‘మీ కొడుక్కి ఎలాంటి హాని చేయను’ | Babul Supriyo Promises Student Mother Will Not Harm Your Son | Sakshi
Sakshi News home page

తనపై దాడి చేసిన వ్యక్తి తల్లికి బాబుల్‌ సుప్రియో హామి

Published Sat, Sep 21 2019 2:43 PM | Last Updated on Sat, Sep 21 2019 2:51 PM

Babul Supriyo Promises Student Mother Will Not Harm Your Son - Sakshi

కోల్‌కతా: రెండు రోజుల క్రితం కోల్‌కతా జాదవ్‌పూర్‌ యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్త​ నెలకొన్న సంగతి తెలిసిందే. బీజేపీ విద్యార్థి విభాగం ఏబీవీపీ నిర్వహించిన సదస్సుకు హాజరైన కేంద్రమంత్రి బాబుల్‌ సుప్రియో రాకకు వ్యతిరేకంగా భారీ సంఖ్యలో విద్యార్థులు నల్లజెండాలు పట్టుకుని నిరసన తెలిపారు. సెమినార్‌ అనంతరం ఆయన తిరిగి వెళుతుండగా కారును అడ్డుకుని వాగ్వాదానికి దిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తనపై దాడి చేయడమే కాక జుట్టుపట్టుకు లాగిన ఓ విద్యార్థి ఫోటోను ట్విటర్‌లో షేర్‌ చేశారు బాబుల్‌ సుప్రియో. సదరు విద్యార్థి పేరు దేబంజన్‌ బల్లవ్‌గా పేర్కొన్నారు. కొద్ది గంటల్లోనే ఈ ఫోటోలు తెగ వైరలయ్యాయి. దాంతో దేబంజన్‌ తల్లి రూపాలి బల్లవ్‌ మీడియా ముందుకు వచ్చి తన కుమారుడిని ఏం చేయవద్దంటూ ప్రాధేయపడింది.
 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘నేను గత మూడు సంవత్సరాలుగా క్యాన్సర్‌తో బాధపడుతున్నాను. నా కుమారుడికి ఏం తెలియదు. చిన్నపిల్లవాడు. దయచేసి నా కుమారుడిని ఏం చేయవద్దు’ అంటూ కన్నీళ్లతో వేడుకుంది. ఈ విషయం కాస్త బాబుల్‌ సుప్రియో దృష్టికి వచ్చింది. దాంతో ఆయన ‘ఆంటీ దయచేసి మీరు బాధపడకండి. నేను కానీ నా కార్యకర్తలు కానీ మీ కుమారుడికి ఎలాంటి హాని చేయం.. పోలీసులకు కూడా ఫిర్యాదు చేయం. మీ కుమారుడు తను చేసిన తప్పు గురించి తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే అతడి ఫోటోలు షేర్‌ చేశాను. మీ కుమారుడి గురించి ఆందోళన చెందకండి. మీ ఆరోగ్యం జాగ్రత్త’ అంటూ సుప్రియో ట్వీట్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement