఏడాది ఫిబ్రవరిలో అప్పటి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేసిన సంగతి విదితమే. 49 రోజుల పాటు అధికారంలో ఉన్న కేజ్రీవాల్... జన్‌లోక్‌పాల్ బిల్లును సభలోకి ప్రవేశపెట్టలేదనే సాకుతో ఆయన తన పదవినుంచి దిగిపోయారు. ఆ తర్వాత ఢిల్లీలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ సారథ్యంలో అధికార కార్యక్రమాలు జరుగుతున్నాయి. -
కర్సేవలో పాల్గొన్న నజీబ్‌జంగ్
న్యూఢిల్లీ: స్వచ్ఛ్ భారత్ అభియాన్‌లో లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ కూడా పాలుపంచుకున్నారు. స్థానిక బంగ్లాసాహిబ్ గురుద్వారాలో ఆయన భక్తుల పాదరక్షలను శుభ్రం చేశారు. సతీమణి అమీనాతో కలిసి వచ్చిన ఎల్జీ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ‘భారత్... పరిశుభ్రంగా ఉండాలనే మహాత్మాగాంధీ కల. అటువంటి కార్యక్రమమే ఇవాళ దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. దీంతో ఆయన కల సాకారమవుతోంది. జాతీయ రాజధాని నగరంలో ఇది ఐదేళ్లపాటు జరగనుంది. ఢిల్లీని పరిశుభ్రం చేసే విషయంలో నగర పాలక సంస్థలు, ఆస్పత్రులతోపాటు ప్రజలు కూడా తమవంతు సహకారం అందించాలి. పరిశుభ్రతను ఓ అలవాటుగా మార్చుకుందాం’ అని అన్నారు. అందువల్ల పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయన్నారు. ఎంతోకాలంగా ఈ గురుద్వారాకు రావాలని అనుకుంటున్నాన ని, అందువల్లనే స్వచ్ఛ్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించానని, దీంతో తన కోరిక తీరిందని ఆయన పేర్కొన్నారు. మనది లౌకికవాద దేశమని, అందువల్లనే ఈ ప్రార్థనామందిరానికి వచ్చానని అన్నారు. -
రండీ.. హస్తినను శుభ్రపరుద్దాం!
సాక్షి, న్యూఢిల్లీ: నగరంలో ప్రస్తుతం కొనసాగుతున్న పారిశుధ్య కార్యక్రమంలో పాల్గొనడానికి మంత్రులు, అధికారులు పోటీపడుతుండగా.. సామాన్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని లెప్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ పిలుపునిచ్చారు. స్వచ్ఛ్ భారత్ మిషన్‌ని విజయవంతం చేయడానికి ప్రభుత్వ ప్రయత్నాలు మాత్రమే సరిపోవని, సామాన్య ప్రజలు కూడా కార్యక్రమంలో పాల్గొనాలని నజీబ్ జంగ్ కోరారు. ‘ప్రభుత్వ ప్రయత్నాలు మాత్రమే సరిపోవు. ఢిల్లీవాసులు ఇళ్లనుంచి బయటకు వచ్చి స్కూళ్లు, ఆసుపత్రులను సందర్శించి, పారిశుధ్య కార్యక్రమంలో పాల్గొనాల’ని నజీబ్ జంగ్ నగరప్రజలకు విజ్ఞప్తిచేశారు. ‘పరిశుభ్రమైన భారతదేశం గాంధీజీ కన్నకల. ఈ కలను నిజం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఢిల్లీలో పారిశుధ్య కార్యక్రమం నెలరోజులపాటు కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వం, మున్సిపల్ సంస్థలు, ఢిల్లీ ప్రభుత్వం ఇందుకోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ కార్యక్రమం 2019 వరకు కొనసాగుతుంది. ఈ కార్యక్రమంతో విదేశాలలో కనిపించేంతటి పరిశుభ్రత మనదేశంలో కూడా కనబడుతుందని నేను ఆశిస్తున్నాన’ని ఢిల్లీవాసులకు చేసిన విజ్ఞప్తిలో నజీబ్ జంగ్ పేర్కొన్నారు. నేడు 2 గంటల వరకే పనిచేయనున్న ప్రభుత్వ కార్యాలయాలు నగరంలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు ఇవాళ మధ్యాహ్నం రెండు గంటల వరకే పనిచేయనున్నాయి. గాంధీ జయంతిని పురస్కరించుకొని స్వచ్ఛ్ భారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండడంతో అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసేందుకుగాను సౌత్‌బ్లాక్, నార్త్ బ్లాక్, శాస్త్రిభవన్, రైల్ భవన్, శ్రమ్ శక్తిభవన్, ఉద్యోగ్ భవన్, నారిమన్ భవన్, విజ్ఞాన్ భవన్ కార్యాలయాను కాస్త ముందుగానే మూసివేయనున్నారని సంబంధి త విభాగం ఓ ప్రకటనలో తెలిపింది. వీటితోపాటు సీఎస్ఐఆర్ బిల్డింగ్, రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయం, యోజ నా భవన్, నేషనల్ ఆర్కైవ్స్, ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్, నేషనల్ మీడియా సెంటర్, జవహర్ భవన్, వాయు భవన్, సేనా భవన్, నేషనల్ మ్యూజియం, విజ్ఞాన్ భవన్, సీసీఏ, వ్యవసాయ మంత్రిత్వశాఖ కార్యాలయం, డీఆర్డీఓ, రక్షాభవన్, నేషనల్ స్టేడియం, హైదరాబాద్ హౌస్, కోస్ట్‌గార్డ్ హౌస్ తదితర భవనాలు కూడా మూతపడనున్నాయి. ‘క్లీన్ అండ్ గ్రీన్ ఢిల్లీ’ డ్రైవ్‌ను ప్రారంభించనున్న మెట్రో స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఢిల్లీ మెట్రో ‘క్లీన్ అండ్ గ్రీన్ ఢిల్లీ’ డ్రైవ్‌ను ప్రారంభించనుంది. గాంధీ జయంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు డీఎంఆర్సీ ఓ ప్రకటనలో తెలిపింది. కార్యక్రమంలో భాగంగా నగరంలోని అన్ని మెట్రో స్టేషన్లలో మొక్కలు నాటుతామని, స్టేషన్ల పరిసరాలను శుభ్రపరుస్తామని మెట్రో ప్రకటించింది. ఇప్పటికే ప్రయాణికులకు అత్యుత్తమ సేలందిస్తున్న మెట్రో ఇక నుంచి పర్యావరణ పరిరక్షణ కోసం స్టేషన్ పరిసరాలను హరితమయంగా మార్చనుందని డీఎంఆర్సీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ అనుజ్ దయాళ్ తెలిపారు. డీఎంఆర్సీలో పనిచేసే సిబ్బంది, అధికారులు, సీఐఎస్ఎఫ్ జవాన్లు, పారిశుద్ధ్య కార్మికులు, పార్కింగ్ కాంట్రాక ్టర్లు, సదుపాయాల కల్పన సిబ్బందిని ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తామని తెలిపారు. నగరంలోని 147 మెట్రో స్టేషన్లతోపాటు 8 రైళ్ల నిర్వహణ డిపోల్లో కూడా అక్టోబర్ 2న ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని దయాళ్ తెలిపారు. వీటితోపాటు ఏడు డీఎంఆర్సీ కాలనీలను హరితమయంగా మారుస్తామన్నారు. అంతేకాక యమునా తీరప్రాంతంలో 1,500 పండ్ల మొక్కలను నాటుతామని చెప్పారు. అల్లనేరేడు, చింత, ఉసిరి, వెలగ తదితర పండ్ల మొక్కలను నాటుతామని చెప్పారు. -
ఢిల్లీ పోలీసుల ప్రతిష్ట పెంచాలి
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీపోలీసుల ప్రతిష్టను పెంపొం దించేలా చర్యలు తీసుకోవాలని లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ పోలీసు ఉన్నతాధికారులకు సూచిం చారు. ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులతో బుధవారం రాజ్‌భవన్‌లో నిర్వహించిన సమావేశంలో లెఫ్టినెం ట్ గవర్నర్ ప్రసంగించారు. ప్రజలతో సత్ససంబంధాలు, నైతిక విలువలు పెంపొందించుకొనెలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఉన్నతాధికారులు నిజాయతీగా వ్యవహరించి ఎస్హెచ్ఓలు, కానిస్టేబుల్స్‌కు స్ఫూర్తిని ఇవ్వాలని ఆయన చెప్పారు. ఢిల్లీ పోలీసుల పట్ల గల దురభిప్రాయం పోవాలంటే వారు అన్ని రకాల అవినీతికి దూరంగా ఉండాలని అన్నారు. కిందిస్థాయి సిబ్బంది అవినీతి అక్రమాలకు పాల్పడకుండా, ప్రజలను వేధించకుం డా, బెదిరించకుండా ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అన్నారు. ఈ సందర్భంగా ఎఫ్ఐఆర్లు దాఖలు చేయడంలో ఢిల్లీ పోలీసులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొంటున్నారని, దాని వల్ల నగరంలో కేసుల నమోదు సంఖ్య పెరిగిందని పోలీస్ కమిషనర్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఢిల్లీ పోలీసులను లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అభినందించారు. ఢిల్లీ పోలీసులు అదే స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. తప్పు చేసిన సిబ్బందిని శిక్షించడం వల్ల కొంత ఫలితం ఉన్నప్పటికీ అదే పరిష్కారం కాదని, విధుల్లో నైతిక విలువలు పాటించేలా అవగాహన కల్పించాలని అన్నారు. ఠానా స్థాయి కమిటీలు మరింత చురుకుగా పనిచేయాలని, ఫీల్డ్ ఆఫీసర్లు ప్రజాప్రతినిధులతో సత్సంబంధాలను కలిగి ఉండాలని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో పోలీసు కమిషనర్ బస్సీతో పాటు ప్రత్యేక పోలీసు కమిషనర్లు, జాయింట్ పోలీసు కమిషనర్లు, డిప్యూటీ పోలీసు కమిషనర్లు పాల్గొన్నారు. -
వారం రోజుల ముందే..
