Babul Supriyo
-
మమత మార్క్ రాజకీయం.. బీజేపీ మాజీ ఎంపీకి మంత్రివర్గంలో చోటు!
కోల్‌కతా: పాఠశాల నియామకాల కుంభకోణంలో అరెస్టయిన మాజీ మంత్రి పార్థా ఛటర్జీని మంత్రి పదవి నుంచి తొలగించిన తర్వాత కేబినెట్ విస్తరణ చేపట్టారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. బుధవారం మధ్యాహ్నం ఐదుగురు కొత్తగా మంత్రులుగా ప్రమాణం చేశారు. అందులో బీజేపీ మాజీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి బాబుల్ సుప్రియోకు చోటు కల్పించారు దీదీ. గత ఏడాదే బీజేపీ నుంచి తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు బాబుల్ సుప్రియో. బాబుల్ సుప్రియోతో పాటు స్నేహాశిష్ చక్రబర్తి, పార్థా బౌమిక్, ఉదయాన్ గుహా, ప్రదిప్ మజందెర్లు మంత్రులుగా ప్రమాణం చేశారు. వారికి కీలక శాఖలు కేటాయించనున్నారని సమాచారం. స్నేహాశిష్ చక్రబర్తి ప్రస్తుతం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు. హూగ్లీ జిల్లాలో ఇంఛార్జ్‌గా సేవలందిస్తున్నారు. పార్థా బౌమిక్ మూడు సార్లు నైహాతి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉదయాన్ గుహా ఫార్వర్డ్ బ్లాక్ నేత, 2016లో టీఎంసీ తీర్థం పుచ్చుకున్నారు. పార్థా ఛటర్జీ అరెస్ట్ నేపథ్యంలో ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించారు మమతా బెనర్జీ. ఆయన నిర్వహించిన పారిశ్రామిక, వాణిజ్య, పార్లమెంటరీ వ్యవహారాల వంటి ఐదు కీలక శాఖలను తన వద్దే అట్టిపెట్టుకున్నారు. మంత్రివర్గ విస్తరణపై మంగళవారం ప్రకటన చేసిన దీదీ.. రాష్ట్రంలో జిల్లాల సంఖ్యను 23 నుంచి 30కి పెంచుతున్నట్లు తెలిపారు. సుబ్రతా ముఖర్జీ, సధన్ పాండేలను కోల్పోయామని, పార్థా చటర్జీ జైలుకు వెళ్లిన క్రమంలో వారికి సంబంధించిన శాఖలను తాను మోయలేకపోతున్నట్లు పేర్కొన్నారు. ఇదీ చదవండి: Gujarat Elections 2022: కాంగ్రెస్‌కు షాక్.. బీజేపీలోకి ఇద్దరు కీలక నేతలు! -
సీఎం పగ్గాల తర్వాత లగ్గం చేసుకుంది వీళ్లే!
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(49) వివాహం ఇవాళ వార్తల్లో ప్రముఖంగా నిలిచింది. దగ్గరి బంధువు డాక్టర్ గుర్ప్రీత్ కౌర్(32)తో కొద్దిమంది సమక్షంలోనే ఆయన వివాహం జరిగింది. ముఖ్యమంత్రి హోదాలో ఆయన వివాహం జరగడం చర్చనీయాంశంగా మారగా.. గతంలోనూ ఇలా రాజకీయంగా అత్యున్నత హోదాలో ఉండి.. మళ్లీ పెళ్లి చేసుకున్న ప్రముఖులు చాలా మందే ఉన్నారు. హెచ్డీ కుమారస్వామి జేడీ(ఎస్) నేత హెచ్డీ కుమారస్వామి.. కర్ణాటక ముఖ్యమంత్రిగా 2006-07 మధ్య కాలంలో పని చేశారు. 1986లోనే ఆయనకు వివాహం అయ్యింది. అయితే.. 2006లో ఆయన కన్నడ నటి రాధికను రహస్యంగా రెండో వివాహం చేసుకున్నారు. నాలుగేళ్ల తర్వాత రాధిక తనంతట తానుగా ప్రకటించేదాకా ఈ విషయం బయటకు తెలీలేదు. ఆ తర్వాత కుమారస్వామి కూడా ఆ విషయాన్ని అంగీకరించారు. వీర్‌భద్ర సింగ్ హిమాచల్ ప్రదేశ్ రాజకీయాల్లో తిరుగులేని నేత ఈయన. 1962, 1967, 1971లో.. మూడుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. అయితే 1983లో వీర్‌భద్ర సింగ్.. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ఏడేళ్లపాటు సీఎంగా ఉన్నారు. ఆ సమయంలోనే 1985లో ప్రతిభా సింగ్‌ను రెండో వివాహం చేసుకున్నారు ఆయన. మొదటి భార్య రత్నకుమారి(జుబ్బల్ యువరాణి) అప్పటికే అనారోగ్యంతో మరణించింది. ప్రతిభా సింగ్ ఎవరో కాదు.. మండి లోక్ సభ ఎంపీ. బాబుల్ సుప్రియో మాజీ కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో. 2015లో మొదటి భార్య నుంచి విడాకులు తీసుకున్న ఈయన.. 2019లో మోదీ కేబినెట్లో కేంద్ర మంత్రిగా ఉండగానే ఎయిర్ హోస్టెస్ రచనా శర్మను రెండో వివాహం చేసుకున్నారు. ముంబై నుంచి కోల్‌కతా మధ్య ఫ్లైట్‌లో ప్రయాణించేప్పుడు వాళ్ల మధ్య పరిచయం అయ్యింది. చందర్ మోహన్ హర్యానా మాజీ ఉప ముఖ్యమంత్రి. ఈయన వివాహ జీవితం వివాదాస్పదంగా నిలిచింది. 2008లో మంత్రి పదవిలో ఉన్నప్పడు.. ప్రేయసి అనురాధా బాలి కోసం మతం మార్చుకున్నాడు ఆయన. భార్య సీమా భిష్ణోయ్ సమ్మతితోనే.. చాంద్ మొహమ్మద్, ఫిజా(అనురాధా బాలి)గా ఇద్దరూ పేర్లు మార్చుకుని మరీ వివాహం చేసుకున్నారు. కానీ, ఈ చర్య ఆయన రాజకీయ ప్రస్థానాన్ని ఘోరంగా దెబ్బ తీసింది. అయితే ఈ ప్రేమ కథ ఎన్నోరోజులు సాఫీగా సాగలేదు. కొన్నిరోజులకే ఇద్దరూ విడిపోగా.. 2012లో బాలి అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. ప్రఫుల్లా కుమార్ మహంతా అస్సాం మాజీ ముఖ్యమంత్రి. 1985 డిసెంబర్ నుంచి 1990 వరకు ఆయన సీఎంగా విధులు నిర్వహించారు. సీఎంగా ఉన్న టైంలో 1988లో జయశ్రీ గోస్వామి మహంతను ఆయన వివాహం చేసుకున్నారు. రైటర్ అయిన జయశ్రీ గోస్వామి.. ఆ తర్వాత రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు కూడా. అయితే.. అసెంబ్లీ సెక్రటేరియెట్ ఎంప్లాయి సంఘమిత్ర భరాలిని ఆయన రహస్యంగా రెండో వివాహం చేసుకున్నారన్న ఆరోపణలు ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. భార్య జయశ్రీ గోస్వామితో ప్రఫుల్లా కుమార్ మహంతా -
మమతా బెనర్జీ అనూహ్య నిర్ణయం..
సమకాలీన రాజకీయాల్లో నరేంద్ర మోదీకి దీటుగా దూసుకుపోతున్న నాయకురాలు మమతా బెనర్జీ. పశ్చిమ బెంగాల్లో ఖాళీగా ఉన్న ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు ఎవరూ ఊహించని విధంగా అభ్యర్థులను ప్రకటించి మరోసారి తన ప్రత్యేకత చాటుకున్నారు దీదీ. సినిమా రంగంలో అగ్రతార వెలుగొంది రాజకీయాల్లోకి వచ్చిన ‘రెబల్ స్టార్’ శత్రుఘ్న సిన్హాను అనూహ్యంగా మళ్లీ రాజకీయ తెర మీదకు తెచ్చారు. కొంత కాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయనకు పిలిచి మరీ ఎంపీ సీటు ఇచ్చి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. బెంగాల్లో ఖాళీగా ఉన్న అసన్సోల్ లోక్‌సభ స్థానం, బాలేగంజ్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల సంఘం తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో ఈ రెండు స్థానాలకు మమతా బెనర్జీ అభ్యర్థులను ప్రకటించారు. అసన్సోల్ నుంచి శత్రుఘ్న సిన్హా, బాలేగంజ్లో బాబుల్ సుప్రియోలు తమ పార్టీ తరపున పోటీ చేస్తారని ఆమె ప్రకటించారు. అయితే బాబుల్ సుప్రియో రాజీనామాతో ఖాళీ అయిన అసన్సోల్ లోక్‌సభ స్థానాన్ని శత్రుఘ్న సిన్హాకు కేటాయించడం విశేషం. సిన్హాకే ఎందుకు? బిహార్‌లోని పట్నా లోక్‌సభ నియోజక వర్గం నుంచి 2009, 2014 ఎన్నికల్లో బీజేపీ ఎంపీగా గెలిచిన శత్రుఘ్న సిన్హా కేంద్రంలోని వాజపేయి కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. అయితే తర్వాత కాలంలో మోదీ పాలనకు వ్యతిరేకంగా గళమెత్తారు. దీంతో 2019 ఎన్నికల్లో ఆయనకు బీజేపీ టిక్కెట్ దక్కలేదు. ఈ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్‌కు మద్దతుగా బెంగాల్లో ఆయన ప్రచారం చేశారు. ఈ కారణం వల్లే ఆయనకు అసన్సోల్ ఉప ఎన్నికలో పోటీ చేసే అవకాశం దీదీ కల్పించినట్టు తెలుస్తోంది. అసన్సోల్ to బాలేగంజ్ గాయకుడు, నటుడైన బాబుల్ సుప్రియో.. అసన్సోల్ లోక్‌సభ స్థానం నుండి రెండుసార్లు బీజేపీ ఎంపీగా ప్రాతినిథ్యం వహించారు. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచి విజయం సాధించి కేంద్ర కేబినెట్లోనూ స్థానం సంపాందించారు. 2021, మార్చి-ఏప్రిల్‌లో జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆయనను టోలీగంజ్ నియోజకవర్గం నుంచి పోటీకి దించింది. అయితే ఆయన ఘోర పరాజయం పాలవడంతో పాటు కేంద్ర కేబినెట్లోనూ స్థానం కోల్పోయారు. తర్వాత పరిస్థితులు ప్రతికూలంగా మారడంతో బీజేపీని వీడి గతేడాది సెప్టెంబర్‌లో టీఎంసీలో చేరారు. తర్వాత నెలలో లోక్‌సభ సభ్యత్వాన్ని అధికారికంగా వదులుకున్నారు. తాజాగా ఆయన బాలేగంజ్ ఉప ఎన్నిక బరిలో నిలిచారు. (UP Election 2022: పార్టీల వారీగా సీట్లు, ఓట్ల శాతం..) ఇద్దరూ ఇద్దరే! శత్రుఘ్న సిన్హా, బాబుల్ సుప్రియోలకు చాలా పోలికలు ఉన్నాయి. ఇద్దరూ సినిమా రంగం నుంచి రాజకీయాలకు వచ్చి కేంద్ర మంత్రులుగా పనిచేశారు. బీజేపీని వ్యతిరేకించి ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీలో నిలిచారు. ఉప ఎన్నికల్లో వీరు విజయం సాధిస్తారా.. మమతా బెనర్జీ వ్యూహం ఏమేరకు ఫలిస్తోందో వేచి చూడాలి. అసన్సోల్, బాలేగంజ్ స్థానాలకు ఏప్రిల్ 12న పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 16న ఫలితాలు వెలువడతాయి. (క్లిక్: ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ) -
ఎంపీ పదవికి బాబుల్ సుప్రియో రాజీనామా
న్యూఢిల్లీ: బీజేపీ మాజీ నేత బాబుల్ సుప్రియో లోక్‌సభ సభ్యత్వానికి అధికారికంగా రాజీనామా చేశారు. నెల రోజుల క్రితం ఆయన బీజేపీకి రాజీనామా చేసి టీఎంసీ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. మంగళవారం సుప్రియో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి, రాజీనామా పత్రం అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘ఎంపీ పదవికి రాజీనామా చేసినందుకు నా మనసెంతో వేదనకు గురవుతోంది. నాపై నమ్మకం ఉంచిన ప్రధాని మోదీకి, పార్టీ అధ్యక్షుడు నడ్డాకు, హోం మంత్రి అమిత్ షాకు కృతజ్ఞతలు’ అని తెలిపారు. పశ్చిమబెంగాల్లోని ఆసన్సోల్ నుంచి రెండు పర్యాయాలు ఆయన లోక్‌సభకు ఎన్నికయ్యారు. చదవండి: యూపీలో 40% టికెట్లు మహిళలకే -
బెంగాల్లో బీజేపీకి షాక్
-
మొన్నటి వరకూ కేంద్రమంత్రి.. ఇప్పుడు టీఎంసీ గూటికి
కలకత్తా: ఇటీవల చేపట్టిన కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో పోస్టు కోల్పోయిన కేంద్ర మాజీ మంత్రి బాబుల్ సుప్రియో బీజేపీకి బైబై చెప్పేసి ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. కొన్ని రోజులు కిందట బీజేపీకి రాజీనామా చేసిన ఆయన తాజాగా శనివారం టీఎంసీ గూటికి చేరారు. బాబుల్ సుప్రియోను ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ, రాజ్య సభ సభ్యుడు డెరెక్ బబ్రెయిన్ సాదర స్వాగతం పలికారు. చదవండి: మహిళలను గౌరవిస్తే మీకు 23 సీట్లు వచ్చేవి కావు:హోంమంత్రి మరోసారి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో జూలై 31వ తేదీన ఇక రాజకీయాల నుంచే వైదొలుగుతున్నట్లు సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. లోక్‌సభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తానని ప్రకటించారు కూడా. పశ్చిమ బెంగాల్‌కు చెందిన బాబుల్ సుప్రియో ప్రముఖ గాయకుడు. 2014 ఎన్నికల సమయంలో బీజేపీలో చేరి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. సార్వత్రిక ఎన్నికల్లో అస్సనోల్ నుంచి పోటీ చేసి తొలిసారి ఎంపీగా గెలిచారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తొలి మంత్రివర్గంలో బాబుల్ సుప్రియో చేరారు. పట్టణ అభివృద్ధి సహాయ మంత్రిగా పని చేశారు. 2019 ఎన్నికల్లో మళ్లీ అస్సనోల్ నుంచి గెలుపొంది కేంద్రమంత్రిగా నియమితులయ్యారు. చదవండి: పొట్టి దుస్తులు వేసుకోవడం నేరమా? అయితే ఇటీవల కేంద్రమంత్రివర్గంలోకి తనను తీసుకోకపోవడంతో బీజేపీకి బైబై చెప్పేశారు. వాటితోపాటు మరికొన్ని కారణాలుకూడా ఉన్నాయి. కొన్ని నెలల కిందట జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా బాబుల్ సుప్రియోను బీజేపీ బరిలో దింపింది. అనూహ్యంగా సుప్రియో తృణమూల్ కాంగ్రెస్ చేతిలో పరాజయం పొందాడు. దీంతోపాటు రాష్ట్రంలో బీజేపీ ఆశించిన ఫలితాలు పొందలేదు. ఇది దృష్టిలో ఉంచుకుని బీజేపీ అధినాయకత్వం కేంద్ర మంత్రివర్గం నుంచి ఆయనను తొలగించింది. ఈ క్రమంలోనే ఆయన మనస్తాపానికి గురయ్యారు. ఆ క్రమంలోనే బీజేపీకి రాజీనామా చేశారు. తాజాగా తృణమూల్‌లో చేరడంతో ఆయన రాజకీయ సన్యాసం చేస్తారనే వార్తలకు తెర పడింది. Today, in the presence of National General Secretary @abhishekaitc and RS MP @derekobrienmp, former Union Minister and sitting MP @SuPriyoBabul joined the Trinamool family. We take this opportunity to extend a very warm welcome to him! pic.twitter.com/6OEeEz5OGj — All India Trinamool Congress (@AITCofficial) September 18, 2021 -
ఎంపీగా కొనసాగుతా.. రాజకీయాల్లో ఉండను
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్లోని అసన్సోల్ లోక్‌సభ సభ్యుడు, కేంద్రమాజీ మంత్రి బాబుల్ సుప్రియో మనస్సు మార్చడంలో బీజేపీ అధిష్టానం కొంతమేర సఫలీకృతమైంది. పార్లమెంట్ సభ్యుడిగా రాజీనామా చేయాలన్న నిర్ణయాన్ని మార్చుకున్నట్లు ఆయన సోమవారం ఢిల్లీలో ప్రకటించారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సోమవారం సమావేశమైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘పార్లమెంట్ సభ్యుడిగా రాజ్యాంగ బాధ్యతలను నెరవేరుస్తా. ముందుగా ప్రకటించిన విధంగా క్రియాశీల రాజకీయాల నుంచి మాత్రం వైదొలుగుతా’అని వెల్లడించారు. ఢిల్లీలోని అధికార నివాసాన్ని కూడా ఖాళీ చేశానన్నారు. ఇటీవల ప్రధాని మోదీ చేపట్టిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సమయంలో మంత్రిగా ఉన్న బాబుల్ సుప్రియోతో రాజీనామా చేయించిన విషయం తెలిసిందే. ఈ పరిణామంతో మనస్తాపం చెందిన సుప్రియో ఎంపీ పదవికి రాజీనామా చేసి, క్రియాశీల రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. కానీ, పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ చేతిలో ఘోర పరాజయం షాక్ నుంచి తేరుకోని బీజేపీ.. సుప్రియో రాజీనామాతో జరగనున్న ఉప ఎన్నికల్లో పోటీ పడి, నెగ్గే పరిస్థితిలో లేదు. ఈ పరిణామాన్ని ఊహించిన బీజేపీ చీఫ్ నడ్డా, హోం మంత్రి అమిత్ షాలు ఎంపీ పదవిలో కొనసాగేలా సుప్రియోను ఒప్పించడంలో విజయం సాధించారు. రాష్ట్రంలో పార్టీ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కొంతమేరకు తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు మీడియాకు తెలిపారు. -
రాజకీయాలకు బాబుల్ గుడ్‌బై!
న్యూఢిల్లీ: మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నేత బాబుల్ సుప్రియో రాజకీయాలకు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించారు. త్వరలో ఎంపీ పదవికి రాజీనామా చేస్తానన్నారు. ఇటీవల జరిగిన కేంద్ర కేబినెట్ విస్తరణకు ముందు సుప్రియోతో పార్టీ మంత్రి పదవికి రాజీనామా చేయించింది. అప్పటి నుంచి ఆయన అసంతృప్తిగా ఉన్నారు. ‘రాజకీయాలు వీడాలని నిర్ణయించుకున్నాను. నేను టీఎంసీ, కాంగ్రెస్, సీపీఎం సహా మరే ఇతర పార్టీలోకి వెళ్లడం లేదు. ఎప్పటికీ బీజేపీతోనే ఉంటా. రాజకీయాల్లో ఉండి సామాజిక సేవ చేయడం సాధ్యం కాదు’ అంటూ బాబుల్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తనకు అవకాశమిచ్చినందుకు అమిత్‌షా, నడ్డాలకు బాబుల్ కృతజ్ఞత చెప్పారు. తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోమని వీరు అడిగారని, కానీ తనను మన్నించి తన కోరికను ఆమోదించాలని కోరారు. బాబుల్ ప్రస్థానం ప్రముఖ గాయకుడైన బాబుల్ సుప్రియో 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆ ఏడాది పశ్చిమ బెంగాల్‌లోని అసన్సోల్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. మోదీ హయంలో తొలిసారి ఏర్పాటైన కేంద్ర ప్రభుత్వంలో పట్టణ అభివృద్ధిశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అసన్సోల్ నుంచి రెండోసారి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. రెండోసారి కూడా ఆయన కేంద్రమంత్రి పదవి దక్కించుకున్నారు. అయితే ఇటీవల బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి టీఎంసీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. దీంతో అధిష్టానం ఆయన్ను మంత్రి పదవి నుంచి దిగిపొమ్మని కోరింది. ‘పదవి పోవడం వల్ల రాజకీయాలు వదిలేస్తున్నావా అని ఎవరైనా అడిగితే కొంతమేరకు అవుననే అంటాను. అసెంబ్లీ ఎన్నికలప్పటి నుంచి రాష్ట్ర నాయకత్వంతో విబేధాలు కూడా కొంత వరకు కారణమే’ అని బాబుల్ తెలిపారు. బాబుల్ రాజీనామాపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ స్పందించలేదు. ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేసినట్లు తనకు తెలియదని, సోషల్ మీడియాను తాను ఫాలో కానని చెప్పారు. ఇదంతా డ్రామా అని టీఎంసీ ఎద్దేవా చేసింది. మంత్రి పదవి దక్కనందుకే బాబుల్ ఇలా చేస్తున్నారని, రాజీనామా చేసేట్లయితే స్పీకర్‌కు ఫార్మెట్లో పంపాలని టీఎంసీ నేత కునాల్ ఘోష్ అభిప్రాయపడ్డారు. -
బీజేపీకి భారీ షాక్: రాజకీయాలకు ఎంపీ గుడ్ బై
కలకత్తా: ఇటీవల కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో పోస్టు కోల్పోయిన కేంద్ర మాజీ మంత్రి బాబూల్ సుప్రియో అలిగారు. తనకు మళ్లీ మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో ఇక రాజకీయాల నుంచే వైదొలుగుతున్నట్లు ఆయన శనివారం సంచలన ప్రకటన చేశారు. దీంతోపాటు లోక్‌సభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తానని సోషల్ మీడియా వేదికగా బాబుల్ సుప్రియో తెలిపారు. ఈ పరిణామం పశ్చిమ బెంగాల్‌తో పాటు ఢిల్లీలోని బీజేపీ అధిష్టానానికి పెద్ద షాక్ ఇచ్చింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన బాబుల్ సుప్రియో ప్రముఖ గాయకుడు. బీజేపీలో 2014 నుంచి కొనసాగుతున్నాడు. ‘అల్విదా’ అంటూ ప్రారంభించి తాను రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు సుదీర్ఘ లేఖను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘అల్విదా.. నేను తృణమూల్, కాంగ్రెస్, సీపీఎం.. ఇలా ఏ పార్టీలోకి చేరడం లేదు. ఆ పార్టీల్లోకి రావాలని నన్ను ఎవరూ పిలవలేదు. నేను ఒకే టీం ప్లేయర్‌ను. ఎప్పటికీ ఒకే పార్టీ (బీజేపీ)లో ఉంటా. నా వల్ల కొంతమంది సంతోషపడగా.. మరికొందరు బాధపడ్డారు. సుదీర్ఘ చర్చల అనంతరం నేను ఒక నిర్ణయం తీసుకున్నా. రాజకీయాల నుంచి వైదొలుగుతున్నా. రాజకీయాల్లో ఉండి సామాజిక సేవ చేయడం అసాధ్యం. నన్ను తప్పుగా అనుకోకండి’ అంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. వీటిలతో మరికొన్ని విషయాలను ఆ ప్రకటనలో ప్రస్తావించారు. 2014 ఎన్నికల సమయంలో బీజేపీలో చేరి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. సార్వత్రిక ఎన్నికల్లో అస్సనోల్ నుంచి పోటీ చేసి తొలిసారి ఎంపీగా గెలిచారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ తొలి మంత్రివర్గంలో బాబుల్ సుప్రియో చేరారు. పట్టణ అభివృద్ధి సహాయ మంత్రిగా పని చేశారు. 2019 ఎన్నికల్లో మళ్లీ అస్సనోల్ నుంచి గెలుపొంది కేంద్రమంత్రిగా నియమితులయ్యారు. అయితే ఇటీవల జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో బాబుల్ సుప్రియోకు చోటు దక్కలేదు. అందుకు కారణం లేకపోలేదు. తాజాగా జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా బాబుల్ సుప్రియోను బీజేపీ బరిలో దింపింది. అనూహ్యంగా సుప్రియో తృణమూల్ కాంగ్రెస్ చేతిలో పరాజయం పొందాడు. దీంతోపాటు రాష్ట్రంలో బీజేపీ ఆశించిన ఫలితాలు పొందలేదు. ఇది దృష్టిలో ఉంచుకుని బీజేపీ అధినాయకత్వం కేంద్ర మంత్రివర్గం నుంచి ఆయనను తొలగించింది. ఈ క్రమంలోనే ఆయన మనస్తాపానికి గురయ్యారు. బీజేపీకి రాజీనామా చేసి తృణమూల్‌లో చేరుతారని వార్తలు వినిపించగా అనూహ్యంగా ఆయన రాజకీయాల నుంచే తప్పుకుంటున్నట్లు ప్రకటించడం గమనార్హం. -
‘రాజీనామా చేయమన్నారు.. బాధగా ఉంది’
కోల్‌కతా: కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో బాబుల్ సుప్రియో తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. బాబుల్ సుప్రియోతో పాటు మరో 14 మంది మంత్రులు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాజీనామాపై స్పందిస్తూ.. బాబుల్ సుప్రియో ఫేస్బుక్లో ఓ పోస్ట్ చేశారు. తాను రాజీనామా చేశానని.. ఇన్నాళ్లు తనకు మంత్రిగా పని చేసే అవకాశం కల్పించిన ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞత తెలియజేశారు. ఈ సందర్భంగా బాబుల్ సుప్రియో తన ఫేస్బుక్లో ‘‘అవును.. పొగ ఉందంటే.. తప్పకుండా ఎక్కడో ఓ చోట మంట ఉన్నట్లే.. విషయం తెలిసిన దగ్గర నుంచి నా మీడియా మిత్రులు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు.. కానీ అందరితో మాట్లాడటానికి కుదరడం లేదు. అవును మంత్రుల మండలికి నేను రాజీనామా చేశాను. నేను ముందు చెప్పినట్లుగానే.. నన్ను రాజీనామా చేయమని కోరారు.. చేశాను. మంత్రుల మండలిలో సభ్యుడిగా ఉండి.. దేశానికి సేవ చేసే అవకాశం కల్పించినందుకు గౌరవనీయులైన ప్రధానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’’ అన్నారు. ‘‘ఈ రోజు నా మీద ఒక్క అవినీతి ఆరోపణ లేనందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. నా నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో కృషి చేశాను. అందుకే వారు 2019లో అత్యధిక మెజారిటీతో తిరిగి నన్ను గెలిపించారు. బెంగాల్ నుంచి మంత్రులగా ప్రమాణస్వీకారం చేయబోతున్న నా సహచరుల పేర్లు ప్రస్తుతం నేను బయటకు చెప్పలేను.. కానీ వారి గురించి అందరికి తెలుసు. వారందరికి నా అభినందనలు. రాజీనామా విషయంలో నేను బాధపడుతున్నాను.. కానీ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయబోతున్న వారి పట్ల చాలా సంతోషిస్తున్నాను’’ అంటూ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ తన మంత్రివర్గాన్ని అనూహ్యంగా పునర్వ్యవస్థీకరించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు దాదాపు 15 మంది మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. డాక్టర్ హర్షవర్ధన్, సదానంద గౌడ, దేబశ్రీ చౌదరి, రావ్ సాహెబ్ పాటిల్, సంజయ్ ధోత్రే, సంతోష్ గంగ్వార్, అశ్విన్ చౌబే, రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్, బబుల్ సుప్రియో, ప్రతాప్ సారంగి రాజీనామా చేసినవారిలో ఉన్నారు. వచ్చే ఏడాది జరిగే శాసన సభ ఎన్నికలు, రాష్ట్రాలు, ప్రాంతాలు, సామాజిక వర్గాలు వంటి అనేక అంశాలను దృష్టిలో పెట్టుకుని మోదీ తన మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించబోతున్నారని బీజేపీ వర్గాలు తెలిపాయి. -
నర్సును పక్కనబెట్టి వ్యాక్సిన్ వేసిన కౌన్సిలర్; వీడియో వైరల్
కోల్‌కతా: నర్సు పక్కన ఉండగానే తృణముల్ పార్టీకి చెందిన కౌన్సిలర్ వ్యాక్సిన్ వేసిన ఘటన వివాదాస్పదంగా మారింది. ఈ ఘటన కోల్‌కతాకు 200 కిమీ దూరంలో ఉన్న అసన్సోల్ గ్రామంలో ఏర్పాటు చేసిన క్యాంప్‌లో చోటుచేసుకుంది. ఏ మాత్రం అనుభవం లేకుండానే కౌన్సిలర్ వ్యాక్సిన్ వేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు బీజేపీ ఎంపీ బాబుల్ సుప్రియో తన ట్విటర్లో షేర్ చేశారు. మమతా బెనర్జీ ప్రభుత్వం తన ఇష్టారీతిన వ్యవహరిస్తుంది. అనుభవం ఉన్న నర్సులను పక్కన కూర్చోబెట్టి ఒక కౌన్సిలర్ వ్యాక్సిన్ వేయడం ఏంటని ప్రశ్నించారు. ఒకవేళ వ్యాక్సిన్ వేసే సమయంలో ఆ మహిళకు ఏమైనా జరిగి ఉంటే ఎవరు బాధ్యత వహిస్తారని పేర్కొన్నారు. పాలక సభ్యులపై టీఎంసీకి నియంత్రణ లేనట్లుగా కనిపిస్తున్నదని విమర్శించారు. ఇక విషయంలోకి వెళితే.. శనివారం అసన్సోల్ క్యాంప్‌లో కోవిడ్ వ్యాక్సిన్ ఎలా వేస్తున్నారనే దానిని పరిశీలించడానికి తృణమూల్ కౌన్సిలర్ తబస్సుం అరా అక్కడికి వచ్చారు. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ వేయించుకోవడానికి వచ్చిన ఒక మహిళను కుర్చీలో కూర్చోబెట్టి తాను వ్యాక్సిన్ వేస్తానని తబస్సుం నర్సుకు తెలిపారు. ఆ తర్వాత ఆమె వ్యాక్సిన్ ఉన్న సిరంజిని తీసుకొని మహిళకు వ్యాక్సిన్ వేశారు. ఇదంతా ఒక వ్యక్తి తన ఫోన్ కెమెరాలో బందించాడు. ఇక తబస్సుం తన వీడియో వ్యవహారం బయటికి రావడంతో స్పందించారు. '' నేను ఆ మహిళకు వ్యాక్సిన్ వేయలేదు. కేవలం ఖాళీ సిరంజీని నా చేతిలో పట్టుకొని ఆమెకు ఇచ్చినట్లు చేశాను. దీన్ని తప్పుగా అర్థం చేసుకొని నాపై విమర్శలు చేస్తున్నారు.అయినా నేను నర్సింగ్ కోర్సు నేర్చుకున్నా.. దీనిలో నాకు అనుభవం ఉందని'' చెప్పుకొచ్చారు. ప్రస్తుతం కౌన్సిలర్ వ్యాక్సిన్ ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Seems like TMC govt has no control over its administrators.TMC's Tabassum Ara, a member of the administrative body of AMC, has vaccinated people herself and risked hundreds of lives…Will her political colour shield her from stern punishment?@MamataOfficial pic.twitter.com/EaF3EsK9Bw — Babul Supriyo (@SuPriyoBabul) July 3, 2021 -
ఊరంతా ఏకమై.. మహిళను చితకబాది, జుట్టు కత్తిరించి
కోల్‌కతా: ఊరి జనమంతా కలిసి పట్టపగలు నడి రోడ్డు మీద ఓ మహిళను చితకబాదారు. జుట్టు కత్తిరించి చిత్రహింసలకు గురి చేశారు. ఈ దారుణ సంఘటన పశ్చిమ బెంగాల్లో చోటుచేసుకోగా.. దీనికి సంబంధించిన వీడియోని బీజేపీ నేత బాబుల్ సుప్రియో ట్విటర్లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. మహిళ ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో స్త్రీలపై ఇంత అరాచకంగా ప్రవర్తించడం నిజంగా దారుణం.. ఇదేనా మనం కోరుకున్న బంగ్లా అంటూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు నెటిజనులు. బాబుల్ సుప్రియో ట్వీట్ చేసిన ఈ వీడియోలో ఓ మహిళ నేల మీద పడి ఉంటుంది. ఇక గ్రామంలోని ఆడ, మగ ఆమెను కొడతారు. జుట్టుపట్టుకుని ఈడ్చుకు వస్తారు. తనను వదిలేయమని ఎంత ప్రాధేయపడినా వారు కనికరించలేదు. ఇంతలో కొందరు మహిళలు బాధితురాలి దగ్గరకు వచ్చి.. ఆమె జుట్టు పట్టుకుని కత్తిరిస్తారు. మరో దారుణమైన విషయం ఏంటంటే పట్టపగలే ఈ సంఘటన చోటు చేసుకుంది. జనాలు గుమికూడి చోద్యం చూశారు తప్ప ఏ ఒక్కరు ఆమెను కాపాడలేదు. కొందరు ఈ తతంగాన్ని వీడియో తీయడంలో బిజీ అయ్యారు. అక్రమ సంబంధం ఆరోపణల నేపథ్యంలోనే సదరు మహిళపై ఇలా దాడి చేశారని సమాచారం. Atrocities against women of Bengal continue from Moynaguri to Kumargram, as politically biased authorities turn a blind eye... Now a woman has been physically assaulted in front of the whole village for allegedly having an affair...Is this the Bengal of our dreams?@narendramodi pic.twitter.com/60uTKDCw4i — Babul Supriyo (@SuPriyoBabul) June 17, 2021 దీనిపై స్పందిస్తూ బాబుల్ సుప్రియో ‘‘బెంగాల్ మహిళలపై దురాగతాలు మొయినాగురి నుండి కుమార్గ్రామ్ వరకు కొనసాగుతున్నాయి. రాజకీయ నేతల చెప్పు చేతల్లో నడిచే అధికారులు కళ్లుండి గుడ్డివారయ్యారు. అక్రమ సంబంధం ఆరోపణలపై సదరు మహిళను శారీరకంగా హింసించారు. ఇదేనా మనం కలలు కన్న బెంగాల్’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చదవండి: 8 ఏళ్లు గడిచినా పగ చల్లారలేదు...అందుకే పథకం ప్రకారం -
కార్యకర్తని చెంపదెబ్బ కొట్టిన కేంద్రమంత్రి బాబుల్ సుప్రియా
-
బీజేపీ వ్యూహం: ఎన్నికల బరిలో కేంద్ర మంత్రి.. ఎంపీలు..
న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కేంద్ర మంత్రిని, ఎంపీలను కూడా అసెంబ్లీ బరిలోకి దింపింది. కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో సహా నలుగురు ఎంపీలను పశ్చిమబెంగాల్లో, ఇద్దరు ఎంపీలను, మెట్రోమ్యాన్ శ్రీధరన్‌ను కేరళలో, ప్రముఖ సినీ నటి, పార్టీ జాతీయ ఆఫీస్‌బేరర్ ఖుష్బూను తమిళనాడులో పోటీలో నిలిపింది. పార్టీ ప్రదాన కార్యదర్శి అరుణ్‌సింగ్, బాబుల్ సుప్రియో, మరో కేంద్ర మంత్రి దేబశ్రీ చౌధురి ఆదివారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పలువురు అభ్యర్థుల పేర్లను విడుదల చేశారు. పశ్చిమబెంగాల్‌కు సంబంధించి 63 మందితో, తమిళనాడు, అస్సాంల్లో 17 మంది చొప్పున, కేరళలో 112 మందితో కూడిన జాబితాను విడుదల చేశారు. కేరళలోని మొత్తం 140 స్థానాల్లో 115 సీట్లలో బీజేపీ పోటీ చేస్తోంది. మిగతా స్థానాల్లో మిత్ర పక్షాలు పోటీ చేస్తాయని అరుణ్ సింగ్ వెల్లడించారు. పశ్చిమబెంగాల్లో టాలీగుంగే నుంచి బాబుల్‌సుప్రియో, దిన్హట నుంచి ఎంపీ నిశిత్ ప్రామాణిక్, చుంచురా స్థానం నుంచి ఎంపీ లాకెట్ చటర్జీలను, తారకేశ్వర్ స్థానం నుంచి రాజ్యసభ ఎంపీ స్వపన్ దాస్ గుప్తాను బరిలో దింపారు. మాజీ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ అశోక్ లాహిరికి అలీపుర్దౌర్ స్థానం కేటాయించారు. లాహిరి 2017 నుంచి 2020 వరకు ఫైనాన్స్ కమిషన్ సభ్యుడిగా ఉన్నారు. టికెట్ నిరాకరించడంతో తృణమూల్ నుంచి బీజేపీలో చేరిన సీనియర్ నాయకుడు రవీంద్రనాథ్ భట్టాచార్యకు సింగూరు నుంచి అవకాశం కల్పించారు. సినీతారల్లో తనుశ్రీ చక్రవర్తి(శ్యాంపూర్), పాయల్ సర్కార్(బెహల పుర్బ), యశ్‌దాస్ గుప్తా(చండితల)లకు టికెట్లు ఇచ్చారు. అశోక్ లాహిరి, స్వపన్‌దాస్ గుప్తాలకు అవకాశం కల్పించడం ద్వారా 2019 లోక్‌సభ ఎన్నికల్లో తమకు దూరంగా ఉన్న రాష్ట్రంలోని మేధావి వర్గాన్ని ఆకర్షించేందుకు బీజేపీ ప్రయత్నించింది. కేరళలో ఇటీవలే బీజేపీలో చేరిన మెట్రోమ్యాన్ ఈ శ్రీధరన్‌ను పాలక్కాడ్ నుంచి, కేంద్ర మాజీ మంత్రి, ఎంపీ కేజే ఆల్ఫోన్స్‌ను కంజీరప్పల్లి నుంచి, రాజ్యసభ ఎంపీ, నటుడు సురేశ్ గోపీని త్రిస్సూర్ నుంచి, మరో నటుడు కృష్ణ కుమార్‌ను తూర్పు తిరువనంతపురం నుంచి బీజేపీ పోటీలో నిలిపింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళల ప్రవేశానికి వ్యతిరేకంగా ఉద్యమించిన కే సురేంద్రన్ కొన్ని, మంజేశ్వర్ స్థానాల నుంచి పోటీ చేయనున్నారు. సీనియర్ నేత పద్మనాభన్‌కు ముఖ్యమంత్రి విజయన్ పోటీలో ఉన్న ధర్మడం స్థానాన్ని బీజేపీ కేటాయించింది. అస్సాంలో బాఘ్బర్ సీటు నుంచి హసీనారా ఖాతూన్, హాజో స్థానం నుంచి సుమన్ హరిప్రియ బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. మార్చ్ 27 నుంచి 8 దశల్లో పశ్చిమబెంగాల్లో, మూడు దశల్లో అస్సాంలో, ఒకే దశలో ఏప్రిల్ 6న కేరళ, తమిళనాడుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. చదవండి: అక్కడ మాత్రమే బీజేపీ గెలుస్తుంది: శరద్ పవర్ -
ఇంత దారుణమా.. క్రికెట్‌ను చంపేశాడు!
