ప్రభుత్వం ఏర్పాటు దిశగా బీజేపీ
ప్రభుత్వ ఏర్పాటు విషయంలో నిన్నామొన్నటిదాకా ఊగిసలాట ధోరణిని ప్రదర్శించిన బీజేపీ ఇప్పుడు ఆ దిశగానే సంకేతాలిచ్చింది. ఒకవేళ అదే జరిగితే ముఖ్యమంత్రి పదవి రేసులో జగదీశ్ ముఖి... అందరికంటే ముందుండొచ్చని భావిస్తున్నారు. బీజేపీ సంకేతాల నేపథ్యంలో లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఏమిచేస్తారనేది ఇప్పుడు కీలకంగా మారింది. మరోవైపు అవసరమైన సంఖ్యాబలం కోసం బీజేపీ ఏమిచేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఆహ్వానిస్తే ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఈ విషయాన్ని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఒకవేళ అదే కనుక జరిగితే ఆ ఆ పార్టీ సీనియర్ నాయకుడు జగదీశ్‌ముఖి సీఎం పదవి రేసులో అందరికంటే ముందుండొచ్చని అంటున్నారు. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ బుధవారం ఉదయం ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. కాగా 28 మంది పార్టీ ఎమ్మెల్యేలతో సతీష్ ఉపాధ్యాయ లాంఛనంగా సమావేశమవడం ఇదే మొదటిసారి. ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందనే ఊహాగానాల నేపథ్యంలో ఆ పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.అయితే సతీష్ ఉపాధ్యాయ మాత్రం....కొత్తగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నేతత్వంలో ఈ సమావేశం జరిపినట్లు చెబుతున్నారు. ఢిల్లీలో రాజకీయ పరిస్థితిని ఈ సమావేశంలో చర్చించామని అంగీకరించిన ఆయన... ప్రభుత్వ ఏర్పాటుపై చర్చ జరిగిందా? లేదా? అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.
మంగళవారం సాయంత్రం ఉపాధ్యాయ ఢిల్లీ ఎంపీలతో పార్టీ కార్యవర్గంతో సమావేశమయ్యారు. హర్షవర్ధన్ మినహా మిగతా ఆరుగురు ఎంపీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ రెండు సమావేశా ల్లో ప్రభుత్వ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై చర్చించారని అంటున్నారు. అయితే ఈ విషయంలో ఆ పార్టీలో భిన్నాభిప్రాయాలున్నాయని అంటున్నారు. హర్షవర్ధన్‌తో పాటు కొందరు బీజేపీ నేతలు ప్రభుత్వ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారని, అందువల్ల ఆమ్ ఆద్మీ పార్టీకి లాభం కలుగుతుందని వారు భావిస్తున్నారని అంటున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విదేశీ యాత్రను ముగించుకుని రాజధానికి తిరిగివచ్చిన తర్వాతే ఈ అంశంపై తుది నిర్ణయం వెలువడుతుందని అంటున్నారు. అయితే కొందరు ఎమ్మెల్యేలు తక్షణం ప్రభుత్వం ఏర్పాటుచేయాలని కోరుతున్నారు.
వెంటనే ఎల్జీని కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు సంసిద్ధత ప్రకటించాలని వారు భావిస్తున్నట్టు తెలిసింది. అకాలీదళ్‌తో సభ్యుడితో కలుపుకుని శాసనసభలో బీజేపీకి 29 మంది సభ్యుల బలం ఉంది. ఓ స్వతంత్ర ఎమ్మెల్యేపాటు మరో జేడీయూకి చెందిన మరో ఎమ్మెల్యే మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆ పార్టీకి చెందిన కొందరు ఒత్తిడి చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటుచేసేందుకు తాము సుముఖంగా ఉన్నామని అంటోన్న బీజేపీ వర్గాలు అందుకు అవసరమైన సంఖ్యాబలాన్ని సమకూర్చుకునే అవకాశాల విషయంలో పెదవి విప్పడం లేదు. ప్రభుత్వ ఏర్పాటుపై ఊహాగానాలు జోరందుకున్న నేపథ్యంలో లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్, అసెంబ్లీ స్పీకర్ ఎం.ఎస్. ధీర్‌ల పాత్ర అత్యంత కీలకం కానుంది. ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఉందని, ఒకవేళ అటువంటిదేమీ జరగకపోతే అప్పుడు మాత్రమే ఎన్నికలు అనివార్యమవుతాయని నజీబ్‌జంగ్ బుధవారం పేర్కొనడం విశేషం. ఒకవేళ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమని బీజేపీ ముందుకొస్తే సంఖ్యాబలం ఉందని నిరూపించడం కోసం ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే ఎమ్మెల్యేలను తన ముందు ప్రవేశపెట్టాలని నజీబ్ కోరవచ్చు లేదా నేరుగా ప్రభుత్వం ఏర్పాటుచేసే వీలు కల్పించి బలనిరూపణ కోసం కొంత సమయం ఇవ్వవచ్చు.