కోల్‌కతా: పాఠశాల నియామకాల కుంభకోణంలో అరెస్టయిన మాజీ మంత్రి పార్థా ఛటర్జీని మంత్రి పదవి నుంచి తొలగించిన తర్వాత కేబినెట్ విస్తరణ చేపట్టారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. బుధవారం మధ్యాహ్నం ఐదుగురు కొత్తగా మంత్రులుగా ప్రమాణం చేశారు. అందులో బీజేపీ మాజీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి బాబుల్ సుప్రియోకు చోటు కల్పించారు దీదీ. గత ఏడాదే బీజేపీ నుంచి తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు బాబుల్ సుప్రియో.
బాబుల్ సుప్రియోతో పాటు స్నేహాశిష్ చక్రబర్తి, పార్థా బౌమిక్, ఉదయాన్ గుహా, ప్రదిప్ మజందెర్‌లు మంత్రులుగా ప్రమాణం చేశారు. వారికి కీలక శాఖలు కేటాయించనున్నారని సమాచారం. స్నేహాశిష్ చక్రబర్తి ప్రస్తుతం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు. హూగ్లీ జిల్లాలో ఇంఛార్జ్‌గా సేవలందిస్తున్నారు. పార్థా బౌమిక్ మూడు సార్లు నైహాతి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉదయాన్ గుహా ఫార్వర్డ్ బ్లాక్ నేత, 2016లో టీఎంసీ తీర్థం పుచ్చుకున్నారు.
పార్థా ఛటర్జీ అరెస్ట్ నేపథ్యంలో ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించారు మమతా బెనర్జీ. ఆయన నిర్వహించిన పారిశ్రామిక, వాణిజ్య, పార్లమెంటరీ వ్యవహారాల వంటి ఐదు కీలక శాఖలను తన వద్దే అట్టిపెట్టుకున్నారు. మంత్రివర్గ విస్తరణపై మంగళవారం ప్రకటన చేసిన దీదీ.. రాష్ట్రంలో జిల్లాల సంఖ్యను 23 నుంచి 30కి పెంచుతున్నట్లు తెలిపారు. సుబ్రతా ముఖర్జీ, సధన్ పాండేలను కోల్పోయామని, పార్థా చటర్జీ జైలుకు వెళ్లిన క్రమంలో వారికి సంబంధించిన శాఖలను తాను మోయలేకపోతున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: Gujarat Elections 2022: కాంగ్రెస్‌కు షాక్.. బీజేపీలోకి ఇద్దరు కీలక నేతలు!
Comments
Please login to add a commentAdd a comment