సిడ్నీ టెస్టులో జట్టును రక్షించేందుకు చివరి రోజున హనుమ విహారి చూపించిన పట్టుదల గురించి ఎంత చెప్పినా తక్కువే. కండరాలు పట్టేసినా నొప్పిని భరిస్తూ అతను 161 బంతులు ఆడాడు. దీనిపై క్రికెట్ ప్రపంచం మొత్తం ప్రశంసలు కురిపించింది. అయితే కేంద్ర మంత్రి, మాజీ గాయకుడు బాబుల్ సుప్రియో మాత్రం ఒక వ్యతిరేక వ్యాఖ్యతో తన అసంతృప్తిని ప్రదర్శించాడు. ‘7 పరుగులు చేసేందుకు 109 బంతులా... ఇంత ఘోర ప్రదర్శనతో క్రికెట్‌ను చంపేసి భారత జట్టు చారిత్రక విజయం సాధించే అవకాశాన్ని హనుమ బిహారి పోగొట్టాడు. ఇది పెద్ద నేరం’ అంటూ ట్వీట్ చేశాడు. దీనిపైనే ట్విట్టర్లో తీవ్రమైన విమర్శలు వచ్చాయి. సుప్రియో అజ్ఞానాన్ని అంత తిట్టిపోశారు. అయితే విహారి దీనికి ఒకే ఒక పదంతో సమాధానం ఇచ్చాడు. ఇది బుధవారం సోషల్ మీడియాలో హోరెత్తిపోయింది. తన పేరును తప్పుగా రాయడాన్ని చూపిస్తూ ‘హనుమ విహారి’ అంటూ భారత క్రికెటర్ ట్వీట్ చేశాడు. దీనికి సుమారు 61 వేల లైక్‌లు రాగా... సహచరుడు అశ్విన్ కూడా ROFL MAXX!! అంటూ పడిపడి దొర్లి నవ్వుతున్నట్లు ట్వీట్ చేశాడు. దీనికి 80 వేల లైక్‌లు వచ్చాయి. సెహా్వగ్ కూడా ‘ఒక్క విహారి అందరి లెక్క సరి చేశాడు’ అంటూ వ్యాఖ్యానించాడు. చదవండి: స్మిత్వి అన్ని చిన్నపిల్లల బుద్ధులే -
హాస్పిటల్స్‌లో మొబైల్ ఫోన్లపై బాన్
కోల్‌కతా : హాస్పిటల్ లోపల మొబైల్ ఫోన్ల వాడకాన్నినిషేధిస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే రోగుల సహాయార్థం ల్యండ్లైన్స్ ఏర్పాటు చేస్తామని రాష్ర్ట ప్రధాన కార్యదర్శి రాజీవా సిన్హా బుధవారం తెలిపారు. కోల్‌కతాలోని బాంగూర్ హాస్పిటల్లో కరోనా పేషెంట్స్ ఉన్న ఐసోలేషన్ వార్డులో రెండు మృతదేహాలను గంటల కొద్ది అలాగే వదిలేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రెండు మృతదేహాలకు చాలా దగ్గర్లోనే కరోనా రోగులు కూర్చొని ఉన్నారు. అయినప్పటికీ వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. డెడ్‌బాడీస్‌ని తక్షణమే తీసెకెళ్లాల్సిందిగా బాధితులు మొర పెట్టుకున్నా సిబ్బంది పట్టించుకోలేదు. ఈ మొత్తం వ్యవహారాన్ని అక్కడే ఉన్న ఓ కరోనా రోగి వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో వైరల్ అయ్యింది. ప్రభుత్వం కనీస జాగ్రత్తలు కూడా తీసుకోవట్లేదంటూ నెటిజన్లు ఫైర్ అయ్యారు. ఈ ఘటనపై కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో మాట్లాడుతూ...వీడియో వైరల్ కావడంతోనే హాస్పిటల్స్ లోపల మొబైల్ ఫోన్లను నిషేదించారని మమతాసర్కార్పై ఆరోపణలు గుప్పించారు. నిజాలను నొక్కిపెట్టే ప్రయత్నంలో భాగంగానే ఈ చర్యకు పూణుకున్నట్లు ద్వజమెత్తారు. అంతేకాకుండా ఈ వైరల్ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసిన మంత్రి..ఇంత జరుగుతున్నా మమతా బెనర్జీ మాత్రం దీనిపై స్పందించట్లేదని, కనీసం అది నకిలీ వీడియో అని చెప్పడానికి కూడా ముందుకు రావట్లేదని పేర్కొన్నారు . దీన్ని బట్టి ఈ వీడియో నిజం అని నమ్మడానికి చాలా ఆస్కారం ఉందని ట్వీట్ చేశారు. What’s very concerning is, inspite of this VDO being super-viral on all platforms, TILL NOW the WB Govt of @MamataOfficial Didi, did not come up with any claim that this is a fake VDO or that the hospital is not Bangur!!That takes us Very Close to believing it is indeed authentic https://t.co/Ec92ByNdgg — Babul Supriyo (@SuPriyoBabul) April 21, 2020 -
‘దీదీ వైరస్‌తో పోరాడుతున్నాం’
సాక్షి, న్యూఢిల్లీ : పశ్చిమబెంగాల్లో తాము కరోనా వైరస్ కంటే ప్రమాదకర వైరస్‌తో పోరాడుతున్నామని కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో అన్నారు. మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ సర్కార్‌తో పోరాటం ప్రాణాంతక వైరస్‌పై పోరు కంటే అధికమని వ్యాఖ్యానించారు. బెంగాలీలను అవమానపరిచి, వారిని వైరస్ బారిన పడవేసే ముందే మమతా బెనర్జీ అధికార పీఠం నుంచి వైదొలగాలని అన్నారు. దీదీ వైరస్‌కు వ్యతిరేకంగా పోరాడే యాంటీబాడీలు పశ్చిమబెంగాల్లో పనిచేయడం ప్రారంభించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాగా లాక్డౌన్ అమలును పర్యవేక్షించేందుకు పశ్చిమబెంగాల్‌కు కేంద్ర బృందాలను పంపడాన్ని మమతా బెనర్జీ వ్యతిరేకించారు. కరోనా కేసులు అధికంగా ఉన్న ఇతర రాష్ట్రాలను విస్మరించి బెంగాల్‌కే ఎందుకు కేంద్ర బృందాలను పంపారని ఆమె నిలదీశారు. తమ రాష్ట్రానికే ఎందుకు కేంద్ర బృందాలను పంపారో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వివరణ ఇవ్వాలని ఆమె పట్టుబట్టారు. అప్పటివరకూ కేంద్ర బృందాలకు సహకరించబోమని దీదీ పేర్కొన్నారు. చదవండి : మమత మరో తీపికబురు.. -
1.09 కోట్ల వృక్షాలు నరికారు!