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ రాజధాని నగరంలో ‘స్వచ్ఛ్ భారత్’ పథకం గురువారమే ప్రారంభం కానుంది. ఇందుకోసం ఢిల్లీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచన మేరకు గాంధీ జయంతిని పురస్కరించుకుని వచ్చే నెల రెండో తేదీన ఈ కార్యక్రమం లాంఛనంగా ప్రారంభం కావాల్సి ఉంది. ఈ కార్యక్రమం ఢిల్లీతోపాటు దేశవ్యాప్తంగా వచ్చే నెల 23 వరకు జరగనుంది. కేంద్ర పట్టణ అభివృద్ధి మంత్రిత్వ శాఖ నేతృత్వంలో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అన్ని చర్యలు తీసుకోవాలంటూ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ ఇప్పటికే అన్ని భాగాల అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మిగతా ప్రాంతాలకంటే ఢిల్లీ వెనుకబడకుండా చూడడం కోసం లెఫ్టినెంట్ గవర్నర్ స్వయంగా ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇందులోభాగంగా ఈ నెల తొమ్మిదో తేదీన మొట్టమొదటిసారిగా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమం అమలు కోసం వ్యూహాన్ని రూపొందిం చాలంటూ ఆయన వివిధ విభాగాల అధికారులను ఆదేశించారు. మంగళవారం నిర్వహించిన మరో సమావేశంలో అన్ని అంశాలను సమీక్షించిన అనంతరం సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ), ప్రజాపనుల శాఖ (పీడబ్ల్యూడీ), రవాణా, పర్యావరణం, విద్య, ఆరోగ్యం, పర్యటన. పట్టణ అభివృద్ధి శాఖ తదితర విభాగాలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నాయి. బడి పిల్లలు, యువతతోపాటు నగర వాసులను ఈ కార్యక్రమంలో పాల్గొనేలా సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకుంటున్నారు. పభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, పెద్ద పెద్ద విద్యాసంస్థలు, రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్లు (ఆర్డబ్ల్యూఏ), వర్తక సంఘాలు, మార్కెట్ అసోసియేషన్లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నాయి. ఇక ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (ఎమ్సీడీ) ఈ కార్యక్రమాన్ని వార్డు స్థాయిలో చేపట్టనుంది. దీని కింద పార్కులు, చెరువులు, వీధులు, రహదారులు, సర్వీస్ లేన్లు, ఖాళీ స్థలాల పరిశుభ్రతపై దృష్టి సారించనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవం తం చేయడం కోసం తాము చేపట్టనున్న చర్యలను మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు... ఎల్జీకి ఇప్పటికే వివరించారు. ఖాళీగాఉన్న వెయ్యికిపైగా ప్లాట ్లను శుభ్రపరచడం కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిందిగా ఢిల్లీ అభివృద్ధి సంస్థను ఎల్జీ ఆదేశించారు. కాగా పారిశ్రామికవాడల్లో కూడా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తారు. ఈ ప్రాంతాల్లో పేరుకుపోయిన దాదాపు 600 ట్రక్కులపైగా వ్యర్థాలను తొలగించనున్నారు. సామాస్య ప్రజలు కూడా తమ ఇళ్లు. దుకాణాల పరిసరాల పరిశుభ్రతపై దృష్టి సారించాలని ఎల్జీ కోరారు. రహదారులపై నిర్మాణ సామగ్రి, వ్యర్థాలను పారవేసే వారిపై ఈ కార్యక్రమంలో భాగంగా కఠిన చర్యలు తీసుకుంటారు. రహదారులు, పేవ్మెంట్లపై నిబంధనలకు భిన్నంగా నిలిపిఉంచిన వాహనాల యజమానులపై భారీఎత్తున జరిమానాలు విధిస్తారు. మరుగుదొడ్ల పునరుద్ధరణపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు. మహిళలకు ప్రత్యేకంగా మరుగుదొడ్లను నిర్మిస్తారు. జరిమానాల కింద రూ. 28 లక్షలు వసూలు న్యూఢిల్లీ: పారిశుధ్యాన్ని గాలికొదిలేసిన సంస్థలపై దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరే షన్ (ఎస్డీఎంసీ) కొరడా ఝళిపించింది. ఈ నెలలో ఇప్పటివరకూ నాలుగు వేలమందికి చలాన్లు పంపిన కార్పొరేషన్ వారి వద్దనుంచి రూ. 28 లక్షలను జరిమానా కింద వసూలు చేసింది. ఇలా జరిమానా చెల్లించినవాటిలో ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ (డీడీఏ), ప్రజాపనుల శాఖ (పీడబ్ల్యూడీ)తోపాటు ఇంకా ప్రయివేటు సంస్థలు కూడా ఉన్నాయి. ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్ మహేశ్ గుప్తా వెల్లడించారు. ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ పారిశుధ్య కార్యక్రమాన్ని పెద్దఎత్తున చేపట్టామని, మొత్తం నాలుగు జోన్లలో ఈ కార్యక్రమం జరుగుతోందన్నారు. ఇందులోభాగంగా డంప్‌లను తొలగిస్తున్నామన్నారు. వీధుల్లో ఉమ్మి వేయొద్దంటూ నగరవాసులను హెచ్చరిస్తున్నామన్నారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు సహకరించాల్సిందిగా స్థానికులను కోరుతున్నామన్నారు. త ప్పుచేసిన వారిని వదిలిపెట్టబోమని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు. ఎవరైనా వీధుల్లో చెత్త పారేస్తే వారికి జరిమానా విధిస్తున్నమన్నారు. ఈ నెల ఏడో తేదీన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని, వంద రోజులపాటు ఇది కొనసాగుతుందని అన్నారు. -
