సమకాలీన రాజకీయాల్లో నరేంద్ర మోదీకి దీటుగా దూసుకుపోతున్న నాయకురాలు మమతా బెనర్జీ. పశ్చిమ బెంగాల్‌లో ఖాళీగా ఉన్న ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు ఎవరూ ఊహించని విధంగా అభ్యర్థులను ప్రకటించి మరోసారి తన ప్రత్యేకత చాటుకున్నారు దీదీ. సినిమా రంగంలో అగ్రతార వెలుగొంది రాజకీయాల్లోకి వచ్చిన ‘రెబల్ స్టార్’ శత్రుఘ్న సిన్హాను అనూహ్యంగా మళ్లీ రాజకీయ తెర మీదకు తెచ్చారు. కొంత కాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయనకు పిలిచి మరీ ఎంపీ సీటు ఇచ్చి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.
బెంగాల్‌లో ఖాళీగా ఉన్న అసన్‌సోల్ లోక్‌సభ స్థానం, బాలేగంజ్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు ఎన్నికల సంఘం తాజాగా షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో ఈ రెండు స్థానాలకు మమతా బెనర్జీ అభ్యర్థులను ప్రకటించారు. అసన్‌సోల్ నుంచి శత్రుఘ్న సిన్హా, బాలేగంజ్‌లో బాబుల్ సుప్రియోలు తమ పార్టీ తరపున పోటీ చేస్తారని ఆమె ప్రకటించారు. అయితే బాబుల్ సుప్రియో రాజీనామాతో ఖాళీ అయిన అసన్‌సోల్ లోక్‌సభ స్థానాన్ని శత్రుఘ్న సిన్హాకు కేటాయించడం విశేషం.
సిన్హాకే ఎందుకు?
బిహార్‌లోని పట్నా లోక్‌సభ నియోజక వర్గం నుంచి 2009, 2014 ఎన్నికల్లో బీజేపీ ఎంపీగా గెలిచిన శత్రుఘ్న సిన్హా కేంద్రంలోని వాజపేయి కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. అయితే తర్వాత కాలంలో మోదీ పాలనకు వ్యతిరేకంగా గళమెత్తారు. దీంతో 2019 ఎన్నికల్లో ఆయనకు బీజేపీ టిక్కెట్ దక్కలేదు. ఈ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్‌కు మద్దతుగా బెంగాల్‌లో ఆయన ప్రచారం చేశారు. ఈ కారణం వల్లే ఆయనకు అసన్‌సోల్ ఉప ఎన్నికలో పోటీ చేసే అవకాశం దీదీ కల్పించినట్టు తెలుస్తోంది.
అసన్‌సోల్ to బాలేగంజ్
గాయకుడు, నటుడైన బాబుల్ సుప్రియో.. అసన్‌సోల్ లోక్‌సభ స్థానం నుండి రెండుసార్లు బీజేపీ ఎంపీగా ప్రాతినిథ్యం వహించారు. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడి నుంచి విజయం సాధించి కేంద్ర కేబినెట్‌లోనూ స్థానం సంపాందించారు. 2021, మార్చి-ఏప్రిల్‌లో జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆయనను టోలీగంజ్ నియోజకవర్గం నుంచి పోటీకి దించింది. అయితే ఆయన ఘోర పరాజయం పాలవడంతో పాటు కేంద్ర కేబినెట్‌లోనూ స్థానం కోల్పోయారు. తర్వాత పరిస్థితులు ప్రతికూలంగా మారడంతో బీజేపీని వీడి గతేడాది సెప్టెంబర్‌లో టీఎంసీలో చేరారు. తర్వాత నెలలో లోక్‌సభ సభ్యత్వాన్ని అధికారికంగా వదులుకున్నారు. తాజాగా ఆయన బాలేగంజ్ ఉప ఎన్నిక బరిలో నిలిచారు. (UP Election 2022: పార్టీల వారీగా సీట్లు, ఓట్ల శాతం..)
ఇద్దరూ ఇద్దరే!
శత్రుఘ్న సిన్హా, బాబుల్ సుప్రియోలకు చాలా పోలికలు ఉన్నాయి. ఇద్దరూ సినిమా రంగం నుంచి రాజకీయాలకు వచ్చి కేంద్ర మంత్రులుగా పనిచేశారు. బీజేపీని వ్యతిరేకించి ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీలో నిలిచారు. ఉప ఎన్నికల్లో వీరు విజయం సాధిస్తారా.. మమతా బెనర్జీ వ్యూహం ఏమేరకు ఫలిస్తోందో వేచి చూడాలి. అసన్‌సోల్, బాలేగంజ్ స్థానాలకు ఏప్రిల్ 12న పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 16న ఫలితాలు వెలువడతాయి. (క్లిక్: ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ)
Comments
Please login to add a commentAdd a comment