సాక్షి, హైదరాబాద్: అభివృద్ధి పేరిట పచ్చని చెట్లు నేలకూలుతున్నాయి. పట్టణాభివృద్ధి, నగరాల విస్తరణ, ఉత్పత్తి, ఉపాధి, ఇతర అవసరాల కోసం మౌలిక సదుపాయాల కల్పన, ఇతర ప్రాజెక్టుల నిర్మాణం ఇలా పేరు ఏదైనా చివరకు చెట్లే అందుకు ఆహుతవుతున్నాయి. అత్యంత వేగంగా చోటుచేసుకుంటున్న వాతావరణ మార్పులు, వాటి వల్ల తలెత్తుతున్న ఉపద్రవాలు, ఇతరత్రా సమస్యలకు ప్రకృతి సమతుల్యత దెబ్బతినడం, పచ్చదనం తగ్గిపోవడం ప్రధాన కారణాలుగా పర్యావరణ నిపుణులు చేస్తున్న హెచ్చరికలు పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. 1.09 కోట్ల చెట్ల కొట్టివేత... 2014–19 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం 1,09,75,000 చెట్ల నరికివేతకు కేంద్ర అటవీ, పర్యావరణశాఖ అనుమతిచ్చింది. ఇటీవల లోక్‌సభలో కేంద్ర అటవీ, పర్యావరణ వాతావరణ మార్పుæ శాఖ చెప్పిన సమాచారం మేరకు పలు అంశాలు వెల్లడయ్యాయి. దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో 2016–19 మధ్యకాలంలో 12,12,753 లక్షల చెట్లను కొట్టేసేందుకు అనుమతినిచ్చినట్లు స్పష్టమైంది. దాదాపు 11 లక్షల చెట్లతో మహారాష్ట్ర రెండో స్థానంలో, 10 లక్షల చెట్లతో మధ్యప్రదేశ్ మూడోస్థానంలో నిలిచాయి. లోక్‌సభలో ఒకప్రశ్నకు కేంద్ర సహాయమంత్రి బాబుల్ సుప్రియో సమాధానమిస్తూ వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల కోసం దేశవ్యాప్తంగా గత ఐదేళ్లలో మొత్తం 1.09 కోట్ల చెట్లను కూల్చేందుకు అనుమతినిచ్చినట్లు తెలియజేశారు. ముఖ్యంగా 2018–19లో ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో అత్యధిక సంఖ్యలో 5,22,242 చెట్లు కూల్చేందుకు అనుమతినిచ్చినట్టు కేంద్ర ప్రభుత్వ గణాంకాలను బట్టి వెల్లడైంది. చెట్లకు మొక్కలు ప్రత్యామ్నాయమా ? గత మూడేళ్లలో 76,72,337 చెట్లను తొలగించగా, 7.87 కోట్ల కంటే ఎక్కువగా మొక్కలను కంపల్సరీ ఎఫారెస్టేషన్ కింద నాటినట్లు లోక్‌సభలో కేంద్ర మంత్రి వెల్లడించారు. తప్పని పరిస్థితుల్లో మాత్రమే చెట్లను తొలగిస్తున్నామని, ప్రభుత్వ విధానంలో భాగంగా ప్రత్యామ్నాయంగా పెద్ద సంఖ్యలో మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తున్నట్లు తెలియజేశారు. సిటిజన్స్ ఆఫ్ హైదరాబాద్‌కు చెందిన కాజల్మహేశ్వరీ మాత్రం నరికేసే పాత వృక్షాలు, చెట్లకు మొక్కలు ప్రత్యామ్నాయం కాలేవని, వాటి స్థానంలో మొక్కలను చూడలేమని అభిప్రాయపడ్డారు. ‘40–50 ఏళ్ల పాత చెట్లకు హరితహారంలో నాటే మొక్కలు ప్రత్యామ్నాయం కాలేవు. ఎందుకంటే పెద్ద వృక్షాలు వాతావరణంలోకి విడుదల చేసే ఆక్సిజన్, పీల్చుకునే కార్బన్ డయాక్సైడ్ శాతాన్ని మొక్కలు భర్తీ చేయలేవు. కాబట్టి, చెట్ల నరికివేతతో జీవవైవిధ్యానికి జరుగుతున్న నష్టం అంచనా వేయలేని స్థాయిలో ఉంది’అని పేర్కొన్నారు. చెట్లు (లక్షల్లో) నరికారు ఇలా సంవత్సరం చెట్లు 2014–15 23.3 2015–16 16.9 2016–17 17.01 2017–18 25.5 2018–19 17.38 భారత్‌లో తలసరికి 28 చెట్లే 2018లో ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా చూస్తే వివిధ దేశాల్లో ఒక్కొక్కరికి ఉన్న చెట్ల నిష్పత్తి కంటే భారత్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కెనడాలో అత్యధికంగా ఒక్కో వ్యక్తికి 8,953, రష్యాలో 4,461, బ్రెజిల్లో 1,494, అమెరికాలో 716, చైనాలో 102 చెట్లు ఉండగా, మన దేశంలో మాత్రం ఒక్కొక్కరికి 28 చెట్లే ఉన్నాయి. ఒకవైపు చెట్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుండటంతో పాటు, అభివృద్ధి ప్రాజెక్టుల పేరిట ఉన్న చెట్లను కొట్టేస్తుండటంతో ఈ పరిస్థితి తలెత్తిందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీనిని బట్టి మన దేశంలో చెట్ల సంఖ్య ఏ మేరకు గణనీయంగా తగ్గిపోతోందో స్పష్టమవుతోంది. -
ఘోష్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి ఫైర్
కోల్‌కతా: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రజా ఆస్తులను ధ్వంసం చేసిన వారిని కుక్కల్లా కాల్చేశారని ఆ పార్టీ పశ్చిమ బెంగాల్ చీఫ్ దిలీప్ ఘోష్ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో తప్పుపట్టారు. యూపీ, అసోంలలో బీజేపీ ప్రభుత్వాలు ఏ కారణంగానైనా ప్రజలపై కాల్పులు జరపలేదని అన్నారు. దిలీప్ ఘోష్ వ్యాఖ్యలతో బీజేపీకీ సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆయన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని కేంద్ర మంత్రి అభ్యంతరం వ్యక్తం చేశారు. నదియా జిల్లాలో జరిగిన బహిరంగ సభలో దిలీప్ ఘోష్ మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఏఏను వ్యతిరేకిస్తూ జరిగిన నిరసనల్లో రైల్వే ఆస్తులను, బస్సులను ధ్వంసం చేసిన వారిపై కాల్పులు జరపలేదని మమతా బెనర్జీ సర్కార్‌నూ ఘోష్ దుయ్యబట్టారు. ప్రజల ఆస్తులను ధ్వంసం చేసిన వారిపై దీదీ (మమతా బెనర్జీ) పోలీసులు ఎలాంటి చర్యలూ చేపట్టలేదు... యూపీ, అసోం, కర్ణాటకల్లో తమ ప్రభుత్వాలు ఇలాంటి వారిని కుక్కల్లా కాల్చేశాయని దిలీప్ ఘోష్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. చదవండి : లాఠీలతో చితక్కొడతాం.. జైళ్లో పడేస్తాం -
‘ఆయన రెండో జకీర్ నాయక్’
సాక్షి, న్యూఢిల్లీ : ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ రెండో జకీర్ నాయక్ (ఇస్లాం బోధకుడు)లా తయారవుతున్నారని కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో ఆరోపించారు. జకీర్ నాయక్‌పై రెచ్చగొట్టే వ్యాఖ్యలతో విద్వేషాన్ని వ్యాపింపచేయడం, ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమకూర్చడం వంటి పలు ఆరోపణలున్న విషయం తెలిసిందే. అయోధ్య వివాదంపై సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో తనకు తమ మసీదును తిరిగి ఇవ్వాలని ఓవైసీ పేర్కొన్న నేపథ్యంలో కేంద్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన అతిగా మాట్లాడితే చట్టం తన పని తాను చేసుకువెళుతుందని అన్నారు. కాగా, తమ పోరాటం భూమి కోసం కాదని, తమ న్యాయపరమైన హక్కులు దక్కడం కోసమేనని ఓవైసీ వ్యాఖ్యానించారు. మసీదును నిర్మించేందుకు ఏ ఆలయాన్ని కూల్చలేదని సుప్రీం కోర్టు స్పష్టంగా చెప్పిందని..మసీదును మాకు తిరిగివ్వాలని తాము కోరుకుంటున్నామని ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అసదుద్దీన్ పేర్కొన్నారు. -
‘మీ కొడుక్కి ఎలాంటి హాని చేయను’