ప్రభుత్వం ఏర్పాటు దిశగా బీజేపీ
ప్రభుత్వ ఏర్పాటు విషయంలో నిన్నామొన్నటిదాకా ఊగిసలాట ధోరణిని ప్రదర్శించిన బీజేపీ ఇప్పుడు ఆ దిశగానే సంకేతాలిచ్చింది. ఒకవేళ అదే జరిగితే ముఖ్యమంత్రి పదవి రేసులో జగదీశ్ ముఖి... అందరికంటే ముందుండొచ్చని భావిస్తున్నారు. బీజేపీ సంకేతాల నేపథ్యంలో లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఏమిచేస్తారనేది ఇప్పుడు కీలకంగా మారింది. మరోవైపు అవసరమైన సంఖ్యాబలం కోసం బీజేపీ ఏమిచేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఆహ్వానిస్తే ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఈ విషయాన్ని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఒకవేళ అదే కనుక జరిగితే ఆ ఆ పార్టీ సీనియర్ నాయకుడు జగదీశ్‌ముఖి సీఎం పదవి రేసులో అందరికంటే ముందుండొచ్చని అంటున్నారు. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ బుధవారం ఉదయం ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. కాగా 28 మంది పార్టీ ఎమ్మెల్యేలతో సతీష్ ఉపాధ్యాయ లాంఛనంగా సమావేశమవడం ఇదే మొదటిసారి. ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందనే ఊహాగానాల నేపథ్యంలో ఆ పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.అయితే సతీష్ ఉపాధ్యాయ మాత్రం....కొత్తగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నేతత్వంలో ఈ సమావేశం జరిపినట్లు చెబుతున్నారు. ఢిల్లీలో రాజకీయ పరిస్థితిని ఈ సమావేశంలో చర్చించామని అంగీకరించిన ఆయన... ప్రభుత్వ ఏర్పాటుపై చర్చ జరిగిందా? లేదా? అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. మంగళవారం సాయంత్రం ఉపాధ్యాయ ఢిల్లీ ఎంపీలతో పార్టీ కార్యవర్గంతో సమావేశమయ్యారు. హర్షవర్ధన్ మినహా మిగతా ఆరుగురు ఎంపీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ రెండు సమావేశా ల్లో ప్రభుత్వ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై చర్చించారని అంటున్నారు. అయితే ఈ విషయంలో ఆ పార్టీలో భిన్నాభిప్రాయాలున్నాయని అంటున్నారు. హర్షవర్ధన్‌తో పాటు కొందరు బీజేపీ నేతలు ప్రభుత్వ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారని, అందువల్ల ఆమ్ ఆద్మీ పార్టీకి లాభం కలుగుతుందని వారు భావిస్తున్నారని అంటున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విదేశీ యాత్రను ముగించుకుని రాజధానికి తిరిగివచ్చిన తర్వాతే ఈ అంశంపై తుది నిర్ణయం వెలువడుతుందని అంటున్నారు. అయితే కొందరు ఎమ్మెల్యేలు తక్షణం ప్రభుత్వం ఏర్పాటుచేయాలని కోరుతున్నారు. వెంటనే ఎల్జీని కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు సంసిద్ధత ప్రకటించాలని వారు భావిస్తున్నట్టు తెలిసింది. అకాలీదళ్‌తో సభ్యుడితో కలుపుకుని శాసనసభలో బీజేపీకి 29 మంది సభ్యుల బలం ఉంది. ఓ స్వతంత్ర ఎమ్మెల్యేపాటు మరో జేడీయూకి చెందిన మరో ఎమ్మెల్యే మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆ పార్టీకి చెందిన కొందరు ఒత్తిడి చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటుచేసేందుకు తాము సుముఖంగా ఉన్నామని అంటోన్న బీజేపీ వర్గాలు అందుకు అవసరమైన సంఖ్యాబలాన్ని సమకూర్చుకునే అవకాశాల విషయంలో పెదవి విప్పడం లేదు. ప్రభుత్వ ఏర్పాటుపై ఊహాగానాలు జోరందుకున్న నేపథ్యంలో లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, అసెంబ్లీ స్పీకర్ ఎం.ఎస్. ధీర్ల పాత్ర అత్యంత కీలకం కానుంది. ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఉందని, ఒకవేళ అటువంటిదేమీ జరగకపోతే అప్పుడు మాత్రమే ఎన్నికలు అనివార్యమవుతాయని నజీబ్‌జంగ్ బుధవారం పేర్కొనడం విశేషం. ఒకవేళ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమని బీజేపీ ముందుకొస్తే సంఖ్యాబలం ఉందని నిరూపించడం కోసం ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేలను తన ముందు ప్రవేశపెట్టాలని నజీబ్ కోరవచ్చు లేదా నేరుగా ప్రభుత్వం ఏర్పాటుచేసే వీలు కల్పించి బలనిరూపణ కోసం కొంత సమయం ఇవ్వవచ్చు. -
బైకర్లూ ఖబడ్దార్!
సాక్షి, న్యూఢిల్లీ: షబ్ ఏ బారాత్‌ను పురస్కరించుకుని శుక్ర వారం నగర రోడ్లపై స్వైరవిహారం చేసే బైకర్లను లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ గురువారం తీవ్రంగా హెచ్చరించారు. యువత బాధ్యతా రహితంగా వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కొనాల్సి వస్తుందని అన్నారు. ప్రతి ఏడాది షబ్ ఏ బారాత్ సందర్భంగా బైకర్లు శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలు శ్రుతి మించుతుండడం తో, యువతను అదుపులో పెట్టాలని జంగ్ తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. షబ్ ఏ బారాత్‌ను పురస్కరించుకుని శాంతి భద్రతలకు, ట్రాఫిక్‌కు ఎలాంటి సమస్య సృష్టించరాదని నజీబ్ జంగ్ యువతను కోరారు. సమస్యలు సృష్టించే వారెవరైనా వయస్సుతో నిమిత్తం లేకుండా కఠిన చర్య చేపట్టవలసిందిగా పోలీసులను ఆదేశించారు. షబ్ ఏ బారాత్ ప్రార్థనలతో గడపాల్సిన రోజని, మృతులకు నివాళులు సమర్పించాల్సిన రోజని నజీబ్ జంగ్ తెలిపారు. ఇదిలా ఉండగా, బైకర్లను అదుపులో పెట్టడం కోసం పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. బైకర్లు శాంతి భద్రతలకు అంతరాయం సృష్టించకుండా ఉండడం కోసం పలుచోట్ల బారికేడ్లు అమర్చారు. గత సంవత్సరం షబ్ ఏ బారాత్ సందర్భంగా వందల మంది యువకులు మోటారుబైకులపై రాత్రి వేళ రోడ్లపైకి, ముఖ్యంగా ఇండియా గేట్ వద్దకు వచ్చి ఫీట్లు చేస్తూ, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారు. వారి అల్లరిచేష్టలు తెల్లవారుఝామువరకు కొనసాగాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని పోలీసులు ఈ సంవత్సరం వారిని అదుపులో పెట్టాలని నిర్ణయించారు. ఐటీఓ వద్ద బహదూర్షా మార్గ్ నుంచే బారికేడ్లను అమర్చి బైకర్లు గుంపులు గుంపులుగా ఇండియా గేట్ సి హెక్సాగన్ వద్దకు చేరుకోకుండా చూడాలని నిర్ణయించారు. శుక్రవారం రాత్రి బారికేడ్ల వద్ద ట్రాఫిక్ పోలీసులను కూడా మోహరిస్తామని, సరైన పత్రాలు కలిగి హెల్మెట్లు ధరించిన బైకర్లను మాత్రమే బారికేడ్లు దాటి వెళ్లేందుకు అనుమతిస్తామని పోలీసులు తెలిపారు. పాత ఢిల్లీ ప్రాంతంలో మత పెద్దలతో కూడా ఈ విషయమై మాట్లాడి వారిని జాగరూకులను చేయాలంటూ పోలీసు ఉన్నతాధికారులు బీట్ కానిస్టేబుళ్లను ఆదేశిం చారు. -
రెండు వారాల్లో పరిష్కారం
సాక్షి, న్యూఢిల్లీ:నగరంలో విద్యుత్ సంక్షోభానికి కారణం గత పన్నెండేళ్లుగా ఢిల్లీ సర్కారు చేతులు ముడుచుకుని కూర్చోవడమేనని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఆరోపించారు. ఈ సమస్యను ఓ కొలిక్కి తీసుకొచ్చేందుకు రెండు వారాలు పడుతుం ద ని ఆయన చెప్పారు. మంగళవారం ఉదయం అత్యవసర సమావేశాన్ని నిర్వహించిన మంత్రి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సమస్యపై లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్‌తో పాటు తమ శాఖ కార్యదర్శి, ఇతర అధికారులు, ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, విద్యుత్ శాఖ కార్యదర్శి, డిస్కంలతో సమావేశమై పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలను చర్చించినట్లు చెప్పారు. ఈ సంక్షోభానికి కారణం గత పన్నెండేళ్లుగా విద్యుత్ రంగానికి సంబంధించి సమగ్ర ప్రణాళిక , ముందుచూపు లోపించడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. 2002 నుంచి విద్యుత్ రంగంలో విధాన నిర్ణయం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పెట్టుబడులు కొరవడ్డాయని, ఎవరూ పట్టించుకోలేదని ఆరోపించారు. ముందుచూపు లేకనే పెరుగుతున్న జనాభా అవసరాలను దృష్టిలో పెట్టుకుని మౌలిక సదుపాయాలకు సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం తగు ప్రణాళికలు రూపొందించలేద న్నారు. గత పన్నెండేళ్లలో పవర్‌గ్రిడ్ సామర్థ్యం పెంచలేదని, అక్కడక్కడా ఓ ట్రాన్స్ఫార్మర్ వేయడమే తప్ప భవిష్యత్త్తు అవసరాలకు తగినట్లుగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. గత పన్నెండేళ్ల కాలంలో విద్యుత్ ఉత్పాదన 400 మెగావాట్ల మేర మాత్రమే పెరిగిందని ఆయన చెప్పారు. గడచిన 12 ఏళ్లలో 14 మంది, మూడేళ్లలో ఐదుగురు విద్యుత్ శాఖ కార్యదర్శులు మారారన్నారు. సమస్య తీవ్రతపై ప్రభుత్వ స్పందన అంతంతేననడానికి ఇదొక మచ్చుక మాత్రమేనని అన్నారు. ఢిల్లీ నగరంలో ఏడు ప్రధాన సబ్స్టేషన్లను, ఏడు ప్రధాన లైన్లను తక్షనమే ఆధునీకరించాల్సిన అవసరం ఉందని, అయితే గత ప్రభుత్వం దానిని పట్టించుకోలేదన్నారు. సరిపడా విద్యుత్ ఉన్నప్పటికీ దాని సరఫరాకు అవసరమైన డిస్ట్రిబ్యూషన్, ట్రాన్స్మిషన్ లైన్లు లేవన్నారు. ఇటీవలి గాలిదుమారంతోపాటు ఉష్ణోగ్రతల పెరుగుదల ఈ సమస్యను మరింత జటిలం చేసిందన్నారు. గాలిదుమారం కారణంగా దెబ్బతిన్న విద్యుత్ లైన్ల పునరుద్ధరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఆయన చెప్పారు. మండోలా- గోపాల్పూర్, బామ్నౌలీ- పప్పన్ కలాన్ లైన్లను ఇప్పటికే పునరుద్ధరించారన్నారు. సాధారణంగా మరమ్మతు పనులకు నెలల సమయం పడుతుందని, అయితే శరవేగంగా పూర్తి చేస్తున్నందుకుగాను సంబంధిత అధికారులను ఆయన అభినందించారు. బవానా ప్లాంట్‌కు గ్యాస్ సరఫరా బవానా గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్ ఉత్పాదన సామర్థ్యం మంగళవారం రాత్రి నుంచి పెరుగుతుందని, ఇందుకు కావాల్సిన గ్యాస్‌ను సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేశామని ఆయన చెప్పారు. 1,500 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఈ ప్లాంట్ కేవలం 290 మెగావాట్లు విద్యుత్‌ను మాత్రమే ఉత్పత్తి చేస్తోందని ఆయన చెప్పారు. విద్యుత్ ఉత్పాదన పెంపునకు గ్యాస్ అవసరమంటూ అధికారులు చెప్పారని, అందుకు ఎన్టీపీసీతోపాటు కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖతోనూ మాట్లాడానని ఆయన చెప్పారు. అయితే తాను సమస్యను రాజకీయం చేయాలనుకోవడం లేదని అంటూనే ఆయన గత కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. తూర్పు ఢిల్లీ ఎంపీ... తల్లి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ అక్కడ విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందని ఆయన ఆరోపించారు. ఈ సమస్య పరిష్కారం కోసం చేపట్టిన చర్యలను ఆయన వివరించారు. బదర్పూర్-నోయిడా-గాజీపూర్ లైను శుక్రవారం దెబ్బతిందని, భూగర్భ మరమ్మతు పనులు జరుగుతున్నాయన్నారు. అందుకు కావలసిన ఆరు జాయింట్లు ప్రస్తుతం అందుబాటులో లే వని అధికారులు చెప్పారని, వాటిని దేశంలో ఎక్కడినుంచైనా గానీ లేదా విదేశాల నుంచైనా గానీ తెప్పించి వేయాల్సిందిగా ఆదేశించానని గోయల్ చెప్పారు. మహారాణి బాగ్-గాజీపూర్ లైన్లో మూడు టవర్లను పునరుద్ధరించాల్సి ఉందని, వాటి పునరుద్ధరణ పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ పనికాకపోయినప్పటికీ ఆ పని దానికి అప్పగించి వారం రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించినట్లు మంత్రి చెప్పారు. బవానా- నరేలా లైన్ మరమ్మతు పనులను కూడా ప్రాధాన్యతాపరంగా చేపట్టనున్నట్లు ఆయన చెప్పారు. దాద్రీ -లోనీ- హర్ష్విహార్ ప్రాజెక్టుకు ఉత్తరప్రదేశ్ అటవీశాఖ క్లియరెన్స్ కావాలని అధికారులు చెప్పారని, ఈ విషయమై మీరట్ కమిషనర్‌తో మాట్లాడాల్సిందిగా అధికారులను అదేశించానని చెప్పారు. మండోలీలో మొబైల్ టవర్ మండోలీలో మొబైల్ టవర్‌ను ఏర్పాటుచేయనున్నట్లు ఆయన చెప్పారు. దక్షిణ ఢిల్లీలో మస్జీద్ మోడ్ వద్ద 100 మెగావాట్లు గ్రిడ్ పనులు జరుగుతున్నాయని, ఈ పనులు మంగళవారం రాత్రి వరకు పూర్తవుతాయని ఆయన చెప్పారు. విద్యుత్ ఫిర్యాదులకు సానుకూలంగా ప్రతిస్పందించాల్సిందిగా డిస్కంలను, 24 గంటలు ల్యాండ్ లైన్ ఫోన్లు, మొబైల్ ఫోన్లలో అందుబాటులో ఉండాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించినట్లు ఆయన చెప్పారు. ఎప్పుడు ఎక్కడ విద్యుత్ కోతలు విధిస్తారనే షెడ్యూల్‌ను ప్రతి రోజూ ఉదయం ఎనిమిది గంటలకు బులెటిన్ విడుదల చేయాలని డిస్కంలను ఆదేశించినట్లు చెప్పారు. తాను ఆదేశించిన పనుల ప్రగతిపై ఢిల్లీ ప్రభుత్వం ప్రతి సాయంత్రం ఐదు గంటలకు పురోగతి నివేదిక విడుదల చేస్తుందని ఆయన వివరించారు. -
కోత వేళలు ప్రకటించండి
న్యూఢిల్లీ: విద్యుత్ కోత వేళల షెడ్యూల్ ముందుగానే ప్రకటించాలని డిస్కంలను లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ ఆదేశించారు. అదేవిధంగా నగరంలోని మాల్స్‌కు రాత్రి పది గంటలతర్వాత కోత విధించాలని సూచించారు. ఈ మేరకు ఆదివారం సంబంధిత అధికారులతో సమావేశమై నగరంలో విద్యుత్ సరఫరాపై సమీక్షించారు. ‘మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటలవరకు, మళ్లీ రాత్రి పది గంటల నుంచి తెల్లవారుజామున ఒంటి గంటదాకా విద్యుత్ వినియోగం అధికంగా ఉంటుంది. అందువల్ల ఏయే సమయాల్లో కోత ఉంటుందనే విషయాన్ని ఆయా పంపిణీ సంస్థలు ముందస్తుగా ప్రకటించాలి’ అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. దీంతోపాటు నగరంలోని హైమాస్ట్ దీపాలు విద్యుత్‌ను భారీగా వినియోగించుకుంటాయని, అందువల్ల డిమాండ్ ఎక్కువగా ఉండే సమయాల్లో వాటిని ఆపివేయాలన్నారు. విద్యుత్ కొరత సమస్యను అధిగమించేందుకు అవలంబించాల్సిన విధానాలను ఆయన ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. కొన్ని ప్రాంతాల్లో ఇంకా మరమ్మతు పనులు కొనసాగుతున్నాయని, అందువల్ల విద్యుత్ సరఫరాలో కోత తప్పదని ఈ సందర్భంగా ఎల్జీ పేర్కొన్నారు. పెనుదుమారం కారణంగా దెబ్బతిన్న టవర్ల పునరుద్ధరణ ప్రక్రియ కూడా ఇంకా కొనసాగుతోందన్నారు. డిస్కంలు... తమ కాల్‌సెంటర్లు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా చూడాలన్నారు. అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించుకోవాలని సూచించారు. ప్రజలతో సంబంధాలను మెరుగుపరుచుకోవాలన్నారు. మరోవైపు ప్రజలు కూడా విద్యుత్‌ను అవసరమైన మేరకే వినియోగించుకోవాలని సూచించారు. కార్యాలయతోపాటు ఇళ్లల్లోని ఎయిర్ కండిషనర్లను అవసరమైన మేరకే వాడుకోవాలన్నారు. కాగా ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఢిల్లీ ట్రాన్స్‌కో సంస్థకు చెందిన ఉన్నతాధికారులతోపాటు అన్ని డిస్కంల సీఈఓలు పాల్గొన్నారు. -
బొమ్మలా కాదు... అమ్మో అనిపించేలా!
గవర్నర్ లేదా లెఫ్టినెంట్ గవర్నర్ పదవుల్లో ఉండే వ్యక్తులంటేకీ తిప్పితే ఆడే బొమ్మలనే అభిప్రాయం దాదాపు అందరిలోనూ ఉంటుంది. అయితే ఆప్ ప్రభుత్వం వైదొలగిన అనంతరం పాలనా బాధ్యతలు చేపట్టిన లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ మాత్రం తాను గుంపులో గోవిందయ్యను కానని నిరూపించుకుంటున్నారు. న్యూఢిల్లీ: ఢిల్లీ రాష్ట్రానికి నామమాత్రపు సారథి అనే ముద్రను లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ తొలగించుకున్నారు. ఎన్నికల్లో విజయం అనంతరం బాధ్యతలను చేపట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం...జన్ లోక్‌పాల్ బిల్లుకు శాసనసభలో ఆమోదం లభించకపోవడంతో రెండున్నర నెలల్లోనే వైదొలగిన సంగతి విదితమే. దీంతో ఢిల్లీ రాష్ట్రానికి లెఫ్టినెంట్ గవర్నర్‌గా నజీబ్ జంగ్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. బాధ్యతలు తనపై పడ్డాక నజీబ్ జంగ్ ఏదో మొక్కుబడిగా కాకుండా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారు. మొద్దునిద్రపోతున్న ప్రభుత్వ అధికారులను ఉరుకులుపరుగులు పెట్టిస్తున్నారు. నగర పౌరుల అవసరాలను తీర్చేందుకు తనవంతు కృషి చేస్తున్నారు. ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించిన అనంతరం ఈ ఏడాది ఫిబ్రవరి 17న జంగ్... లెఫ్టినెంట్ గవర్నర్‌గా బాధ్యతలను స్వీకరించారు. అప్పటినుంచి ఇప్పటివరకూ 12 పర్యాయాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న నగరంలోని పలు పాఠశాలలు, ఆస్పత్రులు, కళాశాలలను ఆయన తనిఖీ చేశారు. పూరిపాకలు అత్యధికంగా ఉండే వసంత్‌కుంజ్ పరిసరాల్లో అగ్నిప్రమాదం ఘటన చోటుచేసుకున్నప్పుడు తొలిసారి అక్కడకు చేరుకున్న వ్యక్తి ఎల్జీయే. దీంతో సంబంధిత అధికారులు కూడా అక్కడికి చేరుకోకతప్పలేదు. దీంతో ఇళ్లతోపాటు విలువైన సామగ్రిని కోల్పోయిన బాధిత కుటుంబాలకు కొంతమేర ఊరట లభించింది. ఎనిమిదిసార్లు సమావేశాలు ఎల్జీగా బాధ్యతలను చేపట్టిన అనంతరం నజీబ్‌జంగ్ వివిధ శాఖల అధిపతులతోపాటు అధికారులతో ఇప్పటివరకూ ఎనిమిది పర్యాయాలు సమావేశమయ్యారు. ఈ విషయాన్ని ఓ ఉన్నతాధికారి బుధవారం వెల్లడించారు. ఈ నెల ఒకటో తేదీన జరిగిన సమావేశం అనంతరం ఎల్జీ ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు నగరంలోని నిత్యావసరాల దుకాణాలు, రవాణా శాఖకు చెందిన ఐదు జోనల్ కార్యాలయాలు, 16 పెట్రోల్ బంకులు, ఐదు పాఠశాలలు, టోకు మార్కెట్లపై సంబంధిత అధికారులు మెరుపుదాడులు నిర్వహించారు. వాటి పనితీరును ఈ సందర్భంగా తనిఖీ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 21వ తేదీన అధికారులతో సమావేశమైన జంగ్.. ఆప్ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన పబ్లిక్ గ్రీవియెన్స్ సెల్ పనితీరును సమీక్షించారు. నగరంలోని పలు పాఠశాలలు, కళాశాలల్లో వసతుల మెరుగునకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. -
