గవర్నర్ లేదా లెఫ్టినెంట్ గవర్నర్ పదవుల్లో ఉండే వ్యక్తులంటేకీ తిప్పితే ఆడే బొమ్మలనే అభిప్రాయం దాదాపు అందరిలోనూ ఉంటుంది. అయితే ఆప్ ప్రభుత్వం వైదొలగిన అనంతరం పాలనా బాధ్యతలు చేపట్టిన లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ మాత్రం తాను గుంపులో గోవిందయ్యను కానని నిరూపించుకుంటున్నారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ రాష్ట్రానికి నామమాత్రపు సారథి అనే ముద్రను లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ తొలగించుకున్నారు. ఎన్నికల్లో విజయం అనంతరం బాధ్యతలను చేపట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం...జన్ లోక్‌పాల్ బిల్లుకు శాసనసభలో ఆమోదం లభించకపోవడంతో రెండున్నర నెలల్లోనే వైదొలగిన సంగతి విదితమే. దీంతో ఢిల్లీ రాష్ట్రానికి లెఫ్టినెంట్ గవర్నర్‌గా నజీబ్ జంగ్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. బాధ్యతలు తనపై పడ్డాక నజీబ్ జంగ్ ఏదో మొక్కుబడిగా కాకుండా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారు. మొద్దునిద్రపోతున్న ప్రభుత్వ అధికారులను ఉరుకులుపరుగులు పెట్టిస్తున్నారు. నగర పౌరుల అవసరాలను తీర్చేందుకు తనవంతు కృషి చేస్తున్నారు.
ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించిన అనంతరం ఈ ఏడాది ఫిబ్రవరి 17న జంగ్... లెఫ్టినెంట్ గవర్నర్‌గా బాధ్యతలను స్వీకరించారు. అప్పటినుంచి ఇప్పటివరకూ 12 పర్యాయాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న నగరంలోని పలు పాఠశాలలు, ఆస్పత్రులు, కళాశాలలను ఆయన తనిఖీ చేశారు. పూరిపాకలు అత్యధికంగా ఉండే వసంత్‌కుంజ్ పరిసరాల్లో అగ్నిప్రమాదం ఘటన చోటుచేసుకున్నప్పుడు తొలిసారి అక్కడకు చేరుకున్న వ్యక్తి ఎల్జీయే. దీంతో సంబంధిత అధికారులు కూడా అక్కడికి చేరుకోకతప్పలేదు. దీంతో ఇళ్లతోపాటు విలువైన సామగ్రిని కోల్పోయిన బాధిత కుటుంబాలకు కొంతమేర ఊరట లభించింది.
ఎనిమిదిసార్లు సమావేశాలు
ఎల్జీగా బాధ్యతలను చేపట్టిన అనంతరం నజీబ్‌జంగ్ వివిధ శాఖల అధిపతులతోపాటు అధికారులతో ఇప్పటివరకూ ఎనిమిది పర్యాయాలు సమావేశమయ్యారు. ఈ విషయాన్ని ఓ ఉన్నతాధికారి బుధవారం వెల్లడించారు. ఈ నెల ఒకటో తేదీన జరిగిన సమావేశం అనంతరం ఎల్జీ ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు నగరంలోని నిత్యావసరాల దుకాణాలు, రవాణా శాఖకు చెందిన ఐదు జోనల్ కార్యాలయాలు, 16 పెట్రోల్ బంకులు, ఐదు పాఠశాలలు, టోకు మార్కెట్లపై సంబంధిత అధికారులు మెరుపుదాడులు నిర్వహించారు. వాటి పనితీరును ఈ సందర్భంగా తనిఖీ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 21వ తేదీన అధికారులతో సమావేశమైన జంగ్.. ఆప్ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన పబ్లిక్ గ్రీవియెన్స్ సెల్ పనితీరును సమీక్షించారు. నగరంలోని పలు పాఠశాలలు, కళాశాలల్లో వసతుల మెరుగునకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు.
బొమ్మలా కాదు... అమ్మో అనిపించేలా!
Published Wed, May 7 2014 10:42 PM | Last Updated on Sat, Sep 2 2017 7:03 AM
Advertisement