కోల్‌కతా: రెండు రోజుల క్రితం కోల్‌కతా జాదవ్‌పూర్ యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్త నెలకొన్న సంగతి తెలిసిందే. బీజేపీ విద్యార్థి విభాగం ఏబీవీపీ నిర్వహించిన సదస్సుకు హాజరైన కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో రాకకు వ్యతిరేకంగా భారీ సంఖ్యలో విద్యార్థులు నల్లజెండాలు పట్టుకుని నిరసన తెలిపారు. సెమినార్ అనంతరం ఆయన తిరిగి వెళుతుండగా కారును అడ్డుకుని వాగ్వాదానికి దిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తనపై దాడి చేయడమే కాక జుట్టుపట్టుకు లాగిన ఓ విద్యార్థి ఫోటోను ట్విటర్లో షేర్ చేశారు బాబుల్ సుప్రియో. సదరు విద్యార్థి పేరు దేబంజన్ బల్లవ్‌గా పేర్కొన్నారు. కొద్ది గంటల్లోనే ఈ ఫోటోలు తెగ వైరలయ్యాయి. దాంతో దేబంజన్ తల్లి రూపాలి బల్లవ్ మీడియా ముందుకు వచ్చి తన కుమారుడిని ఏం చేయవద్దంటూ ప్రాధేయపడింది. This is the guy who led the assault in #JadavpurUniversity .. we will find him out and then see what @MamataOfficial does to him in terms of charging him for assault without ANY PROVOCATION whatsoever from our/my side@CPKolkata @BJP4Bengal @ABVPVoice @BJYM pic.twitter.com/RzImVk7r5C — Babul Supriyo (@SuPriyoBabul) September 20, 2019 ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘నేను గత మూడు సంవత్సరాలుగా క్యాన్సర్‌తో బాధపడుతున్నాను. నా కుమారుడికి ఏం తెలియదు. చిన్నపిల్లవాడు. దయచేసి నా కుమారుడిని ఏం చేయవద్దు’ అంటూ కన్నీళ్లతో వేడుకుంది. ఈ విషయం కాస్త బాబుల్ సుప్రియో దృష్టికి వచ్చింది. దాంతో ఆయన ‘ఆంటీ దయచేసి మీరు బాధపడకండి. నేను కానీ నా కార్యకర్తలు కానీ మీ కుమారుడికి ఎలాంటి హాని చేయం.. పోలీసులకు కూడా ఫిర్యాదు చేయం. మీ కుమారుడు తను చేసిన తప్పు గురించి తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే అతడి ఫోటోలు షేర్ చేశాను. మీ కుమారుడి గురించి ఆందోళన చెందకండి. మీ ఆరోగ్యం జాగ్రత్త’ అంటూ సుప్రియో ట్వీట్ చేశారు. -
కేంద్ర మంత్రికి చేదు అనుభవం
కోల్‌కతా: కేంద్ర మంత్రి, బీజేపీ నేత బాబూల్ సుప్రియోకు చేదు అనుభవం ఎదురైంది. పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలోని జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయంలో గురువారం ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సుప్రియోను ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఐఏ, ఏఎఫ్‌ఎస్‌యూ, ఎఫ్‌ఈటీఎస్‌యూ తదితర వామపక్ష విద్యార్థి సంఘాలు ఘెరావ్ చేశాయి. దీంతో ఆయన్ను కాపాడేందుకు సాక్షాత్తూ గవర్నర్ ధనకర్‌తో పాటు భారీగా పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. బీజేపీ విద్యార్థి విభాగం ఏబీవీపీ నిర్వహించిన సదస్సుకు హాజరైన సుప్రియో రాకను నిరసిస్తూ భారీసంఖ్యలో విద్యార్థులు నల్లజెండాలు పట్టుకుని నిరసన తెలిపారు. సెమినార్ అనంతరం ఆయన తిరిగివెళుతుండగా కారును అడ్డుకుని వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా కొందరు విద్యార్థులు తన జుట్టు పట్టుకుని లాగారనీ, దాడిచేశారని సుప్రియో ఆరోపించారు. అయితే సుప్రియో వర్సిటీ విద్యార్థినులతో దురుసుగా ప్రవర్తించారని ఏఎస్‌ఎఫ్‌యూ నేత దెబ్రాజ్ దేబ్నాథ్ విమర్శించారు. ఈ ఉద్రిక్తత గురించి తెలుసుకున్న గవర్నర్ ధనకర్ హుటాహుటిన విశ్వవిద్యాలయానికి చేరుకుని సుప్రియోను సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారు. ఈ ఘటన అనంతరం ఏబీవీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. క్యాంపస్‌లోని ఏఎఫ్‌ఎస్‌యూ కార్యాలయంలోని కంప్యూటర్లు, సీలింగ్ ఫ్యాన్లు, ఫర్నీచర్‌ను ధ్వంసం చేసి నిప్పుపెట్టారు. సుప్రియోపై దాడి వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని పశ్చిమబెంగాల్ సీఎస్‌ను గవర్నర్ ఆదేశించారు. -
‘నా జుట్టు పట్టుకు లాగారు.. కింద పడేశారు’
కోల్‌కతా: బీజేపీ ఎంపీ బాబుల్ సుప్రీయోకు విద్యార్థుల నిరసన సెగ తగిలింది. గురువారం కోల్‌కతాలోని జాదవ్‌పూర్ యూనివర్సిటీలో ఏబీవీపీ విద్యార్థులు ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి బాబుల్ సుప్రియో హాజరయ్యారు. ఈ క్రమంలో కాలేజీలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన బాబుల్ సుప్రియోను కొందరు విద్యార్థులు అడ్డుకుని గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. వీరంతా స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఎఫ్ఐ), ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ అసోసియేషన్‌కు(ఏఎస్ఎఫ్ఏ) చెందిన వారు కావడం విశేషం. విద్యార్థుల నిరసన నేపథ్యంలో బాబుల్ సుప్రియో క్యాంపస్‌లోకి వెళ్లకుండానే వెను తిరిగారు. ఈ సందర్భగా బాబుల్ మాట్లాడుతూ.. ‘నేను రాజకీయాలు చేయడం కోసం ఇక్కడకు రాలేదు. కానీ విద్యార్థుల ప్రవర్తన చూస్తే నాకు చాలా బాధ కలుగుతుంది. వారు నన్ను అడ్డుకున్నారు. నా జుట్టు పట్టుకు లాగారు. కింద పడేసారు. వారంతా తమను తాము నక్సల్స్‌గా పిలుచుకుని నన్ను రెచ్చగొట్టాలని చూశారు. కానీ వారు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా నన్ను రెచ్చగొట్టలేరు’ అని పేర్కొన్నారు. ఆ సమయంలో గవర్నర్ జగదీప్ ధంఖర్, యూనివర్సిటీ చాన్సిలర్ అక్కడే ఉన్నారు. జరిగిన విషయాన్ని గవర్నర్ సీరియస్‌గా తీసుకున్నట్లు సమాచారం. -
బీజేపీ కోతులను బంధిస్తాం
కోల్‌కతా: కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియోను కోతితో పోలుస్తూ తృణమూల్ నేత, అసన్సోల్ నగర జితేంద్ర తివారీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి కోతుల ఆట కట్టిస్తామని ఆయన వ్యాఖ్యానించారు. గత కొద్ది రోజులుగా ఇరువురు నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అసన్సోల్ నగరంలోని 22 రథయాత్ర ఉత్సవ కమిటీలకు రూ. 25 వేల చొప్పున ఇవ్వాలన్న తివారి నిర్ణయాన్ని సుప్రియో ఎద్దేవా చేశారు. ప్రజల నుంచి కట్‌మనీ రూపంలో దోచుకున్న డబ్బును తిరిగిస్తున్నారని పేర్కొన్నారు. తనను ఎద్దేవా చేసిన సుప్రియోను కోతితో పోలుస్తూ తివారి తాజాగా విరుచుకుపడ్డారు. అసన్సోల్లో జరిగిన అల్లర్లకు బీజేపీ కార్యకర్తలే కారణమని అంతకుముందు తివారి ఆరోపించారు. జార్ఖండ్ నుంచి మనుషులను తీసుకొచ్చి అల్లర్లు సృష్టించారని పేర్కొన్నారు. ఈ ఘటనల్లో తృణమూల్ కార్యకర్తలతో పాటు పోలీసులు గాయపడ్డారని తెలిపారు. -
‘అసభ్యంగా తిట్టారు..బెదిరిస్తున్నారు’
కోల్‌కతా : కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో తనను దూషించారంటారని అసన్సోల్ మేయర్, తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జితేంద్ర కుమార్ ఆరోపించారు. అసభ్యంగా తిట్టడంతో పాటు తనను బెదిరింపులకు గురిచేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు..‘ అసన్సోల్ ఎంపీ, కేంద్రమంత్రి బాబుల్ సుప్రియో కార్యాలయం నుంచి ఓ వ్యక్తి నాతో మాట్లాడాడు. అసభ్య పదజాలంతో నన్ను దూషించాడు. దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించాడు’ అని లేఖలో పేర్కొన్నారు. కాగా లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బెంగాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అధికార తృణమూల్, బీజేపీ నేతలు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘర్షణల్లో పార్టీ కార్యాలయాలు సైతం ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో పశ్చిమ వర్ధమాన్ జిల్లాలోని టీఎంసీ కార్యాలయాన్ని గుర్తు తెలియని దుండగులు కూల్చివేయడంతో.. అక్కడికి చేరుకున్న జితేంద్ర కుమార్ బీజేపీ కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు వెంటనే స్పందించకపోతే బీజేపీ కార్యాలయాన్ని ధ్వంసం చేస్తానని హెచ్చరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో బాబుల్ సుప్రియో తనను బెదిరిస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక అసన్సోల్ సిట్టింగ్ ఎంపీగా ఎన్నికల బరిలో దిగిన బాబుల్ సుప్రియో ప్రత్యర్థి మున్మున్ సేన్‌పై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రెండోసారి నరేంద్ర మోదీ కేబినెట్లో చోటు దక్కించుకున్న ఆయన.. పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పుల శాఖ సహాయమంత్రిగా నియమితులయ్యారు.