నిధులు విడుదల చేయండి
న్యూఢిల్లీ: అభివృద్ధి పనులను చేపట్టేందుకు వీలుగా ఎమ్మెల్యే కోటా నిధులను విడుదల చేయాలని లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్‌కు బీజేపీ విన్నవించింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ర్ట శాఖ అధ్యక్షుడు హర్షవర్ధన్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం మంగళవారం ఆయనకు ఓ వినతిపత్రం సమర్పించింది. ఇందుకు స్పందించిన ఎల్జీ.. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే విడుదల చేస్తానని హామీ ఇచ్చారు. ఎల్జీతో భేటీ అనంతరం హర్షవర్ధన్ మీడియాతో మాట్లాడుతూ చాలీచాలని విద్యుత్, నీటి సరఫరాతోపాటు పాఠశాలల్లో ప్రవేశాలకు సంబంధించి నగరవాసులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరామన్నారు. ప్రైవేటు విద్యుత్ సంస్థలు, వాటర్ ట్యాంకర్ మాఫియా నగరవాసుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయన్నారు. చాలీచాలని విద్యుత్, నీటి సరఫరాతోపాటు పాఠశాలల్లో ప్రవేశాలకు సంబంధించి నగరవాసులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరినట్టు తెలిపారు. ప్రైవేటు విద్యుత్ సంస్థలు, వాటర్ ట్యాంకర్ మాఫియా నగరవాసుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయన్నారు. సాధికార కమిటీని నియమించండి ప్రజారవాణా వ్యవస్థలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి సాధికార కమిటీని నియమించాలని కూడా ఎల్జీని కోరినట్టు తెలిపారు. ఈ కమిటీ ఎల్జీ నేతృత్వంలో ఏర్పాటు కావాలని, ఢిల్లీతోపాటు జాతీయ ప్రాదేశిక ప్రాంతం (ఎన్సీఆర్)లో ఎదురవుతున్న సమస్యలకు సంబంధించి సదరు కమిటీ మూడు నెలల్లోగా తన నివేదికను సమర్పించాలని కోరామన్నారు. నగరానికి పటిష్టమైన ప్రజారవాణా విధానం అవసరమని పేర్కొన్నారు. ప్రైవేటు, ప్రభుత్వ ప్రజారవాణా విధానాన్ని రూపొందించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఒకవైపు వాహనాల సంఖ్య పెరగడం, మరోవైపు ఆక్రమణలు పెరిగిపోవడం... పెద్దసంఖ్యలో ప్రమాదాలు జరగడానికి కారణమవుతోందన్నారు. నగరంలో ఫుట్‌పాత్‌లు మాయమైపోయాయన్నారు. ఇది కూడా ప్రమాదాలకు హేతువవుతోందన్నారు. రాజధాని నగరంలో ప్రైవేటు బస్సులకు టెర్మినల్ లే దన్నారు. రోడ్డుప్రమాదాలకు ఈ బస్సులు కూడా కారణమవుతున్నాయన్నారు. వీటిని ట్రాన్స్‌పోర్టు మాఫియా నడుపుతోందన్నారు. వీటి సేవలను నియంత్రించేందుకు తాత్కాలిక నిషేధాజ్ఞ ఉండాలన్నారు. -
ఢిల్లీ అసెంబ్లీకి మళ్లీ ఎన్నికలు...?
-
ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ విముఖత
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ విముఖత వ్యక్తం చేసింది. అసెంబ్లీలో తమకు తగినంత బలం లేనందున ప్రభుత్వం ఏర్పాటు చేయలేమని లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్కు తెలిపినట్టు బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి హర్షవర్థన్ తెలిపారు. శాసనసభ ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇవ్వనందున ప్రతిపక్షంలోనే కూర్చుంటామని చెప్పామన్నారు. ఈ సాయంత్రం లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌తో హర్షవర్థన్ సమావేశమయ్యారు. ప్రభుత్వం ఏర్పాటుపై చర్చించేందుకు గవర్నర్ తనను ఆహ్వానించారని హర్షవర్థన్ తెలిపారు. అయితే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తాము నిరాకరించామని ఆయన వెల్లడించారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 31 సీట్లు గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆమ్ ఆద్మీ పార్టీ 28 సీట్లు గెల్చుకుని ద్వితీయ స్థానంలో నిలిచింది.