సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌ల మధ్య విబేధాలు పతాక స్థాయికి చేరుకున్నాయి. అన్ని ప్రభుత్వ ఫైళ్లు తన వద్దకు తప్పక రావల్సిందేనని నజీబ్ జంగ్.. సీఎం కేజ్రీవాల్‌కు లేఖ రాశారు. అన్ని ఫైళ్లను ఎల్జీ కార్యాలయానికి పంపనవసరం లేదని ఢిల్లీ ప్రభుత్వం కిందనున్న అన్ని ప్రభుత్వ విభాగాలకు కేజ్రీవాల్ కార్యాలయం ఏప్రిల్ 29న లేఖ రాసింది. దీంతో లెఫ్టినెంట్ గవర్నర్ ఈ ఉత్తర్వును ఉపసంహరించుకోవాలని సీఎంను కోరారు. ఎల్జీ కార్యాలయానికి ఫైళ్లు పంపరాదని అధికారులను కోరడం రాజ్యాంగపరంగా సరైనది కాదని పేర్కొంటూ ఆదివారం పత్రికా ప్రకటన విడుదల చేశారు.
ముఖ్యమంత్రి కేజ్రీవాల్, లెప్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌ల మధ్య మొదటి నుంచీ సామరస్యత లేదన్నది అందరికీ తెలిసిన విషయమే. ఫిబ్రవరిలో కేజ్రీవాల్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎల్జీ కార్యాలయం, సీఎం కార్యాలయం ఎడమొఖం, పెడమొఖంగానే ఉంటున్నాయి. ఢిల్లీ ప్రభుత్వ పరిధి కిందకు రాని పోలీసు, శాంతిభద్రతలు, భూమి ఇత్యాది అంశాలకు సంబంధించిన ఫైళ్లను తన ద్వారా పంపాలని కేజ్రీవాల్.. లెఫ్టినెంట్ గవర్నర్‌ను కోరారు. అందుకు ఎల్జీ నిరాకరించారు. దీంతో ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన అన్ని పైళ్లను ఎల్జీకి పంపాల్సిన అవసరం లేదని సీఎం కార్యదర్శి రాజేందర్‌కుమార్ ఏప్రిల్ 29న నోటిఫికేషన్ జారీ చేశారు.
దీంతో కినుక చెందిన జంగ్ ఈ ఉత్వర్వును ఉపసంహరించుకోవలసిందిగా ఆదివారం సీఎం కార్యాలయాన్ని దేశించారు. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఆదేశాన్ని కాంగ్రెస్, బీజేపీలు విమర్శిస్తున్నాయి. అయితే ప్రభుత్వ పనితీరును మెరుగుపరచడం కోసం, ఫైళ్ల కదలికలో వేగం పెంచడం కోసం ఈ ఆదేశాలు జారీ చేసినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం కింద ఉండే ఢిల్లీ పోలీసు, శాంతిభద్రతల అంశాలను తన పరిధిలోకి తెచ్చుకోవాలని ఆమ్ ఆద్మీ సర్కారు ఆశిస్తోంది. ఈ రెండింటిపై అధికారం లేనట్లయితే ఢిల్లీ సర్కారు బలహీనంగా ఉంటుందని ఆప్ సర్కారు భావిస్తోంది.
సీఎం, గవర్నర్ మధ్య ముదిరిన వివాదం
Published Mon, May 4 2015 11:57 PM | Last Updated on Sun, Sep 3 2017 1:25 AM
Advertisement
Advertisement