సాక్షి, న్యూఢిల్లీ : వందేమాతరం జాతీయ గీతాన్ని రచించిన ప్రముఖ బెంగాలీ రచయిత భంకిమ్ చంద్ర ఛటర్జీ జయంతిని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన స్మారక కార్యక్రమాన్ని ఉద్దేశించి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బుధవారం ప్రసంగించిన విషయం తెల్సిందే. ఈ ప్రసంగం ద్వారా అమిత్ షా 2019లో సార్వత్రిక ఎన్నికలకు ప్రచార శంఖారావాన్ని పూరించారంటూ అటు బీజేపీ, ఇటు మీడియా తెగ ప్రచారం చేశాయి. అయితే సమావేశానికి ముఖ్య అతిథులుగా ఆహ్వానించిన బెంగాల్ మేధావులే హాజరుకాలేదు.
ప్రముఖ బెంగాలీ నటి సౌమిత్రా ఛటర్జీ, మాజీ సుప్రీం కోర్టు జడ్జీ అశోక్ గంగూలి. రచయిత సంతోష్ రాణా, థియేటర్ ప్రముఖులు రుద్రప్రసాద్ సేన్ గుప్తా, చందన్ సేన్, మనోజ్ మిత్ర, గాయకుడు అమర్ పాల్, పెయింటర్ సమీర్ అయీచ్‌లకు బీజేపీ నుంచి ఆహ్వానాలు అందాయి. వీరిలో ఒక్కరు కూడా హాజరు కాలేదు. పెద్ద నోట్ల రద్దు, కొన్ని సామాజిక వర్గాలను లక్ష్యంగా చేసుకొని బీజేపీ రాజకీయాలు నెరపడాన్ని నిరసిస్తూ తాను ఈ సమావేశానికి రావడం లేదని సౌమిత్రా ఛటర్జీ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ప్రముఖల్లో బెంగాలీ భాషా రచయిత బుద్ధదేవ్ గుహ మాత్రమే సమావేశానికి హాజరయ్యారు.
పాలకపక్షం బెదిరించడం వల్లనే ముఖ్య అతిథులు సమావేశానికి హాజరుకాలేకపోయారని బెంగాల్ బీజేపీ నాయకుడు బాబుల్ సుప్రియో ఆరోపించారు. తమకు ఓటు వేయని మేధావులను బెదిరించడం బెంగాల్ పాలకపక్షానికి ఎప్పుడూ ఉండే ఆనవాయితేనని ఆయన అన్నారు. మేధావులు తమ సభలకు హాజరుకాకపోయినా వారు ఎప్పుడు ఫోన్లలో తమకు అందుబాటులోనే ఉన్నారని ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment